బాబూ రాజేంద్ర ప్రసాద్

భారత దేశపు మొదటి రాష్ట్రపతి
(బాబు రాజేంద్ర ప్రసాద్ నుండి దారిమార్పు చెందింది)

డా. రాజేంద్ర ప్రసాద్ (1884 డిసెంబర్ 31963 ఫిబ్రవరి 28) భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి. అతడు 1950 నుండి 1962 వరకు రాష్ట్రపతి బాధ్యతలను నిర్వహించాడు.[1] ప్రజలు ఇతనిని ప్రేమగా, గౌరవంగా 'బాబూ' అని పిలిచేవారు. అతడు భారతీయ రాజకీయ నాయకునిగా భారత జాతీయ కాంగ్రెస్ లో భారత స్వాంతంత్ర్యోద్యమ కాలంలో చేరాడు. అతడు బీహార్ లో ప్రముఖ నాయకునిగా ఎదిగాడు. మహాత్మాగాంధీ మద్దతుదారునిగా అతడు 1931 లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం, 1941లోజరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమాలలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. 1946 ఎన్నికల తరువాత అతడు ఆహారం, వ్యవసాయం శాఖకు భారత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించాడు. అతడు భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి. 1948 నుండి 1950 వరకు భారత రాజ్యాంగ ముసాయిదా తయారీ కోసం ఏర్పరచబడిన సంఘానికి అధ్యక్షత వహించాడు.[2] 1950లో భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించిన తరువాత అతడు రాగ్యాంగ పరిషత్తు ద్వారా మొదటి రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. 1951 సార్వత్రిక ఎన్నికల తరువాత అతడు మొదటి భారత పార్లమెంటు ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. ఒక రాష్ట్రపతిగా అతడు పక్షపాత ధోరణి లేకుండా, ఉన్నత పదవులలో ఉన్నవారు స్వతంత్రంగా వ్యవహరించేందుకుగాను కాంగ్రెస్ పార్టీ రాజకీయాల నుండి వైదొలగి కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పాడు. ఈ పదవి అలంకారప్రాయ మైనదైనప్పటికీ అతడు భారతదేశంలో విద్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు గాను అప్పటి ప్రధానమంత్రి జవాహర్ లాల్ నెహ్రూ కు వివిధ సందర్భాలలో సలహాలనిచ్చేవాడు. 1957లో అతడు రెండవసారి రాష్ట్రపతిగా ఎన్నికై, రెండు సార్లు భారత రాష్ట్రపతి పదవినలంకరించిన ఏకైక వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు.

బాబూ రాజేంద్ర ప్రసాద్
బాబూ రాజేంద్ర ప్రసాద్


పదవీ కాలం
26 జనవరి 1950 – 14 మే 1962
ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ
ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్
ముందు హోదా ప్రారంభించబడినది
చక్రవర్తి రాజగోపాలాచారి (భారత గవర్నర్ జనరల్)
తరువాత సర్వేపల్లి రాధాకృష్ణన్

వ్యక్తిగత వివరాలు

జననం (1884-12-03)1884 డిసెంబరు 3
సివాన్ జిల్లా, బెంగాలీ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతంబీహార్, భారతదేశం)
మరణం 1963 ఫిబ్రవరి 28(1963-02-28) (వయసు 78)
పాట్నా, బీహార్, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి రాజ్‌వంశి దేవి (మ.1961)
పూర్వ విద్యార్థి కలకత్తా విశ్వవిద్యాలయం
సంతకం బాబూ రాజేంద్ర ప్రసాద్'s signature
పురస్కారాలు భారతరత్న (1962)

బాల్యము, విద్యాభ్యాసం

రాజేంద్ర ప్రసాద్[3] బీహార్ రాష్ట్రంలో శివాన్ జిల్లాలోని జెర్దాయ్ గ్రామంలో 1884లో డిసెంబరు 3 న జన్మించాడు. అతని తండ్రి మహదేవ్ సహాయ్ సంస్కృతం, పర్శియను భాషలలో పండితుడు. తల్లి కమలేశ్వరీ దేవి ఎప్పుడూ రామాయణం నుండి కథలు వివరించేది. ఐదవ ఏటనే పర్షియన్ భాష, హిందీ భాష , అంకగణితం ను నేర్చుకోవడానికి ఒక మౌల్వీ (ముస్లిం పండితుడు) దగ్గరకు పంపించబడ్డాడు. తరువాత ఛాప్రా ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసాడు. 12 సంవత్సరాల వయసులోనే రాజ్‌వంశీ దేవిని వివాహం చేసుకున్నాడు. అటు తరువాత విద్యకై పాట్నాలో తన అన్న మహేంద్ర ప్రసాద్ వద్ద ఉంటూ ఆర్.కె.ఘోష్ పాఠశాలలో చదువుకున్నాడు. మరల ఛాప్రా ప్రభుత్వ పాఠశాలలో చేరి కలకత్తా విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై నెలకు రూ.30 ఉపకారవేతనం పొందాడు.

1902లో అతడు కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు. మొదట్లో సైన్సు విద్యార్థి. 1904లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఎఫ్.ఎ ఉత్తీర్ణుడయ్యాడు. అక్కడే 1905లో మొదటి స్థానంలో గ్రాడ్యుయేషన్ చేసాడు. [4] అతని అధ్యాపకులలో జగదీష్ చంద్రబోసు, ప్రఫుల్ల చంద్ర రాయ్ మొదలగువారు ఉన్నారు. అతడి మేథాశక్తికి ఒక ఎక్జామినర్ (పరీక్షకుడు) ప్రభావితుడై అతడి పరీక్షా జవాబు పత్రంపై "పరీక్షకుని కంటే పరీక్షితుడు గొప్పవాడు" అనే వ్యాఖ్య రాసాడు. [5]

తరువాత అతడు సాంఘిక శాస్త్రంపై మక్కువ పెంచుకుని అటువైపు తన దృష్టి మరల్చాడు.1917లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో ఎం.ఎ. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. బి.ఎల్. ఆ తర్వాత ఎం.ఎల్. పూర్తి చేసి డాక్టరేట్ కూడా పొందాడు. రాజేంద్ర ప్రసాద్ చదువుతున్నప్పుడు తన అన్నతో కలిసి ఈడెన్ హిందూ హాస్టలులో నివసించేవాడు. అన్నతో కలిసి స్వదేశీ ఉద్యమాన్నీ నడిపాడు. అతడు "ద్వాన్ సమాజం" లో క్రియాశీల సభ్యునిగా సేవలందించాడు. [6] అతడు పాట్నా కళాశాలలో1906లో జరిగిన బీహారీ స్టూడెట్స్‌ కాన్ఫరెన్సు ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు. భారతదేశంలో మొదటిసారి ఏర్పడిన ఈ సంస్థ చంపారన్ ఉద్యమం, సహాయనిరాకరణోద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన నాయకులైన అనుగ్రహ నారాయణ్ సిన్హా, కృష్ణ సింగ్ లను దేశానికందించింది. .[7]

జీవితం

ఉపాధ్యాయునిగా

 
(కుడి నుండి ఎడమకు కూర్చున్నవారిలో) ప్రసాద్, అనుగ్రహనారాయణ సింగ్ - 1917లో మహాత్మాగాంధీ చంపారన్ ఉద్యమం సమయంలో తీసిన చిత్రం

అతడు ఉపాద్యాయునిగా అనేక విద్యాసంస్థలలో పనిచేసాడు. ఆర్థిక శాస్త్రంలో ఎం.ఎ పూర్తి చేసిన తరువాత అతడు బీహార్ లోని ముజఫర్‌పూర్ లాంగట్ సింగ్ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకునిగా చేరాడు. తరువాత ఆ సంస్థకు ప్రధానాచార్యునిగా తన సేవలనందించాడు. తరువాత 1909లో కలకత్తాలోని రిప్పన్ కళాశాలలో న్యాయవాద విద్యను అభ్యసించడానికి గాను ఉద్యోగాన్ని వదిలి వెళ్ళాడు. అతడు ఆ కళాశాలలో న్యాయవాద విద్యను అభ్యసించే సమయంలో కలకత్తా సిటీ కళాశాలలో ఆర్థికశాస్త్ర అధ్యాపకునిగా పనిచేసాడు. 1915 లో "మాస్టర్ ఆఫ్ లా" పరీక్షలకు హాజరై ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకాన్ని పొందాడు. 1937లో అలహాబాదు విశ్వవిద్యాలయం నుండి న్యాయ శాస్త్రంలో డాక్టరేట్ డిగ్రీని పొందాడు.[8]

న్యాయవాదిగా

1911 లో, కాంగ్రేసులో చేరాడు. కానీ అతని కుటుంబ పరిస్థితి ఏమంత బాగాలేదు. కుటుంబం తన సహాయానికై ఎదురు చూస్తున్న తరుణంలో, స్వాతంత్ర్య సమరంలో పాల్గొనేందుకు అన్నగారిని అనుమతి అడిగాడు.అతడు అందుకు ఒప్పుకోక పోవటం వలన 1916 లో, బీహార్, ఒడిషా రాష్ట్రాల హైకోర్టులలో చేరాడు. తరువాత 1917లో అతడు పాట్నా విశ్వవిద్యాలయంలోని సెనేట్, సిండికేట్ లో మొదటి సభ్యునిగా నియమింపబడ్డాడు. బీహార్ లో సిల్క్-టౌన్ గా ప్రసిద్ధిగాంచిన భగల్‌పూర్ లో న్యాయవాద పాక్టీసును చేపట్టాడు. ఏదైనా విచారణ జరుగుతున్నప్పుడు, తన వాదనకు వ్యతిరేకంగా ఎవరైనా ఉదాహరణలు చూపలేకపోయినప్పుడు, న్యాయమూర్తులు రాజేంద్ర ప్రసాదునే ఉదాహరణ ఇవ్వమని అడిగేవారు.

 
కలకత్తా హైకోర్డు ఆవరణలో డా. రాజేంద్ర ప్రసాద్ విగ్రహం

స్వాతంత్ర్య సమరంలో

న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన అనతికాలంలోనే స్వాతంత్ర్య పోరాటంవైపు ఆకర్షితుడయ్యాడు. రాజేంద్రప్రసాద్ 1906లో మొదటి సారి కలకత్తాలో నిర్వహించబడిన భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాల ద్వారా సంబంధాన్ని పెంచుకున్నాడు. ఆ సమయంలో అతడు కలకత్తాలో విధ్యాభ్యాసం చేస్తూ ఆ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవకునిగా చేరాడు. 2011లో రెండవసారి వార్షిక సమావేశాలు జరుగుతున్న సమయంలో అతడు భారత జాతీయ కాంగ్రెస్ లో చేరాడు. 1916 లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో మహాత్మా గాంధీని కలిసాడు. చంపారన్ లో జరగనున్న నిజ నిర్ధారన కమిటీలోనికి తనతో పాటు స్వచ్ఛంద కార్యకర్తగా రావాలని మహాత్మా గాంధీ అతనిని కోరాడు. మహాత్మా గాంధీ అంకితభావం, విశ్వాసం, ధైర్యాలను చూసి చలించిపోయాడు. 1918 లో'సర్చ్ లైట్'అనే ఆంగ్ల పత్రికను, ఆ తర్వాత 'దేశ్' అనే హిందీ పత్రికను నడిపాడు. 1920లో భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా నిర్వహించబడిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. అతడు తన లాభదాయకమైన న్యాయవాద వృత్తిని, అలాగే విశ్వవిద్యాలయంలోని అధ్యాపక వృత్తి విధులను తప్పుకున్నాడు. పాశ్చాత్య విద్యా సంస్థల స్థాపనకు గాంధీజీ బహిష్కరణకు పిలుపునిచ్చినందున ప్రసాద్ అతని కుమారుడు మృత్యుంజయ ప్రసాద్ ను పాఠశాలనుండి మానివేయించి, భారతీయ సాంప్రదాయ విధానాలలొ విద్యాభ్యాసం అందిస్తున్న బీహార్ విద్యాపీఠ్ లో చేర్పించాడు. [9] ఈ విద్యాపీఠాన్ని1921లో తన మిత్రబృందంతో కలిసి స్థాపించి భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా నడిపాడు. .1921లో మహాత్మా గాంధీతో ఒకమారు సమావేశం తరువాత, విశ్వవిద్యాలయంలో తన సెనేటర్ పదవికి రాజీనామా చేశాడు.

భారత స్వాతంత్ర్యోద్యమంలో అతడు ప్రముఖ రచయిత రాహుల్ సాంకృత్యాయన్ ను కలిసాడు. రాహుల్ సాంకృత్యాయన్ రాజేంద్రప్రసాద్ మేథస్సుకు ప్రభావితుడై ఒక గురువుగా భావించాడు. అతడు రాసిన అనేక వ్యాసాలలో సాంకృత్యాయన్ తో జరిపిన సమావేశాల గురించి పేర్కొన్నాడు. అతడు విప్లవవాద ప్రచురణలను "సెర్చ్‌లైట్" , "దేశ్" పత్రికలకు రాసేవాడు. ఈ పత్రికల కోసం నిధిని సేకరించేవాడు. అతడు దేశ వ్యాప్తంగా పర్యటించి ప్రజలకు స్వాతంత్ర్యోద్యమం విధానాలను ఉపన్యాసాల ద్వారా వివరించాడు.

1924లో బీహారు బెంగాల్‌లలో వచ్చిన వరదలలో అన్నీ కోల్పోయిన అభాగ్యులను ఆదుకోవడంకోసం తనవంతు సహాయాన్ని ముందుండి అందించాడు. 1934జనవరి 15, న ీహారులో భూకంపం వచ్చినప్పుడు రాజేంద్ర ప్రసాదు జైలులో ఉన్నాడు.[10] రెండురోజుల అనంతరం అతనిని విడిచిపెట్టారు. బయటకు రాగానే అతను 1934 జనవరి 17 న బీహార్ సెంట్రల్ రిలీఫ్ కమిటీ లో చేరి నిధులను సేకరించడం మొదలుపెట్టాడు. అలా భూకంప బాధితుల సహాయార్ధథంఅతను సేకరించిన నిధులు (38 లక్షలు) అప్పట్లో వైస్రాయి సేకరించిన నిధులకు మూడింతలున్నాయి.

రాజేంద్రప్రసాద్ 1934 అక్టోబరులో బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు మహాసభలకు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. అలాగే 1939లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేసిన తరువాత, 1947లో ఇంకోసారి, మొత్తం మూడుసార్లు ఆ పదవిని చేపట్టాడు. 1942 ఆగస్టు 8 న క్విట్ ఇండియా తీర్మానాన్ని కాంగ్రెస్ బొంబాయిలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా అనేక మంది స్వాతంత్ర్యోద్యమ కారులు అరెస్టు చేయబడ్డారు. అతనిని పాట్నాలోని సదాఖత్ ఆశ్రమం వద్ద అరెస్టు చేసి, బాంకిపూర్ కేంద్ర కారాగానికి తరలించారు. దాదాపు మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష తర్వాత, 1945, జూన్ 15 న విడిచిపెట్టారు.

1946 సెప్టెంబరు 2 న ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం జవాహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో 12 మంది మంత్రులను ఎంపిక చేసింది. అందులో రాజేంద్ర ప్రసాద్ ఆహారం, వ్యవసాయ శాఖకు మంత్రిగా పనిచేసాడు. తరూవత 1946 డిసెంబరు 11 న రాజ్యాంగ సభకు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. [11] తరువాత జి.పి.కృపాలానీ కాంగ్రెస్ అద్యక్షునిగా రాజీనామా చేసిన తరువాత 1947 నవంబరు 17 న కాంగ్రెస్ అధ్యక్షునిగా భాద్యతలు స్వీకరించాడు.

భారత గణతంత్ర రాజ్యానికి మొదటి రాష్ట్రపతి

 
రాజేంద్ర ప్రసాద్ చిత్రం స్వామిచే 1948 లో గీయబడినది. ఈ చిత్రాన్ని చందమామ పత్రికలో ప్రచురించారు.

భారత స్వాతంత్ర్యం వచ్చిన రెండున్నర సంవత్సరాల తరువాత 1950 జనవరి 26 న స్వతంత్ర భారత రాజ్యాంగం ఆమోదించబడింది. రాజేంద్ర ప్రసాదును మొదటి రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. అనుకోకుండా భారత గణతంత్ర దినోత్సావానికి ఒక రోజు ముందు 1950 జనవరి 25 నాటి రాత్రి అతని సోదరి భగవతి దేవి ప్రసాద్ మరణించింది. అతడు దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేసాడు కానీ రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు పెరేడ్ గ్రౌండ్ లో పూర్తిచేసిన తరువాత మాత్రమే పూర్తిచేసాడు.

భారతదేశానికి అధ్యక్షునిగా రాజ్యాంగం ప్రకారం భాద్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తిగా ఏ రాజకీయ పార్టీకి చెందకుండా స్వతంత్రుడిగా వ్యవహరించాడు. అతడు ప్రపంచవ్యాప్తంగా భారత అంబాసిడరుగా విదేశీ దేశాలతో దౌత్య సంబంధాలు పెంపొందించడం కోసం పర్యటనలు చేసాడు. అతడు రెండవసారి వరుసగా 1952, 1957 లలో తిరిగి ఎన్నుకోబడ్డాడు. ఈ విధంగా ఎంపిక కాబడ్డ మొదటి రాష్ట్రపతిగా చరిత్రలో స్థానం సంపాదించాడు. అతని రాష్ట్రపతి పదవీ కాలమ్లో మొదటి సారి రాష్ట్రపతి భవన్ సమీపంలో ఉన్న ముఘల్ గార్డెన్స్ ఒక నెల పాటు సందర్శకుల కోసం అనుమతించబడ్డాయి. [12] దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా స్వతంత్రంగా మెలిగి, ప్రధానిని గానీ పార్టీని గానీ రాజ్యాంగ నిర్మాణంలో జోక్యంచేసుకోనివ్వలేదు. అలా తన తరువాత వచ్చిన అందరు రాష్ట్రపతులకు ఉదాహరణగా నిలిచాడు. "హిందూ కోడ్ బిల్" చట్టం పై వివాదాల తరువాత అతను రాష్ట్ర వ్యవహారాల్లో మరింత చురుకైన పాత్రను పోషించాడు. 12 సంవత్సరాలపాటు భారత రాష్ట్రపతిగా సేవలందించి 1962 న పదవీ విరమణ చేసాడు.

కార్యాలయాన్ని విడిచిపెట్టిన తరువాత 1962 మే 14 న పాట్నా కు తిరిగి వచ్చి బీహార్ విద్యాపీఠంలో ఉండాలని కోరుకున్నాడు.[13] 1962 సెప్టెంబరు లో, అతని భార్య రాజ్‌వంశీ దేవి చనిపోయింది. 1963 ఫిబ్రవరి 28 న ఆయన రాం రాం అంటూ కన్ను మూశాడు. మరణానికి నెలరోజుల ముందు తనకుతానే ఒక ఉత్తరం రాసుకున్నాడు, అందులో ఇలా చెప్పాడు, "నేను అంతిమ దశకు చేరువైనట్లు అనిపిస్తూంది, ఏదైనా చేసే శక్తి అంతమవుతుంది, నా ఉనికే అంతమవుతుంది".

అనంతర కాలంలో భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన భారతరత్న పురస్కారాన్ని రాజేంద్ర ప్రసాదుకు ప్రకటించారు. పాట్నాలో " రాజేంద్ర స్మృతి సంగ్రహాలయం" ను అతనికి అంకితం చేసారు. [14] దేశ ప్రజలలో ఆయనకు ఉన్న అచంచలమైన ప్రేమాభిమానాల వలన ఆయనను దేశ్ రత్న అని పిలిచేవారు.

సాహితీ సేవలు

  • ప్రెసిడెంట్ ఆఫ్ కాన్‌స్టిట్యూయంట్ అసెంబ్లీ
  • సత్యాగ్రహ ఎట్ చంపారన్ (1922)
  • డివిజన్ ఆఫ్ ఇండియా (1946, ఆన్‌లైన్)
  • ఆత్మకథ (1946), బానిక్ పూర్ జైలులో 3 సంవత్సరాలు ఉన్న సమయంలో రాసిన స్వీయ చరిత్ర.
  • మహాత్మా గాంధీ అండ్ బీహార్, సం రెమినిసైన్సెస్ (1949)
  • బాపూ కె కదమోం మె (1954)
  • సిన్స్ ఇండిపెండెన్స్ (1960 లో ప్రచురణ)
  • భారతీయ శిక్ష
  • అట్ ద ఫీట్ ఆఫ్ మహాత్మా గాంధీ

ఇతర పఠనాలు

  • Rajendra Prasad, first President of India, by Kewalram Lalchand Panjabi. Published by Macmillan, 1960.
  • Rajendra Prasad: twelve years of triumph and despair, by Rajendra Lal Handa. Published by Sterling Publishers,1979.
  • Dr Rajendra Prasad, Correspondence and Select Documents, by Rajendra Prasad, Valmiki Choudhary. Published by Allied Publishers, 1984. ISBN 81-7023-002-0. Excerpts (Vol. 1-Vol. 10)
  • Dr Rajendra Prasad by India Parliament. Lok Sabha. Published by Lok Sabha Secretariat, 1990.
  • Rajendra Prasad and the Indian freedom struggle, 1917–1947, by Nirmal Kumar. Published by Patriot Publishers, 1991. ISBN 81-7050-128-8.
  • Dr Rajendra Prasad: Political Thinkers Of Modern India, by V. Grover. Published by Deep & Deep Publications, 1993.
  • First Citizens of India, Dr Rajendra Prasad to Dr Shanker Dayal Sharma: Profile and Bibliography, by A. B. Kohli. Published by Reliance Pub. House, 1995. ISBN 81-85972-71-0.

ఆధారాలు

  1. ఇంతకుముందు ఉన్న రాష్ట్రపతుల గురించి భారత ప్రభుత్వంవారి అధికారిక వెబ్‌సైటులో చూడండి
  2. కాంగ్రేస్ పార్టీ వెబ్‌సైటులో రాజేంద్ర ప్రసాద్ గురించి
  3. డా. రాజేంద్ర ప్రాసాద్ జీవిత చరిత్ర

మూలాలు

  1. The President of India Shri Pranab Mukherjee Archived 11 ఆగస్టు 2013 at the Wayback Machine. Presidentofindia.nic.in. Retrieved on 12 December 2013.
  2. President's Secretariat National Informatics Centre
  3. Janak Raj Jai (1 January 2003). Presidents of India, 1950–2003. Regency Publications. pp. 1–. ISBN 978-81-87498-65-0.
  4. Sanghralaya, Rajendra Smriti. "Major Life Events of Dr. Rajendra Prasad - First President of India". rss.bih.nic.in. Archived from the original on 3 మార్చి 2013.
  5. Miglani, Neha (20 మే 2012). "Evaluators for preserving flawless answer sheets". The Times of India. Archived from the original on 27 సెప్టెంబరు 2016. Retrieved 28 ఫిబ్రవరి 2015.
  6. राजेंद्र प्रसाद (2007). राजेंद्र बाबू: पत्रों के आईने में. प्रभात प्रकाशन. ISBN 978-81-7315-654-0.
  7. "First president Rajendra Prasad remembered - Times of India". Archived from the original on 5 డిసెంబరు 2016.
  8. "Major Life Events of Dr. Rajendra Prasad – First President of India". Rss.bih.nic.in. Archived from the original on 3 మార్చి 2013. Retrieved 10 జూలై 2013.
  9. Atul Sethi, "Distant dads?" ''The Times of India'' (Aug 12 2007) Archived 6 జూలై 2008 at the Wayback Machine. Timesofindia.indiatimes.com (12 August 2007). Retrieved on 12 December 2013.
  10. Kamat. "Great freedom Fighters". Kamat's archive. Archived from the original on 20 ఫిబ్రవరి 2006. Retrieved 25 ఫిబ్రవరి 2006.
  11. "Archived copy". Archived from the original on 24 అక్టోబరు 2014. Retrieved 23 అక్టోబరు 2014.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  12. "Record visitors at Mughal Garden". www.rediff.com. Archived from the original on 1 జనవరి 2011. Retrieved 2 మార్చి 2018.
  13. About Rajendra Smriti Sanghralaya, Sadakat Ashram, Patna, Bihar, India Archived 26 ఆగస్టు 2011 at the Wayback Machine. Rss.bih.nic.in. Retrieved on 12 December 2013.
  14. "Dr Rajendra Prasad". Archived from the original on 25 మార్చి 2008. Retrieved 12 మార్చి 2010.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link). Indian Politicians Biography

బయటి లింకులు

 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.



ఇంతకు ముందు ఉన్నవారు:
రాజగోపాలాచారి (జెనరల్ గవర్నర్)
భారత రాష్ట్రపతి
1950 జనవరి 261962 మే 13
తరువాత వచ్చినవారు:
సర్వేపల్లి రాధాకృష్ణన్