ప్రణీత్ హనుమంతు
ప్రణీత్ హనుమంతు తెలుగు యూట్యూబర్, తెలుగు సినిమా నటుడు. ఇతనికి ఫనుమంతు (Phanumantu) అన్న ప్రసిద్ధ యూట్యూబ్ ఛానెల్ ఉంది. హరోం హర, మై డియర్ దొంగ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. యూట్యూబ్ లైవ్‌లో చిన్నవయసు పిల్ల గురించి చేసిన లైంగిక వ్యాఖ్యల పట్ల రేగిన వివాదంతో సుప్రసిద్ధుడయ్యాడు. ఇతని తండ్రి సిహెచ్. అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసే ఐఏఎస్ అధికారి కాగా అన్నయ్య అజయ్ హనుమంతు ఫ్యాషన్ యూట్యూబర్.
నేపథ్యం
మార్చుప్రణీత్ హనుమంతు తండ్రి సిహెచ్. అరుణ్ కుమార్. అరుణ్ కుమార్ 2004 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌గా పనిచేస్తున్నాడు.[1][2] ప్రణీత్ అన్నయ్య అజయ్ హనుమంతు కూడా యూట్యూబర్. అజయ్ "ఏ జ్యూడ్" (Aye Jude) అన్న పేరుతో మగవారి ఫ్యాషన్స్ గురించి స్టైలింగ్ టిప్స్ ఇచ్చే ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు.[3]
కెరీర్
మార్చుయూట్యూబర్గా
మార్చుప్రణీత్ హనుమంతుకు ఫనుమంతు (Phanumantu) అన్న యూట్యూబ్ ఛానెల్ ఉంది. 2020లో ప్రారంభించిన ఈ ఛానెల్లో 2024 జూలై 10 నాటికి 1,82,000 మంది ఫాలోవర్లు ఉన్నారు.[1] ఇతని ఛానెల్లో సాధారణంగా సినిమాలకు, ప్రముఖులకు సంబంధించిన వీడియోలు, ప్రఖ్యాతి చెందిన సోషల్ మీడియా వీడియోలను ప్రదర్శిస్తూ వాటి గురించి తీవ్రమైన భాషలో అభిప్రాయాలు చెప్తూంటాడు. దీన్నే "రోస్టింగ్" అంటూంటారు. దీనిలో ప్రణీత్ ఒక్కడే పాల్గొనడంతో పాటుగా కొన్నిసార్లు అతని మిత్రులైన ఇతర యూట్యూబర్లు కూడా పాల్గొంటూ ఉంటారు. వీటిలో లైవ్ వీడియోలతో పాటుగా రికార్డెడ్ వీడియోలు కూడా ఉంటూ ఉంటాయి.[4]
రోస్ట్ వీడియోలతో పాటుగా సినిమాలకు ప్రమోషన్స్ కోసం వీడియోలు, ఇంటర్వ్యూలు కూడా ప్రణీత్ చేశాడు. కీడా కోలా సినిమా కోసం దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ దాస్యం బ్రహ్మానందంలా నటిస్తూ చేసిన వీడియో చేసింది ఇతనే. హాయ్ నాన్న సినిమా విడుదలకు ముందు నాని, భజే వాయు వేగం సినిమాకు ముందు కార్తికేయ గుమ్మకొండ ప్రమోషన్స్ కోసం ఇతనికి ఇంటర్వ్యూలు ఇచ్చారు.[2]
నటన
మార్చుప్రణీత్ కొన్ని సినిమాల్లో నటించాడు. 2024 ఏప్రిల్లో ఆహాలో విడుదలైన మై డియర్ దొంగ సినిమాలో ప్రాంక్ స్టార్ పాత్రలో నటించాడు. 2024 జూన్‌లో విడుదలైన హరోం హర సినిమాలో సెల్వ మాణిక్యం బుజ్జులు అన్న తమిళనాడుకు చెందిన డాన్ పాత్రలో నటించాడు.[5]
వివాదాలు
మార్చు2024 జులైలో ప్రణీత్ హనుమంతు తన తోటి యూట్యూబర్లైన ఆది, బుర్రా, డాలస్ నాగేశ్వరరావు వంటివారు కలసి ఫనుమంతు యూట్యూబ్ ఛానెల్లో చేసిన లైవ్లో ఒక వీడియో మీద వ్యాఖ్యలు చేశారు. తండ్రీ కూతుళ్ళలా కనిపిస్తున్న ఇద్దరి మధ్య (అందులో పాప వయసు ఐదారేళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది) చేసిన ఒక సరదా వీడియో మీద ప్రణీత్, అతని మిత్ర బృందం అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు.[4]
పిల్లల మీద అసభ్యకరమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేశారన్నది ఎత్తిచూపుతూ ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాలు వేదికగా విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రణీత్ బృందం చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ వేసిన ట్వీట్లలో ఒకదాన్ని సాయి ధరమ్ తేజ్ 2024 జూలై 7న కోట్ ట్వీట్ చేసి తక్షణం వీరిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, డీజీపీలను ట్యాగ్ చేయడంతో ఈ అంశానికి విస్తృతమైన ప్రచారం లభించింది. మంచు మనోజ్, నారా రోహిత్ వంటి సినిమా నటులు కూడా స్పందించారు. దీనితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, డీజీపీ వంటివారు ట్విట్టర్లో ప్రతిస్పందించి చర్యలు తీసుకుంటామని రాశారు.[4]
ఈ అంశంపై తెలంగాణ పోలీసు శాఖ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసింది. జూలై 10న బెంగళూరు పోలీసులు ప్రణీత్ హనుమంతును అరెస్టు చేసి తెలంగాణ పోలీసులకు అప్పగించారు.[1]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 Staff, T. N. M. (2024-07-10). "YouTuber Praneeth Hanumantu arrested for sexualising father-daughter relationship". The News Minute (in ఇంగ్లీష్). Retrieved 2024-07-14.
- ↑ 2.0 2.1 Pulagam, Satya (2024-07-08). "ప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?". telugu.abplive.com. Retrieved 2024-07-14.
- ↑ "తమ్ముడు చేసింది తప్పే.. ఆరేళ్ల క్రితమే ఇంటి నుంచి బయటికొచ్చేశా: హనుమంతు బ్రదర్ ఏ జూడ్". Samayam Telugu. Retrieved 2024-07-14.
- ↑ 4.0 4.1 4.2 "డర్టీ జోక్స్: సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు మాట్లాడొచ్చా, తండ్రీ కూతుళ్ళ బంధంపై జుగుప్సగా మాట్లాడిన యూట్యూబర్‌పై విమర్శలేంటి?". బీబీసీ న్యూస్ తెలుగు. 2024-07-08. Archived from the original on 2024-07-10. Retrieved 2024-07-14.
- ↑ Muttevi, Sri Lakshmi (2024-07-10). "YouTuber Praneeth Hanumanthu arrested by Telangana cops". newsmeter.in (in ఇంగ్లీష్). Retrieved 2024-07-14.