ఎండోస్కొపి, లేదా కుహరాంతర దర్శనం లేక అంతర్దర్శనం శరీరపు లోపలి భాగాలను పరిశీలించే వైద్య పరీక్ష. ఎండోస్కోపి అనగా లోపలికి చూడడం; ఈ పరీక్షకు ఉపయోగించే పరికరంను అంతర్దర్శిని (ఎండోస్కోప్) అని వ్యవహరిస్తారు. వీటిని వివిధ అవయవాల్లో చాలా రకాల వ్యాధులను గుర్తించడానికి, వైద్యం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ అంతర్దర్శిని పరీక్షలు చేసేటప్పుడు అవసరంబట్టి వ్యక్తులకు నిద్రమందులు లేక మత్తుమందులు ఇస్తారు.

నమన అంతర్దర్శిని(A flexible endoscope.)

తొలిగా ముక్కు, చెవి, గొంతు, స్వరపేటిక, శ్వాసనాళం, అన్నవాహిక ( అన్ననాళం) పురీషనాళం, గర్భాశయద్వారాలను పరీక్షించుటకు లోహాలతో చేసిన వంపులుపోని సరళ అంతర్దర్శినులు వాడకంలోనికి వచ్చాయి. వీటి ద్వారా దీపకాంతి ప్రసరింపచేసో లేక వీటి చివర దీపాలు అమర్చో  లోపల ఉన్న కుహరాలు పరీక్షిస్తారు. కణపరీక్షలకు తునుకలను లేక కుంచెలు లేక శలాకలతో కణసముదాయాన్ని కూడా గ్రహించగలరు. వంకలు తిరగని నిటారు అంతర్దర్శినులతో శరీరంలో కొన్ని భాగాలనే పరీక్ష చేయగలరు.

గాజుతంతువుల ద్వారా కాంతిని ప్రసరించు సాంకేతికత లభ్యమై తంతు దృశాశాస్త్రం ( ఫైబరు ఆప్టిక్స్) అభివృద్ధి చెందడంతో వంపులు తిరిగే నమన అంతర్దర్శినులు (ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్స్) వాడుకలోనికి వచ్చాయి. తంతువుల సముదాయంతో నిర్మించబడు ఈ అంతర్దర్శినులు కొద్ది మిల్లీమీటర్లనుండి సుమారు ఒక సెంటీమీటరు వ్యాసపరిమాణంలో అవసరమైన పొడవు కలిగి వంపులు తిరిగే గొట్టాలవలె ఉంటాయి. ఈ అంతర్దర్శినులలో వంగే గాజు లేక ప్లాస్టిక్ తంతువులు శరీరం లోపలిభాగాల ప్రతిబింబాలను వైద్యుల కళ్ళకు కటకాల ద్వారా అందిస్తాయి.

ఆపై నవీనతరంలో దృశ్యదర్శినులు (విడియోస్కోప్స్) వాడుకలోకి వచ్చాయి. ఇవి అవయవాల నాళం లేక కుహరంలోనికి కాంతిని ప్రసరించి, వీటి చివర ఉండే చిత్రగ్రాహకాలతో అవయవాల లోపలి చిత్రాలు గ్రహించి ఆ చిత్రాలను తీవెల ద్వారా దూరదర్శిని తెరపైకి ప్రసరింపజేస్తాయి.

అంతర్దర్శినుల పైన అమర్చిన చోదనచక్రాలు తిప్పి అంతర్దర్శిని కొనను పైకి, క్రిందకు, కుడిపక్కకు, ఎడమ ప్రక్కకు పూర్తిగా వంచగలుగుట వలన పరీక్షిస్తున్న అవయవ నాళంని (కుహరంని) అనుసరించి అంతర్దర్శినిని ముందుకు నడిపించి పరీక్ష చేయగలుగుతారు. ఈ అంతర్దర్శినులలో ప్రత్యేకమార్గం ద్వారా అవయవాలలోనికి గాలి పంపించి అవయవాల నాళాలను, తిత్తులను తెఱిచి ఉంచగలరు. మరో ప్రత్యేక ద్వారంలోంచి సన్ననితీగ వంటి శ్రావణం చొప్పించి అవయవాలనుంచి కణపరీక్షకు చిన్న చిన్న తునుకలు గ్రహించవచ్చు. అవసరమైతే నీటిని చిందించి చిత్రగ్రాహకాన్ని కడిగి శుభ్రం చేయవచ్చు.

కడుపులో పుళ్ళు కనిపెట్టుటకు, పెద్దప్రేవులలో కర్కటవ్రణాల (కేన్సర్ల) శోధనకు, కంతుల (పోలిప్స్) నిర్మూలనకు అంతర్దర్శినులు విరివిగా వాడకంలోకి వచ్చినా, ఈ దినాలలో వివిధ వైద్యరంగాలలో అంతర్దర్శినులు ప్రాచుర్యం పొందాయి. వ్యాధులను కనుగొనుటకే గాక, చికిత్సా ప్రక్రియలకు కూడ అంతర్దర్శినులు ఉపయోగపడుతున్నాయి.

ఉపయోగాలు

మార్చు
 
అన్నవాహికలో సంకోచం (Esophageal stricture)

వాంతులు, వమనవికారం, మింగుటలో కష్టం, అన్నవాహికలో ఆహారం అడ్డుపడడం, కడుపునొప్పి, విరేచనాలు, నల్లవిరేచనాలు, రక్తస్రావం, బరువు తగ్గడం, పాండురోగం, వంటి రుగ్మతలు కలవారిలో అన్నవాహిక-జఠర-ఆంత్రదర్శన (ఇసోఫేగో గాస్ట్రో డుయోడినోస్కోపీ) పరీక్షలు, బృహదాంత్ర దర్శన (కొలనోస్కొపీ) పరీక్షలు ఉపయోగపడుతాయి.

 
జీర్ణకోశంలో జీర్ణవ్రణం(Peptic ulcer in stomach)
అన్నవాహిక జఠరాంత్ర దర్శనం
మార్చు

అన్నవాహిక లో తాపం (ఇసోఫెజైటిస్), ఆమ్లతిరోగమన వ్యాధి (ఏసిడ్ రిఫ్లెక్స్), అన్ననాళంతో జఠరభ్రంశం[1] (హయెటల్ హెర్నియా) అన్ననాళంలో ఇరకటాలు, లియోమయోమాలు అనే అప్రమాదకరపు పెరుగుదలలు, ప్రమాదకర కర్కటవ్రణములు (కాన్సర్లు), అన్ననాళంలో ఉబ్బుసిరలు (ఇసోఫేజియల్ వేరిసిస్) వైద్యులు అంతర్దర్శినితో కనుగొనగలరు.

 
పెద్దప్రేవులో కంతి (Colon polyp)

జీర్ణకోశం లో తాపం (గాస్ట్రైటిస్), జీర్ణవ్రణాలు[2] (పెప్టిక్ అల్సర్స్), కంతులు (పోలిప్స్), లియోమయోమాలు అనే అప్రమాదకరపు పెరుగుదలలు, కర్కటవ్రణాలు (కాన్సర్స్) వైద్యులు అన్ననాళ జఠరాంత్ర దర్శినితో అంతర్దర్శనం చేసి కనుగొనగలరు. కణపరీక్షలకు, హెలికోబాక్టర్ బాక్టిరై అనే సూక్ష్మజీవుల పరీక్షకు చిన్న తునుకలు గ్రహించగలుగుతారు.

చికిత్సాపరంగా,
మార్చు

అన్నవాహికలో: ఇరకటాలను బుడగల సాధనాలతో వ్యాకోచింపజేయుటకు, ఉబ్బుసిరలను పట్టీలతో బంధించుటకు, ఉబ్బుసిరలలో రక్తస్రావాన్ని బుడగల పీడనంతో ఆపుటకు, అన్నవాహిక దిగువ నియంత్రణకండరాన్ని బిగుతు చేయుటకు, ఇరుక్కొన్న బయటి వస్తువులను, భోజన కబళాలను తొలగించుటకు అన్నవాహిక జఠరాంత్రదర్శనం ఉపయోగపడుతుంది.

జీర్ణకోశంలో: కంతులను ఛేదించుటకు, రక్తస్రావం జరుగునపుడు రక్తస్రావ ప్రాంతాలలో ఎపినెఫ్రిన్ వంటి ఔషధాలు సూదులద్వారా చొప్పించో లేక విద్యుద్దహనీకరణంతోనో రక్తస్రావమును నిలువరింపజేయుటకు, జఠర అధోద్వారంలో ఇరకాటాలను ( పైలోరిక్ స్టెనోసిస్) బుడగసాధనంతో వ్యాకోచింపజేయుటకు, జీర్ణాశయం ద్వారా క్లోమపుతిత్తులలో కూడుకొన్న ద్రవాలను తొలగించుటకు అన్నవాహిక జఠరాంత్ర దర్శనం ఉపయోగపడుతుంది.

ఇతర ప్రక్రియలు
మార్చు

జీర్ణకోశం లోనికి బయటిచర్మంద్వారా కృత్రిమ ఆహారనాళం చొప్పించుటకు, శ్రవణాతీతధ్వని సాధనాలతో అన్నవాహిక, జీర్ణకోశం, క్లోమంను, పైత్యనాళాలను పరీక్షించుటకు, క్లోమనాళాన్ని, పైత్యనాళాలను ఎక్స్ - రే వ్యత్యాసపదార్థాలు చొప్పించి పరీక్షించుటకు జఠరాంత్రదర్శినులు ఉపయోగపడుతాయి.

 
పెద్దప్రేవు కంతిని విద్యుద్దహనీకరణకు ఉచ్చులో బంధించుట (Catching a colon polyp in a snare)

ప్రథమాంత్రంలో (డుయోడినమ్) జీర్ణవ్రణాలు (పెప్టిక్ అల్సర్స్), తాపం (డుయోడినైటిస్) జఠరాంత్ర దర్శనం వలన కనుగొనగలరు. సీలియక్ వ్యాధిని కూడా జఠరాంత్ర దర్శినితో ప్రథమాంత్రం, మధ్యాంత్రంలో (జెజునమ్) మొదటి భాగాన్ని పరీక్షించి తునుకలు గ్రహించి కణపరీక్షలతో కనుగొనగలరు[3]. చిన్నప్రేగును పూర్తిగా సూక్ష్మాంత్ర దర్శినితో (ఎంటెరోస్కోప్) పరీక్షించవచ్చు. ఇది శ్రమతో కూడిన పని. చిన్నప్రేగులో తాపములు, జీర్ణవ్రణాలు, రసికణపు పెరుగుదలలు (లింఫోమాలు), సీలియక్ వ్యాధి అంతర్దర్శినులతో కనుగొనవచ్చు.

పెద్దప్రేగును బృహదాంత్రం అని కూడా అంటారు. వైద్యులు బృహదాంత్రదర్శినితో (కొలనోస్కోప్)

 
ఛేదించిన పెద్దప్రేవులోని కంతిని చిక్కంతో గ్రహించుట. (Catching excised polyp in a basket)jpeg

పురీషనాళాన్ని (రెక్టమ్), పెద్దప్రేవులను , శేషాంత్రంలో (ఇలియమ్) చివరి భాగాన్ని పరీక్షించగలరు. ప్రమాదకరం కాని కంతులు (పోలిప్స్), ప్రమాదకరమైన కర్కటవ్రణాలు ( పుట్టకురుపులు/కాన్సర్స్), తాపక వ్యాధులు (క్రోన్స్ వ్యాధి, అల్సరేటివ్ కొలైటిస్, ఇతర తాపకవ్యాధులు), బుద్బుదాలు

 
పెద్దపేగులో కర్కటవ్రణము, పెద్దపేగులో ఇరకాటము (Colon cancer; Stricture of colon )

(డైవెర్టిక్యులోసిస్), ఇరకాటాలు (స్ట్రిక్చర్స్) బృహదాంత్ర దర్శనం (కొలొనోస్కొపీ) వలన కనుగొంటారు. కంతులు ప్రమాదకరం కాని పెరుగుదలలైనా (బినైన్ ట్యూమర్స్), అవి కాలక్రమేణా ప్రమాదకర కర్కటవ్రణాలుగా పరిణామం చెందే అవకాశం ఉంది[4]. అందువలన వైద్యులు వాటిని విద్యుద్దహనీకరణంచేత తొలగిస్తారు.   

శోధన బృహదాంత్ర దర్శనం
మార్చు

ఉత్తర అమెరికా ఖండంలో వైద్యులు నలభైయైదు  సంవత్సరాలు నిండిన వారికి బృహదాంత్ర దర్శన (పెద్దప్రేవుల అంతర్దర్శన) పరీక్షలను ప్రతి ఐదు - పది సంవత్సరాలకు శోధన పరీక్షగా (స్క్రీనింగ్ టెస్ట్) ఒకసారి సూచిస్తారు. ఈ పెద్దప్రేవుల అంతర్దర్శన పరీక్షలు చేసినప్పుడు కంతులు (పాలిప్స్) కనిపిస్తే వాటిని సమూలంగా విద్యుద్దహన చికిత్సతో తొలగించి కణపరీక్షకు పంపిస్తారు. ఈ కంతులు తొలిదశలలో  నిరపాయకరమైన బోళాగడ్డలైనా (బినైన్ ట్యూమర్స్) తరువాత అపాయకరమైన కర్కట వ్రణాలుగా పరిణామం చెందవచ్చు. ఈ నిరపాయకరమైన ఆంత్రపు పెరుగుదలలను తొలగించుటచే వైద్యులు అపాయకరమైన కర్కటవ్రణాలను నివారించ గలుగుతారు. తొలిదశలలో కనుక్కోబడిన పెద్దప్రేవుల కర్కటవ్రణాలు (కోలన్ కేన్సర్స్) చికిత్సలకు సాధారణంగా లొంగుతాయి. భారతదేశంలో యీ కొలొనోస్కోపులు శోధన పరీక్షలుగా (స్క్రీనింగ్ టెస్ట్స్) ప్రాచుర్యం పొందినట్లు లేదు. దీర్ఘకాలిక పరిశోధనలు చేస్తే వీటి ఉపయుక్తత తెలిసే అవకాశం ఉంది.

 
బృహదాంత్రంలో బుడగల వ్యాధి (Diverticulosis of colon)
 
పైత్యనాళ క్లోమనాళాల చిత్రీకరణ )ERCP Roentgen)

కాలేయంలో పైత్యరసం స్రవించబడుతుంది. పైత్యరసం చిన్న చిన్న పైత్యనాళికల ద్వారా ప్రవహిస్తుంది. పైత్యనాళికల కలయికచే కుడి ఎడమ కాలేయనాళాలు (హెపాటిక్ డక్ట్స్) ఏర్పడుతాయి. కాలేయం బయట ఈ కుడి ఎడమ కాలేయనాళాలు కలసి ఉమ్మడి కాలేయనాళంగా (కామన్ హెపాటిక్ డక్ట్) ఒకటవుతాయి. ఉమ్మడి కాలేయనాళం పిత్తాశయవాహినితో కలసి పైత్యరసనాళం (కామన్ బైల్ డక్ట్) అవుతుంది. పైత్యరసం పిత్తాశయవాహిని ద్వారా పిత్తాశయంలోనికి చేరి పిత్తాశయం ముకుళించుకొన్నపుడు తిరిగి పైత్యనాళంలోనికి ఆపై ప్రథమాంత్రంకి (డుయోడినమ్)  ప్రవహిస్తుంది. పైత్యనాళం క్లోమనాళంతో కలసి క్రోవిగా (ఏంపుల్లా ఆఫ్ వేటర్) ఏర్పడుతుంది.ఈ క్రోవి ప్రథమాంత్రం (డుయోడినమ్) లోనికి మధ్యస్థంగా విచ్చుకొంటుంది. పైత్యనాళంలో రాళ్ళు, కర్కటవ్రణాలు (కాన్సర్స్), సంకోచాలు, క్లోమంలో కర్కటవ్రణాలు పైత్య ప్రవాహానికి అవరోధం కలిగిస్తే అవరోధపు పచ్చకామెర్లు కలుగుతాయి. అంతర్దర్శన తిరోగమన పైత్యనాళ క్లోమనాళ చిత్రీకరణ (ఎండోస్కోపిక్ రిట్రోగ్రేడ్ ఖొలాంజియో పాంక్రియేటోగ్రఫీ): ఈ పరీక్షలో అంతర్జర్శినితో అన్నవాహిక, జఠరాల ద్వారా ప్రథమాంత్రం లోనికి వెళ్ళి క్రోవి (ఏంపుల్లా) లోనికి సన్నని నాళం చొప్పించి ఎక్స్ రే వ్యత్యాసపదార్థం పైత్యనాళాలలోనికి క్లోమనాళం లోకి చొప్పించి ప్రతిదీప్తి దర్శనంతో (ఫ్లోరోస్కొపీ) చిత్రాలు తీసి రుగ్మతలు తెలుసుకుంటారు. ఈ పరీక్షతో పైత్యనాళంలో రాళ్ళను, కర్కటవ్రణాలను, తాపం వలన కలిగే ఇరకటాలను (స్ట్రిక్చర్స్) క్లోమంలో కర్కటవ్రణాలను, దీర్ఘకాల క్లోమతాపాన్ని, కనుగొనవచ్చు. ఈ ప్రక్రియలో 3.5-5% మందిలో క్లోమతాపం[5] వంటి అవాంఛిత ఫలితాలు కలిగే అవకాశం ఉండడం వలన, కేవలం రోగనిర్ణయం కొఱకు ఈ ప్రక్రియ చెయ్యరు. పైత్యనాళంలో రాళ్ళను తొలగించడానికి[6][7], పైత్యనాళంలో సంకోచాలను వ్యాకోజింపజేసి వ్యాకోచనాళాలు (స్టెంట్స్) అమర్చి పైత్యరస ప్రవాహాన్ని మెరుగుపరచడానికి, చికిత్సకు తోడ్పడు సందర్భాలలో ఈ ప్రక్రియను నిపుణులు ఉపయోగిస్తారు. అయస్కాంత ప్రతిధ్వని పైత్యనాళ క్లోమనాళ చిత్రీకరణ (మాగ్నెటిక్ రెజొనెన్స్ ఖొలాంజియో పాంక్రియేటోగ్రఫీ), అంతర్దర్శన శ్రవణాతీతధ్వని చిత్రీకరణ(ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్) కర్కటవ్రణాలను, దీర్ఘకాల క్లోమతాపాలను కనుగొనుటకు ఉపయోగిస్తారు.

శ్వాసవ్యవస్థ

మార్చు

ముక్కు ముందు భాగాన్ని నాసికా వివృతి (నేసల్ స్పెక్యులమ్) అనే సాధనంతో ముక్కుపుటాలను ఎడం చేసి దీపం వెలుగును ప్రసరించి పరీక్ష చేయవచ్చు. ముక్కు వెనుక భాగాన్ని పరనాసికా దర్శినితో (పోస్టీరియర్ రైనోస్కోప్) నోటి ద్వారా వెళ్ళి మృదుతాలువు వెనుక మీద ఉన్న నాసికా గళంను (నేసోఫేరిన్స్), మృదుతాలువు క్రింద ఉన్న వక్త్రగళాన్ని (ఓరోఫేరిన్స్) పరీక్షించవచ్చును.

గొంతు: నాసికా గళ స్వరపేటికా దర్శనం కు (నేసో ఫెరింగో లెరింగోస్కొపీ) నాసికా గళ స్వరపేటికా దర్శిని అనే సన్నని నమన (వంగే) అంతర్దర్శినిని లేక దృశ్యదర్శినిని (విడియోస్కోప్) నిపుణులు ఉపయోగిస్తారు. ముక్కు శ్లేష్మపుపొరలో మత్తు కలిగించు లైడొకేన్ వంటి మందుల తుంపరులు జల్లి ఈ పరీక్షచేస్తారు. అంతర్దర్శినిని ముక్కులో నెమ్మదిగా చొప్పించి ప్రత్యక్షంగా ముక్కులో భాగాలు పరీక్షిస్తూ ముక్కు వెనుక ఉన్న నాసికాగళాన్ని, ఆపై నోటివెనుక ఉన్న వక్త్రగళాన్ని, తరువాత నోటిక్రింద ఉన్న అధోగళాన్ని, స్వరపేటికను పరీక్షిస్తారు. ఈ పరీక్ష ఊపిరికి అడ్డంకులున్నవారిలో, నిద్రలో శ్వాసకు అంతరాయాలు కలిగేవారిలో, గొంతునొప్పి, మ్రింగుటకు ఇబ్బంది, బొంగురుగొంతు వంటి గొంతుకలో మార్పులు ఉన్నవారిలోను, ముక్కులోను గొంతులోను రక్తస్రావం ఉన్నవారిలోను ఉపయోగకరం[8]. నాసికా గళ అంతర్దర్శనంతో ముక్కులో కంతులు (పోలిప్స్), నడిమిగోడ ఒక ప్రక్కకు ఒఱుగుట (సెప్టల్ డీవియేషన్), నాసికాశుక్తుల అతివృద్ధి (హైపర్ ట్రఫీ ఆఫ్ నేసల్ కాంఖె), రక్తస్రావం జరిగితే కారణాలు, ముక్కులోను, గళంలోను గల  పెరుగుదలలు, నిద్రలో కలిగే శ్వాసభంగాలకు కారణాలు, స్వరతంత్రుల కదలికలలో లోపాలు, స్వరతంత్రుల పొంగు, స్వరపేటికలో పెరుగుదలలు కనుగొనగలరు[8].

శ్వాసనాళ దర్శనం
మార్చు
 
శ్వాసనాళ, పుపుసనాళాల దర్శన పరీక్ష

దిగువ శ్వాసమార్గంలో శ్వాసనాళాన్ని, శ్వాసనాళపు శాఖలను వంగని లోహపు సరళ శ్వాసనాళదర్శినితో (రిజిడ్ బ్రోంకోస్కోప్) పరీక్షించవచ్చును. బయట వస్తువులు శ్వాసనాళంలోను పుపుసనాళాలలోను చిక్కుకొన్నప్పుడు వాటిని తొలగించుటకు వంగని నిటారు శ్వాసనాళదర్శినులు ఉపయోగపడుతాయి. రోగి నోటిలోను, గొంతులోను శ్లేష్మపుపొరపై, మత్తుమందు జల్లి, రోగికి మత్తుమందు ఇచ్చి ఈ పరికరాన్ని నోటి ద్వారా గొంతులోనికి చొప్పించి, ఆపై స్వరతంత్రుల మధ్యనుండి శ్వాసనాళంలోనికి వెళ్ళి శ్వాసనాళాన్ని దాని రెండు శాఖలను పరీక్షించవచ్చును. వాటిలో చిక్కుకొన్న బయటి వస్తువులను శ్వాసనాళదర్శినిలోంచి తీయవచ్చును. పుపుసనాళాలలో రక్తస్రావాన్ని విద్యుద్దహనీకరణంతో ఆపుటకు కూడ ఇవి ఉపయోగపడతాయి. చికిత్సాపరంగా ఉపయోగపడేటపుడే సరళ శ్వాసనాళదర్శినులు వాడుతారు.

వంచగలిగే సన్నని నమన శ్వాసనాళ దర్శినులు (ఫ్లెక్సిబిల్ బ్రోంకోస్కోప్స్), దృశ్యదర్శినులు (విడియోస్కోప్స్) విస్తృతంగా వాడుకలోనికి వచ్చాయి. వీటితో శ్వాసనాళాన్ని, శ్వాసనాళపు శాఖలను, ఉపశాఖలను పరీక్షించి వాటినుంచి కణపరీక్షకు తునుకలు, లేక కుంచెలతో కణజాలములను గ్రహించవచ్చును. వాటిలో ఇరుక్కొన్న బయటి వస్తువులను, శ్లేష్మాన్ని, రక్తస్రావం జరిగితే రక్తాన్ని తొలగించవచ్చు.

 
నమన మూత్రాశయదర్శినితో మూత్రమార్గం, మూత్రాశయాల పరీక్ష

మూత్రాశయంను మూత్రమార్గంను (యురిత్రా), మూత్రాశయదర్శినితో (సిస్టోస్కోప్) వైద్యనిపుణులు పరీక్షిస్తారు.

మూత్రాశయదర్శన పరీక్షలు: రక్తమూత్రం (హెమచ్యూరియా) కలవారిలోను, మూత్రపథం సూక్ష్మజీవుల ఆక్రమణలకు తఱచు గురి అయేవారిలో, మూత్రవిసర్జనలో నొప్పి, అవరోధములు కలిగినవారిలో, కటివలయంలో నొప్పి దీర్ఘకాలంంగా ఉన్నవారిలో, మూత్రవిసర్జన కండరములపై ఆధీనత తప్పినవారిలో, మూత్రపరీక్షలో అసాధారణ కణములు ఉన్నప్పుడు, మూత్రాశయంలో కంతులు (పోలిప్స్), కర్కటవ్రణములు (క్యాన్సర్లు), ఇతర పెరుగుదలలు కనుగొనుటకు, మూత్రాశయంలోను, మూత్రనాళాలలోను రాళ్ళు చిక్కుకొన్నప్పుడు అవసరమవుతాయి[9].

సాధారణంగా ఈ పరీక్ష మూత్రమార్గంలో లైడొకేన్ వంటి తిమ్మిరి మందులతో నొప్పి లేకండా చేసి నిర్వహిస్తారు. సరళ మూత్రాశయదర్శినిలో (రిజిడ్ సిస్టోస్కోప్స్) అమర్చిన కటకాల వలన ఇది దూరదర్శిని వలె పనిచేస్తుంది. దీని ద్వారా కాంతిని ప్రసరింపజేసి మూత్రమార్గంను, మూత్రాశయంని పరీక్షించగలరు. మూత్రాశయంలో తెఱుచుకొనే మూత్రనాళాలలోనికి వ్యత్యాస పదార్థాలను చిందించి ఎక్స్-రే లతో మూత్రనాళాలను చిత్రీకరించవచ్చు.

నమన మూత్రాశయ దర్శినులలో (ఫ్లెక్సిబిల్ సిస్టోస్కోప్స్) దృశాతంతువులు (ఆప్టికల్ ఫైబర్స్) చిత్రాలను ప్రసరింపజేస్తాయి. దృశ్యదర్శినులలో (విడియోస్కోప్స్) చిత్రగ్రాహకాలు చిత్రాలను దూరదర్శిని తెరమీదకు ప్రసరింపజేస్తాయి.వీటి ద్వారా లోపలకు కాంతి ప్రసరింపజేసి మూత్రమార్గం, మూత్రాశయాలనే కాక మూత్రనాళాలలోనికి చొప్పించి మూత్రానాళాలను కూడా పరీక్షించే అవకాశం ఉంది. మూత్రనాళాలను పరీక్షించేటపుడు రోగులను నిద్రపుచ్చుటకు మత్తుమందులు అవసరమవుతాయి వీటిలోని ప్రత్యేకమార్గం ద్వారా శ్రావణాలతో కణపరీక్షలకు తునియలు గ్రహించవచ్చు. చిక్కాలతో మూత్రాశయంలోని రాళ్ళను, మూత్రనాళాలలోని రాళ్ళను తొలగించే అవకాశం ఉంది[10]. ప్రత్యేక తంతువు ద్వారా లేజర్ కాంతితో మూత్రాశయంలోని, మూత్రనాళాలలోని రాళ్ళను ఛేదించే వీలుంది. విద్యుద్దహనీకరణంతో మూత్రాశయంలోని కంతులు ఛేందించు వంటి యితర చికిత్సాప్రక్రియలకు కూడా అవకాశం ఉంటుంది[9].  

 
గర్భాశయగ్రీవ దర్శిని (Colposcope)

గర్భాశయగ్రీవదర్శిని (కాల్పోస్కోప్) యోనిపైన , లోపల కాంతిని పరసరింపజేసి, యోని బయటి భాగాలను, లోపలి భాగాలను, గర్భాశయ గ్రీవాన్ని (సెర్విక్స్) పెద్దవిగా జేసి పరీక్షించడానికి  తోడ్పడే సూక్ష్మదర్శిని. అదివఱకు గర్భాశయ గ్రీవంనుంచి సేకరించిన కణజాలంలో (పాప్ స్మియర్ తో) అసాధారణలు కలవారిలోను, గర్భంలో ఉన్నపుడు స్టిల్ బెస్టరాలుకి గురి అయినవారిలోను, ఇతర అసాధారణలు కలవారిలోను కర్కటవ్రణాలకు (కేన్సర్స్) దారితీసే అసాధారణ మార్పులు కనుగొనుటకు గర్భాశయ గ్రీవ దర్శనం (కాల్పోస్కొపీ) పరీక్ష చేస్తారు[11].

ఈ పరీక్షను యోనిని వివృతి సాధనంతో (స్పెక్యులమ్) తెఱిచి కాంతి ప్రసరింపజేసి చేస్తారు. అసాధారణ మార్పులు పసిగట్టుటకు ఎసిటిక్  పూతలు, అయొడిన్ పూతలు కూడ తోడ్పడుతాయి. అసాధారణ కిణాలను తొలగించో లేక వాటినుంచి తునియలు గ్రహించో కణపరీక్షలకు పంపవచ్చు. కర్కటవ్రణాలను నివారించుటకు లేక ప్రారంభదశలో కనుగొని చికిత్సలు చేయుటకు గర్భాశయగ్రీవ దర్శనం తోడ్పడుతుంది.

గర్భాశయగ్రీవంలో హ్యూమన్ పాపిల్లోమేటస్ వైరస్ అనే విషజీవాంశాల వలన చాలా కర్కటవ్రణాలు కలుగుతాయి[12]. పొగత్రాగేవారిలో కూడా ఈ కర్కటవ్రణాలు కలుగవచ్చు[13]. వీటిని త్వరగా కనుగనుటకు పాప్ స్మియర్స్ తో కణపరీక్షలు, గర్భాశయగ్రీవదర్శన పరీక్షలు చాలా ఉపయోగపడుతాయి[12]. ప్రారంభదశలో ఉన్న గర్భాశయ కర్కటవ్రణాలను (కేన్సర్స్) చికిత్సలతో పూర్తిగా నయం చేసే అవకాశాలు ఉన్నాయి.

 
గర్భాశయ దర్శనం

ఈ పరీక్షకు గర్భాశయదర్శిని (హిష్టెరోస్కోప్) అనే వంచగలిగే నమన పరికరం వాడుతారు. దీనిలో కాంతి ప్రసరించుటకు, దృశ్యంను ప్రసరించుటకు మార్గాలు లేక తంతులు ఉంటాయి. గాలి లేక ద్రవాలు చొప్పించి గర్భాశయ కుహరంను పరీక్షించుటకు అనువుగా విస్తృతపరచుటకు, కణపరీక్షలకు, శస్త్రచికిత్సలకు పరికరములు చొప్పించుటకు మార్గాలుంటాయి. అన్నిటికీ తొడుగుగా కోశముంటుంది. దీనిని గర్భాశయగ్రీవం బాహ్యద్వారం ద్వారా ప్రవేశింపజేస్తారు. అవసరమయితే పరీక్షకు ముందు గర్భాశయ బాహ్యద్వారంను, గర్భాశయమార్గంను వ్యాకోచినులతో (డైలేటర్స్) అంచెలుగా వ్యాకోచింపజేస్తారు. గర్భాశయమార్గంలోనికి, ఆపై గర్భాశయ కుహరంలోనికి ప్రత్యక్షముగా చూస్తూ ప్రవేశించి పరీక్షిస్తారు.  

సాధారణంగా గర్భాశయ దర్శనం ఋతుస్రావం అయిన కొద్ది దినాలలో చేస్తారు. అపుడు గర్భాశయపు గోడ మందం తక్కువగా ఉంటుంది.స్థానికంగా మత్తు కలిగించో, లేక పూర్తిగా రోగిని నిద్రపుచ్చో ఈ పరీక్ష చేయవచ్చు.

గర్భాశయదర్శనం అసాధారణ రక్తస్రావం కలిగినవారిలో పరీక్షకు, గర్భాశయపు లోపలిపొరలో కంతులు తొలగించుటకు, గర్భాశయపు లోపలిపొరను తొలగించుట లేక ధ్వంసం చేయుటకు, లోపలిపొరలో చిక్కుకుపోయిన గర్భనిరోధక సాధనాలను తొలగించుటకు,గర్భాశయకుడ్యంలోని కండర తంతుకణజాల అప్రమాదకర పెరుగుదలలను (ఫైబ్రోలియోమయోమాస్ / ఫైబ్రోయిడ్స్)తొలగించుటకు, గర్భస్రావము జరిగినవారిలో మిగిలిపోయిన పిండసంబంధ కణజాలములను తొలగించుటకు ఉపయోగపడుతుంది.

అండవాహక నాళదర్శిని సూక్ష్మ అంతర్దర్శిని. దీనిని గర్భాశయదర్శిని ద్వారా గర్భాశయకుహరంలో తెఱుచుకొను అండవాహకనాళ ద్వారంగుండా చొప్పించి నాళమును పరీక్షిస్తారు. అండవాహకనాళ దర్శనం అండవాహక వంధ్యత్వం ( నాళములలో లోపముల వలన సంతానహీనత) కలవారిలో కారణములు కనుగొనుటకు, పరిష్కరించుటకు ఉపయోగపడగలదు. ఈ పరీక్ష మత్తుమందిచ్చి చేస్తారు.

శరీర కుహరాలు

మార్చు
 
ఉదరకుహర దర్శనం

ఉదరకుహరంను ( ఎబ్డోమినల్ కేవిటీ), కూపకకుహరంను (పెల్విక్ కేవిటీ) వైద్యులు ఉదరకుహర దర్శినితో ( లేపరోస్కోప్) పరీక్షించగలరు. శస్త్రచికిత్సలు కూడా ఉదరదర్శిని (లేపరోస్కొప్) ద్వారా నిర్వహించగలరు[14]. ఉదరకుహర దర్శినులు సాధారణంగా వంగని సరళదర్శినులు. అందువలన ఉదరకుహరంలో ఏ దిశలోనైనా చొప్పించి వివిధ అవయవాలను సమీపించుటకు, పరీక్షించుటకు, శస్త్రచికిత్సలు చేయుటకు అనువుగా ఉంటాయి. వీటి చివర దృశ్య చిత్రగ్రాహకాలు (విడియో కెమేరాలు) కాని అంకాత్మక (డిజిటల్) చిత్రగ్రాహకాలు కాని ఉంటాయి. ఉదరకుహరంను, కూపకంను (పెల్విస్), పేగులను, ఉదరంలో ఇతర అవయవాలను కప్పుచు ఉదరాంత్రవేష్టనం (పెరిటోనియమ్) అనే పొర ఉంటుంది. ఉదరకుడ్యంపై చిన్న చిన్న రంధ్రముల ద్వారా ఉదరదర్శినులను ఉదరకుహరంలోనికి లేక కూపకకుహరంలోనికి చొప్పించి లోపలి అవయవాలను పరీక్షిస్తారు. ఈ పరీక్షలో ఉదరకుహరంను బొగ్గుపులుసు గాలితో ఉబ్బింపచేయడం వలన పేగులను, అవయవాలను వేర్పఱచుటకు వీలవుతుంది. బొగ్గుపులుసు గాలి దహించని గాలి. విద్యుద్దహనీకరణలలో మంటలు రేగవు[15]. బొగ్గుపులుసుగాలి కణజాలంచే గ్రహించబడి ఆపై ఊపిరితిత్తుల ద్వారా విసర్జింపబడుతుంది. ఉదరకుహర దర్శినుల ద్వారా కత్తెరలు, పటకారులు, శలాకలు,వంటి శస్త్రచికిత్సలకు అవసరమగు సన్నని పరికరాలను చొప్పించవచ్చును.

ఉదరకుహర దర్శినులను ఉపయోగించి గర్భాశయం, అండవాహక (ఫెల్లోపియన్) నాళం, అండాశయాలు (ఓవరీస్), క్రిముకం (ఎపెండిక్స్), జీర్ణకోశం ప్రేవులు, పిత్తాశయం, మూత్రపిండములపైన శస్త్రచికిత్సలు చేయగలరు[15]. ఉదరకుహరదర్శనంతో (లేపరోస్కొపీ) చేయు శస్త్రచికిత్సల్లో గాయములు చిన్నవగుటచే వీరిలో నొప్పి తక్కువగా ఉంటుంది, రక్తనష్టము తక్కువగా ఉంటుంది, రోగులు త్వరగా కోలుకుంటారు.

పుఫుసకుహర దర్శనం
మార్చు
 
దృశ్య వక్షోదర్శినితో శస్త్రచికిత్స (video assisted thoracoscopy (VATS) CRUK 378)

వక్షములో గుండె, ఊపిరితిత్తులు ముఖ్యమైన అవయవాలు. ఊపిరితిత్తులను ఆవరిస్తూ పుఫుసవేష్టనం (ప్లూరా) ఉంటుంది. పుఫుసవేష్టనపు లోపలి పొర ఊపిరితిత్తులను కప్పుతూ ఉంటే, రెండవపొర ఱొమ్ము గోడను కప్పుతూ ఉంటుంది. పుఫుసవేష్టనపు రెండుపొరల మధ్య చాలా తక్కువ ద్రవముండి ఆ పొరలు ఒకదానిపై ఇంకొకటి కదలుటకు కందెన వలె పనిచేస్తుంది. ఈ పొరలమధ్య స్థలము పుఫుసకుహరం. పుఫుసకుహరంను వక్షోదర్శినితో (థొరకోస్కోప్) పరీక్షించి, అవసరమయితే కణపరీక్షలకు తునుకలు గ్రహించవచ్చును. అసాధారణంగా ద్రవాలు చేరుకుంటే వాటిని తొలగించి పరీక్షకు పంపవచ్చును. పుఫుసకుహరదర్శనంతో  శస్త్రచికిత్సలు చేసే అవకాశం ఉంది. వక్షోదర్శిని చివరలో కటకం (లెన్స్) కాని, దృశ్యచిత్రగ్రాహకం (విడియో కెమేరా) కాని ఉండి  దూరదర్శిని తెరపైకి చిత్రం ప్రసరింపజేస్తాయి. దీనిలో శస్త్రచికిత్స పరికరాలను చొప్పించుటకు మార్గాలుంటాయి.

మధ్యవక్షోదర్శనం
మార్చు

రెండు ఊపిరితిత్తుల నడిమి ఉండే మధ్యవక్షంను (మీడియేష్టినమ్) మధ్యవక్షోదర్శిని (మీడియేష్టినో స్కోప్) తో పరీక్షించవచ్చును. మధ్యవక్షంలో ఉన్న రసగ్రంథుల (లింఫ్ నోడ్స్) నుంచి కణపరీక్షలకు తునుకలు గ్రహించవచ్చు.

సంధ్యంతర దర్శనం
మార్చు

కీలు (సంధి) లోపలకు సంధ్యంతర దర్శిని (ఆర్థ్రోస్కొప్) అనే సన్నని అంతర్దర్శన పరికరం చొప్పించి కీలు (సంధి) లోపలి భాగాలను పరీక్షించి కీలులో ఏర్పడిన గాయాలను, స్నాయువుల (లిగమెంట్స్) చిరుగులను, వ్యాధులను వైద్యులు కనుగొనగలుగుతున్నారు. మోకాలి కీలులో  స్నాయువుల చిరుగులను సంధ్యంతర దర్శనంతో (ఆర్థ్రోస్కొపీ) చక్కబఱచగలుగుతున్నారు. మోకాలి కీలులోని అర్ధచంద్రాకార మృదులాస్థి బింబాలలో (మినిస్కై) చీలికలను చూచి చికిత్స చేయగలరు. తుంటికీలు, భుజసంధి, మణికట్టుకీలు ఇతర కీళ్ళను పరీక్షించుటకు, వాటిలో చికిత్సలు చేయుటకు అంతర్దర్శినులు లభ్యం. చికిత్సలు చేసేటపుడు కీలులోనికి అంతర్దర్శినిని చొప్పించుటకు ఒక రంధ్రం, పరికరాలను చొప్పించుటకు వేఱొక చిన్న రంధ్రం చేస్తారు. ఈ శస్త్రచికిత్సలతో రోగులు త్వరగా కోలుకొంటారు.

గర్భిణీ స్త్రీలలో

మార్చు

గర్భిణీ స్త్రీలలో నెలలు నిండి కాన్పుకు సిద్ధముగా ఉన్నవారిలో కాన్పు ఆలస్యమయి గర్భస్థశిశువు ఆపదలో ఉన్నపుడు వ్యాకోచించిన గర్భాశయగ్రీవం ద్వారా ఉల్బదర్శినిని (ఏమ్నియోస్కోప్) చొప్పించి మావిసంచిని (ఏమ్నియాటిక్ సాక్) పరిశీలించుట / ఉల్బదర్శనం (ఏమ్నియోస్కొపీ) వలన ప్రయోజనము చాలా చాలా తక్కువ[16]. సూక్ష్మజీవుల ఆక్రమణకు గుఱిచేయుట[17], మావిసంచిని చించుట వంటి ప్రమాదాలకు అవకాశం ఉండడం వలన ఉల్బదర్శనం వాడుక తక్కువే[17].

 
గర్భస్థ పిండదర్శనం (Fetal-endoscope)

గర్భిణీ స్త్రీలలో వైద్యులు గర్భాశయంలోనికి సన్నని నమన దృశ్యదర్శినిని ( ఫ్లెక్సిబుల్ విడియోస్కోప్) చొప్పించి పిండము(ల)ను పరీక్షించి కొన్ని పుట్టువ్యాధులకు (కంజెనిటల్ డిసీజెస్) వికిరణ వర్ధిత కాంతికిరణ శస్త్రచికిత్సలు (లేజర్ సర్జరీస్) చేయగలుగుతున్నారు. కవల పిల్లలలో రక్తప్రసరణ అసమానంగా ఉన్నపుడు ఒక పిండం నుండి రెండవ పిండానికి రక్తం తరలించు రక్తనాళాలను మూయించి రెండు పిండాలకు రక్తప్రసరణ సమంగా చేస్తారు[18][19].

మావిసంచి నుంచి కణజాలాలు పట్టీలుగా (ఏమ్నియాటిక్ బేండ్స్) ఏర్పడి పిండము చుట్టూ అల్లుకొని కుంచించునపుడు వాటిని పిండదర్శనం ద్వారా ఛేదించి అవయవాల రక్తప్రసరణకు అడ్డంకులు తొలగించగలరు. అవయవాలు అప్పుడు సక్రమంగా వృద్ధిచెందుతాయి[19].

విరూప సవరణ శస్త్రచికిత్సల్లో (ప్లాస్టిక్ సర్జరీస్) కూడా అంతర్దర్శినులను వినియోగిస్తారు.

నవీన వైద్యంలో అంతర్దర్శినుల వినియోగం చాలా ప్రాముఖ్యత వహిస్తుంది.

మూలాలు

మార్చు
  1. Yu, Hai-Xiang; Han, Chun-Shan; Xue, Jin-Ru; Han, Zhi-Feng; Xin, Hua (2018-04). "Esophageal hiatal hernia: risk, diagnosis and management". Expert Review of Gastroenterology & Hepatology. 12 (4): 319–329. doi:10.1080/17474124.2018.1441711. ISSN 1747-4132. PMID 29451037. {{cite journal}}: Check date values in: |date= (help)
  2. Najm, Wadie I. (2011-09-01). "Peptic Ulcer Disease". Primary Care: Clinics in Office Practice. Gastroenterology. 38 (3): 383–394. doi:10.1016/j.pop.2011.05.001. ISSN 0095-4543.
  3. Hill, Ivor D.; Dirks, Martha H.; Liptak, Gregory S.; Colletti, Richard B.; Fasano, Alessio; Guandalini, Stefano; Hoffenberg, Edward J.; Horvath, Karoly; Murray, Joseph A.; Pivor, Mitchell; Seidman, Ernest G. (2005-01). "Guideline for the Diagnosis and Treatment of Celiac Disease in Children: Recommendations of the North American Society for Pediatric Gastroenterology, Hepatology and Nutrition". Journal of Pediatric Gastroenterology and Nutrition (in అమెరికన్ ఇంగ్లీష్). 40 (1): 1. ISSN 0277-2116. {{cite journal}}: Check date values in: |date= (help)
  4. "Colorectal polyps: MedlinePlus Medical Encyclopedia". medlineplus.gov (in ఇంగ్లీష్). Retrieved 2024-03-30.
  5. Dumonceau, Jean-Marc; Andriulli, Angelo; Elmunzer, B. Joseph; Mariani, Alberto; Meister, Tobias; Deviere, Jacques; Marek, Tomasz; Baron, Todd H.; Hassan, Cesare; Testoni, Pier A.; Kapral, Christine; European Society of Gastrointestinal Endoscopy (2014-09). "Prophylaxis of post-ERCP pancreatitis: European Society of Gastrointestinal Endoscopy (ESGE) Guideline - updated June 2014". Endoscopy. 46 (9): 799–815. doi:10.1055/s-0034-1377875. ISSN 1438-8812. PMID 25148137. {{cite journal}}: Check date values in: |date= (help)
  6. Kelly, Nicholas M; Caddy, Grant R (2008-01). "SUCCESSFUL ENDOSCOPIC MANAGEMENT OF FRACTURED DORMIA BASKET DURING ENDOSCOPIC RETROGRADE CHOLANGIOPANCREATOGRAPHY FOR CHOLEDOCHOLITHIASIS". The Ulster Medical Journal. 77 (1): 56–58. ISSN 0041-6193. PMC 2397011. PMID 18271088. {{cite journal}}: Check date values in: |date= (help)
  7. Coucke, Ethan M.; Akbar, Hina; Kahloon, Arslan; Lopez, Peter P. (2024), "Biliary Obstruction", StatPearls, Treasure Island (FL): StatPearls Publishing, PMID 30969520, retrieved 2024-03-30
  8. 8.0 8.1 Alvi, Sirhan; Harsha, Pooja (2024), "Flexible Nasopharyngoscopy", StatPearls, Treasure Island (FL): StatPearls Publishing, PMID 30969562, retrieved 2024-04-01
  9. 9.0 9.1 "Cystoscopy and Ureteroscopy - The Doctors Lounge(TM)". web.archive.org. 2011-07-10. Archived from the original on 2011-07-10. Retrieved 2024-04-04.
  10. "Rigid Cystoscope - an overview | ScienceDirect Topics". www.sciencedirect.com. Retrieved 2024-04-04.
  11. "Colposcopy: Biopsy, Purpose, Procedure, Risk & Results". Cleveland Clinic (in ఇంగ్లీష్). Retrieved 2024-04-11.
  12. 12.0 12.1 "Basic Information About Cervical Cancer | CDC". www.cdc.gov (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-08-25. Retrieved 2024-04-11.
  13. Luhn, Patricia; Walker, Joan; Schiffman, Mark; Zuna, Rosemary E.; Dunn, S. Terence; Gold, Michael A.; Smith, Katherine; Mathews, Cara; Allen, Richard A.; Zhang, Roy; Wang, Sophia; Wentzensen, Nicolas (2013-02). "The role of co-factors in the progression from human papillomavirus infection to cervical cancer". Gynecologic oncology. 128 (2): 265–270. doi:10.1016/j.ygyno.2012.11.003. ISSN 0090-8258. PMC 4627848. PMID 23146688. {{cite journal}}: Check date values in: |date= (help)
  14. "Laparoscopy". Cleveland Clinic (in ఇంగ్లీష్). Retrieved 2024-04-17.
  15. 15.0 15.1 "Training in diagnostic laparoscopy". www.gfmer.ch. Retrieved 2024-04-17.
  16. Debord, M.-P. (2011-12). "[To evaluate the role of fetal movement counting and amnioscopy in the management of prolonged pregnancies]". Journal De Gynecologie, Obstetrique Et Biologie De La Reproduction. 40 (8): 767–773. doi:10.1016/j.jgyn.2011.09.008. ISSN 1773-0430. PMID 22056195. {{cite journal}}: Check date values in: |date= (help)
  17. 17.0 17.1 Raboni, Stefano; Kaibura, Christine T.; Fieni, Stefania (2004). "Amnioscopy: is it actual?". Acta Bio-Medica: Atenei Parmensis. 75 Suppl 1: 59–61. ISSN 0392-4203. PMID 15301293.
  18. "Fetoscopic Laser Surgery". www.hopkinsmedicine.org (in ఇంగ్లీష్). Retrieved 2024-04-21.
  19. 19.0 19.1 "Fetoscopy: Advantages, Procedure, Results & Risks". Cleveland Clinic (in ఇంగ్లీష్). Retrieved 2024-04-20.