ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయం

ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయం తూర్పుగోదావరి జిల్లా, కొత్త పేట మండలం, పలివెల గ్రామంలో ఉంది. పూర్వం ఈ గ్రామం పల్లవ పురం గా పిలవబడేది. కాలక్రమేణా పలివెలగా నామాంతరం చెందింది.

ఉమా కొప్పులింగేశ్వర స్వామి
పేరు
ఇతర పేర్లు:కొప్పేశ్వర స్వామి
ప్రధాన పేరు :ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:తూర్పు గోదావరి జిల్లా
ప్రదేశం:https://maps.google.com/?cid=8534527442158507515 పలివెల కొత్తపేట మండలం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శివుడు
ప్రధాన దేవత:పార్వతి
ముఖ్య_ఉత్సవాలు:మహ శివరాత్రి,గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు, కార్తిక మాసం.
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :హిందూ

స్థల పురాణం

మార్చు

ఇది ప్రాచీన ఆలయం. 11వ శతాబ్దం లో రాజమహేంద్రవరం రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుడు కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. అగస్త్య ప్రతిష్టితం. ఒకానొక కాలంలో ఈ ఆలయ పూజారి వేశ్యా వ్యసనం లో ఉండేవాడు. ప్రతి రోజు ఆముక్త మాల్యదలాగా వేశ్య తలలో పెట్టుకొన్న పూల మాలలనే దేవుడికి వేసేవాడు. ఒక సారి మహ రాజు స్వామి దర్శనానికి గుడికి వస్తే స్వామికి అలంకరించిన పుష్ప మాలను పూజరి మహ రాజుకి ఇచ్చాడు .అందులో ఒక స్త్రీ శిరోజాలు మహరాజు కనిపించాయి.ఈ విషయమై పూజారిని నిలదీస్తే మన స్వామి లింగానికి ఉన్న కొప్పు లో ఉండే వెంట్రుకలే అని అబద్ధం చేప్పాడు. కావాలంటే రేపు ఉదయం రాగానే నిర్మాల్యాన్ని చూపిస్తాను అన్నాడు .సరే అని రాజు వెళ్ళిపోయాడు .పూజారికి అబద్ధం ఆడినందుకు ప్రాణ సంకటంగా ఉంది .తనతప్పును రాజు గమనిస్తే మరణ శిక్ష ఖాయం అనుకోని పశ్చాత్తాప పడతాడు.బోళా శంకరుడు దయ తలిచి తనలింగం పై కొప్పు దానికి శిరోజాలు సృష్టించి పూజారిని కాపాడాడు. మర్నాడు రాజు రావటం స్వామి శిరస్సున శిరోజాలు చూసి పూజారిని అనుమానిచి నందుకు మన్నించమని కోరడం జరిగింది .పూజారినీ రాజును భక్త వత్సలుడు మన్నించి దీవించాడు .అప్పటినుండి కొప్పు లింగేశ్వర స్వామిగా ప్రజలు కొలుస్తున్నారు.[1]

సాహిత్యాధారాలు

శ్రీనాథుడుని కాలంలో అగస్త్య లింగేశ్వరునిగా పూజలందుకొన్నట్లుశ్రీనాథుడు శ్లొకాన్ని వ్రాశాడు. ఈయన తన కాశీఖండము, భీమఖండము, శివరాత్రి మహాత్మ్యములలో ఈ స్వామిని కొప్పయ్య, కొప్పులింగడు అని గొప్పగా వర్ణిస్తూ, ఈస్వామే తన ఇంటి ఇలవేల్పని చెప్పాడు. ఈ కాలానికే చెందిన అజ్జరపు పేరయలింగ కవి కూడా తన "ఒడయనంబి విలాసం"లో ఈ స్వామిని గురించి వర్ణిస్తూ, ఇప్పటి ఈ చిన్న గ్రామాన్ని ఒక గొప్ప పట్టణముగా చెపుతూ ఇంద్రుడు ఒక్కసారి ఇక్కడికి వస్తే తన స్వర్గాన్ని మరిచిపోతాడని అన్నాడు. ఈ సాహిత్యాధారాల వలన సా.శ. 14వ శతాబ్దంనాటికే పలివెల గొప్ప పట్టణమని, ఇక్కడ వేంచేసి ఉన్న కొప్పులింగేశ్వరుని ఆలయము ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమని తెలుస్తోంది.

చారిత్రక ఆధారాలు: ఈ ఆలయములో అనేక శాసనాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ లభించిన వానిలో పురాతనమైనది సా.శ. 1170 కి చెందింది. ఇది ఒక ప్రముఖ కవి యొక్క దాన శాసనము. ఇంకా కాకతీయ ప్రతాపరుద్రునికి చెందిన శాసనము, రెడ్డిరాజులకు చెందిన శాసనాలే కాక ముస్లిం రాజైన కుతుబ్-ఉల్-ముల్క్ కు చెందిన దానశాసనము ఉండడం విశేషం. ప్రస్తుతము సా.శ. 15వ శతాబ్దము వరకూ శాసనాలు లభించాయి. పిఠాపురం రాజావారి పాలనలో కూడా పలివెల ఒక ప్రత్యేకమైన ఠాణాగా ఉండేది. ఈ ఆధారాల వలన సా.శ.10వ శతాబ్దం నుండి కూడా రాజులు, ప్రముఖులు, సామాన్య ప్రజలు ఆలయపోషణ చేసినట్లు తెలుస్తోంది. ప్రతాపరుద్రుని కాలంలో ఆలయ జీర్ణొద్దారణ జరిగినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. ముస్లింల దండయాత్రల సమయంలో నంది తల విరిగి పడింది దానిని ఇప్పుడు అతికించడం జరిగింది.

కొప్పు లింగేశ్వరుడు ఆలయం

మార్చు

అక్కడి ప్రజల కథ ప్రకారం ఒకప్పుడు ఒక వెలనాటి పూజారి ఈ శివలింగారాధన శక్తి వంచన లేకుండా చేస్తూ ఉండెవాడు. కాని అ పూజారికి ఒక దురలవాటు ఉండేది. ఆయనకు ఒక వేశ్యతో సంబంధం ఉండేది. ఆ పూజారి మీద ఆరాజ్యపు రాజుకి చాలా పిర్యాదులు అందుటూ ఉండేవి. ఇది గమనించి ఒక రోజు ఆరాజ్యపు రాజు స్వామి దర్శనానికి రాగా ఆ పూజారి స్వామి ప్రసాదాన్ని రాజుకు ఇస్తాడు. ఆ ప్రసాదంలో ఒక వెంట్రుక కనిపిస్తుంది. రాజు ప్రశ్నించగా మా శివునకు జటాజూటం ఉన్నదని రాజుకి తెలిపుతాడు. రాజు పూజారిని జటాజుటం చూపించమనగా పూజారి ఆ రోజు స్వామికి ప్రత్యేక అలంకారంలో ఉన్నారు కాబట్టి మరుసటి రోజు వచ్చి చూస్తే స్వామివారి జటాజూటం కన్పిస్తుంది అని ఆ పూజారి చెప్పగా ఆ రాజు ఆ రోజుకి నిష్క్రమించి తరువాత రోజు రావడానికి అంగీకరిస్తాడు. కాని శివవింగం మీద జాటాజుటం కనిపించకపోతే ఆ పుజారి తల తీయించి వేస్తాను అని చెప్తాడు. ఆ రోజు రాత్రంతా శివలింగానికి పూజలు చేసి మహాదేవుడిని తనను కాపాడమని వేడుకోంటాడు. తరువాత రోజు రాజు దర్శనానికి వచ్చి చూస్తే శివలింగాన్ని చూస్తే జటాజూటం కనిపిస్తుంది. ఆఆరాజుకి ఆ జటాజుటం నిజమో కాదో అని సంశయం కలిగి జటాజుటాన్ని లాగి చుస్తాడు, శివ లింగం నుంచి నెత్తురు వస్తుంది, వెంటనే రాజుకు కంటి చూపు పోతుంది. అప్పుడు ఆ రాజు శివామహాదేవా అని వేడుకొనగా ఆరాజుకు కంటి చూపు వస్తుంది. ఆ రరాజు తన సామ్రాజ్యంలో జుటుగపాడు (ఇప్పటి రావులపాలెం మండలం లోని ఒక గ్రామం) అనే గ్రామాన్ని మాన్యంగా రాజు ప్రకటిస్తాడు. ఇప్పటికి కూడా శివలింగముకు జాటాజూటం ఉంది. అప్పటినుండి ఇప్పటివరకు ఈ పవిత్రక్షేత్రంలో కొప్పులింగేశ్వరుడుగా పరమ శివుడు భక్తుల దర్శనం ఇచ్చి దర్శనం చేసుకొన్న వారిని మహాదేవుడు తరింపజేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖ ఈ గుడిలో ఉన్న రాజగోపురం, స్వామిమందిరం, కొన్ని స్తంభాలు పై ఉన్న శిల్పాలను పరిరక్షిస్తోంది.[2]

ఆలయ విశేషాలు

మార్చు

దేవాలయానికి కొన్ని వైవిధ్యాలు ఉన్నాయి. మొదటిది – శివలింగంపై కొప్పు ఉండడం.[3] రెండవది – అమ్మవారు స్వామివారి పక్కనే ఉండడం. శ్రీ పార్వతీపరమేశ్వరులు కలిసియున్న ఏకపీఠం ఇక్కడే ఉంది. మూడవది – నిజానికి శివలింగంపై కొప్పు మొదటినుండి ఉండినది కాదు; కాలాంతరంలో పుట్టుకొచ్చింది. ఈ ఆలయమును తూర్పున కౌసికి, దక్షిణమున సాంఖ్యాయని, పడమర వశిష్ఠ, ఉత్తరాన మాండవి, పల్వల అను అంతర్వాహినిగా ఉన్న ఐదు నదులు చుట్టి ఉన్న ప్రదేశములో నిర్మించినట్లు చెబుతారు. ఈనాడు కూడా కౌసికి, వసిష్ఠలతో పాటు గర్భగుడిలో వర్షాకాలములో నీరు నిండుటచే పల్వలను కూడా చూడవచ్చును. ఇటీవల గర్భ్గగ్రుహమును గ్రానైటు రాయి పరచి బాగు చేశారు.

ఈ ఆలయము పలివెల మధ్యలో నాలుగెకరాల సువిశాల ప్రాంగణములో, ఒక దానిలో ఒకటిగా ఉన్న రెండు ఎత్తైన ప్రాకారాలతో, చుట్టూ వీధులతో రాజసంగా ఉంటుంది. ఈ ప్రాంగణములో ప్రధానాలయము, ఎన్నో మండపాలు, పరివార దేవతాలయాలు ఉన్నాయి. ఈ మండపాలలో చాళుక్యుల, రెడ్డిరాజుల వాస్తు సంప్రదాయాలను చూడవచ్చును. ఈ ప్రాంగణములోని మండపాలు అందలి శిల్పాలలో సా.శ. 10వ శతాబ్దము నుండి సా.శ. 17వ శతాబ్దము మధ్యకాల వాస్తు-శిల్ప పరిణామమును చూడవచ్చును.

ఈ ఆలయములో వివిధ శిల్పాలు కనువిందు చేస్తాయి. ఇవి వేంగి (తూర్పు)చాళుక్యుల, రెడ్డిరాజుల కాలంనాటి శిల్పలక్షణాలు కలిగి ఉన్నాయి. గర్భగుడిలో ప్రతిష్ఠించబడిన లింగమునకు ముందువైపున అగ్రభాగములో చతురస్రాకారములో ఒక పొడుచుకువచ్చిన భాగము ఉంది. దీనినే కొప్పు అంటారు. ఇందువలననే ఈ స్వామి కొప్పులింగేశ్వరుడుగా ప్రసిద్ధిగాంచాడు. ఈయనకు ప్రక్కనే పార్వతీదేవి (ఉమాదేవి) ప్రతిష్ఠించబడి ఉంది. ఈమెకు ఉన్న ప్రభామండలంనకు రెండు వైపులా గణపతి, కుమారస్వామి కూడా ఉన్నారు. సాధారణంగా శైవాలయాలలోని గర్భగుడిలో ప్రధానంగా లింగము ఉండి, అమ్మవారు ఒక ప్రక్కగా ఉంటుంది, లేక ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఇంక వినాయకుడు, కుమారస్వాములు వేరేగా పరివారదేవతాలయాలలో ఉంటారు. కానీ ఇక్కడ స్వామివారు, అమ్మవారు ప్రక్క ప్రక్కనే ఒకే పీఠంపై ఉన్నట్లుగా ఉన్నారు. అందువలననే ఈ స్వామిని ఉమాకొప్పులింగేశ్వరుడు అంటారు. ఈవిధముగా ఆది దంపతులు సకుటుంబ సమేతంగా గర్భగుడిలోనే ఒకే పీఠంపై వేంచేసి దర్శనమివ్వడం ఇక్కడి విశేషం. ప్రాంగణములో వినాయకుడు, కుమారస్వామి, భైరవుడు, చండికేశ్వరస్వామి, పాపవిమోచన స్వాములు ప్రత్యేకముగా ప్రతిష్ఠించబడి భక్తుల పూజలందుకుంటున్నారు.

వివిధ మండపాలపై ఉన్న శిల్పాలు అతి మనోహరంగానూ ఆలోచింపజేసీవిగానూ ఉన్నాయి. ఈ మొత్తము శిల్పసంపదను నాలుగు ప్రధాన వర్గాలుగా వర్గీకరించవచ్చును. అవి శైవము, వైష్ణవము, సాంఘికము, ఇతరములు. శైవములో శివ-పార్వతుల వివిధ రూపాలు-వృషభారూఢమూర్తి, లింగోధ్భవమూర్తి, నటరాజు, అర్ధనారీశ్వరుడు మొదలైన అనేకరూపాలేకాక పురాణగాథలైన కిరాతార్జునీయం, మృగవ్యధ మొదలగు గాథలు కూడా ఉన్నాయి. వైష్ణవ శిల్పాలలో కృష్ణుడు, లక్ష్మీదేవి ఇంకా రామాయణ గాథలు ఉన్నాయి.

సాంఘికాలు, ఇతరాలలో ఆనాటి జీవనవిధానాన్ని ప్రతిబింబించే ఎన్నో శిల్పాలు, నర్తకీమణులు, లతలు, జంతువులు మొదలైన శిల్పాలు ఉన్నాయి. మొత్తంగా ఈ ఆలయశిల్పం అత్యంత విలువైంది. ఈ శిల్పాలు వాతావరణ ప్రభావానికి, దాడులకు గురి అవడం వలన చాలా నష్టం వాటిల్లింది. ఇక్కడ ఒక విష్ణాలయము ఉండేదనడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ ఆలయము ఇప్పుడు లేదు. అది కాలక్రమేణా శిథిలమైనా అయి ఉండాలి లేదా ఆలయవాస్తు-శిల్పానికి జరిగిన నష్టంలో ఇదీ ఒకటైనా అయి ఉండాలి. అదే కనుక అయితే ఈ ఆలయానికి అధిక శాతంలోనే నష్టం జరిగిందని చెప్పవచ్చును.

ఆలయానికి ఈ మధ్యకాలములో జరిగిన జీర్ణోద్ధరణ కార్యక్రమాల వలన పడిపోవడానికి సిధంగా ఉన్న కట్టడాలను గట్టిపరచడం, కొన్ని కొత్తకట్టడాలు చోటు చేసుకోవడంతో ఆలయము కొత్త శోభలను సంతరించుకుంది. ఇప్పుడు ఈ ఆలయము ఆధునికత అనే మేలిముసుగులో దాగిన అపురూపమైన పురాతనాలయము.

ఇతర విషయాలు

మార్చు

ఈ ఆలయానికి తూర్పున కౌసికి, దక్షిణాన సాంఖ్యాయని, ఉత్తరాన మాండవి, పల్వల అనే నదుల మధ్య లో ఈ ఆలయం ఉంది. శివ లింగానికి పై భాగం లో చతురస్రాకారం లో కొప్పు కనిపిస్తుంది .అందుకే కొప్పు లింగేశ్వరుడుగా దర్శనం ఇస్తాడు. పార్వతీ దేవి గర్భ గుడిలోనే స్వామి లింగంప్రక్కనే ఒకే పీఠంపై కొలువై ఉండటంవిశేషం.ఈ ఆలయంలో కుమారస్వామి వినాయకుడు కూడా ఉన్నారు.

పండుగలు

మార్చు

రవాణా సౌకర్యాలు

మార్చు

ఈ దేవాలయం కొత్తపేట కు 2 కిలోమీటర్ల ఉంది. రాజమహేంద్రవరం , అమలాపురం నుండి బస్సు సౌకర్యం ఉంది.

మూలాలు

మార్చు
  1. Sanagala, Naveen (2020-12-28). "Palivela Umakoppeswara Swamy Temple (Uma Koppulingeswara Swamy Temple)". HinduPad. Retrieved 2023-11-28.
  2. "శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామి | Shri Uma Koppu Lingeswara Swami Temple". TELUGU BHAARATH. Retrieved 2023-11-28.
  3. "శివలింగంపై కొప్పు". TeluguOne Devotional. Retrieved 2023-11-28.