చంద్రశేఖర వేంకట రామన్

నోబెల్ బహుమతి పొందిన భౌతిక శాస్త్రవేత్త
(చంద్రశేఖర్ వెంకటరామన్ నుండి దారిమార్పు చెందింది)

సి.వి.రామన్‌FRS[1] (నవంబర్ 7, 1888 - నవంబర్ 21, 1970) భారతదేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త. రామన్‌ ఎఫెక్ట్‌ను కనిపెట్టాడు.[2] 1930 డిసెంబరులో రామన్‌కు నోబెల్‌ బహుమతి వచ్చింది. 1954లో భారత ప్రభుత్వం ఆయనను భారతరత్న పురస్కారంతో సత్కరించింది[3][4]. ఆయన పరిశోధన ఫలితాన్ని ధ్రువపరిచిన రోజును (ఫిబ్రవరి 28) జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది.

చంద్రశేఖర వేంకట రామన్
జననం(1888-11-07)1888 నవంబరు 7
తిరుచిరాపల్లి, మద్రాసు రాష్ట్రం, భారతదేశం
మరణం1970 నవంబరు 21(1970-11-21) (వయసు 82)
బెంగళూరు, కర్నాటక, భారతదేశం
జాతీయతభారతీయుడు
రంగములుభౌతిక శాస్త్రము
వృత్తిసంస్థలుభారత ఆర్థిక విభాగము
ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
చదువుకున్న సంస్థలుప్రెసిడెన్సీ కాలేజి
డాక్టొరల్ విద్యార్థులుజి.ఎన్.రామచంద్రన్
ప్రసిద్ధిరామన్ ఎఫెక్ట్
ముఖ్యమైన పురస్కారాలు నోబెల్ పురస్కారం
భారతరత్న
లెనిన్ శాంతి బహుమతి

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబరు 7 వ తేదీన తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతీ అమ్మాళ్ దంపతులకు జన్మించాడు. తాను ఎనిమిదిమంది సహోదరులలో రెండవవాడు. తన తండ్రి స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసాడు. 1882లో తన తండ్రి విశాఖపట్నంలో ఎ.వి.నరసింహారావు కళాశాలలో భౌతిక శాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగంలో చేరినందున వారి కుటుంబం విశాఖపట్నంలో నివాసముంది. అతను విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. సి.వి.రామన్ చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. ఆయన తండ్రి భౌతిక అధ్యాపకులవడం, అతనిని భౌతికశాస్త్రం వైపు మరింత కుతూహలం పెంచుకునేలా చేసింది. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ (ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించి) పూర్తి చేశాడు. 1907లో ఎం.యస్.సి (ఫిజిక్స్)లో యూనివర్సిటీకి ప్రథముడిగా నిలిచారు. తన 18 వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఈయన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమైంది. ఆయనలోని పరిశోధనాభిరుచిని పరిశీలించిన అధ్యాపకులు ప్రోత్సహించి ఇంగ్లాండు వెళ్ళి పరిశోధన చేయమన్నారు. కానీ ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఒక వైద్యుడు ఆయన ఇంగ్లాండు వాతావరణానికి సరిపడడని తేల్చడంతో అతను ఇంగ్లాండు ప్రయాణం విరమించుకున్నాడు. నన్ను అన్‌ఫిట్ అన్న ఆ డాక్టరుకు నేనెంతో రుణపడి ఉన్నాను అని తర్వాత రామన్ పేర్కొన్నారు. ఎమ్మే చదివి ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేశారు.

ఉద్యోగం

మార్చు

1907లో ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అయ్యారు. అక్కడ ఇండియన్‌ సైన్స్‌ అసోసియేషన్‌కు రోజూ వెళ్ళి పరిశోధనలు చేసుకునేవారు. రామన్‌ ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశుతోష్‌ ముఖర్జీ బ్రిటీష్‌ ప్రభుత్వానికి లేఖ రాస్తూ... రామన్‌ సైన్స్‌ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుందని సూచించారు. కానీ, బ్రిటీష్‌ ప్రభుత్వంఅంగీకరించలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి పరిశోధనలు కొనసాగించాడు.

ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ ఉత్తీర్ణుడై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు. ఉద్యోగంలో చేరే ముందు లోకసుందరి అమ్మాళ్‌తో వివాహమైంది. ఒకసారి కలకత్తాలో ప్రయాణం చేస్తున్నప్పుడు బౌబజారు స్ట్రీట్ వద్ద ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూసి పరుగు పరుగున వెళ్ళాడు. ఆ సంస్థ గౌరవ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్‌ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతిని పొందాడు. పరిశోధనలపై ఉన్న ఆసక్తి వలన తెల్లవారుజామున ఐదున్నరకే ఐసిఎస్‌కు వెళ్ళేవారు. తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం, తిరిగి సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశోధన, ఆదివారాలు, సెలవు దినాలు పరిశోధనలోనే గడిచేవి.

అతని తల్లి పార్వతి అమ్మాళ్‌కు సంగీతంలో మంచి అభిరుచి ఉండేది. ఆమె వీణను అద్భుతంగా వాయించేది. అందుకే రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం వంటి సంగీతవాయిద్యాల గురించి సాగాయి. విజ్ఞాన పరిశోధన తృష్ణ వలన తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరారు. 1921లో లండన్‌లో తను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై ఉపన్యాసాలు ఇచ్చాడు. అప్పుడు శ్రోతల్లోని ఒకరు ఇలాంటి అంశాలతోరాయల్ సొసైటీ సభ్యుడవు కావాలనుకుంటున్నావా అంటు నవ్వులాటగా అన్నప్పుడు ఆయనలో పరిశోధనలపై మరింత ఆసక్తి పెరిగింది. శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలను కాంతి శాస్త్రం వైపు మార్చాడు. తన తిరుగు ప్రయాణంలో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు రెండింటికి నీలిరంగు ఉండటం ఆయనను ఆలోచింపచేసింది. అప్పటిదాకా అనుకుంటున్నట్లు సముద్రపు నీలి రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదు. సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణం అని ఊహించాడు. కలకత్తా చేరగానే తన ఊహను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాలు కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. అందుకు యువశాస్త్రవేత్తలైన కె.ఆర్.రామనాధన్, కె.యస్ .కృష్ణన్ ఆయనకు అండగా నిలిచారు. 1927 డిసెంబరులో ఒకరోజు సాయంత్రం కె.యస్.కృష్ణన్ రామన్ వద్దకు పరుగెత్తుకొని వచ్చి కాంప్టన్ (భౌతిక శాస్త్రవేత్త)కు నోబెల్ బహుమతి వచ్చిందని ఆనందంతో చెప్పగానే రామన్ ఎక్సలెంట్ న్యూస్ అని సంతోషపడ్డా, కాంప్టన్ ఫలితం ఎక్స్(X) కిరణాల విషయంలో నిజమైనపుడు, కాంతి విషయాలలో నిజం కావాలి కదా అనే ఆలోచనలో పడ్డాడు. ఆ ఆలోచనే రామన్ ఎఫెక్టుకు దారితీసింది. తగినంత అధునాతనమైన పరికరాల్లేకపోయినా, రామన్ తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంగా ఉన్నాడు.

అతను అనుకున్నట్లే 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్టు అంటే పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞులసదస్సులో చూపించాడు. అందుకే బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్‌హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈ రామన్ ఎఫెక్టు అసామాన్యమైనదని, అందులో 200 రూపాయలు కూడా ధరచేయని పరికరాలతో ఆ దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ రామన్‌ను అభినందించారు. ఈయన పరిశోధన యొక్క విలువను గుర్తించి 1930లో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు. ఆ మహనీయుని సేవలను భారత ప్రభుత్వం గుర్తించి 1954లో 'భారతరత్న' అవార్డు బహుకరించిన సమయంలో సందేశాత్మక ఉపన్యాసం ఇస్తూ 'విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి' అన్న మాటలు నేటికి ఆలోచింపచేసేవి. ఆయన నాజీవితంలో ఒక విఫల ప్రయోగం. ఎందుకంటే నేను నా మాతృభూమిలో నిజమైన సైన్స్ నిర్మాణం చేయగలననుకున్నాను. అంటూ చివరి వరకు భారతదేశంలో సైన్స్ అభివృద్ధికై పాటుపడ్డ ఆ మహనీయుడు 1970 నవంబర్ 20 న భౌతికంగా కన్నుమూసినా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించుకొని ఆయనను చిరంజీవిగా మనమధ్యే నిలిపేలా కొన్ని సంస్థలు ఆయన పేరు మీద టాలెంట్ టెస్ట్‌లు, సైన్స్‌కు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నాయి. విద్యార్థినీ, విద్యార్థుల్లో ఆయన స్ఫూర్తిని నింపుతూ సైన్స్ అంటే మక్కువ కలిగేలా చేస్తున్నాయి. 1928లో ఫిబ్రవరి 28న ఈయన రామన్ ఎఫెక్టును కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ఫిబ్రవరి 28వ తారీఖును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా (నేషనల్ సైన్స్ డే) జరుపుకొంటారు.

జాతీయ విజ్ఞాన దినోత్సవం

మార్చు
 
చిత్తూరు జిల్లా మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని సి.వి.రామన్ విగ్రహం

1928లో ఫిబ్రవరి 28న ఈయన రామన్ ఎఫెక్టును కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ఫిబ్రవరి 28వ తారీఖును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా (నేషనల్ సైన్స్ డే) జరుపుకొంటారు.

మూలాలు

మార్చు
  1. Bhagavantam, S. (1971). "Chandrasekhara Venkata Raman 1888-1970". Biographical Memoirs of Fellows of the Royal Society. 17: 564–526. doi:10.1098/rsbm.1971.0022.
  2. "Sir Venkata Raman - Biographical". Nobel Peace Prize - Official website. Retrieved 6 November 2013.
  3. "Raman, Sir Chandrasekhara Venkata". Encyclopædia Britannica, Inc. 2007. Retrieved 2007-09-11.
  4. G. Venkataraman, Journey into light: Life and Science of C. V. Raman, Indian Academy of Science, 1988. ISBN 818532400X.

బయటి లింకులు

మార్చు