ఇద్దరు మొనగాళ్లు

ఇద్దరు మొనగాళ్లు 1967 మార్చి 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. బి విఠలాచార్య దర్సకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో, కాంతారావు, కృష్ణకుమారి, ఘట్టమనేని కృష్ణ, సంధ్యారాణి, సుకన్య నటించారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్ పి కోదండపాణి సమకూర్చారు.

ఇద్దరు మొనగాళ్లు
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.విఠలాచార్య
తారాగణం కాంతారావు,
కృష్ణకుమారి,
ఘట్టమనేని కృష్ణ,
సంధ్యారాణి,
సుకన్య,
నెల్లూరు కాంతారావు
సంగీతం ఎస్.పీ. కోదండపాణి
నిర్మాణ సంస్థ మధు పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సాంకేతికవర్గం

మార్చు

తారాగణం

మార్చు

అవంతీ పురాధీశుడు వీరసేనుడు ముందు ఏ మాత్రం హెచ్చరికలు చేయకుండా గజపురంపై దురాక్రమణ చేస్తాడు. గత్యంతరం లేక గజపురాధిపతి సింహబాహు భార్య శీలవతిని, కుమారుడు రాజశేఖరుని తీసుకుని అడవులపాలవుతాడు. అడవిలో శీలవతికి దాహం కాగా నీరు తేవడానికి వెళ్ళిన రాజు పాముకాటుకు గురి అవుతాడు. శీలవతి ప్రసవించి మగబిడ్డను కంటుంది. భర్త తిరిగిరానందున నిరాశ పడి ఇద్దరు పిల్లలతో బయలుదేరి మార్గమధ్యంలో ఉన్న నదిని దాటడానికి ప్రయత్నిస్తుంది. తీరాన పడుకోబెట్టిన బాలుని గ్రద్ద ఎత్తుకు పోయి ఒక అడవిలో వదిలివేస్తుంది. ప్రవాహంలో రాజశేఖరుడు కొట్టుకుపోతాడు. శాపగ్రస్త అయిన శీలవతి భల్లూకంగా మారి రెండవ బిడ్డను చూసి పెంచుతుంది. సర్పదష్టుడైన రాజు ఒక ముని ఇచ్చిన మూలికతో బ్రతుకుతాడు. భార్యాపిల్లలను కోల్పోయిన సంతాపంతో ఆత్మహత్యకు పూనుకోగా ముని వారించి కర్తవ్యం ఉపదేశిస్తాడు. భల్లూకం పెంచిన బాలుడు అడవిమనిషిగా తయారవుతాడు. అటు నాలుగేళ్ల రాజశేఖరుడు సంతాన హీనులైన కిట్టయ్య దంపతులకు దొరికి పెద్దవాడవుతాడు. టార్జాన్‌లా తయారైన అడవిమనిషి వన విహారానికి వచ్చిన రాకుమారి మాధవీదేవిని చూసి, ఆమె ఆమె చెలికత్తెలు చేసిన నాట్యానికి ఉప్పొంగి అమాంతంగా ఎత్తుకుపోతాడు. రాజకుమార్తె చేసిన ఆర్తనాదాన్ని విన్న రాజశేఖరుడు అడవి మనిషితో పోరాడి ఆమెను విడిపించి అవంతీపురం చేర్చగా ఆమె హృదయంతో పాటు సేనాధిపతి పదవి లభిస్తుంది. అడవి మనిషి రాకుమారి కోసం కోటకు రాగా రాజశేఖరుడు బోనులో బంధిస్తాడు. ఎలుగుబంటి రూపంలో ఉన్న తల్లి వచ్చి విడిపిస్తుంది. భైరవద్వీపంలో ధూమకేతువు అనే మాంత్రికుడు ఎప్పుడూ అబద్ధం చెప్పని సత్యవ్రతుని తీసుకురమ్మని లావణితో పాటు శిష్యులను కూడా పంపిస్తాడు. తెచ్చినవారు పనికిరారని అనువైన సత్యవంతుని తీసుకురమ్మని తిరిగి పంపిస్తాడు. నగరంలో మనుషులు మాయమవుతుండడంతో రాజు అడవిమనిషిని తీసుకురమ్మని రాజశేఖరుని పంపిస్తాడు. రాజశేఖరుడు అడవి మనిషితో పోరాడుతుండగా భల్లూకం వచ్చి రాజశేఖరుని చేతిపై ఉన్న మచ్చను చూసి అతను తన కుమారుడే అని గ్రహించి రెండోవాణ్ణి అతనికి అప్పగిస్తుంది. రాజశేఖరుడు అడవిమనిషితో కోటకు తిరిగిరాగా రాజు అతనిని శిక్షిస్తానంటాడు. రాజును ధిక్కరించి తమ్ముని ఇంటికి తీసుకువచ్చి సుగుణకు అప్పగిస్తాడు. సుగుణ అతనికి అ ఆ ఇ ఈ లతో బాటు ప్రేమపాఠాలు నేర్పుతుంది. భల్లూకం ప్రజాసేవ చేస్తున్న భర్తను కలుసుకుని సేవలు చేస్తూ ఉంటుంది. శివరాత్రినాడు పంచలింగ పవిత్రజలాలు తెస్తే తల్లి శాపవిమోచనం కలుగుతుందని తెలుసుకుని రాజశేఖరుడు భైరవద్వీపం వెళతాడు. అక్కడ మాంత్రికునితో పోరాడతాడు. ధూమకేతువు లావణికి మాధవి రూపం ఇచ్చి తాను రాజశేఖరునిగా మారి కోటకు వస్తాడు. పంచలింగజలాలను తెచ్చి దయాసాగర్‌గా ప్రజాసేవ చేస్తున్న తండ్రి వద్దనే ఉన్న తల్లికి శాపవిమోచనం కలిగించి తిరిగి కోటకు వచ్చేసరికి రాజశేఖరుని రూపంలో ఉన్న ధూమకేతు మాధవిని వివాహం చేసుకోబోతున్నట్టు గ్రహిస్తాడు. కోటలో జరిగిన పోరాటంలో ధూమకేతును రాజశేఖరుడు చంపుతాడు. లావణికి శాపవిమోచనమై అదృశ్యమౌతుంది. తల్లిదండ్రులు, పిల్లలు ఏకమౌతారు. రాజశేఖరునికి, తమ్మునికి వివాహాలు జరగడంతో కథ సుఖాంతమౌతుంది.[1]

పాటలు

మార్చు
  1. ఏనాడు లేనిది ఈనాడు ఐనది - సుశీల, రచన: సి నారాయణ రెడ్డి,
  2. కొంగున కట్టెసుకోనా ఓ రాజా - ఎస్. జానకి, కె.జె. యేసుదాస్, రచన:ఆరుద్ర
  3. చిరు చిరు చిరు నవ్వులు నా చేతికి - ఘంటసాల, సుశీల రచన సి: నారాయణ రెడ్డి
  4. పూలు పూచెను నా కోసం - సుశీల , రచన: వీటూరి
  5. రా రా రమ్మంటె రావేమిరా - ఎల్. ఆర్. ఈశ్వరి, రచన: సి నారాయణ రెడ్డి
  6. సక్కనోడా చాలులేరా నీ కొంటె చూపులు - ఎస్. జానకి , రచన: దాశరథి
  7. ప్రభో కాల భైరవ, మాధవపెద్ది, ఎస్.జానకి , గానం: జీ.కృష్ణమూర్తి.

మూలాలు

మార్చు
  1. వై.రామ్‌చందర్ (12 March 1967). "చిత్రసమీక్ష:ఇద్దరు మొనగాళ్ళు". ఆంధ్రప్రభ దినపత్రిక. Retrieved 31 July 2020.[permanent dead link]

Watch Online Movie Archived 2024-01-26 at the Wayback Machine at Movie Archive Archived 2024-01-26 at the Wayback Machine