పొట్లపల్లి శ్రీనివాస రావు

పొట్లపల్లి శ్రీనివాస రావు ప్రముఖ వర్థమాన తెలుగు సాహితీవేత్త.

పొట్లపల్లి శ్రీనివాస రావు
జననం1960, జనవరి 27
చలివాగు కనిపర్తి గ్రామం, రేగొండ మండలం, వరంగల్ రూరల్ జిల్లా
నివాస ప్రాంతంహన్మకొండ, వరంగల్ అర్బన్ జిల్లా
వృత్తిసబ్ రిజిస్ట్రార్‌
ప్రసిద్ధితెలుగు సాహితీవేత్త, సమాజ సేవకులు
మతంహిందూ
తండ్రిధరణీశ్వరరావు
తల్లిరుక్మిణిదేవి

శ్రీనివాసరావు స్వగ్రామం వరంగల్ (గ్రామీణ) జిల్లా పరకాల మండలంలోని చలివాగు కనిపర్తి(ప్రస్తుతం రేగొండ మండలంలో ఉంది). అతను పొట్లపల్లి ధరణీశ్వరరావు, రుక్మిణిదేవి దంపతులకు జనవరి 27, 1960లో మొదటి సంతానంగా జన్మించాడు. శ్రీనివాసరావుకు ఒక సోదరుడు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు.

కుటుంబ నేపథ్యం

మార్చు

వీరిది సాధారణ మధ్యతరగతి కుటుంబం. ధరణీశ్వర్‌రావు విద్యాశాఖలో వయోజన విద్య ప్రాజెక్టు డైరెక్టర్‌గా విధులు నిర్వహించి విరమణ పొందాడు.

బాల్యం-విద్యాభ్యాసం

మార్చు

శ్రీనివాసరావు బాల్యమంతా సొంతూరులోనే గడిచింది. ఐదో తరగతి వరకు గ్రామంలోనే చదువుకున్నాడు. ఆరు, ఏడు తరగతులు కొత్తూరులోని ప్రాథమికోన్నత పాఠశాలలో చదివాడు. ఎనిమిదవ తరగతి నుంచి పదో తరగతి వరకు హన్మకొండలోని మర్కాజీ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. పాఠశాల విద్యాభ్యాస సమయం నుండే వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో చురుగ్గా పాల్గొనేవాడు. కాశీమజిలీ కథలు, చందమామ, బాలమిత్ర, అపూర్వ చింతామణి మొదలగు నీతిబోధనా పుస్తకాల పఠనంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవాడు. ఇంటర్‌ విద్య వరంగల్‌లోని ఎల్‌.బి. కళాశాలలో, డిగ్రీ విద్య హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీకి అనుబంధ సంస్థైన ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో పూర్తి చేశారు. అనంతరం కాన్పూర్ యూనివర్సిటీ లో పి.జి. పూర్తి చేశాడు.

ఉద్యోగం

మార్చు

ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడే జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం లభించింది. అనంతరం సీనియర్‌ అసిస్టెంటుగా పనిచేసి, ప్రస్తుతం వరంగల్ లో సబ్‌ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

రాణిస్తున్న రంగాలు

మార్చు
  • ప్రభుత్వ రంగం
  • సాహిత్య రంగం
  • సాంస్కృతిక రంగం
  • సామాజిక సేవా రంగం

సాహిత్య - సాంస్కృతిక కృషి

మార్చు
 
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 2021, ఏప్రిల్ 3న హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన ఆజాది కా కవి సమ్మేళన కార్యక్రమంలో కవిత్వ పఠనం చేస్తున్న పొట్లపల్లి శ్రీనివాసరావు

వరంగల్‌లోని ఎల్‌.బి. కళాశాలలో ఇంటర్‌ విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు (1977లో) కళాశాల బాటనీ లెక్చరర్‌, ఉద్యోగ రీత్యా బదిలీపై వెళ్తున్న సమయంలో “ఎవరు నీ వారు?... ఎవరు నా వారు?... ఎవరికి ఎవరు ఏమైనా కాలచక్రపు గమనంలో కొట్టుకుపోవాల్సిందేనా?” అంటూ లెక్చరర్‌పై ఉన్న అభిమానంతో రాసిన చిన్న వచన కవితే పొట్లపల్లి శ్రీనివాసరావు మొదటి రచన. ఈ రచనను విన్న తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు విశేషంగా ఆకర్షితులై అభినందించగా, మహాకవి కాళోజీ నారాయణరావు నీలో రచనాశైలి ఉందని అభినందించగా అప్పటి నుంచి కవితా రచన పై మక్కువ పెంచుకున్నాడు. ఆ తర్వాతి నుంచి కవిత్వం రాయడం ప్రారంభించాడు.

ఇంటర్‌ విద్యాభ్యాస సమయంలోనే కాలేజీ మ్యాగజైన్‌ కి తెలుగు విభాగం తరపున ఎడిటర్‌గా ఎంపిక కాబడ్డాడు. డిగ్రీ చదువుతున్న సమయంలో ప్రముఖ సాహితీవేత్త పేర్వారం జగన్నాధం అతనిలోని కవి లక్షణాలను గుర్తించి కాలేజీ మ్యాగ్జిన్‌ కోసం సాహిత్యం అందిచమని ప్రోత్సహించాడు. ఈ అనుభవాలు అతనికి సాహిత్య జిజ్ఞాసను మరింత పెంచాయి.

జనఘర్ష వారపత్రికలో తొలిసారి శ్రీనివాస్ రచించిన ‘చైతన్య గులాబీలు' అనే చిన్న కవిత ప్రచురితమైంది.

ప్రపంచీకరణ నేపథ్యంలో పాశ్చత్య పోకడలకు విరుద్ధంగా సంస్కృతి సాంప్రదాయాల రక్షణకు అనేక రచనలు చేశాడు పొట్లపల్లి. 1987లో తన తొలి కవితా సంకలనంగా చైతన్య గులాబీలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించాడు. మూడు స్వప్నాలు - ఒక మెలకువ పేరుతో తన రెండవ పుస్తకం వెలువరించాడు. ఆ తర్వాత సమాజంలోని మంచి, చెడులను తెలుపుతూ స్వతహాగా విలువలను తెలుసుకోవడానికి మానవున్ని మానవునిగా గుర్తించేందుకు మూడో కన్ను రచించాడు. అతని నడిచివచ్చిన దారి పుస్తకం మనుషుల్లోని అప్యాయత, అనురాగాలను వ్యక్తపరిచిన రచనగా నిలిచింది. తెలంగాణ ఉద్యమ సమయంలో దెబ్బతిన్న బెబ్బులిని రచించగా దానిని మొదటి జె.ఎ.సి. సమావేశంలో స్వామిగౌడ్‌ ఆవిష్కరించారు.

ఉద్యమ ప్రారంభంలో 2001లో తెలంగాణ రచయితల వేదిక ఫోరం వ్యవస్థాపక సభ్యునిగా, ఉపాధ్యక్షునిగా నందిని సిధారెడ్డి అధ్యక్షతన తెలంగాణ సోయితో రచనలు చేశాడు. కొత్త కవులకు ప్రేరణ కలిగించేందుకు ఓ వేదిక అందించాలనే ఉద్దేశంతో 1980లో సాహితీ సమితి అనే సంస్థను ఏర్పాటు చేశాడు. సాహితీ సమితి ద్వారా 40 నుంచి 50 వరకు పుస్తకాలు ప్రచురితమయ్యాయి.

దివిటి, మా విరసం, రత్నాలవీణ.... మొదలగు పుస్తకాలకు సంపాదకునిగా వ్యవహించారు. కాళోజీ రామేశ్వర రావు సాహిత్యం పై అక్షరార్చన, కోవెల సంపత్కుమారాచార్య సాహిత్యం పై సాహితీ సంపద, పేర్వారం జగన్నాధం సాహిత్యం పై పేర్వారం సాహితీ నీరాజనం అనే విశ్లేషణా పుస్తకాలు వెలువరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మలిదశ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆత్మబలిదానాలు చేసుకుంటున్న వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు తన సంపాదకత్వంలో ఊపిరి అనే కవితా సంకలనాన్ని తీసుకొచ్చాడు. నాయిన కవితా సంకలనానికి గౌరవ సంపాదకుడిగా వ్యవహరించాడు.

అనాథల జీవనశైలి పై మమతల ఊయల, తెలంగాణ పల్లె జీవనం పై మా ఊరు, భ్రూణహత్యలకు వ్యతిరేకంగా అమ్మ, ఉద్యమంలో జిల్లాకు ప్రత్యేక స్థానం కోసం వరంగల్‌ యాది మొదలగు డాక్యుమెంటరీలు రూపొందించాడు. 2014 లో కాకతీయ ఉత్సవాల సందర్భంగా మహిళా మేలుకో అనే నృత్య రూపకాన్ని రచించారు. బ్యాగ్ శీను అనే లఘు చిత్రానికి పర్యవేక్షణ చేశాడు. ఓరుగల్లు పోరుగానం ఆడియో ఆల్బమ్ లో పాటలు రాశారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో మూడు సంవత్సరాల పాటు పలు సాహిత్య అంశాల మీద, వరంగల్ ప్రముఖుల మీద దాదాపు 150 వ్యాసాలు రాశాడు. చాలా సాహిత్య పత్రికలు, దిన పత్రికలు, మాస పత్రికలు, సంకలనాలు, అంతర్జాల పత్రికలలో శ్రీనివాస్ రచించిన పలు కవితలు, పాటలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి, ప్రముఖుల ప్రశంసలందుకున్నాయి. సాహిత్య రంగంలో చేస్తున్న కృషికిగాను అనేక అవార్డులు, సన్మానాలు పొందాడు.

స్వీయ రచనలతో ప్రచురించిన పుస్తకాలు

మార్చు
  • చైతన్య గులాబీలు (చిన్న వచన కవితల సంకలనం) - 1987
  • మూడో కన్ను (వచన కవితల సంకలనం) - 1996
  • మూడు స్వప్నాలు - ఒక మెలకువ (వచన కవితల సంకలనం) - 2004
  • నడిచివచ్చిన దారి (వచన కవితల సంకలనం) - 2008
  • దెబ్బతిన్న బెబ్బులి (తెలంగాణ ఉద్యమ వచన కవితల సంకలనం) - 2011

సంపాదకత్వం వహించి ప్రచురించిన పుస్తకాలు

మార్చు
  • దివిటి - 1985
  • మా విరసం - 1990
  • రత్నాల వీణ - 1991
  • అక్షరార్చన - 19991
  • సాహితీ సంపద - 1993
  • పేర్వారం సాహితీ నీరాజనం
  • నాయిన - 2005
  • ఊపిరి - 2012

సామాజిక సేవ

మార్చు

తెలంగాణ కీర్తి స్థూపానికి నామకరణం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. తెలంగాణ భావజ్వాల ప్రాప్తికి నందిని సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటుకు ముఖ్యభూమిక పోషించాడు. వికలాంగ, వృద్ధ అనాథ, నిరుపేద ప్రజలకు తగిన చేయూతనిస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఇంకెన్నో ఇతర సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ నిస్వార్ధంగా తన వంతు సేవలు అందిస్తున్నాడు. సామాజిక సేవలకుగాను పురస్కారాలు, సన్మానాలు అందుకున్నాడు.

నిర్వహిస్తున్న పదవీ భాధ్యతలు

మార్చు
  • తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వరంగల్ అర్బన్ జిల్లా శాఖ అధ్యక్షుడు
  • తెలంగాణ జాగృతి - వరంగల్ అర్భన్ జిల్లా శాఖ సాంస్కృతిక విభాగం కన్వీనర్
  • కాళోజి ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యుడు, సంయుక్త కార్యదర్శి
  • సాహితీ సమితి ఉపాధ్యక్షుడు
  • వరల్డ్ పీస్ మిషన్ వ్యవస్థాపక సభ్యుడు
  • INSA - న్యూ ఢిల్లీ సభ్యుడు
  • రైటర్స్ కార్నర్ - వరంగల్ ప్రధాన కార్యదర్శి
  • సృజన లోకం - వరంగల్ ప్రధాన కార్యదర్శి
  • మిత్ర మండలి సభ్యులు
  • రెడ్ క్రాస్ సొసైటీ - వరంగల్ సభ్యులు
  • ISKON సభ్యులు
  • TGOU రాష్ట్ర ట్రెజరర్
  • బతుకమ్మ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు
  • లయన్స్ క్లబ్ అఫ్ భీమారం - హన్మకొండ చార్టర్ మెంబర్
  • డిస్ట్రిక్ట్ 320 F వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్
  • కవితా వార్షిక సంపాదక వర్గ సభ్యుడు

అందుకున్న అవార్డులు/ పొందిన గొప్ప సన్మానాలు

మార్చు
  • ఉత్తమ కవి అవార్డు - టిఎన్జీవోస్‌ (1990)
  • ఉత్తమ రచయిత అవార్డు - ప్రణయ మిత్ర మండలి (1999)
  • A 1 టాలెంట్‌ అవార్డు - అమ్మ ఆర్గనైజేషన్‌ (2001)
  • ఉత్తమ కవి స్వర్ణకంకణం - లయన్స్ క్లబ్ (2013)
  • గుర్రం జాషువా అవార్డు - గుర్రం జాషువా పరిశోధన కేంద్రం (2015)
  • ఉత్తమ సాహితీవేత్త అవార్డు - వరంగల్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ (2016)
  • తేజ విశిష్ట పురస్కారం - తేజ ఆర్ట్‌ క్రియేషన్స్‌ (2016)

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు