లలితా సహస్రనామ స్తోత్రం
లలితా సహస్రనామ స్తోత్రం, లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక స్తోత్రం. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీ దేవి స్వరూపమును సూచిస్తాయి. శక్తి ఆరాధనలోను, శ్రీవిద్యలోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ స్తోత్రం పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయని, కష్టాలు కడతేరుతాయని, సిద్ధులు లభిస్తాయని, ముక్తి లభిస్తుందని విశ్వాసం కలవారి నమ్మకం.
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు | |
వేదములు (శ్రుతులు) | |
---|---|
ఋగ్వేదం · యజుర్వేదం | |
సామవేదము · అధర్వణవేదము | |
వేదభాగాలు | |
సంహిత · బ్రాహ్మణము | |
అరణ్యకము · ఉపనిషత్తులు | |
ఉపనిషత్తులు | |
ఐతరేయ · బృహదారణ్యక | |
ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
కఠ · కేన · ముండక | |
మాండూక్య ·ప్రశ్న | |
శ్వేతాశ్వర | |
వేదాంగములు (సూత్రములు) | |
శిక్ష · ఛందస్సు | |
వ్యాకరణము · నిరుక్తము | |
జ్యోతిషము · కల్పము | |
స్మృతులు | |
ఇతిహాసములు | |
మహాభారతము · రామాయణము | |
పురాణములు | |
ధర్మశాస్త్రములు | |
ఆగమములు | |
శైవ · వైఖానసము ·పాంచరాత్రము | |
దర్శనములు | |
సాంఖ్య · యోగ | |
వైశేషిక · న్యాయ | |
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
ఇతర గ్రంథాలు | |
భగవద్గీత · భాగవతం | |
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
శివ సహస్రనామ స్తోత్రము | |
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
... · ... | |
ఇంకా చూడండి | |
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం |
ఈ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా హయగ్రీవునికి, అగస్త్యునికి జరిగిన సంవాదం రూపంలో ఉపస్థితమై ఉంది. లలితా సహస్రనామాన్ని వశిన్యాది వాగ్దేవతలు (వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని అనే ఎనిమిది మంది దేవతలు) దేవి ఆజ్ఞానుసారం దేవిస్తుతికోసం పఠించారని చెప్పబడింది. స్తోత్రంలో దేవి కేశాది పాదవర్ణన ఉంది. ఇందులో అనేక మంత్రాలు, సిద్ధి సాధనాలు, యోగ రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయని, విశ్వసిస్తారు. లలిత (క్రీడించునది) ను స్తుతించే ఈ స్తోత్రాన్ని దేవి ఇతర రూపాలైన దుర్గ, కాళి, మహాలక్ష్మి, సరస్వతి, భగవతి వంటి దేవతలను అర్చించడానికి కూడా పఠిస్తారు. పారాయణం, అర్చన, హోమం వంటి అనేక పూజావిధానాలలో ఈ సహస్రనామస్తోత్రం పఠించడం జరుగుతుంది.
స్తోత్ర పరిచయం
మార్చుబ్రహ్మాండ పురాణం 36వ అధ్యాయం "లలితోపాఖ్యానం"లో లలితా సహస్రనామ స్తోత్రం ఉంది. ఇందులో లలితాదేవిని సకల శక్తిస్వరూపిణిగాను, సృష్టిస్థితిలయాధికారిణిగాను వర్ణించారు. శ్రీమహావిష్ణువు అవతారమైన హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఈ స్తోత్రాన్ని ఉపదేశించాడు. లలితా పురాణంలో భండాసురుని సంహరించడానికి దేవి అవతరించినట్లుగా వర్ణించారు. ఈ గ్రంథాలలో శ్రీపురమును సూచించే శ్రీచక్రం నిర్మాణం వర్ణించబడింది. ఆదిశంకరులు, భాస్కరాచార్యుడు త్రిశతి, సహస్రనామములకు వ్యాఖ్యానాలు అందించారు.
అగస్త్యమహర్షికి ఉపదేశంలో హయగ్రీవుడు శ్రీలలితాదేవి ఆవాసమైన శ్రీపురాన్ని, పంచదశాక్షరి మంత్రాన్ని, శ్రీయంత్రము, శ్రీవిద్య, శ్రీలలితాంబిక, శ్రీగురుదేవుల ఐక్యతను వివరించాడు. అగస్త్యుడు లలితాసహస్రనామమును ఉపదేశింపమని కోరగా అది గుహ్యమని, అర్హత లేనివారికి ఉపదేశించడం నిషిద్ధమని హయగ్రీవుడు తెలిపాడు. కాని అగస్త్యుడు అర్హత కలిగిన ఋషి గనుక హయగ్రీవుడు అతనికి లలితాసహస్రనామాన్ని ఉపదేశించాడు.
స్తోత్రం ముఖ్య విభాగాలు
మార్చుఅన్ని పెద్ద స్తోత్రాలలాగానే లలితా సహస్రనామస్తోత్రంలో కొన్ని విభాగాలున్నాయి. పూజ, అర్చన లేదా పారాయణ చేసే సందర్భాన్ని బట్టి కొన్ని విధి విధానాలను పాటిస్తారు. సాధారణంగా భక్తులు ముందు శుచిగా స్నానాది కార్యములు ముగించుకొని నిత్య పూజా కార్యక్రమం చేసుకొని లలితా సహస్రనామస్తోత్రమును చదవడం జరుగుతుంటుంది.
పూర్వ పీఠిక
మార్చుపూర్వ పీఠికలో స్తోత్ర ఆవిర్భావాన్ని గురించి, ఆస్తోత్రం గోప్యనీయత గురించి హయగ్రీవుడు అగస్త్యునికి చెప్పిన వివరణ ఉంది. స్తోత్ర పారాయణ మహాత్మ్యము, అది చదవడంలో పాటించవలసిన నియమాలు వివరింపబడ్డాయి. పూర్వ పీఠికలో తెలుపబడిన కొన్ని ముఖ్యాంశాలు -
ముందుగా హయగ్రీవుడు అగస్త్యునికి శ్రీ లలితాదేవి చరిత్రను, భండాసురుని సంహారము, శ్రీపుర వర్ణన, శ్రీ విద్యా పంచాక్షరీ మంత్ర మహిమలను, హోమ విధానాలను తెలిపాడు. శ్రీచక్రానికి, శ్రీవిద్యకు, శ్రీదేవికి, గురుశిష్యులకు ఉండే అన్యోన్య తాదాత్మ్యాన్ని బోధించాడు. మంత్రిణి, శ్యామలాంబ, దండిని, వారాహిదేవి సహస్రనామాలను ఉపదేశించాడు. తనకు లలితా సహస్రనామాలను కూడా ఉపదేశించమని అగస్త్యుడు ప్రార్థించాడు.
లలితాదేవి సహస్రనామాలు రహస్యమయాలనీ, శ్రీదేవియందు శ్రద్ధాభక్తులు కలిగి గురుముఖతః పఞ్చదశాక్షరీ మంత్రోపదేశాన్ని పొందిన శిష్యునకు మాత్రమే గురువు ఈ రహస్యనామాలను ఉపదేశించాలనీ హయగ్రీవుడు తెలిపాడు. లలితా తంత్రాలలో ఈ సహస్రనామాలే సర్వశ్రేష్టం. వీనివలన శ్రీలలితాదేవి సులభంగా ప్రసన్న అవుతుంది. ముందుగా శ్రీచక్రార్చన, పంచదశాక్షరీ జపం చేసి, అనంతరం సహస్రనామ పారాయణ చేయాలి. జపపూజాదులకు అసమర్ధులైనవారు నామసహస్రపారాయణం మాత్రం చేయవచ్చును. దేవి ఆజ్ఞానుసారం వశిన్యాది దేవతలు రచించిన ఈ స్తోత్రం పారాయణం చేసేవారికి లలితాదేవి అనుగ్రహం, సకలాభీష్ఠ సిద్ధి కలుగుతాయి. శ్రీదేవి ఆజ్ఞానుసారం బ్రహ్మవిష్ణుమహేశ్వరాది దేవతలు, మంత్రిణి శ్యామలాంబవంటి శక్తులు కూడా ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని భక్తితో పఠిస్తున్నారు.
పారాయణ భాగం
మార్చుపూర్వ పీఠిక, ఉత్తర పీఠికలను కొందరు పారాయణంలో భాగంగా చదువవచ్చును కాని సాధారణంగా వాటిని మినహాయించి "న్యాసం" నుండి "సహస్రనామము" వరకు పారాయణలో చదువుతారు.
- న్యాసం
పారాయణ క్రమంలో ముందుగా న్యాసము చేస్తారు. చేయబోయే జపం ఏమిటి? ఎవరు దీనిని ముందు చెప్పారు? దాని ప్రాశస్త్యత ఏమిటి? అందుకు రక్షణ ఏమిటి? ఎందుకు ఈ జపం చేయబడుతున్నది వంటి విషయాలు న్యాసంలో చెబుతారు.
అస్య శ్రీలలితాసహస్ర నామస్తోత్రమాలా మంత్రస్య
వశిన్యాది వాగ్దేవతావతా ఋషయ:
అనుష్టుప్ ఛంద:
శ్రీలలితా పరాభట్టారికా మహాత్రిపురసుందరీ దేవతా
ఐం - బీజం, క్లీం - శక్తిః, సౌః - కీలకం
(శ్రీమద్వాగ్భవకూటేతి బీజమ్ మధ్యకూటేతి శక్తి: శక్తికూటేతి కీలకమ్ )
సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్ధే
శ్రీలలితా త్రిపురసుందరీ పరాభట్టారికా సహస్రనామ జపే వినియోగ:
తరువాత "అంగన్యాసము", "కరన్యాసము" చెబుతారు.
- ధ్యానము, పూజ
న్యాసం తరువాత ధ్యానం పఠిస్తారు. ఏ దేవతనుద్దేశించి ఈ స్తోత్రం పారాయణం చేయబడుతున్నదో ఆ దేవతను ముందుగా ధ్యానించడం సంప్రదాయం - ఈ స్తోత్ర ధ్యానంలో మూడు శ్లోకాలున్నాయి. "అరుణాం కరుణాంతరంగీమ్ ... ", "ధ్యాయేత్ పద్మాసనస్థాం...", "సకుంకుమ విలేపనామ్..." అనేవి ఆ మూడు ధ్యాన శ్లోకాలు. వాటిలో మొదటిది క్రింద వ్రాయబడింది.
అరుణాం కరుణాతరంగితాక్షీం
ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం
అణిమాదిభిరావృతాం మయూఖై
రహమిత్యేవవిభావయే భవానీమ్ ॥ 1 ॥
- ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మ పత్రాయతాక్షీం
- హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసమద్ధేమపద్మాం వరాంగీమ్ ।
- సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం
- శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురసుతాం సర్వసంపత్-ప్రదాత్రీమ్ ॥ 2 ॥
- సకుంకుమ విలేపనా మళికచుంబి కస్తూరికాం
- సమంద హసితేక్షణాం సశరచాప పాశాంకుశామ్ ।
- అశేష జనమోహినీ మరుణమాల్య భూషోజ్జ్వలాం
- జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరే దంబికామ్ ॥ 3 ॥
తరువాత దేవికి "లమిత్యాది పంచపూజ" చేస్తారు. గురుధ్యానం కూడా చేస్తారు.
- వేయి నామాలు
ఇది శ్రీదేవి వేయి నామములను స్తుతించే ప్రధాన భాగం. ఉదాహరణగా కొన్ని శ్లోకాలు ఇక్కడ వ్రాయడమైనది.
- 1,2,3వ శ్లోకములు
శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ
చిదగ్ని కుండ సమ్భూతా దేవకార్య సముద్యతా
ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహుసమన్వితా
రాగస్వరూప పాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా
మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకా
నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా
- 21వ శ్లోకము
సర్వారుణా నవద్యాంగీ సర్వాభరణ భూషితా
శివకామేశ్వరాంకస్థా శివా స్వాధీన వల్లభా
- 52వ శ్లోకం
సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా
సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ
- 65వ శ్లోకము
భానుమండల మధ్యస్థా భైరవీ భగమాలినీ
పద్మాసనా భగవతీ పద్మనాభ సహోదరీ
- 70వ శ్లోకము
నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా
హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయవర్జితా
- 118వ శ్లీకము
ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా
శ్రీషోడశాక్షరీవిద్యా త్రికూటా కామకోటికా
- 130వ శ్లోకము
ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ
సర్వధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణీ
- 148వ శ్లోకము
దురారాధ్యా దురాధర్షా పాటలీకుసుమప్రియా
మహతీ మేరునిలయా మందారకుసుమప్రియా
- 172వ శ్లోకము
స్తోత్రప్రియా స్తుతిమతీ శృతిసంస్తుత వైభవా
మనస్వినీ మానవతీ మహేశీ మంగళాకృతిః
- 182, 183, 184వ శ్లోకములు (చివరి మూడు)
అభ్యాసాతిశయజ్ఞాతా షడద్వాతీతరూపిణీ
అవ్యాజకరుణామూర్తి రజ్ఞానధ్వాందీపికా
ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్యశాసనా
శ్రీచక్రరాజనిలయా శ్రీమత్త్రిపురసుందరీ
శ్రీశివా శివశక్త్యైక్యరూపిణీ లలితాంబికా
ఏవం శ్రీలలితాదేవ్యాం నామ్నాం సాహస్రకం జగుః
ఉత్తర పీఠిక (ఫలశృతి)
మార్చుమూడవ అధ్యాయం అయిన "ఉత్తర పీఠిక"లో ఫలశృతి చెప్పబడింది. అందులో హయగ్రీవుడు అగస్త్యునికి తెలిపిన కొన్ని విషయాలు:
శ్రీలలితాసహస్రనామములు రహస్యమయములు. అపమృత్యువులను, కాలమృత్యువులను కూడా పోగొట్టును. రోగాలను నివాఱించి దీర్ఘాయుర్దాయాన్ని ప్రసాదిస్తాయి. సకల సంపదలనూ కలిగిస్తాయి. ఈ స్తోత్రాన్ని శ్రద్ధాసక్తులతో విధివిధానుసారం పఠించాలి. అన్ని పాపాలను హరించడానికి లలితాదేవియొక్క ఒక్కనామం చాలును. భక్తుడైనవాడు నిత్యం గాని, పుణ్యదినములయందుగాని ఈ నామపారాయణ చేయాలి. విద్యలలో శ్రీవిద్య, దేవతలలో శ్రీలలితాదేవి, స్తోత్రాలలో శ్రీలలితా సహస్రనామ స్తోత్రము అసమానములు. శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన, రహస్యనామపారాయణ అనే భాగ్యాలు అల్పతపస్వులకు లభించవు. భక్తిహీనులకు దీనిని ఉపదేశింపరాదు. ఈ లలితాసహస్రనామస్తోత్రమును తప్పక పఠిస్తే శ్రీదేవి సంతసించి సర్వభోగములను ప్రసాదించును.
అర్ధాలు, రహస్యార్ధాలు
మార్చుఉత్తరపీఠికలోను, పూర్వపీఠికలోను చెప్పబడిన విధంగా లలితాసహస్రనామస్తోత్రంలోని వివిధనామాలు రహస్యమయాలు, అనేక నిగూఢార్ధ సంహితములు అని అనేకులు భావిస్తారు. నామాలలో అనేక మంత్రాలు, బీజాక్షరాలు నిక్షిప్తమై యున్నాయని కూడా వారి విశ్వాసం. ముఖ్యంగా శాక్తేయులకు ఇవి చాలా విశిష్ఠమైనవి. ఈ శ్లోకంలోని నామాల అర్ధాలను, భావాలను అనేకులు వ్యాఖ్యానించారు. అంతేగాక వాటిని విషయపరంగా కొన్ని విభాగాలుగా చేసి, ఒక్కొక్క విభాగం ఒక్కొక్క తాత్విక లేదా తాంత్రిక ఆంశానికి చెందినట్లుగా భావిస్తున్నారు.
సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము - అనే పంచకృత్యాలకు అనుగుణంగా ఈ శ్లోకాలలోని నామములు కూర్చబడినాయని ఒక వివరణ. దేవి "పంచకృత్యపరాయణ" అని వర్ణింపబడింది.
సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జితా
సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ -- 63
సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ
సదాశివానుగ్రహదా పంచకృత్య పరాయణా -- 64
అనగా దేవి బ్రహ్మరూపిణియై సృష్టిని, విష్ణు (గోవింద) రూపిణియై స్థితికార్యమును, రుద్రరూపిణియై సంహారమును, ఈశ్వరియై తిరోధానమును, సదాశివమూర్తియై అనుగ్రహమును నిర్వహించుచున్నది. మొదటి శ్లోకంలోని మొదటి మూడునామములు - శ్రీమాత, శ్రీమహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి - కూడా సృష్టి, స్థితి, సంహారములను సూచించుచున్నవి. ఆలాగే తరువాతి రెండు నామములు - చిదగ్నికుండ సమ్భూతా, దేవకార్యసముద్యతా - అనునవి తిరోధానమును, అనుగ్రహమును సూచించునని అంటారు.
"ఉద్యద్భానుసహస్రాభా" నుండి "శింజాన మణిమంజీరమండిత శ్రీపదాంబుజా" వరకు శ్రీదేవి కేశాదిపాద సౌందర్యవర్ణన ఉంది. తరువాత దేవి ఆవాసమైన చింతామణిగృహవర్ణన, ఆపై భండాసురసంహారము, కుండలినీశక్తికి సంబంధించిన నామాలు ఉన్నాయి. ఆ తరువాత అనేక విద్యలు, పూజలు, మంత్రములు నిక్షిప్తమై ఉన్నాయంటారు.
మరికొందరు విశ్లేషకులు ఈ వెయ్యి నామాలను వందేసి నామములున్న పది విభాగాలుగా చెబుతారు. ఆ పది విభాగాలలోని మొదటి నామముల క్రమం ఇలా ఉన్నది -
- శ్రీమాతా - చూడండి: లలితా సహస్ర నామములు- 1-100
- మణిపూరాంతరూఢితా - చూడండి: లలితా సహస్ర నామములు- 101-200
- సద్గతిప్రదా - చూడండి: లలితా సహస్ర నామములు- 201-300
- హ్రీంకారీ - చూడండి: లలితా సహస్ర నామములు- 301-400
- వివిధాకారా - చూడండి: లలితా సహస్ర నామములు- 401-500
- గుడాన్నప్రీతమనసా - చూడండి: లలితా సహస్ర నామములు- 501-600
- దరాందోళిత దీర్ఘాక్షీ - చూడండి: లలితా సహస్ర నామములు- 601-700
- దేశకాలపరిచ్ఛిన్నా - చూడండి: లలితా సహస్ర నామములు- 701-800
- పుష్టా - చూడండి: లలితా సహస్ర నామములు- 801-900
- నాదరూపిణీ - చూడండి: లలితా సహస్ర నామములు- 901-1000
శ్రీవిద్య, లలితాసహస్రనామం
మార్చులలితాసహస్రనామ పారాయణ (మంత్రము), శ్రీచక్ర పూజ (యంత్రము), కుండలినీయోగ సాధన (తంత్రము), - అనేవి శ్రీవిద్యోపాసనలో ముఖ్యమైన అంశాలు. సగుణ బ్రహ్మోపాసన, నిర్గుణ బ్రహ్మోపాసన అనే రెండు విధానాలు ఈ విద్యాసాధనలో నిక్షిప్తమై ఉన్నాయి. యోగసాధనలో చెప్పబడే షట్చక్రాలు (మూలాధార చక్రము, స్వాధిష్ఠాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము) లలితాసహస్రనామంలో చెప్పబడినాయి. ఈ చక్రాలను అధిగమించి సహస్రారంలో కొలువైయున్న జగన్మాతృకా స్వరూపాన్ని చేరుకోవడమే కుండలినీయోగసాధనలోని లక్ష్యం.
వ్యాఖ్యానాలు
మార్చులలితా సహస్ర నామానికి అనేకులు వ్యాఖ్యలు వ్రాశారు. వీటిలో భాస్కరాచార్యుడు వ్రాసిన "సౌభాగ్య భాస్కరము" మనకు తెలిసినవాటిలో మొదటిది, అనేక ఇతర వ్యాఖ్యానాలకు మాతృక వంటిది. భాస్కరాచార్యుడు కృష్ణాతీరవాసి, ఆంధ్రుడు. కర్ణాటకలో బీజాపూర్ నవాబుకు మంత్రి గంభీరరాయ దీక్షితులు మహాపండితుడు. మహాభారతాన్ని పార్శీ భాషలోనికి అనువదించి "భారతి" అనే బిరుదు పొందాడు. ఇతని భార్య కోనమాంబ. రాచ కార్యంపై ఈ దంపతులు హైదరాబాదుకు వచ్చినపుడు వారికి జన్మించిన బిడ్డ భాస్కరరాయలు. ఇతడు నారాయణపేట వద్ద లోకాపల్లిలో నృసింహయాజి వద్ద విద్యాభ్యాసం చేశాడు. సూరత్‌లోని ప్రకాశానంది శివదత్తశుక్ల వద్ద దీక్షోపదేశం పొందాడు. దేశాటనం చేస్తూ 1750 ప్రాంతంలో కాశీ నగరాన్ని సందర్శించాడు. అక్కడ "సౌభాగ్య భాస్కరము" అనబడే లలితాసహస్రనామస్తోత్ర వ్యాఖ్యానం రచించాడు. ఇంకా సేతుబంధము, చండాభాస్కరము, తృచ భాస్కరము, పరివస్యా రహస్యము మొదలైన 43 గ్రంథాలను రచించాడు. ఇతని సిద్ధి శక్తులను గూర్చి, పాండిత్యాన్ని గూర్చి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి.[1]
సౌభాగ్య భాస్కరమే కాకుండా మరికొన్ని ప్రసిద్ధ వ్యాఖ్యానాలు - [2]
- విమర్శనానందుని వ్యాఖ్యానం - 200 శ్లోకాలలో, 9 అధ్యాయాలుగా ఉంది. ఈ విమర్శనానందుడు విమలానందనాధుని శిష్యునిగా తెలుస్తున్నది.
- సౌభాగ్య రత్నాకరము - సచ్చిదానందనాధూని శిష్యుడైన విద్యారణ్యనాధుని వ్యాఖ్య - 36 తరంగాలలో ఉంది.
- శివానందనాధుని శిష్యుడైన భట్టనారాయణుని వ్యాఖ్యం - 2500 శ్లోకాలలో
పూర్తిపాఠం
మార్చు- s:లలితా సహస్రనామ స్తోత్రము : వికీసోర్సులో లలితా సహస్రనామ స్తోత్రము పూర్తి పాఠం చదవి తరించండి.
విశేషాలు
మార్చు- కొన్ని సహస్రనామ స్తోత్రాలలో కొన్ని నామాల పునరుక్తి కనిపిస్తుంది. అలాంటి చోట్ల వ్యాఖ్యాతలు ఆ నామాలకు వేరు వేరు అర్ధాలను తెలిపి పునరుక్తి దోషం లేదని నిరూపించారు. కాని లలితా సహస్రనామ స్తోత్రంలో ఏ నామము పునరుక్తింపబడలేదు.
- సంస్కృత శ్లోకాలలో కొన్ని చోట్ల ఛందస్సు సరిపోవడానికి "తు, చ, అపి, హి" వంటి అక్షరాలు, పదాలు వాడడం జరుగుతుంది. కాని లలితా సహస్రనామస్తోత్రంలో అలా ఎక్కడా వాడలేదు.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ శ్రీవిద్యాసారధి - డా. క్రోవి పార్ధసారధి
- ↑ http://kandamangalam.com/Documents%5CSREE%20LALITHA%20SAHASRANAMA%20STOTRAM.pdf
వనరులు
మార్చు- శ్రీమాతా, శ్రీవిద్య, శ్రీచక్రము - రచన: ఎ.జి. ప్రసూన - ఇంటర్నెట్ ఆర్చీవులో లభిస్తున్నది.
- శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము - రచన: బ్రహ్మశ్రీ పురాణపండ రాధాకృష్ణమూర్తి - ప్రచురణ: గొల్లపూడి వీరాస్వామి సన్, రాజమండ్రి
- శ్రీవిద్యా సారథి (లలితా రహస్యనామ భాష్యము) - రచన: డా. క్రోవి పార్ధసారథి - ప్రచురణ: శివకామేశ్వరి గ్రంథమాల, విజయవాడ (2002)