అహోబిల మఠం
అహోబిల మఠం (శ్రీ అహోబిల మఠం అని కూడా పిలుస్తారు) అనేది వడకలై శ్రీ వైష్ణవ మఠం సా.శ. 1400 లో[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పూర్వ కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలం, అహోబిలంలో వేదాంత దేశిక వడకళై సంప్రదాయాన్ని అనుసరించి స్థాపించబడింది.[2] [3]ఇది ఆదివాన్ శతకోప స్వామి (వాస్తవానికి శ్రీనివాసాచార్య అని పిలుస్తారు)కి ఆపాదించబడింది.[4][5][6]
అహోబిల మఠం
అహోబిలం | |
---|---|
పవిత్ర ప్రదేశం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నంద్యాల జిల్లా |
Elevation | 327 మీ (1,073 అ.) |
భాషలు | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
అధివాన్ శతకోప, వడకళై సన్యాసి,[7] వేదాంత దేశిక [8][9] గొప్ప శిష్యుడు, ప్రసిద్ధ శ్రీ వైష్ణవ ప్రఖ్యాత నడదూర్ అమ్మాళ్ పండిత వారసుడు, ఘటికాశతం అమ్మాళ్ శిష్యుడు,[10] స్థాపించాడు. పాంచరాత్ర సంప్రదాయం ఆధారంగా ఈ మఠాన్ని స్థాపించారు. [11][12][13][14]
అహోబలం హిందూ యాత్రికులకే కాక, పర్యాటక కేంద్రంగా, కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంశించడం వల్ల అహోబలమైనది. ఎగువ మహోబలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభువుగా బిలంలో వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు. నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాలలో ప్రకటించాడు కావున నవనారసింహక్షేత్రం అని అంటారు. నవనారసింహులలో దిగువ అహోబిలంలో పేర్కొనబడలేదు. కాని ఈ ఆలయప్రాశస్తం అమోఘమైనది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువ దిగువ అహోబల పుణ్యక్షేత్రాలను సందర్శించి తరిస్తారు. ఈ క్షేత్రం నంద్యాల జిల్లాలోని నంద్యాల రైల్వేస్టేషన్ కు 68 కిలోమీటర్ల దూరంలోని ఆళ్ళగడ్డకు 24 కిలోమీటర్ల దూరములో ఉంది. అన్ని ప్రధాన క్షేత్రముల నుండి అహోబిలం చేరడానికి మార్గాలు, రవాణా సౌకర్యములున్నవి. ఈ క్షేత్రం సముద్రమట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది. అహోబలంలో ప్రదానమయినది భవనాశిని నది. లక్ష్మినరసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భువికి దిగి వచ్చింది. ఈ దివ్య తీర్థంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఉగ్రనరసింహస్వామి. పరమ భాగవతుడయిన ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకశిపుణ్ణి వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు. ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబలక్షేత్రం. దిగువ అహోబలంలో వెలసిన ప్రహ్లాదవరదుని సన్నిధానం లక్ష్మీనరసింహస్వామి విశిష్ట అద్వైతాలకు కార్యకలాపాలకు కేంద్రం. వేద ఘోషలతో దివ్యప్రబంధ సూక్తులతో అర్చకుల ఆరగింపులతో కోలాహలంగా ఉంటుంది. శ్రీ కార్యపరుల పరమ భక్తుల ఏకాంత భక్తికి అమృతవల్లి సమేత నరసింహుడు పరవశించి సేవింపవచ్చిన వారికి కోరకనే వరాలు అనుగ్రహిస్తాడు. ప్రహ్లాద వరదుడు లక్ష్మీ సమేతుడై సుందరంగా శేషపీఠం మీద అవతరించాడు. వీరి సహితంగా అమృతవల్లి సన్నిధి అండాల్ సన్నిధి ఉన్నాయి. ఇక్కడ వైష్ణవ ఆచార్యులకు, అళ్వారులకు ప్రత్యేక సన్నిధాలున్నవి. వేంకటేశ్వరునకు పద్మావతి వివాహ సమయమున శ్రీ నరసింహస్వామిని ప్రతిష్ఠించి ఆరాధించాడు కావున ఈ ఐతిహ్యానికి గుర్తుగా వెంకటేశ్వరుని సన్నిధి, కళ్యాణ మంటపం ఉంది. ప్రహ్లాద వరదుడు ఉభయనాంచారులయిన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు స్వర్ణ కవచాలతో మూలమూర్తులకు దివ్యాభిషేకాలతో, దివ్య ఆభరణములతో నేత్ర పర్వంగా నిలిచింది. ఈ క్షేత్రం 108 దివ్య క్షేత్రములలో ప్రముఖమైంది. వైష్ణవ ఆళ్వారులు దర్శించి స్తుతించిన క్షేత్రమును మాత్రమే దివ్యక్షేత్రములు అంటారు. ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది. ఆదిశేషుడు పర్వతాకృతి పొందినాడని పౌరాణిక విశ్వాసం. ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవళించారు. ఆ పడగలపై శ్రీనివాసుడు, నడుముపై నారసింహుడు, తోకపై మల్లిఖార్జునుడు ఆవిర్భవించారు. వీరు నల్లమల మగసిరులుగా మలచారు. తిరుమల, అహోబిలం, శ్రీశైలం స్వయం వ్యక్త క్షేత్రాలు. అహోబిలక్షేత్ర ప్రసిద్ధికి, అభివృద్ధికి ఎందురో రాజులు, రాజన్యులు, ఎన్నో సేవలందించారు. పల్లవులు, చోళులు, విద్యానగరరాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగరరాజులు, రెడ్డిరాజులు అభివృద్ధికి వికాసానికి తోడ్పడినారు. 15వ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రలో అహోబిలక్షేత్రం పడి నలిగిపోయింది. రంగరాయల ప్రభువు తురుష్కుల మీద విజయం సాధించి జీయరుగారికి అహోబిలక్షేత్రాన్ని అప్పగించి, జయానికి గుర్తుగా ఉన్నతోన్నత మయిన జయస్తంభాన్ని దేవాలయ చివరి ప్రాకారమందు స్థాపించాడు. ఇది ఇప్పటికి మనం చూడవచ్చు. పరమశివ భక్తుడయిన ప్రతాప రుద్రమహారాజు దినచర్య ప్రకారం శివలింగం పోతపోయగా నృసింహాకృతి వచ్చినందుకు ఆ విగ్రహాన్ని మొదటి అహోబిల పీఠాధిపతి వారికి అప్పగించి, జీవితాంతం నరసింహుని సేవించి పూజించాడు. ఈ క్షేత్రానికి నగరి, నిధి, తక్ష్యాద్రి, గరుడాద్రి, శింగవేళ్ కుండ్రం, ఎగువ తిరుపతి, పెద అహోబిలం, భార్గవతీర్థం, నవనారసింహ క్షేత్రం అనే పేర్లు కూడా కలవని పురాణములు చెప్పుచున్నవి. తురుష్కుల దండయాత్రలో విచ్ఛిన్నమయిన అహోబల్ క్షేత్రానికి 43వ పీఠాధిపతి పంచసంస్కారాలలో 44వ పీఠాధిపతి ఆశీస్సులతో మధురాంతకం నుండి అహోబలం మేనేజర్ గా నియమితులయిన ఆర్. లక్ష్మినారాయణ కాలమునుండి పూర్వవైభవాన్ని సంతరించుకుంటూ వస్తున్నది. ఇతను వేద, ప్రభంధము, అధ్యయనము, మూర్తులకు అలంకారము చేయడంలో నిష్ణాతులు. ఎన్నో ఉత్సవాలను భక్తుల సహాయంతో పూర్వ వైభవాన్ని సంతరించుకునేటట్లు చేశారు. అదే క్రమంగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నది. అహోబిల నృసింహుని సుప్రభాత సుందర సేవలు, ఏకాంత సేవల వరకు సొగసులను నింపుకున్నది. నవరాత్రులు విశేష దినములలో అయ్యవారు, అమ్మవారు, అద్దాల మంటపంలో వింత వెలుగులు విరజిమ్ముతున్నారు. విజయదశమి, సంక్రాంతి పార్వేట ఉత్సవాలలో స్థానికులు, చెంచుల విన్యాసాలు, విల్లంబుల ప్రయోగాలు గ్రామీణ వాతావరణానికి అద్ధం పడతాయి. ఆలయ విధులలో పూజ పునస్కారములలో తెలిసో తెలియకో జరిగిన శైతిల్యాలకు ప్రాయశ్చిత్తంగా, వర్చస్వంతంగా క్షేత్రం విరాజిల్లడానికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఎన్నో నిత్య సేవలు, ఆర్జిత సేవలు, ఉత్సవాలు, అభిషేకాలు, వేదాంత ఘోషలు, ప్రభంధ పారాయణములు, కళ్యాణోత్సవములు, ఆలయపాలకులు అనితరసాధ్యంగా నిర్వహిస్తారు. తీర్థయాత్రలలో ప్రధానమయిన మండపం (తలనీలాలు), స్నానం దర్శనం మొదలయిన వాటికిక్కడ అవకాశమేర్పడింది. దిగువ అహోబిలం చేరుకుని, ప్రహ్లాదవరదుని సేవించుకొని ఇక్కడికి 8 కి.మీ దూరములోనున్న ఎగువ అహోబిలంలోని గుహాంతర్భాగాన నిలిచిన అహోబల నృసింహుని అర్చించుకొని భవనాశిని జలాలతో సేద తీర్చుకొని ఓర్పుతో క్రమంగా నవనారసింహ క్షేత్రాలను దర్శించుకొని ప్రహ్లాద బడిలో బండ మీద నిలిచి భాగవత సుందర జ్ఞాపకాలను పొంది ఉగ్రస్తంభ ప్రదక్షిణలతో పుణీతమై తీర్ధయాత్రను ఫలవంతం చేసుకోవడానికి నేడు చక్కని అవకాశమున్నది.
చరిత్ర
మార్చుఈ క్షేత్రాన్ని 1830ల్లో కాశీయాత్రచేసి దానిని గ్రంథస్థం చేసిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రా చరిత్రలో వర్ణించారు. ఆయన వ్రాసిన ప్రకారం 1830 నాటికి ఎగువ అహోబిలానికి, దిగువ అహోబిలానికి నడుమ చీకటిగల అడవి ఉండేది. అప్పటికి ఈ స్థలం కుంభకోణం వద్దనుండే అహోబళం జియ్యరు వారి ఆధీనం. వారి ముద్రకర్త అహోబిలానికి రెండు క్రోసుల దూరానగల బాచపల్లెలో ఉండి ఈ స్థలాన్ని చూసుకునేవారు. ముద్రకర్త యెగువ, దిగువ స్థలాల్లో అర్చన చేసే అర్చకులిద్దరికీ అప్పుడప్పుడూ నెలకు రూ.6 చొప్పున జీతం ఇస్తూవుండేవారు. గుడి ఖర్చులకు జియ్యరు పంపే డబ్బు తప్ప మరే దారీ ఉండేది కాదు. హైదరాబాద్ రాజ్యపు దివాను పేష్కరు రాజా చందులాలా ఈ క్షేత్రానికి సంవత్సరానికి రూ. వెయ్యి చొప్పున ఇప్పించేవారు. దిగువ అహోబిలంలో కొన్ని పేదల గుడిసెలు ఉండేవని, ఎగువన అవీ లేవని, జలము రోగప్రదం కావడంతో మనుష్యులు నివసించేందుకు భయపడేవారని వ్రాశారు. ఫాల్గుణమాసంలో బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో 400 వరహాల హాశ్శీలు ఆదాయం వస్తూండేదని, దానిని కందనూరి నవాబు తీసుకుని గుడికి చేయాల్సిన సౌకర్యాల గురించి మాత్రం పట్టించుకునేవాడు కాదని వివరించారు. ఉప్పుతో సహా ఏమీ దొరకని ప్రాంతంగా ఉండేది. ఏవి కావాల్సినా బాచపల్లె నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది. అక్కడ ప్రతిఫలించియున్న పరమాత్మ చైతన్యము, స్వప్రకాశము చేత లోకులకు భక్తిని కలగజేయుచున్నది గాని, అక్కడ నడిచే యుపచారములు దానికి నేపాటికిన్నీ సహకారిగా నుండలేదు. అని ఆయన వ్రాశారు.[15]
అహోబల మహత్యం
మార్చుఈ పుడమి మీద ఉన్న నాలుగు దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటి. రాక్షసుడైన హిరణ్యకశ్యపుని సంహరించడానికి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభమునందు, ఉద్భవించిన స్థలమే ఈ అహోబిలక్షేత్రము. ఈ స్థల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతంలో బ్రహ్మాండపురాణం అంతర్గతంలో 10 అధ్యాయాలు, 1046 శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయబడింది.
పార్వేట
మార్చుఅహోబిల స్వామి వారు తన పెళ్ళికి తానే స్వయంగా భక్తులను అహ్వాఇస్తానని అన్నారట. ఆరు వందల సంవత్సరాల క్రితం ఆ నాటి ప్రప్రథమ పీఠధి పతి శ్రీ శఠ గోప యతీంద్ర మహదేశికన్ వారు ఈ బ్రహోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఆ నాటి నుండి ఈ నాటివరకు పర్వేట ఉత్సవాలు ఘనంగా 45 రోజుల పాటు జరగడం ఒక విశేషము. తిరుమలలో కూడా శ్రీ వారికి పార్వేట ఉత్సవాలు జరుగుతాయి. అటు పిమ్మట బ్రహ్మోత్సవాలు జరిగి గరుడోత్సవంతో అనగా మర్చి 17 న ఈ వేడుకలు పూర్తవుతాయి. అహోబిల స్వామి వారు తన వివాహ మహోత్సవానికి భక్తులను ఆహ్వానించడానికి అహోబిల పరిసర ప్రాంతంలో సుమారు 35 గ్రామాల్లో ఈ నలబైదు రోజులు సంచరిస్తాడు. పర్వేట ఉత్సవాలు ఈ గ్రామాలలో ఆ నలబైదు రోజులు జరుగుతాయి. ఈ నెలన్నర రోజులు అన్ని గ్రామాల్లో అందరికి పండగే. అన్ని వేడుకలె. స్వామి వారి పల్లకి మోసే బాధ్యత ఇక్కడి కొన్ని కుటుంబల వారికి తరతరాలుగా వంశ పారంపర్యంగా వస్తున్న ఒక సంప్రదాయము. సుమారు 120 మంది ఈ విధంగా స్వామి వారి సేవలో తరిస్తున్నారు.
ఎగువ అహోబిలం
మార్చుఎగువ అహోబిలంలో వేంచేసియున్న మూల విరాట్ కు ఉగ్రనరసింహస్వామి అహోబిల, అహోబల, నరసింహస్వామి, ఓబులేసుడు అని పిలుస్తారు. గరుడాద్రి, వేదాద్రి పర్వతముల మధ్యన ఈ ఎగువ అహోబిల ఆలయము ఉంది.
దిగువ అహోబిలం
మార్చుశ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన లక్ష్మీనరసింహస్వామి వేంచేసినదే దిగువ అహోబిలం.అక్కడ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి
వివరాలు
మార్చుప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
శ్రీ నరసింహస్వామి | లక్ష్మీదేవి | ఇంద్ర-పాపనాశ-నరసింహ తీర్థాలు | తూర్పుముఖం | కూర్చున్న భంగిమ | నమ్మాళ్వార్-తిరుమంగై ఆళ్వార్ | గుహ విమానం | ప్రహ్లాదునకు |
వైవిధ్యమైన నరసింహస్వామి ఆలయాలు
మార్చుఈక్షేత్రమున నవనారసింహులు కలరు. ఇక్కడగల అహోబిల మఠములోను లక్ష్మీనరసింహర్ వేంచేసియున్నారు
ఆలయం | ప్రదేశం |
---|---|
లక్ష్మీనరసింహం- | దిగువ అహోబిలం |
సత్తిరాంత నరసింహం, | -- |
యోగనరసింహం:- | తేరువీధిలో 2 కి.మీ. |
కారంగి నరసింహం:- | పై అహోబిలం |
ఉగ్రనరసింహం:- | దిగువ అహోబిలం |
భార్గవ నరసింహం:- | గరుడాద్రి |
పర్ములిధి నరసింహం:- | వేదాద్రి |
వరాహ నరసింహం:- | |
ప్రహ్లాద నరసింహం:- | గంధాద్రి |
అహోబిల పర్వతం చుట్టును అనేక సన్నిధులు తీర్థాలు ఉన్నాయి.
దర్శనీయ స్థలాలు
మార్చునవ నారసింహ గుళ్ళు
మార్చుఅహోబిల క్షేత్రమందు నవనారసింహులు నవవిధ రూపాలలో ఎగువ, దిగువ అహోబిల చుట్టు ప్రక్కల వెలసియున్నారు
జ్వాలా అహోబిల మాలోల క్రోద కారంజ భార్గవ
యోగానంద క్షాత్రవత పావన నవ మోర్థ్యః
అనగా
- 1 జ్వాలా నరసింహ: స్తంభంనుంచి ఉద్భవించిన నరసింహుడు క్రోధాగ్ని జ్వాలలతో ఊగి పోతూండటంతో జ్వాలా నరసింహుడన్నారు. ఇక్కడే ఉగ్ర నరసింహుడు హిరణ్యకశిపుని వధించినట్లు చెప్పబడుతోంది. ఇక్కడి ఆలయంలో అష్టభుజ, చతుర్భుజ నరసింహులు, హిరణ్యకశిపుని వెంటాడుతున్న నరసింహుడు .. ఈ మూడు విగ్రహాలు ప్రతిష్టింపబడి వున్నాయి. ఇదివరకు ఇది హిరణ్యకశిపుని రాజప్రాసాదంగా భావింపబడుతోంది. ఇక్కడే భవనాశనీ నది ప్రారంభం అవుతుంది.జ్వాలా నృసింహస్వామి దేవాలయం . 'అచలచయ మేరు' అని పిలువబడే కొండపై ఉంది. ఇది ఎగువ అహోబిల ఆలయం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్థలం అసలు స్పాట్ అని చెప్పబడింది, ఇక్కడ హిరణ్యకసిపుని చంపినప్పుడు స్వామి ఉగ్రత ను చూడవచ్చు.
- 2 అహోబిల నరసింహ: గరుత్మంతునికి దర్శనమిచ్చిన నరసింహ స్వామి. ముక్కోటి దేవతలు స్తోత్రము చేసినా కోపము తగ్గని నరసింహస్వామి ప్రహ్లాదుడు తపస్సు చేయగా స్వయంభువుడిగా వెలిశాడు.
- 3 మాలోల నరసింహ:లక్ష్మీదేవికి ప్రియమైన నరసింహస్వామి వేదాద్రి పర్వతంమీద లక్ష్మీనృసింహ స్వామిగా "మా" అనగ లక్ష్మి లోల యనగ "ప్రియుడు" అని అర్ధం. ఈ దేవాలయానికి మార్కొండలక్ష్మమ్మపేటు అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 1 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంది. స్వామి వారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు. వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈగుడి నిర్మించబడింది. ఇక్కడి శిల్పము వామపాదాన్ని మడుచుకొని, దక్షిణపాదాన్ని వంచి కిందకు వదలి సుఖాసీనుడై ఉన్నాడు. స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి స్వామివారి వామ హస్తము లక్ష్మీదేవిని ఆ లింగనము చేసుకొన్నట్లుగా యున్నది. స్వామి శంఖు, చక్ర, వరద, హస్తాలతో యున్నది. భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి. ఇదొక ప్రశంతమైన సుందరమైన చోటు, ధ్యాన అనుష్టాలకు చక్కని వేదిక. ఈ నరసింహా స్వామిని పూజించినవారికి శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది.
- 4 క్రోద నరసింహ (వరాహ నారసింహ): వేదాద్రి పర్వతముయందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్ళి సోమకాసుని సంహరించి భూదేవి సహితంగా పైకితెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రమని పేరు. భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి. ఈ నరసింహా మూర్తిని దర్శించిన రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి.
- 5 కారంజ నరసింహ: కారంజ వృక్ష స్వరూపిమైన శ్రీ కారంజ నరసింహ మూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వేంచేసియున్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు.పగడలువిప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యాననిమగ్నుడైన మూర్తి.గోబిలుడనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనారని, శ్రీ ఆంజనేయస్వామి ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు "నాకు శ్రీరామ చంద్రమూర్తి తప్ప వేరెవ్వరు తెలువదనగా" నృసింహుడు నేనే శ్రీరాముడ నేనే నృసింహస్వామి సాంగ (ధనస్సు) హస్తములతో దర్శన మివ్వగా ఈ స్వామికి కారంస్వామి అని పేరు. ఈ స్వామికి పాలనేత్రము (త్రినేత్రము) కలదు. అందుకే అన్నమయ్య "పాలనేత్రానల ప్రబల విద్ద్యులత కేళి విహార లక్ష్మీనరసింహ" అని పాడారు. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి చంద్రగ్రహ అనుగ్రహం లభించును.
- 6 భార్గవ నరసింహ: పరశురాముడు ఈ అక్షయ తీర్ధ తీరమందు తపస్సు చేయగా శ్రీ నృసింహాస్వామి హిరణ్యకశిపుని సంహరం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు. కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రమని పేరు. ఈ స్వామిని "భార్గోటి" అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు. పరశురాముని పూజలందుకున్న దివ్యధామము. ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 కి.మీ. దూరంలో ఉత్తర దిశ (ఈశాన్యము) యున్నది. స్వామి వారి విగ్రహం, పీఠంపై చతుర్బాహయుతమై శంఖు చక్రాన్వితములైన ఊర్ద్వబాహువుల, అసురుని ప్రేవువులను చీలుస్తు రెండు హస్తాలు, ఖడ్గహస్తుడైన హిరణ్య కశిపుడు, ప్రక్కలోనే అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు, ప్రభావళిలో దశావతారములతో ఈ విగ్రహము కలిగియున్నది. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి సూర్యగ్రహ అనుగ్రహం లభించును
- 7యోగానంద నరసింహ: ఈ ఆలయం 2 కిలోమీటర్ల దూరంలో దిగువ అహోబిలమ్ నుంచి ఆగ్నేయ దిశలో ఉంది. హిరణ్యకశిప్పుడును చంపిన తరువాత, నరసింహ ప్రహ్లాదుడు అనేక యోగ భంగిమలను బోధించాడు. అందువలన, యోగానంద నరసింహ అని పిలుస్తారు. యోగమునందు ఆనందమును ప్రసాదించుచున్నాడు. కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహ స్వామి అని పిలవబడుచున్నాడు. యోగపట్టంతో, విలసిల్లినాడు, ప్రహ్లాదుని ఈ యోగ నృసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేసినాడట. మనశ్చాంచల్యము కలిగిన బ్రహ్మ నరసింహుని గురించి తపస్సు చేసి మన:స్ధిరత్వమును సాధించెను. ఈ ప్రదేశము యోగులకు, దేవతలకు నిలయం.ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి శనిగ్రహ అనుగ్రహం లభించును
- 8 క్షాత్రపత నరసింహ (ఛత్రవట నారసింహ): దిగువ అహోబిలమ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో, దేవత యొక్క చిత్రం ముతక పొదలతో చుట్టుపక్కల ఉన్న పెపల్ చెట్టు కింద ఏర్పాటు చేయబడింది. అందువల్ల చాతురత నరసింహస్వామిగా పిలుస్తారు పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈమూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి. "హా హా" "హుహ్వా" అను ఇద్దరు గంధర్వులు అతి వేగముతో గానం చేసి నృత్యం చేయగా నృసింహస్వామిసంతోషించి వారికి శప విమోచనం గావించెను. కిన్నెర, కింపుర, నారదుల ఈ క్షేత్రంలో గానం చేసిరి. సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామిని చత్రవట స్వామి అని పిలుస్తారు. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి కేతుగ్రహ అనుగ్రహం లభించును
- 9 పావన నరసింహ: పరమపావన ప్రదేశంలో ఏడుపడగల ఆదిశేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపములను, సంసారంలో జరిగే సుఖ:దుఖా:లను తొలగించ గలిగే వాడని అర్ధమగుచున్నది. "భరద్వాజ" ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామి వారు మహాలక్ష్మీ సహితంగా వారికి దర్శనమిచ్చారు. కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రానికి పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 6 కి.మీ. దూరములో దక్షిణ దిశలో యున్నది. పాపకార్యములు చేసినవారు ఈ స్వామిని దర్శించినంతనే పావనులగుదురు. బ్రహ్మోత్సవముల దగ్గరనుండి ప్రతి "శనివారం" నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగును. ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వారి వారి కష్టములను, పాపములను భగవంతుని ప్రార్థనా రూపముగా సేవించి దర్శించుకుంటారు. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి బుధగ్రహ అనుగ్రహం లభించును.జ్వాలా నరసింహస్వామి క్షేత్రము దగ్గర భవనాశని అనే జలపాతము ఉంది. అక్కడ స్నానంచేస్తే సకల పాపాలు పోతాయి అని భక్తుల నమ్మకం.
ప్రహ్లాద బడి
మార్చుఇది చిన్న గుహ. దీనినే ప్రహ్లాద బడి అంటారు. ఈ గుహ ఎదురుగా కొండలపైనుండి నీరు పడుతూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ గుహ ఎదురుగా విశాలమైన రాళ్ళ చప్టాలాగా సహజసిద్ద కొండ ఉంటుంది, దానిపైన రకరకాల అక్షరాలు వ్రాసినట్లు గీతలు ఉంటాయి. ఈ అక్షరాలలో చాలా వాటికి పోలికలు గమనించవచ్చు! ఈ గుహలోకి ఒకేసారి కేవలం ఐదుగురు మాత్రమే వెళ్ళగలుగుతారు
మఠం
మార్చుఅహోబిలం మఠం చాలా ప్రసిద్ధి పొందినది. ఇది వైష్ణవ మత వ్యాప్తిలో కీలక భూమిక పోషించింది. సంకీర్తనాచార్యుడు, అన్నమయ్య ఇక్కడనే దీక్షపొంది మంత్రోపదేశం పొందినాడు. (లేదా వారి గురుపరపంపర ఈ మఠానికి సంబంధించినది). ఇది దిగువ అహోబిలంలో ఉంది. ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయము చాలా అందంగా, శిల్పకళలతో విలసిల్లుతుంది. మఠంలోనూ నరసింహస్వామి విగ్రహాలు ఉన్నాయి. వీని పూజాపునస్కారాలు చూడదగ్గవి.
ఉగ్ర స్థంభం
మార్చుఇది అహోబిలంలోని ఎత్తైన కొండ, దీనిని దూరం నుండి చూస్తే ఒక రాతి స్తంభం మాదిరిగా ఉంటుంది దీని రెండు చీలికలను రెండు భాగాలుగా విభజించడం చూడవచ్చు. ఇది చిరస్మరణీయ దృక్కోణం . దీనిని చేరుకోవడం కొంచెం కష్ష్టం, కానీ ఒకసారి దీనిని చేరుకుంటే మంచి ట్రెక్కింగు చేసిన అనుభూతినిస్తుంది.
దీని పైన ఒక జండా (కాషాయం), నరసింహస్వామి పాదాలు ఉంటాయి.ఎగువ అహోబిలమ్ ఆలయం నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో, స్తంభం
దీని నుండే నరసింహస్వామి ఉద్భవించినాడని ప్రతీతి. జ్వాలానరసింహ, భవనాశని దగ్గరలోని చిన్న కొండ అధిరోహించు రహదారి గుండా దీనిని చేరుకోవాలి. జ్వాలా, ఉగ్ర స్టాంబామ్ అనే రెండు సన్నివేశాలను మీరు ఒక గైడ్ ను తీసుకోవలసి ఉంది. మిగిలిన అన్ని ఇతర దేవుళ్ళు సాపేక్షంగా సులభంగా చూడవచ్చు. జ్వాలా, ఉగ్ర స్తంభముల మధ్య కూడా జ్వాలా మార్గంలో గుర్తించబడింది.
రవాణా సౌకర్యాలు
మార్చు- రోడ్డు మార్గం: హైదరాబాదు నుండి అహోబిలం వెళ్ళేందుకు రోడ్డు సౌకర్యం ఉంది. కడప, తిరుపతి నుండి వచ్చువారు, చాగలమర్రి నుంచి ముత్యాలపాడు, క్రిష్టాపురం, బాచేపల్లి మీదుగా కూడా అహోబిలం చేరుకోవచ్చు.
- రైలు మార్గం:అహోబిలం దగ్గరలోని రైలు నిలయం నంద్యాల. చెన్నై- బొంబాయి రైల్వేమార్గంలో గల కడప స్టేషన్‌లోదిగితే, ఆళ్లగడ్డ మీదుగా 115 కి.మీ. దూరంలో రహదారిమార్గంలో చేరవచ్చు.
- విమాన మార్గం:అహోబిలం దగ్గరలోని విమానాశ్రయం కర్నూలు
వసతి సౌకర్యాలు
మార్చు- తిరుమల తిరుపతి దేవస్థాన అతిధి గృహం
- అహోబిలం మఠ అతిథి గృహం: శ్రీ అహోబిల మఠ మలోలా గెస్ట్ హౌస్ గా పిలువబడే అతిథి గృహాన్ని మఠం నిర్వహిస్తుంది. మొత్తం 14 గదులు, 4 సింగిల్ గదులు, 6 డబుల్ గదులు, 4 ట్రిపుల్ గదులు ఉన్నాయి. వీటిలో రెండు డబుల్ గదులు, రెండు ట్రిపుల్ గదులు ఎయిర్ కండిషన్ ఉన్నాయి. అదనంగా, 10 వసతి గృహాల గదులు ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ "History of Ahobila Matam". acharyan38.com. Archived from the original on 2022-10-19. Retrieved 2022-10-19.
- ↑ S Rath (2012). Aspects of Manuscript Culture in South India. BRILL Academic. pp. 246–247 with footnotes. ISBN 978-90-04-22347-9.
- ↑ "Welcome to Sri Ahobila Muth Portal". www.ahobilamutt.org. Retrieved 2022-10-19.
- ↑ Pg.557 The History and Culture of the Indian People: The Delhi sultanate; Bharatiya Vidya Bhavan, Bhāratīya Itihāsa Samiti
- ↑ Pg.211 Report on the inscriptions of the Devasthanam collection, with illustrations, Sadhu Subrahmanya Sastry, Kallidaikurichi Aiyah Nilakanta Sastri, K.P. Bagchi & Co., 1998
- ↑ Pg.105 The Temple of Lord Varadaraja, Kanchi: a critical survey of Dr. K. V. Raman's Sri Varadarajaswami Temple, Kanchi
- ↑ Pg.36 Hindu and Muslim religious institutions, Andhra Desa, 1300-1600; New Era, 1984
- ↑ Pg.18 Śrī Vedānta Deśika - By Mudumby Narasimhachary, Sāhitya Akādemī ISBN 81-260-1890-9
- ↑ Pg.57 The history of the Vijayanagar Empire, Volume 1; M. H. Rāma Sharma, Popular Prakashan, 1978.
- ↑ Pg.129 Studies in social history:modern India, O. P. Bhatnagar, India. University Grants Commission, University of Allahabad. Dept. of Modern Indian History; St. Paul's Press Training School, 1964.
- ↑ Tirupati Balaji was a Buddhist shrine, Sanjivan Publications, 1991
- ↑ "Vadakalai Srivaishnava Festivals' Calendar - The source mentions Pancharatra & Munitraya Krishna Jayantis celebrated by Ahobila Matha & Andavan Ashrams respectively". Archived from the original on 2011-10-03. Retrieved 2011-09-25.
- ↑ Ahobila Matha's Balaji Mandir Pune, Calendar - The calendar mentions Ahobila Matha disciples celebrating Krishna Jayanti as "Pancharatra Sri Jayanti". Archived 2011-10-09 at the Wayback Machine
- ↑ వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
వెలుపలి లంకెలు
మార్చు- శ్రీ అహోబిల నృసింహ చరిత్ర (సంకలన కర్త - శ్రీ కిడాంబి వేణుగోపాలాచార్య, ప్రధాన అర్చకులు, శ్రీ లక్ష్మీ నృసింహ దేవస్థానం, అహోబిలం)
- అహోబిలం మఠం వారి సైటు