చుక్కపల్లి పిచ్చయ్య

చుక్కపల్లి పిచ్చయ్య పారిశ్రామికవేత్త. ఇతడు దాతగా, మానవతావాదిగా పేరుగడించాడు.

చుక్కపల్లి పిచ్చయ్య
జననంచుక్కపల్లి పిచ్చయ్య
(1928-08-07)1928 ఆగస్టు 7
Indiaకంచెర్ల పాలెం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం2012 మే 24
విజయవాడ
మరణ కారణంఅనారోగ్యం
వృత్తిపారిశ్రామికవేత్త
ఉద్యోగంపాపులర్ షూమార్ట్
ప్రసిద్ధిమానవతావాది, వితరణశీలి, సామ్యవాద సిద్ధాంత ప్రచారకుడు, శాంతి ఉద్యమకారుడు, ప్రగతిశీల సాహితీవేత్త
మతంహిందూ
భార్య / భర్తసరోజనమ్మ
పిల్లలుఅరుణ్‌కుమార్‌, అమర్‌కుమార్‌, విజయ్‌కుమార్‌, శాంతకుమారి

జీవిత విశేషాలు

మార్చు

ఇతడు గుంటూరు జిల్లా, తెనాలి మండలం కంచెర్ల పాలెం గ్రామంలో 1928 ఆగష్టు 7వ తేదీన జన్మించాడు. ఇతని తండ్రి పేరు చుక్కపల్లి తిరుమలయ్య. ప్రాథమిక విద్య అనంతరం ఇతని సోదరుడు చుక్కపల్లి తిరుపతి వెంకయ్య ప్రోత్సాహంతో 1957లో వ్యాపారంలో ప్రవేశించాడు. వ్యాపారరంగంలో వుంటూనే సాహిత్యం, పుస్తక రచన పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. ఆయన స్వయంగా రాసినవిగాని, ఇతరుల పుస్తకాలు సంకలనం చేసినవిగాని కోటి 73 లక్షల 66 వేల ప్రతులు వుంటాయి. ఈయన ప్రగతిశీల సాహితీవేత్త. 1962లో పాపులర్‌ షూమార్ట్‌ ప్రధాన కార్యాలయం, బ్రాంచీల విధానాన్ని విజయవాడలో ప్రారంభించి, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలలో 145 బ్రాంచీలకు విస్తరించాడు. ఈయన సంస్థల్లో సుమారు 900 మంది ఉద్యోగులున్నారు. 1977లో పాపులర్‌ షూమార్ట్‌ గ్రూప్‌ సంస్థల ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి అనేక రూపాలలో పేద, వికలాంగ, అనాథలను ఆదుకున్నాడు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో బాధితులకు తక్షణ సాయంగా దుప్పట్లు, వంట సామాన్లు, టవల్స్‌ లక్షలాది రూపాయల విలువైనవి అందించాడు. అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సహాయనిధులకు భూరి విరాళాలు అందజేశాడు. వ్యాపారరంగంలో ఈయన చేసిన కృషికిగాను అనేక అవార్డులు సొంతం చేసుకున్నాడు. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల నుండి ఉద్యోగ పత్ర, లోకశ్రీ, విజయశ్రీ, ఉద్యోగరత్న, ఎక్సలెన్సీ, సేల్స్‌ ప్రమోషన్‌ అవార్డులు అందుకున్నాడు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ అనేక దేశాల్లో పర్యటించాడు. ఇందుకు గుర్తింపుగా 'ప్రపంచశాంతి బంగారుపతకం' అందుకున్నాడు. సోవియట్‌ రష్యా, అమెరికా, చైనా, కెనడా, బ్రిటన్‌, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్, చెకొస్లోవేకియా, తూర్పు జర్మనీ, ఆఫ్ఘనిస్తాన్‌, థాయిలాండ్, శ్రీలంక, బ్యాంకాక్, హాంగ్‌కాంగ్, జపాన్‌, ఫిలిప్పీన్స్, సింగపూరు, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించాడు. సోవియట్‌ రష్యా, చైనా సందర్శించి వచ్చిన తర్వాత ఆయా దేశాల విశిష్టతను తెలియజేస్తూ పుస్తకాలను రచించి 15 లక్షల 95 వేల ప్రతులను ప్రజలకు అందించాడు. చిన్నతనం నుండి వామపక్ష భావాలతో పెరిగిన పిచ్చయ్య కులమతాలకు అతీతంగా స్వగ్రామమైన కంచెర్ల పాలెంలో జనరల్‌ పంచాయతీ ఎన్నికల్లో దళితుడిని అభ్యర్థిగా నిలిపి గెలిపించాడు. అనేక ఆదర్శ వివాహాలు జరిపించాడు. ఇతడి సంస్థల్లో కుటుంబ నియంత్రణ, ధూమపాన నిషేధం విధించి మార్గదర్శకంగా నిలిచాడు. ఉద్యోగులకు పలు సమకాలీన అంశాలపై శిక్షణ ఇప్పించాడు. నాయుడమ్మ సైన్స్‌ ఫౌండేషన్‌ పాదరక్షల వ్యాపారానికి ఇతడిని రోల్‌మోడల్‌గా గుర్తించి 'మాన్యుఫ్యాక్చరర్‌ ఆఫ్‌ ఫుట్‌వేర్‌ పిచ్చయ్యాస్‌ మోడల్‌' అనే పుస్తకాన్ని ప్రచురించి వెనుకబడిన దేశాల్లో పంపిణీ చేసింది. ఈయనకు భార్య సరోజనమ్మ, ముగ్గురు కుమారులు అరుణ్‌కుమార్‌, అమర్‌కుమార్‌, విజరుకుమార్‌, కుమార్తె శాంతకుమారి ఉన్నారు. వీరంతా ఫుట్‌వేర్‌ వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. ఇతడు కొంత కాలం అనారోగ్యంతో బాధపడుతూ, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయవాడలో 2012, మే 24, గురువారం తన 84వ యేట మరణించాడు[1].

రచనలు

మార్చు
  1. ఆచరించండి! - వ్యక్తివికాసానికి ఉత్తమపద్ధతులు
  2. ప్రథమ సోషలిష్టు దేశంలో పర్యటన-పరిశీలన
  3. చైనాలో మా పర్యటన అనుభవాలు
  4. నమ్మకాలు-నిజాలు - సి.వి.సర్వేశ్వరశర్మతో కలిసి
  5. ఆలోచించండి!

మూలాలు

మార్చు