టీ హబ్ 2

తెలంగాణ ప్రభుత్వ సంస్థ

ఆలోచనతో రండి...ఆవిష్కరణతో వెళ్ళండి అనే నినాదంతో తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ లో భాగంగా వివిధ రంగాల్లో పెరుగుతున్న స్టార్టప్‌లకు ప్రోత్సహించేందుకు స్టార్టప్ లకు ఇంక్యుబేటర్ గా మొదలైన టీ హబ్ కు కొనసాగింపుగా తెలంగాణ ప్రభుత్వం టీ హబ్‌ 2ను నిర్మించింది. రాయిదుర్గంలోని నాలెడ్జ్‌ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో 400 కోట్ల రూపాయలతో 3.5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ హబ్‌ 2ను నిర్మించారు.[1]

టీ హబ్ 2
టీహబ్‌-2ను ప్రారంభించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
స్థాపన2022, జూన్ 28
కేంద్రీకరణస్టార్టప్ ఇంక్యుబేటర్
కార్యస్థానం
Originహైదరాబాద్, తెలంగాణ
జాలగూడుటీ హబ్‌ వెబ్సైట్

ఒకేసారి 2 వేలకు పైగా స్టార్టప్‌లకు వసతి కల్పించేందుకు నిర్మించిన ఈ టీహబ్‌-2 ప్రపంచంలోనే అతి పెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌గా నిలిచింది. ఇక్కడ ఒకేసారి 1500 స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైన మౌలిక వసతులను, పరిపాలన వ్యవస్థను ఏర్పాటుచేశారు. అంకుర సంస్థల ప్రతినిధులు, కంపెనీల ప్రతినిధులు పనిచేయడానికి, చర్చించుకోవడానికి వర్క్‌ స్టేషన్లు, మీటింగ్‌ హాళ్ళు ఏర్పాటుచేయబడ్డాయి.[2]

ప్రారంభం మార్చు

2022 జూన్ 28న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతులమీదుగా టీహబ్‌-2 ప్రారంభించబడి, దేశ యువతకు అంకితమివ్వబడింది. ప్రారంభోత్సవం సందర్భంగా ఇన్నోవేషన్‌ టార్చ్‌ (కాగడా)ను అధికారులు కేసీఆర్‌కు అందించారు. అనంతరం టీ–హబ్‌ 2.0 నమూనాను ముఖ్యమంత్రి ఆవిష్కరించాడు. 21 యూనికార్న్‌లు, పలు స్టార్టప్‌ సంస్థల ప్రతినిధులను కేసీఆర్‌ సన్మానించాడు. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, టీహబ్‌ సీఈవో శ్రీనివాస్‌రావు, సైయంట్‌ సంస్థ వ్యవస్థాపకుడు బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, చేవెళ్ళ ఎంపీ జి. రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, నాగర్ కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దనరెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, టీఎస్‌టీఎస్‌ చైర్మన్‌ పాటిమీది జగన్‌మోహన్‌రావు, సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో వివిద కంపెనీలు, స్టార్టప్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు.[3]

టీ హబ్‌2 ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో భారతీయ భాషల మైక్రో బ్లాగ్ కూ యాప్‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, హీరో మోటర్ గ్రూప్‌, పొంటాక్‌, వెబ్3.0 సంస్థలతో టీ హబ్‌ ఒప్పందాలు కుదుర్చుకున్నది.

ఇన్నొవెటివ్ సమ్మిట్‌ మార్చు

ఈ టీ హబ్‌ 2.0 ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన మాస్టర్‌ క్లాసెస్‌, సెషన్స్‌లో 25 యునికార్న్‌ స్టార్టప్‌ ఫౌండర్లు, 30 వెంచర్‌ క్యాపిటల్‌ కంపెనీల ప్రతినిధులు, డ్రావిన్ బాక్స్‌, మీషో, స్విగ్గి, జోమాటో, యూనికార్న్‌ స్టార్టప్‌ సంస్థలు హాజరయ్యారు. అడోబ్‌ చైర్మన్‌, సీఈవో శంతనునారాయణ్‌, సికామోర్‌ నెట్‌వర్క్స్‌ సీఈవో దేశ్‌పాండే, అతేరా ఎండీ కన్వయ్‌ రేఖి, ఇతర దేశవిదేశీ ప్రముఖులు వీడియో సందేశాలు ఇచ్చారు. టీహబ్‌ కొత్త భవనంలో నిర్వహించిన డ్రమ్‌ జామ్‌తో కార్యక్రమంలో కలారీ క్యాపిటల్‌కు చెందిన రవీందర్‌సింగ్‌, మోఎంగేజ్‌ సహ వ్యవస్థాపకుడు రవితేజ దొడ్డా, డార్విన్‌బాక్స్‌ సహ వ్యవస్థాపకుడు చెన్నమనేని రోహిత్‌, స్విగ్గీ కో ఫౌండర్ శ్రీహర్ష మాజేటి, ‘కూ’ సంస్థ కో ఫౌండర్ అప్రమేయ రాధాకృష్ణలు పాల్గొనగా ఆ చర్చాగోష్టిలో సినీనటుడు దగ్గుబాటి రానా కీలక ఉపన్యాసమిచ్చాడు.[4]

నిర్మాణం మార్చు

కొరియన్‌ సంస్థ స్పేస్‌ గ్రూపుతో కలిసి ‘ఫామ్‌ స్టూడియో’ ఈ భవన డిజైన్లను రూపొందించింది. ఐఐటీ చెన్నై, ఐఐటీ రూర్కీ వంటి సంస్థలు దీని నిర్మాణంపై అధ్యయనం చేసి నివేదికలు అందించగా, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్టీల్‌ సంస్థ నిర్మాణానికి తగిన సూచనలు చేసింది.

చార్మినార్‌ నిర్మాణ శైలీ మాదిరిగానే ఈ భవనం కూడా నాలుగు పిల్లర్ల మీదే నిర్మాణమయింది. చార్మినార్‌లోని పిల్లర్ల మధ్యనుంచి పైకి ఉన్నట్లుగా ఈ భవనంలో కూడా మెట్ల మార్గాలు, లిప్టులను ఏర్పాటుచేయబడ్డాయి. 10 అంతస్థులున్న భవానాన్ని 5 అంతస్థులకు ఒక భాగం, మరో 5 అంతస్థులకు మరో భాగంగా విడదీసి మధ్య భాగాన్ని పిల్లర్ల చుట్టూ డిజైన్‌తో నిర్మించారు. సాంప్రదాయ నిర్మాణ శైలిలో కాకుండా పూర్తిగా భిన్నమైన, ఎంతో ఆధునికమైన విధానంలో దీని నిర్మాణం జరిగింది.

ఈ భవన నిర్మాణం కోసం మొత్తం 10వేల మెట్రిక్‌ టన్నుల స్టీల్‌ను వినియోగించారు. మొదటగా నాలుగు పిల్లర్లను నిర్మించి సుమారు రెండతస్థుల ఎత్తుకు వెళ్ళిన తర్వాత నాలుగు పిల్లర్ల మధ్య భాగాలను రెండు వైపులా ఎక్కువ దూరం, మరో రెండు వైపులా తక్కువ దూరం ఉండేలా నిర్మించారు. ఇలా ఐదు అంతస్థులు నిర్మించిన తర్వాత మళ్ళీ నాలుగు పిల్లర్ల మీద కొంత ఎత్తు వరకు నిర్మాణం పూర్తిచేసి, వాటి మీద మళ్ళీ ఐదు అంతస్థులతో భవనాన్ని పూర్తిచేశారు. మొత్తం 5 లక్షలకు పైగా చదరపు అడుగుల నిర్మాణ స్థలం ఉండగా అందులో 3.5 లక్షల చదరపు అడుగులను మాత్రమే వినియోగించేలా డిజైన్‌ చేసి అత్యాధునిక శైలితో కూడిన ఇంటీరియర్స్‌ను ఏర్పాటు చేశారు.

ఈ భవన సామర్థ్యాన్ని పరీక్షించడంకోసం మొత్తం ఖాళీగా ఉంటే ఎలా ఉంటుంది..? ఒకవైపే ఉద్యోగులు ఉంటే ఎలా ఉంటుంది..? అన్న వివిధ రకాలుగా 64 రకాల లోడింగ్‌ టెస్టులను నిర్వహించారు.[5]

ఇతర వివరాలు మార్చు

టీ-హబ్ 2.0లో మొదటి అంతస్తును అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ భాగస్వామ్యంతో ఏర్పాటైన సీఐఐ, ఏఐసీ టీ-హబ్ ఫౌండేషన్‌కు కేటాయించారు. ఆర్టిఫిషయల్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్‌ను ప్రోత్సహించడం కోసం ఏడో అంతస్తును సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు కేటాయించారు. ఎనిమిది, తొమ్మిదో అంతస్తులను జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జికా) ప్రాజెక్ట్‌తోపాటు సమాజంపై ప్రభావం చూపే స్టార్టప్‌లు, యువ వ్యాపారవేత్తలకు కేటాయించారు.

మన ఇన్నోవేటర్స్‌ కథలు మార్చు

టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో 2022 అక్టోబరు 19న 'మన ఇన్నోవేటర్స్‌ కథలు' అనే కార్యక్రమంలో గ్రామీణుల ఆవిష్కరణలు ప్రదర్శించబడ్డాయి. సమస్య మీది.. పరిష్కారం మాది అనే కాన్సెప్టుతో రైతులు, వృద్ధులు, ఇతర వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలకు చక్కటి పరిష్కారమార్గాలను చూపేవిధంగా ఆవిష్కరణలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ రూపొందించిన ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, గ్రామాలకు ఇన్నోవేషన్ గురించి తెలిసేలా చేసింది. ఎంపిక చేసిన 23 గ్రామీణ ఆవిష్కరణల్లో 21 ఆవిష్కరణల గురించి తెలుసుకున్న పెట్టుబడిదారులు 21 ఆవిష్కరణల్లో 49మంది పెట్టుబడి పెట్టేందుకు ముందుకువచ్చారు.[6]

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (23 June 2022). "టీ-హబ్‌ 2 సిద్ధం" (in ఇంగ్లీష్). Archived from the original on 27 June 2022. Retrieved 27 June 2022.
  2. "మనం దేశానికే రోల్‌ మోడల్‌". Sakshi. 2022-06-29. Archived from the original on 2022-06-29. Retrieved 2022-07-27.
  3. www.ETGovernment.com (2022-06-29). "T-Hub 2.0 opens with a capacity to house 4000 start-ups, world's largest facility - ET Government". ETGovernment.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-07-27. Retrieved 2022-07-27.
  4. "T-Hub 2.0: అతిపెద్ద అవిష్కరణల ప్రాంగణం టీహబ్‌-2.. ప్రారంభించనున్న సీఎం కేసీఆర్". Samayam Telugu. 2022-06-28. Archived from the original on 2022-06-29. Retrieved 2022-07-27.
  5. telugu, NT News (2022-06-28). "చార్మినార్‌ స్ఫూర్తితో టీహబ్‌-2 భవనం". Namasthe Telangana. Archived from the original on 2022-07-08. Retrieved 2022-07-27.
  6. telugu, NT News (2022-10-20). "అబ్బురపరిచిన మన ఇన్నోవేటర్స్‌". Namasthe Telangana. Archived from the original on 2022-10-20. Retrieved 2022-10-22.
"https://te.wikipedia.org/w/index.php?title=టీ_హబ్_2&oldid=4032215" నుండి వెలికితీశారు