ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, అనంతపురం

(ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల (అనంతపురం) నుండి దారిమార్పు చెందింది)

ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, అనంతపురం (దత్తమండలం కళాశాల) 1916లో అనంతపురంలో స్థాపించబడింది. ఈ కళాశాల 1940-43 మధ్యకాలంలో రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచింది.

ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల
రకంసార్వత్రిక
స్థాపితం1916
ప్రధానాధ్యాపకుడుఎన్.రంగస్వామి
స్థానంఅనంతపురం, ఆంధ్ర ప్రదేశ్, భారత్
కాంపస్పట్టణ ప్రాంతం
అనుబంధాలుశ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం

చరిత్ర

మార్చు

దత్తమండలాలను ఉద్దరించి చైతన్యవంతం చేయాలనే తలంపుతో అలనాటి డి.పి.ఐ. జె.హెచ్.స్టోన్ దొరగారి ప్రమేయంతో అనంతపురం మునిసిపల్ హైస్కూలులో కాలేజి ఏర్పడింది.[1] 1916 జులై 8వ తేదీనాడు ద్వితీయశ్రేణి కళాశాలగా ఆవిర్భవించిన ఈ కళాశాలకు తొలి ప్రిన్సిపాల్ ఎస్.ఇ.రంగనాథన్. 41 విద్యార్థులతో, హిస్ట్రరీ, తెలుగు, కన్నడ, సంస్కృత, తత్త్వశాస్త్ర బోధనాంశాలతో ప్రారంభమైన ఈ కళాశాల ఆర్థికంగాను, అధ్యాపకుల కొరతతోను మొదట్లో కొంత ఇబ్బంది పడింది. ప్రొఫెసర్ మార్క్ హంటర్ నేతృత్వంలోని విశ్వవిద్యాలయ కమిషన్ అనంతపురానికి వచ్చి ఈ కళాశాలను పరిశీలించి చేసిన సిఫారసు మేరకు ఈ కళాశాల మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధం అయింది. రెండేండ్లు అనుబంధంగా ఉండి 1918 జూన్ 6లో ప్రథమశ్రేణి కళాశాలగా ఎదిగింది. ఈ ఎదుగుదలకు ప్రిన్సిపాల్ రంగనాథన్, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, లార్డ్ పెంట్‌లెండ్ కృషిచేశారు. మొదటి ఏడేండ్లలో కళాశాల కొత్త గదుల నిర్మాణంతో ఉత్సాహంగా ముందుకు సాగింది. 1920 అక్టోబరు 23 న కేశవ పిళ్లై అధ్యక్షతలో తొలి వార్షికోత్సవం జరిగింది. ఈ కళాశాలకు రెండవ ప్రిన్సిపాల్‌ అరుళానందం నేతృత్వంలో భౌతికమైన వనరులు చేకూరాయి. ద్వితీయ దశకంలో కళాశాల ప్రగతి పుంజుకుంది. ఎన్.ఆర్.కృష్ణమ్మ ప్రిన్సిపాల్‌గా సుదీర్ఘకాలం పనిచేసి అభివృద్ధి దిశగా పెనుమార్పులు వచ్చాయి. అధ్యాపకులలో అంకితభావం, విద్యార్థులలో అధ్యయన కాంక్ష, పరీక్షలలో ఉత్తమ ఫలితాల సాధన, క్రీడల్లో ప్రదర్శించిన నైపుణ్యం అంతా కలిసి ఈ కళాశాల కీర్తిని పెంచాయి.

 
స్వర్ణోత్సవాల సందర్భంగా తపాలాశాఖ విడుదల చేసిన ప్రత్యేక కవరు

1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఈ కాలేజి 1930లో మళ్ళీ మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మార్చారు. ఆ ఏడే కళాశాలకు హాస్టల్ భవనం ఏర్పడింది. 1940లో మద్రాసులోని సెయింట్ జాన్స్ దళానికి అనుబంధంగా ఈ కళాశాలలో అంబులెన్స్ విభాగం ఏర్పడింది. పేద విద్యార్థులకు విద్యార్థి వేతనం, విద్యలో వెనుకబడినవారికి ఉచితంగా ట్యుటోరియల్స్, ఫోటోగ్రఫీ క్లబ్, విహారయాత్రలు, వస్తుప్రదర్శన వంటివి ఈ కళాశాలలో ప్రవేశపెట్టి విద్యార్థులకు ఉత్తేజాన్ని కలిగించారు. 1945లో మద్రాసులోని యూనివర్శిటీ ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూలు అనుబంధంగా ఈ కళాశాలలో ఒక విభాగం వెలిసింది. 1946లో ప్రిన్సిపాల్ పి.ఎన్.గౌడ ఆధ్వర్యంలో రజతోత్సవ వేడుకలు జరిగాయి. 1947లో ఈ కళాశాల ప్రభుత్వ కళాశాలగా మారింది. ఆంధ్రరాష్ట్ర అవతరణతో ఈ కళాశాల ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండి తర్వాత కొంతకాలానికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధమైంది. 1978లో ఈ కళాశాల వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆ ఉత్సవాలకు అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి హాజరయ్యాడు. 1981లో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఏర్పడ్డాక ఈ కళాశాల దానికి అనుబంధ కళాశాలగా మారింది.

శత వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ కళాశాల ప్రస్తుతం 31 డిగ్రీ కోర్సులు, 14 పి.జి.కోర్సులు అందజేస్తున్నది. 7964మంది విద్యార్థులు ఈ కళాశాలలో చదువుకుంటున్నారు.[2] వీరిలో 90 శాతం విద్యార్థులు ఆర్థికంగా లేదా సామాజికంగా వెనుకబడినవారు. ప్రస్తుతం ఎన్.రంగస్వామి ఈ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నాడు.

జాతీయోద్యమంలో పాత్ర

మార్చు

స్వాతంత్ర్యోద్యమంలో ఈ కళాశాల ముఖ్యపాత్రను నిర్వహించింది.[3] ఈ కళాశాల 1940-43 మధ్యకాలంలో రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచింది. ఈ కళాశాల విద్యార్థులు పలువురు తమ భవిష్యత్తును లెక్కచేయకుండా జాతీయోద్యమంలో దూకారు. స్థానిక పీస్ మెమోరియల్ హాల్‌లో ఎ.పి.సి.సి సమావేశం జరిగినప్పుడు నీలం సంజీవరెడ్డి, కల్లూరు సుబ్బారావు, పప్పూరు రామాచార్యులు, కడప కోటిరెడ్డి, టంగుటూరి ప్రకాశం మొదలైన హేమాహేమీలతో పాటు ఈ కళాశాల విద్యార్థులు జీవరత్నమ్మ, ఆదిశేషయ్య పాల్గొనడం ఆ రోజులలో సంచలనాన్ని సృష్టించింది. ఆ సమావేశంలో వ్యక్తిగత సత్యాగ్రహానికి బదులు సామూహిక సత్యాగ్రహం చేపట్టాలని నిర్ణయించారు. 1940 జనవరి 28 న కళాశాల విద్యార్థులు రమేష్, టి.కె.ఆర్.శర్మ, ఆదిశేషయ్య, జీవరత్నమ్మల ఆధ్వర్యంలో పెద్ద ప్రదర్శన నిర్వహించారు. ఆ కాలంలోనే ఐదుకల్లు సదాశివన్, విద్వాన్ విశ్వం, నీలం సంజీవరెడ్డిల ఆధ్వర్యంలో ఆకాశవాణి అనే సైక్లోస్టయిల్ పత్రిక రహస్యంగా వెలువడేది. ఆ పత్రిక విద్యార్థులకు ఎంతో చైత్యన్యాన్ని పెంచింది. రాజకీయ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నందుకు ఆదిశేషయ్యను కళాశాల నుండి బహిష్కరించారు. మహిళా విద్యార్థి జీవరత్నమ్మ ఆ రోజుల్లో విద్యార్థుల సమ్మెకు నాయకత్వం వహించింది. పోలీసులు ఆమెను చితకబాదారు. ఆ తర్వాత ఆమె రహస్యంగా జాతీయోద్యమంలో పాల్గొనింది. ఆ రోజుల్లో ఆమెను కాలేజీ జోన్ ఆఫ్ ఆర్క్ అని పిలిచేవారు. అప్పట్లో కాలేజీ లెక్చరర్లుగా ఉన్న దామెర్ల రామారావు, ఉపమాక సూర్యనారాయణ రహస్యంగా విద్యార్థులకు మార్గదర్శనం చేసేవారు. ఈ విధంగా ఈ కళాశాల జాతీయోద్యమానికి సాక్షీభూతంగా నిలిచింది.

తొలి విద్యార్థిని

మార్చు

1920 ప్రాంతాలలో ఆడపిల్లలు కాలేజీ చదువు చదవడం చాలా అరుదైన విషయం. అనంతపురం మునిసిపల్ హైస్కూలులో టీచర్‌గా పనిచేసే కాశినేని నాగలింగప్ప మూడవ కుమార్తె నారాయణమ్మ ఐదవ తరగతి చదివాక ఆమె చదువు మాన్పించాలనుకొన్నారు. అయితే ఆమె పట్టుదలతో హైస్కూలుకు వెళ్లి ఎస్.ఎస్.ఎల్.సి పాసయింది. తరువాత కాలేజీలో చదువుకొనాలని ఆమె ఆకాంక్ష. తల్లి దండ్రులను, అన్నలను ఒప్పించి అప్పటి ప్రిన్సిపాల్ ఆర్.కృష్ణమ్మ (పురుషుడు) ప్రోత్సాహంతో దత్తమండల కళాశాలలో చేరింది. ఆమె ఆ కళాశాల మొట్టమొదటి మహిళావిద్యార్థి.[4] పాతూరు నుండి కొత్తూరులో ఉన్న కళాశాలకు ఒకతే నడుచుకుంటూ కాలేజీకి వచ్చేది. ఎలాగో కష్టపడి చదివి ఎఫ్.ఎ., బి.ఏ. పరీక్షలు పాసయింది. బి.ఎ. పాసయిన తర్వాత ఆమెను బళ్లారిలోని ఒక వృద్ధుడికి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఆ వివాహబంధం ఎక్కువరోజులు నిలువలేదు. తరువాత పుట్టిల్లు చేరింది. ఆ తరువాత మద్రాసులోని టీచర్ ట్రైనింగ్ కళాశాలలో ఎల్.టి.ట్రైనింగ్ పూర్తి చేసి టీచర్‌గా ఉద్యోగం సంపాదించింది. ఆమె ఉద్యోగాన్ని సమర్థతతో నిర్వర్తించి పదోన్నతి పొంది విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ అయ్యింది. 20 సంవత్సరాలు రాయలసీమలో 10 సంవత్సరాలు సర్కారు జిల్లాలలో పనిచేసి రిటైర్ అయింది. 1998లో ఆమెను కళాశాల యాజమాన్యం సన్మానించింది.

పూర్వ అధ్యాపకులు

మార్చు

ఈ కళాశాలలో పనిచేసిన అధ్యాపకులలో కొందరు.

పూర్వ విద్యార్థులు

మార్చు

ఈ కళాశాలలో చదువుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గర్వకారణమైన స్థానాలు సాధించిన విద్యార్థులలో కొందరు.[5].

మూలాలు

మార్చు
  1. ఎడిటర్ (1999). "ఆర్ట్స్ కళాశాల చరిత్ర". అనంతనేత్రం (వార్త దినపత్రిక అనంతపురం జిల్లా ప్రత్యేక సంచిక): 17.
  2. V. K., RAKESH REDDY (2015-01-03). "Anantapur Arts and Science College to turn 100 years". The Hindu. Retrieved 27 January 2015.
  3. ఎడిటర్ (1999). "స్వాతంత్ర్యోద్యమంలో అనంత విద్యార్థుల పాత్ర". అనంతనేత్రం (వార్త దినపత్రిక అనంతపురం జిల్లా ప్రత్యేక అనుబంధం): 60.
  4. జి., రామకృష్ణ (1999). "ప్రప్రథమ విద్యార్థిని నారాయణమ్మ". అనంతనేత్రం (వార్త దినపత్రిక అనంతపురం జిల్లా ప్రత్యేక అనుబంధం): 134.
  5. ఎడిటర్ (1999). "అనంత ఆర్ట్స్‌కాలేజీ సృష్టించిన ఆణిముత్యాలు". అనంతనేత్రం (వార్త దినపత్రిక అనంతపురం జిల్లా ప్రత్యేక అనుబంధం): 41.