కానూరి వెంకటేశ్వరరావు

కానూరి వెంకటేశ్వరరావు కమ్యూనిస్టు కురువృద్ధుడు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకులు, న్యూడెమోక్రసీ సీనియర్‌ నాయకులు, ప్రజా గేయ రచయిత.వామపక్ష ఉద్యమాలకు, ప్రజా పోరాటాలకు పాటలు ప్రాణం పోశారాయన. కానూరి వెంకటేశ్వరరావు ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లో కూడా క్రియాశీలక సభ్యుడిగా ఉంటూ ఒక రచయితగా, ఒక కళాకారుడిగా సేవలందించారు. అనేక ఉద్యమాలకు తన పాటలు, బుర్రకథల ద్వారా ఊపిరి పోశారు. ప్రజా నాట్యమండలి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యల ద్వారా ఒక సాంస్కృతిక విప్లవాన్ని సృష్టించిన కలం యోధుడు.[1]

కానూరి వెంకటేశ్వరరావు
కానూరి వెంకటేశ్వరరావు చిత్రం
జననం1916
మరణంఏప్రిల్ 10, 2015
ఖమ్మంలోని సిపిఐ(ఎం.ఎల్‌)న్యూడెమోక్రసీ జిల్లా కార్యాలయం
ఇతర పేర్లుకానూరి వెంకటేశ్వరరావు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కమ్యూనిస్టు కురువృద్ధుడు
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకులు
న్యూడెమోక్రసీ సీనియర్‌ నాయకులు
ప్రజా గేయ రచయిత.
జీవిత భాగస్వామిదమయంతి
పిల్లలునలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు
తల్లిదండ్రులుమాణీక్యమ్మ,పున్నయ్య

జీవిత విశేషాలు మార్చు

ఆయన 1916లో కృష్ణా జిల్లా గుడివాడ తాలూకాలోని కోడూరు గ్రామంలో మాణీక్యమ్మ, పున్నయ్య దంపతులకు జన్మించారు. వారిది పేద రైతు కుటుంబం. భూమి, భుక్తి, దేశ విముక్తి కోసం వీరోచితంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రజానాట్యమండలి ప్రముఖులలో ఒకరుగా ఉన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, విరసం, ప్రజా రచయితల సమాఖ్య ద్వారా రచయితగా, కళారూపాల దర్శకుడిగా, ప్రదర్శకుడిగా, కళారంగంలో అవిరళంగా కృషి చేశారు.[2]

1956 లో కానూరి కుటుంబం వరంగల్కు వలస వెళ్ళీంది. ములుగు తాలూకా ఘనపురంలో వ్యవసాయం చేస్తూ కానూరి జీవితాన్ని కొనసాగించారు. భార్య దమయంతి ములుగు సమితి ఉపాధ్యక్షురాలిగా పనిచేసారు. ఆయనకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. 1995లో భార్య మరణానంతరం ఆయన తన మకాంను యింటి నుండి పార్టీ కార్యాలయానికి మార్చుకున్నారు. బుర్రకథ, ఒగ్గుకథ, హరికథ తదితర కళారూపాలతో ప్రజల్లో విప్లవ చైతన్యానికి ఆయన ఎంతో కృషి చేసారు. 1960-70 మధ్య "ప్రగతి బాగోతం" అనే నాటకాన్ని వ్రాసి పల్లెల్లో విస్తృతంగా ప్రదర్శించారు.సి.పి.యం నుండి విప్లవకారులు చీలిపోయినపుడు ఆయన విప్లవకారుల వైపు నిలబడ్డారు. పాట్ల రామనర్సయ్య సాన్నిహిత్యంలో నక్సల్బరీ, గోదావరి లోయ ఉద్యమాలకి అండగా నిలబడ్డారు.ఖమ్మంలో జరిగిన మొదటి విరసం మహాసభకు ఆయన హాజరయ్యారు. 1974లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పి.డి.ఎస్.యు విద్యార్థులతో పరిచయం యేర్పడి "అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య" నెలకొల్పారు. ఎమర్జన్సీ ఎత్తివేసిన తరువాత వివిధ జిల్లాలలో ఉన్న కళాకారులను సమావేశపరచి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా పురరుద్ధరించి కానూరి అరుణోదయ వ్యవస్థాపకులయ్యారు.[3]

చిన్ననాటి నుంచి పాట, పద్యం నటనల పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. 1933లో అంగలూరు గ్రామంలో అక్కినేని నాగేశ్వరరావు బాలకృష్ణుని పాత్రలో నటించిన ‘యశోదకృష్ణ’ పద్యనాటకంలో యశోద పాత్రధారిణి రాకుండా ఎగ్గొడితే ఆపద్ధర్మంగా కానూరి ఆ పాత్రను సవాలుగా స్వీకరించి పోషించారు. అందరి ప్రశంసలనూ పొందారు. 1940వ దశకంలో కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావంతో ప్రజా నాట్యమండలి ప్రదర్శనలకు ఆకర్షితుడై, 1944 నుంచి తన జీవితకాలపు చివరి శ్వాసదాకా ప్రజా కళారంగంలోనే కొనసాగిన అనితరసాధ్యమైన అంకితభావం కానూరిది. 1974లో ఆవిర్భవించిన ‘అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య’లో మొదటి నుంచి చివరిదాకా నిర్మాణ బాధ్యతలలో వుంటూ వచ్చారు.[4]

బుర్రకథల రచయితగా మార్చు

ఆయన జార్జిరెడ్డి, శ్రీకాకుళం, పోరాటం, విప్లవ సింహం రామనర్సయ్య, నీలం రామచంద్రయ్య హరికథలు, డాక్టర్‌ కోట్నీస్‌, గురజాడ, ఝాన్సీలక్ష్మీభాయి, భగతసింగ్‌ బుర్రకథలు రాశారు. భాయిబాగోతం, రాజధాని రగడ, ప్రగతి, ఇందిరా జాలం, యక్షగానాలు, ఒగ్గు కథలు, జనగానం (నృత్య కళారూపం), కాచనపల్లి అమరవీరుల రక్తగానం, నెల్లిమర్ల కార్మికుల పోరాట బుర్రకథలు రాశారు.[2]

సాహితీకారునిగా మార్చు

ఉమ్మడి రాష్ట్రంలో వందలాది క్యాంపులు నిర్వహించి, వేలాది మంది కళాకారులకు శిక్షణ ఇచ్చారు. నక్సల్బరీ ఉద్యమం నుంచి ఈనాటి గోదావరి లోయ ప్రజాసాహిత్యం వరకు వ్యంగ్య రచయితగా పేరుపొందారు. 1945లో ప్రజానాట్యమండలిలో చేరారు. 1950 వరకు క్రియాశీలకంగా పనిచేశారు. 'కథకాని కథ' అంటూ తన జీవిత చరిత్రను తానే స్వయంగా రాసుకున్నారు.[2]

వ్యక్తిగత జీవితం మార్చు

ఆయన సతీమణి దమయంతి. ఆమె 1995 లో మరణించారు. ఆయనకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు.

మరణం మార్చు

కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మంలోని సిపిఐ (ఎం.ఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యాలయంలో తన 99వ యేట ఏప్రిల్ 10 2015 న చివరిశ్వాస విడిచారు.[5]

మూలాలు మార్చు

  1. ప్రజా సాహిత్య సృష్టి కర్త...కానూరి వెంకటేశ్వరరావు[permanent dead link]
  2. 2.0 2.1 2.2 "ఎన్‌డి సీనియర్‌ నాయకులు 'కానూరి' మృతి". నవతెలంగాణ-ఖమ్మంప్రతినిధి. nava telangana. Retrieved 11 April 2015.
  3. "విప్లవ సాంస్కృతిక ఉద్యమ సారధీ కామ్రేడ్ కానూరి తాత సంస్మరణ సభ". Archived from the original on 2016-03-05. Retrieved 2015-07-19.
  4. "ప్రజా కళాకారుడు - దివికుమార్‌ (11-Apr-2015)". దివికుమార్‌ -జనసాహితి ప్రధాన కార్యదర్శి. andhra jyothi. Archived from the original on 7 మార్చి 2016. Retrieved 11 April 2015.
  5. "కానూరి వెంకటేశ్వరరావు కన్నుమూత." Archived from the original on 2016-03-04. Retrieved 2015-07-19.

ఇతర లింకులు మార్చు