కండ్లగుంట (నకరికల్లు)

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా, నకరికల్లు మండలంలోని గ్రామం
(కండ్ల గుంట నుండి దారిమార్పు చెందింది)

కండ్లగుంట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, పల్నాడు జిల్లా, సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గంలోని, నకరికల్లు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కండ్లగుంట
—  రెవిన్యూయేతర గ్రామం  —
ముద్దు పేరు: కండ్లకుంట
కండ్లగుంట is located in Andhra Pradesh
కండ్లగుంట
కండ్లగుంట
అక్షాంశరేఖాంశాలు: 16°12′07″N 80°00′42″E / 16.201958°N 80.011607°E / 16.201958; 80.011607
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం నకరికల్లు
ప్రభుత్వం
 - సర్పంచి రావెల సాయి నవీన్
జనాభా (గ్రామ పంచాయితీ/వార్డ్ కోడ్: 08, శాసనసభ వరుస సంఖ్య : 217)
 - మొత్తం 3,765
 - పురుషులు 1,840
 - స్త్రీలు 1,925
 - గృహాలు 998
పిన్ కోడ్ 522603
ఎస్.టి.డి కోడ్ 08647

గ్రామ చరిత్ర

మార్చు

ఈ గ్రామానికి పౌరాణికంగా చాలా గొప్ప చరిత్ర ఉంది. కండ్లగుంట గ్రామ సమాచారాన్ని 1812లో బ్రిటీషు గవర్నమెంటుకు మదరాసు ప్రాంత సర్వేయర్ జనరల్ కోలిన్ మెకంజీ ఆధ్వర్యంలో అప్పటి గ్రామ కరణం సర్వే చేసి ఇచ్చిన సమాచారం ప్రకారం గుంటూరు జిల్లా గ్రామ కైఫియ్యత్తు మవుజె కండ్లగుంట పరగణె బెల్లంకొండ సర్కారు మల్రాజు వేంకట గుండ్డారావు జమీదారు స్న ౧౨౨౨ (1812A.D) ఫసలీలో గ్రామ చరిత్ర వివరించబడింది.

 
“పల్లెకు పోదాం...” 

కండ్లగుంట చాలా పురాతనమైన పల్లెటూరు. ఈ గ్రామ పంచాయితీ శివారు గ్రామమైన చాగల్లు (నకిరికల్లు) గ్రామానికి అంతరాభాగంగా ఉంది. పూర్వం నుండి ఈ గ్రామం పెద్దబజారు, చిన్నబజారు, యాదవులబజారు, పెద్దపల్లె, చిన్నపల్లె, ఎరుకల గుడిసెలు అను సామాజిక ప్రాంతాలుగా ఉండేవి. కమ్మ వారు ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న ఈ గ్రామంలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉంది. ఈ గ్రామంలో నాగార్జున సాగర్ జలాశయం యొక్క కుడి కాలువ వుండుట చేత ఊరి చుట్టూరా పచ్చని వరి పొలాలతో, ఎటు చూసినా పచ్చదనంతో పరవశిస్తూ, కనుచూపుమేర ప్రకృతి శోభాయానంగా, పచ్చటి ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ఆకుపచ్చని పల్లె. గ్రామం ప్రధాన వీధులన్నీ సిమెంటు రోడ్లే. ఈ గ్రామం పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలోని నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం-సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గం కిందకు వచ్చే పచ్చని పల్లె. గ్రామంలో దాదాపు 998 కుటుంబాలతో 3766 పై చిలుకు జనాభా ఉంది. ఈ గ్రామం 20.35 ఎకరాలు గ్రామ విస్తీర్ణంతో, సముద్ర మట్టానికి 106 మీటర్ల ఎత్తులో, క్రొత్తగా రూపుదిద్దుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 50 కిలోమీటర్ల సమీపంలో ఉంది. ఈ గ్రామం దగ్గరలోని మూడు పట్టణాలు (నరసరావుపేట-సత్తెనపల్లి-పిడుగురాళ్ళ)కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఒక్కరు చేయలేని దాన్ని అందరూ కలసి చేస్తే అదే “ఐక్యత”.  నలుగురి మేలు కోసం చేతులు కలిపి పని చేస్తే అదే “అభివృద్ధి”.  గ్రామఐక్యత, సానుకూల దృక్పధంతో గ్రామాభివృద్ది  సాధించవచ్చు అంటూ కోడెల శివప్రసాదరావు స్ఫూర్తితో హైదరాబాదులో స్టిరపడిన 1. జంపని వెంకట్రావు, 2. కండ్లగుంట శ్రీనివాసరావు, 3. 'పోసాని సుబ్బారావు లు ఓ కమిటీగా ఏర్పడి “కండ్లగుంట విలేజ్ ఫౌండేషన్” ను స్థాపించి, గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను జన్మభూమిపై మమకారంతో గ్రామస్థులు, దేశ విదేశాలలో స్థిరపడిన వారందరి సహాయ సహకారాలతో గ్రామాభివృద్దే ద్యేయంగా “ఐక్యత–అభివృద్ధి” నినాదంతో  “గ్రామవికాసమే–మన అంతిమ ఆశయం” సాధనకు “కండ్లగుంట విలేజ్ ఫౌండేషన్” పల్లె  ప్రగతికి కృషిచేస్తూ, గ్రామస్తులందరూ కలసి మెలసి ప్రేమ ఆప్యాయతలతో సంక్రాంతి పండుగ వేళ జరుపుకునే  ప్రత్యేక ఆత్మీయ సమావేశమే “పల్లెకు పోదాం...”  కార్యక్రమం.

గ్రామం పేరు వెనుక చరిత్ర

మార్చు

ఆంథ్ర మహాభారతంలోని అరణ్యపర్వంలోని కథ: షోడశ చకవ్రర్తులలో పేరెన్నికగన్న యయాతి మహారాజు కుమారుడు మాంథాత. మాంథాత చక్రవర్తికి ముగ్గురు కుమారులు. మాంధాత పెద్ద కుమారుడైన శిబి చక్రవర్తికి మేఘదంబరుడు, జీమూత వాహనుడు అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవారు. మాంథాత జ్యేష్ఠపుత్రుడైన శిబి రాజ్యాథికారానికి వచ్చాడు. ప్రజారంజకుడైన శిబి చక్రవర్తి పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో తులతూగుతున్నారు. అన్న అడుగుజాడల్లో నడుస్తూ తమ్ముళ్లు ఇద్దరూ ప్రజల గౌరవాదరాలను పొందుతున్నారు. అటువంటి సమయంలో మేఘదంబరునకు పుణ్యక్షేత్ర సందర్శన చేయాలనే కుతూహలం కలగడంతో తన కోరికను అన్నగారికి విన్నవించుకొని, అనుమతినివ్వవలసిందిగా కోరాడు. తమ్ముని కోరిక సముచితమని భావించి, దేశాటనకవసరమైన ధనాన్ని, పదిహేనువందల మంది పరివారాన్ని ఇచ్చి పోయిరమ్మని ఆశీర్వదించాడు శిబి చక్రవర్తి. ఉత్తర దేశ యాత్రలు ముగించుకొని, దక్షిణ భారతంలో సంచరిస్తూ శ్రీశైలాది దివ్యక్షేత్రాలను సందర్శించి, చేరుంజర్ల (ఇప్పుడు మన నకరికల్లు మండలంలోని చేజెర్ల) ప్రాంతానికి చేరుకున్నాడు

ఈ ప్రాంత ప్రకృతి రమణీయతకు, ప్రశాంతతకు ఆకర్షితుడైన మేఘదంబరుడు కొంతకాలం ఈ ప్రాంతంలోనే ఉండాలని నిర్ణయించుకొని, తన పరివారాన్ని అందుకు ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించాడు. కొద్దిరోజులు పరిసరాల్లోని కొండలు, కోనల్లో సంచరిస్తూ, అక్కడ దేవరకొండ కోనలోని గుహల్లో తపస్సు చేసుకుంటున్న తాపసులను చూసి సంభాషించి మానసిక ప్రశాంతతను పొందాడు. అనంతరం తన పర్ణశాలకు వచ్చిన మేఘదంబరుడు తాను కూడా తపస్సు చేయాలనే సంకల్పానికి వచ్చాడు. మరుసటిరోజే ఒక ప్రశాంతమైన గుహలోకి ప్రవేశించి తపస్సు ప్రారంభించాడు. కొద్దికాలంలోనే ఆప్రాంతంలోని మునులతో చెలిమి ఏర్పడింది. అనతి కాలంలోనే తపస్సిద్ధి పొందిన మేఘదంబరుడు శివైక్యాన్ని పొందాడు. ఆయన అనుచరులు, అక్కడున్నవారి సహాయంతో మరణించిన అతని భౌతికకాయానికి దహన సంస్కారాలు జరిపించారు. ఆశ్చర్యంగా ఆ చితాగ్ని మధ్య నుండి ఒక అద్భుతమైన శివలింగం ఆవిర్భవించింది. ఆనందాశ్ఛర్యాలకులోనైన పరిసరప్రాంత ప్రజలు, మునులు ఆ లింగాన్ని మేఘదంబేశ్వరలింగమని స్తుతించి, ఆతను తపస్సు చేసిన గుహలోనే ప్రతిష్ఠించి, పూజలు చేయసాగారు. అదే ఈనాడు చేజర్లలో మేఘాలమల్లేశునిగా కొలువబడుతున్న లింగం.

మేఘదంబరుడు లింగాకృతిని పొందగానే ఆయన వెంట వచ్చిన పరివారమంతా ఖిన్నులై, వేగంగా రాజథానికి చేరుకొని జరిగిన వృత్తాంతాన్ని అంతటిని మహారాజైన శిబి చక్రవర్తికి విన్నవించారు. తమ్ముని మరణానికి మిక్కిలి శోకించిన శిబి చక్రవర్తి కొంతసమయానికి తేరుకొని, సోదరుడు లింగరూపాన్ని పొందడాన్ని విని ఆశ్చర్యపోయాడు. చిన్నతమ్ముడైన జీమూతవాహనుని పిలిచి చేరుంజర్ల వెళ్లి జరిగిన వృత్తాంతాన్ని సమగ్రంగా తెలుసుకొని రమ్మని పంపించాడు. జీమూతవాహనుడు పరివారంతో బయలుదేరి వేగంగా చేరుంజర్ల చేరుకున్నాడు. అక్కడి మునివరులు చూపించగా అన్నయైన మేఘదంబరుడు తపస్సు చేసుకున్న గుహను, పూజలందుకుంటున్న మేఘదంబరలింగాన్ని చూశాడు. అన్న అదృష్టానికి ఎంతో మురిసిపోయాడు. కాని స్థలప్రభావమో లేక పూర్వ జన్మపుణ్యఫలమో కాని జీమూతవాహనునికి కూడా ఆ ప్రదేశంలోనే తపస్సు చేయాలనే సంకల్పం కలిగింది. తపస్సు ప్రారంభించిన అనతి కాలంలోనే జీమూతవాహనుడు సిద్ధి పొందాడు. తోటి తాపసులు పరివారము అంత్యక్రియలు నిర్వహించారు. చితాగ్నిలో నుండి అద్భుతలింగం ప్రత్యక్ష మైంది. ఆశ్చర్యపోయిన అక్కడి వారు జీమూతవాహనుడు తపస్సుచేసిన గుహలోనే ఆ లింగాన్ని ప్రతిష్ఠచేసి పూజించసాగారు.

జీమూతవాహని వెంటవచ్చిన పరిజనం వెనుతిరిగి రాజథానికి చేరుకుని సమస్త విషయాన్ని శిబి చక్రవర్తికి విన్నవించుకున్నారు. మేరునగథీరుడైనశిబి చక్రవర్తిని అనుజుల మరణాలు ఎంతో కుంగుదీశాయి. కొంతకాలానికి మనసును కుదుట పరుచుకొని చేరుంజర్ల వెళ్లి తన తమ్ముళ్ళు లింగ రూపాలను పొందిన ప్రదేశాలను దర్శించి రావాలని నిర్ణయించుకున్నాడు. రాజ్యాన్ని మంత్రులకప్పగించి, ఇల్లాలిని వెంట పెట్టుకొని, అపరిమిత ధనరాశులను రథాలపై పెట్టుకొని, దక్షిణదిశగా బయలుదేరాడు. పుణ్యనదీనదాలలో స్నానం చేస్తూ, దివ్యక్షేత్రాలను దర్శిస్తూ, చేరుంజర్ల చేరుకున్నాడు. రాజదంపతుల ఆగమనాన్ని తెలుసుకున్న ఆపరిసర గ్రామాల ప్రజలు, అచ్చటి గుహలలోని మునులు వారికి సాదరస్వాగతం పలికారు. వారందరు వెంటరాగా శిబిదంపతులు మేఘదంబరుడు, జీమూత వాహనుడు తపస్సు చేసుకున్న గుహలు, నిత్యపూజలందుకుంటున్న వారి లింగమూర్తులను దర్శించి ఉద్విగ్నమానసులయ్యారు. శిబి చక్రవర్తి ఆ చేరుంజర్ల పరిసర ప్రశాంత ప్రకృతికి ఆకర్షించబడి, అక్కడే కొంతకాలం ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆపరిసరాల్లో ఏవో దివ్యశక్తులున్నాయని, తనతమ్ములు లింగరూపులుగా మారిన ఈక్షేత్రంలోనే తాను నూరు యజ్ఞాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎందరో మహర్షులు ఆ యజ్ఞానికి హాజరయ్యారు. అందరికీ ఘనంగా మర్యాదలు జరిగాయి. అందర్నీ గొప్పగా సత్కరించాడు శిబి చక్రవర్తి. ఆయన ఔదార్యానికి, దాననిరతికి తాపసులందరూ ఆశ్చర్యపోయారు. శిబి చక్రవర్తి దానశీలతను పదే పదే ప్రజలందరూ ప్రశంసించారు. తొంభైతొమ్మిది యజ్ఞాలను నిర్విఘ్నంగా పూర్తిచేసి నూరవ యజ్ఞాన్ని ప్రారంభించిన శిబిచక్రవర్తిని చూసి భయపడిన దేవేంద్రుడు దిక్పాలకులతో కలసి త్రిమూర్తులను శరణువేడాడు. త్రిమూర్తులు శిబి చక్రవర్తి తపశ్శక్తిని, ఔదార్యాన్ని పరీక్షించదలచారు.

శివుడు ఒక వేటగాని వలెను, బ్రహ్మ బాణం లాగాను, విష్ణువు ఒక కపోతం (పావురం) లాగాను రూపుదాల్చారు. తపశ్శక్తిని పరీక్షించుటకు త్రిమూర్తులు భూలోకానికి వచ్చి విడిది చేసిన ప్రదేశమే “విప్పర్ల” గ్రామంగా పిలవబడుతోంది. త్రిమూర్తులు తమ రూపాలను మార్చుకున్న ప్రదేశం “రూపెనగుంట” గ్రామంగా, త్రిమూర్తులు శిబిచక్రవర్తిని క్రీగంట చూసిన ప్రదేశాన్ని “కండ్లకుంట” గ్రామంగాను పిలువబడుతున్నాయని పరిసర ప్రాంతవాసుల కథనం.

శిబి చక్రవర్తి ఒకరోజు తన రాజప్రాసాదం మేడ మీద కూర్చుని ప్రకృతిని తిలకిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచో ఒక పావురం శరవేగంగా ఎగురుకుంటూ వచ్చి ఆయన చెంత వాలింది. ఈలోగా దానిని తరుముతూ ఒక వేటగాడు వచ్చింది. అనుకోని పరిణామానికి నివ్వెరపోయాడు శిబి చక్రవర్తి. ప్రాణభయంతో వణుకుతున్న పావురం ‘రాజా! నన్ను నీవే కాపాడాలి’ అంటూ మొరపెట్టుకుంది. ‘తప్పక కాపాడతాను. నా రాజ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనులకు రక్షణ ఉంటుంది’ అని భరోసా ఇచ్చాడు. పావురాన్ని తరుముతూ వచ్చిన వేటగాడు ఊరుకోలేదు. ‘రాజా! నేను ఆకలితో అలమటిస్తున్నాను. ఆ పావురం నా సహజ ఆహారం. దానిని వదిలేస్తే నా ఆకలి తీర్చుకుంటాను’ అని అడిగాడు. ‘రక్షణ కల్పిస్తానని పావురానికి నేను మాట ఇచ్చాను. దానిని వదల్లేను. నీ ఆకలి తీర్చుకోవడానికి మరేది అడిగినా ఇస్తాను. పావురాన్ని వదిలేయి’ అని బదులిచ్చాడు శిబి చక్రవర్తి. ‘రెండు షరతులకు అంగీకరిస్తే పావురాన్ని వదిలేస్తాను’ అని చెప్పాడు వేటగాడు. సరేనన్నాడు శిబి చక్రవర్తి. షరతులేమిటో చెప్పమన్నాడు. ‘పావురం బరువుకు సమానమైన మాంసాన్ని నీ శరీరం నుంచే కోసి ఇవ్వాలి. మాంసం ఇస్తున్నప్పుడు నువ్వు కంటతడి పెట్టరాదు’ అన్నాడు వేటగాడు. షరతులకు అంగీకరించాడు శిబి చక్రవర్తి. వెంటనే ఒక తక్కెడను, తన శరీరం నుంచి మాంసాన్ని కోసేందుకు కత్తిని తెప్పించాడు. గుప్పెడు మాంసం కోసిస్తే పావురం బరువుకు సరిపోతుందనుకున్నాడు. తన కుడితొడ నుంచి గుప్పెడు మాంసం కోసి తక్కెడలోని ఒకవైపు పళ్లెంలో వేశాడు. మరోవైపు పళ్లెంలో పావురాన్ని నిలిపాడు. పావురమే బరువు తూగింది. మరికొంత మాంసాన్ని తీసి వేశాడు. అయినా పావురమే బరువు తూగింది. శిబి చక్రవర్తి తన శరీరంలోని కుడివైపు ఉన్న మాంసమంతా తక్కెడలో వేసేశాడు. అయినా పావురమే బరువు తూగింది. ఇదేదో మాయలా ఉందనుకున్నాడు. అయితే, ఏదైనా కానీ తాను మాత్రం ధర్మానికి కట్టుబడే ఉండాలనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో శిబి చక్రవర్తి ఎడమకంట ఒక కన్నీటి బిందువు ఉబికింది. దానిని చూడగానే వేటగాడు... ‘రాజా! నీవేదో అయిష్టంగా నీ మాంసాన్ని ఇస్తున్నట్లున్నావు. అలాగైతే నీ మాంసం నాకు అక్కర్లేదు. నీ అండలోని పావురాన్ని వదిలేస్తే శుభ్రంగా తినేసి పోతా. నీ శరీరం తిరిగి పూర్వస్థితికి వచ్చేలా చేస్తా’ అన్నాడు.

"ఓ శ్యేనరాజమా! నువ్వు పొరబడుతున్నావు. నీ ఆకలితీర్చే అదృష్టం నా శరీరంలోని కుడిభాగానికి దక్కినందుకు ఎడమభాగం ఆనందంతో పులకిస్తోంది. అందుకే నా ఎడమకన్ను ఆనందబాష్పాన్ని చిందిస్తోంది. నీ ఆకలి తీర్చడానికి నా శరీరంలోని ఎడమభాగం కూడా సిద్ధంగా ఉంది. చూడు! ఎడమభాగంలోని మాంసాన్ని కూడా వేసేస్తాను’ అంటూ మళ్లీ కత్తికి పనిచెప్పాడు. అక్కడ చేరిన అశేష జనవాహిని ఆ దృశ్యాన్ని చూసి హహాకారాలు చేయసాగారు. అప్పటికీ పావురమే బరువుగా ఉండటంతో మహారాజు నిర్వికారమైన చిరునవ్వుతో తన శిరస్సును ఖండించి త్రాసులో ఉంచవలసిందిగా తన సేవకుడిని ఆజ్ఞాపించాడు. రాజసేవకుడు ప్రభువు శిరస్సును ఖండించి త్రాసులో ఉంచాడు. అప్పుడు కపోతంతో సమానంగా త్రాసు తూగింది. దానితో భక్తుని యెడల భగవంతుని శోధన ముగిసింది. శంఖచక్రథారియై శ్రీమహా విష్ణువు, త్రిశూలధారియై ముసిముసినవ్వులతో శంకరుడు, బాణరూపాన్నివీడి చతుర్ముఖుడు ప్రత్యక్షమయ్యారు. శిబి చక్రవర్తి ధర్మనిరతికి, దానగుణానికి సంతోషించిన దేవతలు పూలవాన కురిపించారు. అతని త్యాగశీలతను మెచ్చి దేవతలు అతనిని పునరుజ్జీవితుడిని చేసి వరం కోరుకోమన్నారు. తనకు, తన సమస్త పరివారానికి, ఋత్వికులకు కైలాసప్రాప్తిని కోరాడు శిబి చక్రవర్తి. పరివార సమేతంగా తమందరి శరీరాలు లింగాలుగా కావాలని కోరాడు. తథాస్తు అని ఆశీర్వదించారు త్రిమూర్తులు. అలా తల లేని శిబి మొండెమే కపోతేశ్వర లింగమైందని స్థల పురాణం. కరచరాణాద్యవయవములు లేని శిబి మొండానికి దేవతలందరు ఆకాశగంగా జలంతో అభిషేకం చేశారు. ఆ అభిషేకజలమే ఓంకారణదిగా, ఓగేరుగా చేరుంజర్లలో ప్రవహిస్తోంది.

ఆంథ్ర మహాభారతంలోని అరణ్యపర్వంలో ఈ కథ కన్పిస్తోంది.

బౌద్ధ జాతక కథ: శిబిజాతకం కథ ప్రకారం శిబి చక్రవర్తి తన కన్నులను మారువేషంలో వచ్చిన ఇంద్రునికి దానం చేశాడు. కన్నులను ఇంద్రునికి దానం చేసిన ప్రదేశం కుంట కాబట్టి “కండ్లకుంట” అనే నమాంక్కితం  ఏర్పడినది.

అవసన సతకం కథ ఈ శిబిజాతక కథనూ, మహాభారత కథనూ అనుసంధానిస్తుంది. బౌద్ధ జాతక శిల్పాలలో శిబి కథ తరచు కనిపిస్తుంటుంది.

గ్రామ భౌగోళికం

మార్చు

గ్రామ సమాచారం

మార్చు
  • కండ్లగుంట గ్రామకంఠం వైశాల్యం:- హిందువుల నివాస వైశాల్యం: 18.04 ఎకరాలు (సర్వే నెం: 468), క్రైస్తవులు నివాస వైశాల్యం: 2.04 ఎకరాలు (సర్వే నెం: 479-A), ముస్లింల నివాస వైశాల్యం: 0.27 ఎకరాలు (సర్వే నెం: 469), గ్రామం మొత్తం నివాస వైశాల్యం: 20.35 ఎకరాలు, చెరువు వైశాల్యం: చింతల చెరువు వైశాల్యం: 14.31 ఎకరాలు (సర్వే నెం: 477-B), చింతల చెరువు వైశాల్యం: 0.36 ఎకరాలు (సర్వే నెం: 477-G), చెరువు కుంట వైశాల్యం: 6.68 ఎకరాలు (సర్వే నెం: 470), మొత్తం చెరువు-కుంటల వైశాల్యం: 21.35 ఎకరాలు, పంటపొలాల వైశాల్యం: సాగు వైశాల్యం: 2413.35 ఎకరాలు, పోరంబోకు స్థలం వైశాల్యం: 443.31 ఎకరాలు, మొత్తం మెట్ట-మాగాణి సాగు వైశాల్యం: 2856.66 ఎకరాలు, అసైన్డ్ భూమి వైశాల్యం: 105.74 ఎకరాలు, సభ్యులు: 167 మంది, గ్రామం మొత్తం వ్యవసాయ పొలం వైశాల్యం: 2856.66 ఎకరాలు, వైకుంఠ మహాప్రస్థానం శ్మశానవాటిక వైశాల్యం: హిందూ (OC) వైశాల్యం: 3.93 ఎకరాలు (సర్వే నెం: 479-B2B), హిందూ (SC) వైశాల్యం: 2.74 ఎకరాలు (సర్వే నెం: 480), ముస్లిం వైశాల్యం: 0.15 ఎకరాలు (సర్వే నెం: 365-D2), అక్షాంశాలు, రేఖాంశాలు: 16°20’19.58” N 80°01’16.07” E, సముద్ర మట్టం నుండి ఎత్తు: 106 మీటర్లు లేదా 347.68 అడుగులు

సమీప గ్రామాలు

మార్చు

గ్రామ సరిహద్దులు:- తూర్పు: దమ్మాలపాడు, పడమర: చీమలమర్రి, ఉత్తరం: చాగల్లు, దక్షిణం: రూపనగుంట్ల

అధికారులు, స్థానిక ప్రజల భాష తెలుగు. ఇక్కడి ప్రజలు ప్రధానంగా తెలుగు మాట్లాడుతారు. అయితే ముస్లింలు ఉర్దూలోనూ మాట్లాడతారు. అలానే ఎరుకల వారు ఎరుకల భాషలో మాట్లాడతారు. విద్యారంగంలో మంచి అభివృద్ధిని సాధించడం వలన చాలామంది ఆంగ్ల భాషను కూడా అర్థం చేసుకోగలరు.

వాతావరణo

మార్చు

గ్రామంలో కాలుష్యం చాలా తక్కువగా ఉంటుంది. వేసవిలో కొన్నిసార్లు 45 °C ఉష్ణోగ్రతకు చేరుతుంది. అయితే సాధారణంగా సగటు ఉష్ణోగ్రత 34 °C (93 °F) నుండి 27 °C (81 °F) ఉంటుంది.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

మార్చు

కండ్లగుంట గ్రామానికి నరసరావుపేట డిపొ నుండి నరసరావుపేట-చాగల్లు బస్సు సర్వీసులో కండ్లగుంట చేరుకోవచ్చును, లేదా నరసరావుపేట పల్నాడు బస్టాండ్ నుండి ఆటోలు, వ్యానుల సౌకర్యమూ ఉంది. సత్తెనపల్లి రైల్వే స్టేషన్ నుండి 22.5 కిలోమీటర్ల దూరంలోనూ, నరసరావుపేట రైల్వే స్టేషన్ నుండి 17.5 కిలోమీటర్ల దూరంలోనూ, పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ నుండి 26.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. నరసరావుపేట నుండి గ్రామానికి చేరుకోవడానికి ఊరికి ముఖద్వారంగా ఉన్న సాగర్ కుడి కాలువ వంతెన దాటి రావలెను. సమీప గ్రామాలతో సంబంధాలుండేటట్లుగా మంచి రహదారులు నిర్మించారు. ఐదు వైపుల నుండి రోడ్డు మార్గం ద్వారా ఈ గ్రామానికి సులభంగా చేరుకోవచ్చు.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మార్చు

ఈ ఊరిలో ఏడు ఆంగన్‌వాడీ కేంద్రాలు, నాలుగు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో ఒక ఉన్నత పాఠశాల, మూడు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుతం ఒక ప్రాథమిక పాఠశాల మూసివేయబడింది. ఈ ఊరిలోని బాల బాలికలకు, గర్బవతులకు (ముఖ్యంగా పేద వారి పిల్లలకు, పేద మహిళలకు) పుష్టికరమైన ఆహారం (సంపూర్ణ ఆహారం) అందటంలేదని, వారికి పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో, ప్రభుత్వ పర్యవేక్షణలో ఏడు ఆంగన్‌వాడీ (Anganwadi) కేంద్రాలు ఏర్పాటు చేయబడినవి. గ్రామంలోని అన్ని ఆంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థుల హాజరును పెంచడానికి ఆంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు కలిసి గ్రామంలో అన్ని ఇండ్లకు వెళ్ళి పిల్లలను పంపించేలా అవగాహన కల్పించి, ఆంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యకరంగా ఎదుగుతారన్న విషయాన్ని తల్లిదండ్రులకు తెలుపుతారు.

ప్రాధమిక పాఠశాలలు

మార్చు

మండల పరిషత్ ప్రాథమిక (Z.P) పాఠశాల: ఇది చాలా పురాతనమైన పాఠశాల. విద్య అనేది వ్యక్తి ప్రగతికే కాదు, మొత్తం జాతి నిర్మాణానికి, పురోగతికి పునాది లాంటిదనే భావంతో, అక్షరాస్యతలో అట్టడుగులో ఉన్న గ్రామాన్ని ‘అఆ’లు దిద్దించాలనే సత్ సంకల్పంతో గ్రామంలో ‘మండల పరిషత్ ప్రాధమిక (Z.P) పాఠశాల’ను 1932వ సంవత్సరంలో స్థాపించడం జరిగినది. ఈ పాఠశాలకు R.C No: 55 dated 12-12-1932 UDISE Code No: 28172200701 నంబరుతో సహవిద్యాలయం(కో-ఎడ్యుకేషన్)గా డీఇఓ, గుంటూరు వారు ఉత్తర్వులు జారీ చేసినారు. ఈ ప్రాధమిక పాఠశాలనే 'చిన స్కూలు' అని కూడా అంటారు. ఈ గ్రామంలో ప్రారంభమై, సమీప గ్రామాల నుండి కూడ ఎన్నో మాణిక్యాలని వెలికి తీసింది. పాఠశాల నుండే ఎందరో చదువుకుని ఉన్నత స్థాయిలోకి వచ్చారు. పాఠశాల ఎంతోమంది మేధావులను సమాజానికి అందించింది. విద్యారంగంలో వాసికెక్కిన గ్రామం. ఇప్పటికి ఉపాద్యాయులు అంకితభావంతో భోదిస్తుండడంతో విద్యార్ధులు రాణిస్తున్నారు. పాఠశాలకు ఎంతో ఘనమైన చరిత్ర ఉన్నదని చెప్పుటకు నవ్యాంధ్ర తోలి సభాపతి కోడెల శివప్రసాదరావు ఈ పాఠశాల విద్యార్దే. అలానే గాలి సుబ్బారావు, రావెల సత్యనారాయణ, పోసాని వెంకటేశ్వర్లు, మరెందరో ఉన్నత విద్యనభ్యసించిన ప్రముఖులు అక్షరాలను నేర్చుకున్నది ఈ పాఠశాలలోనే.

మండల పరిషత్ ప్రాధమిక (ఆదివాసీ ఆంధ్ర) పాఠశాల: కదిలేదీ.. కదిలించేది.. పెనుతుపాను సృష్టించేది.. అక్షరం. ఆ అక్షరాలతో అక్షరాస్యతలో అట్టడుగులో ఉన్న గ్రామాన్ని ‘అఆ’లు దిద్దించాలనే సత్ సంకల్పంతో గ్రామంలో ‘మండల పరిషత్ ప్రాధమిక (ఆదివాసీ ఆంధ్ర) పాఠశాల’ను 1918వ సంవత్సరంలో హరిజనవాడలో స్థాపించడం జరిగినది. ఈ పాఠశాల గుర్తింపుకై R.C No: 28 dated 18-01-1918 UDISE Code No: 28172200702 నంబరుతో సహవిద్యాలయం(కో-ఎడ్యుకేషన్)గా డీఇఓ, గుంటూరు వారు ఉత్తర్వులు జారీ చేసినారు. ఎస్సీ (హరిజనవాడ) కాలనీలోని నిరుపేద విద్యార్థులకు కూడా నాణ్యమైన డిజిటల్ విద్యను అందించాలనే భావంతో మండల ప్రజా పరిషత్ (ఎఎ) పాఠశాలలో డిజిటల్ తరగతుల నిమిత్తం కంప్యూటర్ తో పాటు స్పీకర్స్, టీవీ ఏర్పాటు చేయడం జరిగింది.

జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల

మార్చు
 
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గేటు
 
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

పూర్వం “కండ్లగుంట” గ్రామంలో విద్యాబోధనకై ఏవిధమైన సౌకర్యాలు ఉండేవి కావు. కేవలం ఒక ప్రాథమిక పాఠశాల తప్ప వేరేదేదీ ఉండేది కాదు. ఈ స్ధాయిలోనే 1980వ సంవత్సరం వరకూ చాలా మంది తమ చదువులను ముగించుకోవడం జరిగేది. కొద్ది మంది మాత్రమే సమీపంలో ఉండే నగరాలలో తమ ఉన్నత విద్యనభ్యసించడానికి వెళ్ళేవారు. దూర ప్రాంతాలకు వెళ్లి విద్యను అభ్యసించడం ఎంత కష్టమో భావించి, ఊరిలోనే పైచదువుల కొరకు ఓ పాఠశాలను ఏర్పాటు చేయాలనే తలంపుతో, పాఠశాలను వారి శక్తిమేరకు వీలైనంత ఉన్నతమైన స్ధాయిలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేపట్టారు. గ్రామపెద్దలు, సంబంధిత రాజకీయ నాయకులతోనూ, ప్రభుత్వ అధికారులతోనూ కలసికట్టుగా కృషిచేసి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను (జెడ్.పి.పి.హెచ్) నెలకొల్పడంలో విజయం సాధించారు. 1982-83 విద్యాసంవత్సరంలో 8వ తరగతిని మొదటి బ్యాచ్ 27 మంది విద్యార్థులతో ప్రారంభమై, 9వ తరగతి, 10వ తరగతులను కూడా వరుసగా తరువాత సంవత్సరంలలో ప్రవేశపెట్టడం జరిగింది.

ఫలితంగా గ్రామంలో పాఠశాల నిర్మాణానికి కాలసిన భూమిని జంపని చిన్నబ్బాయి, 'నిరక్షరాస్యత రూపుమాపాలనే ఉద్దేశంతో' సుమారుగా 3.5 ఎకరాలను శాశ్విత భవనాలు నిర్మించుట, క్రీడా మైదానాలను ఏర్పరుచుట కొరకు భూమిని దానం చేయడం జరిగింది. ఈ గ్రామం అంతగా అభివృధ్ది పొందినది కాకపోయినా, ఉన్నత పాఠశాల భవనాలను, వాటితో పాటుగా మంచి మౌలికసదుపాయాలు కల్పించి విద్యాబోధనకు అనుకూలమైన, సౌకర్యాలున్న పాఠశాలగా ప్రభుత్వ నిధులతో ఉన్నత పాఠశాల రూపుదిద్దుకున్నది. అదేవిధంగా సర్వ శిక్షా అభియాన్ అనేది 6–14 సంవత్సరాల మధ్య వయస్సున్న బాలలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను ఒక ప్రాథమిక హక్కుగా మార్చిన పథకం. ఈ పథకంలో భాగంగా పాఠశాలలో మరొక బిల్డింగ్ స్థాపించడం జరిగింది. ఈ ఊరి పాఠశాలలో ప్రయోగశాలను ఏర్పాటుచేయడం, కంప్యూటర్లను ఏర్పాటుచేయడం కూడా జరిగింది.

తదుపరి కాలంలో కండ్లగుంట గ్రామంలోని పాఠశాల, చాగల్లు, చీమలమర్రి, దేచవరం, రూపెనగుంట్ల గ్రామాలకు కూడా ఓ విద్యాకేంద్రంగా భాసిల్లుచున్నది. కేవలం తెలుగు మీడియంతో ప్రారంభమైన పాఠశాలలో ఇప్పుడు ఇంగ్లీషు మీడియంలో అత్యుత్తమ ఉన్నత విద్యార్హతలతో కూడిన నిష్ఠాతులయిన ఉపాధ్యాయులతో అభివృద్ధి చెందుతూ ఉంది.

  • ఉన్నత పాఠశాలకు సంబంధించిన ప్రభుత్వం భూమి వివరాలు:- పట్టా పాసుపుస్తకం ఖాతా నంబరు: 20001602, సర్వే నంబరు: 478 కింద 5.74 ఎకరాలు, సర్వే నంబరు: 479_B2A కింద 1.84 ఎకరాలు. రిజిస్టర్ కాబడిన మొత్తం భూమి: 5.74+1.84= 7 ఎకరాలు 58 సెంట్లు.
  • ఉన్నత పాఠశాల మంజూరు ఉత్తర్వులు సంఖ్య:
  • ఉన్నత పాఠశాల ప్రారంభించిన తేది:
  • ఉన్నత పాఠశాల మొదటి ప్రధానోపాధ్యాయులు:బద్ధుల రాఘవయ్య.
  • ప్రస్తుతం పాఠశాలలో చదువుచున్న విద్యార్థుల సంఖ్య:- బాలురు: 200 (రెండువందలు), బాలికలు: 177 (నూట డెబ్బైఏడు). మొత్తం: 377 (మూడు వందల డెబ్బైఏడు)
  • S.C, S.T, B.C, డ్వాక్రా మహిళల పిల్లలకు స్కాలర్ షిప్ సౌకర్యం. ఉచిత పుస్తకాల పంపిణి.
  • మధ్యాహ్నభోజన వసతి, ఉచిత కంప్యూటర్ శిక్షణ, గ్రంథాలయ సౌకర్యం, ప్రయోగశాల ద్వారా సైన్సు విద్యాబోధన, మానసిక-శారీరిక దారుడ్యం కొరకు ఆటలు, మానసిక వికాసం కలుగుటకు క్విజ్, డిబేట్ లాంటి కార్యక్రమాలు జరుగును.
  • ఉచిత APSRTC బస్సు సౌకర్యం ( బాలికలకు మాత్రమే)

గ్రామంలోని మౌలిక వసతులు

మార్చు

రక్షిత మంచినీటి పథకం

మార్చు
 
ఉచిత మంచినీటి పథకం
  • కండ్లగుంట గ్రామ బొడ్డురాయి ఎదురుగా తమ స్వంత స్థలంలో దాత రావెల సత్యనారాయణ అందరికి మంచి ఆరోగ్యం మంచినీళ్లతోనే అనే భావంతో శుద్ధమైన మంచినీళ్ళను తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం "రావెల సైదయ్య, హనుమాయమ్మ గార్ల ఉచిత మంచినీటి పథకం"ను, తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో శుద్ధజల కేంద్రాన్ని ఏర్పాటుచేసి ఊరందరి దాహార్తిని తీరుస్తూ, ప్రతినెల దానికయ్యే ఖర్చులను, వేతనాలను సమకూరుస్తున్నారు.
  • కండ్లగుంట గ్రామ వినాయకుడి గుడి వద్ద 'కోడెల సత్యనారాయణ చారిటబుల్‌ ట్రస్ట్‌' ద్వారా స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు, పౌరసరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జి.వి.వి. అంజనేయుల గార్ల చేతుల మీదుగా 2015, సెప్టెంబర్-23న గ్రామంలో స్వర్గీయ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు, కోడెల సంజీవయ్య, డాక్టర్‌ కోడెల సత్యనారాయణ విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా విచ్చేసి, ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా, గ్రామీణ ప్రాంతాల వారికి స్వచ్ఛమైన, శుద్ధిచేసిన 20 లీటర్ల మంచినీటిని రెండు రూపాయలకే అందించుచున్నారు. ఈ పథకానికి కావలసిన షెడ్డు, యంత్ర పరికరాలను, AMG India International సహకారంతో సుమారు ఏడు లక్షలు రూపాయల వ్యయంతో వాటర్ ప్లాంట్ నిర్మించారు. గ్రామ పంచాయతీ ద్వారా దీనికి కావలసిన స్థలాన్ని సమకూర్చారు..

వైద్య సౌకర్యం

మార్చు

పశువుల వైద్యం నిమిత్తం ప్రభుత్వం వారి పశు వైద్యశాల కూడా ఈ గ్రామంలో ఉంది.

విద్యుత్తు సౌకర్యం

మార్చు

నాలుగు పెద్ద ట్రాన్సఫార్మరులతో విద్యుత్ సౌకర్యం కలదు. ఊరంతా విద్యుత్ స్తంబాలకు దీపాలు, ఈ ఊరి నాగార్జునసాగర్ కెనాల్ మీద మూడు జల విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి జరుగుచున్నది. ఈ గ్రామంలో 33/11 కె.వి విద్యుత్తు ఉపకేంద్రం ఉన్నది.

  • విద్యుత్ సౌకర్యం గల కుటుంబాల సంఖ్య: 974
  • విద్యుత్ సౌకర్యం లేని కుటుంబాల సంఖ్య: 24

మీ-సేవ కేంద్రం

మార్చు

కండ్లగుంట గ్రామ ప్రజలకు నేరుగా సేవలందించాలన్న లక్ష్యంతో రామలయానికి ఎదురుగా శ్రీ రామాంజనేయ ‘మీ-సేవ’ కేంద్రాన్ని ప్రభుత్వ అనుమతితో మొగిలి వీరాంజనేయులు (సి.యస్.సి. ఆథరైజ్డ్ సెంటర్ నంబర్: APOPR02785 dated 12-04-2014) స్వహస్తాలతో ప్రారంభించారు. మీ-సేవా కేంద్రంలో కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, జిరాక్స్, ఇంటర్నెట్ సౌకర్యంతో నెలకొల్పారు. మీసేవ ద్వారా రెవెన్యూ, పురపాలక, రవాణా, పౌర సరఫరాలు, ఆధార్‌, ఎన్నికలు, విద్య, వ్యవసాయ, కార్మిక, సాంఘిక సంక్షేమ, జనన-మరణ సర్టిఫికెట్లు, వాణిజ్య, పారిశ్రామిక, విద్యుత్‌ శాఖ బిల్లులు, భూగర్భగనుల శాఖలకు చెందిన సేవలను ఇక్కడ పొందవచ్చు. ‘మీ-సేవ’కు అనేక సేవల కోసం వచ్చే వినియోగదారుల నుంచి ధరల పట్టికలో నిర్దేశించిన రుసుము మాత్రమే వసూలు చేస్తూ, పూర్తి పారదర్శకతతో సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు ఎలాంటి అదనపు రుసుమూ వసూలు చేయడం లేదు.

  • మీ-సేవ కేంద్రం ప్రతి రోజూ ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 8గంటల వరకు తెరచి ఉంటుంది. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు మాత్రమే భోజన విరామం సమయం. ఆదివారం, ప్రభుత్వ సెలవుల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు తెరచి ఉంటుంది.
  • మీ-సేవ కేంద్రం ఫొన్ నంబరు: +91 9866552512.

తపాలా సౌకర్యం

మార్చు

ఈ ఊరిలోని తపాల శాఖ ద్వారా రికరింగ్ డిపాజిట్లు, పోస్టల్ సేవింగ్స్ ఖాతాలు, ఇన్సూరెన్స్ పాలసీలు, ఉపాధి హామీ పథకం పేమెంట్లు, సేవింగ్ ఖాతాలు, మనీ ఆర్డర్లు చేయబడుచున్నవి. కండ్లగుంట గ్రామ తపాలాశాఖకు సబ్ ఆఫీస్ రావిపాడు గాను, హెడ్ ఆఫీస్ నరసరావుపేట గాను ఉంది.

జాతీయ బ్యాంకు

మార్చు
 
సెంట్రల్ బ్యాంకు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:- కండ్లగుంట-చాగల్లు రహదారి మీద పాలకేంద్రం బిల్డింగ్ లో, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియ శాఖా కార్యాలయాన్ని 1989, ఫిబ్రవరి-10వ తేదీనాడు కోడెల శివప్రసాదరావు, A.P.V.N శర్మ గార్ల చేతుల మీదుగా ప్రారంభించిబడింది. గ్రామీణ ప్రాంతాలలోని బడుగులకు చేయూతనిచ్చేలా ఉండాలనే ఉద్దేశంతో ఈ బ్యాంకు స్థాపించడం జరిగింది. ఈ బ్యాంకు ద్వారా అన్నిరకాల లోన్స్ ఇవ్వబడుచున్నవి. చుట్టుప్రక్కల గ్రామీణ రైతులకు పంట రుణాలు, ఇతర రుణాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. పంట భూములు తాకట్టు పెట్టి, బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందుటకు రైతులకు సౌకర్యం ఉంది. బ్యాంకు అంతర్జాలంతో అనుసంధానించబడింది. గ్రామంలో ATM సౌకర్యం ఉంది.

  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కండ్లగుంట బ్రాంచ్ ఫొన్ నంబరు:- 08647-246225 సెల్ నంబరు:- 8886391188
  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కండ్లగుంట బ్రాంచ్ IFSC Code: CBIN0282805[1]
 
శ్రీ  రావెల సైదయ్య హనుమాయమ్మ గార్ల  కళ్యాణమండపం

కండ్లగుంటలో కళ్యాణమండపం

మార్చు

ఈ గ్రామస్థుడు రావెల సత్యనారాయణ కళ్యాణ మండపాన్ని నిర్మించారు. 2014 జనవరి 15వ తేదీన “పల్లెకు పోదాం రా.” ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కళ్యాణమండపం పునఃనిర్మాణ బాధ్యత నాదే అని రావెల సత్యనారాయణ ప్రకటించి, సిమెంటు స్త్రక్చర్ గా ఉన్న మండపాన్ని గేటులు, కిటికీలు, ఫాన్లు, విద్యుత్తు లైటులు,జనరేటర్ సౌకర్యం, రంగులు, డైనింగ్ హాలుకు కావలసిన సామాను, వంటగది, పసందైన వంటకాలను తయారు చేసుకొనుటకు వంటసామగ్రితో సహా సర్వాంగ సుందరంగా సకల సౌకర్యాలతో అత్యంత విశాలమైన కళ్యాణమండపానికి కావలసినంత స్థలం దానం చేయడమే కాకుండా, నేతిచెంబు, పెళ్ళి పీటలు లాంటి ప్రతి చిన్న అవసరాన్ని గుర్తించి ఎంతో ఉన్నతమైన ఆలోచనలతో పునఃనిర్మించారు.గ్రామంలోని ప్రతి పేదవాడు శుభాకార్యాన్ని అంగరంగ వైభవంగా వివాహ మహోత్సవాన్ని జరుపుకొనుటకు కావలసిన సకల సౌకర్యాలను సమకూర్చాడు.బయట సరుకులు మాత్రమే తెచ్చుకుంటే చాలు, మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోనేంత సౌకర్యాలతో ఇతను గ్రామానికి అంకితం చేసిన కళ్యాణమండపం కండ్లగుంటకు లభించిన గొప్ప ఆస్థి. నవ్యాంధ్ర ప్రదేశ్ కు మొట్టమొదటి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేతులమీదుగా 2016, జనవరి-15న రావెల సత్యనారాయణ గ్రామ ప్రజలకు అంకితం చేసారు.

కండ్లగుంటలో గ్రామ కచేరి

మార్చు

గ్రామ ప్రజలందరికి సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకొనుటకు వేదికగా రావెల సత్యనారాయణ తండ్రి జ్ఞాపకార్థంగా 'రావెల సైదయ్య గారి గ్రామ కచేరి'ని సుమారు పది లక్షలు రూపాయల వ్యయంతో నిర్మించి గ్రామానికి అంకితమిచ్చారు

 
వైకుంఠ మహాప్రస్థానం

కండ్లగుంటలో వైకుంఠ మహాప్రస్థానం శ్మశానవాటిక

మార్చు

వందల సంవత్సరాలుగా మురుగుకుంటో, మరుగుదొడ్డో, శ్మశానమో గుర్తుపట్టలేనంతగా ఉండే ఊరి శ్మశానవాటిక కనీస సౌకర్యాలు ఉంటే బావుంటుంది అనుకునేవారు పెమ్మసాని బ్రహ్మయ్య. శ్మశానవాటిక నిర్మాణానికి 2014 జనవరి 15వ తేదీన “పల్లెకు పోదాం రా..” ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో బ్రహ్మయ్య అతని సంకల్పాన్ని ప్రకటించారు. అందమైన స్వాగత తోరణం నుంచి లోపలికి అడుగు పెట్టగానే వినాయకుడు, బ్రహ్మ-విష్ణు-మహేశ్వరుడు, సత్యహరిశ్చంద్రుని విగ్రహాలు, స్నానాలు చేయడానికి ప్రత్యేక గదులు, వేచి ఉండడానికి విశాలమైన ప్రాంగణం, కాటికాపరికి ప్రత్యేక గది, ఫాన్లు, విద్యుత్తు లైటులు, అందమైన రోడ్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని మొక్కలతో ఓ అద్భుతమైన హరితవనంలాగా తీర్చిదిద్ది, అంత్యక్రియలకు అవసరమైన సకల సదుపాయాలతో అత్యుత్తమ కళాత్మకమైన 'వైకుంఠ మహాప్రస్థానం శ్మశానవాటిక’ను బ్రహ్మయ్య నిర్మించాడు.ఆంధ్ర ప్రదేశ్ కు మొట్టమొదటి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, గుంటూరు కొత్తపేట సి.ఐ. దిరిసైల వెంకన్నచౌదరి చేతులమీదుగా 2016, జనవరి-15న గ్రామ ప్రజలకు అంకితం చేసారు.

ధర్మ సత్రం

మార్చు

చెరుకూరి వారి వంశస్థులు 1835 లో కట్టించారు.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

మార్చు

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

కండ్లగుంటలోని ఉన్నత పాఠశాలలో ఒక పెద్ద మంచినీళ్ళ బావి ఉంది. ఇది దాదాపు 150 సంవత్సరాలుగా ఊరందరి గొంతు తడుపు చున్నది. గ్రామంలో రెండు పెద్ద చెరువులు కూడా ఉన్నాయి. వీటి కింద కొన్ని వందల ఎకరాల ఆయకట్టు సాగు అవుచున్నది. గుంటూరు బ్రాంచి కెనాల్ గా పిలువబడే నాగార్జునసాగర్ కుడి కాలువ నేరుగా గ్రామం నుంచే వెళ్తోంది. కండ్లగుంట గ్రామస్తుల ప్రధాన జీవనాదారం వ్యవసాయం. వరి ప్రధాన పంట. వరి, మొక్కజొన్న, మిరప, పత్తి ప్రధాన పంటలగాను.. మినుము, పెసర, కంది అంతర పంటలగాను ప్రత్యేక గుర్తింపు ఉంది. ఊరి మీదగా ప్రవహిస్తున్న నాగార్జునసాగర్ కుడి కాలువ కారణంగా గ్రామంలోని మెట్ట ప్రాంతాలలో సైతం రైతులు పంటలు సాగు చేస్తూ మెరుగైన దిగుబడులు సాధిస్తున్నారు. వాణిజ్య పంటలు కూడా కండ్లగుంటలో సాగవుతున్నాయి.

  • చెరువు వైశాల్యం: చింతల చెరువు వైశాల్యం: 14.31 ఎకరాలు (సర్వే నెం: 477-B), చింతల చెరువు వైశాల్యం: 0.36 ఎకరాలు (సర్వే నెం: 477-G), చెరువు కుంట వైశాల్యం: 6.68 ఎకరాలు (సర్వే నెం: 470), మొత్తం చెరువు-కుంటల వైశాల్యం: 21.35 ఎకరాలు, పంట పొలాల వైశాల్యం: సాగు వైశాల్యం: 2413.35 ఎకరాలు, పోరంబోకు స్థలం వైశాల్యం: 443.31 ఎకరాలు, మొత్తం మెట్ట-మాగాణి సాగు వైశాల్యం: 2856.66 ఎకరాలు / అసైన్డ్ స్థలం వైశాల్యం: 105.74 ఎకరాలు, సభ్యులు: 167 మంది / గ్రామం మొత్తం వ్యవసాయ పొలం వైశాల్యం: 2856.66 ఎకరాలు

గ్రామ ప్రధాన పంటలు: వరి, పత్తి, మొక్కజొన్న, మిరప

గ్రామ అంతర పంటలు: కందులు, మినుము, పెసర

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

ఈ గ్రామానికి ప్రధాన ఆధారం, ఆదాయం, వృత్తి అన్నీ వ్యవసాయమే. కొందరు వారికి సాయం చేసి కూలీ అనిపించుకుంటారు, మరి కొందరు వ్యవసాయ ఆధారిథ పనులు చేస్తారు, ఇంకొందరు పశువుల ద్వారా పాల ఉత్పతిని పెంచి ఆదాయాన్ని పొందుతారు. ఈ పాలు కొనుక్కోవడానికి పాల సరఫరా సహకార సంఘం వారు, కొన్ని ప్రైవేటు డైరీలు, ప్రైవేటు వ్యక్తులు వస్తుంటారు. ఈ ఊరిలో అనేక కులాలకు చెందిన వారు ఉన్నారు. వారిలో కమ్మ, యాదవులు (గొల్లలు), రజక (చాకలి), కుమ్మరి, ఎరుకల, యానాది, మాదిగ, మాల, వడ్డెర, కంసాలి, బ్రాహ్మణులు, వైశ్య కులస్థుల వారు ఉన్నారు. వీరిలో కమ్మ, యాదవులు, మాదిగ మొదలగు కులస్తుల జనాభా ఎక్కువ. ఈ గ్రామంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ మతాలకు చెందిన వారు ఉన్నారు. అందరూ ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధాపపడి జీవిస్తున్నారు. ప్రాచీన గ్రామీణ వ్యవస్థ లాగే ఇక్కడ గోల్లలు గొర్రెల/మేకల పెంపకం/పోషణను, రజకులు బట్టలుతకడం, కోమట్లు హోటల్స్-చిల్లర దుకాణాలు, కుమ్మరోళ్ళు కుండలపని, కంసాలి వాళ్ళు వ్యవసాయానికి సంబంధించిన వడ్రంగి పని, బ్రాహ్మణులు అర్చకులుగా, ఇలా వారి వారి కులవృత్తిలను చేసుకుంటూ కొద్దిపాటి వ్యవసాయం కూడా చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తునారు. మిగిలిన కులాల వారు ఎక్కువ శాతం వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. మరి కొందరు మేస్త్రీ పని,హమాలి పని, కరెంట్ పని, డ్రైవింగ్ వృత్తిగా ఎంచుకుని సొంత ఆటోల ద్వారా కొందరు, దర్జీ పనిలో మరి కొందరు, ఉపాద్యాయ వృత్తిలో ఇలా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఊరి యువత ఎక్కవ సంఖ్యలో వృత్తి నైపుణ్యం ఉన్న రంగాలవైపే మొగ్గు చూపుతున్నారు. నేటితరం యువత పెద్ద ఎత్తున విద్యాబ్యాసం చేసిన వారు మాత్రం మంచి వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు, పడుతున్నారు. ఎక్కువగా యువత చదువులకోసం, ఉద్యోగాల కోసం గ్రామాన్ని విడిచి వలసలు పోతున్నారు.యువత కూడా రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు.

గ్రామంలో సాగునీటికి కొంతమంది ఊరికి ఈశాన్యంలో ఉన్న చెరువు మీదే ఎక్కువగా ఆధారపడతారు. ఎక్కువ మంది సాగర్బా కాలువ, బావుల మీద ఆధారపడతారు. ఈ చెరువు చుట్టుపక్కల గ్రామాల చెరువుల్లో కల్లా పెద్ద చెరువు. వర్షాకాలంలో పై నుంచి పారే నీటిని చెరువులోకి మళ్ళిస్తారు. దీనికి చుట్టూ చెరువు కట్టడం ఉంది. ఒక వేళ చెరువు నిండి పోతే అదనపు నీటిని విడుదల చేయడానికి రెండు తూములు ఉన్నాయి. చెరువులో రజకులు చేపలు పట్టుకోవడానికి గ్రామ పంచాయితీ ప్రతి సంవత్సరం వేలం నిర్వహిస్తుంది. అందులో పాడుకున్న వాళ్ళు మాత్రమే ఆ సంవత్సరం చేపలు పట్టి అమ్ముకోవడానికి అర్హులు.

గ్రామంలో మూడు బియ్యం మరలు (రైస్ మిల్లులు) ఉన్నాయి. చాలా మంది గ్రామస్థులు బియ్యం ఇక్కడే మరాడించుకుని వెళుతుంటారు. కొద్ది మంది తమ పంటను ఈ ఊరికోచ్చే వ్యాపారస్తులకు అమ్మి సొమ్ము చేసుకుంటుంటారు. వ్యవసాయానికి ఎక్కువగా ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు వాడతారు. దాదాపు ప్రతీ ఇంటిలోనూ పాడి సంపద ఉండటం వల వాటి వ్యర్థాలను తమ పంట పొలాలను ఎరువుగా వాడుకుంటారు.

నెంబరు. Z 121 ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్

మార్చు

వ్యవసాయం చెరువుల క్రింద, నాగార్జునసాగర్ కాలువల క్రింద సాగుచేయడం జరుగుతుంది. వ్యవసాయానికి ఆర్థిక సహాయనిమిత్తం గ్రామంలో నెంబరు. Z 121 చీమలమర్రి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్, గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు తమ సేవలను అందిస్తున్నాయి. రైతులకు సబ్సీడితో మందుకట్టలు, పంట రుణాలు అందించుచున్నారు. ఆఫీసు కొరకు, మందుకట్టలు నిల్వచేసుకునే నిమిత్తం పి.ఎ.సి.ఎస్.లో గోదాము సౌకర్యం ఉంది. గోదాము నిర్మాణానికి అలపర్తి రత్తమ్మ-అచ్చయ్య గార్ల కుమార్తె చిగురుపాటి ఆది లక్ష్మమ్మ- నాగేశ్వరరావు గార్ల కుమార్తె అంజనీదేవి స్థలదానం చేయడమైనది. గోదాము నిర్మాణానికి నల్లపాటి శివరామ చంద్రశేఖర్ రావు, D.C.C.B చైర్మన్, వట్టికుంట వెంకటేశ్వర్లు, P.A.C.S. అధ్యక్షులు చేసిన కృషి అభినందనీయం.

  • ప్రస్తుత అధ్యక్షులు: గంగవరపు నాగేశ్వరరావు || ఫోన్ నంబరు: 9533441884 * చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్: పూదోట అంతయ్య || ఫోన్ నంబరు: 9908200712

పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం

మార్చు

ఈ గ్రామంలోని పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం 1980లో గ్రామ ప్రజల సమష్టి కృషితో స్థాపించబడింది. ఈ సంఘం 35 సంవత్సరాలుగా, లాభాలబాటలో పయనించుచున్నది. అప్పటినుండి రైతులకు అన్నివిధాలుగా వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఏటా క్రమం తప్పకుండా డివిడెండు అందజేస్తున్నది. అప్పట్లో గ్రామం నడిబొడ్డున 4 సెంట్ల స్థలాన్ని కొని అందులో రూ.3.5 లక్షలతో భవనాన్ని నిర్మించారు. అందులోని సగబాగాన్ని సెంట్రల్ బ్యాంకుకి అద్దెకు ఇచ్చారు. ప్రస్తుతం ఈ పాలకేంద్రంలో 430 మంది సభ్యులుగా ఉన్నారు. రోజువారీ పాలసేకరణ 700 లీటర్లకు చేరినది. ఈ డెయిరీకి పాలు పోసే రైతులకు అదనపు ప్రోత్సాహం అందించడం జరుగుతుంది. కంప్యూటర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో కంప్యూటరు ద్వారా వెన్నశాతం రీడింగు, పాల పరిమాణం నిర్ధారణ చేస్తున్నారు. నెలకు మూడుసార్లు చెల్లింపులు చేస్తున్నారు. ఉత్తమమైన నిర్వహణ ద్వారా పశుపోషకులకు చాలా మేలు జరుగుచున్నది. పశువుల బీమా పథకం అమలు చేస్తున్నారు. పశువుల దాణా వగైరాలు ప్రభుత్వ ధరలకే అందించుచున్నారు. ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహించుచున్నారు. పశువులకు సమతుల్యాహారం అందించడంలో సహాయపడుచున్నారు. దేశవాళీ మరియూ ఫారం గేదెలలో పాల ఉత్పత్తి పెరుగుదలపై, పాలలో వెన్న శాతం పెంచేటందుకు పశువులకు అందించవలసిన పోషకాహారం గురించి, వీరు రైతులకు పలు సూచనలు చేసారు. శాస్త్రీయ పద్ధతులలో పశుపోషణకై అవగాహన సదస్సులు నిర్వహించుచున్నారు. గ్రామంలోని ఈ పాలకేంద్రం, జిల్లాలోనే ఉత్తమ కేంద్రాలలో ఒకటిగా పేరుపొందినది.

గ్రామ పంచాయితీ

మార్చు
  • దేశ స్వాతంత్ర్య సముపార్జన తరువాత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి. ప్రజల అవసరాలను తీర్చడానికై పంచాయితీరాజ్ వ్యవస్థ ఏర్పడింది. దాని పర్యవసానంగా మన గ్రామానికి కూడా గ్రామ పంచాయితీ ఏర్పడింది. ఈ గ్రామంలో, 1975 నుండి తొలి అధ్యక్ష పాలన ప్రారంభమైంది. సర్పంచిని గ్రామస్థులంతా కలిసి ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. అందరూ కలసి నిర్ణయం తీసుకొని గ్రామ ఉన్నతికి కృషిచేస్తున్నారు. గ్రామంలో అన్ని వర్గాల ప్రజలకూ మౌలిక వసతులు సమకూరినవి. దాదాపుగా అన్ని వీధులలోనూ సిమెంటు రహదారులను సుందరంగా తీర్చిదిద్దారు. గ్రామంలోని పాఠశాలలను, కార్పొరేటు పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేసి, తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పాటుపడుచున్నారు. తొలుత ఈ గ్రామసర్పంచిగా దానియేలును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కంఠంనేని కోటయ్య, పమిడి రామయ్య, గాడిపర్తి శాయమ్మ, బద్ధుల రాధిక, యాసారపు జాను, పి.రాములు, గర్నెపూడి ఆనందరావు గ్రామ ప్రథమపౌరులుగా కొనసాగారు. కాని పార్టీ కక్షల కారణంగా 2013 విడదీయుట జరిగింది. నాటి నుండి నేటి వరకు సర్పంచులు, స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గ్రామాభివృద్ధి జరిగింది. ఈ గ్రామం రాజకీయపరంగా, విద్యాపరంగా, వ్యవసాయపరంగానూ చైతన్యవంతమైనది.
  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయితీకి జరిగిన ఎన్నికలలో, పమిడి రామయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. తరువాత ఇతను నకరికల్లు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా ఎన్నికైనారు.
  • నూతన ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడిన తరువాత మొట్ట మొదటి శాసన స్పీకర్ గా ఏన్నికైన కోడెల శివ ప్రసాద రావు స్వగ్రామం ఇదే.1983 నుండి ఎం.ఎల్.ఎ కొనసాగుచున్నారు.స్వంత గ్రామం అయినందున సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. గ్రామంలో 90% సిమెంటు రహదారులు నిర్మించారు.
  • సంపూర్ణ పారిశుద్ధ్య ఉద్యమానికి సత్తెనపల్లి శాసనసభ్యుడు, సభాపతి కోడెల శివప్రసాదరావు శ్రీకారంతో స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద తక్కువ కాలవ్యవధిలో ఈ ఊరి ప్రజలు స్వచ్ఛందంగా తమంతట తామే ఇంటింటికీ మరుగుదొడ్లును నిర్మించుకొని స్వచ్ఛభారత్ మిషన్ ను 100% అమలు చేయడంలో ఆదర్శంగా నిలిచారు. గ్రామంలోనూ వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాన్ని చేపట్టారు.గ్రామాభివృద్ధిలో కోడెల, ప్రజల సహకారం మరువలేనిది. పార్టీలకతీతతంగా అందరూ ముందుకొచ్చి ప్రగతిలో భాగస్వాములయ్యారు.

నీరు-చెట్టు పథకం క్రింద 2015,ఆగస్టు-14వ తేదీనాడు, ఈ చెరువులో పూడికతీత కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెరువులోని సారవంతమైన మట్టిని గ్రామంలోని ఉన్నత పాఠశాలలోని క్రీడా మైదానాలను ఏర్పరుచుట కొరకు ‘కండ్లగుంట విలేజ్ ఫౌండేషన్’ వారి సహాయ సహకారాలతో సుమారుగా 3000 ట్రక్కుల మట్టితో చదునుచేసుకొని వివిధ క్రీడా కోర్టులను ఏర్పరచుకోవడం జరిగింది.

గ్రామంలోని దేవాలయాలు

మార్చు
 
శ్రీ బాలవినాయకుని గుడి

శ్రీ బాలవినాయకుడి గుడి

మార్చు

గ్రామంలో వేంసేసియున్నటువంటి బాలవినాయకుని గుడి 1968వ సంవత్సరం గుంటుపల్లి సుబ్బమ్మ గారి కోరిక మేరకు జంపని పెద రాఘవయ్య గారు ప్రతిష్ఠ జరిపినారు. నిత్య దూప, దీప నైవేద్యాలు, ఉత్సవాలు జరుపుట కొరకు కొంత మాన్యం, కొంత డబ్బు ఇచ్చారు. ఈ గుడి నిర్మాణంలో జంపని శేషయ్య విశేష కృషి చేసి, ‘ఉడతాభక్తి’గా ఇప్పటికీ స్వామివారికి సేవలందిస్తున్నారు. ఈ ప్రతిష్ఠ కార్యక్రమంలో గుంటుపల్లి, కంఠమనేని, జంపని వంశస్తులూ పాల్గొని గుడి నిర్మాణంలో భాగాస్వాములైనారు.

ఈ గుడికి వెనుకవైపు వేప చెట్టు గుబురుగా కనిపిస్తుంది. ఈ వేపచెట్టును బండ్లమూడి వెంకట్రామయ్య గ్రామ ప్రజలు ఖాళీ సమయంలో విశ్రాంతి తీసుకొనుటకు సిమెంటు అరుగు, తాటాకులు, వెదురు కర్రలతో కప్పును తమ స్వంత ఖర్చుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేప చెట్టు గుబురుగా ఉండటంతో చల్లటి ఆహ్లాదాన్నిస్తుంది. గ్రామస్థులు, ప్రయాణికులు ఏ మాత్రం ఖాళీ ఉన్నా ఈ చెట్టు నీడలో సేదదీరుతారు. వేసవిలో ఖాళీ ఉండకుండా ఇదే అరుగు మీద గ్రామీణ ఇండోర్ ఆటలు ఆడుకుంటూ కాలక్షేపం చేస్తారు. ఊరిలో ఏమూలకెళ్లినా పలానా చెట్టు ఎక్కడ అంటే టక్కున చెప్పేస్తారు. దీనినే వినాయకుని గుడి సెంటర్ అంటారు. పూర్వం ఈ ప్రాంతాన్ని యర్రం వాళ్ళ బావి అనేవారని ఊరి పెద్దలు చెప్తారు.

బొడ్డురాయి (నాభిశిల)

మార్చు

కలరా మసూచి మొదలగు సంక్రమిక సాంఘిక వ్వ్యాధులు, పశువ్యాధులు సోకకుండా ఉండేందుకు గ్రామవాసులు పూజించుటకై నిలువున నాటిన పెద్దరాయి. బొడ్డురాయికి పూజలు చేయడంతో వ్యాధులన్ని నయమైనట్లు పూర్వికుల నమ్మకం. ఇది మహాలక్ష్మి అంశమైన శీతల దేవత ప్రతికృతిగా గ్రామ మద్యమున నెలకొల్పిన శిల. గ్రామ నడిబొడ్డున అరుగువలే అమర్చిన పెద్దబండ. గ్రామ నడిబొడ్డున అరుగువలే అమర్చిన పెద్దబండనే బొడ్రాయిగా రూపాంతరము చెంది, ఈ గ్రామములో బొడ్రాయిగా లేదా బొడ్డురాయి లేదా నాభిశిలగా పిలిచెదరు. గ్రామమున అరిష్టము లేర్పడినప్పుడు కుమ్మరులు గ్రామప్రజల పక్షమును యీ రాతిని పూజించి, వడపప్పు పానకములను పంచిపెట్టుదురు. కాని గ్రామంలో అందరూ ఆదరిస్తారు. గ్రామంలో ఏ శుభకార్యం చేయాలన్న "బొడ్డురాయి"ని మొదట దర్శించాలి. గ్రామంలో జరిగే పెళ్ళి లాంటి శుభకార్యాలన్నింటిలోనూ ఈ రాయి దగ్గరకు వచ్చి పూజాదులు చేసి వెళ్లుదురు. "నా చుట్టే పల్లె మొత్తం వెల్లివిరిసిందని" ముచ్చటపడి మూగసాక్షిగా నీదైన ధ్యాన ముద్రలో ఎండా, వాన, చలి, నునువెచ్చని హాయికి అతీతంగా, అలౌకికంగా అలరారేదే "బొడ్డురాయి". బొడ్డురాయి ఓ గ్రామదేవత లాంటిది.

శ్రీ లక్ష్మి గణపతి దేవాలయం

మార్చు

గ్రామంలోని శ్రీ చెన్నకేశవస్వామి వారి దేవాలయమునకు దక్షిణ దిక్కుగా శ్రీ లక్ష్మి గణపతి దేవాలయాన్ని గంగవరపు కొండయ్య 1968వ సంవత్సరంలో ప్రతిష్ఠ జరిపినారు. సదరు దేవాలయానికి దూప, దీప నైవేద్యాలు, ఉత్సవాలు జరుపుట కొరకు కొంత మాన్యం ఇచ్చారు.

శ్రీ భూనీళా సమేత శ్రీ చెన్నకేశవస్వామి వారి దేవాలయం

మార్చు
 
చెన్నకేశవస్వామి వారి దేవాలయం

ఈ గ్రామంలోని శ్రీ చెన్నకేశవస్వామి వారి దేవాలయం అతి పురాతనమైనది. 2007 లో దేవాలయ పునఃరుద్ధరణ సమయంలో బయటపడిన పురాతన విగ్రహాల ద్వారా ఇచ్చట దాదాపు 15వ శతాబ్దము నుండి దేవాలయం కలదని తెలుస్తుంది. ప్రస్తుతం త్రిభంగి రూపంలో ఉన్న స్వామివారి విగ్రహం దాదాపు 300 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠంపబడి గ్రామ ప్రజలచేత పూజలందుకుంటూ ఉంది. ఈ దేవాలయం గోడలమీద పురాతన కాలంలో చెక్కిన శిల్పసంపద, శాసనాలు దాగి ఉన్నాయి. ఈ గుడిలో ఉపదేవాలయలు ఉన్నాయి.

ఈ గ్రామంలోని శిథిలావస్థలో ఉన్న “శ్రీ భూనీళా సమేత శ్రీ చెన్నకేశవస్వామి” వారి దేవాలయాన్ని సుమారు 1885వ సంవత్సరంలో చెరుకూరి చౌదరమ్మ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. సదరు దేవాలయానికి నిత్య ధూప,దీప నైవేద్యాలు వంశపారంపర్యంగా చేయడానికి పూజారికి ఐదు ఎకరంల స్వంత భూమిని ఇచ్చారు.. దేవాలయంలోని భజంత్రీలకు చాకిరి నిమిత్తం పన్నెండు ఎకరంల స్వంత భూమిని ఇచ్చారు.ఈ విధంగా అతని వంశ పారంపర్వంతం జరిగేటట్లు ఏర్పాటు చేసారు.స్వామివారి కల్యాణ మహోత్సవం ఏరువాక పూర్ణిమ నాడు జరుపుతారు. ఉదయం గణపతి అవాహన పుణోహవాచనం, అంకురార్పణ, ధ్వజారోహణ, స్థాపిత దేవతల అభిషేకములు, అగ్ని ప్రతిష్ఠాపన, కుంకురార్పణ, మంత్రపుష్ఫం అనంతరం, కోరిన కోరికలు తీర్చుతూ భక్తుల ఇలవేల్పు దైవంగా ప్రసిద్ధి గాంచిన “శ్రీ భూనీళా సమేత శ్రీ చెన్నకేశవస్వామి” వారి కల్యాణ మహోత్సవాలు ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ ( ఏరువాక పూర్ణిమ) జరుగుతాయి. స్వామి వారి కల్యాణ మహోత్సవం రోజున స్వామి వారిని దర్శించుకున్నవారికి అష్టైశ్వర్యాలు, సకల సంపదలు, కోరిన కోరికలు తీర్చే దేవునిగా ఊరందరికీ విశ్వాసం. ముఖ్యముగా సంతాన ప్రాఫ్తి ప్రసాధించే స్వామివారిగా భక్తుల ప్రగాడ విశ్వాసం. అందుకు తార్కాణం గ్రామంలోని చాలామంది పేర్లు చెన్నయ్య, చెన్నకేశవులు, కేశవులు అని పేర్లు చాలామంది గ్రామస్తులకు ఉండటమే తార్కాణం. భక్తులు స్వామివారికి విశేష పూజలు చేసి తీర్ధప్రసాదాలు అందుకుంటారు. ధనుర్మాసంలో జరిగే వ్రతము, ముక్కోటి, కనుములకు స్వామివారి ఊరేగింపు, దేవీ నవరాత్రులు, వార్షిక పండుగలు పంతొమ్మిది, మండల పూజాకార్యక్రమాలతో ఎంతో వైభవంగా జరుగుతాయి.

శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం

మార్చు

ఇదే దేవాలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నరసింహ సమేత ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం, శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం అంతర్భాగంగా కొలువై ఉన్నాయి. మానసిక వ్యాధులు, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు శ్రీ వీరాంజనేయస్వామివారికి ( 40రోజులు) మండలం ప్రదక్షిణలు చేసినట్లయితే వారి సమస్యలు తీరటం ఇక్కడ గమనార్హం. 2009లో ఈ దేవాలయం గ్రామస్థులు, వంశపారంపర్య ధర్మకర్తల సహాయ సహకారాలతో పునరుద్దరించబడింది. ఈ గుడి సముదాయ ఆలనాపాలనా వ్యవహారాలన్నీ “చెరుకూరి ఇంటిపేరుగల వంశస్థులు” ఎంతో ఆప్యాయతతో నిర్వహిస్తున్నారు.

సీతారామలక్ష్మణ హనుమంతో సమేత రామాలయం

మార్చు
 
రామాలయం

గ్రామంలోని రాములోరి గుడికి అతిపురాతనమైన చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని నరసరావుపేట జమీందారుల ఆధ్వర్యంలో గుడి నిర్మాణం చేసారు. తదుపరి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆలయానికి గ్రామ కరణంగారు ధర్మకర్తగా ఉన్నారు. తదుపరి వారు మేము జరపలేమని చెప్పియున్నారు. అప్పుడు గ్రామంలో గ్రామ పెద్దలు ఒక నిర్ణయం తీసుకొని, ఎవరు పాట ఎక్కువ పాడితే వారు దేవాలయమునకు ధర్మకర్తగా చేసేలాగా నిర్ణయం చేసారు. రాములోరి గుడి ఆలనాపాలనా వ్యవహారాలన్నీ మేము చూస్తామంటూ గుంటుపల్లి వంశస్థులు ముందుకు వచ్చి, ధర్మకర్తలుగా ఉండటానికి సంసిద్ధత వ్యక్తపరిచారు. గ్రామస్తులందరి ఏకాభిప్రాయంతో రాములోరి గుడి బాధ్యతలను గుంటుపల్లి వంశస్థులుకు అప్పగించారు. గ్రామంలో ప్రసిద్ధిచెందిన ఈ గుడి కాలక్రమేణా శిథిలమవడంతో గుంటుపల్లి వంశస్థులు పునఃనిర్మించాలని నిర్ణయించారు. గ్రామస్థులు, ప్రవాసాంధ్రులు వారి శక్తిమేరకు విరాళాలందించారు. గ్రామంలోని ప్రధాన వీధిలో కోటి రూపాయల వ్యయంతో రాములోరి గుడి నిర్మాణాన్ని అందరి ఆర్థిక సహాయ సహకారాలతో పునఃనిర్మించారు. ఈ ప్రాచీన ఆలయ ప్రదేశంలో ఏకశిలపై “శ్రీ సీతా, లక్ష్మణ, హనుమతో సమేతుడై హిమాంక స్థిత జానకీ పరివేష్టితుడై” ఉన్న స్వామివార్ల మూలవిరాట్టు విగ్రహాలనే శాస్త్రోక్తంగా, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, మంగళవాద్యాల నడుమ, ఆలయప్రతిష్ఠతోపాటు, ఎంతో అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించారు. భద్రాచలం అడవుల నుంచి ధ్వజ స్తంబానికి కావలసిన చెట్టును తీసుకొచ్చారు. భద్రాచలం అడవుల నుంచి తీసుకొని వచ్చిన ధ్వజ స్తంబాన్ని అదే సమయంలో ఆలయం ఎదుట జీవధ్వజస్తంభ ప్రతిష్ఠ చేసారు. నూతన ఆలయంలో గర్భగుడి, ఆలయ మండపం, ఆంజనేయస్వామి, ప్రవేశ మార్గంలో సీతారామ కల్యాణ ఘట్టాలతో పాటు, ఆలయం చుట్టూ దేవతా ప్రతిమలు చెక్కిన ప్రహరీ నిర్మాణం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో పలు హోమాలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీగా అన్నసంతర్పణ నిర్వహించారు.శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా సీతారామ కల్యాణం నిర్వహిస్తారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహిస్తారు.

 
శ్రీరామ నామస్మరణ

సంక్రాంతి పర్వదినం సందర్భంగా సీతారాముల వార్ల ఉత్సవమూర్తులను ముందుగా ఆలయ వేదికపై ఉంచి అర్చకులు పుష్ప పల్లికీ సేవతో ప్రారంభించి మంగళ వాయిద్యాల నడుమ విశేషపూజలు నిర్వహించి, బండి మీద ఉత్సవమూర్తులను అధిష్ఠింపజేసి అశేషాజనవాహిని నడుమ గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు.

ఈ ఆలయానికి చెందిన శ్రీ సీతారామాంజనేయ భజన భక్త సమాజ బృందం 1950సంవత్సరంలో గ్రామ ప్రధాన వీధులలో తెల్లవారుజామున తిరుగుతూ “శ్రీరామ నామస్మరణ”తోనే గ్రామంలో తెల్లవారే లాగా రాములోరి పరమ పవిత్ర భక్తుడు గుంటుపల్లి కనకయ్యచే గ్రామ సంకీర్తన కార్యక్రమం ప్రారంబించబడింది. ఈవిధంగా నిర్వహించడం ఈదేవస్థానం యొక్క ఆనవాయితీ. అవిచ్ఛన్నముగా భక్తులచేత కొనసాగబడుట ఈ గ్రామమునకు గర్వకారణం.

ఈ దేవాలయమునకు వంశపారంపర్య ధర్మకర్తలుగా గుంటుపల్లి సుబ్బయ్య, గుంటుపల్లి కనకయ్య, గుంటుపల్లి తిరుపతిస్వామి వారి వంశీకులు వ్యవహరిస్తున్నారు.

శ్రీ గంగా పార్వతీ సమేత ఇష్టకామేశ్వరస్వామివారి ఆలయం

మార్చు

శ్రీ గంగా పార్వతీ సమేత ఇష్టకామేశ్వరస్వామివారి దేవాలయము కండ్లగుంట గ్రామంలో సుమారు 150 సంవత్సరాల కాలంలో పూర్వీకులు ప్రతిష్ఠ జరిపియున్నారు. సదరు దేవాలయమునకు నర్సారావుపేట జమీందారు గారు నిష్ఠ నైవేద్యములు శాశ్వతంగా జరుపుటకు దేవాలయ పూజారికి కొంత భూమి,మేళతాళములు జరుపు కార్యక్రమాలకు కొంత భూమి,చాకిరి చేసే చాకలి వారికి కొంత భూమి,దేవాలయ అభివృద్ధికి కొంత భూమి దానం ఇచ్చారు. కొంత భూమిని దేవాలయము శాశ్వతంగా జరుపుటకు బ్రాహ్మణ వంశస్థులైన పులిజాల వార్కి ఇచ్చారు.

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం

మార్చు
 
శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం
 
శ్రీ వీరాంజనేయస్వామి

వివాహానికి ముందు వెంకటేశ్వర స్వామికి ఎదురు నడిచే ప్రతి ఒక్కరూ ఊరికి దక్షిణాన ఉన్న నాగార్జునసాగర్ కాలువ దగ్గర ఉన్న ఈ ఆలయానికి వచ్చి పూజలు చేయాల్సిందే. ఇక్కడ పూర్వకాలం నుంచి ఈ ఆచారం ఉంది.

పోలేరమ్మ తల్లి దేవాలయం

మార్చు

పూర్వం 150 సంవత్సరాల క్రితం కండ్లగుంట గ్రామంలో దేవాలయము ప్రతిష్ఠంపబడింది. కాన ఈ యొక్క దేవాలయము పాడైపోయినందున మరలా అన్ని వర్ణాల గ్రామ ప్రజలు కలిసి కొత్తగా దేవాలయము ప్రతిష్ఠ జరిగింది. ఈ యొక్క దేవాలయమునకు అన్ని వర్ణాల వారు పూజలు జరుపుతున్నారు. వివాహాల సందర్భంగా కొందరి వంశస్థులు అమ్మవారి కలశాన్ని వీరకత్తులు, వీరతాళ్ళతో, డప్పువాయిద్యాలతో కొలుపులు కొలుస్తారు. ఈ ఊరు వారికి ఇలవేల్పు, ఇష్ట దైవమైన పోలేరమ్మకు జాతర జరిపించేటట్లుగా వరం కోరినట్లుగా తెలుస్తున్నది. గ్రామంలో పెళ్ళి చేసుకొనే ప్రతి ఒక్కరు అమ్మవారికి నిండుబిందెలతో వారపోస్తూ, డప్పువాయిద్యాలతో పసుపు, కుంకుమలు సమర్పించుకొని తమ భక్తిప్రపత్తులను చాటుకుంటారు. దీనినే పోలేరమ్మకు నీళ్ళు పోయడం అంటారు. ఇది ఈ గ్రామంలో వస్తున్నా పురాతనమైన ఆచారం.

శ్రీ షిర్డీ సాయిబాబావారి ఆలయం

మార్చు

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవస్థానం

మార్చు

గ్రామంలో బ్రహ్మంగారి గుడిగా ప్రసిద్ధిచెందినది. ఈ గుడి కాలక్రమేణా శిథిలమైపోవడం మొదలైంది. శిథిలమైన ఈ ఆలయాన్ని 1998వ సంవత్సరంలో శ్రీ పడకండ్ల వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో పునఃనిర్మాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ విగ్రహాలతోపాటు, ఈశ్వరీమాత, సిద్ధయ్య విగ్రహల ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ ఆలయంలో గోవిందమాంబ, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారల కళ్యాణ మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కళ్యాణంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ గుడి ఆలనాపాలనా వ్యవహారాలన్నీ.. “గుడి నిర్మాణ దాత పడకండ్ల వెంకటేశ్వర్లు” ఎంతో ఆప్యాయతతో నిర్వహిస్తున్నారు.

పీర్ల సావిడి

మార్చు

ఇక్కడ ముస్లిం ప్రజలందరూ రంజాన్ పండుగను నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇక్కడ ఏ పండుగనైనా అందరు కలసి చేసుకుంటారు. ముఖ్యంగా "పీర్ల పండుగ" ఊరి జాతర లాంటిది. ఈ పండుగ ఊరు మొత్తం 10 రోజులు జరుపుతారు. ఈ ఊరిలో పీర్ల సావిడి పూర్వం నుండి ఉంది. దిని యొక్క కార్యక్రమాలు ముస్లింలు నడుపుచున్నారు.

చర్చిలు

మార్చు

గ్రామంలో నాలుగు చర్చిలు ఉన్నాయి

గ్రామ ప్రముఖులు

మార్చు
 
ఎన్ టి ఆర్, సైదయ్య
 
మహాత్మాగాంధీ
 
సంజీవయ్య & వెంకటేశ్వర్లు
  • కోడెల శివప్రసాదరావు:- కండ్లగుంట గ్రామంలో 1947 మే 2వ తేదీన కోడెల శివప్రసాదరావు జన్మించారు.
  • పోసాని వెంకటేశ్వర్లు:- 2014, ఆగస్టు-22 వ తేదీ నాడు, హైదరాబాదులో ఉమ్మడి హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటరుగా పదవీ పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ పోసాని వెంకటేశ్వర్లు, కండ్లగుంట గ్రామంలో 1959లో జన్మించారు.
  • యాళ్ళ శ్రీనివాస శేషసాయి బాబు:-

గ్రామ విశేషాలు

మార్చు
  • ఎక్కడేక్కడో ఉంటున్న ఈ గ్రామస్తులందరూ ఈ గ్రామంలో 15,జనవరి-2016న కలుసుకున్నారు. ఈ ఆత్మీయ కలయికకు రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాలలో ఉంటున్న గ్రామస్తులంతా వచ్చి పాలుపంచుకున్నారు.
  • కండ్లగుంట విలేజ్ ఫౌండేషన్ తో పూర్వ విద్యార్థులు, ప్రవాసాంధ్రులందరూ కలిసి శిథిలావస్థలో ఉన్న పాఠశాలను దాదాపు 850 ట్రక్కుల మట్టితో భారీగా ఉన్న గుంతలను సుమారుగా రూ. 2 లక్షల రూపాయల వ్యయంతో చదును చేసి విశాలమైన క్రీడామైదానంగా తీర్చిదిద్దటమే కాకుండా, ప్రవాసాంధ్రుడు నెల్లూరి నాగేశ్వరరావు సుమారుగా రూ. 5 లక్షల నిధులతో డ్రైనేజీ పైపులైనుల ఏర్పాటు, విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించడం, కిటికీలు, తలుపులు, ఆధునీకరణ పనులు, రంగులు వేయడంతో ఈ పాఠశాల కార్పోరేట్ కు దీటుగా సకల సౌకర్యాలు ఒనగూర్చి, సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు
  • జలదీక్షలో భాగంగా కేవలం ఐదు రోజుల్లో 900 ఇంకుడు గుంతల్ని జల చైతన్యం కార్యక్రమంలో పూర్తిచేసారు.
  • కండ్లగుంట విలేజ్ ఫౌండేషన్ సభ్యుడు జంపని వెంకట్రావు అతని తండ్రి గారైన జంపని హనుమయ్య జ్ఞాపకార్థం, ఎస్సీ కాలనీలోని నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యను అందించాలనే భావంతో మండల ప్రజా పరిషత్ (ఎఎ) పాఠశాలలో డిజిటల్ తరగతుల నిమిత్తం కంప్యూటర్, టీవీ, 100 మంది విద్యార్థులకు అవసరమైన నోట్ బుక్స్, డ్రాయింగ్ బుక్స్ ది 01-06-2016 పంపిణీ చేయడం జరిగింది.
  • కండ్లగుంట విలేజ్ ఫౌండేషన్, గుంటూరు రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రూ. మూడు లక్షలతో వ్యయంతో 160 బెంచీలను రోటరీ క్లబ్ కార్యదర్శి ముత్తినేని వెంకటేశ్వర రావు అందజేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ కోడెల శివరామకృష్ణ వ్యవహరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనం పరిడవిల్లెలా కృషి చేయాలని తెదేపా నియోజకవర్గ నాయకులు డాక్టర్ కోడెల శివరామకృష్ణ పిలుపునిచ్చారు.
  • నదుల అనుసంధానం ఆవశ్యకత, దానిని ఆచరణలో పెడుతున్న సియం చంద్రబాబునాయుడు గురించి, భారత రాజ్యాంగ దినోత్సవం (26-11-2018) రోజున గుంటూరు జిల్లా నకరికల్లులో జరిగిన గోదావరి.. పెన్నా నదుల అనుసంధానానికి ఫేజ్‌-1 కార్యక్రమంలో ఎలాంటి తడబాటు లేకుండా విపులీకరించిన కండ్లగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని ఎం. స్నేహ కోటేశ్వరి.

గణాంకాలు

మార్చు

2015 వ.సంవత్సరం (ది.15-11-2015 తారీఖు వరకు) గ్రామ పంచాయితీ కార్యదర్శి జనాభా లెక్కల సమాచారం ప్రకారం గ్రామ జనాభా మొత్తం సంఖ్య: 3765

  • పురుషుల సంఖ్య: 1840
  • స్త్రీల సంఖ్య: 1925
  • గృహాల సంఖ్య: 998
  • బూత్ నంబరు: 198వ బూత్ లో 769 ఓటర్లు, 199వ బూత్ లో 684 ఓటర్లు, 200వ బూత్ లో 879 ఓటర్లు, 201వ బూత్ లో 840 ఓటర్లు, 202వ బూత్ లో 593 ఓటర్లు
  • వీరిలో షెడ్యూల్ కులాల జనాభా సంఖ్య: 1634, షెడ్యూల్ తెగల జనాభా సంఖ్య: 297
  • అక్షరాస్యత: 61.38%, పురుషుల అక్షరాస్యత: 73.29%, స్త్రీల అక్షరాస్యత: 49.17%.
  • భూమి లేని కుటుంబాల సంఖ్య: 428
  • మహిళలు తలల గృహాలు సంఖ్య: 198
  • శాశ్వత ఇళ్ళు కలిగిన వారి సంఖ్య: 954
  • తాత్కాలిక ఇళ్ళు కలిగిన వారి సంఖ్య: 44
  • సురక్షిత త్రాగునీటి సౌకర్యం గల కుటుంబాల సంఖ్య: 17
  • సురక్షిత త్రాగునీటి సౌకర్యం లేని కుటుంబాల సంఖ్య: 981
  • విద్యుత్ సౌకర్యం గల కుటుంబాల సంఖ్య: 974
  • విద్యుత్ సౌకర్యం లేని కుటుంబాల సంఖ్య: 24

మూలాలు

మార్చు
  1. "Central Bank Of India, Kandlakunta branch - IFSC, MICR Code, Address, Contact Details, etc". Archived from the original on 2021-09-26. Retrieved 2020-10-08.

వెలుపలి లంకెలు

మార్చు