జయప్రకాశ్ రెడ్డి

ప్రతినాయక, హాస్య పాత్రలకు పేరొందిన నటుడు
(జయ ప్రకాష్ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)

జయప్రకాశ్ రెడ్డి (మే 8, 1946 - సెప్టెంబరు 8, 2020) తెలుగు నటుడు.[1] రాయలసీమ యాసలో ఆయన చెప్పే సంభాషణలు ప్రసిద్ధి. దాదాపు 300 సినిమాల్లో నటించిన ఈయన ఎక్కువగా ప్రతినాయక, హాస్య పాత్రలను పోషించాడు.[2]

జయప్రకాశ్ రెడ్డి

జన్మ నామంతుర్పు జయప్రకాశ్ రెడ్డి
జననం (1946-05-08)1946 మే 8
మరణం 2020 సెప్టెంబరు 8(2020-09-08) (వయసు 74)
గుంటూరు, ఆంధ్రప్రదేశ్
ప్రముఖ పాత్రలు ప్రేమించుకుందాం రా
సమరసింహారెడ్డి
జయం మనదేరా
చెన్నకేశవరెడ్డి
కిక్
ఎవడి గోల వాడిది
ఢీ

వ్యక్తిగత విశేషాలు

మార్చు

ఈయన కర్నూలు జిల్లా, శిరివెళ్ళ మండలంలోని వీరారెడ్డి పల్లి గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో 1946, మే 8న జన్మించాడు. తండ్రి సాంబిరెడ్డి సబ్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేసేవారు. నెల్లూరులోని పత్తేకాన్‌పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు చదివాడు. తర్వాత నెల్లూరులోని రంగనాయకులపేట లోని ఉన్నత పాఠశాలలో చేరాడు. ఇతడు పదోతరగతిలో ఉండగా నాన్నకు అనంతపురం బదిలీ అయ్యింది. అక్కడ సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీలో చేరాడు.[3] కొన్నాళ్లకి జయప్రకాశ్ తండ్రి డిఎస్పీ హోదాలో నల్లగొండకు బదిలీ అయ్యాడు. తండ్రికోసం నల్లగొండ వచ్చిపోతుండేవాడు. అక్కడ బంధువులూ, స్నేహితులతో మాట్లాడటంతో తెలంగాణ భాష మీదా పట్టు దొరికింది. చదువులోనూ ముందుండే వాడు. డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని గణితం ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాడు. 1979 నుంచి 1981 వరకు నల్లగొండలోని సెయింట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్‌లో మ్యాథ్స్ టీచర్‌గా పనిచేశాడు. సినిమాల్లో నటించడం వల్ల స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) తీసుకున్నాడు.[4]

నటజీవితం

మార్చు

చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఆసక్తి ఉండేది. తండ్రి కూడా నటుడే కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అందుకు అడ్డు చెప్పేవారు కాదు. తండ్రీ కొడుకులు కలిసి కూడా నాటకాల్లో నటించారు. అనంతపురంలోని పాఠశాలలో చదివేటపుడు అక్కడి టీచర్లందరూ ఆచార్యులే. గుండాచారి అని సైన్స్ టీచర్ కల్చరల్ యాక్టివిటీస్‌కి హెడ్‌గా పనిచేసేవారు. కళలపై ఆయనకున్న అభిమానం ఇతనిపై చాలా పనిచేసింది. ఎంతంటే ఒకరోజు ఇతడు, ఇతడి స్నేహితుడు ‘దుర్యోధన గర్వ భంగం’ అనే నాటికలో పద్యాలు, డైలాగులు బట్టీ కొట్టేసి ఆయన దగ్గరకెళ్లి టపటపా అప్పజెప్పేశారు. ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు. ఆయన చాలా కోపంగా ‘మళ్లీ నాటకాల పేరెత్తితే తన్నేస్తాను వెధవల్లారా..’ అంటూ అరిచారు. ఇతడి స్నేహితుడు లైట్‌గా తీసుకున్నాడు గానీ.. ఇతడు మాత్రం చాలా ఫీలయ్యాడు. మూడురోజులు బెంగపెట్టుకున్నాడు. ఆ బాధ, కసి కారణంగానే నటనను వృత్తిగా స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నాడు.

గుంటూరు ఏసీ కళాశాలలో ఉన్నప్పుడు ఓ సీనియర్‌ స్టేజీ రాచరికం అనే నాటకంలో అడవేషం వేసే అవకాశం ఇచ్చాడు. అది రాజూ, రాణీ, సేవకీ, సేవకుడు ఉండే నాటకం. పాటలూ, ఆటలూ అన్నీ నేర్చుకొని సేవకి పాత్ర చేశాడు. నాటకం అయ్యాక అబ్బాయిలు ఎత్తుకుని ముద్దులు పెట్టేసుకున్నారు. మూడు నాలుగు రోజుల తర్వాత నోటీసు బోర్డు చూస్తే, యూనివర్సిటీ ప్రకటించిన బహుమతుల్లో ఉత్తమ నటి జయప్రకాశ్‌‌రెడ్డి అని రాసి ఉంది. అప్పటి నుంచి నాటకాలు వేయడం, వేయించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఉద్యోగంలో చేరాక కూడా నాటకాలను వదులుకోలేదు. ఉన్నతాధికారులూ బాగా ప్రోత్సహించడంతో పలు పరిషత్తులూ, సమాజాలతో కలిసి పనిచేసే అవకాశం దక్కంది. జె. పి.థియేటర్ ఏ. పి. పేరుతో ప్రతి సంవత్సరం తన తండ్రి పేరుమీద నల్లగొండలో నాటకోత్సవం జరిపేవారు. ‘జేపీ’స్‌ నెలనెలా నాటక సభ’ పేరిట ఓ సమాజాన్ని కూడా స్థాపించాడు.[3]

సినీ రంగం

మార్చు

ఒకసారి జయప్రకాష్ రెడ్డి నల్గొండలో డాక్టర్ రాజారావు మెమోరియల్ ఆర్ట్స్ అసోషియేషన్ తరపున అనేక నాటికలలో నటించి, దర్శకత్వం వహించాడు. నల్లగొండ జిల్లా పరిషత్ ఆవరణలో ప్రజా పోరు పత్రిక మొదటి వార్షికోత్సవం సందర్భంగా మాడభూషి దివాకర్ బాబు రాసిన గప్ చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావు కు అతని నటన నచ్చి నిర్మాత రామానాయుడుకు పరిచయం చేశాడు. అప్పుడు హైదరాబాదులో రామానాయుడు, అతని కుటుంబసభ్యుల ముందు ఆ నాటకాన్ని ప్రదర్శించాడు. అలా ఈయన 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యాడు.[4] అప్పటినుండి 1992 వరకు 25 సినిమాల్లో నటించాడు. కానీ ఆర్థికంగా ఒడిదుడుకులు రావడంతో మళ్లీ గుంటూరుకు వెళ్లి మున్సిపల్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేశాడు. ఉదయం ఆరింటి నుంచి ట్యూషన్లు చెప్పడం, బడికి వెళ్లడం, మళ్లీ రాత్రి తొమ్మిదింటి వరకూ ట్యూషన్లు ఇలా జీవితం సాగింది. అనుకోకుండా ఓసారి హైదరాబాదు వచ్చినప్పుడు రామానాయుడు కలిసి 1997లో ప్రేమించుకుందాం రా అనే సినిమా ద్వారా మరో అవకాశం కల్పించగా, ఆ చిత్రం ప్రతినాయకునిగా ఇతనికి మంచి పేరు తీసుకునివచ్చింది. తరువాత 1999లో బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి విజయవంతమైన సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రతోనే ప్రేక్షకులను మెప్పించాడు. బదిలీలతో అనంతపురం, కర్నూలు, కడప, ప్రొద్దుటూరులలో చదువుకోవడం, గుంటూరు, నల్లగొండలో నివసించడం వల్ల రాయలసీమ, నెల్లూరు, శ్రీకాకుళం, కోస్తా, ఆంధ్ర, తెలంగాణ ఇలా అన్ని ప్రాంతాల మాండలికాలపై ఇతనికి పట్టు వచ్చింది.[5]

అలెగ్జాండర్ నాటకం

మార్చు

రంగస్థల, సినిమా నటుడు ఆశిష్‌ విద్యార్థితో కలిసి నటించినపుడు, తాను ఒకే పాత్రతో నాటకాలు వేశానని ఆశిష్‌ విద్యార్థి చెప్పడంతో తాను కూడా తెలుగు నాటకరంగంలో అలాంటి ప్రయోగం చేయాలనుకున్నాడు. పూసల వెంకటేశ్వరరావు రాసిన అలెగ్జాండర్‌ అనే నాటకాన్ని తయారుచేసి రిటైర్డ్‌ మేజర్‌ పాత్రలో ఏకపాత్రాభినయంతో 100 నిమిషాలపాటు ఏకధాటిగా ఆ నాటకాన్ని 30 ప్రదర్శనలిచ్చాడు.[3][6]

నటించిన చిత్రాలు

మార్చు

తెలుగు

మార్చు

సంభాషణలు

మార్చు
  • వచ్చేదానికంటే పొయ్యేదే ఎక్కువ ఉందేమి రా?
  • ఒరేయ్ పులీ! ఏమిరా నెత్తికి అట్ల గుడ్డ జుట్టుకున్న్యావ్, బోడెమ్మ లెక్క!
  • మీ మనసులు దెల్చుకున్న్యాం, మా అలవాట్లని మార్చుకున్న్యాం.
  • పెళ్ళి నాడు గుడక మాంసం ఏంది రా? ఒక్క దినము గుడక ఉండలేవా?
  • ఏమి రా నోరు లేచ్చండాదే?
  • ఆడ ఏం ఉండాయో ఏం లేవో. కంది బ్యాడలు, శెనగ బ్యాడలు, అన్ని ఒక లారీకి ఏసి పంపిజ్జామా?

పురస్కారాలు

మార్చు

2000 నంది అవార్డు (జయం మనదేరా), రాణి రుద్రమ, వేట, కొత్త సైన్యం అనే సినిమాలకు కూడా నంది అవార్డులు వచ్చాయి.

ఇతడు 2020, సెప్టెంబరు 8న గుంటూరులోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు.[13][14][15]

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-12-28. Retrieved 2011-09-28.
  2. Sakshi (9 September 2020). "సినిమా ఉన్నంతవరకూ.. జయప్రకాశం". Sakshi. Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  3. 3.0 3.1 3.2 ఈనాడు, సినిమా (8 September 2020). "వెండితెరకు సీమ యాసను పరిచయం చేసి..!". www.eenadu.net. Archived from the original on 9 September 2020. Retrieved 9 September 2020.
  4. 4.0 4.1 "ఉత్తమ విలన్: మనది విలన్ టైప్ అందుకే". sakshi.com. జగతి పబ్లికేషన్స్. Archived from the original on 28 సెప్టెంబరు 2016. Retrieved 25 September 2016.
  5. సాక్షి, తెలంగాణ (నల్గొండ) (2015-01-04). "నల్లగొండతో విడదీయరాని బంధం". www.sakshi.com. Archived from the original on 2017-09-20. Retrieved 2020-09-09.
  6. ఆంధ్రజ్యోతి, ఓపెన్ హార్ట్ (సినీ ప్రముఖులు) (8 September 2020). "'నువ్వు తగ్గితే పనికిరావు అని హెచ్చరిస్తూనే ఉంటారు'". www.andhrajyothy.com. Archived from the original on 9 September 2020. Retrieved 9 September 2020.
  7. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (14 February 2020). "వరల్డ్ ఫేమస్ లవర్.. రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 24 February 2020. Retrieved 24 February 2020.
  8. సాక్షి, సినిమా (7 September 2018). "'సిల్లీ ఫెలోస్‌‌' మూవీ రివ్యూ". Archived from the original on 7 September 2018. Retrieved 6 June 2019.
  9. "Intlo Deyyam Nakem Bhayam (Cast & Crew)". Telugu Mirchi.com. Archived from the original on 2020-01-31. Retrieved 2020-01-31.
  10. మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.
  11. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-26. Retrieved 2020-08-04.
  12. "jeevi review for Adda". idlebrain.com. Retrieved 16 July 2019.
  13. "Jaya Prakash Reddy (1946-2020): Mahesh Babu, Jr NTR, Prakash Raj and others mourn demise of versatile actor". The Indian Express (in ఇంగ్లీష్). 2020-09-08. Retrieved 2020-09-08.
  14. "Actor Jaya Prakash Reddy passes away". The Indian Express. 8 September 2020. Retrieved 8 September 2020.
  15. Namasthe Telangana (27 March 2021). "గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు". Archived from the original on 2021-03-27. Retrieved 30 November 2021.

బయటి లంకెలు

మార్చు