కుముద్‌బెన్ జోషీ

కుముద్‌బెన్ మణిశంకర్ జోషీ (1985, నవంబరు 26 - 1990 ఫిబ్రవరి 7) వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా ఉంది. శారదా ముఖర్జీ తర్వాత ఈమె రాష్ట్రానికి రెండవ మహిళా గవర్నరు.[1] ఈమె కేంద్ర ప్రభుత్వంలో 1980 అక్టోబరు నుండి 1982 జనవరి వరకు సమాచార, ప్రసరణ సహాయమంత్రిగానూ, 1982 జనవరి నుండి 1984 డిసెంబరు వరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రిగాను పనిచేసింది.[2]

కుముద్‌బెన్ మణిశంకర్ జోషీ

పదవీ కాలం
1985, నవంబరు 26 – 1990, ఫిబ్రవరి 7
ముందు శంకర దయాళ్ శర్మ
తరువాత కృష్ణకాంత్

వ్యక్తిగత వివరాలు

జననం 1934, జనవరి 31
ధరోరి గ్రామం, నవ్సారీ జిల్లా, గుజరాత్
మరణం 2022 మార్చి 14
ధరోరి గ్రామం, నవ్సారీ జిల్లా, గుజరాత్
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రేసు
జీవిత భాగస్వామి అవివాహితురాలు
వృత్తి రాజకీయవేత్త

ప్రారంభ జీవితం

మార్చు

కుముద్‌బెన్ మణిశంకర్ జోషీ 1934, జనవరి 31న, గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాదు శివార్లలోని కత్వాడా గ్రామంలో జన్మించింది. ఈమె తండ్రి మణిశంకర్ జోషీ. నవ్‌సారిలోని ఎస్.బి.గర్దా కళాశాల నుండి బి.ఏ. పట్టభద్రురాలయ్యింది. ఆ తర్వాత ఆరేళ్ళపాటు విస్తరణ అధికారిగానూ, నాలుగేళ్ళ పాటు గుజరాత్ రాష్ట్రంలో మహిళా సహకార విద్యాధికారిగానూ పనిచేసింది.[3]

1971-72లో వల్సాడ్ జిల్లా కాంగ్రేసు ప్రధానకార్యదర్శిగా రాజకీయ జీవితం ప్రారంభించి, 1972 నుండి 1978 వరకు గుజరాత్ ప్రదేశ్ కాంగ్రేసు కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉంది. 1974-76 లలో గుజరాత్ రాష్ట్ర కాంగ్రేసు కన్వీనరుగా వ్యవహరించి, జిల్లా, రాష్ట్ర స్థాయి కాంగ్రేసు సమావేశాలు నిర్వహించింది. కుటుంబ నియంత్రణ, మురుగు పారుదల గూర్చి ప్రచారం చేసేందుకు అనేక శిబిరాలు నిర్వహించడమే కాక, వ్యవసాయరంగంలో అభివృద్ధి చెందిన విధానాలను రైతులకు తెలియజేసేందుకు కృషిచేసింది. గిరిజన ప్రాంతాలలో మహిళ, యువజన కార్యక్రమాలు, సహకార శిక్షణ, విద్య, విస్తరణ కార్యక్రమాల్లో ఆమె ప్రముఖ పాత్ర వహించింది.

జోషీ, 1973, అక్టోబరు 15 నుండి 1985, నవంబరు 25 వరకు మూడుసార్లు రాజ్యసభ సభ్యురాలిగా ఉంది.

 
ఇంటర్నేషనల్ కాటన్‌మిల్స్ ఫెడరేషన్ యొక్క పరిశోధనాకేంద్రాన్ని పర్యటించిన సందర్భంలో కొత్త పత్తి రకాన్ని పరిశీలుస్తున గవర్నరు కుముద్‌బెన్ జోషీ

గవర్నరుగా పదవి స్వీకరించిన వెంటనే, ఈమె రాష్ట్రంలోని 23 జిల్లాలు, రాష్ట్రం బయటా పర్యటించి, తనముందు వచ్చిన 13 మంది గవర్నర్ల కంటే తాను క్రియాశీలకమైన గవర్నరని చూపే ప్రయత్నం చేసింది. 1985 నవంబరు 26 నుండి 1987 సెప్టెంబరు 30 వరకు, ఈమె 108 సందర్భాల్లో జిల్లాలను, 22 సార్లు రాష్ట్రం బయటా సందర్శించింది. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి రామరావు, ఆయన పార్టీ వాళ్ళు, ఇది రాష్ట్రంలో కాంగ్రేసు బలగాన్ని పరిపుష్టం చేసేందుకు చేస్తున్న ప్రయత్నంగా చూశారు.

వివాదాలు

మార్చు

కుముద్‌బెన్ మణిశంకర్ జోషీ, తను రాజ్‌భవన్లో ఉన్నకాలంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుండి అనేక బెదిరింపులు ఎదుర్కొన్నది. రిపబ్లిక్ దినోత్సవ పరేడ్ ప్రసంగంలో, గవర్నరు కుముద్‌బెన్ రాష్ట్ర ప్రగతిని తక్కువచేసి మాట్లాడిన తీరును, ప్రసంగం శైలిని ఖండిస్తూ, రాష్ట్ర కేబినెట్ ఒక తీర్మానాన్ని ఆమోదించడంతో ఈమె వ్యతిరేక ప్రచారం మరింత తీవ్రతరమైంది. ఈ తీర్మానంలో మంత్రులు, ముఖ్యమంత్రి ఈ విషయమై అప్పటి రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్కు లేఖ వ్రాయవలసిందిగా కోరారు. తెలుగుదేశం మంత్రులు ఈమె "కాంగ్రేసు (ఐ) ఏజెంటు"గా వ్యవహరిస్తుందని విమర్శించారు.

తన ఇరవై నిమిషాల ధారాళమైన హిందీ ప్రసంగంలో, జోషీ, "ఏ రాష్ట్రమూ, కేంద్ర ప్రభుత్వ సహాయం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలుచేయలేదని" చెప్పింది. ఉదాహరణలుగా, కేంద్ర ప్రభుత్వం, విశాఖ ఉక్కు కర్మాగారంపై రోజుకు నాలుగు కోట్లు ఖర్చుపెడుతుందని, ఆహారధాన్యాల పంపిణీకై, రూపాయిలో 75 పైసలు సబ్సిడీ ఇస్తుందని చూపారు. కేంద్రప్రభుత్వం కాంగ్రేసేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలపై వివక్షను పాటిస్తుందన్న ఆరోపణను దృష్టిలో ఉంచుకొని ఈమె వ్యాఖ్యలు చేసింది.

అటవీ శాఖామంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు, రాష్ట్రం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పక్కకునెట్టి, కేంద్రప్రభుత్వ పథకాలనే ఎత్తిచూపిందని ఆరోపించాడు. సహకారశాఖామంత్రి ఎన్.యతిరాజారావు ప్రకారం "ఈమె గవర్నరు కార్యాలయాన్ని కాంగ్రేసు (ఐ) ప్రజాసంబంధాల కార్యాలయం స్థాయికి దిగజార్చింది." జోషీ, దీనికి ప్రతిచర్యగా హైదరాబాదులో అనేక స్థానిక వార్తాపత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. తనపై చేసిన ఆరోపణలను "చెత్త" అని అభివర్ణిస్తూ, "ఇలాంటి విమర్శలకు స్పందించడం తన గౌరవమర్యాదలకు తగనిపని." అని స్పదించింది.[4]

కుముద్‌బెన్‌ జోషీ అనారోగ్యంతో బాధపడుతూ 2022 మార్చి 14న తన స్వగ్రామం గుజరాత్‌లోని నవ్సారీ జిల్లా, ధరోరి గ్రామంలో మరణించింది.[5]

మూలాలు

మార్చు
  1. "Former Governors of Andhra Pradesh". National Informatics Centre. Archived from the original on 3 ఏప్రిల్ 2014. Retrieved 21 December 2012.
  2. "Worldwide Guide for women leadership". Guide2womenleaders. Retrieved 21 December 2012.
  3. "కొత్త గవర్నర్ కుముద్ బెన్ జోషి జీవిత విశేషాలు" (PDF). ఆంధ్రపత్రిక. No. 1985 నవంబరు 27. p. 6. Archived from the original (PDF) on 25 September 2020. Retrieved 29 October 2017.
  4. Stefaniak, B.; Moll, J.; Sliwiński, M.; Dziatkowiak, A.; Zaslonka, J.; Chyliński, S.; Leśniak, K.; Iwaszkiewicz, A.; Iljin, W. (1977). "[Development of technics employed in extracorporeal circulation in the years 1961-1976 in the light of 1,200 cases]". Kardiologia Polska. 20 (3): 247–250. ISSN 0022-9032. PMID 328977.
  5. Eenadu (15 March 2022). "ఉమ్మడి ఏపీ మాజీ గవర్నర్‌ కుముద్‌బెన్‌ జోషీ కన్నుమూత". Archived from the original on 15 March 2022. Retrieved 15 March 2022.