ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు
ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు వంశీ దర్శకత్వంలో 2002 లో విడుదలైన సినిమా. ఈ సినిమా నంది పురస్కారాన్ని గెలుచుకుంది. చక్రి సంగీతం సమకూర్చిన ఈ చిత్రగీతాలు ప్రజాదరణ పొందాయి.
ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వంశీ |
---|---|
నిర్మాణం | వల్లూరిపల్లి రమేష్ బాబు |
రచన | గూడూరు విశ్వనాథ శాస్త్రి |
తారాగణం | రవితేజ కల్యాణి ప్రసన్న కృష్ణ భగవాన్ |
సంగీతం | చక్రి |
విడుదల తేదీ | ఆగస్టు 2, 2002 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుమోరంపూడి అనిల్ కుమార్ (రవితేజ) ఒక పట్టభద్రుడైన నిరుద్యోగి. ఉద్యోగం వెతుక్కుంటూ నగరానికి వస్తాడు. చాలా ఇంటర్వ్యూలలో పాల్గొని విసిగిపోయిన తరువాత ఓ కంపెనీ యజమాని అతని నిజాయితీకి, పనికి అతనిచ్చే విలువని గుర్తించి రాత్రి కాపలాదారుగా ఉద్యోగం ఇస్తాడు. అనిల్ ఆ చుట్టుపక్కల ఎక్కడైనా గది అద్దెకు దొరుకుతుందేమోనని వెతుకుతాడు. సత్యానందం (జీవా) ఆ కాలనీలో అమెరికాలో ఉన్న ఓ స్నేహితుడి ఇంటి అద్దె వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాడు. స్వాతి (కల్యాణి) ఆ గదిలో ఉంటూ ఓ సాఫ్ట్ వేరు సంస్థలో ఉద్యోగం చేస్తుంటుంది. అనిల్ చేసేది రాత్రి ఉద్యోగం కావడంతో సత్యానందం స్వాతి ఉండే గదిలోనే అతన్ని పగలు మాత్రమే ఉండమని రెండో అద్దె వసూలు చేస్తుంటాడు. అనిల్ అందుకు అంగీకరించి ఆ గదిలో అద్దెకు దిగుతాడు. అక్కడి అలంకరణ చూసి ముచ్చట పడి ఆమెను ఆరాధిస్తుంటాడు.
ఆ కాలనీ నిండా వంశీ మార్కు హాస్యనటులకో నిండి ఉంటుంది. సత్యానందం బావమరిది (కృష్ణ భగవాన్) తన వింత ప్రవర్తనతో ఆ కాలనీ వాళ్ళకు ఇబ్బందులు తెచ్చిపెడుతూ ఉంటాడు. బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే మల్లికార్జునరావు కాలనీలో అందరికీ ఐడియాలు అమ్ముతూ ఉంటాడు. పొట్టిరాజు (కొండవలస లక్ష్మణరావు) భార్య దగ్గర మెప్పు పొందాలని రకరకాల వ్యాపారాలు చేసి ఏవీ కుదరక భార్య చేత చీవాట్లు తింటుంటాడు.
ఒక నెల తర్వాత అనిల్ స్వాతి ఉంచిన విగ్రహాన్ని పొరబాటున పగలగొడతాడు. అందుకు క్షమాపణగా ఒక లేఖ రాసి దాని కింద పెడతాడు. అప్పుడు ఆమెకు తనుగాక ఆ గదిలో ఇంకొక వ్యక్తి ఉన్నాడని తెలిసి సత్యానందాన్ని పిలిచి చీవాట్లు పెడుతుంది. కానీ అనిల్ నిజాయితీ నచ్చి గదిలో ఉండటానికి అనుమతిస్తుంది. ఇద్దరూ కేవలం ఉత్తరాల ద్వారానే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇష్టాఇష్టాలు కలిసి తెలియకుండానే ప్రేమలో పడతారు. స్వాతి ఒక రెస్టారెంటులో అనిల్ ను చూసి తన పర్సు దొంగిలించాడని అనుమానిస్తుంది. దాంతో వారిద్దరూ ఒకే రూమ్మేట్స్ అని కాకుండా వేరే రకంగా పరిచయమౌతుంది. అనిల్ తనపేరు కుమార్ అని పరిచయం చేసుకుంటాడు. అనిల్ కి తన రూమ్మేటైన స్వాతి, బయట పరిచయమైన స్వాతి ఒక్కరే అని తెలుసుకుంటాడు కానీ పెళ్ళి దాకా తెలియకుండా ఉంది ఆమెను ఆశ్చర్యపరచాలనుకుంటాడు.
స్వాతి ఆఫీసులో పనిచేసే ఆనంద్ ఆమెను చూసి ఇష్టపడి పెళ్ళి సంబంధం కోసమని తన వాళ్ళను స్వాతి పెంపుడు తల్లిదండ్రుల దగ్గరకు పంపిస్తాడు. స్వాతి తల్లిదండ్రులు ఆమెకు పెళ్ళి చేస్తా తమ కష్టాలు తీరతాయని భావించి ఆ సంబంధానికి అంగీకరిస్తారు. స్వాతి తండ్రి కోరికను కాదనలేక, అనిల్ ను వదులుకోలేక సతమతమౌతుంది. ఆమె కుమార్ ను సలహా అడుగుతుంది. అనిల్ ఆమె కుటుంబ పరిస్థితిని గమనించి తండ్రి చెప్పిన సంబంధమే చేసుకోమంటాడు. తన ప్రేమను త్యాగం చేయడం కోసం తాను ఓ ధనవంతుల అమ్మాయిని ఇష్టపడుతున్నాననీ స్వాతిని వదిలేస్తున్నాననీ ఒక లేఖ కూడా రాస్తాడు. దాంతో స్వాతి అయిష్టంగానే పెళ్ళికి ఒప్పుకుంటుంది. చివరికి అనిల్ స్నేహితుడి ద్వారా నిజం తెలుసుకుని ఇద్దరూ కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
పాత్రలు-పాత్రధారులు
మార్చు- రవితేజ ... అనిల్
- కళ్యాణి ... స్వాతి
- ప్రసన్న... ఆనంద్
- శివారెడ్డి ... అనిల్ స్నేహితుడు
- బెనర్జీ ... ఆనంద్ సోదరుడు
- కోట శ్రీనివాసరావు ... ఆనంద్ తండ్రి
- మల్లికార్జున రావు ... లాండ్రీ నడిపేవాడు
- ఎం. ఎస్. నారాయణ
- జీవా
- తనికెళ్ల భరణి
- ఎల్. బి. శ్రీరామ్
- జయ ప్రకాష్ రెడ్డి ... కానిస్టేబుల్
- కృష్ణ భగవాన్ ... చిట్టిబాబు
- సూర్య ... స్వాతి తండ్రి
- కొండవలస లక్ష్మణరావు ... పొట్టిరాజు
- ప్రీతి నిగమ్[1][2]
పురస్కారాలు
మార్చు- నంది ఉత్తమ నటీమణి - కళ్యాణి
- నంది ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లు - గణపతి
- పాటల జాబితా.
- వెన్నెల్లోహాయ్ హాయ్ , చక్రి
- రా రమ్మని , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య
- నాలో నేను, సందీప్ , కౌసల్య
- పోగడమాకు అతిగా , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య
- సీతాకోక చిలుకా, చక్రి, కౌసల్య
- ఎన్నెన్నో వర్ణాలు , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,కౌసల్య
- మది నిండుగా మంచితనం, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య.
- ఏమి ఈ భాగ్యము, కౌసల్య
- నూజివీడు సోనియా , రవివర్మ
మూలాలు
మార్చు- ↑ సాక్షి, ఆంధ్రప్రదేశ్ (13 November 2014). "నా జీవితమే ఓ పుస్తకం". Sakshi. Archived from the original on 18 మే 2020. Retrieved 18 May 2020.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (17 November 2015). "విలన్‌గా భయపెడుతున్నా". andhrajyothy.com. Archived from the original on 18 మే 2020. Retrieved 18 May 2020.
- ↑ http://www.idlebrain.com/news/2000march20/nandiawards2002.html