సర్దేశాయి తిరుమలరావు
సర్దేశాయి తిరుమల రావు ( నవంబర్ 28, 1928 - మే 11, 1994) వృత్తిరీత్యా తైల పరిశోధనా శాస్త్రవేత్త. ప్రవృత్తిరీత్యా సాహితీ విమర్శకుడు. ఆజన్మ బ్రహ్మచారి.
సర్దేశాయి తిరుమలరావు | |
---|---|
![]() సర్దేశాయి తిరుమలరావు | |
జననం | సర్దేశాయి తిరుమలరావు నవంబరు 28, 1928 కర్నూలు జిల్లా,ఆస్పరిమండలం, జొహరాపురం గ్రామం |
మరణం | మే 11, 1994 అనంతపురం |
వృత్తి | డైరెక్టరు, తైలసాంకేతిక పరిశోధనాసంస్థ, అనంతపురం |
ప్రసిద్ధి | తైల సాంకేతిక శాస్త్రవేత్త, విమర్శకుడు, రచయిత |
జీవిత విశేషాలు సవరించు
కర్నూలు జిల్లా జోహారాపురంలో పేద మధ్వబ్రాహ్మణ కుటుంబంలో 1928, నవంబర్ 28 న జన్మించాడు. కృష్ణవేణమ్మ, నరసింగరావు ఇతని తల్లిదండ్రులు.ఇతడి పూర్వీకుడు వెంకన్నపంతులు ఆదోని నవాబు దగ్గర మంత్రిగా పనిచేసి మంత్రాలయంలో రాఘవేంద్ర మఠం స్థాపనకు తోడ్పడినవాడు. ఆదోని,అనంతపురంలలో ప్రాథమిక,ఉన్నత పాఠశాల విద్యలు చదివాడు. అనంతపురం దత్తమండల కళాశాల [తరువాతి కాలంలో గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల]లో 1946-1950ల మధ్య చదివాడు. చిలుకూరి నారాయణరావుకు ఇతడు శిష్యుడు. 1954లో రాజస్థాన్ రాష్ట్రం పిలానికి చెందిన బిర్లా ఇన్స్టిట్యూట్‌నుండి ఎం.ఎస్.సి. కెమిష్ట్రీ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.ఆజన్మ బ్రహ్మచారి.[1][2][3][4]
1954లో తైల సాంకేతిక పరిశోధనా సంస్థలో కెమిస్టుగా కెరీర్ ను ప్రారంభించి, 1983 జూలై 31న డైరెక్టర్ గా పదవీ విరమణ చేసేంత వరకూ సర్దేశాయి తిరుమలరావు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. ఆయన పేరిట తైలసాంకేతిక రంగంలో పదకొండు పేటెంట్లు ఉన్నాయి. ఈ రోజు గృహిణులు తమ ఇళ్ళల్లో ఉపయోగించే వంటనూనెలలో కొన్నిటికి ఈయన సాంకేతికతను అభివృద్ధి చేశాడు.
ఆయన నేతృత్వంలో OTRI (Oil Technology Research Institute) సంస్థ కేంద్ర ప్రభుత్వం యేటా ఉత్తమ పరిశోధనాసంస్థలకు ఇచ్చే బహుమతులలో ఐదు సార్లు బంగారు పతకాన్ని, ఇంకా పది సార్లు రజత కాంస్యపతకాలను గెలుచుకుంది. జాతీయ, విదేశీయ పత్రికలలో తైలసాంకేతికత మీద ఐదువందలకు పైగా పరిశోధనా, సిద్ధాంత వ్యాసాలు వ్రాశాడు.
సాహితీ సేవ సవరించు
ప్రతి రచననూ విమర్శనాత్మక దృష్టితో చూసే సర్దేశాయి తిరుమలరావుకు నచ్చిన గ్రంథాలు మూడున్నాయి. గురజాడ రచించిన కన్యాశుల్కం నాటకాన్ని, ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన మాలపల్లి నవలను, గడియారం వేంకట శేషశాస్త్రి రాసిన శివభారతం కావ్యాన్ని ఆయన ఎంతో ఇష్టపడేవాడు. కన్యాశుల్క నాటక కళ, సాహిత్య తత్త్వము-శివభారత దర్శనము అనే పుస్తకాలను రాశారు. మాలపల్లి మీద రచన పూర్తి చేయకుండానే ఆయన కన్నుమూశాడు. ఈయన సాహిత్యకృషిని గుర్తించి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 1989లో గౌరవ డాక్టరేట్ (డి.లిట్.)ప్రదానం చేసింది. ఈయన విమర్శకు గుర్తింపుగా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 1989లో తిక్కవరపు రామిరెడ్డి స్మారక పురస్కారాన్ని ఇచ్చింది. భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ది హిందు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, బ్లిట్జ్,సైన్స్‌టుడే మొదలైన పత్రికలలో సాహిత్య, సాహిత్యేతర అంశాలపై ఎన్నో వ్యాసాలు, ఉత్తరాలు వ్రాశాడు. చర్చలు చేశాడు. అసలు పేరుతో పాటుగా 'తి', 'నిశ్శంకతిమ్మణ్ణ', 'పైథోగొరస్' మొదలైన తొమ్మిది కలంపేర్లతో రచనలు చేశాడు. ఇతడు విమర్శలు మాత్రమే కాకుండా సృజనాత్మక రచనలు కొన్ని చేశాడు. వాటిలో 'పద్మావతీ చరణచారణ చక్రవర్తి', 'పగచిచ్చు' అనే నాటికలు, 'భూసూక్తము' అనే కథా ఉన్నాయి.[5] ఇతని విషయపరిజ్ఞానానికి, విమర్శనాదృష్టికి, అభిరుచికి అద్దం పట్టే కొన్ని చర్చలు ఇలా ఉన్నాయి.
- బసవేశ్వరుడు కాయకమే కైలాసమనెనా? - ఆంధ్రపత్రిక దినపత్రిక
- భారత,రామాయణ,భాగవతముల ఆద్యంతముల ఆంతర్యము - ఆంధ్రప్రభ దినపత్రిక
- తిక్కన స్త్రీపర్వములోని ఛందోవైవిధ్యములోని ఆంతర్యము - ఆంధ్రప్రభ దినపత్రిక
- వేదవ్యాసుడు బ్రాహ్మణేతరుడా? - భారతి
- కన్యాశుల్కంలో అసభ్యత ఉన్నదా? - భారతి
- హిమలేహ్యం - శేషేంద్రజాలం - భారతి
- మినీకవిత - మాక్సీవ్యాఖ్య - భారతి
- తెలుగు మీద కన్నడ ప్రభావమెంత? - భారతి
- మాలపల్లి పై ఈస్టలిన్ ప్రభావం కలదా? - భారతి
పుస్తకాలు సవరించు
- తెలుగు విశ్వవిద్యాలయం రాచపాళెం చంద్రశేఖరరెడ్డి సంపాదకత్వంలో సర్దేశాయి తిరుమలరావు విమర్శావ్యాసాలను విమర్శ-ప్రతివిమర్శ పేరుతో ప్రకటించింది.
- 1965 ప్రాంతం నుండి 1994లో కన్నుమూసేంత వరకూ భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ది హిందు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలలో రాసిన వ్యాసాలను, లేఖలను, సాహితీ విమర్శలను సేకరించి జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు అనే పుస్తకంగా తీసుకొచ్చారు. దీనిలో తిరుమలరావు రచనలతో పాటు ఆయన గురించి ఇతరులు వ్రాసిన వ్యాసాలు కూడా ఉన్నాయి. దీని సంపాదకులు కోడీహళ్లి మురళీ మోహన్, నాగసూరి వేణుగోపాల్.
మరణం సవరించు
మూలాలు సవరించు
- ↑ తెలుగు పెద్దలు పుట 294
- ↑ కర్నూలు జిల్లా రచయితలచరిత్ర - కె.ఎన్.ఎస్.రాజు,కర్నూలు జిల్లా రచయితల సహకార ప్రచురణ సంఘం, కర్నూలు
- ↑ రాయలసీమ రచయితల చరిత్ర మూడవ సంపుటి - కల్లూరు అహోబలరావు,శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
- ↑ వార్త అనంతపురంజిల్లా ప్రత్యేక సంచిక అనంతనేత్రం
- ↑ జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు - కోడీహళ్లి మురళీ మోహన్, నాగసూరి వేణుగోపాల్ - అబ్జక్రియేషన్స్,హైదరాబాదు