కర్ణాటక ప్రాంతం
తూర్పు కనుమలకు బంగాళాఖాతానికీ మధ్య ఉన్న ద్వీపకల్ప దక్షిణ భారత ప్రాంతాన్ని కర్ణాటక ప్రాంతం (కర్నాటిక్) అనేవారు. ఇది పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. ఆధునిక రాష్ట్రాలైన తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో ఉంది. బ్రిటిషువారి కాలంలో, సరిహద్దులు భిన్నంగా ఉండేవి. ప్రస్తుత కర్ణాటక. దక్కన్‌కు దక్షిణంగా ఉన్న మొత్తం ప్రాంతమంతా అప్పటి కర్ణాటకలో భాగంగా ఉండేవి.
వ్యుత్పత్తి
మార్చుకర్నాటిక్ లేదా కర్నాటిక్ అనే పదం యొక్క ఉత్పన్నానికి సంబంధించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి.
బిషప్ రాబర్ట్ కాల్డ్వెల్ ప్రకారం, అతని ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణంలో, ఈ పదం కర్ (అంటే "నలుపు") నాడు (అంటే "దేశం") ల నుండి "నల్ల దేశం" అనే అర్థంలో ఉద్భవించింది. ఇది దక్కను పీఠభూమి దక్షిణ భాగంలో ఉన్న నల్ల నేలను సూచిస్తుంది.[1]
ఆంగ్లేయులు తూర్పు తీరంలో స్థిరపడినప్పుడు, దక్షిణ భారతదేశం మొత్తం, కృష్ణా నది నుండి కేప్ కొమోరిన్ వరకు, కానరీస్ రాజవంశ పాలనలో ఉండేది. వీరు హంపీ విజయనగరం నుండి కర్ణాటక రాజ్యం పేరిట పాలించేవారు. అందువల్ల మద్రాస్‌కు దక్షిణంగా ఉన్న తీర మైదానాలకు, అవి తమిళం మాట్లాడే జిల్లాలైనప్పటికీ, అవి కానరీస్ దేశానికి వెలుపల ఉన్నప్పటికీ, "కర్నాటిక్" అనే పేరు వచ్చింది.[2]
భౌగోళిక శాస్త్రం
మార్చుయూరోపియన్లు కర్నాటిక్ లేదా కర్నాటక్ (కన్నడ, కర్నాటక, కర్ణాటకదేశం) అని పిలిచిన ఈ ప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సీలో తూర్పు కనుమలు, కోరమాండల్ తీరాల మధ్య ఉంది. [1]
ఉపవిభాగాలు
మార్చుఈ ప్రాంతాన్ని సాధారణంగా యూరోపియన్లు కర్నాటిక్ అని పిలిచేవారు. ఈ ప్రాంతానికి చాలా చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంది గానీ ఇది రాజకీయ లేదా పరిపాలనా విభాగం కాదు. ఇది తూర్పు తీరం వెంబడి 600 కిలోమీటర్ల పొడవు, 50 నుండి 100 కిలోమీటర్ల వెడల్పున విస్తరించి ఉంది. ఉత్తరాన గుంటూరు సర్కారు సరిహద్దుగా, దక్షిణాన కేప్ కొమోరిన్ (కన్యాకుమారి అగ్రం) వరకు విస్తరించింది. దీన్ని దక్షిణ, మధ్య, ఉత్తర కర్ణాటకలుగా విభజించారు. కొలెరూన్ నదికి (కొల్లిడం నది) దక్షిణంగా ట్రిచినోపోలీ (తిరుచినాపల్లి - తిరుచ్చి) పట్టణం వరకూ ప్రాంతాన్ని దక్షిణ కర్నాటిక్ అని పిలిచేవారు. ఈ డివిజన్‌లోని ప్రధాన పట్టణాలు తంజోర్, ట్రిచినోపోలీ, మధురై, ట్రాంక్‌బార్, నాగపటం, తిన్నెవెల్లి. మధ్య కర్నాటిక్ కొలెరూన్ నది నుండి పెన్నా నది వరకు విస్తరించి ఉండేది. దాని ప్రధాన పట్టణాలు మద్రాసు, పాండిచ్చేరి, ఆర్కాట్, వెల్లూరు, కడలూరు, పులికాట్, నెల్లూరు. ఉత్తర కర్నాటిక్ పెన్నార్ నది నుండి దేశంలోని ఉత్తర సరిహద్దు వరకు విస్తరించి ఉండేది. ఈ ప్రాంతం లోని ప్రధాన పట్టణం ఒంగోలు. పైన నిర్వచించినట్లుగా, కర్నాటిక్ పరిధిలో తీర ప్రాంతం లోని నెల్లూరు, చింగ్లెపుట్, సౌత్ ఆర్కాట్, తంజోర్, మదురై, తిన్నెవెల్లి జిల్లాలతో పాటు, లోతట్టు ప్రాంతాలైన ఉత్తర ఆర్కాట్, ట్రిచినోపోలీలు ఉండేవి. ఈ ప్రాంతంలోని జనాభాలో ప్రధానంగా బ్రాహ్మణీయ హిందువులు ఉన్నారు. ముస్లింలు తక్కువగా చెదురుమదురుగా ఉండేవారు.
చరిత్ర
మార్చుచరిత్రలో, ఇప్పుడు కర్ణాటక అని పిలువబడే ప్రాంతం పాండ్య చోళ రాజ్యాల మధ్య విభజించబడింది. చేర రాజవంశం (ఇప్పటి కేరళ) తో కలిపి దక్షిణ భారతదేశంలో ఈ మూడు తమిళ రాజ్యాలు ఉండేవి. పాండ్య రాజ్యం మదురై, తిన్నెవెల్లి జిల్లాలతో సమానంగా ఉండగా, చోళులు కోరమాండల్ తీరం వెంబడి నెల్లూరు నుండి పుదుకోట్టై వరకు, ఉత్తరాన పెన్నా నది, దక్షిణాన దక్షిణ వెల్లారు సరిహద్దులుగా విస్తరించి ఉండేవారు.[1]
శతాబ్దాలుగా ఈ ప్రాంత పాలన ఈ రాజవంశాల కింద అనేక స్వతంత్ర లేదా అర్ధ స్వతంత్ర అధిపతుల అధీనంలో ఉండేది. వీరి మధ్య ఉన్న అంతర్గత సంఘర్షణలకు అనేక కోటలు దుర్గాలు సాక్షులుగా ఉన్నాయి. సైనిక వర్గాలకు యుద్ధం పట్ల అభిరుచి ఉన్నప్పటికీ, దేశంలో తమిళ నాగరికత బాగా అభివృద్ధి చెందింది. దేశం లోని సంపద కారణంగా ఈ సంస్కృతి చాలావరకు కొనసాగింది. ఇప్పుటి లాగానే అప్పుడూ దాని ముత్యాల చేపల పెంపకానికి ప్రసిద్ధి చెందింది. ఈ మత్స్య సంపదలో, ఇప్పుడు తిన్నెవెల్లిలోని తాంబ్రపర్ణి నదిపై ఉన్న చిన్న గ్రామమైన కోర్కై (గ్రీకు KhXxot), ఒకప్పుడు పాండ్యుల రాజధాని. ఇది క్రైస్తవ శకానికి చాలా కాలం ముందు పాలనా కేంద్రంగా ఉంది.[1]
ప్లినీ కాలంలో, నౌకాశ్రయంలో ఇసుక మేట వేసిన కారణంగా, దాని వైభవం అప్పటికే క్షీణించడంతో, పాండ్యులు తమ రాజధానిని మధురైకి తరలించారు.[3] తరువాత ఇది తమిళ సాహిత్యానికి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. క్రీస్తుకు నాలుగు శతాబ్దాల ముందు మౌర్య రాజు అశోకుడు చోళ రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా గుర్తించాడు. వారికి కావేరి ముఖద్వారం వద్ద ఉన్న కావిరిపద్దినం (కావేరి పట్టణం) ప్రధాన ఓడరేవుగా ఉండేది. దాని అవశేషాలు ఇప్పుడు ఇసుకలో కూరుకుపోయాయి.[1]
క్రీస్తు తర్వాత మొదటి రెండు శతాబ్దాల వరకూ, రోమన్ సామ్రాజ్యం, తమిళ రాజ్యాల మధ్య పెద్ద ఎత్తున సముద్ర వాణిజ్యం జరిగింది; కానీ సా.శ. 215 లో అలెగ్జాండ్రియాలో కారకాల్లా ఊచకోత తర్వాత ఇది ఆగిపోయి, దానితో పాటు శతాబ్దాల పాటు యూరప్‌తో ఉన్న సంబంధం కూడా ఆగిపోయింది.[1]
4వ శతాబ్దంలో తమిళ పల్లవుల శక్తి పుంజుకుంది. ఇది దాదాపు 400 సంవత్సరాల పాటు ఇతర తమిళ రాజ్యాలను ఆక్రమించి దేదీప్యంగా వెలిగింది. సా.శ. 640 లో చైనా యాత్రికుడు హ్సువాన్ త్సాంగ్ పల్లవ రాజధాని కంచి (కంజేవరం)ని సందర్శించినప్పుడు, చోళ (చు-లి-యా) రాజ్యం ఒక చిన్న భూభాగంలో ఉందని, చాలా తక్కువ మంది అక్కడ నివసించేవారనీ తెలుసుకున్నాడు. పల్లవుల ఆధీనంలో ఉన్న పాండ్య రాజ్యంలో (మలకూట), సాహిత్యం చచ్చిపోయింది, బౌద్ధమతం అంతరించిపోయింది. ప్రజలు హిందూమతం, జైన మతాలను అవలంబించేవారు. ముత్యాల మత్స్య సంపద అభివృద్ధి చెందుతూనే ఉంది.[1]
సా.శ.740లో చాళుక్య విక్రమాదిత్యుని విజయంతో పల్లవ రాజుల శక్తి ఉడిగిపోయింది. 9వ శతాబ్దం చివరిలో పల్లవులను ఆదిత్య చోళుడు నాశనం చేసాడు. ఈ సమయం నుండి, శాసనాల రికార్డులు పుష్కలంగా ఉన్నాయి. 9వ శతాబ్దంలో బలహీనంగా ఉన్న చోళ రాజవంశం, ఇప్పుడు పునరుద్ధరించబడింది. నాలుగు సంవత్సరాల యుద్ధం తర్వాత చాళుక్యులను ఓడించిన రాజరాజ ది గ్రేట్ విజయాలతో దాని శక్తి పరాకాష్టకు చేరుకుంది. సుమారు సా.శ. 994 నాటికి పాండ్య రాజులు అతనికి సామంతులయ్యారు. ఒకప్పుడు అతని రాజధాని అయిన తంజావూరు లోని అద్భుతమైన ఆలయం గోడలపై అతని విజయాలను లిఖించాడు. సా.శ. 1018లో అతని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు సింహాసనాన్ని అధిష్టించాడు. గంగానది వరకూ తాను సాధించిన విజయాలకు ప్రతీకగా అతను గంగైకొండ అనే బిరుదును స్వీకరించాడు. అతను నిర్మించిన గంగైకొండ చోళపురం అనే కొత్త రాజధాని శిధిలాలు ఇప్పటికీ ట్రిచినోపోలీ జిల్లాలో ఓ నిర్జన ప్రాంతంలో ఉన్నాయి. అతని వారసులు చాళుక్యులు, ఇతర రాజవంశాలతో శాశ్వతమైన యుద్ధాలను కొనసాగించారు. 1278 లో మూడవ కులోత్తుంగ చోళుడు మరణించే వరకు చోళుల శక్తి పెరుగుతూ పోయింది. అతని తరువాత వారసత్వం వివాదాస్పదమై చోళుల పతనానికి కారణమైంది. దాంతో, కొన్ని సంవత్సరాల పాటు పాండ్యులకు అధికారానికి వచ్చి, దక్షిణాదిలో పైచేయి సాధించారు.[1]
అయితే 1310 లో, మాలిక్ కాఫూర్ నాయకత్వంలో జరిగిన దండయాత్ర దక్షిణ భారతదేశంలోని హిందూ రాజ్యాలను శిథిలావస్థకు చేర్చింది. చూర్ణం అయినప్పటికీ, ఆ రాజ్యాలు పూర్తిగా ఆరిపోలేదు; కొన్నాళ్ళ పాటు అరాచకం తాండవించింది. ఆ తరువాత, చోళ రాజులు, ముసుల్మాన్‌ల మధ్య పోరాటం పర్యవసానంగా కంచిలో 14వ శతాబ్దం చివరి వరకు పాలించిన హిందూ రాజవంశం స్థాపన జరిగింది, 1365లో పాండ్యుల శాఖ ఒకటి తిరిగి స్థాపించుకోవడంలో విజయం సాధించింది. మదురై రాజ్యంలో కొంత భాగం, అది 1623 వరకు ఉనికిలో ఉంది. [1]
15వ శతాబ్దం ప్రారంభంలో, దేశం మొత్తం విజయనగర రాజుల పాలనలోకి వచ్చింది; అయితే 16వ శతాబ్దంలో ముసల్మాన్లు విజయనగర సామ్రాజ్యాన్ని కూలదోసిన తర్వాత జరిగిన అరాచకత్వంలో, మదురై, తంజావూరు, కంచిలలో స్థాపించబడిన హిందూ ప్రభువులు (నాయకులు) తమను తాము స్వతంత్రులుగా ప్రకటించుకున్నారు. వారు కర్ణాటకను వారి మధ్య విభజించుకుని గోల్కొండ, బీజాపూర్ నవాబులకు సామంతులుగా మారారు.[1]
17వ శతాబ్దపు చివరికి వచ్చేసరికి, కర్నాటక ప్రాంతపు ఉత్తర భాగం ఔరంగజేబు అధీనం లోకి వచ్చింది. అతను 1692లో కర్నాటక నవాబు అయిన జుల్ఫికర్ అలీని ఆర్కాట్‌లో నవాబుగా నియమించాడు. ఇంతలో, మరాఠాల శక్తి అభివృద్ధి చెందడం ప్రారంభించింది; 1677లో శివాజీ వెల్లూరు, జింగీ, కర్నూల్‌లలో విజయనగర ప్రభువుల చివరి అవశేషాలను అణచివేయగా, 1674లో తంజావూరు నాయకులను పడగొట్టిన అతని సోదరుడు వెంకోజీ, ఆ నగరంలో ఒక రాజవంశాన్ని స్థాపించాడు. ఇది ఒక శతాబ్దం పాటు కొనసాగింది. ఔరంగజేబు మరణానంతరం ఢిల్లీ అధికార పతనం మరిన్ని మార్పులకు దారితీసింది. ఆర్కాట్ నవాబు సాదేత్-అల్లా (1710–1732) స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాడు; అతని వారసుడు దోస్త్ అలీ (1732–1740) 1736లో మధురైని జయించి, స్వాధీనం చేసుకుని, దక్షిణ-మధ్య భారతదేశంలో తన అధికారాన్ని స్థాపించాడు. అ తర్వాత హైదరాబాద్ నిజాం, అతని వారసులను ఉత్తర కర్ణాటక నవాబులుగా నియమించాడు. నవాబ్ మహమ్మద్ అన్వర్-ఉద్-దిన్ (1744-1749) మరణం తరువాత, మహమ్మద్ అలీ, హుసేన్ దోస్త్ మధ్య వారసత్వ వివాదం రేగింది. ఈ వైరంలో, ఫ్రెంచి వారు, ఆంగ్లేయులు, కర్ణాటకలో ప్రభావం కోసం పోటీ పడి, చెరొక పక్షాన నిలిచారు. బ్రిటిషు వారి విజయంతో మహమ్మద్ అలీ అధికారానికి వచ్చి 1795 లో మరణించే వరకు ఉత్తర కర్ణాటకను పాలించాడు. ఇంతలో, ఈ ప్రాంతంలో ఇతర సమస్యలు తలెత్తాయి. మదురై నాయకుల మరణానంతరం 1736 లో దాన్ని ఆక్రమించిన మదురై నవాబు దోస్త్ అలీ (1732–1740) ని 1741 లో ఓడించి మరాఠాలు అతని రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు; 1743లో మైసూర్‌కు చెందిన హైదర్ అలీ మధ్య కర్నాటకను ఆక్రమించి ధ్వంసం చేశాడు. 1758 లో మదురైని బ్రిటిషు మళ్ళీ ఆక్రమించారు. చివరకు, 1801లో ఒక ఒప్పందం ద్వారా ఆర్కాట్ నవాబు రాజ్యమంతటినీ తమకు రాయించుకున్నారు. దీని ప్రకారం నవాబుకు వార్షిక ఆదాయంగా అనేక లక్షల పగోడాలు ఇవ్వాలని, బ్రిటిషు వారు దేశ రక్షణ, ఆదాయ సేకరణ కోసం సైనిక బలగాన్ని నిర్వహించాలనీ ఒప్పందం కుదిరింది. 1853 లో నవాబు మరణంతో, అతని నామమాత్రపు సార్వభౌమాధికారాన్ని అంతం చేసి, అతని కుటుంబానికి ఉదారంగా భరణాన్ని ఇచ్చారు.
కర్నాటిక్ ప్రాంతంలోని మిగిలిన ప్రాంతాలను, బ్రిటిష్ వారు మొదటిసారిగా ప్రవేశించినప్పుడు, పాలెగాళ్ళు అనే సైనికాధికారులు పాలించేవారు. 1805 లో పాలెగాళ్ళ నిర్ణయాత్మక ఓటమి తరువాత, వారి కోటలు, సైనిక వ్యవస్థలూ ధ్వంసమయ్యాయి.[1]
కర్నాటిక్ ప్రాంతం మొఘల్ సామ్రాజ్యం, బ్రిటన్, ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన కర్నాటిక్ యుద్ధాలకు క్షేత్రమైంది. ఈ యుద్ధాల్లో చివరికి బ్రిటిషు వారు విజయం సాధించడంతో, భారతదేశంపై బ్రిటిష్ సామ్రాజ్య ఆధిపత్యానికి దారితీసింది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 public domain: Chisholm, Hugh, ed. (1911). "Carnatic". ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్) (11th ed.). Cambridge University Press. One or more of the preceding sentences incorporates text from a publication now in the
- ↑ Rice, Edward Peter (1921). A history of Kanarese literature. p. 12.
- ↑ Pliny Hist.