మోసగాళ్ళకు మోసగాడు
మోసగాళ్ళకు మోసగాడు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించగా, కృష్ణ, విజయనిర్మలనాగభూషణం, రావుగోపాలరావు ముఖ్యపాత్రల్లో నటించిన తెలుగు యాక్షన్ కౌబాయ్ చిత్రం. భారతదేశంలోనే తొలి కౌబాయ్ నేపథ్యంలోని సినిమాగా పేరుతెచ్చుకుంది.[1]
మోసగాళ్ళకు మోసగాడు (1971 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్.ఆర్.దాస్ |
---|---|
నిర్మాణం | జి. ఆదిశేషగిరిరావు |
తారాగణం | కృష్ణ, విజయనిర్మల |
సంగీతం | పి. ఆదినారాయణరావు |
ఛాయాగ్రహణం | వి. ఎస్. ఆర్. స్వామి |
కూర్పు | కోటగిరి గోపాలరావు |
నిర్మాణ సంస్థ | శ్రీ పద్మాలయా మూవీస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నిర్మాణం
మార్చుఅభివృద్ధి
మార్చుపద్మాలయా స్టూడియోస్ కృష్ణ పెద్దకుమార్తె పద్మాలయ పేరుమీదుగా, సోదరులు ఆదిశేషగిరిరావు, హనుమంతరావు నిర్మాతలుగా ఏర్పడిన కృష్ణ స్వంత బ్యానర్. 1970లో తానే కథానాయకునిగా ఆ పతాకంపై తొలి సినిమా అగ్నిపరీక్ష పరాజయం పాలైంది. ఆ సమయంలో మద్రాసు థియేటర్లలో విజయవంతమవుతున్న మెకన్నాస్ గోల్డ్ వంటి కౌబాయ్ చిత్రాలపై కృష్ణ దృష్టిపడింది. మెకన్నాస్ గోల్డ్, ఫ్యూ డాలర్స్ మోర్, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ లాంటి సినిమాలను కలుపుకుని ఓ కథ తయారుచేసి తెలుగులో కౌబాయ్ సినిమా చేయాలన్న ఆలోచన దాంతో కృష్ణకు వచ్చింది.[2] కృష్ణ ఆ బాధ్యతలను అప్పగించగా కౌబాయ్ నేపథ్యాన్ని తెలుగు వాతావరణానికి కలుపుతూ మోసగాళ్ళకు మోసగాడు కథని ప్రముఖ రచయిత ఆరుద్ర రాశారు. సినిమాకి కథ, చిత్రానువాదం, మాటలతో పాటుగా పాటలను కూడా ఆరుద్రే రాశారు. అయితే మొత్తం బౌండ్ స్క్రిప్ట్ పూర్తిచేసి నిర్మాతలకు ఇచ్చాకా వారికి అది బాగా నచ్చేసింది. దాంతో ఈ సినిమాకు ఆరుద్ర దర్శకత్వం వహిస్తేనే బావుంటుందని భావించిన నిర్మాతలు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఘట్టమనేని హనుమంతరావు ఆయనకు దర్శకత్వం ఆఫర్ చేశారు. అయితే తన పరిమితులు తెలిసిన ఆరుద్ర దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేదు. దాంతో ఇక వేరే దారిలేక అప్పటికే విజయలలితతో రౌడీరాణి అనే యాక్షన్ సినిమాకు దర్శకత్వం వహించి విజయం సాధించిన కె.ఎస్.ఆర్.దాస్‌ని దర్శకునిగా తీసుకున్నారు.[3] సినిమాకి మొదట "అదృష్టరేఖ" అన్న పేరు పెడదామని భావించారు, కానీ చివరకు "మోసగాళ్ళకు మోసగాడు" అన్న పేరు పెట్టారు.[2]
చిత్రీకరణ
మార్చుమోసగాళ్ళకు మోసగాడు సినిమాను రాజస్థాన్లో ఎడారులు, బికనీర్ కోట, పంజాబ్ లోని సట్లెజ్ నది తీరం, హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా పరిసర ప్రాంతాల్లో మంచుకొండలు, టిబెట్ పీఠభూమి, పాకిస్తాన్-చైనా సరిహద్దు ప్రాంతం వంటి ప్రదేశాల్లో చిత్రీకరించారు. ఆయా ప్రాంతాల్లో షూటింగ్ కోసం మొత్తం యూనిట్ అంతటినీ రాజస్తాన్ కు ప్రత్యేక రైలు వేయించుకుని తీసుకువెళ్ళారు. సినిమాలో కృష్ణని మొట్టమొదటిసారి కౌబాయ్ గా కాస్ట్యూంస్ చేసిన బాబూరావు, వెంకట్రావు, మేకప్ మేన్ మాధవరావు తీర్చిదిద్దారు.[3] సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా వి.ఎస్.ఆర్.స్వామి వ్యవహరించారు.[2]
థీమ్స్, ప్రభావాలు
మార్చుమోసగాళ్ళకు మోసగాడు అమెరికన్ సినిమాల్లోని కౌబాయ్ సినిమాల జానర్ తో వచ్చింది. కౌబాయ్ అంటే ఉత్తర అమెరికాలో పశువుల మందలను మేపుతూ, వాటికి కాపలాగా ఉంటూ గుర్రాలపై సంచరించే వ్యక్తి. 19వ శతాబ్ది ఉత్తర మెక్సికోలో ఈ పాత్ర జానపద నాయకుని పాత్రగా రూపాంతరం చెంది పలు సాహసగాథలకు ముఖ్యమైన దినుసు అయింది.[4] 19, 20వ శతాబ్దాల్లో అమెరికాలో ఈ కౌబాయ్ పాత్రలను, స్థానిక అమెరికన్ల పాత్రలను రొమాంటిసైజ్ చేస్తూ వెల్డ్ వెస్ట్ షోలు ప్రాచుర్యం పొందాయి.[5] 1920ల నుంచి నేటివరకూ ఆంగ్లంలో పలు కౌబాయ్ సినిమాలో వచ్చాయి. వీటిలో కౌబాయ్ లు నెగిటివ్ గానూ, పాజిటివ్ గానూ కూడా కనిపిస్తారు. కొన్ని సినిమాల్లో కౌబాయ్ లు గ్యాంగ్ స్టర్లుగానూ, మరికొన్నిటిలో దేశభక్తి, సాహసం, ధైర్యం వంటి గుణాలతో కౌబాయ్ కోడ్ వంటి సద్లక్షణాలతోనూ కనిపిస్తారు. మొత్తానికి ఆంగ్ల చిత్రాల్లో కౌబాయ్ ఓ ప్రత్యేకమైన జానర్ గా రూపుదిద్దుకుంది.[6]
ఇలాంటి పూర్తిగా అమెరికన్ సంస్కృతికి చెందిన కౌబాయ్ నేపథ్యంలో సినిమాను రూపొందించి తెలుగు వారిని ఆకట్టుకునేందుకు రచయిత ఆరుద్ర చాలా కృషి చేశారు. ఈ సినిమాలో కథానాయకుడిది పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యం పొందిన నేరస్తుల్ని పట్టించి డబ్బు సంపాదించే బౌంటీ హంటర్ పాత్ర. నేపథ్యం కౌబాయ్. ఇలాంటివి సమకాలీన సమాజంలో కానీ, సమీప గతంలో కానీ లేవు కనుక ఈ సినిమా కాలాన్ని బ్రిటీష్ వారూ, ఫ్రెంచ్ వారూ దేశంలో ఆధిపత్యం కోసం పోరాడుతున్న రోజుల్లో సెట్ చేశారు. బొబ్బిలి యుద్ధం కాలంలో బ్రిటీష్ వారు అమరవీడు అనే సంస్థానాన్ని స్వాధీనం చేసుకునేందుకు దాడిచేసిన రోజుల్లో కథ ప్రారంభమవుతుంది. ఆ అమరవీడు సంస్థానపు నిధి కోసం జరిగే అన్వేషణ గద్వాల సంస్థానం, కర్నూలు రాజ్యాల వరకూ సాగుతుంది. ప్రతినాయకులకు బెజవాడ మంగయ్య, ఏలూరు లింగయ్య, నెల్లూరు రంగయ్య, చిత్తూరు చెంగయ్య, చెన్నపట్నం చిన్నయ్య అంటూ పేర్లను తెలుగు పట్టణాల పేర్లు కలసివచ్చేలా పెట్టారు. విదేశీ సంస్కృతిలోని నేపథ్యానికి తెలుగు వాతావరణం కల్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఇవి.[3]
సినిమాలో నాగభూషణం పోషించిన పాత్ర ప్రముఖ ఆంగ్ల కౌబాయ్ చిత్రం గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ సినిమాలోని అగ్లీ పాత్రను ఆధారం చేసుకుని తయారుచేశారు.[2]
నటీనటులు
మార్చుపాటలు
మార్చు- ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా ఏడిగుందా - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి
- కత్తిలాంటి పిల్లోయి కదలివచ్చె కాస్కో మచ్చుకైన మామ - సుశీల
- కోరినది నెరవేరినది ఓహో కలలు నిజమాయే - సుశీల, ఎస్.పి. బాలు
- గురిని సూటిగ కొట్టేవాడా సాటిలేనిది - ఎల్. ఆర్. ఈశ్వరి
- తకిట ధిమి తక తై తమాషా మైకం తలచినది - ఎల్. ఆర్. ఈశ్వరి
- పద్మాలయాం పద్మాకరాం పద్మపత్రనిభేక్షణా (శ్లోకం) - ఎస్.పి. బాలు
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (27 August 2023). "52 వసంతాలు పూర్తి చేసుకున్న మోసగాళ్లకు మోసగాడు.. తొలి పాన్ వరల్డ్ సినిమా ఇదే..!". Archived from the original on 28 August 2023. Retrieved 28 August 2023.
- ↑ 2.0 2.1 2.2 2.3 రెంటాల, జయదేవ. "కౌబాయ్ లకు కౌబాయ్". ఇష్టపడి. Archived from the original on 9 మే 2015. Retrieved 15 August 2015.
- ↑ 3.0 3.1 3.2 ఎం., సికిందర్. "నాటి రహస్యం!". సినిమా స్క్రిప్ట్ & రివ్యూ. Archived from the original on 7 మార్చి 2016. Retrieved 14 August 2015.
- ↑ Malone, J., p. 1.
- ↑ Malone, J., p. 82.
- ↑ "Gene Autry's Cowboy Code" © Autry Qualified Interest Trust. Archived 2010-09-17 at the Wayback Machine Web page accessed February 3, 2009.