నాగార్జునసాగర్

ఆనకట్ట
(నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి దారిమార్పు చెందింది)

నిర్మాణ కాలంనాటి తెలంగాణ లోని నల్గొండ జిల్లా, ఆంధ్ర లోని గుంటూరు జిల్లా సరిహద్దుల పై కృష్ణా నదిపై నిర్మింపబడిన ఆనకట్ట వల్ల ఏర్పడిన జలాశయాన్ని నాగార్జున సాగర్ అంటారు. ఇది దేశంలోనే రిజర్వాయర్లలో రెండవ స్థానంలో ఉంది, పొడవులో మొదటిది.దీని నిర్మాణ కాలము 1955 - 1967. ఈ జలాశయమునకి 11,472 మిలియన్ ఘనపు అడుగుల నీటిని నిలువ చేయు సామర్థము గలదు. దీని ప్రధాన కట్టడము 590 అడుగుల ఎత్తుకలిగి 1.6 కిలోమీటర్ల పొడవుతో 26 గేట్లతో ఉంది. ప్రతి గేటు 42 అడుగుల వెడల్పు కలిగి 45 అడుగులు ఎత్తు కలిగి యున్నది. దీని ద్వారా నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా, ఖమ్మం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా లకు సాగునీరు అందించ బడుతున్నది. ఇక్కడ పెద్ద జల విద్యుత్ కేంద్రము కూడా ఉంది.

నాగార్జునసాగర్
NagarjunaSagarDam.JPG
నాగార్జునసాగర్ ఆనకట్ట
నాగార్జునసాగర్ is located in India
నాగార్జునసాగర్
Location of నాగార్జునసాగర్
అధికార నామంనాగార్జునసాగర్ ఆనకట్ట
ప్రదేశంనల్గొండ జిల్లా, తెలంగాణా, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
అక్షాంశ,రేఖాంశాలు16°34′32″N 79°18′42″E / 16.57556°N 79.31167°E / 16.57556; 79.31167Coordinates: 16°34′32″N 79°18′42″E / 16.57556°N 79.31167°E / 16.57556; 79.31167
నిర్మాణం ప్రారంభండిసెంబరు 10 1955
ప్రారంభ తేదీ1960
నిర్మాణ వ్యయం1300 కోట్ల రూపాయలు
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుకృష్ణా నది
ఎత్తు124 metres (407 ft) from river level
పొడవు1,550 metres (5,085 ft)
జలాశయం
సృష్టించేదినాగార్జున సాగర్ రిజర్వాయరు
మొత్తం సామర్థ్యం11,560,000,000 m3 (9,371,845 acre⋅ft)
క్రియాశీల సామర్థ్యం5,440,000,000 m3 (4,410,280 acre⋅ft)[1]
పరీవాహక ప్రాంతం215000 km² (83012 sq mi)
ఉపరితల వైశాల్యం285 kమీ2 (110 sq mi)
విద్యుత్ కేంద్రం
Commission date1978-1985
టర్బైన్లు1 x 110 MW Francis turbines, 7 x 100.8 MW reversible Francis turbines
ప్రవేశ సామర్థ్యం816 MW
Website
https://irrigation.telangana.gov.in/icad/projectsMajUp#
https://irrigationap.cgg.gov.in/wrd/projects
Map

ప్రాజెక్టు-పట్టణంసవరించు

కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjuna Sagar project) అతి పెద్దది. ఇది ఒక బహుళార్థసాధక ప్రాజెక్టు. అప్పటి ఆంధ్రప్రదేశ్ లోని నల్గొండ జిల్లా , గుంటూరు జిల్లా సరిహద్దుల పై నందికొండ వద్ద నిర్మించిన ఈ ఆనకట్టను మొదట్లో నందికొండ ప్రాజెక్టు అని పిలిచేవారు. ఈ ప్రాంతానికున్న చారిత్రక ప్రాధాన్యం వలన ఈ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని పేరుపెట్టారు.

నందికొండ గ్రామం నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో ఉంది. ప్రాజెక్టు నిర్మాణానంతరం నాగార్జునసాగర్‌గా ప్రసిద్ధి చెందింది. నాగార్జునసాగర్ పట్టణము మూడు భాగములుగా విభజించబడింది. ఆనకట్టకు దక్షిణాన విజయపురి సౌత్ (వీ.పీ.సౌత్) (గుంటూరు జిల్లా), ఆనకట్ట దాటిన వెంటనే ఉత్తరాన పైలాన్ (నల్గొండ జిల్లా), ఉత్తరాన కొండ మీద హిల్ కాలనీ (నల్గొండ జిల్లా) ఉన్నాయి.

నాగార్జునసాగర్ ప్రముఖ బౌద్ధ చారిత్రక స్థలం కూడా. శాతవాహనుల కాలమునాటి శ్రీ పర్వతమే నాగార్హున కొండ. ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతంలో బోధనలు చేసినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. జలాశయం నిర్మాణ సమయంలో ఇక్కడ లభించిన అమూల్యమయిన చారిత్రిక కట్టడాల శిథిలాలను జలాశయం మధ్యలో "నాగార్జునకొండ" అని ఇప్పుడు పిలువబడే మ్యూజియంలో భద్ర పరచారు. ఆ మ్యూజియాన్ని నాగార్జునకొండ మ్యూజియం అంటారు.

నందికొండ ప్రాజెక్టుసవరించు

చరిత్రసవరించు

ఇక్కడ ఒక జలాశయము కట్టాలనే ఆలోచన బ్రిటిష్ పరిపాలకుల కాలంలోను అనగా నైజాము పరిపాలన కాలములోనే 1903 లోనే వచ్చింది. చివరికి భారత దేశ ప్రథమ ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా 1955 డిసెంబరు 10 నాడు పునాది రాయి పడింది. భారత దేశ రెండవ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి చేతుల మీదుగా 1967 లో కుడి, ఎడమ కాలవలోనికి నీటి విడుదల జరిగింది.

గతంలో ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాకులు, శాతవాహనులు పరిపాలించేవారు. ఆకాలంలో కట్టబడి అనేక బౌద్ధ స్థూపాలు ఇతర కట్టడాలు ఈ జలాశయములో మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. వాటి పరిరక్షణకు వాటిలో చాల వాటిని యదాతదంగా పెకలించి జలాశయం మధ్యలో నెలకొని వున్న నాగార్జునకొండపైకి తరలించి అక్కడ వాటిని యదాతదంగా ఏర్పాటు చేయడము జరిగింది. అక్కడ ఒక మ్యూజియం కూడా నిర్మించి అందులో ఆనాటి అనేక వస్తువులను ప్రదర్శన కొరకు పెట్టారు.

ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వము కృష్ణానది నీటిని తమిళ దేశానికి తీసుకుపోవుటకు కృష్ణా పెన్నా నదులను సంధించుటకు "కృష్ణా-పెన్నార్ ప్రాజెక్ట్"ను బృహత్తర ప్రణాళికగా తలపెట్టింది. ఇది తెలిసి ముక్త్యాల రాజా అనబడు వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ ఆంధ్ర ప్రాంతములోని తొమ్మిది జిల్లాలలో ప్రతివూరు తిరిగి (38వేల మైళ్ళు) నాగార్జునసాగర్ నిర్మాణానికి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపారు. ఆ సమయములోనే డా. కె. ఎల్. రావు ద్వారా పూర్వం హైదరాబాదు నవాబు ఆలీయవార్ జంగ్ కృష్ణా నదిపై పరిశోధన చేయించి ప్రణాళికలు తయారు చేయించాడని విన్నాడు. అన్వేషించి ఆ రిపోర్టులు సాధించాడు. 'నందికొండ ప్రాజెక్ట్ స్వరూప స్వభావాలు తెలుసుకోవడానికి స్వయముగా క్షేత్రాన్వేషణకు పూనుకున్నాడు. ఎన్నో వ్యయప్రయాసలకు లోనై మాచెర్ల దగ్గర నదీలోయను దర్శించాడు. స్వంత ఖర్చుతో నెలనెలా జీతాలు ఏర్పరిచి మైసూరు ప్రభుత్వ రిటైర్డు ఛీఫ్ ఇంజినీరు నరసింహయ్య, పి. డబ్ల్యు.డి రిటైర్డు ఇంజినీరు గోపాలాచార్యులు ద్వారా అంచనాలు, ప్లానులు తయారు చేయించాడు.

మద్రాసు ప్రభుత్వము వారి ప్రయత్నాలకు అన్నివిధములా అడ్డు పడింది. రాజా గారు కృష్ణా రైతుల వికాస సంఘము స్థాపించి కేంద్ర ప్రభుత్వముపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వము ఖోస్లా కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ పర్యటనలో నందికొండ ప్రస్తావన లేదు. రాజా ఎంతో నచ్చజెప్పి నందికొండ సందర్శన చేర్పించాడు. కానీ కమిటీ సభ్యులు నందికొండకు కార్లు, జీపులలో వెళ్ళుటకు అనువైన దారి లేదనే సాకుతో విషయమును దాటవేయుటకు ప్రయత్నించారు. రాజా వేలరూపాయలు ఖర్చు పెట్టి ఇరవైఇదు గ్రామాలనుండి ప్రజలను, స్వయంసేవకులను కూడగట్టి, వారము రోజులు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి, కార్లు వెళ్ళుటకు వీలగు దారి వేశారు. 1952లో ఖోస్లా కమిటీ నందికొండ డాం ప్రదేశము చూసి ప్రాజెక్టు కట్టుటకు ఇంతకన్న మంచి చోటు వుండదని తేల్చింది. విజయవాడ నుండి 260 మైళ్ళ పొడవునా ఖోస్లా కమిటీకి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రాజెక్ట్ ప్రాంతం పరిశీలించిన ఖోస్లా "ఇది భగవంతుడు మీకు ఇచ్చిన అమూల్యమైన వరం" అని తెల్పాడు.

ఖోస్లా కమిటీ రిపోర్టును తొక్కిపెట్టుటకు ఢిల్లీలో ప్రయత్నములు మొదలైనవి. రాజా ఢిల్లీ వెళ్ళి ప్రొఫెసర్ ఎన్.జి.రంగా, మోటూరు హనుమంతరావు, కొత్త రఘురామయ్య మొదలగు పార్లమెంటు సభ్యులను కలిసి, రిపోర్టును వెలికితీయించి దాని ప్రతులను అందరికి పంచిపెట్టి, ప్రణాళికా సంఘం సభ్యులందరిని ఒప్పించి సుముఖులు చేశాడు. ప్రణాళికా సంఘం ఖోస్లా కమిటీ సూచనలను 1952లో ఆమోదించింది. జలాశయ సామర్థ్యం 281 టి.ఎం.సి.గా సూచించింది. అదే సమయములో రాష్ట్ర ప్రభుత్వము కూలిపోయింది. రాష్ట్రములో గవర్నర్ (చందూలాల్ త్రివేది) పాలన ఆరంభమయింది. త్రివేది ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారిని ఖోస్లా కమిటీ రిపోర్టు ఆమోదించమని విజ్ఞప్తి చేశారు. చివరకు 1954 లో నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆమోదముద్ర లభించింది. 1955 డిసెంబర్ 10న (మన్మధ నామ సంవత్సరం కార్తీక బహుళ ద్వాదశి నాడు) అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. అప్పటి హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి, బూర్గుల రామకృష్ణారావు, ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ సి.ఎం.త్రివేది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిర్మాణ సమయములో రాజా గారు యాభైరెండు లక్షల రూపాయిలు మాచింగ్ గ్రాంటుగా ఇచ్చారు. డ్యాము నిర్మాణం 1969లో పూర్తయింది. క్రెస్టు గేట్లను అమర్చే పని 1974లో పూర్తయింది.

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ముక్త్యాల రాజా కార్యదక్షతకు, దేశసేవాతత్పరతకు, నిస్వార్ధసేవానిరతికి గొప్ప ఉదాహరణ. ముఖ్యముగా సాగర్ ఆయకట్టు రైతులకు రాజాగారు బహుధా స్మరణీయులు. నార్ల వెంకటేశ్వర రావు మాటలలో "ఆయన అంతగా తపన చెందకపోతే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ మనకు సిద్ధించేది కాదేమో". రాజా గారిని ప్రజలు "ప్రాజెక్టుల ప్రసాద్" అని పిలుచుకునేవారు.బౌద్ధ అవశేషాలతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన నందికొండ, ప్రాజెక్టు నిర్మాణం తరువాత నాగార్జునసాగర్ గా ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరింత స్థిరపడింది.

ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, 2005 డిసెంబర్ 10 న స్వర్ణోత్సవాలను జరుపుకుంది. రూ.3 వేల కోట్ల ప్రపంచ బ్యాంకు రుణంతో సాగర్‌ను పూర్తిస్థాయిలో ఆధునికీకరించి ఆయకట్టు అంతటికీ నీరు అందిస్తాం అని ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చెప్పాడు. సాగర్ నిర్మాణ సమయంలో అసువులు బాసిన వారి స్మారకార్థం ఏర్పాటు చేసిన స్థూపాన్ని వై.ఎస్. ఆవిష్కరించాడు. గౌతమ బుద్ధుడు, ఆచార్య నాగార్జునుడి విగ్రహాలతో బాటు సాగర్ నిర్మాణ సమయంలో ముఖ్యమంత్రులుగా ఉన్న నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, ఇంజినీరింగ్ నిపుణులు కె.ఎల్.రావు, సాగర్ మొదటి చీఫ్ ఇంజినీర్ జాఫర్ అలీల విగ్రహాలను వై.ఎస్. ఆవిష్కరించాడు.

విశేషాలుసవరించు

 
నాగార్జున సాగర్ ఎడమకాలువ
 
నాగార్జున సాగర్ కుడి కాలువ గేట్లు

సాగునీటి సరఫరా కోసమే కాక, విద్యుదుత్పత్తి కొరకు కూడా ఉద్దేశించబడిన నాగార్జునసాగర్ ఒక బృహత్తర బహుళార్థసాధక ప్రాజెక్టు. ప్రధాన ఆనకట్ట రాతి కట్టడము. దీనికి రెండువైపులా మట్టితో కట్టిన కట్టలు ఉన్నాయి. డ్యాముకు ఇరువైపుల నుండి రెండు సాగునీటి కాలువలు బయలుదేరుతాయి. కుడి కాలువని జవహర్ కాలువ గాను, ఎడమ కాలువను లాల్ బహదూర్ కాలువ గాను పేరు పెట్టారు. అయితే వ్యవహారంలో వీటిని కుడి కాలువ, ఎడమకాలువ గానే పిలుస్తారు. కుడికాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు, ఎడమ కాలువ ద్వారా నల్గొండ, కృష్ణా, ఖమ్మం జిల్లాలకు సాగునీరు సరఫరా అవుతుంది. అంతేకాక, కృష్ణా, గుంటూరు జిల్లాలలోని కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించేందుకు కూడా నాగార్జునసాగర్ ఉపయోగపడుతుంది.

ప్రాజెక్టు గణాంకాలుసవరించు

డ్యాము పొడవు: 15,956 అ. (4863.388 మీ.)

 • ప్రధాన రాతి ఆనకట్ట పొడవు: 4756 అ. (1449.628 మీ.)
 • మొత్తం మట్టికట్టల పొడవు: 11,200 అ. (3413.76 మీ.)
  • ఎడమ మట్టికట్ట పొడవు: 8400 అ. (2560.32 మీ.)
  • కుడి మట్టికట్ట పొడవు: 2800 అ. (853.44 మీ.)
 • మొత్తం క్రెస్టుగేట్ల సంఖ్య: 26
 • కుడి కాలువ పొడవు: 203 కి.మీ.
 • ఎడమ కాలువ పొడవు: 179 కి.మీ.

జలాశయ సామర్థ్యంసవరించు

 • పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 408 టి.ఎం.సి. (శతకోటి ఘనపుటడుగులు-థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్)
 • కనీస స్థాయి నిల్వ: 213 టి.ఎం.సి.

విద్యుదుత్పత్తి సామర్థ్యంసవరించు

విద్యుదుత్పత్తికై నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మూడు కేంద్రాలున్నాయి. వీటి మొత్తం ఉత్పాదక సామర్థ్యం 960 మె.వా. (మెగా వాట్లు)

 • నది దిగువకు నీరు విడుదలయ్యే చోట నిర్మించిన కేంద్రంలో: 810 మె.వా.,
 • కుడి కాలువకు నీరు విడుదలయ్యే చోట: 90మె.వా.,
 • ఎడమకాలువకు నీరు విడుదలయ్యే చోట: 60 మె.వా.

ఉత్పత్తి సామర్థ్యం గల కేంద్రాలు ఉన్నాయి.

ఆయకట్టు వివరాలుసవరించు

 
కుడికాలవ విస్తరణ

ప్రాజెక్టు కింద 5 జిల్లాల్లో మొత్తం 22,35,910 ఎకరాల ఆయకట్టు వివరాలు ఇలా ఉన్నాయి.

కుడి కాలవసవరించు

కుడి కాలువ
జిల్లా ఆయకట్టు, ఎకరాల్లో
గుంటూరు జిల్లా 6,68,230
ప్రకాశం జిల్లా 4,43,180
మొత్తం 11,11,410

కుడికాలవపై గుంటూరు శాఖా కాలవ, అద్దంకి శాఖా కాలవ, ఒంగోలుశాఖా కాలువ, ఇంకా చాలా పెద్ద కాలువలు వున్నాయి.

ఎడమకాలవసవరించు

ఎడమ కాలువ
జిల్లా ఆయకట్టు, ఎకరాల్లో
నల్గొండ జిల్లా 3,72,970
ఖమ్మం జిల్లా 3,46,769
కృష్ణా జిల్లా 4,04,760
మొత్తం 11,24,500

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణసవరించు

ప్రధాన వ్యాసం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ ఋణంతో ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృధ్ది పేరుతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులను చేపట్టింది. 2010, ఆగస్టు 14వ తేదిన ప్రపంచ బ్యాంక్ తో దీనిపై ఒప్పందం కుదిరింది. 10.9.2010 నుండి ఈ పథకం అమలు లోకి వచ్చింది. ఈ పధక కాల పరిమితి ఆరు సంవత్సరాలు. ఈ పథకం 31.7.2016 తో ముగుస్తుంది. ఒప్పందం జరిగేలోగా, చర్చలు కొనసాగుతుండగానే ప్రభుత్వం ఆధునీకరణపనులను ప్రారంభించింది. ఈ పథకం అంచనా వ్యయం రూ.4444.41 కోట్లు. ఇందులో 48 శాతం ప్రపంచ బ్యాంక్ ఋణం. రాష్ట్రప్రభుత్వ్తం వాటా 52 శాతం. ఒప్పందానికి సంవత్సరం ముందునుండి నిబంధనలకు లోబడి జరిగిన వ్యయంలో ప్రపంచ బ్యాంకు ఋుణం వాటా రిట్రోఏక్టివ్ ఫడింగ్ ద్వారా చెల్లిస్తుంది
ఆధునీకరణ లక్ష్యాలు

1. నాగార్జున సాగర్ కాలువలను ఆధునీకరించి నీటి సరఫరా సామర్ధ్యాన్ని వృధ్ది చేస్తూ వ్యవసాయాభివృధ్ధి చేయుట,వ్యవసాయ ఉత్పాదకత పెంచుట
2. నీటిపారుదల ఆయకట్ట అభివృధ్ది శాఖ సామర్ధ్యాన్ని పెంపుచేసి జలవనరులను బహుముఖంగా, ప్రణాళికా బధ్ధంగా జలవనరులను అభివృధ్ది చేసి నిర్వహించుట
ఈ పథకంలో పలు అంశాలు ఉపాంశాలు ఇమిడి ఉన్నాయి. ఈ పథకం గరిష్ఠ లక్ష్యాలతో కూడుకొన్నది. ఈ పథకాన్ని ప్రధానంగా సాగునీరు ఆయకట్టు అభివృధ్ది శాఖ అమలు చేస్తుంది. కాగా అంశం బిలో ఉపాంశాలను వ్యవసాయ శాఖ. ఉద్యాన శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖలు ఈ పథకం అమలులో పాలు పంచుకుంటున్నాయి. ప్రభుత్వ శాఖలకు తోడు వాలంతారి, ఆచార్యఎన్.జి.రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సామేతి వంటి సంస్దలు ఈ పధకం అమలులో భాగస్వాములు. సి అంశంలో రెండు ఉాపాంశాలను భుగర్భ జలశాఖ అమలు చేస్తుంది.

నీరు అందుబాటుసవరించు

ఎగువనవున్న రాష్ట్రాలలో ఆనకట్టల ఎత్తు పెంచడం, కొత్త ఆనకట్టలు కట్టడం వలన, వర్షాలు పుష్కలంగా లేనప్పుడు, నాగార్జునసాగర్ జలాశయానికి వచ్చే నీరు తగ్గుతున్నది. దీనివలన ఆయకట్టులోని పొలాలకు నీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది.

నాగార్జునకొండసవరించు

నాగార్జునసాగర్ నిర్మాణ సమయంలో బయల్పడిన క్రీ.పూ.2వ శతాబ్ధపు బౌద్ధావశేషాలను జలాశయం మధ్య కొండపై నిర్మింపబడిన నాగార్జునకొండ మ్యూజియంలో భధ్రపరిచారు. ఈ ద్వీపపు మ్యూజియం ప్రపంచంలోనే అరుదైనది. బుద్ధునివిగా చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇందులో చూడదగ్గవి.

ఇతర దర్శనీయ స్థలాలుసవరించు

 
సాగరమాత దేవాలయం

పర్యాటకులకు ప్రధానమైన ఆకర్షణ నాగార్జునసాగర్ ప్రాజెక్టు. ముఖ్యంగా వర్షాలు బాగా పడి గేట్లు తెరిచినప్పుడు పెద్దయెత్తున సందర్శకులు వస్తారు. నాగార్జున కొండ మ్యూజియం కూడా తప్పక చూడదగినది.

నాగార్జున సాగర్ దక్షిణభాగమైన విజయపురి సౌత్ లో ఉన్న సాగరమాత ఆలయం హిందూ ఆలయ శైలిలో నిర్మించిన కాథలిక్ చర్చి. ఈ ఆలయం నాగార్జునసాగర్ జలాశయానికి దక్షిణపు ఒడ్డున ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీ ప్రధానద్వారానికి ఎదురుగా ఉంది. ఈ ఆలయము నిర్మాణ శైలిలోనే కాక కొన్ని పూజా పద్ధతులలో కూడా హిందూమత పద్ధతులను అవలంబించడం విశేషము. ఉదాహరణకు ఈ గుడిలో మేరీమాతకు భక్తులు టెంకాయలు కొట్టి అగరువత్తులు సమర్పిస్తుంటారు. ప్రతియేటా మూడురోజుల పాటు జరిగే సాగరమాత ఆలయ తిరునాళ్ళకు చుట్టుపక్కల ప్రాంతాలనుండి అనేకమంది భక్తులు విచ్చేస్తారు.

సమీపంలోని దర్శనీయ స్థలాలుసవరించు

 1. ఎత్తిపోతల జలపాతం - సహజసిద్దంగా ఏర్పడిన జలపాతం.
 2. అనుపు - బౌద్ద మతాచార్యుడు నాగార్జునుడు నాగార్జునుడు నాలగవ శతాబ్థంలో విశ్వవిద్యాలయాన్నిస్థాపించిన ప్రాంతం
 3. మాచర్ల - పురాతన ఆలయాలు ఉన్నాయి

అనుపుసవరించు

 
బొద్ద మతస్తులు

అనుపు ప్రదేశానికి బౌధ్ధ మతాచార్యుడు ఆచార్య నాగార్జునుడు క్రీస్తు శకము నాలుగవ శతాబ్దంలో ఇచ్చటకు వచ్చి ఒక విశ్వ విద్యాలయాన్ని నిర్మించాడు. ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్య నబ్యసించారని చారిత్రికాదారాలున్నాయి. సాగర గర్బంలో వుండిన ఆనాటి విశ్వ విద్యాలయ శిథిలాలను యదా తదంగా తరలించి నాగార్జునకొండ పైన మ్యూజియంలోను, ఆరుబటయ కూడా భద్ర పరచి సందర్శకులు చూడ డానికి ఏర్పాటు చేశారు. అనుపు అనే ప్రాంతం సాగర్ ముంపునకు గురికాలేదు. కనుక అక్కడ వున్న ఆనాటి కట్టడాలు ఎక్కడ వున్నవి అక్కడనే భద్రపరచి జాగ్రత్త తీసుకుంటున్నారు భారత పురావస్తు శాఖ వారు. ఈ విషమై పరిశోధన చేసే వారికిది అమూల్యమైన ప్రదేశము: అనుపు నాగార్జున సాగర్ ఆనకట్టకు దక్షిణం వైపున సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి రవాణా సౌకర్యం అంతగా లేదు. వాహనాలలో వచ్చే వారికి రోడ్డు మార్గమున్నది. అనుపు నుండి కూడా నాగార్జునకొండ వరకు లాంచీలను అప్పుడప్పుడు నడుపుతారు. అనుపులోని ఆనాటి కట్టడాలను ఈ క్రింద చూడ వచ్చును.

జలవిద్యుత్తుసవరించు

ఇక్కడ నిర్మించిన జలవిద్యుత్తు కేంద్రం 8 యూనిట్లతో... 815.6 మెగా వాట్ల విద్యుత్తు తయారుకాగల శక్తి గలది. అందులో మొదటి యూనిట్ 1978 మార్చి 7 లో ప్రారంభమైనది. 8 వ యూనిట్ 24 డిసెంబరు 1985 న ప్రారంభమైనది.గుంటూరు జిల్లాలో విస్తరించి ఉన్న నాగార్జున సాగర్ కుడికాలువ పై నిర్మించిన జలవిద్యుతు కేంద్రం 90 మెగా వాట్ల సామర్థమున్నది. ఎడమ కాలువ జల విద్యుత్తు కేంద్రం 60 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యము కలిగి యున్నది.

చిత్ర మాలికసవరించు

గగన విహారంసవరించు

బౌద్ధులు సాగర్‌ను పుణ్యక్షేత్రంగా భావిస్తున్నారు. విదేశీయులు రహదారి మార్గాన వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు. ట్రాఫిక్‌ సమస్యలతోపాటు, సమయం ప్రధాన సమస్యగా మారింది.నాగార్జునకొండ, బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు, ఎత్తిపోతల జలపాతం, అనుపు పురావస్తు సంపద,జలాశయ అందాలు ప్రత్యేక ఆకర్షణ. అందువలన పర్యాటకశాఖ సాగర్‌ పరిధిలో 500 ఎకరాల్లో మెగా పర్యాటకం ప్రాజెక్టులో భాగంగా హైదరాబాదు‌, విజయవాడ, వైజాగ్‌తోపాటు బెంగుళూరు, ఢిల్లీ, బొంబాయి, పూణె వంటి నగరాల నుంచి నేరుగా హెలికాప్టర్ లో సాగర్‌కు పర్యాటకులను తరలించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం విమాన శిక్షణ కోసం నాగార్జున సాగర్‌లో చిన్నపాటి విమానశ్రయం ఉంది.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలు, వనరులుసవరించు

 1. "India: National Register of Large Dams 2009" (PDF). Central Water Commission. మూలం (PDF) నుండి 19 ఫిబ్రవరి 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 7 August 2011. Cite web requires |website= (help)

బయటి లింకులుసవరించు