నాయిని నర్సింహరెడ్డి ఉక్కు వంతెన

నాయిని నర్సింహరెడ్డి ఉక్కు వంతెన (ఇందిరాపార్కు– వీఎస్‌టీ ఉక్కు వంతెన) అనేది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఇందిరాపార్కు– వీఎస్‌టీ ప్రాంతాల మధ్య నిర్మించిన ఉక్కు వంతెన.[1] హైదరాబాదు నగరంలోనే తొలిసారిగా నిర్మించబడిన ఈ ఉక్కు వంతెన సదుపాయంతో హిందీ మహావిద్యాలయ, విద్యానగర్, రామ్‌నగర్, వీఎస్టీల నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ మీదుగా సచివాలయం, లక్డీకాపూల్‌ తదితర ప్రాంతాలకు వెళ్ళేవారికి ట్రాఫిక్ సమస్య తీరనుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.[2]

నాయిని నర్సింహరెడ్డి ఉక్కు వంతెన
(ఇందిరాపార్కు– వీఎస్‌టీ స్టీలు బ్రిడ్జి)
ప్రదేశం
ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, హైదరాబాదు, తెలంగాణ
జంక్షన్ వద్ద
రహదార్లు
ఇందిరాపార్కు– వీఎస్‌టీ
నిర్మాణం
రకంఫ్లైఓవర్
లైన్స్4
నిర్మాణం చేసినవారునిర్మాణంలో ఉంది by హైదరాబాదు మహానగర పాలక సంస్థ
ప్రారంభం2023, ఆగస్టు 19
గరిష్ట
ఎత్తు
20 మీటర్లు
గరిష్ట
వెడల్పు
2.8 కిలోమీటర్ల పొడవు
16.61 మీటర్ల వెడల్పు

దశాబ్దాల పాటు వీఎస్టీ కార్మిక సంఘానికి నాయకత్వం వహించి, ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రిగా పనిచేసిన నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలమేరకు దీనికి 'నాయిని నర్సింహరెడ్డి ఉక్కు వంతెన'గా పేరు పెట్టబడింది. దక్షిణ భారతదేశంలో రహదారిపై నిర్మించిన మొదటి పొడవైన ఉక్కు వంతెన ఇది.[3] 2023, ఆగస్టు 19న ఈ వంతెన ప్రారంభించబడింది.

ప్రతిపాదన మార్చు

విద్యానగర్ నుండి వీఎస్టీల, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, అశోక్ నగర్, ఇందిరా పార్కు మీదుగా ప్రయాణించేవారికి ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్య తీరేందుకు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాం కింద 2.62 కిలోమీటర్ల (ఎలివేటెడ్‌ కారిడార్‌లో 2.436 కిలోమీటర్లు కాగా, ఎగువ ర్యాంపు 0.106 కి.మీ., దిగువ ర్యాంపు 0.150 కి.మీ.) పొడవుతో, 16.61 మీటర్లు వెడల్పుతో భూమికి 20 మీటర్లు ఎత్తుతో (ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ చౌరస్తాలో మెట్రో కారిడార్‌ మీదుగా 26.54 మీటర్ల ఎత్తు) నాలుగు లైన్లతో ఒక బై డైరెక్షనల్‌ ఉక్కు వంతెన నిర్మించాలని ప్రతిపాదించబడింది. స్టాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డీపి)లో భాగంగా జిహెచ్ఎంసి నిర్మించిన 36వ ఫ్లైఓవర్ ఇది.

శంకుస్థాపన మార్చు

ఈ ఉక్కు వంతెన నిర్మాణానికి 2020, జూలై 11న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేశాడు.[4] ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, హైదరాబాద్‌ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌తోపాటు స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.[5]

నిర్మాణం మార్చు

భూసేకరణ అవసరం లేకుండా ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. వంతెన నిర్మాణం త్వరగా పూర్తిచేయడం కోసం సాధారణ కాంక్రీట్‌ నిర్మాణం కాకుండా 450 కోట్ల రూపాయలతో ఉక్కు వంతెన నిర్మాణం చేశారు.[6] ఈ వంతెన నిర్మాణంలో 12,500 మెట్రిక్‌ టన్నుల ప్రత్యేక అలాయ్‌ స్టీల్‌, 20 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వినియోగించారు. స్టీల్‌ను ఉక్రెయిన్‌ నుంచి తీసుకువచ్చారు. వంతెనలో మొత్తం 81 స్టీల్‌ పిల్లర్లు, 46 పైల్‌ ఫౌండేషన్లు ఉన్నాయి. నాలుగు లేన్లుగా నిర్మించిన దీనిలో 426 గర్డర్లు ఉన్నాయి. వంతెనలోని పిల్లర్లు, గర్డర్లకు పూర్తిగా ఉక్కు వాడుతూ, వంతెన శ్లాబ్‌ మాత్రం కాంక్రీట్‌ నిర్మాణమే చేశారు. సంప్రదాయ పద్ధతిలోని ఫ్లై ఓవర్ల కంటే వీటికి 40 శాతం మేర సమయం ఆదా అవుతుందని అధికారులు పేర్కొన్నారు.[7] గంటకు 40 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో మాత్రమే వెళ్ళేందుకు అనుమతి ఉన్న ఈ వంతెనపై ఎల్‌ఈడీ లైట్లు, క్రాస్ బారియర్ల ఏర్పాటు చేశారు.

ప్రారంభం మార్చు

2023, ఆగస్టు 19న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ వంతెనని ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, ఎంపీ కే.కేశవరావు, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, మేయర్ గద్వాల్ విజలయక్ష్మీతోపాటు అధికారులు పాల్గొన్నారు.[8][9]

 
నాయిని నర్సింహరెడ్డి ఉక్కు వంతెన ప్రారంభోత్సవ శిలాఫలకం

మూలాలు మార్చు

  1. "KTR inspects progress of steel bridge". The Hindu. 2023-03-04. ISSN 0971-751X. Archived from the original on 2023-03-04. Retrieved 2023-07-03.
  2. "Complete steel bridge in 3 months, KT Rama Rao tells Greater Hyderabad Municipal Corporation". The Times of India. 2023-03-05. ISSN 0971-8257. Archived from the original on 2023-03-05. Retrieved 2023-07-03.
  3. "Hyderabad: స్టీల్ వంతెన ప్రారంభ తేదీ ఖరారు: బ్రిడ్జీకి కార్మిక నేత పేరు". telugu.oneindia. 2023-08-18. Archived from the original on 2023-08-18. Retrieved 2023-08-18.
  4. "హైదరాబాద్‌లో స్టీల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన కేటీఆర్". Samayam Telugu. Archived from the original on 2023-07-03. Retrieved 2023-07-03.
  5. "Two Steel Bridges To Come Up In Hyderabad". Sakshi Post (in ఇంగ్లీష్). 2020-07-11. Archived from the original on 2023-07-03. Retrieved 2023-07-03.
  6. "Indira Park-VST steel bridge to be ready in three months: Telangana IT Minister KTR". The New Indian Express. 2023-03-05. Archived from the original on 2023-03-05. Retrieved 2023-07-03.
  7. "స్టీల్‌ వంతెనలకు సై!". Sakshi. 2019-02-27. Archived from the original on 2023-07-24. Retrieved 2023-07-24.
  8. "KTR: ప్రతిపక్షాలకు ఈసారి సినిమా చూపిస్తాం: కేటీఆర్‌". EENADU. 2023-08-19. Archived from the original on 2023-08-19. Retrieved 2023-08-19.
  9. ABN (2023-08-19). "KTR: సినిమా చూసేందుకు వచ్చి మేమూ ట్రాఫిక్‌లో ఇరుక్కునే వాళ్లం.. స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవంలో కేటీఆర్". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-08-19. Retrieved 2023-08-19.