అయ్యంకి వెంకటరమణయ్య

గ్రంథాలయ ఉద్యమ కారుడు
(అయ్యంకి వేంకటరమణయ్య నుండి దారిమార్పు చెందింది)

అయ్యంకి వెంకట రమణయ్య (1890-1979) గ్రంథాలయోద్యమకారుడు, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంలో సిద్దహస్తులు, పత్రికా సంపాదకుడు. గ్రంథాలయ సర్వస్వము అనే పత్రికను నిర్వహించాడు. ఈయన గ్రంథాలయ ఉద్యమంలో జీవితాంతం విశేష కృషి సల్పి గ్రంథాలయ పితామహుడుగా పేరుగాంచాడు.

అయ్యంకి వెంకటరమణయ్య
జననం24 జులై 1890
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం
తాలూకా కొంకుదురు ప్రస్తుతం బిక్కవోలు
మండలం కొంకుదురు గ్రామం
మరణం1979 మార్చి 7
ఇతర పేర్లుగ్రంథాలయ పితామహుడు
వృత్తిగ్రంథాలయోధ్యమకారుడు,
పత్రికా సంపాదకులు
తల్లిదండ్రులు
  • వెంకటరత్నం (తండ్రి)
  • మంగమాంబ (తల్లి)

జీవిత విశేషాలు

మార్చు

ఆయన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా అనపర్తి నియోజక వర్గంలోని బిక్కవోలు మండంలో ఉన్న కొంకుదురు గ్రామంలో 1890 జూలై 24న జన్మించాడు.[1] వీరి తల్లిదండ్రులు వెంకటరత్నం, మంగమాంబ.వీరి తండ్రి శ్రీ వెంకతరత్నం గారు నీటిపారుదల శాఖలో ఉద్యోగి. ఈయన అయ్యంకిలో శ్రీ గంగా పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం నిర్మించారు. వెంకటరమణయ్య గారు విజయవాడలో ఉన్నప్పుడు, రామమోహన ధర్మ పుస్తక భాండాగారంతో అనుబంధం పెంచుకొని, ఆ గ్రంథాలయానికి కార్యదర్శి అయ్యారు. 1934-48 మధ్య, కోస్తా ఆంధ్ర ప్రాంతములో అనేక గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. 1972 లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. గ్రంథాలయ పితామహ, సరస్వతీ రమారమణ, గ్రంథాలయ విశారద వంటి బిరుదులు అందుకున్నారు. వీరు 1979, మార్చి-7న దివంగతులైనారు. ఏటా ఆయన వర్ధంతి సందర్భంగా, ఆయన మనుమడు ఆచార్య డా.వెంకటమురళీకృష్ణ, విద్యార్థులకు నోటు పుస్తకాలు అందిస్తున్నారు. తమ పూర్వీకులు కట్టించిన ఆలయానికి ధర్మకర్తగా ఉంటూ, లక్షలాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. ఆయన స్వగ్రామంలో "అయ్యంకి" పేరిట ఒక గ్రంథాలయం నెలకొల్పాలని, స్థానికుల అభిలాష.

శ్రీ అయ్యంకి వెంకటరమణయ్యగారు, దేశంలో పూర్తిస్థాయిలో గ్రంథాలయాలను నెలకొల్పిన వ్యక్తిగా పేరు గడించారు. తన 19వ ఏటనే శ్రీ బిపిన్ చంద్రపాల్ గారిని ఆదర్శంగా తీసుకొని, ప్రజాసేవ వైపు అడుగిడినారు. 1910 లో బందరులో "ఆంధ్ర సాహిత్య పత్రిక"ను స్థాపించి, గురజాడ, రాయప్రోలు, శ్రీశ్రీ రచనలను ప్రచురించి, ప్రజలను చైతన్యవంతం చేశారు. 1914లో ప్రథమ ఆంధ్ర రాష్ట్ర గ్రంథ భాండాగార ప్రతినిధుల మహాసభలను విజయవాడలో నిర్వహించారు. 1919, నవంబరు-14న, చెన్నైలో తొలి "అఖిలభారత పౌర గ్రంథాలయం"ను స్థాపించి, మొదటి మహాసభను నిర్వహించారు. ఆ రోజును, 1968 నుండి, "జాతీయ గ్రంథాలయ వారోత్సవ దినం"గా జరుపుకొనుచున్నారు. వీరు అనేక గ్రంథాలయ యాత్రలను నిర్వహించి, "ప్రజా గ్రంథాలయమే ప్రజల విశ్వవిద్యాలయం" అని చాటి చెప్పారు.

గ్రంథాలయోద్యమం

మార్చు

1911లో విజయవాడలో రామమోహన గ్రంథాలయ స్థాపనకు తోడ్పడ్డాడు. 1914లో విజయవాడలో ఆంధ్రదేశ గ్రంథ భాండాగార, ప్రతినిధుల గ్రంథాలయ మహాసభలు జరిపి భారతదేశంలో తొలిసారిగా గ్రంథాలయ సంఘాన్ని, 1915లో సంఘ పక్షాన గ్రంథాలయ సర్వస్వం పత్రికను స్థాపించడానికి తోడ్పడ్డారు. 1919లో అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘాన్ని స్థాపించి, 1924లో ఆ సంఘ పక్షాన ఇండియన్ లైబ్రరీ జర్నల్ అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించాడు. వీరు ఈ సంఘాన్ని స్థాపించిన రోజును నేషనల్ లైబ్రరీ డేగా భారత గ్రంథాలయ సంస్థ గుర్తించి దేశమంతటా 1968 నుంచి ప్రతి సంవత్సరం జాతీయ గ్రంథాలయ వారోత్సవము (నేషనల్ లైబ్రరీ వీక్) ను నిర్వహిస్తుంది.

1934-1948 మధ్యకాలంలో గ్రంథాలయ యాత్రలను అపూర్వమైన స్థాయిలో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో కార్యదర్శులు నిర్వహించారు. వీరి మూలంగా వందల సంఖ్యలో కొత్త గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. మూసివేసినవి పునరుద్ధరించబడ్డాయి. 1920, 1934లలో గ్రంథాలయ కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆంధ్రదేశంలోని ప్రతి గ్రామం పర్యటించాడు.

గౌరవాలు

మార్చు
  • గ్రంథాలయ విశారద, గ్రంథాలయ పితామహ, గ్రంథాలయోద్ధారక, సరస్వతీ సామ్రాజ్య ప్రతిష్ఠాపనాచార్య.
  • భారత ప్రభుత్వం 1972 లో పద్మశ్రీ గౌరవాన్నిచ్చింది.
  • ఆంధ్రవిశ్వ కళాపరిషత్తు గ్రంథాలయ శాస్త్ర పరీక్షలో ఉత్తమ విద్యార్థికి వీరి పేరుతో స్వర్ణ పతకం ఇస్తుంది.
  • 1979లో అయ్యంకి లైబ్రరీ కమిటీ ఏర్పడి ప్రతి సంవత్సరం ఉత్తమ గ్రంథాలయ కార్యకర్తను సత్కరిస్తోంది.

ఇవి కూడా చూడండి

మార్చు

ఆర్.జనార్థనం నాయుడు

మూలాలు

మార్చు
  1. మన గ్రంథాలయ సేవానిరతులు, వెలగా వెంకటప్పయ్య, పేజీ.23