పింగళి లక్ష్మీకాంతం

భారతీయ కవి మరియు రచయిత
(పింగళి లక్ష్మీకాంతము నుండి దారిమార్పు చెందింది)

పింగళి లక్ష్మీకాంతం (జనవరి 10, 1894 - జనవరి 10, 1972) ప్రసిద్ధ తెలుగు కవి. పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. రాయల అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన వంశానికి చెందిన లక్ష్మీకాంతం అధ్యాపకుడిగా, నటుడిగా,[1] కవిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు.

పింగళి లక్ష్మీకాంతం
జననంపింగళి లక్ష్మీకాంతం
జనవరి 10, 1894
కృష్ణా జిల్లా లో ఆర్తమూరుగ్రామం
మరణంజనవరి 10, 1972
నివాస ప్రాంతంకృష్ణా జిల్లా లో ఆర్తమూరుగ్రామం
వృత్తికవి
నటుడు
1954 - 1961 - విజయవాడ ఆకాశవాణి కేంద్రం సలహాదారు
1961 - 1965 - తెలుగు ఆచార్యుడు.
ప్రసిద్ధిప్రసిద్ధ కవి
తండ్రివెంకటరత్నం
తల్లికుటుంబమ్మ

జీవిత చిత్రం

మార్చు

పింగళి లక్ష్మీకాంతం 1894, జనవరి 10కృష్ణా జిల్లా ఆర్తమూరులో జన్మించాడు. ఈయన స్వగ్రామం చిట్టూర్పు. వీరి తల్లిదండ్రులు వెంకటరత్నం, కుటుంబమ్మ. ప్రాథమిక విద్యాభ్యాసం రేపల్లెలో పొందిన తరువాత మచిలీపట్నం లోని[2] హిందూ ఉన్నత పాఠశాల, నోబుల్ కళాశాలలో చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. పట్టా పొందారు. తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రికి శుశ్రూష చేసి, సంస్కృతాంధ్రాలలో బాగా పఠించి వారి శిష్యులలో అగ్రగణ్యులయ్యారు.

నోబుల్ కళాశాలకు చెందిన పాఠశాలలో ఆంధ్ర పండితుడిగా పనిచేశారు. మద్రాసు విశ్వవిద్యాలయంలోని ప్రాచ్య పరిశోధన విభాగంలో కొంతకాలం పరిశోధన చేశారు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్తులోను, శ్రీ వేంకటేశ్వరవిశ్వవిద్యాలయంలోను[3] ఆంధ్రాచార్యులుగా అధ్యక్షులుగా పనిచేసారు.

కాటూరి వెంకటేశ్వరరావుతో కలసి వీరు ఆంజనేయస్వామిపై ఒక శతకం చెప్పారు. వీరిద్దరు జంటకవులుగా ముదునురు, తోట్లవల్లూరు, నెల్లూరు మొదలగు చోట్ల శతావధానాలు చేశారు.

వీరు పాండవోద్యోగ విజయములు, ముద్రా రాక్షసము నాటకాలలో ధర్మరాజు, రాక్షస మంత్రిగా పాత్రలు చక్కగా పోషించి పేరుపొందారు. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యవర్గ సభ్యులు[4]గా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వీరికి విశిష్ట సభ్యత్వం ఇచ్చి సత్కరించింది.

వీరు 1972 సంవత్సరం జనవరి 10 తేదీన పరమపదించారు.

నిర్వహించిన పదవులు

మార్చు
  • బందరు నోబుల్ హైస్కూలులో తెలుగు పండితుడు
  • మద్రాసు ఓరియెంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో పరిశోధకుడు
  • 1931 - ఆంధ్ర విశ్వవిద్యాలయం, తెలుగు శాఖలో మొట్టమొదటిసారిగా బి.ఏ, ఆనర్స్ కోర్సు ప్రాంభించిన సమయంలో అక్కడ లెక్చరర్‌గా చేరాడు. క్రొత్త కోర్సులకు రూపకల్పన చేశాడు. 18 సంవత్సరాల సర్వీసు అనంతరం 1949లో పదవి విరమించాడు. ఇతను చేసిన పాఠ్య ప్రణాళికలే ఇతర సంస్థలకు మార్గదర్శకాలయ్యాయి. ఇతని బోధనల నోట్సులే సాహిత్య చరిత్ర, విమర్శలకు ప్రామాణికాలయ్యాయి.
  • 1954 - 1961 - విజయవాడ ఆకాశవాణి కేంద్రం సలహాదారు.
  • 1961 - 1965 - శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యుడు.

రచనలు

మార్చు
  1. ఆంధ్ర సాహిత్య చరిత్ర[5]
  2. సాహిత్య శిల్ప సమీక్ష[6]
  3. మధుర పండిత రాజము
  4. సంస్కృత కుమార వ్యాకరణము
  5. గంగాలహరి
  6. తేజోలహరి
  7. ఆత్మాలహరి
  8. ఆంధ్ర వాజ్మయ చరిత్ర (?)
  9. గౌతమ వ్యాసాలు
  10. గౌతమ నిఘంటువు (ఇంగ్లీష్ - తెలుగు)
  11. నా రేడియో ప్రసంగాలు
  12. మానవులందరు సోదరులు (మహాత్మా గాంధీ ప్రవచనాలకు అనువాదం)
  13. తొలకరి
  14. సౌందర నందము (1932) - పింగళి కాటూరి కవుల జంట కృతి
  15. ఆంగ్లేయ దేశ చరిత్రము (1931) [7]
  16. "పల్నాటి వీర చరిత్ర"ను పరిష్కరించాడు.

మూలాలు

మార్చు
  1. "ఆంధ్ర సాహిత్య చరిత్ర - పింగళి లక్ష్మీకాంతం".[permanent dead link]
  2. "పింగళి కాటూరి కవుల్లో ఒకరైన పింగళి లక్ష్మీకాంతం…బందరు". Archived from the original on 2022-09-28. Retrieved 2022-04-12.
  3. "సాహిత్య చరిత్ర పితామహుడు".
  4. "తెలుగు కవిగా ప్రసిద్ధి చెందిన బహుముఖ ప్రజ్ఞశాలి". Archived from the original on 2022-04-12. Retrieved 2022-04-12.
  5. DR.PINGALI LAKSHMIKANTHAM (1974). ANDHRA SAHITYA CHARITRA. ROP Hyderabad, PAR Informatics. ANDHRA PRADESH SAHITYA ACADAMY.
  6. "సాహిత్య శిల్ప సమీక్ష - పింగళి లక్ష్మీకాంతం".
  7. లక్ష్మీకాంతం, పింగళి. ఆంగ్లేయ దేశ చరిత్రము. చెన్నపురి: ఇండియన్ పబ్లిషింగ్ హౌస్ లిమిటెడ్. Retrieved 2020-07-12.