ఇది నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు నటించిన మొదటి సినిమా. తమిళనాడు టాకీస్ బ్యానర్‌పై ఈ సినిమా 1950, అక్టోబర్ 27వ తేదీన విడుదలయ్యింది.

అదృష్ట దీపుడు
(1950 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.సౌందర రాజన్
తారాగణం రామశర్మ,
గుమ్మడి వెంకటేశ్వరరావు (పరిచయం),
పద్మ,
టి. సూర్యకుమారి
సంగీతం అద్దేపల్లి రామారావు
నేపథ్య గానం పి. లీల,
మాధవపెద్ది,
టి. సూర్యకుమారి,
పామర్తి
నిర్మాణ సంస్థ తమిళనాడు టాకీస్
భాష తెలుగు

కథా సంగ్రహం

మార్చు

అదృష్టదీపుడు మాళవరాజు పెద్ద కుమారుడు. దుర్మార్గుడైన ఉపమంత్రి విక్రబాణుడు పన్నిన కుట్రఫలితంగా రాజు బంధింపబడతాడు. అతని కుటుంబం చెల్లాచెదురౌతుంది. అదృష్టదీపుడు ఒక గొల్ల ముసలి వద్ద పెరుగుతాడు. అమరావతి అనే రహస్యరాజ్యాన్ని స్థాపించి ప్రజోపయోగకార్యాలు చేస్తూ వివిధ రాజ్యాల సామరస్యం కోసం కానుకలు పంపుతాడు. విక్రబాణునకు కూడా కానుకలు పంపుతాడు. అమరావతి రాజు లేఖ చూచి, శత్రుశేషం ఇంకా మిగిలి ఉన్నదని తెలుసుకుని రాయబారుల్ని బంధిస్తాడు. శత్రు సంహారం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. భువనేశ్వరీదేవి ఆలయంలోని నిక్షేపం గురించి, మగధరాజకుమారి కాంతిమతి గురించి అదృష్టదీప, విక్రబాణులిద్దరూ వింటారు. అదృష్టదీపుడు ఆమెకు ప్రేమకానుకలు పంపుతాడు. విక్రబాణుడు ఆమెను వివాహం చేసుకునేందుకు తన కత్తిని పంపుతాడు. మగధరాజు విక్రబాణుని బాంధవ్యం తిరస్కరించి అదృష్టదీపుని కానుకలు తన కుమార్తెకు అందజేస్తాడు. విక్రబాణుని బారినుండి తప్పించుకున్న నిండుచూలాలు, రాణి అడవిలో మగశిశువును ప్రసవిస్తుంది. ఆ శిశువును ఒక కోతి ఎత్తుకుపోగా, సోమదత్తుడనే బ్రాహ్మణుడు చూసి, వానిని తన ఇంటికి తీసుకుపోయి పెంచి పెద్దవాణ్ణి చేస్తాడు. వానికి హరిదత్తుడనే పేరుపెడతాడు. సోమదత్తుని కూతురు హరిదత్తుని ప్రేమించి బలాత్కరిస్తుంది. హరిదత్తుడు చలించకుండా, తన పూర్వస్థితి తెలుసుకునేందుకు ఇల్లు వదిలి బయలుదేరుతాడు. హరిదత్తుడు బయలుదేరి పుష్పగిరి పోయి అక్కడి రాజకుమారి ప్రియంవద ప్రశ్నలకు జవాబులు చెప్పలేక జైలులో పడతాడు. ప్రియంవద అతడిని ప్రేమిస్తుంది. కాంతిమతి రూపలావణ్యాలు విన్న అదృష్టదీపుడు, ఆమెను చూడటానికి బయలుదేరి దారిలో సదానందముని ఆశ్రమం చేరి, ఆ మునివల్ల కార్యసిద్ధి పొందగలడనే మాటలు వింటాడు. ఆ సమయానికే అదృష్టదీపుని చూచేందుకు బయలుదేరిన కాంతిమతి, ఆశ్రమంలోని సంభాషణలవల్ల, అదృష్టదీపుని గుర్తించి అతనివద్ద తాను కాంతిమతి చెలికత్తెగా నటిస్తుంది. ఆ చెలికత్తె చెప్పిన ప్రకారం మరునాడు కాంతిమతి చిత్రపటం చూడటానికి వెడతాడు. అక్కడ కాంతిమతిని కలుసుకుని తన ప్రేమచిహ్నంగా ఆమెకు ఉంగరం ఇచ్చివస్తాడు. మాళవరాజ్యం నుండి వస్తున్న గణపతి మార్గమధ్యంలో బంధించబడ్డ హరిదత్తుని చూస్తాడు. గణపతి హరిదత్తుని గురించి అదృష్టదీపునికి చెబుతాడు. తన తమ్ముడు పుష్పగిరిలో ఉన్నాడని తెలుసుకుని అదృష్టదీపుడు పుష్పగిరికి బయలుదేరుతాడు. అక్కడి రాజభటులు ఇతడిని హరిదత్తునిగా భ్రమించి జైలులో పెడతారు. అదృష్టదీపుడు సమాధానానికి 15 రోజులు గడువుతీసుకుని అక్కడి వారివల్ల భువనేశ్వరీ ఆలయానికి దారి తెలుసుకుని ఆలయానికి పోతాడు. భువనేశ్వరీ దేవి వల్ల ప్రియంవద ప్రశ్నలకు జవాబు, తన చరిత్ర తెలుసుకుని తమ్ముని కొరకు బయలుదేరతాడు. జైలు నుండి తప్పించుకున్న హరిదత్తుడు మగధరాజ్యానికి వస్తాడు. కాంతిమతి ఇతడిని అదృష్టదీపునిగా భావిస్తుంది. తాను అదృష్టదీపుడు కానని, అతడిని తీసుకువస్తానని ప్రతిజ్ఞ చేసి ఈ రహస్యం తెలుసుకోవడానికి హరిదత్తుడు బయలుదేరతాడు. హరిదత్తుడు, అదృష్టదీపుడు కలుసుకుంటారు. వారి చరిత్రంతా చర్చించుకుంటారు. వారి తల్లిదండ్రులను వెదకడానికి, ప్రియంవద ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి, కాంతిమతిని కలుసుకోవడానికి ఇద్దరూ బయలుదేరతారు. కాంతిమతి అదృష్టదీపునికోసం బయలుదేరి దారిలో అత్తగారిని కలుసుకుంటుంది. అమరావతిని నాశనంచేసి కాంతిమతిని తన రాణీగా చేసుకోవడానికి విక్రబాణుడు అతని అనుచరుడు విక్రబద్ధుడు మారువేషాలతో అమరావతికి వస్తారు.అక్కడ కాంతిమతిని, రాణిని, గొల్లముసలిని పట్టుకుంటారు. విక్రబాణుడు కాంతిమతిని వివాహం చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు. హరిదత్తుడు ప్రియంవద ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆమెను తీసుకుని భువనేశ్వరీ ఆలయానికి వస్తాడు. అక్కడి నుండి అంతా దేవి ఇచ్చిన వాహనంపై అమరావతికి వస్తారు. విక్రబాణ, విక్రబద్ధులను వధించి తల్లిదండ్రులను విడిపిస్తారు. భువనేశ్వరీదేవి సమక్షంలో హరిదత్త ప్రియంవదలు, అదృష్టదీప కాంతిమతులూ వివాహం చేసుకుంటారు.[1]

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
  1. అందముగా ఆనందముగా సుమ మందిరముల - పి.లీల, మాధవపెద్ది
  2. ఈశ్వరి నీకిది న్యాయమా భువనేశ్వరి - టి. సూర్యకుమారి
  3. ఏమిటో ఈ జగతి దారితెన్ను లేని ఈ గతి - పామర్తి
  4. ఓ మోహనాంగా నీదు తెన్నులు వెదుకు - టి. సూర్యకుమారి
  5. జయజయ శ్రీమాళ్వరాజకులమణి - ఎ.వి. సరస్వతి, పి.లీల
  6. ఝణఝణ ఝణఝణ ఝూంకారములతో - టి. సూర్యకుమారి
  7. నేలపై నడయాడు నెలవంకయేదది - టి. సూర్యకుమారి, మాధవపెద్ది

మూలాలు

మార్చు
  1. తోలేటి (1950). అదృష్టదీపుడు పాటలపుస్తకం (1 ed.). p. 16. Retrieved 23 May 2021.

బయటి లింకులు

మార్చు