దేవబత్తుల జార్జి

తెలుగు నాటకరంగ, సినిమా నటుడు, నాటక దర్శకుడు

దేవబత్తుల జార్జి (1945, ఆగస్టు 10 - 2021, జూన్ 22) తెలుగు నాటకరంగ, సినిమా నటుడు, నాటక దర్శకుడు. బాహుబలి సినిమాలో బాహుబలిని గుర్తుపట్టే ముసలివాడి పాత్రలో నటించి గుర్తింపు పొందాడు.[1]

దేవబత్తుల జార్జి
జననం(1945-08-10)1945 ఆగస్టు 10
మరణం2021 జూన్ 22(2021-06-22) (వయసు 75)
జాతీయతభారతీయుడు
వృత్తిరిటైర్డ్ బ్యాంక్ మేనేజరు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలుగు నాటకరంగ, సినిమా నటుడు, నాటక దర్శకుడు

జీవిత విషయాలు

మార్చు

జార్జి 1945, ఆగస్టు 10న కృపానందం - రత్నమ్మ దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని ఆచంట వేమవరం గ్రామంలో జన్మించాడు. ఇతనికి ఒక అన్న, ఇద్దరు సోదరీమణులు. స్వగ్రామమై ఆచంట వేమవరంలో చదివాడు. గ్రామం నుండి తత్సమాన, కళాశాలలో ఉత్తీర్ణత సాధించిన ఏకైక వ్యక్తిగా నిలిచాడు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల నుండి డిగ్రీ విద్య, ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. విద్యను పూర్తిచేశాడు.

కొంతకాలం హైదరాబాద్‌లోని హైకోర్టులో పనిచేశాడు. ఆ తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసి 2000లో బ్యాంక్ మేనేజర్‌గా స్వచ్ఛంద పదవి విరమణ చేశాడు.[2]

వ్యక్తిగత జీవితం

మార్చు

వనిత కుమారితో జార్జి వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు (కిరణ్ కుమార్, వినోద్) ఇద్దరు కుమార్తెలు (మౌనిక, మాధురి).

నాటకరంగం

మార్చు

ఏలేశ్వరం గ్రామంలో బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్న సమయంలో దర్శకుడి ప్రోత్సాహంతో కొడుకు పుట్టాల నాటికలోని హీరో పాత్రతో నాటకరంగంలోకి ప్రవేశించి అనేక నాటక, నాటికల్లో నటించాడు. చెవిలో వువ్వు, దెబ్బతిన్న సుబ్బారావు, ఓ చీకటి రాత్రి, ది గేమ్, శాంతి వనం, సీతాలు సిగ్గుతో సచ్చిపోనాది, కూలి రాజు, ఆది శంకరాచార్య, క్షేత్రయ్య, భయం, విశ్వశాంతి, రాజిగాడు రాజయ్యాడు, అంబేద్కర్ రాజగృహ ప్రవేశం వంటి నాటకాలలో నటించాడు. కూలి రాజు నాటకంలోని పాత్రకు ఉత్తమ నటుడిగా పలు అవార్డులు అందుకున్నాడు. అందిన ఆకాశం నాటికకు దర్శకత్వం వహించాడు.[3][4] అనేక పరిషత్తులో ప్రదర్శించబడిన ఈ నాటికకు ఉత్తమ నాటిక, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి విభాగాల్లో బహుమతులు వచ్చాయి. రేడియో నాటకాల్లో కూడా నటించాడు. డీజీ క్రియేషన్స్‌ సంస్థను స్థాపించి పలు నాటకాలు ప్రదర్శించాడు. ఇతర నాటక సంస్థలకు అధ్యక్షుడిగా, సభ్యుడిగా సేవలు అందించాడు.

పదవి విరమణ పొందిన తరువాత అమృతం సీరియల్‌లో అవకాశం వచ్చింది. అనేక సీరియళ్ళలో నటించాడు.

సినిమాలు

మార్చు

నటుడిగా చేసిన ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టడంతో దర్శకుడు రాజమౌళి చూసి, బాహుబలిలో సినిమాలో అవకాశం ఇచ్చాడు.[5] 'గ్రీన్ ఆర్మీ' అనే షార్ట్ ఫిల్మ్‌ని నిర్మించి, నటించాడు.

  1. బాహుబలి
  2. బాహుబలి 2

జార్జి 2021, జూన్ 22న ఆచంట వేమవరంలోని తన స్వగృహంలో గుండెపోటుతో మరణించాడు.

మూలాలు

మార్చు
  1. The Hans India, Vijayawada (24 June 2021). "Theatre personality Devabattula George passes away". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2021. Retrieved 27 June 2021.
  2. సాక్షి, పశ్చిమ గోదావరి (28 May 2017). "బాహుబలిలో నటించటం గ్రామానికే గర్వకారణం". Sakshi. Archived from the original on 1 June 2017. Retrieved 27 June 2021.
  3. వెబ్ ఆర్కైవ్, నమస్తే తెలంగాణ, వరంగల్ సిటీ (12 February 2018). "ఆకట్టుకుంటున్న నాటకోత్సవాలు". Archived from the original on 17 April 2018. Retrieved 27 June 2021.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link)
  4. ఈనాడు, పాలకొల్లు పట్టణం (5 April 2021). "ముగిసిన జాతీయ స్థాయి నాటికోత్సవాలు". Archived from the original on 22 June 2021. Retrieved 27 June 2021.
  5. ఈనాడు, డైలీహంట్ (26 March 2018). "వెండి తెర వయా రంగస్థలం" (in ఇంగ్లీష్). Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.