మహమ్మద్ కైఫ్ (జననం 1980 డిసెంబరు 1) మాజీ భారత క్రికెట్ ఆటగాడు. భారత్ తరపున టెస్టులు, ODIలు ఆడాడు.[1] అండర్-19 స్థాయిలో అతను చూపిన ప్రదర్శనల బలంతో జాతీయ జట్టు లోకి వచ్చాడు. అక్కడ అతను 2000లో అండర్-19 ప్రపంచ కప్‌లో భారత జాతీయ అండర్-19 క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించి విజయం సాధించాడు. కైఫ్ 2002 ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఉమ్మడి విజేతలలో ఒకటైన భారత జట్టులో సభ్యుడు. 2003 క్రికెట్ ప్రపంచ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో సభ్యుడు.

మొహమ్మద్ కైఫ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1980-12-01) 1980 డిసెంబరు 1 (వయసు 43)
అలహాబాద్, ఉత్తర ప్రదేశ్
ఎత్తు5 ft 11 in (1.80 m)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం ఆఫ్ స్పిన్
పాత్రఆల్ రౌండరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 228)2000 మార్చి 2 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు2006 జూన్ 30 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 142)2002 జనవరి 28 - ఇంగ్లాండు తో
చివరి వన్‌డే2006 నవంబరు 29 - దక్షిణాఫ్రికా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.11
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1998–2014ఉత్తర ప్రదేశ్ క్రికెట్ జట్టు
2014–2016ఆంధ్ర క్రికెట్ జట్టు
2008–2009రాజస్తాన్ రాయల్స్
2010కింగ్స్ XI పంజాబ్
2011–2013రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
2016–2018ఛత్తీస్‌గఢ్ క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ODI ఫస్ట్ క్లాస్ క్రికెట్
మ్యాచ్‌లు 13 125 186
చేసిన పరుగులు 624 2,753 10,229
బ్యాటింగు సగటు 32.84 32.01 38.60
100s/50s 1/3 2/17 19/59
అత్యధిక స్కోరు 148* 111* 202*
వేసిన బంతులు 18 1,484
వికెట్లు 0 20
బౌలింగు సగటు 35.75
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 3/4
క్యాచ్‌లు/స్టంపింగులు 14/– 55/– 170/–
మూలం: CricInfo, 2023 3 April

కైఫ్ 2018 జూలై 13 న క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుండి రిటైర్ అయ్యాడు.[2]

వ్యక్తిగత జీవితం మార్చు

మహమ్మద్ కైఫ్ ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో 1980 డిసెంబరు 1 న మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతను కాన్పూరు లోని గ్రీన్ పార్క్ హాస్టల్‌తో తన కెరీర్ ప్రారంభించాడు.[3] అతని తండ్రి మహ్మద్ తారీఫ్ అన్సారీ రైల్వేస్ క్రికెట్ జట్టుకు, ఉత్తర ప్రదేశ్ క్రికెట్ జట్టుకూ ఆడాడు. [4] అతని సోదరుడు మహ్మద్ సైఫ్ మధ్యప్రదేశ్ క్రికెట్ జట్టు, ఉత్తరప్రదేశ్ క్రికెట్ జట్ల కోసం ఆడుతున్నాడు.[5]

కైఫ్, జర్నలిస్టు పూజా యాదవ్‌ను 2011లో పెళ్ళి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు, కబీర్ అనే కుమారుడు, ఈవా అనే కుమార్తె ఉన్నారు.[6]

తొలి రోజుల్లో మార్చు

2005 జూలై నాటికి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర క్రికెటర్లు ఐదుగురిలో కైఫ్ ఒకడు.[7] 2009 నాటి భారత ODI టీమ్‌లో సురేశ్ రైనా, ప్రవీణ్ కుమార్, రుద్ర ప్రతాప్ సింగ్ అనే ముగ్గురు రెగ్యులర్లతో ఉత్తరప్రదేశ్‌ బాగా ప్రాతినిధ్యం ఉండేది. కైఫ్ సెంట్రల్ జోన్, ఉత్తర ప్రదేశ్ జట్లు రెండింటికీ కెప్టెన్‌గా ఉన్నాడు. 2005/06 ఛాలెంజర్ ట్రోఫీలో కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అందుబాటులో లేనపుడు జాతీయ ODI జట్టుకు కూడా కెప్టెన్‌గా పనిచేసాడు.

అంతర్జాతీయ కెరీర్ మార్చు

కైఫ్ 2000 లో బెంగుళూరులో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టుతో టెస్టుల్లో రంగప్రవేశం చేసాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ మొదటి బ్యాచ్‌లో ఎంపికయ్యాడు.[8]

అతని అంతర్జాతీయ కెరీర్ ప్రారంభంలో అస్థిరంగా ఉంది. బ్యాటింగులో అప్పుడప్పుడు అత్యుత్తమ ప్రదర్శనను అందించాడు. 2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్‌లో కైఫ్ చేసిన 87* (75 బంతుల్లో) పరుగులతో భారత్ 326 పరుగులను ఛేదించడం అతని అత్యంత ప్రసిద్ధ ప్రదర్శన. ఇందులో అతనికి తన మొదటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది.

2004 చివరలో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో, అతను మూడు ODI లలో నిలకడగా ఆడినందుకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. [9]

కైఫ్ 20 సంవత్సరాల వయస్సులో దక్షిణాఫ్రికాపై తొలి టెస్టు ఆడాడు. అయితే పెద్దగా రాణించనందున అతన్ని జాతీయ జట్టు నుండి తొలగించారు. 2004 చివరలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో రెండు అర్ధ శతకాలు సాధించి మళ్ళీ జట్టులోకి వచ్చాడు.

కైఫ్ వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తుతాడని, కవర్ స్థానంలో చక్కటి ఫీల్డింగు చేస్తాడని పేరుంది. ఫీల్డీంగులో చురుకుదనం చూపడంలో, బంతిని ఖచ్చితంగా విసరడంలోనూ అతను ప్రసిద్ధి. 2003 మార్చి 10 న జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 2003 ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు పట్టి ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా అతను రికార్డు సృష్టించాడు.

మిడిల్ ఆర్డర్ మార్చు

బ్యాటింగులో 7వ స్థానంలో కాకుండా 3వ స్థానంలోనే బాగా రాణించినప్పటికీ టీమ్ మేనేజ్‌మెంట్ కైఫ్‌ను మిడిల్ ఆర్డర్‌లోనే ఎక్కువగా ఉపయోగించుకుంది. పిచ్‌పై స్థిరపడేందుకు కొంత సమయం దొరికినప్పుడు అతను ఎక్కువ పరుగులు చేసేవాడు. దేశీయ ఆటలు, కౌంటీ క్రికెట్‌లో అతను సాధారణంగా 3వ స్థానంలో దిగేవాడు. కానీ ద్రవిడ్, రైనా, యువరాజ్ వంటి ఆ స్థానంలో ఉన్న ఆటగాళ్ల కారణంగా, కైఫ్ స్థిరమైన ప్రాతిపదికన 3వ స్థానంలో ఆడటం కష్టమైంది. కోచ్‌గా గ్రెగ్ చాపెల్, కెప్టెన్‌గా రాహుల్ ద్రవిడ్‌ల రాకతో, స్కోరింగ్ రేటును వేగవంతం చేయడానికి ఇర్ఫాన్ పఠాన్ లేదా మహేంద్ర సింగ్ ధోనీకి 3 వ స్థానాన్ని ఇచ్చేవారు.

2006 మార్చిలో ఇంగ్లండ్‌తో నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో గాయపడిన యువరాజ్ సింగ్ స్థానంలో అతన్ని టెస్ట్ జట్టులోకి తిరిగి తీసుకున్నారు. టెస్ట్ మ్యాచ్‌ను కాపాడుకోవడానికి 91 పరుగులతో అత్యధిక స్కోరు చేసినప్పటికీ, యువరాజ్ తన ఫిట్‌నెస్‌ సాధించాక, కైఫ్‌ను మళ్ఖ్ళీ తొలగించారు. అయితే సచిన్ టెండూల్కర్ గాయపడటంతో వెస్టిండీస్‌లో జరిగిన నాలుగు టెస్టుల్లో అతను చోటు దక్కించుకున్నాడు. అక్కడ రెండో టెస్టులో 148 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇది అతని తొలి టెస్టు శతకం.

2006 చివరలో అతన్ని ODI జట్టు, టెస్ట్ జట్టు రెండింటి నుంచీ తొలగించారు. 2008 ఏప్రిల్‌లో అతన్ని దక్షిణాఫ్రికాతో జరిగిన రెండవ టెస్టు జట్టులోకి తీసుకున్నారు గానీ, అందులో అతను ఆడలేదు.

పెద్దగా బౌండరీలు కొట్టకుండానే, వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తుతూ బ్యాటింగు చేసే ఎండ్‌ను మార్చుతూ ఉండే అతని మెళుకువల వలన, ఛేజింగులో ఉండే ఒత్తిడి తగ్గేది. మిడిల్ ఆర్డర్‌లో చేసే ఈ ఛేజింగు సామర్థ్యం మైఖేల్ బెవన్ అనుసరించే పద్ధతికి అనుగుణంగా ఉండేది. [10]

ఫీల్డింగ్ మార్చు

క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఫీల్డర్‌లలో కైఫ్ ఒకడు. యువరాజ్ సింగ్‌ను పాయింట్‌ స్థానంలోను, కైఫ్‌ను కవర్‌లలోనూ ఉంచేవారు. ఈ జోడీని దాటి బంతిని కొట్టడం ప్రత్యర్థికి కఠినంగా ఉండేది. వారు మైదానంలో ఉన్నప్పుడు భారత ఫీల్డింగ్ స్థాయి గణనీయంగా మెరుగుపడింది. యువరాజ్ సింగ్ ఆల్-రౌండర్ కావడంతోను, జట్టులో అతను సీనియర్ ఆటగాడు కావడంతోనూ కైఫ్ చాలాసార్లు "చివరి 11"లో ఉండలేకపోయేవాడు.

దేశీయ కెరీర్ మార్చు

కైఫ్ 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సంవత్సర పోటీలో విజేత అయిన రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఒక ఐకానిక్ ప్లేయర్‌గా అతన్ని US$6,85,000కి కొనుగోలు చేసారు. జట్టు కోసం అన్ని మ్యాచ్‌లలో ఆడినప్పటికీ, మొత్తం సిరీస్‌లో అతని ప్రదర్శన పేలవంగా ఉంది. 16 సగటుతో 176 పరుగులు మాత్రమే చేశాడు. 2009 ఏప్రిల్ 15 న, అతన్ని రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజ్‌మెంట్ తొలగించింది. పేలవమైన ఫామ్‌ను, ఖర్చు తగ్గింపునూ కారణాలుగా చూపి 2009 సీజన్‌లో కైఫ్‌ను జట్టు నుండి తొలగించింది. [11]

2010 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు కైఫ్‌ను కింగ్స్ XI పంజాబ్ US$2,50,000 కు కొనుగోలు చేసింది. [12]

2011 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు కైఫ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో రౌండ్ బిడ్డింగ్‌లో కొనుగోలు చేసింది. మూడోసారి బిడ్డింగ్‌కు హాజరు కావాలని అభ్యర్థించబడిన ఏకైక ఆటగాడు అతనే. తర్వాత ఒక ఇంటర్వ్యూలో సహారా ఇండియాకు చెందిన సుబ్రతా రాయ్, కైఫ్‌ను IPL జట్టులోకి తీసుకోవాలని భావించినందునే తాను మూడవ రౌండ్ బిడ్డింగ్‌ను అభ్యర్థించినట్లు పేర్కొన్నాడు.

కోచింగ్ కెరీర్ మార్చు

2017 ఫిబ్రవరిలో గుజరాత్ లయన్స్ 2017 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోచ్ అయిన బ్రాడ్ హాడ్జ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా కైఫ్‌ను నియమించింది. అతను 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్, 2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసాడు.

క్రికెట్ బయట మార్చు

రాజకీయ జీవితం మార్చు

అతను భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి, 2014 లోక్‌సభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లోని ఫుల్‌పూర్ నుండి పోటీ చేసి, బిజెపికి చెందిన కేశవ్ ప్రసాద్ మౌర్య చేతిలో ఓడిపోయాడు.[13]

మూలాలు మార్చు

  1. Cricinfo. "Mohammad Kaif". Retrieved 14 July 2018.
  2. The Economic Times (13 July 2018). "Mohammad Kaif announces retirement from competitive cricket". The Economic Times. Retrieved 13 July 2018.
  3. "Mohammad Kaif". Cricinfo. Retrieved 21 April 2012.
  4. "Syed Mushtaq Ali Trophy – Players – Tarif". Cricinfo. Retrieved 11 July 2011.
  5. "Syed Mushtaq Ali Trophy – Players – Saif". Cricinfo. Retrieved 11 July 2011.
  6. "Kaif caught, bowled by Delhi girl". Hindustan Times. 29 March 2011. Archived from the original on 22 March 2020. Retrieved 22 March 2020.
  7. Times of India
  8. Ramchand, Partab (15 April 2000). "First list of NCA trainees". Cricinfo. Retrieved 8 February 2007.[permanent dead link]
  9. "India bag series in style - Final ODI - Yuvraj smashes 69 off 32 balls after big guns boom". www.telegraphindia.com. Retrieved 2020-10-25.
  10. "Bevan, Dhoni and the art of finishing".
  11. "Kaif axed from RR, Warne blasts ICC | Cricket News". Cricbuzz.com. 15 April 2009. Retrieved 11 July 2011.
  12. "Kieron Pollard, Shane Bond attract maximum bids at IPL auction | Cricket News | Indian Premier League 2010 | ESPN Cricinfo". Cricinfo.com. Retrieved 11 July 2011.
  13. "Congress's first list for LS polls: Rahul, Sonia, Nilekani among 194 candidates named". The Times of India. PTI. 8 March 2014. Retrieved 8 March 2014.