సింగపూరు

ఆసియా ఖండంలోని చిన్నదేశం

సింగపూర్ (మలయ్: Singapura; చైనీస్: 新加坡, Xīnjiāpō; తమిళం: சிங்கப்பூர்), అధికారిక నామం సింగపూర్ గణతంత్రం, ఒక చిన్న ద్వీపం, నగరం, దేశం కూడాను. మలేషియాకు దక్షిణాన ఉంది. 704 చదరపు కిలోమీటర్ల (272 చదరపు మైళ్ళు) విస్తీర్ణంతో దక్షిణ ఆసియాలోని అతి చిన్న దేశం.

రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్
新加坡共和国
சிங்கப்பூர் குடியரசு
Republic of Singapore
Flag of సింగపూరు సింగపూరు యొక్క Coat of arms
నినాదం
["Majulah Singapura"] Error: {{Lang}}: text has italic markup (help)  (Malay)
"Onward, Singapore"
ముందుకు, సింగపూర్'
జాతీయగీతం
మజూలా సింగపురా
(మజులా సింగపురా)
సింగపూరు యొక్క స్థానం
సింగపూరు యొక్క స్థానం
రాజధానిసింగపూరు నగరం
1°17′N 103°51′E / 1.283°N 103.850°E / 1.283; 103.850
అతి పెద్ద నగరం సింగపూరు
అధికార భాషలు ఆంగ్లము 
మలయ్ 
చైనీస్ మాండరిన్ 
తమిళం 
ప్రభుత్వం పార్లమెంటరీ తరహా రిపబ్లిక్కు
 -  రాష్ట్రపతి టోనీ టాన్
 -  ఫ్రధానమంత్రి లీ సియెన్ లూంగ్
స్వతంత్రం
 -  స్వపరిపాలన
ఇంగ్లాండు పరిపాలనలో

June 3 1959[1] [1] 
 -  ఏక పక్షంగా స్వతంత్రం ప్రకటన ఆగస్టు 31 1963 
 -  మలేసియాతో విలీనం సెప్టెంబరు 16 1963 
 -  మలేసియా నుండి వేరుపడడం ఆగస్టు 9 1965 
విస్తీర్ణం
 -  మొత్తం 704.0 కి.మీ² (188వ స్థానం)
270 చ.మై 
 -  జలాలు (%) 1.444
జనాభా
 -  2007 అంచనా 4,483,900 (117వ స్థానం)
 -  2000 జన గణన 4,117,700[2] 
 -  జన సాంద్రత 6,489 /కి.మీ² (2 వస్థానం)
16,392 /చ.మై
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం US$228.116 బిలియన్లు[3] (44వ స్థానం)
 -  తలసరి US$49,714 (6వ స్థానం)
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase 0.916 (high) (25వ స్థానం)
కరెన్సీ సింగపూరు డాలరు (SGD)
కాలాంశం SST (సింగపూర్ ప్రామాణిక కాలం) (UTC+8)
 -  వేసవి (DST)  (UTC+8)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .sg

బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ 1819వ సంవత్సరములో అడుగుపెట్టినప్పుడు ఇది మలయ్, ఒరాంగ్ లౌట్ జాలర్లు నివసించు గ్రామం. బ్రిటిషు వారు రవాణాల నిమిత్తం వాడుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపాను ఆక్రమించింది, 1945 సంవత్సరములో తిరిగి బ్రిటిష్ వారి పరమయ్యింది. 1963 సంవత్సరములో మలేషియా ఏర్పడినప్పుడు దానిలో భాగంగా ఉండి, రెండు సంవత్సరముల తరువాత సైద్ధాంతిక విభేదాలతో విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడినది.

స్వతంత్ర దేశంగా అవతరించిన తరువాత, సగటు సింగపూర్ నివాసి జీవనశైలి గణనీయంగా మెరుగుపడింది. విదేశీ పెట్టుబడులు ప్రభుత్వ యాంత్రీకరణము వలన ఎలక్ట్రానిక్సు, కర్మాగారం ఆధారంగా ఒక ఆధునిక ఆర్థికరంగం ఉద్భవించింది. స్థూల జాతీయ ఉత్పత్తి ఆధారంగా ప్రపంచంలో 18వ ధనవంతమైన దేశము. భూభాగము ప్రకారము ఎంతో చిన్నదయినా, సి.$212 బిలియన్ల మారకద్రవ్య (అ.$139 బిలియన్లు) నిల్వలు కలది. ధనవంతమైన జీవన శైలి ప్రకారము, ది ఎకనామిస్టు (2005) సింగపూరును ఆసియాలో అతి ఉత్తమమైనదిగా ప్రపంచములో 11వ స్థానముగా నిర్ధారించింది. ఇంత చక్కటి విలువలు కలిగి ఉన్నా, సగటున లక్ష జనాభాకు 13.57 మరణశిక్షలు నమోదు అవుతున్నాయి, సౌదీ అరేబియా 4.65, చైనా 2.01 శాతం గమనించాల్సిన విషయం.

పేరు వెనుక గాథ

మార్చు
 

వికీపీడియా నుండి సింగపుర అనే పేరు రెండు మలయ్ (మూలం సంస్కృతం) పదాలైన సింగ (సింహము), పుర (పురము) అనే రెండు పదాల కలయిక వలన వచ్చింది. చారిత్రక పుటల ప్రకారము, పధ్నాలుగువ శతాబ్దపు సుమత్ర ద్వీప యువరాజు సంగ్ నిల ఉతమ ఈ ద్వీపాన్ని సందర్శించినప్పుడు సింహము తల వలె ఉన్న ఒక వింత జంతువు కనిపించినందుకు ఆ పేరు పెట్టాడట.

 
సింగపూరు డౌన్ టౌన్

దక్షిణ ఆసియా ఖండంలో అతి చిన్న దేశము సింగపూర్. వ్యాపారపరంగానూ, ఆర్థికంగానూ బాగా అభివృద్ధి చెందిన దేశము. చక్కటి పర్యాటక కేంద్రము కూడా అయిన ఈ దేశములో మలయ్, చైనా, భారత దేశీయులు ఎక్కువగా స్థిరపడటంతో విభిన్న సంస్కృతులకు నిలయముగా మారినది. పర్యాటకముగానే కాక విలాసాలకు, వినోదాలకు పేరుపొందిన దేశము సింగపూర్.

సింగపూర్ లో ఇటీవల కాసినోవా అనబడే పాశ్చాత్యుల జూదగృహము నిర్మించడముతో ధనవంతులైన వ్యాపారవేత్తలను ఇది చక్కగా ఆకర్షిస్తూఉంది. ఆరోగ్యపరంగానూ సింగపూర్ అభివృద్ధి పథంలో ఉండటంతో విదేశీయులు సైతము వైద్యము కోసము ఇక్కడకు వస్తూ ఉంటారు. పరిశుద్ధతలో కూడా చక్కటి పేరు సంపాదించిన దేశము ఇది. సింగపూరు అభివృద్ధికి ఇక్కడి పరిపాలనా దక్షత కూడా ఒక కారణము. పకడ్బందీగా ఉండే పరిపాలనా నిర్వహణ అతి చిన్నదేశమైన సింగపూరుని ప్రపంచ దేశాలలో ఆర్థికంగా 13వ స్థానంలో నిలిచేలా చేసింది.

చరిత్ర

మార్చు

సింగపూరు అనే పేరుకు సంస్కృత పదమైన సింహపుర్ (सिंहपुर) మూలమని ఇక్కడ ప్రజల విశ్వాసము. 14 వ శతాబ్దములో సుమత్ర మలయ్ రాజకుమారుడు సన్గ్ నిల ఉతమ తుఫానులో చిక్కుకొని ఈ దీవిలో అడుగు పెట్టినపుడు అతనికి ఒక మృగము కనిపించింది. దానిని అతని మంత్రి సింహముగా గుర్తించాడు. ఆ కారణంగా దీనికి సింగపూర్ అన్న పేరు స్థిర పడింది. కానీ ఇటీవలి పరిశోధనలు సింగపూరులో సింహాలు ఎప్పుడూ నివసించిన దాఖలాలు లేవని నిర్ధారించారు. రాజకుమారుడు సన్గ్ నిల ఉతమ చూసిన మృగము మలయ్ పులి అయి ఉండవచ్చని అభిప్రాయ పడుతున్నారు.

ప్రారంభంలో ఈ ద్వీపము 'సుమత్రన్ శ్రీవజయ' సామ్రాజ్యములో తెమసెక్ (సముద్ర పురము) అనే జవనెసె నామముతో వ్యవహరించబడి క్రీపూ 2 వ శతాబ్దమునుండి 14 వ శతాబ్దము వరకు వ్యాపారకేంద్రముగా విలసిల్లిన తరువాత క్షీణదశ ఆరంభమైంది. పురాతన అవశేషాలు ఇంకా తెమసెకలో మిగిలి ఉన్నా ఆర్కియాలజిస్టులచే ఇది నిర్ధారించబడలేదు. 16వ శతాబ్దము నుండి 19వ శతాబ్ధపు ప్రారభం వరకు జోహర్లో ఒక భాగంగా ఉంది. ఈ సమయములో ఈ ద్వీపము జాలరుల నివాసస్థలంగా ఉంటూ వచ్చింది.

1819వ సంవత్సరము జనవరి 29 వ తేదీన ఈ ద్వీపంలో కాలిడిన థోమస్ స్టాన్ ఫోర్డ్స్ రాఫిల్స్ భౌగోళికంగా సింగపూరు వ్యాపారానికి అత్యంత అనుకూలమైన ప్రదేశంగా గుర్తించి ఈస్టిండియా కంపెనీ తరఫున బ్రిటిష్ వ్యాపారకేంద్రముగా అభివృద్ధి పరచే ఉద్దేశముతో ఒక ఒప్పందము చేసుకున్నాడు.ఈ ఒప్పందము దేశములో ఆధునిక యుగానికి నాంది పలికింది. అంతర్జాతీయంగా ఇక్కడకు వచ్చినివసించే వారిపై పౌరసత్వ కట్టుబాట్లు నిర్బంధం లేని కారణంగా వివిధ సంస్కృతులకు చెందిన ప్రజలు ఇక్కడ స్థిరపడటము ఆరంభము అయినది. 1858 వ సంవత్సరము నుండి జరిగిన ఈస్టిండియా పరిపాలన 1867 వ సంవత్సరమున బ్రిటిష్ సామ్రాజ్యపు ఛత్రము కిందకు చేరింది. సా.శ. 1869 వ సంవత్సరానికి జనసంఖ్య 1,00,000 కు చేరుకుంది. బ్రిటిష్ కాలనీ ఆరంభం నగరనిర్మాణ వ్యూహాలతో నగరాన్ని సంస్కృతి పరంగా విభజించింది. సింగపూర్ నది ప్రాంతము వ్యాపారుల, బ్యాంకర్ల ఆధిక్యములో వాణిజ్యపరంగా అభివృద్ధిని సాధించింది.

రెండవ ప్రపంచ యుద్ధకాలములో ఈ ద్వీపము ఆంగ్లేయ సైనికుల అసమర్ధత కారణంగా 1942 వ సంవత్సరము ఫిబ్రవరి 15వ తేదీన 6 రోజుల యుద్ధము తరువాత జపాను సైన్యంచే ముట్టడించబడి జపాను వశమైంది. ఈ యుద్ధము బ్రిటిష్ సైన్యము యొక్క అతి పెద్ద వైఫల్యముగా చర్చిల్ చే వర్ణించబడింది. 1945 వ సంవత్సరము సెప్టెంబర్ 12 వ తేదీన జపానీయుల లొంగుబాటు తరువాత తిరిగి ఈ ద్వీపాన్ని బ్రిటిష్ వశపరచుకుంది.

స్వతంత్రము

మార్చు

1959 వ సంవత్సరములో స్వతంత్రదేశంగా అవతరించిన సింగపూరు 1962వ సంవత్సరము ఆరంభమైన వ్లీన చర్చల ఫలితంగా 1963 సెప్టెంబర్ 16 న మలయాళో విలీనమైంది కానీ తరువాతి కాలంలో వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా 1965 ఆగస్టు మాసంలో అధికారపూర్వకంగా స్వతంత్ర ప్రతిపత్తిని సాధించుకుంది.

పర్యాటక కేంద్రముగా సింగపూరు

మార్చు

సింగపూరు పారిశుద్ధ్యానికి పేరు పొందిన నగరం. ఈ దేశ ఆర్థిక వనరులలో పర్యాటక రంగము ప్రధాన పాత్ర వహిస్తుంది కనుక ఇక్కడకు విచ్చేసే పర్యాటకులకు విమానాశ్రయంలోనే తాత్కాలిక వీసా మంజూరు చేసే ఏర్పాటు ఉంది . ఈ దేశానికి వివిధ దేశాలనుండి టూరిస్ట్ వీసా సులువుగానే లభిస్తుంది.

 
సింగపూర్‌లోని కెనడియన్ ఇంటర్నేషనల్ స్కూల్

నైట్ సఫారీ

మార్చు

నైట్ సఫారీ అంటే రాత్రివేళలో జంతు ప్రదర్శనశాల చూసే ఏర్పాటు ఉంది. జంతుప్రదర్శనశాలలో ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఉంటాయి. రాత్రివేళలో జంతువులను వాటి సహజ పరిస్థితులలో చూడటము పర్యాటకులకు వింత అనుభూతిని కలిగిస్తుంది. పగటివేళలో కూడా జంతుప్రదర్శనశాలను చూసే ఏర్పాటు ఉంది.

పక్షుల పార్క్(Bird Park)

మార్చు

ఇక్కడ పక్షులచేత రకరకాల విన్యాసాలు చేయిస్తారు. అద్భుతమైన ఈ ప్రదర్శన పర్యాటకులనెంతో ఆకర్షిస్తుంది.అలాగే అనేక రకముల పక్షులను ఇక్కడ సందర్శించ వచ్చు. గద్ద తన ఆహారాన్ని ఎలా వేటాడుతుందో ఇక్కడ సందర్శకుల కోసము ప్రదర్శిస్తూ ఉంటారు.అత్యంత అపురూపమైన లేత కాషాయ రంగు హంసలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. పార్కు మొత్తము చుట్టి చూడటానికి చక్కని రైలు ప్రయాణము ఉంది. స్కై టవర్లో సందర్శకులను టవర్ పై భాగానికి తీసుకువెళ్ళి కిందకు దించుతారు. పైకి వెళ్ళినపుడు సింగపూరే కాక చుట్టూ ఉండే ఇండోనేషియా, మలేషియా చూడగలగటము ఒక అద్భుతమైన ఆకర్షణ.

సెంతోసా ద్వీపం

మార్చు

ఈ ద్వీపానికి కేబులు కారులో ఒక దారిలో వెళ్ళవచ్చు. తిరిగి రావడానికి బస్సురూటును ఉపయోగించుకుంటారు. సింగపూరులో భాగమైన సెంటోసా ద్వీపంలో సింగపూరు జాతీయ చిహ్నమైన మెర్లాయన్ కింది సగ భాగము చేప, పై సగ భాగము సింహము. సందర్శకులను మెర్లాయన్ తలభాగమువరకు లిఫ్ట్ లో తీసుకు వెళతారు. ముందుగా ఒక చిన్న ప్రదర్శన ఉంటుంది .ఇక్కడ సంప్రదాయక భవనంలో సింగపూరు చరిత్రను లేజర్ షో సహాయంతో ప్రదర్శిస్తారు. అతి సహజమైన పరిస్థితిలో జీవము ఉట్టిపడే బొమ్మలతో నావ ప్రయాణము, నావికులు, వర్తకము అనేక సంప్రదాయాలు ప్రతిబింబించే బొమ్మలతో కూడిన ప్రదర్శనశాలను సందర్శకులు సందర్శించవచ్చు.

ఇక్కడ చూడవలసిన వాటిలో ఆండర్ వాటర్ వరల్డ్ కూడా ముఖ్యమైనదే. భూగర్భములో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ వరల్డ్ లో అనేక సముద్ర ప్రాణులు సజీవముగా చూసే ఏర్పాటు ఉంది. రాత్రివేళలో అద్భుతమైన లేజర్ షోలు జరుగుతూ ఉంటాయి. సింగపూరు సముద్ర తీరాన రేవు (హార్బర్) నుండి క్రూయిజ్ లలో అర్ధరోజు టూర్, దీర్ఘకాల అంటే రెండు నుండి మూడు రోజుల పడవ ప్రయాణము చేయవచ్చు. ఈ టూరులో ఈ దేశములో భాగమైన ఇతర దీవులను సందర్శించవచ్చు. సముద్రతీరములో డాల్ఫిన్ షో లను జరుపుతూ ఉంటారు.

లిటిల్ ఇండియా, చైనాటౌన్, సెరంగూన్ రోడ్

మార్చు

ఇవి చూడవలసిన వాటిలో ప్రధానమైనవి. పండుగ సమయాలలో అంగడి వీధులను చూడముచ్చటగా అలంకరిస్తారు. విదేశీయులు ఇక్కడ ముస్తాఫా, సన్ టెక్ లలో తమకు కావలసిన వస్తువులను తప్పక కొనుగోలు చేస్తుంటారు. సన్ టెక్ నిర్మాణాన్ని ఇక్కడి ప్రజలు గొప్పగా వర్ణిస్తుంటారు. ఇక్కడ అనేక మతాలకు సంబంధించిన గుడులు ఆయా సంప్రదాయాలను చక్కగా ప్రతిబింబిస్తూ భక్తులను అలరిస్తుంటాయి. ఇక్కడి భోజనశాలల్లో రుచికరమైన భారతీయ భోజనం లభించే సదుపాయము ఉంది.

రవాణా సదుపాయాలు

మార్చు
 

సింగపూరు ప్రజలు ఎక్కువగా మెట్రో రైళ్ళు, సిటీ బస్సుల పై ఆధారపడతారు. ముందుగా రుసుము చెల్లించి తీసుకున్న పాసులతో నిర్ణయించిన మైలేజి వరకు ప్రయాణము చేయవచ్చు. పార్కింగ్, ట్రాఫిక్ జామ్, వాహన రద్దీలను తగ్గించుటకు ఇక్కడి ప్రభుత్వము పార్కింగ్ రుసుము అధికము చేయడము, అధిక కొనుగోలు పన్నులను విధించడము చేస్తుంటుంది. ఈ కారణంగా ప్రజలు ఎక్కువగా బస్సులు, రైళ్ళలోనే ప్రయాణిస్తుంటారు. టాక్సీలలో ఎక్కువగా ఒకేరకమైన కనీస రుసుము వసూలు చేస్తుంటారు. విహార యాత్రీకుల కోసము ఆకర్షణీయమైన పైభాగము తెరచి ఉండే బస్సులను నడుపుతూ ఉంటారు. చక్కటి ప్రయాణ వసతులు ఉన్నా ప్రజల అవసరానికి సరిపడనందున రవాణా వ్యవస్థ కొంత ప్రజల విమర్శను ఎదుర్కొంటూ ఉంటుంది.

 
సింగపూర్ రేవు - వెనుక ప్రక్క సెంతోసా దీవి చూడవచ్చును

విదేశాంగ వ్యవహారాలు

మార్చు

సింగపూరుకు 175 దేశాలతో చక్కటి దౌత్య సంబంధాలు ఉన్నాయి, వాటిలో ఎక్కువభాగము దౌత్యకార్యాలయాలను నెలకొల్పలేదు. సింగపూరుకు ఐక్యరాజ్యసమితిలో, కామన్వెల్త్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో సభ్యత్వము ఉంది. యునైటెడ్ కింగ్‌డమ్తో చక్కటి సంబంధ బాంధవ్యాలను నడుపుతూ ఉంది. అందువలన బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియాలతో కలిసి ఐదు దేశాల రక్షణ ఒప్పందముతో సురక్షితమై ఉంది. సింగపూర్ అమెరికాతో కూడా మంచి సంబంధాలను కలిగి ఉంది. అనేక దేశాలతో ధారాళమైన వ్యాపార ఒప్పందాలను కలిగి ఉంది.

జనసంఖ్య

మార్చు

2007 సెప్టెంబర్ నాటికి సింగపూరు జనాభా 46,80,000 ను చేరింది.వీరిలో ఇక్కడ స్థిరపడినవారు 37,00,000.వీరిలో చైనీయులు 75.2%, మలయావారు 13.6%, భారతీయులు8.8%,2.4 ఇతర దేశాలకు చెందినవారు.ప్రపంచంలో జనసాంద్రతలో ప్రజా పరిపాలన అమలులో ఉన్న దేశాలలో సింగపూరు రెండవ స్థానంలోఉంది. 1960లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్నందున స్థలాభావం, కనీస అవసరాలను అందించే వనరులను దృష్టిలో పెట్టుకొని కుటుంబ నియంత్రణ కట్టుబాటును కట్టుదిట్టం చేశారు.1990లో కూలిపనులకు మానవనరుల కొరత గమనించి జనాభా పెరుగుదలకై 2001 నాటికి బేబీ బోనస్ చట్టము అమలులోకి వచ్చింది.

సింగపూరు భౌగోళిక స్థితి

మార్చు

ప్రధానద్వీపంతో చేరి 63 ద్వీపాల సమూహంతో కూడిన దేశం సింగపూరు. జురాన్గ్ దీవి, సెంటోసా దీవి, పులవ్ టెక్నాగ్ దీవి, పులవ్ యుబిన్ దీవి కొంచెం విస్తీర్ణంలో పెద్దవి. మిగిలినవి ఆకారములో చిన్నవి. జురాన్గ్ దీవిని పెట్రో కెమికల్ సంబంధిత వ్యవహారాలకు మాత్రమే వాడుకుంటారు. సెంటోసా దీవిని వినోదాలకు పర్యాటక ఆకర్షణకు వాడుకుంటారు, పులవ్ టెక్నాగ్ దీవిని రక్షణదళ సంబంధిత వ్యవహారాలకు వాడుకుంటారు. పులవ్ యుబిన్ దీవిలో ఇంకా నగరాభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టనందువలన అది సహజ సౌందర్యముతోనూ, పురాతన జీవన శైలిని ప్రతిబింబించే కట్టడాలతోను అలరారుతూ సందర్శకులను ఆకర్షిస్తుంది.166 మీటర్ల ఎత్తు కలిగిన బుకిత్ తిమాహ్ హిల్ సింగపూరులో ఎత్తైన ప్రదేశంగా గుర్తించబడింది. ఉత్తరాన నిర్మించిన సింగపూరు కాజ్ వే, తువాస్ సెకండ్ లింక్ అనేవి రెండు మానవ నిర్మిత వారధులు. 1960 వరకు నదీముఖద్వారం వరకు మాత్రమే నగర నిర్మాణాలు పరిమితమై ఉండేవి. మిగిలినప్రదేశంలో రైన్ ఫారెస్ట్ పోగా మిగిలిన భూమిని వ్యవసాయానికి వాడుతూ వచ్చారు. 1974లో మెరుగు పరచిన అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా నగరపురాలలో నిర్మించిన నివాస యోగ్య నిర్మాణాలు దేశాన్ని నిర్మాణాలతో నిండిపోయేలా చేశాయి.

సింగపూరు ప్రభుత్వం చేపట్టిన అనేక భూమి విస్తీర్ణ కార్యక్రమాల కారణంగా ఈ దేశం తన భూప్రదేశాన్ని 1960 నుండి ఇప్పటి వరకు 581.5 చదరపు కిలోమీటర్ల నుండి 704 చదరపు కిలోమీటర్లుగా అభివృద్ధి పరచుకుంది. రెండువేల సంవత్సరానికి ఇంకా 100 చదరపు కిలోమీటర్ల భూమిని అభివృద్ధి చేస్తారని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్న చిన్న మట్టి దిబ్బలుగా వున్న దీవులు ప్రధాన దీవులలో కలుస్తూ కొంత భౌగోళిక రూపురేఖలు మారుతూ ఉన్నాయి. కొంత కొండ ప్రాంతాలనుండి భూ ప్రాంతాన్ని సేకరించారు.నగరాభివృద్ధి పథకాల కారణంగా తరిగి పోయింది పోను, 23 శాతము రైన్ ఫారెస్ట్ రిజర్వ్ గా ఉంది.దీనిలో కొంత బుకిత్ తిమాహ్ నేచర్ రిజర్వ్ కాగా మిగిలినవి మానవ నిర్వాహిత ఉద్యానవనాలు (పార్క్) సింగపూరుబొటానికల్ గార్డెన్ వీటిలో ఒకటి.

సింగపూరు వాతావరణం

మార్చు

సింగపూరు సంవత్సరమంతా మారని పగటి కాలం, రాత్రి కాలం కలిగిన ప్రత్యేక దేశం. దాదాపు ఒకే రకమైన శీతోష్ణ స్థితి, విస్తారమైన వర్షాలు కలిగిన దేశం . గాలిలో తేమ సరాసరి 90 శాతం. వరసగా వర్షాలు పడే సమయాలలో ఇది 100 శాతానికి చేరుకుంటుంది.వర్షాలు ఏసమయంలోనైనా రావడం సహజం కనుక ఇక్కడి ప్రజలు ప్రతి రోజు గొడుగులను వెంట ఉంచుకుంటారు.వీరు వాడే గొడుగులు ప్రత్యేకతను కలిగి ఉంటాయి.అధిక ఆవశ్యకత కారణంగా ఇవి దృఢంగాను ఆకర్షణీయంగానూ ఉంటాయి.నవంబరు, డిసెంబరు నెలల్లో అత్యధిక వర్షపాతం ఉంటుంది.ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు నెలల్లో ప్రక్క దేశమైన ఇండోనేషియా పొదలలో రేగే మంటల కారణంగా సంభవించే వాతావరణ కారణంగా ఆరోగ్య రక్షణకోసం ప్రభుత్వమునుండి కొన్ని హెచ్చరికలను జారీ చేస్తూంటారు.జూన్, జూలై నెలలు ఎండా కాలం. భూమధ్య రేఖకు సమీప ంలో ఉండే కారణంగా ఇక్కడి రాత్రులు, పగలు సంవత్సరమంతా సమాన కాలాన్ని కలిగి ఉంటాయి

సహజ వనరులు

మార్చు

సింగపూరు ప్రజల నీటి అవసరాలను సగభాగం వర్షాధార రిజర్వాయరుల ద్వారా పూర్తి చేస్తారు.మిగిలిన నీరు మలేషియా నుండి సరఫరా అవుతుంది.బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో చేసుకున్ననీటి ఒప్పందాలు ఇరు దేశాలమధ్య దీర్ఘ కాల వివాదాలకు గురవుతున్నాయి. ప్రస్తుత కాలంలో నిర్మిత మౌతున్న రీసైక్లింగ్ ప్లాంట్స్ కారణంగా వెలుపలినుండి సరఫరా అవుతున్న నీటిని కొంచెం కొంచెంగా తగ్గిస్తున్నారు. సింగపూరులో 19 నీటి రిజర్వాయరులు,19 నీటి శుద్ధీకరణ విభాగాలు,14 నీటి నిల్వల రిజర్వాయరులు ఉన్నాయి. ప్రస్తుతము నిర్మాణంలో ఉన్న మరీనా బరేజ్ 2009 లో తన నిర్మాణపు పనులు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు.మలేషియాతో ప్రస్తుతము అమలులో ఉన్న రెండు నీటి సరఫరా ఒప్పందాలు వరుసగా 2011, 2061 సంవత్సరాలలో ముగిసిపోనున్న కారణంగానూ, మూల్యం విషయంలో కొలిక్కి రాని వివాదాల కారణంగాను దేశం నీటి వరుల అభివృద్ధిపై విశేష దృష్టి సారిస్తూ స్వయం సమృద్ధి పధంలో ముందుకు సాగుతుంది.

జనాభాలో 51 శాతము ప్రజలు బౌద్ధమత, థాయిజమ్ అవలంబీకులు. చైనా, ఇండియా, యురేసియాలను పూర్వీకంగా గుర్తించిన 15 శాతము ప్రజలు క్రిస్టియన్లు, 14 శాతం ముస్లిములు వీరిలో అధిక శాతం ఇండియా ముస్లిములు. స్వల్ప సంఖ్యలో సిక్కుమత, హిందూమత, బహాయి విశ్వాము కలిగిన ప్రజలు ఉన్నారు. 15 శాతం ప్రజలు ఏ మతం అవలంబించని వారుగా గుర్తించబడ్డారు. వీరు కాక అనేక మతాలకు చెందిన దేశ సభ్యత్వము లేని ప్రజలు ఇక్కడ పనులను నిర్వహిస్తూ నివసిస్తూ ఉంటారు.

హిందూ దేవాలయాలు

మార్చు

సంస్కృతి

మార్చు

సింగపూరులో పూర్వీకులైన మలాయ్ ప్రజలు, మూడవ తరానికి చేరుకున్న చైనీయులు, విదేశీనివాసులైన ఇండియనులు, అరేబియనులు, యూరేషియనులు నివసిస్తున్న కారణంగా మిశ్రమ సంప్రదాయాలు కలిగి ఉంది. కులాంతర, మతాంతర వివాహాలు ఇక్కడ సహజంగా సంభవిస్తూ ఉంటాయి. వివిధ మతాల ఆలయాలు వీరి మిశ్రమ మత సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. ఇక్కడ వారి వారి ప్రత్యేకత కలిగిన హోటల్స్ (భోజనశాలలు) వారి సంప్రదాయక ఆహారాలతో చేర్చి అవసరాలకు అనుగుణంగా ఇతర సంప్రదాయక ఆహారాలనూ విక్రయించడం సహజం. ఆహార తయారీలో కూడా మిశ్రమ విధానాలు చోటు చేసుకున్నాయి.

విద్యావిధానం

మార్చు

సింగపూరు అత్యధిక అక్షరాస్యులు కలిగిన దేశం. 50 శాతం విద్యార్థులు తమ స్కూలుకు ముందు దశ తరగతులలోనే ఇంగ్లీష్ మాధ్యమంతో విద్యారంభం చేస్తారు. ఎక్కువ మంది పిల్లలు కిండర్ గార్టెన్ చదువు ప్రారంభిస్తారు.ఇక్కడ ప్రైమరీస్కూలు ఆరవసంవత్సరం నుండి మొదలౌతుంది. స్కూలుకు ముందు దశ తరగతులు ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తుంటాయి. వీరి అధికారిక పార్టీకి చెందిన సంస్థలే ఎక్కువ శాతం ఆరంభ పాఠశాలలను నిర్వహిస్తుంటాయి. పాఠశాలలలు ఎక్కువగా గణితము, సామాన్యశాస్త్రము మొదలైనవి ఇంగ్లీష్ లోనూ, మొదటి భాషగా ఇంగ్లీష్, ఇతర భాషలను రెండవ భాషగానూ బోధిస్తుంటాయి.విశేషాధికారాలు కలిగిన కొన్ని చైనీస్ పాఠశాలలు మాండరిన్ మాధ్యమంగానూ వారి పిల్లలకు బోధిస్తూ ఉంటాయి.పాఠశాలల నిర్వహణపై కఠిన కట్టుబాట్లు లేని కారణంగా ఇక్కడ విద్యా సంస్థలు రకరకాలైన విధానాలతో నడుపుతూ ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ నిధులతో నడిచే పాఠశాలలు, విశేషాధికారాలు కలిగిన పాఠశాలలు, స్వతంత్ర పాఠశాలలు, ప్రజా సంస్థల నిధులతో నడిపే పాఠశాలలు ఇక్కడి విద్యావిధానంలో భాగాలు. విద్యావిధానంలో చేరని మూడు సంవత్సరాల కిండర్ గార్టెన్ (ప్రాథమిక విద్యకు ముందు తరగతులు) తరువాత 6 సంవత్సరాల ప్రారంభ విద్య . స్కూల్ లీవింగ్ పరీక్షల తరువాత ఎంచుకున్న పాఠ్యాంశాలతో 4 నుండి 5 సంవత్సరాల మాధ్యమిక తరగతులు అనంతరం న్ లెవెల్ లేక ఒ లెవెల్ పరీక్షలు నిర్వహిస్తారు.జూనియర్ కళాశాలలు 2 నుండి 3 సంవత్సరాల ప్రి యీనివర్సిటీ తరగతులు నిర్వహిస్తాయి.

సింగపూరు జాతీయ భాష మలయ్. వారి జాతీయ గీతం మజులా సింగపుర . అధికార భాషలు మలాయ్, మాండరిన్, ఇంగ్లీష్, తమిళం. దేశ స్వాతంత్ర్యానంతరము ఇంగ్లీష్ అధికారిక హోదాను పొందింది. మొదట అమెరికన్ యాసతో ప్రభావితమైన ఇంగ్లీష్ ప్రారంభమైంది. విద్యా విధానాలలో ఇంగ్లీష్ మాధ్యమం కారణంగా ఇంగ్లీష్ వాడకం దేశమంతా వ్యాపించింది. ఇంగ్లీష్ సాహిత్యం అధికంగా సింగపూరు సాహిత్యంలో చోటు చేసుకోవడం సహజమై పోయింది. రాజ్యాంగ ప్రచురణలకు ఇతర అధికారిక అనువాదాలతో కూడిన ఇంగ్లీషుకు ప్రాముఖ్యత ఇవ్వడం అలవాటు. వివిధ భాషలను మాతృభాషగా కలిగిన ప్రజలు నివసిస్తున్న కారణంగా అనుసంధాన భాషగా ప్రజల మధ్య ఇంగ్లీష్ ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. ఇక్కడి ప్రజల మాతృభాషలతో కలగలసిన సింగ్లీష్ ఇక్కడి ప్రజల స్వంతం. సింగ్లీష్ అంటే చైనా, మలయా, ఇండియన్ భాషల సంక్రమణలతో మిశ్రితమైన ఇంగ్లీష్.ప్రభుత్వం అవిశ్రాంతంగా సింగ్లీషును తగ్గించి మంచి ఇంగ్లీష్ మాట్లాడమని ప్రజలకు హితవు చెబుతూనే ఉంది.

ఆర్ధికరంగం

మార్చు

ఎంట్రీపోర్ట్ (సుంకరహితం) వ్యాపార విధానాల వలన తన ఆర్థికరంగాన్ని చక్కగా పరిపుష్టం చేసుకున్న దేశాలలో సింగపూరు ఒకటి. అంతర్జాతీయ వ్యాపార రంగంలోనాలుగు ఆసియా సింహాలు గా వర్ణించబడే దేశాలలో సింగపూరు ఒకటి. మిగిలినవి వరసగా హాంగ్‌కాంగ్, కొరియా, తైవాన్. సింగపూరు తన ఆదాయంలో 26 శాతం రాబడి కర్మాగారాల ద్వారా రాబట్టుకొంటుంది. కర్మాగారాల రంగాన్ని ఎలక్ట్రానిక్స్, రిఫైనరీ, రసాయనాలు, మెకానికల్ ఇంజనీరింగ్ ఉత్పత్తులు, బయో మెడికల్ సైన్స్ రంగాల వైపు మళ్ళించింది. 2006లో ప్రపంచ ఫౌన్ డ్రీ వేఫర్ వాడకంలో 10 శాతము సింగపూరు ఉత్పత్తుల వలన లభించింది. సింగపూరు రేవు అత్యంత చురుకైన రేవుగా అంతర్జాతీయ గుర్తింపు పొందినది. అత్యంత వ్యాపారానుకూల దేశంగా కూడా సింగపూరు అంతర్జాతీయ గుర్తింపు పొందినది. విదేశీమారక వ్యాపారరంగంలో పేరుపొందిన నాలుగు వ్యాపార అంతర్జాతీయ కేంద్రాలలో సింగపూరు ఒకటి . మిగిలిన మూడు వరుసగా లండన్, న్యూయార్క్, టోక్యో.

పర్యాటక రంగానికి అత్యధికంగా ప్రాధావ్యతనిచ్చే దేశాలలో సింగపూరు ఒకటి. సింగపూరు ప్రజల తలసరి ఆదాయం 29,474 అమెరికన్ డాలర్లు. నిరుద్యోగం 1.7 శాతం. సింగపూరు విదేశీ యాత్రీకులకు అత్యంత ఆకర్షణీయమైన దేశం. 2006వ సంవత్సరములో మాత్రమే 97 లక్షల వీదేశీ యాత్రీకులు ఈ దేశాన్ని సందర్శించారు. విదేశీ యాత్రీకులను అత్యధికంగా ఆకర్షించే వ్యాపార కేంద్రం ఆర్చర్డ్ రోడ్. యాత్రీకులను ఆకర్షించడానికి కాసినోలు అనబడే రెండు ఆధునిక జూదగృహాలకు 2005వ సంవత్సరంలో రాజ్యాంగ పరమైన అనుమతి సింగపూరు ప్రభుత్వం నుండి లభించింది. ఇంటిగ్రేటెడ్ రిసార్ట్స్ అనబడే ఇవి మరీనా తీరంలోనూ, సెంటోసా లోనూ రూపుదిద్దుకుంటున్నాయి. ఇవి తమ నిర్మాణాన్ని 2009లో పూర్తి చేసుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఇవి కాక నిర్మాణదశలో ఉన్న 165 మీటర్ల ఎత్తైన ఫెర్రీ వీల్, సముద్రతీరంలో ఉద్యానవనాలు, మరీనా దక్షిణతీరాన నిర్మిస్తున్న 280 మీటర్ల పొడవైన డబులు హైలెక్స్ బ్రిడ్జ్ సందర్శకులకు అదనపు ఆకర్షణ కానున్నాయి. సింగపూరు ప్రభుత్వము హాంగ్ కాంగ్, బాంకాక్లతో పోటీని తట్టుకొనే విధంగా నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టింది. సందర్శకుల సౌకర్యాలను పెంచే విధంగా హోటల్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ ఉంటారు.

వైద్యచికిత్స కొరకు వచ్చే యాత్రీకులను ఆకర్షించడంలో సింగపూరు త్వరితగతిని అభివృద్ధిని సాధించింది. ఒక్కొక్క సంవత్సరము 2 లక్షల మంది వైద్య చికిత్సల కోసం ఇక్కడికి చేరుకుంటారు. 2012 నాటికి వైద్యం కోసం వచ్చే యాత్రీకుల సంఖ్య 10 లక్షల వరకు పెంచి 3 బిలియన్ల అమెరికన్ డాలర్ల రాబడిని పొందాలని ప్రభుత్వ లక్ష్యం. ఆరోగ్య రంగంలో 13,000 ఉద్యోగాలు అభివృద్ధి చేయవచ్చని ప్రభుత్వ అంచనా.

ఆహారవ్యవహారాలు

మార్చు
 
హాకర్ సెన్టర్

వ్యాపారం, వైద్యచికిత్స, వినోద యాత్రీకుల రద్దీ కారణంగా సింగపూరు ఆహారరంగం అధిక ప్రాధాన్యతను సంతరించుకున్నది. విభిన్న దేశ ప్రజలు నివసిస్తున్న కారణంగా ఇక్కడి ఆహారాలు భిన్న రుచుల మిశ్రమాలుగా తయారౌతూ, ఊహాజనిత కొత్త ఆహారాలు ఉత్పన్నమౌతూ యాత్రీకులను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడి ప్రజలను ఇవి అలరిస్తున్నాయి. చైనీస్ హోటల్స్ తమిళ ఆహారాలను, తమిళ్ హోటల్స్ లో చైనీస్ ఆహారాలనూ పరిచయం చేయడం ఇక్కడ సర్వ సాధారణం.

ప్రాంతీయ ఆహారాలూ విదేశీ ప్రభావంతో తమరూపురేఖలను మార్చుకుంటున్నాయి.విస్తారమైన సముద్ర ఆహారాలు ప్రజలను ఆకర్షిస్తూ ఉంటాయి.ఇక్కడ షాప్స్ తినడానికి సిద్ధంగా ఉండే రకరకాల చాక్లెట్స్, అనేక విదేశీ ఆహారాలను పుష్కలంగా విక్రయిస్తూ ఉంటాయి.

 
ఎస్ప్లెనేడ్ దియేటర్స్

1990 నుండి సింగపూరు ప్రభుత్వం దేశంలో కళలు, సంస్కృతి అభివృద్ధికి విశేషమైన ఆసక్తి ప్రదర్శించడం ప్రారంభించింది.ఈ ప్రయత్నంలో భాగంగా 2002లో ఎస్ప్లెనేడ్ కళాప్రదర్శనలు ప్రారంభించింది.అర్ట్స్ ఫెస్టివల్ 2002 అక్టోబరు 2వ తేదీన ప్రారంభించి నిర్వహించారు.

ప్రచార సాధనాలు

మార్చు

ప్రభుత్వాధీనంలో ఉన్న మీడియాకార్పొరేషన్ టెలివిజన్ ఛానల్స్ (దూరదర్శన్), రేడియో ప్రసారాలు, పత్రికలు, దిన పత్రికల ప్రచురణ, చిత్ర నిర్మాణం లాంటి కార్యక్రమాలు చేపట్టి నిర్వహిస్తూ ఉంటుంది. టెలివిజన్ ఛానల్స్ (దూరదర్శన్) అన్నీమీడియా కార్పొరేషన్ అధీనంలోఉంటాయి. 14 రేడియో ఛానల్స్ (ఆకాశవాణి) మీడియాకార్పొరేషన్ ఆధీనంలోనూ నాలుగు ప్రైవేట్ సంస్థల ఆధీనంలోను ఉంటాయి. ప్రైవేట్ సంస్థలు సెన్సార్ చేయని కార్యక్రమాలు ప్రసారం చేయడం నిషిద్ధం. 16 దినపత్రికలు ఇంగ్లీష్, చైనీస్, మలాయ్, తమిళ భాషలలో వెలువడుతున్నాయి. టుడే పత్రిక మాత్రం మీడియాకార్పరేషన్ ఆధీనంలో ప్రచురించ బడుతుంది. ప్రచురణ వ్యవస్థపై సింగపూరు ప్రెస్ హోల్డింగ్స్ఆధిక్యం సంపాదించుకుంది.

క్రీడా రంగము

మార్చు

సింగపూర్ దేశస్తులు వివిధ రకములైన ఆటలు ఆడటంలో ఉత్సాహం చూపుతుంటారు. వీరి అభిమానపాత్రమైన క్రీడలు ఫుట్ బాల్, బాడ్మింటన్, బాస్కెట్ బాల్, వాలీబాల్, రగ్బీ యూనియన్, క్రికెట్, స్విమ్మింగ్ (ఈతకొట్టడం), టేబుల్ టెన్నిస్ .ఎక్కువ మంది ప్రజలు ప్రభుత్వ నిర్మాణ నివాసాలలో నివసిస్తున్న కారణంగా వారు అందిస్తున్న స్విమ్మింగ్ పూల్స్, ఇండోర్ గేమ్స్ కాంప్లెక్స్, బాస్కెట్ బాల్, టెన్నిస్ కోర్టులు మొదలైనవి ప్రజలకు అందుబాటులో ఉండటం ఒక విశేషం. దీవులకే ప్రత్యేకమైన వాటర్ స్పోర్ట్స్ ఇక్కడ ప్రజాదరణ పొందినవే. సెయిలింగ్, కయాలింగ్, వాటర్ స్కీయింగ్, స్కూబా డైవింగ్ ఇక్కడి క్రీడా ఆకర్షణలు.
కల్లాంగ్ లో 55000 ప్రేక్షకులు సందర్శించే వసతులతో 1973లో ప్రారంభించిన సింగపూరు నేషనల్ స్టేడియం .ఎన్నో సాంస్కృతిక ప్రదర్శనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు, జాతీయ కార్యక్రమాలు నిర్వహించిన ఈ స్టేడియాన్ని 2007 వ సంవత్సరం జూన్ 30 వ తేదీన అధికారికంగా మూసివేసి అదే స్థలంలో సింగపూరు స్పోర్ట్స్ హబ్ నిర్మాణం చేపట్టారు. ఇది 2011లో పూర్తి కాగలదని అంచనా వేస్తున్నారు. ఈ స్టేడియంలో మొత్తం 55000 ప్రేక్షకులు వీక్షించగలిగే వసతులతోబాటు, 6000 ప్రేక్షకులు వీక్షించగలిగే వసతులతో ఇండోర్ అక్వాటిక్ సెంటర్ ,40 మీటర్ల వార్మ్ అప్ అథ్లెటిక్ ట్రాక్ ,3000 ప్రేక్షకులు వీక్షించేలా వివిధ రకాల ఉపయోగం కొరకు ఒక వేదిక, వాణిజ్య అవసరాలకు 36,000 చదరపు అడుగుల ఖాళీ ప్రదేశం లాంటి ప్రత్యేకతలతో నిర్మిస్తున్నారు.
సింగపూర్ వాసుల అభిమానాన్ని చూరగొన్న క్రీడలలో గోల్ఫ్ ఒకటి. ఈ కారణంగా సింగపూరులో 15 గోల్ఫ్ క్లబ్ లు ఉన్నాయి. చౌకైన సభ్యత్వ రుసుము కారణంగా కొంతమంది గోల్ఫ్ క్రీడాకారులు జోహర్, మలేషియాలకు గోల్ఫ్ కోర్స్ శిక్షణ కొరకు తరచు ప్రయాణిస్తూ ఉంటారు.
టేబుల్ టెన్నిస్, బాడ్మింటన్, బౌలింగ్, సెయిలింగ్, సిల్ట్, స్విమ్మింగ్, వాటర్ పోలో క్రీడలలో సింగపూర్ క్రీడాకారులు జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా రాణిస్తున్నారు. ఫాన్ది అహమ్మద్, అన్గ్ పెన్గ్ సియాంగ్, లి జైవీ, రోనాల్డ్ సుసిలో మొదలైన క్రీడా కారుల పేర్లు సింగపూరియన్ల మధ్య సుపరిచితం.
2008 ప్రారంభంలో సింగపూరు మరీనా బేలో స్ట్రీట్ సర్క్యూట్ లో ఫార్ములా వన్ చాంపియన్ షిప్ పోటీలలో ఒక రౌండ్ నిర్వహించనున్నది. ఇది ఎఫ్ 1 సర్క్యూట్ లో మొదటి నైట్ రేస్, ఆసియా మొదటి సర్క్యూట్ గా ప్ర్తేకత కానున్నది. 2006లో సింగపూరు స్లింగర్స్, ఆస్ట్రేలియన్ నేషనల్ బాస్కెట్ బాల్ లీగ్ లో స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆ స్క్వాడ్ లో ముగ్గురు సింగపూరియన్లు ఉన్నారు.
అథ్లెటిక్స్ లో ప్రవేశమున్న విద్యార్థులపై పాఠశాల చదువుల వత్తిడిని గమనించిన కమిటీ ఆన్ స్పోర్ట్స్ సింగపూరు (CoSS) వారు దానిపై దృష్టిని సారించి 2004 న క్రీడా పాఠశాలను స్థాపించి యువ క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.

భవన నిర్మాణము

మార్చు
 
రాఫిల్స్ ప్లేస్ లో నిర్మించిన మూడు ఆకాశ హర్మ్యాలు

సింగపూరును సందర్శించే విదేశీ యాత్రీకులను అధికంగా ఆకర్షించేవి ఇక్కడి ఆకాశ హర్మ్యాలు. వీటిని పాశ్చాత్య శైలిని అనుకరిస్తూ డౌన్ టౌన్ అని వ్యవహరిస్తుంటారు. నగరానికి కేంద్రంగా వాణిజ్య పరంగా ప్రాముఖ్యత కలిగి రాజ్యాంగ వ్యవహారాలు చూసుకునే కార్యాలయాలు మొదలైనవి ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఇవి సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (CBD) లో ఉంటాయి. ఇవి మరీనాతీరం నుండి విస్తరించి ఉంటాయి. ఈ ప్రదేశాన్ని రాఫిల్ ప్లేస్ గా వ్యవహరిస్తారు. దశాబ్దాల అభివృద్ధి వలన ఈ ప్రదేశంలో అనేక ఆకాశ హర్మ్యాలు విస్తరించి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఇవి సివిల్ ఏవియేషన్ అధారిటీ ఆఫ్ సింగపూరు చే పర్యవేక్షించబడుతూ ఉంటాయి. 280 మీటర్ల ఎత్తుకు మించి ఏ నిర్మాణం ఇక్కడ లేదు. వీటిలో అత్యంత ఉన్నత నిర్మాణాలు వరసగా రిపబ్లిక్ ప్లాజా , యుఒబి (UOB) ప్లాజా ఒన్ , ఒయుబి (OUB) సెంటర్ .
మాక్స్ వెల్ రోడ్ వీధులు బారులు తీరిన షాపింగ్ సెంటరుగా అలరారుతుంటుంది. ఇక్కడ అనేక దీవుల నిర్మాణ నమూనాలను సందర్శనార్ధం తయారు చేసి ఉంచారు.
సంప్రదాయ నిర్మాణాలతో నిండి ఉండే చైనా టౌన్ , లిటిల్ ఇండియా ప్రదేశాలు సింగపూరు విభిన్న సాంప్రదాయక పద్ధతులకు తార్కాణం. ఇవి ఈస్టిండియా కంపెనీ కాలంలో ఇక్కడ పనులు చేయడానికి దేశాంతరాలనుండి వచ్చి స్థిరపడిన పౌరుల నివాసాలు. చైనీయులు, ఇండియనులు ఇక్కడ నివాసముంటారు. చర్చులు, హిందూకోవెలలు, మసీదులు, బౌద్ధ దేవాలయాలు కూడా ఇక్కడి ప్రజల సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంటాయి. వీటిని కాపాడవలసిన పురాతన చిహ్నాలుగా ప్రభుత్వం భావిస్తుంది.
స్థలాభావం అధికం కావడం చేత ప్రభుత్వం ప్రజల నివాసార్ధం నిర్మించిన నిర్మాణాలు ఎత్తైనవిగా ఉంటాయి. పార్కులు, ప్లేఏరియాలు, సినిమా థియేటర్లు, పాఠశాలలు మొదలైన సకల వసతులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడి పరిసరాలు లాన్స్ పూలచెట్లు ఫెన్సింగులతో చక్కని పర్యవేక్షణలో పరిశుభ్రంగానూ ఆకర్షణీయంగా ఉంటాయి.

రక్షణవ్యవస్థ

మార్చు

సింగపూరు రక్షణవ్యవహారాలు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (MINDEF)ఆధ్వర్యంలో ఉంటాయి. సింగపూరు ఆర్మీ, రిపబ్లిక్ ఆఫ్ సింగపూరు నావీ, రిపబ్లిక్ ఆఫ్ సింగపూరు ఎయిర్ ఫోర్స్ఈ మూడు కలిసి సింగపూరు ఆర్మ్ ఫోర్స్ రక్షణశాఖ మంత్రి అధికారంలోఉంటాయి. వీరికి కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా తమ సేవలు అందిస్తారు.
సింగపూరు ప్రభుత్వం ఆరోగ్యవంతమైన ప్రతి సింగపూరు పురుషుడు రక్షణవ్యవస్థలో కనీసం 2 సంవత్సరాల కాలం పనిచేయాలని కోరుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు, కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లోనివారికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. రెండవతరానికి చెంది సింగపూరులో స్థిరనివాస మేర్పరచుకున్న పురుషులకు ఈ చట్టం వర్తిస్తుంది. రెండు సంవత్సరముల సేవల అనంతరం రక్షణశాఖలో కొనసాగే విషయం పౌరుడు స్వయంగా నిర్ణయించుకోవచ్చును.నలభై నుండి ఏభై సంవత్సరముల వరకు రక్షణశాఖలో నేరుగానూ లేక రిజర్విస్ట్ గానూ సేవలందించ వచ్చు.నలభై సంవత్సరముల అనంతరం కమిషన్డ్ ఆఫీసర్‌గా చేయవచ్చు. రిజర్విస్ట్ అంటే అత్యవసర సమయాలలో మాత్రమే రక్షణశాఖలో పనిచేసేవారు. 3,50,000 మంది పురుషులు రిజర్విస్ట్ గా నమోదు చేసుకున్నారు .72,500 మంది పురుషులు పూర్తి కాల సేవలో నమోదై ఉన్నారు.
సింగపూరు ఆర్మీ స్వదేశ రక్షణకే ఉపయోగపడిననూ ప్రపంచ వ్యాప్తంగా అవసరమైనప్పుడు మానవతావాదంతో ఇతరసేవలలో కూడా పాల్గొంటుంది. ఫైవ్ డిఫెన్స్అగ్రిమెంట్ ఏర్పాటు చేసుకున్న అయిదు దేశాలలో సింగపూరు ఒకటి. 1980 నుండి సింగపూరు ఆర్మీ అంతర్జాతీయ శిక్షణా కేంద్రాలను అమెరికా, ఆస్ట్రేలియా, రిపబ్లిక్ చైనా, న్యూజిలాండ్, బ్రూనై, ఫ్రాన్స్, థాయిలాండ్, భారత్, దక్షిణాఫ్రికా లలో నిర్వహిస్తుంది. అన్ని విషయాలపై దృష్టి సారించి అన్ని రకాల బెదిరింపులను ఎదుర్కొనేలా వ్యూహరచనతో రక్షణరంగాన్ని అభివృద్ధి చేస్తూ పటిష్ఠం చేస్తూ ఉంది.
సింగపూరు సమీప కాలంలో అంతర్జాతీయంగా పెరుగుతున్న తీవ్రవాదాన్ని దృష్టిలో పెట్టుకొని సాంప్రదాయేతర యుద్ధ పరికరాలకు నిధులను అధికంచేసింది. 1991 సింగపూరు ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 117ను హైజాక్ చేసినప్పుడు సింగపూరు స్పెషల్ ఆపరేషనల్ ఫోర్స్ ప్రయాణీకులకుగాని సిబ్బందికిగాని ప్రాణనష్టం లేకుండా హైజాకర్ల వ్యూహాన్ని తిప్పికొట్టింది. ఈ సంఘటనలో హైజాకర్లు నలుగురూ ప్రాణాలు కోల్పోవడం విశేషం.
సింగపూరు అర్మీని అంతర్జాతీయ సహాయానికీ నియోగిస్తూ ఉంటుంది. అమెరికాతో చేరి 11 దేశాలు పాల్గొనే శాంతి పరిరక్షణ సహాయ బృందంలో సింగపూరు ఆర్మీకి భాగంఉంది. 2001 సెప్టెంబర్లో లూసియానాకు రిపబ్లిక్ ఆఫ్ సింగపూరు ఎయిర్ ఫోర్స్ Ch -47 చినూక్ హెలికాప్టర్లను హరికెన్ కాతరినా తుఫాను సహాయార్ధం పంపింది. ఆ తరువాత సునామీ బాధితుల సహాయార్ధం 3 టాంక్ లోడెడ్ షిప్స్,12 సూపర్ ప్యూమా,8 చినూక్ హెలికాప్టర్లను నియోగించింది. పప్రపన్ఛమ్లొ మన్ఛి కత్తుదిత్తమైన నగరమ్గ పెరొగన్ఛినది.

ప్రభుత్వ విధానాలు

మార్చు

సింగపూరుకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి పీపుల్స్ ఏక్షన్ పార్టీ (PAP) ఆధిపత్యంలోనే ఉంది. ఈ కారణంగా అంతర్జాతీయ రాజకీయ విమర్శకులు, సింగపూరు ప్రతిపక్ష పార్టీలైన వర్కర్స్ పార్టీ ఆఫ్ సింగపూరు, సింగపూరు డెమాక్రటిక్ పార్టీ (SDP), సింగపూరు డెమాక్రటిక్ అలయన్స్ (SDA) సింగపూరును ఏకపక్ష పార్టీగా విమర్శిస్తూ ఉంటారు. విమర్శకులు సింగపూరును ప్రజాస్వాతంత్ర్యం లేని దేశంగాను, సంపూర్ణ స్వాతంత్ర్యం లేని దేశంగాను విమర్శిస్తుంటారు. అంతర్జాతీయ సంస్థ అయిన ఎకనమిక్ ఇంటెలిజన్స్ యూనిట్ సింగపూరు స్వాతంత్ర్యం సార్వభౌమత్వం మిశ్రితమైన మిశ్రమ ప్రదేశంగా వర్ణించారు. అంతర్జాతీయ సంస్థ అయిన ఫ్రీడం హౌస్ కొంత భాగం స్వాతంత్ర్యం మాత్రమే ఉన్న దేశాలవరసలో సింగపూరును చేర్చింది. ఏది ఏమైనా జాతీయ ఎన్నికలలో మాత్రం చట్టఅతిక్రమణ, రిగ్గింగ్ వంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోక పోవడం విశేషం. ప్రధాన పార్టీ అయిన పి ఎ పి ప్రచారయంత్రాంగాన్ని తమకనుగుణంగా వాడుకుంటుందన్న విమర్శకు గురి అవుతూనే ఉంది.

సింగపూరు ఆర్థికరంగంలో ఆధిక్యత సింగపూరు ప్రభుత్వ సంబంధిత రవాణా రంగము, ప్రచురణ సంస్థలు, ప్రసార సంస్థలు, ప్రజావసరాలు మొదలైన సంస్థలదే. సింగపూరు అతితక్కువ అవినీతి కలిగిన దేశంగా ఆసియాలో ప్రథమ స్థానంలోను, అంతర్జాతీయంగా పదవ స్థానంలోనూ ఉంది. పారదర్శకమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా సింగపూరుకు అంతర్జాతీయ ప్రత్యేకత ఉంది.

సింగపూరు చట్టం బ్రిటిష్ ఇండియన్ చట్టాన్ని అనుసరించేదే అయినా పి ఏ పి పార్టీ మాత్రం పాశ్చాత్య దేశాల సంపూర్ణ ప్రజాస్వాతంత్ర్యపు విలువలు పాటించడంలో కొంతవరకు విముఖత చూపిస్తూనే ఉంది. విభిన్న సంస్కృతుల, మతముల, భాషల ప్రజలు నివసిస్తున్న దేశం కనుక అల్ప సంఖ్యాకులను రెచ్చగొట్టేవి, ప్రశాంతతకు భంగం కలిగించేవి, ప్రజాశ్రేయస్సుకు ప్రతికూలమైనట్టి వ్యాఖ్యలను నిషేధిస్తూ వాక్ స్వాతంత్ర్యాన్ని ఒకింత కట్టుబాటులో ఉంచుతూ ఉంది. అల్పసంఖ్యాకులను రెచ్చగొట్టే విధంగా బ్లాగులలో వ్యాఖ్యానాలను ప్రచురించిన ముగ్గురు బ్లాగర్ల పై చర్య తీసుకోవడం ఇందుకు నిదర్శనం. అధిక జరిమానా, కొరడాదెబ్బలు లాంటి శిక్షలు అమలులో ఉన్నాయి. క్రూరమైనహత్యలూ, హానికరమైన మత్తు పదార్థాలకు సంబంధించిన నేరాలకు ఉరిశిక్ష విధించడం మామూలు విషయమే. ప్రపంచంలో అధికశాతం ఉరిశిక్షలు అమలవుతున్న దేశాలలో సింగపూరుది అగ్రస్థానం. ఉరిశిక్షల అమలు విషయంలో అంతర్జాతీయ మానవహక్కుల సమితి విమర్శలను ఎదుర్కుంటున్న సింగపూరు ప్రభుత్వం తమ దేశంలో అమలు చేయవలసిన చట్టంపై తమకు సంపూర్ణ హక్కు ఉందని వాదిస్తూ తమ చర్యలను సమర్ధించుకుంటోంది.

బయటి లింకులు

మార్చు
Singapore గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

  నిఘంటువు విక్షనరీ నుండి
  పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
  ఉదాహరణలు వికికోట్ నుండి
  వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
  చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
  వార్తా కథనాలు వికీ వార్తల నుండి

సింగపూరు అధికారిక వెబ్సైటు లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Singapore: History". Asian Studies Network Information Center. Archived from the original on 2007-03-23. Retrieved 2007-11-02.
  2. "Population - latest data". Singapore Department of Statistics Singapore. 2008-05-30. Archived from the original on 2012-08-06. Retrieved 2008-05-31.
  3. GDP Latest Data Archived 2012-08-06 at the Wayback Machine - Singapore Department of Statistics Singapore (2008-02-14) retrieved on 2008-02-16
"https://te.wikipedia.org/w/index.php?title=సింగపూరు&oldid=4310260" నుండి వెలికితీశారు