ఇందారపు కిషన్ రావు
ఇందారపు కిషన్ రావు (1941 జూలై 4 - 2017 జూన్ 8) ప్రముఖ అవధాని, కవి, బహుభాషా కోవిదుడు. ఇతడు 80కి పైగా అష్టావధానాలు చేశాడు.
ఇందారపు కిషన్ రావు | |
---|---|
జననం | ఇందారపు కిషన్ రావు 1941 జూలై 4 తాండూరు గ్రామం, ఆదిలాబాదు జిల్లా, తెలంగాణా రాష్ట్రం |
మరణం | 2017 జూన్ 8 హైదరాబాదు |
మరణ కారణం | అనారోగ్యము |
వృత్తి | ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు |
మతం | హిందూ |
భార్య / భర్త | విమలాబాయి |
పిల్లలు | శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, కరుణశ్రీ, పద్మశ్రీ, గీతాంజలి |
తండ్రి | కేశవరావు |
తల్లి | కమల |
విశేషాలు
మార్చుకిషన్రావు 1941 జూలై 4వ తేదీన కమల, కేశవరావు దంపతులకు రెండో సంతానంగా ఆదిలాబాద్ జిల్లా తాండూరులో జన్మించాడు. ఇతనికి తెలుగుతోపాటు మరాఠీ, సంస్కృతం, ఉర్దూ భాషల్లో మంచి పాండిత్యం ఉంది. ఇతడు తాండూరులో ప్రాథమిక విద్య, చెన్నూరులో పదో తరగతి వరకు, వరంగల్‌లో పీయూసీ చదివాడు.1966లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ., 1969లో ఎం.ఎ. డిగ్రీలు పొందాడు. ఆ తర్వాత "శేషాద్రి రమణ కవులు - జీవితం - సాహిత్యం" అనే అంశంపై కేతవరపు రామకోటిశాస్త్రి నిర్దేశకత్వంలో పరిశోధన చేసి 1987లో డాక్టరేట్ పట్టాను పొందాడు. కాశీ కృష్ణాచార్యులు, వానమామలై వరదాచార్యులు, దివాకర్ల వెంకటావధాని, సి.నారాయణరెడ్డిలకు ఇతడు ప్రియశిష్యుడు. ఇతడు ఉపాధ్యాయుడిగా తాండూరు, సిర్పూర్, నిర్మల్ లలో పనిచేసి తరువాత 1970లో ఉద్యోగరీత్యా వరంగల్లు జిల్లా, హనుమకొండలో స్థిరపడ్డాడు. ఇతడు 1970 నుంచి 1987 వరకు వరంగల్‌లోని ఎల్‌బీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకునిగా, ఆ తర్వాత పదోన్నతిపై రీడర్‌గా పని చేసి 1999లో ఉద్యోగ విరమణ చేశాడు. ఇతని భార్య విమలాబాయి. వీరికి ఇద్దరు కుమారులు శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, ముగ్గురు కుమార్తెలు కరుణశ్రీ, పద్మశ్రీ, గీతాంజలి ఉన్నారు. ఇతడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ 2017, జూన్ 8వ తేదీన హైదరాబాదులో తన పెద్ద కుమారుడు శ్రీనివాసరావు ఇంటిలో మరణించాడు.[1]
రచనలు
మార్చు- శ్రీనివాస శతకం
- ఋతు సంహారం
- వసంత సుమనస్సులు
- కవితా వసంతం
- సరస్వతీ వైభవం
- వాణీ విలాసము
- శేషాద్రి రమణ కవుల జీవితము - సాహిత్యము (పరిశోధక గ్రంథము)
- అవధాన లేఖ
- కాకతీయ వైభవం (రూపకం)
- ప్రతాప రుద్ర వైభవం (రూపకం)
- సామ్రాట్ గణపతి దేవ (రూపకం)
- రామప్ప (నృత్య రూపకం)
- పాటల పల్లకి
- భాషా చరిత్ర
- ఎం.ఎ. ఫైలాలజీ
- నవరస నాట్య గీతాలు
- కలిసి ఉంటే కలదు సుఖం (రేడియో నాటిక)
- విష్ యూ హ్యపీ న్యూఇయర్ (రేడియో నాటిక)
అవధానాలు
మార్చుఇతని అవధానాలలో సమస్య - దత్తపది - నిషిద్ధాక్షరి - వర్ణన - ఆశుకవిత - పురాణము - ఛందోభాషణము - తేదీలకు వారాలు - అప్రస్తుత ప్రశంస మొదలైన అంశాలు ఉన్నాయి. ఇతడు తాండూరు, ఖమ్మం, హైదరాబాదు, చెన్నూరు, హనుమకొండ, వర్ధన్నపేట, కాజీపేట, మంచిర్యాల, ఎల్కుర్తి, వరంగల్లు మొదలైన చోట్లే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నలుమూలలా, అమెరికాలో తానా మహాసభలలోనూ అవధానాలు నిర్వహించాడు.[2] అవధానాలలో ఇతడు పూరించిన కొన్ని పద్యాలు :
- సమస్య:
ఏడవ భర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్
పూరణ :
కూడని కోర్కెయే మగని గోరుట యో యమధర్మరాజ! పూ
బోడి సుమంగళిత్వమునఁ బొల్పు వహించు ధరిత్రిలోన, నే
మేడలు మిద్దెలున్ నిధులు మెచ్చను, రాజ్యము లేదటంటు నే
నేడవ, భర్త కల్గినపుడే కద సాధ్వికి గౌరవంబిలన్
- దత్తపది:
కొంప - చెంప - కంప - రొంప పదాలతో వరకట్న దురాచారం గురించి.
పూరణ :
కొంపల్ గోడలు పుస్తె లమ్మి తుదకున్ గోచీయె దక్కంగ హృ
త్కంపంబందగ కూతుపెళ్ళి యగునో కాదో యటంచున్ మదిన్
చెంపల్ వేసుకొనేరు చూడ జనకుల్ ఛీఛీ భవం బేల పె
న్రొంపయ్యెన్ బ్రతుకెల్ల నిక్కము కుమారుల్ గాక కూతుళ్ళుగా
- వర్ణన:
వసంతఋతువులో ప్రేయసీ వియోగాతురుని మనఃస్థితి
పూరణ :
శ్రీలు చిందెడి యీ వసంతము చింత గూర్చునె సుందరీ
బాలచంద్రుని దర్శనమ్మది బాణమై వెతగూర్చెడిన్
తాళలేనిక కోకిలమ్మల దౌష్ట్యకూజితముల్ వినన్
జాలమున్ విడనాడి వేగమె సౌఖ్య మీయగ చేరవే.
- ఆశువు:
కృష్ణునికి, కృష్ణదేవరాయలకు పోలిక
పూరణ :
అష్టభార్యల పోషించె నపుడు శౌరి
రాయ లష్టదిగ్గజముల రమణ బ్రోచె
అతడు చక్రమ్ము చేబట్టి అరుల ద్రుంచె
రాజచక్రము తలవంచె రాయలకును
పురస్కారాలు , గుర్తింపులు
మార్చు- వరంగల్ జిల్లా అధికార భాషా సంఘం సభ్యుడు
- వరంగల్ జిల్లా సాంస్కృతిక మండలి సభ్యుడు
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ అధ్యాపక అవార్డు
- తెలుగు విశ్వవిద్యాలయం నుంచి విశిష్ట పురస్కారం
బిరుదులు
మార్చు- కవికోకిల
- కాకతీయ సభాసమ్రాట్
- సాహితీ కిరీటి
- శబ్దశిల్పి
మూలాలు
మార్చు- ↑ కల్చరల్ రిపోర్టర్, వరంగల్ (8 June 2017). "కవి, అష్టావధాని 'ఇందారపు' ఇక లేరు". ఆంధ్రజ్యోతి. Aamodha Publications PVT Ltd. Retrieved 9 June 2017.
- ↑ రాపాక, ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 440–445.