ఓషో
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
రజినీష్ చంద్రమోహన్ జైన్ (డిసెంబరు 11, 1931 - జనవరి 19, 1990). 1960లలో ఆచార్య రజినీష్‌గా, 1970-1980లలో భగవాన్ శ్రీ రజినీష్ గా ఆ తరువాత ఓషోగా పిలువబడిన ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. పరిశీలనాత్మక సిద్ధాంతాలు, పూర్వీయ (తూర్పు దేశాల) ఆధ్యాత్మికత, వ్యక్తిగత భక్తి, లైంగిక స్వాతంత్ర్యం గురించి అనేక ప్రసంగాలు, రచనలు చేసాడు.[1] భారతదేశం, అమెరికా సంయుక్త రాష్ట్రాలులో ఓషో మూవ్‌మెంట్ అనే ఒక వివాదాస్పదమైన కొత్త ఆధ్యాత్మిక సంఘాన్ని స్థాపించాడు.
భగవాన్ శ్రీ రజినీష్ | |
---|---|
![]() 1981లో రజనీష్ | |
బాల్య నామం | చంద్ర మోహన్ జైన్ |
జననం | 11 డిసెంబర్ 1931 కుచ్వాడ, భోపాల్ రాష్ట్రం, బ్రిటీష్ రాజ్ (ఇప్పుడు మధ్యప్రదేశ్, భారతదేశం) |
మరణం | 19 జనవరి 1990 (aged 58) పుణె, మహారాష్ట్ర, భారతదేశం |
జాతీయత | ఇండియన్ |
రంగం | ఆధ్యాత్మికత |
శిక్షణ | డా. హరి సింగ్ గౌర్ విశ్వవిద్యాలయం |
ఉద్యమం | జీవన్ జాగృతి ఆందోళన్ (నియో-సన్న్యాస్) |
చేసిన పనులు | 600 పుస్తకాలు, అనేక వేల ఆడియో, వీడియో ప్రసంగాలు |
మేధస్సు లో ఎదగాలనుకొనే వారి జీవితాలలో ఓషో అధ్యాత్మిక విప్లవాన్ని తెచ్చాడు. సనాతన ధర్మాలను, పూజారులను, రాజకీయవేత్తలను, యుగాల నాటి సాంప్రదాయాలనే కాక స్వీయ అవగాహన పథంలో అడ్డంకిగా కనబడే ప్రతీ దానినీ నిర్భయంగా వ్యతిరేకించాడు. దీనితో ఓషో వివాదాస్పత ఆధ్యాత్మికవేత్తగా సంచలనం సృష్టించాడు. [2]
'ఓషో' పదానికి అర్థం
మార్చుమహాసముద్రం లో కలిసిపోయే దానిని ఆంగ్లం లో ‘oceanic' అని అంటారు. అయితే రజినీష్ ఈ పదాన్ని ఎంచుకోవటం వెనుక దీని అర్థాన్ని మించి ఉంది. ‘oceanic’ అనే పదం ఒక అనుభూతిని సూచిస్తుంది. ఒక మంచు బిందువు మహాసముద్రం లో కలిసిపోయినపుడు ఎలా అయితే తన ఉనికిని కోల్పోతుందో, ఓషో అన్నా కూడా, జాగరూకత అనే మహాసముద్రం లో కరిగిపోయి, తన ఉనికిని కోల్పోయే వాడే ఓషో. తూర్పు దేశాలలో ఓషో అనగా దీవెనలు గల వాడు, ఆకాశం నుండి పూల వర్షం పొందిన వాడు.[3]
పుట్టు పూర్వోత్తరాలు
మార్చురజినీష్ 1931 డిసెంబరు 11 న మధ్యప్రదేశ్‌లో గల నర్సింగ్‌పూర్ జిల్లాలో ఉన్న కుచ్ వాడాలో దిగంబర జైనుల ఇంట జన్మించాడు.[1][4] ఓషో తండ్రి పేరు బాబూలాల్, తల్లి పేరు సరస్వతి.[5] అయితే బాబూలాల్ ను అందరూ ప్రేమగా దద్దా (అన్నయ్య) అని పిలుచుకొనేవారు. [4]
ఓషో అమ్మమ్మ, తాతయ్య లు అతని పేరును రాజా గా పెట్టారు. అతడికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండటానికి ఓషోను వారే పెంచుకొన్నారు.[6] వారిరువురూ తనువులు చాలించిన తర్వాతే ఓషో తిరిగి తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చాడు. అప్పుడే తన రెండో పినతండ్రి ఓషో కు రజినీష్ చంద్ర మోహన్ గా నామకరణం చేసి పాఠశాలలో చేర్పించాడు.[7]
పునర్జన్మ
మార్చుఓషో ది పునర్జన్మ అని తానే ఒప్పుకొన్నాడు. "700 ఏళ్ల క్రితం నేను మరణించే ముందు 21 రోజుల ఉపవాసం చేయాలనుకొన్నాను. అయితే 18 రోజులు పూర్తి కాగానే ఆ జన్మలో నేను తనువు చాలించాను. అందుకే ఈ జన్మలో పుట్టిన వేంటనే నేను మూడు రోజులు ఉపవాసం ఉన్నాను." అని ఒకానొక సందర్భం లో తానే చెప్పాడు. [8]
విద్యాభ్యాసం
మార్చుఓషో తండ్రి బాబూలాల్ తరన్ స్వామి అనే దిగంబర జైను కు శిష్యుడు. తరన్ స్వామి బోధనలు పధ్నాలుగు పుస్తకాలు గా అచ్చువేయబడగా, చిన్న వయసులోనే ఓషో వీటిని చదివటం వలన ఈ బోధనల ప్రభావం ఓషో పై కొద్దో గొప్పో కలదు.[4]
పినతండ్రులు అమృత్ లాల్, శిఖర్ చంద్ ల ప్రభావం కూడా ఓషో పై ఉంది. అమృత్ లాల్ సాహిత్య జ్ఞానం, అతని కవితా పటిమ ఓషో లో సాహిత్యం పై ఆసక్తిని పెంచింది. శిఖర్ చంద్ సోషలిస్టు భావాలు ఓషో లో వ్యవస్థల పట్ల ఆసక్తి పెంచింది. [9]
1955 లో తత్వ శాస్త్రంలో జబల్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి బి.ఏ పట్టా పొందాడు. అక్కడే బోధిస్తూ 1957 లో సౌగర్ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ పట్టా పొందాడు.[1]
జ్ఞానోదయం
మార్చుతన 21వ ఏట తనకు జ్ఞానోదయం అయ్యింది అని ఓషో తెలిపాడు. అది ఒక ఆధ్యాత్మిక మేల్కొల్పు అని, వ్యక్తిగత మతపరమైన అనుభవం ఆధ్యాత్మిక జీవితం యొక్క కేంద్ర బిందువు అని, అటువంటి అనుభూతి ఏ ఒక్క మత వ్యవస్థకు అవగతం కావని ఈ జాగరూకత తనకు తెలిపింది అని ఓషో భావిస్తాడు.[1]
తన పూర్వ జన్మలో, జ్ఞానోదయం కోసం తాను చేసిన ఉపవాసం మధ్యలోనే భంగపడిందని, మూడు రోజుల ఉపవాసం ఇంకా ఉండగనే తాను హత్య చేయబడ్డాడు అని, అందుకే ఈ జన్మ లో ఆ మూడు రోజులు, ఏడు సంవత్సరాలతో హెచ్చించబడి 21వ ఏట జ్ఞానోదయం సిద్ధించిందని, ఓషో స్వయంగ చెప్పుకొచ్చాడు. [10]
రజినీష్ ఉద్యమం
మార్చుతాత్విక చింతనలోనే పలు సంవత్సరాలు భారతదేశం లోని పలు ప్రాంతాలను దర్శించాడు. ఈ ప్రాంతాలలో ఆధ్యాత్మికత మరియు తూర్పు దేశాల తత్వ శాస్త్రాల గురించి ప్రసంగాలు చేశాడు. 1960 లో రజినీష్ నిర్వహించే ధ్యాన తరగతులను బాసటగా అతని అనుచరులు కొందరు ఆర్థిక సహకారానికి సిద్ధపడ్డారు. అప్పటి నుండి రజినీష్ శిష్యగణం దిన దిన ప్రవర్థమానం అయ్యింది. తన శిష్యులను రజినీష్ neo-sannyasins (నవయుగ సన్యాసులు) గా నామకరణం చేశాడు. శిష్యులు తమని తాము "రజినీషీ"లు గా పిలుచుకొనేవారు. కాషాయ రంగు దుస్తులు, 108 పూసలు, తన ఫోటో గల మాలను, ధరించటమే కాకుండా, రజినీష్ తన శిష్యులకు పునర్నామకరణం చేసేవాడు.[11]
స్వభావం
మార్చుఓషో విగ్రహారాధ వ్యతిరేకి, జ్ఞానోదయం పొందిన ఆధ్యాత్మిక వేత్త, మేధో దిగ్గజం.[2] సనాతన ధర్మాలను, పూజారులను/మత ప్రవక్తలను, రాజకీయ నాయకులను, పురాతన సంప్రదాయాలను, ఓషో నిర్భయంగా వ్యతిరేకించాడు.
ఆధ్యాత్మిక గురువు
మార్చు1966 లో రజినీష్ బోధనారంగానికి రాజీనామా చేసి, ఆధ్యాత్మిక గురువుగా అవతరించాడు. తన శిష్యులకు ధ్యానం గురించి బోధించటం మొదలు పెట్టాడు. 70వ దశకంలో తన శిష్యులను సన్యాసం లోకి తీసుకువచ్చాడు. అతని శిష్యగణం ప్రాపంచిక విషయాలను త్యజించి తపో జీవితాన్ని ఆచరించారు. సన్యాసం అంటే సర్వం త్యజించటం కాదని, జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తూ కూడా సన్యాసం చేపట్టవచ్చని, కేవలం ప్రపంచం నుండి దూరంగా ఉండటం వలనే ఇది సాధ్యం అని సన్యాసానికి క్రొత్త అర్థం తీసుకు వచ్చాడు.[1]
పాశ్చాత్య శిష్యులు
మార్చురజినీష్ బోధనలు ఎల్లలు దాటాయి. తత్వానికి రజినీష్ తీసుకు వచ్చిన నూతన కోణానికి పాశ్చాత్యులు సైతం ముగ్ధులు అయ్యారు. అతని శిష్యులుగా చేరటానికి వీరు భారత్ రావటం ప్రారంభించారు. 1974 లో రజినీష్ ఉద్యమానికి పుణే కేంద్రం అయ్యింది. దైవాన్ని అనుభూతి చెందటానికి ఇక్కడ క్రియాశీలక ధ్యానం (Dynamic Meditation) నేర్పబడేది. పాశ్చాత్య సంస్కృతి నుండి గ్రహింపబడ్డ, వైవిధ్యమైన స్వస్థత కార్యక్రమాలను ఇక్కడ రూపొందించటం జరిగింది. అప్పటి వరకు పలు హైందవ గురువులు శృంగారాన్ని త్యజించమని బోధించగా, ఈ బోధనలను వ్యతిరేకిస్తూ, రజినీష్ శృంగారాన్ని ప్రగతి కారకంగా బోధించాడు.[1]
నమ్మకాలు-ఆచరణ
మార్చు70వ దశకం ప్రథమార్థంలో ఒక మానిఫెస్టోలో రజినీష్ తన శిష్యులకు ప్రాథమిక సూత్రాలను వివరించాడు. ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం తన ప్రతి శిష్యుడు/శిష్యురాలు తమ తమ స్వంత దారులను ఏర్పరచుకోవాలని తెలిపాడు. మహానగరాలలో ఐహిక సుఖాలను కాంక్షించకుండా సామూహిక, ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని సూచించాడు. వివాహ వ్యవస్థను త్యజించమని తెలిపి, సహ జీవనాన్ని ప్రోత్సహించి, అంతు లేని ప్రేమను రుచి చూడమని తెలిపాడు. తన సమూహం లో సంతానం కలుగకుండా గర్బనిరోధక సాధనాలను, అబార్షన్ వంటి వాటిని అవలంబించవలసిందిగా తెలిపాడు. లైంగిక సుఖవాదం (sexual hedonism) పై నమ్మకాలు కలిగించటంతో పలువురు రజినీష్ పట్ల ఆకర్షితులు అయ్యారు. [11]
మొదట తన కోరికలను అంగీకరించి, తర్వాత వాటిని అధిగమించి అంతర్గత స్వాతంత్రాన్ని సాధించే ఒక నూతన మానవుణ్ణి (new man) రజినీష్ సృష్టించదలచుకొన్నాడు. అన్య మతాలాన్ని విఫలమైన ప్రయోగాలని, సిద్ధాంతాలు లేని తన మతమే సఫలీకృతం కాబోతోందని రజినీష్ నమ్మేవాడు. పెట్టుబడిదారు విధానాన్ని రజినీష్ పొగిడే వాడు. మతాలు పేదరికాన్ని పొగడటం వలనే పేదరికం ఉనికి ప్రపంచంలో ఉందని రజినీష్ నమ్మేవాడు. [11]
విలాసవంతమైన జీవితం
మార్చుఆధ్యాత్మికతతో మొదలైన రజినీష్ ఉద్యమం పలు వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది. వ్యాపారాలు బలపడటంతో ఉద్యమం సంస్థాగత సూత్రాలను అవలంబించటం మొదలు పెట్టింది. దీనితో ఉద్యమం లోకి నిధులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. ఒకానొక సమయంలో రజినీష్ వద్ద 90 రోల్స్ రాయిస్ కారులు, విలువైన రాళ్ళతో పొదగబడ్డ పలు చేతి వాచీలు ఉండేవి.[11]
అమెరికా ప్రవేశం
మార్చు1981 లో రజినీష్ అమెరికా సంయుక్త రాష్ట్రాలుకు మకాం మార్చాడు. 1982 లో ఓరేగాన్ లోని ఆంటెలోప్ ప్రదేశానికి దగ్గర 60,000 ఎకారాలలో రజినీష్ పురం అనే నగరాన్ని స్థాపించాడు. ఈ నగరానికి ప్రత్యేకంగా అగ్నిమాపక, పోలీసు, రవాణా వ్యవస్థలు ఏర్పరచటమే కాక, ఇక్కడ పలు రెస్టారెంట్లు, షాపింగ్ మాల్ లు, ఒక విమానాశ్రయం కూడా నిర్మించబడ్డవి. 1984 World Festival (ప్రపంచ పండుగ) ను జరపటానికి రజినీష్ పూనుకొన్నాడు. 15,000 మందితో జరిపిన ఈ పండుగకు అయిన ఖర్చు కోటి డాలర్లు![11]
నేరారోపణలు
మార్చుప్రశాంత తపోవనంగా ఉండవలసిన రజినీష్ పురం గతి తప్పింది. ఏ ప్రాంతంలో అయితే రజినీష్ పురం నిర్మించారో, వాస్తవానికి అది ప్రభుత్వం చే వ్యవసాయానికి కేటాయించబడ్డది. చట్ట ప్రకారం ఇటువంటి భూమిలో కేవలం ఆరుగురు జీవించటానికి మాత్రమే అనుమతి ఉంది. అయితే కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న భక్తుల తాకిడి తట్టుకోలేక స్థానికులు రజినీషీలను వ్యతిరేకిస్తూ తమ గోడును ప్రభుత్వానికి చెప్పుకొన్నారు. వ్యవసాయేతర ప్రయోజనాలకు ఆంటిలోప్ యొక్క నగర ప్రదేశానికి వాడుకోవాలని ప్రభుత్వం రజినీష్ కు ఉత్తర్వులను జారీ చేసింది. అప్పటికే చాలా మంది రజినీషీలు ఆంటిలోప్ పౌరులు అయిపొవటంతో రజినీష్ పురాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి వేయాలన్న స్థానికుల పన్నాగాలకు అడ్డుకట్ట పడింది.[11]
ఆంటిలోప్ నగర పాలక వ్యవస్థలో రజినీషీలు పాగా వేసారు. ఎన్నికలు వచ్చేలా చేసి, వాటిలో గెలిచి, ఆంటిలోప్ నగరాన్ని రజినీష్ గా మార్చాలనే నిర్ణయం వచ్చేలా చేయటంతో స్థానికుల-రజినీషీల మధ్య చిచ్చు రేగింది. ఈ ఎన్నికలో తీర్పు తమకు అనుకూలంగా వచ్చేలా చేసేందుకు రజినీషీలు సలాడ్ బార్ లలో ఆహారాన్ని విషపూరితం చేశారు. దీని ములంగా 700 మంది అస్వస్థతకు గురయ్యారు. రజినీష్ ప్రియ శిష్యులే ఈ ఫుడ్ పాయిజనింగ్ కు కారణం అని తెలుసుకొన్న పోలీసులు వారిని అదుపు లోకి తీసుకొని జైలులో ఉంచారు. తప్పించుకోవాలనే ప్రయత్నంలో రజినీష్ నార్త్ కెరోలీనాలో పోలీసులకు చిక్కాడు.[11]
అమెరికా నుండి పరారీ
మార్చుదురాక్రమణ, హత్య, మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా, ఆంటిలోప్ ఎన్నికలలో అక్రమాలు వంటి నేరారోపణలు ఎదుర్కోవటంతో రజినీష్ శిష్యులు అతణ్ణి వదిలేసి వెళ్ళిపోయారు. 1985 లో వలస మోస నేరారోపణలు ఋజువు కావటంతో రజినీష్ అమెరికా వీడి పోయాడు. 21 దేశాలు అతడికి ఆశ్రయం కల్పించటానికి నిరాకరించగా, తిరిగి పుణేకి వచ్చాడు.[1] రజినీష్ వీడిపోవటంతో రజినీష్ పురం శిథిలమయ్యింది.[11]
ఓషో గా పేరు మార్పు
మార్చు1989 లో రజినీష్ తన పేరును ఓషోగా మార్చుకొన్నాడు.[1]
ఓషో బోధన
మార్చుజీవితానికి సంబంధించిన గొప్ప విలువలు కాన్షియస్ నెస్ (జాగరూకత, స్ప్రహ), ప్రేమ, ధ్యానం, సంతోషం, ప్రజ్ఞ, ఆనందం అని అతను బోధించాడు. జ్ఞానోదయం (ఎన్‌లైటెన్‌మెంట్) అన్నది ప్రతి ఒక్కరి సహజ స్థితి అయినప్పటికీ, అందరూ దీనిని తెలుసుకోలేకపోవటానికి - మనషి ఆలోచనా విధానం ముఖ్య కారణం కాగా, సామాజిక పరిస్థితులు, భయం వంటివి మరి కొన్ని కారణాలు అని అతను అన్నాడు.
హిందీ, ఆంగ్లభాషలలో అతను అనర్గళంగా ప్రవచించాడు. బుద్ధుడు, కృష్ణుడు, గురు నానక్, ఏసుక్రీస్తు, సోక్రటీసు, జెన్ గురువులు, గురుజెఫ్, యోగ సంప్రదాయాలు, సూఫీ, హస్సిడిజమ్, తంత్ర వంటి బోధనలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఎన్నింటిలోనో అతను ఆరితేరిన దిట్ట. ఏ తత్వమూ సత్యాన్ని పూర్తిగా గ్రహించలేదు అనే నమ్మకాన్ని కలిగి, ఏ "ఆలోచనా పద్ధతి"లో కూడా తనను ఎవరూ నిర్వచించలేరని అతను ప్రకటించాడు.
అరవైలలో తరుచుగా శృంగారానికి సంబంధించిన ప్రవచనాలను వెలువరించినందుకు అతణ్ణి "సెక్స్ గురువు" అని పిలిచేవారు. ఆ ప్రవచనాలన్నింటిని Sex to Superconsciousness అనే ఆంగ్ల పుస్తకంగా ప్రచురించారు, ఈ పుస్తకం సంభోగం నుండి సమాధి వరకు అనే పేరుతో తెలుగులో అనువదించబడింది. అతను చెప్పినది, "తంత్ర పద్ధతిలో అనైతికం అనేది లేదు, అంతా నైతికమే" సెక్స్‌ను నైతికంగా అణగద్రొక్కడం లాభ రహితం, సంపూర్ణంగా చైతన్యసహితంగా అనుభవించనప్పుడు దాన్ని దాటి ముందుకు వెళ్ళలేరు అని.
శృంగారం పై అతని ప్రవచనాలలో ఒకటి
"ప్రేమ ఓ ప్రదేశం. స్వేచ్చగా మనస్పూర్తిగా అనుభవించు. జీవితంలో ఏ రహస్యం ఉండదు. దాచిపెట్టడమే ఉంటుంది. సెక్స్ వల్లనే మనం పుడతాము. అన్ కాన్షస్ నుండి సెక్స్ సూపర్ కాన్షస్ కు తీసుకు వెళుతుంది. సెక్స్ తోనే ముక్తి. జీవితం పక్షి. ప్రేమ,స్వేచ్చ రెండు రెక్కలు.అందరూ మనల్ని వదిలివేయటం ఒంటరితనం. అందర్నీ మనం వదిలి వేయటం ఏకాంతం"
చెప్పుకోదగ్గవి
మార్చుప్రతి ఏటా 2,00,000 మంది పర్యాటకులతో, పూణే పట్టణములోని ఓషో అంతర్జాతీయ ధ్యాన విహారము (Osho International Meditation Resort) ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక ఆరామాలలో ఒకటి.
నేడు 50 భాషలలో అనువాదం చెయ్యబడి ఓషో పుస్తకాలు మున్నెన్నడు లేనంతగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అతను వ్యాఖ్యానాలు, పలుకులు గొప్ప వార్తాపత్రిక లెన్నింటిలోనో మనకు కనిపిస్తాయి. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, నవలాకారుడు, విలేఖరి కుష్వంత్ సింగ్, సినిమా నటుడు, రాజకీయనాయకుడు వినోద్ ఖన్నా, అమెరికా కవి రూమీ, అనువాదకుడు కోల్‌మన్ బార్క్స్, అమెరికా నవలాకారుడు టామ్ రాబిన్స్.
కొత్త ఢిల్లీ లోని భారత పార్లమెంటు గ్రంథాలయంలో కేవలం ఇద్దరు ప్రముఖుల పూర్తి జీవితకాల రచనలను మాత్రమే పొందుపరిచారు, ఒకరు ఓషో కాగా మరొకరు మహాత్మా గాంధీ.
మరణం
మార్చుపూణేలో 1990 జనవరి 19 న ఓషో మరణించాడు. అతని మరణం తర్వాత అతని శిష్యులు ప్రభుత్వం అతడి పై కుట్ర పన్నినట్లు, అతడు నిర్దోషి అని తాము గట్టిగా నమ్ముతున్నట్లు, అతడి ఉద్యమాన్ని తాము ముందుకు తీసుకువెళుతున్నట్లు తెలిపారు.[1]
మరణానంతరం ఓషో ఉద్యమం
మార్చుభారత్ లో ఉన్న ఆశ్రమం పేరు మొదట Osho Institute గా, తర్వాత Osho International Meditation Resort గా మార్చబడింది. ఏటా వేల మంది వచ్చి ఇక్కడ చేరుతూ ఉంటారు. 80కి పైగా దేశాలలో ఓషో ధ్యాన కేంద్రాలు నెలకొల్పబడ్డాయి. ఓషోపై, అతడి ఉద్యమంపై పలు పుస్తకాలు వెలువడ్డాయి. 2018 లో నెట్‌ఫ్లిక్స్ లో రజినీష్ ఉద్యమం పై ఆరు భాగాల వైల్డ్ వైల్డ్ కంట్రీ అనే డాక్యుమెంటరీ రూపొందించబడింది.[11]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "Bhagwan Shree Rajneesh | Biography, Facts, & Rajneesh Movement | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). 2025-04-21. Retrieved 2025-05-17.
- ↑ 2.0 2.1 Joshi, Vasant (2010). Osho - The Luminous Rebel (Life Story of the Maverick Mystic). Wisdom Tree. p. 15. ISBN 978-81-8328-421-9.
- ↑ Joshi, Vasant 2009, p. 15.
- ↑ 4.0 4.1 4.2 Joshi, Vasant 2009, p. 24.
- ↑ Joshi, Vasant 2009, p. 29.
- ↑ Joshi, Vasant 2009, p. 30.
- ↑ Joshi, Vasant 2009, p. 31.
- ↑ Joshi, Vasant 2009, p. 32.
- ↑ Joshi, Vasant 2009, p. 25.
- ↑ Joshi, Vasant 2009, p. 33.
- ↑ 11.0 11.1 11.2 11.3 11.4 11.5 11.6 11.7 11.8 "Rajneesh movement | History, Beliefs, & Facts | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). Retrieved 2025-05-17.