మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల

(శ్రీ విజయరామ గాన పాఠశాల నుండి దారిమార్పు చెందింది)

మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల విజయనగరంలో ప్రసిద్ధిచెందిన సంగీత, నృత్య కళాశాల. ఎందరో సంగీత విద్వాంసులు విజయనగరంలో శిక్షణ పొంది దేశదేశాల్లో తమ కీర్తిని, విజయనగరం ఖ్యాతిని చాటి చెప్పుకున్నారు. ఒకనాడు మహా రాజులు తమ ఆస్థానంలో సంగీత కళాకారులను పోషించారు. ఆ మహారాజులే గానకళపట్ల అభిమానంతో ఒక కళాశాలను ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతం ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.

చరిత్ర

మార్చు
 
మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల అధ్యక్షులుగా పనిచేసిన ద్వారం వెంకటస్వామి నాయుడు

ఈ సంగీత కళాశాలకు విజయరామ గజపతిరాజు శ్రీకారం చుట్టారు. తన ఆస్థానంలోని ఉద్యోగి చాగంటి జోగారావు కుమారుడు గంగ బాబు అంధుడు. ఆ బాలుడి కోసం 1919 ఫిబ్రవరి 5న విజయరామ గజపతిరాజు విజయరామ గాన పాఠశాలను ఏర్పాటు చేశారు.[1] ఆనాడు ఈ పాఠశాలకు హరికథా పితామహుడు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు అధ్యక్షులయ్యారు. అనంతరం వయోలిన్‌ వాద్యంలో మేటి అయిన పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు ఈ కళాశాలలో విద్యార్థిగా చేరటానికి రాగా ఆయననే అధ్యక్షులుగా నియమించారు. ఇది ఆయనలోని కళానైపుణ్యానికి నిదర్శనం. అనంతరం ద్వారం నరసింగరావునాయుడు కళాశాల అధ్యక్షులుగా పనిచేశారు.

విజయనగరం కోట వెనుక ప్రాంతంలోని నేటి ఈ కళాశాలను టౌన్‌ హాలు అని పిలిచేవారని అంటారు కొందరు. దక్షిణాదిన కర్ణాటక శాస్ర్తీయ సంప్రదాయాలను పరిరక్షించే ఈ పాఠశాలలో వీణ, గాత్రం, వయోలిన్‌, మృదంగం, సన్నాయి, డోలు వాద్యాలలో శిక్షణ ఇచ్చేవారు. అయితే హరికథ కోర్సును నాటినుంచి నేటి వరకూ అవకాశం కల్పించలేదు. హరికథ, ఫ్లూట్‌ కోర్సులను కళాశాలలో ప్రవేశపెట్టాలని ప్రతి ఏటా వినతులు పంపుతున్నారు.

ప్రసిద్ధిగాంచిన గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు, గాయని పి. సుశీల, శ్రీరంగం గోపాలరత్నం ఈ కళాశాల విద్యార్థులే. అలాగే సినీరంగాన సంగీత దర్శకులుగా పేరొందిన సాలూరు రాజేశ్వరరావు, ఒడిషా రాష్ట్రంలో పలు చలన చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన భువనేశ్వర్‌ మిశ్రో ఇక్కడి సరస్వతీ మందిర ద్వారం నుంచి వచ్చినవారే.

సంగీత చూడామణి నేదునూరి కృష్ణమూర్తి, ద్వారం సత్యనారాయణ, ద్వారం దుర్గాప్రసాదరావు, విజయవాడకు చెందిన వయోలిన్‌ విద్వాంసులు కె.వి రెడ్డి తదితరులు ఈ కళాశాల ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేశారు. 1953లో ఈ గాన పాఠశాల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆధీనంలోకి వెళ్ళింది. ఇది ప్రస్తుతం ఎ.పి ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖలతో విస్తరిస్తోంది. నేడు ఇక్కడ భరతనాట్యంలో కూడా అనేక మంది శిక్షణ పొందుతున్నారు. ఈ కళాశాలలో వారసత్వంలా ఒకే వంశం నుండి విద్యనేర్చిన వయోలిన్‌ కళాకారులు ప్రొఫెసర్లుగా పనిచేశారు.

పాశ్చాత్య తంత్రీవాద్యమైన ఫిడేలు (వయోలిన్‌) కర్ణాటక సంగీత బాణీల్లో పలికించినతీరు ప్రశంసనీయం. నాటి ద్వారం వెంకటస్వామి నుండి నేటితరం ఆధ్యాపకుల వరుకు ద్వారం వారి ముద్ర ఇది అని తెలియజేసే అనుభవజ్ఞులే కావడం విశేషం. ఒకే సంప్రదాయం శృతి లయలతో ఒక రాగాన్ని తీసుకొని వయోలిన్‌పై ఏదో ఒక కొత్తదనం చూపాలనే తపన వారి సాధనలో తెలుస్త్తుంది. ఇక్కడ నేర్చిన వయోలిన్‌ విద్యార్థులు ఏరంగా అయినా తమ ప్రతిభను చూప గలుగుతున్నారు. 90 వసంతాలు గడిచినా నాటి సంప్రదాయరీతిలో విద్యార్థులు శిక్షణ పొందిన కళాశాల రాష్ట్రంలో మరెక్కడాలేదు.

నూకల చినసత్యన్నారాయణ, శ్రీరంగం గోపాలరత్నం, ద్వారం భావనారాయణరావు, పివి శేషయ్య శాస్ర్తీ, నేదునూరి కృష్ణమూర్తి, బురిడి అనూరాధా పరుశురాం కళాశాల అధ్యక్షులయ్యారు. ద్వారం మంగతాయారు ఈ కళాశాలలో వయోలిన్‌ ప్రొఫెసరుగా పనిచేశారు. ఇక్కడి సంగీత, నృత్య విద్యార్థు లకు ఎన్నోఏళ్ళుగా సింహాచలం శ్రీవరాహ నృసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సత్రంలో ఉచిత భోజన సౌకర్యం నేటికీ కొనసాగుతోంది. దూర ప్రాంతాలనుంచి వచ్చిన విద్యార్థులకు మేలు కలిగిస్తూ ప్రతీ ఏటా వినాయక చవితి సందర్భంగా సంగీతోత్సవాలను అధ్యాపక, విద్యార్థి బృందాలు నిర్వహిస్తున్నాయి. నేడు సాంస్కృతికశాఖ సహకరిస్తోంది.

ఈ కళాశాలలోని సంగీత దర్బార్‌ ఎంతో విలక్షణమైంది. ఎందరో విద్వాంసులు ఈ కళాశాలలో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. హిందుస్థానీ, కర్ణాటక సంగీతాలు, భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చారు. ఇక్కడ నేర్చిన విద్యార్థుల ముందు తమ ప్రదర్శనలు ఇచ్చేందుకు కళాకారులు ఆసక్తి చూపుతారంటే అతిశయోక్తి కాదు.

సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ప్రతీఏటా కళాపరిచయం ద్వారా వందలాదిమంది శిక్షణ పొందినవారికి ఈ సంగీత, నృత్యకళాశాలలో ప్రవేశం కల్పిస్తున్నారు. 10 ఏళ్ళు నిండిన వారు ఎవరైనా సంగీత, నృత్యాల్లో విద్యార్థులుగా చేరే అవకాశం ఉంది. ప్రతీ అంశానికి ఒక్కొక్క తరగతి గది ఉంది. తరగతి గదుల్లోనేగాక బయట ప్రాంగణంలో విశాలమైన వృక్షాల నీడన విద్యార్థులు చేసే సాధన వినటానికి ఎందరో ఆసక్తి చూపుతారు. ఈ కళాశాలలో చేరాలనే ఆసక్తి చూపే వారిసంఖ్య ఎక్కువుగా వుంటోంది. వారికి వీలైన సమయంలో ఉదయం గాని, సాయంత్రం గాని నేర్చుకునే అవకాశం కల్పించారు.

ఒడిషా రాష్ట్రంలోని వారికి, ఇటు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వారికి అందుబాటులో వున్న సంగీత కళాశాల ఇదే. ప్రతీఏటా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించే పరీక్షలతోపాటు, ఆంధ్రా యూనివర్శిటీ నిర్వహించే సంగీత, నృత్య పరీక్షలకు విద్యార్థులు హాజరవుతారు. దేశంలో ఎంతో ప్రఖ్యాతి పొందిన ఈ కళా శాలను విశ్వవిద్యాలయంగా మార్చాలని ప్రభుత్వానికి ఎందరో విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రధానాచార్యులు

మార్చు

పూర్వ విద్యార్థులు

మార్చు

మూలాలు

మార్చు
  1. బుడితి, రామినాయుడు (February 2019). "తెలుగు వెలుగు: నూరేళ్ళ నాదకోవెల". రామోజీ ఫౌండేషన్. Archived from the original on 2019-03-05. Retrieved 2019-03-11.
  2. "Biography of Nedunuri Krishna Murthy at Nedunuri.com". Archived from the original on 2020-11-24. Retrieved 2018-07-28.
  3. Biography of Dr. Noookala Chinna Satyanarayana at Nookala.com
  4. Biography of P. Susheela in her website.