నిన్నే పెళ్ళాడతా
నిన్నే పెళ్ళాడతా 1996 లో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన చిత్రం.[1] ఇందులో అక్కినేని నాగార్జున, టబు ప్రధాన పాత్రలు పోషించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి విభాల్లో ఫిల్ం ఫేర్ (దక్షిణాది) పురస్కారాలు, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా అక్కినేని పురస్కారం, ఉత్తమ గాయకుడిగా రాజేష్ కు నంది పురస్కారం లభించాయి.
నిన్నే పెళ్ళాడుతా | |
---|---|
దర్శకత్వం | కృష్ణవంశీ |
రచన | పృథ్వీ తేజ, ఉత్తేజ్ (మాటలు) |
నిర్మాత | అక్కినేని నాగార్జున |
తారాగణం | అక్కినేని నాగార్జున , టబు |
ఛాయాగ్రహణం | కె. ప్రసాద్ |
కూర్పు | శంకర్ |
సంగీతం | సందీప్ చౌతా |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | అక్టోబరు 4, 1996 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుశ్రీను ఉత్సాహవంతుడైన యువకుడు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా జీవితం గడిపే తత్వం అతనిది. అతని తల్లి మహాలక్ష్మికి అతనంటే వల్లమాలిన ప్రేమ. వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న మూర్తి కుటుంబం కూడా వీళ్ళతో కలిసి సరదాగా గడుపుతుంటారు. ఒకసారి మహాలక్ష్మి అలియాస్ పండు అనే అమ్మాయి పైలట్ శిక్షణ తీసుకోవడానికి హైదరాబాదు వస్తుంది. మూర్తి వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ కుటుంబ వాతావరణాన్ని బాగా ఇష్టపడుతుంది. క్రమంగా శీనును ఇష్టపడటం ప్రారంభిస్తుంది. శ్రీనుకు కూడా ఆమె నచ్చుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. శీను కుటుంబానికి కూడా నచ్చడంతో వాళ్ళ పెళ్ళికి అందరూ అంగీకరిస్తారు. ఇంతలో పండు నిజానికి పెళ్ళి రోజు ఇంట్లోంచి పారిపోయిన శీను మేనత్త కూతురని తెలుస్తుంది. కుటుంబ గొడవల మధ్య శీను, మహాలక్ష్మిలు ఎలా కలిశారన్నది మిగతా కథ.
తారాగణం
మార్చు- అక్కినేని నాగార్జున (శీను)
- టబు (మహాలక్ష్మీ అలియాస్ పండు)
- చలపతి రావు (శీను తండ్రి)
- లక్ష్మి (శీను తల్లి మహాలక్ష్మీ)
- గిరిబాబు
- చంద్రమోహన్
- ఆహుతి ప్రసాద్ (మహాలక్ష్మీ తండ్రి)
- బ్రహ్మాజీ
- బెనర్జీ
- మంజు భార్గవి (మహాలక్ష్మీ తల్లి భవాని)
- రవితేజ
- ఉత్తేజ్
- జీవా
- పృథ్వీరాజ్
- సన
నిర్మాణం
మార్చుదర్శకుడు కృష్ణవంశీ మొదటి చిత్రం గులాబి మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా నాగార్జున కృష్ణవంశీని కలిసి తనతో సినిమా చేసే అవకాశం ఇచ్చాడు. మొదట్లో కృష్ణవంశీ నాగార్జునతో ఒక యాక్షన్ కథా చిత్రాన్ని తీయాలనుకుని కథ ఒకటి వినిపించాడు. నాగార్జునకు ఆ కథ నచ్చి సినిమాకు ఓకే చెప్పాడు. కానీ గులాబీ సినిమా విడుదలైన తర్వాత అది తన గురువు రాం గోపాల్ వర్మ స్టైల్లో ఉందనే వ్యాఖ్యలు ఆయన్ను ఆలోచింపజేశాయి. అందుకోసం ఆయన నిన్నే పెళ్ళాడతా లాంటి కుటుంబ కథను ఎంచుకుని మళ్ళీ నాగార్జునకు ఆ కథను వినిపించాడు. నాగార్జున మొదట్లో సందేహించినా తర్వాత అంగీకరించాడు. పది రోజుల్లో స్క్రిప్టు పని పూర్తయింది. నాగార్జున ఈ చిత్రాన్ని అన్నపూర్ణ పతాకంపై స్వయంగా నిర్మించాడు.[2]
కథానాయిక కోసం సుమారు 65 మందిని పరీక్షించారు. తర్వాత కృష్ణవంశీ ముందుగా ముంబై వెళ్ళి టబును ఒప్పించివచ్చాడు. సంగీత దర్శకుడిగా సందీప్ చౌతా ఎంపికయ్యాడు. ఆయనకు ఇదే తొలిచిత్రం.
విడుదల
మార్చుఅక్టోబరు 4, 1996 న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. 39 కేంద్రాల్లో 100 రోజులు, 4 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. అప్పట్లో 12 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసింది. నాగార్జున కెరీర్లో మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ సినిమా ఇది.[2]
పురస్కారాలు
మార్చుదక్షిణాది ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి విభాగాల్లో పురస్కారాలు గెలుచుకుంది. ఉత్తమ కుటుంబ చిత్రంగా అక్కినేని అవార్డును అందుకుంది. ఎటో వెళ్ళిపోయింది మనసు పాటకు గాను ఉత్తమ గాయకుడిగా రాజేష్ కు నంది పురస్కారం లభించింది.
పాటలు
మార్చు- ఎటో వెళ్ళిపోయింది మనసు గానం - రాజేష్ కృష్ణన్ , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి
- గ్రీకు వీరుడు నా రాకుమారుడు గానం - సౌమ్యారావు , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి
- నిన్నే పెళ్లాడేస్తానంటూ గానం - , రామకృష్ణ, సందీప్, రాజెష్ కృష్ణన్, సౌమ్యారావు, బలరాం , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి
- కన్నుల్లో నీ రూపమే గానం - చిత్ర, హరిహరన్ , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి
- నా మొగుడూ రాంప్యారీ పాను దెచ్చీ ఫ్యానేయ్మంటాడే గానం. రాజేష్ కృష్ణన్ , మల్గాడి శుభ , సునీత , రచన: సుద్దాల అశోక్ తేజ
- అబ్బబ్బ దూకుతోంది లేత ఈడు నీ చూపు లాగే , గానం. హరిహరన్, సౌమ్య, జీక్కి, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
- నువ్ నాతో రా, తమాషాలలో తేలుస్తా, హే ఆవారా సుఖాలేమిటో చూపిస్తా, రికామీగా షికారేద్దాం, ఆకాశంలో మకామేద్దాం , గానం. సంజీవ్ వాధ్వని, సుజాత, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
మూలాలు
మార్చు- ↑ Eenadu (4 October 2021). "ఎవర్‌గ్రీన్ మూవీ 'నిన్నే పెళ్లాడతా'కు 25ఏళ్లు". Archived from the original on 4 అక్టోబరు 2021. Retrieved 4 October 2021.
- ↑ 2.0 2.1 "Ninne Pelladata: ఎవర్‌గ్రీన్ మూవీ 'నిన్నే పెళ్లాడతా'కు 25ఏళ్లు - telugu news nagarjuna and tabu ninne pelladatha completed 25 years". www.eenadu.net. Retrieved 2021-10-04.