బొల్లిముంత శివరామకృష్ణ

బొల్లిముంత శివరామకృష్ణ (నవంబరు 27, 1920 - జూన్ 7, 2005) అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు, హేతువాది. అప్పటి మద్రాసు ప్రభుత్వం ఆంధ్రులపై చూపుతోన్న వివక్షని తరిమెల నాగిరెడ్డి చేత పలికించిన రచయిత.. తెలుగు సాహితీ లోకంలో ఆయన నిశ్శబ్ద విప్లవం, మార్క్సిస్టు గాంధీ అని కూడా అంటారు. మనుషులు మారాలి ఆమె ఎవరు సినిమాల సంభాషణకర్త ఆయనే.

బొల్లిముంత శివరామకృష్ణ
బొల్లిముంత
జననంబొల్లిముంత శివరామకృష్ణ
నవంబరు 27, 1920
గుంటూరు జిల్లా చదలవాడ
మరణంజూన్ 7, 2005
ఇతర పేర్లుబొల్లిముంత శివరామకృష్ణ
ప్రసిద్ధిఅభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు, హేతువాది
తండ్రిఅక్కయ్య,
తల్లిమంగమ్మ

జీవిత విశేషాలు

మార్చు

గుంటూరు జిల్లా చదలవాడలో అక్కయ్య, మంగమ్మ దంపతులకు జన్మించిన శివరామకృష్ణ గుంటూరులోనే హయర్‌ గ్రేడ్ ట్రెయినింగ్ పూర్తిచేశారు. ఆయన తండ్రి చదలవాడలో పాఠశాల నెలకొల్పడంతో ఉపాధ్యాయుడిగా అందులోనే చేరారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి, త్రిపురనేని గోపీచంద్ లతో పరిచయం కలిగింది. బాల్యంలో ఈయనపై జస్టిస్‌ పార్టీ ప్రభావం, త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రభావం ఎక్కువగా ఉండేవి. అందుకు కారణం వారి తండ్రి గారికి రామస్వామి చౌదరి నడిపే బ్రాహ్మణ వ్యతిరేకోద్యమం తోనూ, జస్టిస్‌ పార్టీతోనూ సన్నిహిత సంబంధాలుండేవి. ఆ సంబంధాల ప్రభావం కొడుకు శివరామకృష్ణపై బాగా పడ్డాయి. ఈలోగా గోపీచంద్‌ కథలు రాసి పత్రికల్లో అచ్చేస్తూ ఉండేవారు. మంచి పేరు వస్తూ ఉండేది. అది చూసి శివరామకృష్ణ కూడా వచనంలోకి మారారు. తనూ కథలు రాసి పత్రికలకు పంపాలని నిశ్చయించుకున్నారు. ఫలితంగా 1936లో మద్రాసు నుండి వెలువడే ‘చిత్రాంగి’ పత్రికలో తన తొలి కథ ‘ఏటొడ్డు’ ప్రచురించారు. అప్పుడాయన వయసు పదహారు సంవత్సరాలు.

రచయితగా

మార్చు

1945లో తన ఉపాధ్యాయ వృత్తిని వదలి వ్యవసాయ కార్మిక సంఘంలో చేరి చల్లపల్లి రాజాకి వ్యతిరేకంగా సాగిన భూపోరాటంలో పాల్గొన్నారు. ఆ పోరాట అనుభవాలతోనే తొలి రాజకీయ నవల మృత్యుంజయులు రాశారు. నగారా అనే పత్రిక నడిపారు. కొడవటిగంటి కుటుంబరావు రాసిన 'పిల్లి' అనే కథపై కొడవటిగంటి తిరోగమన యాత్ర అంటూ విమర్శ రాశారు. బెంగాల్ కరవుపై బుర్రకథ రాశారు. 'రైతుబిడ్డ' హరికథ రాశారు. సూక్ష్మంలో మోక్షం, అంతరాత్మ అంత్యక్రియలు, శివరామకృష్ణ కథలు బొల్లిముంతవే. ఏ ఎండకాగొడుగు, పత్రికా న్యాయం, తెలంగాణా స్వతంత్రఘోష, క్విట్ కాశ్మీర్, ధర్మసంస్థాపనార్థాయ... ఇలా ఎన్నో నాటికలు రాశారు. రాజకీయ గయోపాఖ్యానం, రాజకీయ కురుక్షేత్రం వంటి పద్యనాటకాలు రాశారు. దొంగ దొరికింది, భలేమంచి చౌకబేరం... వంటి రేడియో నాటికలు రాశారు. నేటి భారతం పేరుతో మూకీ నాటిక రాశారు. ప్రజానాట్యమండలి పునరుద్ధరణ సమయంలో బొల్లిముంత శ్రీకాంత్‌తో కలసి అందరూ బతకాలి నాటకం రాశారు. దీన్ని రక్తకన్నీరు నాగభూషణం వందకు పైగా ప్రదర్శనలిచ్చారు.

1955 మధ్యంతరం ఎన్నికల్లో రెండు పర్యాయాలు బొల్లిముంతపై హత్యాప్రయత్నం జరిగింది. 1960లో మనసుకవి ఆత్రేయ దగ్గర చేరారు. వాగ్దానం, కలసివుంటే కలదుసుఖం, కలిమిలేములు వంటి అనేక చిత్రాలకు ఆరుద్రకు సహరచయితగా సహకరించారు. బి.ఎస్. నారాయణ దర్శకత్వం వహించిన సినిమాల్లో అధిక భాగం ఆయన రాసినవే. 1968లో విశాలాంధ్ర ప్రారంభించిన ప్రతిభ వారపత్రికకి సంపాదకుడయ్యారు. దర్శకుడు వి.మధుసూదనరావు చిత్రాలకు ఎన్నిటికో సంభాషణలు రాశారు. ఆయన రాసిన దాదాపు యాభై సినిమాల్లో మనుషులు మారాలి, ప్రజా నాయకుడు వంటి సీరియస్ సినిమాలేకాక శారద, కళ్యాణమంటపం, మూగకు మాటొస్తే, విచిత్రబంధం వంటి సెంటిమెంట్ ప్రధానమైన చిత్రాలు కూడా ఉన్నాయి. నాటకాల్లో హార్మోనియం వాయించారు. స్త్రీ పాత్రలు ధరించారు.

ఉద్యమాలలో

మార్చు

1938-39 సంవత్సరంలో గుంటూరులో హయ్యర్‌ గ్రేడ్‌ టీచర్‌ ట్రైనింగ్‌కు వెళ్ళినప్పుడు అక్కడ విద్యార్థిఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. ఆ రోజుల్లోనే ఆయన ‘దేశం ఏమయ్యేట్టు?’, ‘వ్యక్తి స్వాతంత్య్రం’ వంటి కథలు రాసి ప్రచురించారు. కమ్యూనిస్టు కార్యకర్తగా ఆయన తన అనుభవంలోకి వచ్చిన విషయాల్ని కథలుగా మలచడం తప్ప, పనికట్టుకుని కథలు రాయాలని రాయలేదు. వ్యవసాయ కూలీలు, ఇతర నిరుపేదలపై దృష్టి సారించి, కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రతిబింబిస్తూ రాశేవారు. ఆ రోజుల్లో చదలవాడ పిచ్చయ్య చౌదరి అభ్యుదయ రచయితల సంఘం (అరసం) నాయకుడు. ఆయన ఇటు త్రిపురనేని రామస్వామి చౌదరి, అటు కృష్ణ శాస్ర్తి లాంటి వారందరినీ కలుపుకుని అభ్యుదయ సాహిత్యోద్యమాన్ని ముందుకు తీసుకు వెడుతూ ఉండేవారు. 1943 లో తెనాలిలో అరసం తొలి మహాసభ జరపడంలో చదలవాడ పిచ్చయ్య చౌదరి కృషి ఎంతో ఉంది. ఆ సభకు అధ్యక్షులు తాపీ ధర్మారావు. బొల్లిముంత శివరామకృష్ణ అప్పటికి ఇరవై మూడేళ్ళ యువకుడు. ఆ మహాసభకు కార్యకర్తగా పనిచేశారు. అప్పటిదాకా అరసంతో సంబంధాలు లేకపోవడం వల్ల, అరసం నిర్వహణలో వెలువడే ‘తెలుగు తల్లి’ పత్రికలో బొల్లిముంత కథలు అచ్చు కాలేదు.

మృత్యుంజయులు

మార్చు

బొల్లిముంత 1945లో టీచర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తి సమయం పార్టీకి అంకితం చేశారు. పార్టీ పనులమీద తిరుగుతూ మునగాల పరగణాలోని జగ్గయ్య పేటకు వెళ్ళి రావడం జరుగుతూ ఉండేది. అక్కడే తెలంగాణ పోరాటం గూర్చి వినడం, అందిన రిపోర్టులు చదువుకోవడం, విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉండేది. వాటితో ఉత్తేజితుడైన యువకుడు బొల్లిముంత ఇరవై ఏడేళ్ళ వయసులో ‘మృత్యుంజయులు’ నవల రాశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన 1946-51 మధ్య అర్ధ దశాబ్ద కాలం పాటు తెలంగాణ రైతులు సాయుధులై దోపిడీ వర్గాల మీద తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటులో కవులు, రచయితలు, కళాకారులు ఎంతోమంది భాగస్వాములయ్యారు. యాదగిరి, సుద్దాల హనుమంతు, తిరునగరి రామాంజనేయులు, నాజర్‌, సుంకర, వాసిరెడ్డి, కాళోజి, దాశరథి, కుందుర్తి, సోమసుందర్‌, గంగినేని వంటి కవులు తమ అక్షరాయుధాలతో ముందు నిలిచారు.

తెలంగాణ పోరాటం ప్రారంభమైన ఒక సంవత్సరానికి బొల్లిముంత ‘మృత్యుంజయులు’ నవల 1947 అక్టోబరు 25న విడుదల చేశారు. ఒక రకంగా కవుల కంటే కూడా తన నవలాయుధంతో ఆయన ముందు నిలిచారు. ఆ తర్వాత గంగినేని ‘ఎర్రజెండాలు’, వట్టికోట ‘ప్రజల మనిషి’, ‘గంగు’, మహీధర రామ్మోహనరావు ‘ఓనమాలు’, మృత్యు నీడల్లో’, తిరునగరి ‘సంగం’ వంటి నవలలు వెలువడ్డాయి. పోరాట విరమణకు ముందు, బొల్లిముంత నవల తర్వాత వెలువడింది లక్ష్మీకాంత మోహన్‌ ‘సింహ గర్జన’. దేశంలోని ఇతర ప్రాంతాల్లో రైతులు పంటలు పండించుకున్నందుకు శిస్తులు కడతారు. కానీ నాటి తెలంగాణలో శిస్తులు కట్టడానికి మాత్రమే పంటలు పడించాల్సి వచ్చేది. అంతటి దుర్భర స్థితిని సహజంగా చిత్రించింది మృత్యుంజయులు నవల. చచ్చేవాడికి రెండు చావులు ఉండవని దిన దిన గండంగా ప్రతిరోజూ చస్తూ బతకడం కన్నా భావి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం పోరాటంలో చావడమే మేలని జెండా పట్టి పోరాటంలో నేలకొరిగిన వీరులే ఈ మృత్యుంజయులు. నవలలోని ముఖ్య పాత్రలన్నీ పోరాటంలో మరణిస్తాయి.అంటే వీరమరణం పొందుతాయి. నవలా రచయిత దృష్టిలో వారంతా చావును జయించినవారు, మృత్యుంజయులు అని అర్ధం. తెలంగాణ పోరాట కాలంలో వెలువడిన తొలి నవలగా, ఒక చారిత్రక అవసరాన్ని గుర్తించి, ప్రజా పోరాటాన్ని నమోదు చేసిన నవలగా తెలుగు సాహిత్యంలో మృత్యుంజయులు నవలకు సుస్థిర స్థానం ఉంటుంది. నాటి కమ్యూనిస్టు నాయకులు చంద్రం ఈ నవలను బొల్లిముంతతో ఆరు సార్లు తిరగరాయించారట! రావి నారాయణ రెడ్డి ఈ నవలకు ముందు మాట రాశారు.

సినీ రచయితగా

మార్చు

1960లో ఆత్రేయ ప్రోత్సాహంతో బొల్లిముంత శివరామకృష్ణ ఆయనకు సహాయకుడుగా మద్రాసు వెళ్ళారు. ఆత్రేయ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ‘వాగ్దానం’కు బొల్లిముంత తొలిసారి స్వయంగా మాటలు రాశారు. ‘తిరుపతమ్మ కథ’కు సంభాషణలు రాసేసరికి ఆ కళలో మరింత పట్టు సాధించారు. ఆ రకంగా ‘మనుషులు మారాలి’ చిత్రం సంభాషణలో పెద్ద హిట్టయ్యింది. దాంతో బొల్లిముంత మద్రాసులో స్థిరపడాల్సి వచ్చింది. సుమారు నలభై ఐదు సినిమాలకు సంభాషణలు రాశారు. మధ్యలో కొన్ని పాటలు కూడా రాశారు. ‘కాలం మారింది’కి రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, ‘నిమజ్జనం’కు జాతీయ అవార్డు లభించాయి.

సినీరంగం

మార్చు
  • వాగ్దానం (1961) స్క్రీీన్ ప్లే
  • తిరుపతమ్మ కధ (1963)
  • పీటలమీదపెళ్ళి(1964)
  • విశాలహృదయాలు (1965)
  • ఆమెఎవరు? (1966)
  • మనుషులు మారాలి (1969)
  • శ్రీదేవి (1970)
  • కళ్యాణమండపం(1971)
  • ఆనంద నిలయం (1971)
  • సుపుత్రుడు(1971)
  • ప్రజానాయకుడు(1972)
  • మంచిరోజులువచ్చాయి (1972)
  • కాలం మారింది (1972)
  • పల్లెటూరి చిన్నోడు(1973)
  • ఆడంబరాలు-అనుబంధాలు(1974)
  • కొత్తకాపురం(1975)
  • ఆయన జూన్ 7, 2005 న మరణించారు.ఆమరుసటి నెలే జూలై 2005 సంచికను ‘ప్రజాసాహితి’ బొల్లిముంత శివరామకృష్ణ సంస్మరణలో వెలువరించింది.
  • ఉపాధ్యాయుడిగా, ఉద్యమకారుడిగా, అరసం నేతగా, కమ్యూనిస్టు కార్యకర్తగా, నవలా రచయితగా, సినీ రచయితగా, సంపాదకుడిగా బహుముఖీనమైన ప్రతిభను కనరపరచిన బొల్లిముంత శివరామకృష్ణ సాహిత్య ప్రపంచంలో మృత్యుంజయుడిగా నిలిచారు.

పురస్కారాలు

మార్చు
  • 1988లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ వారిచే కొండేపూడి సాహితీ సత్కారం అందుకున్నాడు.[1]

బయటి లింకులు

మార్చు

ఐ.ఎమ్.బి.డి.లో బొల్లిముంత పేజీ.

మూలాలు

మార్చు
  1. పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.