మేక

(మేషం నుండి దారిమార్పు చెందింది)

మేక ఒక రకమైన జంతువు. ఈ మేకలు ఆసియా, ఐరోపా దేశపు కొండ మేకను పెంపుడు జంతువుగా మార్పుచెందినవి. ఇవి బొవిడే కుటుంబానికి చెందినవి, గొర్రె, జింక లకు సంబంధించిన కాప్రినే ఉపకుటుంబం లోనివి. ఇవి నెమరువేయు జంతువులు.

మేక
పెంపుడు జంతువు
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Subfamily:
Genus:
Species:
Subspecies:
C. a. hircus
Trinomial name
Capra aegagrus hircus

మేకలలో సుమారు 300 సంకర జాతులున్నాయి.[1]

మేకలు అతి పుతాతన కాలం నుండి మానవుడు పెంచుకుంటున్న జంతువులు. వేల సంవత్సరాల నుండి వీటిని పాలు, మాంసం, ఊలు, తోలు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగంలో ఉన్నాయి.[2] మేక మాంసాన్ని మటన్ అంటారు. నిక్కచ్చిగా చెప్పాలంటె chevon చెవన్ అని అంటారు.

చరిత్ర

మార్చు

మేకలు భారత ఉపఖండంలో సుమారు 9000 BCE నుండి పెంపుడు జంతువులుగా వాడకంలో ఉన్నాయి.[3] ఇవి సుమారు 10,000 సంవత్సరాల పుర్వం ఇరాన్ లోని జాగ్రోస్ పర్వతాలలో పెంచుకున్నట్లు తెలుస్తుంది.[4] నియోలిథిక్ కాలపు వ్యవసాయదారులు వీటిని పాలు, పేడ, మాంసం, ఎముకలు, జుత్తు మొదలైన వాటి విస్తృత ఉపయోగాల కోసం పెంచుకొనేవారు. పెంపుడు మేకలు మందలలో కొండ చరియల్లో మేతకోసం సంచరిస్తాయి.

మేకల ఉపయోగాలు

మార్చు

మేకలు మానవులకు బాగా ఉపయోగకరమైన జంతువులు. వీటి నుండి పాలు, మాంసం, తోలు మొదలైనవి లభిస్తాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు పేదవారికి వీటిని దానమిస్తాయి. ఎందుకంటే పశువుల కంటే వీటిని పెంచడం చాలా సులువు, తక్కువ ఖర్చుతో కూడుకున్నది, విస్తృత ఉపయోగాలు ఉన్నాయి.

మేక పేగుల నుండి శస్త్రచికిత్సలో ఉపయోగించే 'కేట్ గట్' అనే దారాన్ని తయారుచేస్తారు. మేక కొమ్ముల నుండి చెంచాలు తయారుచేయవచ్చును.[5]

 
ఒక బుట్టలో నిలబడిన మేక
 
బోర్ మేక - మాంసం కోసం ప్రసిద్ధిచెందినది.
 
మేక కన్ను, సమాంతర కనుగుడ్డును చూడవచ్చు

మేక మాంసం

మార్చు

మేక మాంసాన్ని కారీబియన్, ఆసియా, భారతదేశాలలో మటన్ అంటారు. మేక మాంసం కూర, వేపుడు మొదలైన వివిధ రకాలుగా వంటలలో ఉపయోగిస్తారు. భారతదేశంలో అన్నంలో కలిపి తయారుచేసే బిర్యానీ రుచికి చాలా ప్రసిద్ధి. మేక మాంసం సామాన్యంగా తక్కువ వేడిలో, నెమ్మదిగా వండాల్సి ఉంటుంది. జెర్కీ మేక దీనికి ప్రసిద్ధిచెందినది.

కోడి మాంసంతో పోలిస్తే మేక మాంసంలో కొవ్వు, కొలెస్టిరాల్ తక్కువగాను, ఖనిజ లవణాలు ఎక్కువగాను ఉంటాయి. మేకలు సన్నంగా వుండడానికి కారణం, ఇవి సాధారణంగా లావెక్కవు.

మాంసమే కాకుండా మేక శరీరంలోని మెదడు, కాలేయం వంటి ఇతర భాగాలు కూడా వండుకొని తినవచ్చును. మేక తల మాంసం కొందరికి ప్రత్యేకమైన ఇష్టం.

పాల ఉత్పత్తులు

మార్చు
 
మేక పొదుగు నుండి పాలు పితకుతున్న దృశ్యం

కొన్ని రకాల మేకలను పాలు, ఇతర సంబంధ ఉత్పత్తుల కోసం పెంచుతారు. మేక పాలు పితకగానే తాగవచ్చును, కానీ బాక్టీరియా సంబంధ వ్యాధుల నుండి రక్షణ కోసం పాశ్చురైజేషన్ చేయడం మంచిది.[6] ఒక విధమైన ఘాటు వాసన కలిగే మేక పోతుని మంద నుండి వేరుచేయకపోతే మేకపాలు వాసన కలిగి ఉంటాయి. మేక పాలు నుండి వెన్న, మీగడ, ఐస్ క్రీమ్ మొదలైనవి తయారుచేయవచ్చును. మేక పాలలో ఆవుపాల మాదిరిగా కాక నురుగు పైకి తేలకుండా పాలతో కలిసిపోతుంది.

 
భారత దేశపు దేశవాళీ మేకలు.. మేకల మంద

ఆవు పాలు పడని వారికి మేక పాలు ఆహారంలో ఉపయోగించవచ్చును.[7] అయితే మేక పాలలో కూడా లాక్టోజ్ ఉండటం మూలంగా లాక్టోజ్ అలర్జీ ఉన్నవారు మాత్రం ఇవి ఉపయోగించకూడదు.[7]

చాలా మేకలు ఇంచుమించు 10 నెలల పాటు 3-5 లీటర్లు పాలిస్తాయి. ఈ పాలలో సుమారు 3.5 శాతం వెన్న ఉంటుంది.[8] మేక పాల నుండి తీసిన వెన్న తెల్లగా ఉంటుంది. పసుపుపచ్చని బీటా కెరోటిన్ వర్ణ హీనమైన విటమిన్ A మారిపోవడం దీనికి కారణం.

 
ఊలు కోసం పెంచే అంగోరా మేక
జపాన్లో గడ్డి మేస్తున్న మేకలు.

కొన్ని మేకలను ఊలు కోసం పెంచుతారు. చాలా మేకలకు శరీరం మీద మెత్తని వెండ్రుకలు ఉంటాయి. కాష్మీరి మేక నుండి కాష్మీరి ఊలు తయారౌతుంది. ఇది ప్రపంచంలో అన్నిటికన్నా ఖరీదైన ఉన్ని. ఇది మెత్తగా, సన్నగా ఉంటుంది.

అంగోరా మేకలకు పొడవైన రింగుల్లా తిరిగే జడలు కట్టే మోహైర్ ఉంటుంది. ఈ వెండ్రుకలు 4 అంగుళాల పొడవుండవచ్చును. ఈ రకమైన మేకల నుండి పైగోరా, నిగోరా అనే సంకరజాతి మేకలను తయారుచేశారు.

ఊలు తీయడానికి మేకలను చంపాల్సిన అవసరం లేదు. కాష్మీరి మేక నుండి ఊలు దువ్వితే వస్తుంది; అదే అంగోరా మేకల నుండి వెంట్రుకలను కత్తిరించాల్సి వస్తుంది. అంగోరా మేకల నుండి సంవత్సరానికి రెండు సార్లు ఊలు వస్తే, కాష్మీరి మేకల నుండి ఒక్కసారే వస్తుంది.

ఈ విధంగా తీసిన ఊలును చలి ప్రదేశాలలో ఉపయోగించే దుస్తులు తయారుచేయడానికి ఉపయోగిస్తారు.

దక్షిణ ఆసియా దేశాలలో కాష్మీరి ఊలును పశ్మినా అంటారు. "పశ్మినా" అంటే (పర్షియా భాషలో "fine wool" అని అర్ధం. ఈ మేకలను పశ్మినా మేకలు అంటారు. ఈ రకమైన మేకలు కాష్మీర్, లడక్ ప్రాంతానికి చెందినవి కావడం మూలంగా వీటి ఊలుకు పశ్చిమ దేశాలలో కాష్మీరి అని పేరు వచ్చింది. ఎంబ్రాయిడరీ చేసిన పశ్మినా షాల్ లు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిచెందినవి.

మేకల పెంపకం

మార్చు

భారత దేశంలో మేకను పేదవాని ఆవు అంటారు. మెట్ట సేద్యంలో మేకల పెంపకం అతిప్రముఖమైన ఉపాధి. ఆవు, గేదె వంటి పశువుల పెంపకానికి అనువుగాని మెట్టపల్లాల ప్రాంతాలలో మేకల పెంపకం ఒక్కటే సాధ్యం. సన్నకారు రైతాంగానికి మేకల పెంపకం అతి తక్కువ పెట్టుబడితో లాభదాయక వృత్తి.[9]

వ్యాధులు

మార్చు

వర్షాకాలంలో నోటి, కాలి వ్యాధి (గాలికుంటు వ్యాధి) వస్తుంది. వ్యాధి సోకితేనోట్లో పుండ్లు కావడం, పొదుగుల వద్ద, కాలి గిట్టలకు కురుపుల్లా వచ్చి తీవ్రంగా ఇబ్బంది పెడతాయి.[10][11]

మూలాలు

మార్చు
  1. Hirst, K. Kris. "The History of the Domestication of Goats". Archived 2008-07-07 at the Wayback Machine About.com. Accessed August 18, 2008.
  2. Coffey, Linda, Margo Hale, and Ann Wells; "Goats: Sustainable Production Overview. Archived 2007-02-04 at the Wayback Machine
  3. Gupta, Anil K. in Origin of agriculture and domestication of plants and animals linked to early Holocene climate amelioration, Current Science, Vol. 87, No. 1, 10 July 2004 59. Indian Academy of Sciences.
  4. anonymous; "Goat busters track domestication", Archived 2012-02-04 at the Wayback Machine Science News 8 April 2000.
  5. anonymous; Goat-Horn Spoon Archived 2008-12-03 at the Wayback Machine.
  6. Ekici, K, &alii; "Isolation of Some Pathogens from Raw Milk of Different Milch Animals", Archived 2008-05-28 at the Wayback Machine Pakistan Journal of Nutrition v 3 (2004) #3, pp 161-162.
  7. 7.0 7.1 The World's Healthiest Foods. "Milk, goat." Archived 2008-05-03 at the Wayback Machine
  8. "American Dairy Goat Association". Archived from the original on 2008-09-13. Retrieved 2008-09-19.
  9. ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]
  10. ఈనాడు, రైతేరాజు (22 March 2020). "పశువులకు గాలికుంటు టీకాలు!". www.eenadu.net. Archived from the original on 30 మార్చి 2020. Retrieved 1 April 2020.
  11. ప్రజాశక్తి, ఫీచర్స్ (22 February 2018). "గాలికుంటు లఎంతో చేటు". డాక్టర్‌. జి. రాంబాబు,. Retrieved 1 April 2020.{{cite news}}: CS1 maint: extra punctuation (link)

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మేక&oldid=4270875" నుండి వెలికితీశారు