బి.విఠలాచార్య

భారతీయ చలన చిత్ర దర్శకులు

బి.విఠల ఆచార్య లేదా బి.విఠలాచార్య (జనవరి 28, 1920 - మే 28, 1999) 'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో 70 చిత్రాలను రూపొందించిన ఈయన 1920 జనవరి 28కర్ణాటకలో ఉడిపిలో జన్మించారు. కొంతకాలం సర్కస్ కంపెనీలో జంతువుల ఆలనా పాలనా చూశారు.

బి.విఠలాచార్య[1]
జానపదబ్రహ్మ బి.విఠలాచార్య [2]
జననంజనవరి 28, 1920 (1920-01-28)1920 జనవరి 28
మరణంమే 28, 1999 1999 మే 28(1999-05-28) (వయసు 79)
ఇతర పేర్లుజానపద బ్రహ్మ
వృత్తిసినీ దర్శకుడు, విఠల్ ప్రొడాక్షన్స్
క్రియాశీల సంవత్సరాలు1944 To 1993
జీవిత భాగస్వామిజయలక్ష్మి

ఆయన ఎన్నో జానపద చిత్రాలకు అద్భుతమైన దర్శకత్వం వహించారు. అప్పటి పరిమితమైన సాంకేతిక పరిజ్ఙానముతో ఆయన చూపించిన ప్రతిభ అసామాన్యమైనది. చాలా కొద్ది ఖర్చుతో ఆయన కనులకింపైన జానపద కళా ఖండాలను రూపొందించారు. 1942 లో చిత్రరంగ ప్రవేశము చేసిన ఈయన నిర్మాతగా డి.శంకర్ సింగ్ తో కలిసి దాదాపు 18 చిత్రాలను తమ మహాత్మా పిక్చర్స్ పతాకముపై నిర్మించారు. వీటిలో సాంఘిక చిత్రాలే అధికము.

ఆ తరువాత తొలిసారిగా తెలుగులో 1953లో షావుకారు జానకి ప్రధాన పాత్ర పోషించిన కన్యాదానం చిత్రానికి దర్శకత్వము వహించాడు. క్రమంగా తెలుగులో నిర్మాతగా, దర్శకునిగా కూడా రాణించి అనేక జానపద చిత్రాలను తీశాడు. ఈయన దర్శకత్వము వహించిన చిత్రాలలో 15 చిత్రాలు నందమూరి తారక రామారావు నటించినవే అందులో 5 చిత్రాలను విఠలాచార్యే స్వయంగా నిర్మించాడు.

జానపదబ్రహ్మ 1999, మే 28 న 80 యేళ్ల వయసులో మద్రాసులోని తన స్వగృహములో కన్నుమూశారు. ఈయనకు ఒక భార్య, నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు కలరు.

ఆయన దర్శకత్వము వహించిన కొన్ని సినిమాలు

మార్చు

కొన్ని విశేషాలు [1]

మార్చు

ఎన్‌.టి.రామారావు, కాంతారావు‌లిద్దరికీ ‘మాస్‌ ఫాలోయింగ్‌’ తెచ్చింది విఠలాచార్య చిత్రాలే. వీటిలో నటీనటులే కాకుండా, పక్షులూ, జంతువులూ కూడా పాత్రధారులు. ‘ట్రిక్‌వర్క్‌’కి ఆయన చిత్రాలు ప్రాధాన్యం కల్పించేవి. ‘లాజిక్‌’ అక్కర్లేదు, ‘అదెందుకు జరిగింది?’ అని అడగడానికి లేదు. ‘ఏమీ అక్కర్లేదు. ప్రేక్షకుల్ని ఆహ్లాదపరచడమే ముఖ్యం. ఇది ‘కమర్షియల్‌ ఆర్ట్‌’ అనబడే సినిమా. మన ప్రేక్షకులు క్లాస్‌ సినిమాలు చూడరు. మాస్‌ చిత్రాలు అనబడేవాడినే ఎక్కువగా చూస్తారు. అందుకే అవే ఎక్కువగా తీశాను. ‘తక్కువ ఖర్చు పెట్టి, ఎక్కువ లాభం పొందాలి’ అన్న సూత్రం కూడా నమ్ముకున్నాను’ అని విఠాలాచార్య చెప్పేవారు.

సినిమా నిర్మాణంలో ‘పొదుపు’ ఎలా చెయ్యాలి? అన్న దారి చూపించిన వ్యక్తి కూడా ఆయనే. ఒకే పెద్ద మందిరం సెట్టు వేస్తే, దాన్నే రకరకాల సెట్లుగా మార్చేవారు ఆయన. అంత:పురం రాజుగారి రహస్యమందిరం, విలన్‌ ఇల్లూ, ఇంకొక రాజుగారి ఇల్లూ - అన్నీ ఒకే ఒక సెట్లో ఇమిడిపోయేవి. సామాన్య జనానికీ, సినిమా చూట్టంలో లీనమైపోయే ప్రేక్షకులకీ ఈ తేడాలు అక్కర్లేదని విఠలాచార్య విశ్వసించేవారు. అలాగే కాస్ట్యూమ్స్‌, ఆభరణాలూ, ప్రతి సినిమాకీ మార్చవలసిన అవసరం లేదు ముఖ్యపాత్రకి తప్ప. ‘నటీనటుల కాల్‌ షీట్లు గల్లంతైతే, వాళ్లని చిలకలుగానో, కోతులుగానో మార్చడం ఆయనకే చెల్లింది’ అని ఒక సందర్భంలో కాంతారావు చెప్పారు.

విఠలాచార్య ఎంతో దక్షతా, బాధ్యతా గల నిర్మాత. నటీనటులకీ, టెక్లీషియన్లకీ తాను ఇస్తానన్న మొత్తాన్ని విభజించి ప్రతినెలా ఒకటో తేదీకల్లా - చిన్నా, పెద్దా అందరికీ చెక్కులు పంపించేసేవారు. ఏది వచ్చినా రాకపోయినా విఠలాచార్య గారి చెక్కు వచ్చేస్తుందన్న నమ్మకం అందరికీ వుండేది. ఈ విధానం అరుదు! అలాగే నటీనటులకి కాల్‌ షీట్స్‌ అడ్జస్ట్‌ చెయ్యడంలో కూడా ఆయన ‘నంబర్‌వన్‌’ అనిపించుకునేవారు. ముందుగా చెబుతే, ఒప్పుకున్న డేట్స్‌ని అటూ, ఇటూగా మార్చి చిన్న, పెద్ద నటీనులందిరికీ, సహాయపడేవారు. వేషాలకోసం ఆఫీసులకి వెళ్తే సాధారణంగా డైరెక్టర్లు, నిర్మాతలూ వాళ్లని చూసేవారు కాదు. మేనేజర్‌ అడ్రస్‌ తీసుకుని పంపేస్తాడు. విఠలాచార్య అలా కాదు. వచ్చిన ప్రతీవాళ్లనీ తన గదిలోకి పిలిచి, కూచోబెట్టి కాఫీ ఇచ్చి మాట్లాడి పంపించేవారు. ఈ విధానం కూడా అరుదే.

స్క్రిప్టు ముందు రాయించుకుని, షెడ్యూల్సు వేసుకుని టైముకి ముందుగానే షూటింగ్‌ పూర్తిచేసి, అనుకున్న తేదీకి సినిమా విడుదల చెయ్యడం ఆయనకే చెల్లింది. సినిమా ఆరంభించకముందే - విడుదల తేదీ ఇవ్వడం ఎంతమందికి సాధ్యం? సినిమా పరిశ్రమలో ఇదికూడా అరుదే! ఇలాంటి అరుదైన వాటిని అమలుపరిచిన విఠలాచార్య జానపద చిత్రాలకి ఆదరణ తగ్గుతోందన్న ఆలోచనలో అక్కినేని నాగేశ్వరరావుతోబీదల పాట్లు’ తీశారు. తన టెక్నీషియన్లందరినీ మార్చి, నటీనటుల్నీ మార్చి మంచి క్వాలిటీతో చిత్రం రావాలని - కృషి చేసి తీశారు. తన విధానానికి భిన్నంగా తీశారు. ‘చిత్రం ఉత్తమంగా వుంది’ అని అందరూ ప్రశంసించారు. కాని డబ్బు రాలేదు. ‘విఠలాచార్య సినిమా ఇలావుందేమిటి?’ అన్నారంతా. ‘నా పేరు కాకుండా ఇంకొకరి పేరు వేసివుంటే బాగా నడిచేదేమో!’ అని వ్యాఖ్యానించారు విఠలాచార్య. ‘ఏది అలవాటు చేస్తే ఆ ధోరణిలో వెళ్లడమేశ్రేయస్కరం’ అన్నది ఆయన చెప్పిన నీతి.

వనరులు

మార్చు

బయటి లింకులు

మార్చు


మూలాలు

మార్చు
  1. http://www.kinema2cinema.com/directors/janapada-brahma-vithalacharya-14.html
  2. వారి సౌజన్యంతో