సిమ్లా
సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం. అదే పేరుతో ఉన్న జిల్లాకు ముఖ్య పట్టణం. ఈ నగరం ఆపిల్ తోటలకు ప్రసిద్ధి. ఇది ఆంగ్లేయులకు భారతదేశపు వేసవి రాజధానిగా ఉండేది. భారతదేశంలో పెద్ద, అభివృద్ధి చెందుతున్న నగరంగా సిమ్లాకు గుర్తింపు ఉంది. కళాశాలలు, పరిశోధనా సంస్థలకు ఇది నెలవు. తుడోర్ బెతన్, నియో-గోతిక్ నిర్మాణాలలో వలసరాజ్యాల కాలం నాటి అనేక భవనాలకూ, ఎన్నో దేవాలయాలకూ, చర్చిలకు సిమ్లా నెలవు. ఈ కట్టడాలతో పాటు, నగరం యొక్క సహజ వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తాయి. శ్రీ హనుమాన్ జాఖు (విగ్రహం), జాఖు ఆలయం, వైస్రెగల్ లాడ్జ్, క్రైస్ట్ చర్చి, మాల్ రోడ్, ది రిడ్జ్ ఇంకా అన్నాడేల్ నగర కేంద్ర ప్రధాన ఆకర్షణలు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన కల్కా-సిమ్లా రైల్వే మార్గం కూడా ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. ఎత్తైన భూభాగం కారణంగా ఇక్కడ పర్వత బైకింగ్ రేసు (ఎంటిబి హిమాలయ) జరుగుతుంది. 2005 లో ప్రారంభమైన ఈ రేసును దక్షిణ ఆసియాలో ఈ రకమైన అతిపెద్ద కార్యక్రమంగా పరిగణిస్తారు.[3]
సిమ్లా
शिमला సిమ్లా | |
---|---|
ముఖ్య పట్టణం | |
దేశం | India |
రాష్ట్రం | హిమాచల్ ప్రదేశ్ |
జిల్లా | సిమ్లా |
Government | |
విస్తీర్ణం | |
• Total | 25 కి.మీ2 (10 చ. మై) |
Elevation | 2,205 మీ (7,234 అ.) |
జనాభా (2011)[2] | |
• Total | 1,71,817 |
• Rank | 1 (in హిమాచల్) |
• జనసాంద్రత | 120/కి.మీ2 (300/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 171 001 |
టెలిఫోన్ కోడ్ | 91 177 XXX XXXX |
ISO 3166 code | [[ISO 3166-2:IN|]] |
Vehicle registration | HP-03, HP-51, HP-52 |
Climate | Cwb (Köppen) |
అవపాతం | 1,577 mమీ. (62 అం.) |
సగటు వార్షిక ఉష్ణోగ్రత | 13 °C (55 °F) |
సగటు వేసవికాలపు ఉష్ణోగ్రత | 18 °C (64 °F) |
సగటు శీతాకాలపు ఉష్ణోగ్రత | 5 °C (41 °F) |
శబ్దవ్యుత్పత్తి
మార్చుకాళి దేవత నిర్భయ అవతారమైన శ్యామల మాత పేరు నుండి సిమ్లా నగరానికి ఈ పేరు వచ్చింది. కాళి బారి ఆలయం ది రిడ్జ్ సమీపంలో ఉన్న బాంటొనీ కొండపై ఉంది.[4] మరొక కథనం ప్రకారం, నీలి పలక అని అర్ధం వచ్చే శ్యామాలయ అనే పదం నుండి సిమ్లాకు ఈ పేరు వచ్చింది. కానీ సాధారణంగా, చాలా మంది మొదటి కథనాన్ని మరింత నమ్మదగిన, ఆమోదయోగ్యమైన, సబబైన కథనంగా పరిగణిస్తారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నగర పేరును సిమ్లా నుండి శ్యామలగా మార్చాలనుకుంటుందని వార్తలు వినిపించాయి. కానీ ప్రజల, స్థానికుల ప్రతికూల స్పందనను చూసి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళికను తోసిపుచ్చింది.[5]
చరిత్ర
మార్చు18 వ శతాబ్దంలో ప్రస్తుత సిమ్లా నగరప్రాంతం చాలా దట్టమైన అడవి ప్రాంతం. అప్పట్లో అక్కడ ఉన్నవి జాఖు ఆలయం, ఇంకా కొన్ని చెల్లాచెదురుగా ఉన్న ఇళ్ళు.[6] ప్రస్తుత సిమ్లా ప్రాంతం 1806 లో నేపాల్‌కు చెందిన భీమ్సేన్ థాపా చేత ఆక్రమించబడింది. ఆంగ్లో-నేపాలీ యుద్ధం (1814-16) తరువాత సుగౌలీ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. 1815 మేలో డేవిడ్ ఓచెర్లోనీ నాయకత్వంలో మలాన్ కోటపై దాడి చేసి గూర్ఖా నాయకులను అణచివేశారు. 1817 ఆగస్టు 30 నాటి డైరీ ఎంట్రీలో, ఈ ప్రాంతాన్ని సర్వే చేసిన గెరార్డ్ సోదరులు, సిమ్లాను "ప్రయాణికులకు నీరు ఇవ్వడానికి ఫకీర్ ఉన్న మోస్తారు గ్రామం" అని వర్ణించారు.
1819 లో, హిల్ స్టేట్స్ రాజకీయ ఏజెంటు లెఫ్టినెంట్ రాస్, సిమ్లాలో ఒక చెక్క కుటీరాన్ని ఏర్పాటు చేశాడు. మూడు సంవత్సరాల తరువాత, అతని వారసుడు, స్కాటిష్ పౌర సేవకుడు చార్లెస్ ప్రాట్ కెన్నెడీ, 1822 లో కెన్నెడీ కాటేజ్ అనే ప్రాంతంలో అన్నాడేల్ సమీపంలో మొట్టమొదటి పక్కా ఇంటిని నిర్మించాడు. దీన్ని ఇప్పుడు సి.పి.డబ్ల్యు.డి (CPWD) కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు. వేసవులలో ఇక్కడి బ్రిటన్ తరహా వాతావరణం గురించిన కథలు అనేక బ్రిటిష్ అధికారులను ఈ ప్రాంతానికి ఆకర్షించడం ప్రారంభించాయి. 1826 నాటికి, కొందరు అధికారులు తమ మొత్తం సెలవులను సిమ్లాలో గడపడం ప్రారంభించారు. 1827 లో, బెంగాల్ గవర్నర్ జనరల్ విలియం అమ్హెర్స్ట్ సిమ్లాను సందర్శించి కెన్నెడీ హౌస్‌లో బస చేశారు. ఒక సంవత్సరం తరువాత, భారతదేశంలోని బ్రిటిష్ దళాల కమాండర్-ఇన్-చీఫ్ స్టేపుల్టన్ కాటన్ అదే నివాసంలోనే ఉన్నారు. ఆయన బస చేసిన సమయంలో, జాఖూ సమీపంలో మూడు మైళ్ల రహదారి, వంతెనను నిర్మించారు. 1830 లో, బ్రిటీష్ వారు కియొంతల్, పాటియాలా అధిపతుల నుండి పరిసర భూమిని తీసుకుని ప్రతిగా రావిన్ పరగణాను ఇంకా భరౌలి పరగణాలో ఒక భాగాన్ని వారికిచ్చారు. ఆ తర్వాత ఈ చోటు, 1830 లో 30 ఇళ్ల నుండి 1881 లో 1,141 ఇళ్ల దాకా, వేగంగా విస్తరించింది.[7]
1903 లో ప్రారంభమైన కల్కా-సిమ్లా రైల్వే మార్గం సిమ్లా ప్రాప్యత, ప్రజాదరణకు తోడ్పడింది. 806 కి పైగా వంతెనలు, 103 సొరంగాలతో కల్కా నుండి సిమ్లాకు రైల్వే మార్గం ఇంజనీరింగ్ సాహసంగా పేర్కొనబడి, "బ్రిటిష్ జ్యువెల్ ఆఫ్ ది ఓరియంట్" అన్న పేరుతో ప్రాచుర్యం పొందింది.[8] 2008 లో ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో భాగమైంది.[9] అదనంగా, సిమ్లా 1871 లో అవిభక్త రాష్ట్రమైన పంజాబ్ రాజధానిగా ఉండేది, కొత్త నగరం చండీగఢ్ (భారతదేశపు పంజాబ్, హర్యానా రాష్ట్రాల ప్రస్తుత రాజధాని) నిర్మాణం వరకు అలాగే ఉంది. 1971 లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత, సిమ్లాను దాని రాజధాని చేశారు.
స్వాతంత్ర్యం తరువాత, పశ్చిమ హిమాలయ యొక్క గుట్టలలో 28 చిన్న రాచరిక రాష్ట్రాలను (భూస్వామ్య యువరాజులు, జైల్దార్లతో సహా) ఏకీకృతం చేసిన ఫలితంగా 1948 ఏప్రిల్ 15 న చీఫ్ కమిషనర్ ప్రావిన్స్ ఉనికిలోకి వచ్చింది, ఈ పూర్తి ప్రాంతాన్ని సిమ్లా హిల్స్ స్టేట్స్, నాలుగు పంజాబ్ దక్షిణ కొండ రాష్ట్రాలుగా పిలుస్తారు. ఇది హిమాచల్ ప్రదేశ్ (పరిపాలన) ఆర్డర్, 1948, అదనపు ప్రావిన్షియల్ జురిస్డిక్షన్ యాక్ట్, 1947 లోని సెక్షన్లు 3, 4 కింద జరిగింది (తరువాత విదేశీ అధికార పరిధి చట్టం, 1947 వైడ్ AO 1950 గా మార్చబడింది). భారత రాజ్యాంగం అమలుతో హిమాచల్ 1950 జనవరి 26 న పార్ట్ సి (part C) రాష్ట్రంగా మారింది అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ నియమించబడ్డారు. శాసనసభ ఎన్నిక 1952 లో జరిగింది. హిమాచల్ ప్రదేశ్ 1956 నవంబరు 1 న కేంద్రపాలిత ప్రాంతంగా మారింది.[10] అప్పటి పంజాబ్ భాగమైన సిమ్లా, కాంగ్రా, కులు, లాహుల్, స్పితి జిల్లాలు, అంబాలా జిల్లా నలగార్ తహసీల్, లోహారా, అమ్బ్ - ఉనా కనుంగో సర్కిల్స్, సంతోఖ్ ఘర్ కనుంగో సర్కిల్లోని కొంత ప్రాంతం, ఇంకొన్ని ప్రాంతాలు; పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద, 1966 నవంబరు 1 న హిమాచల్ ప్రదేశ్‌లో విలీనం చేయబడ్డాయి. 1970 డిసెంబరు 18 న, హిమాచల్ ప్రదేశ్ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించడంతో, కొత్త రాష్ట్రం 1971 జనవరి 25 న అమల్లోకి వచ్చింది. ఆ విధంగా భారతదేశపు పద్దెనిమిదవ రాష్ట్రంగా హిమాచల్ అవతరించింది.[10]
సిమ్లా ఒప్పంద ఒడంబడికపై పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో, భారత ప్రధాని ఇందిరా గాంధీ సిమ్లాలో సంతకం చేశారు. ఈ ఒప్పందం బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్ దౌత్యపరంగా గుర్తించడానికి మార్గాన్ని సుగమం చేసింది. అధికారిక పత్రాలపై 1972 జూలై 2 గా నమోదయినా, నిజానికి పత్రంపై జూలై 3 రాత్రి 0040 గంటలకు సంతకం చేయబడింది. [5]
భౌగోళికం
మార్చుసిమ్లా హిమాలయాల నైరుతి శ్రేణులలో 31°37′N 77°06′E / 31.61°N 77.10°E న ఉంది. సగటు సముద్ర మట్టానికి పైన దీని సగటు ఎత్తు 2,206 మీటర్లు (7,238 అ.). ఈ నగరం ఏడు కొండల వెంట విస్తరించి ఉంది. నగర విస్తీర్ణం తూర్పు నుండి పడమర వరకు దాదాపు 9.2 కిలోమీటర్లు (5.7 మై.).[11]
ఈ నగరం భారతదేశపు భూకంప ప్రమాద వర్గీకరణ ప్రకారం జోన్ IV (అధిక నష్టం జరిగే ప్రమాదంగల జోన్ - హై డ్యామేజ్ రిస్క్ జోన్) వర్గంలోకి వస్తుంది. బలహీనమైన నిర్మాణ పద్ధతులు, పెరుగుతున్న జనాభా వల్ల, ఇప్పటికే భూకంపాలు సంభవించే ప్రమాదం ఉన్న ఈ ప్రాంతానికి, తీవ్రమైన ముప్పు పొంచి ఉంది.[12][13] ప్రధాన నగరానికి సమీపంలో నీటి వనరులు లేవు, సమీప నది సట్లెజ్ సుమారు
21 కి.మీ. (13 మై.) దూరంలో ఉంది.[14] గిరి, పబ్బార్ నదులు (యమునా యొక్క రెండు ఉపనదులు) కుడా సిమ్లా జిల్లా గుండా ప్రవహిస్తాయి, కానీ ఇవి నగరం నుండి మరింత దూరంలో ఉన్నాయి.
సిమ్లా ఏడు కొండల పైన నిర్మించబడింది: ఇన్వెరామ్ కొండ, అబ్జర్వేటరీ కొండ, ప్రాస్పెక్ట్ కొండ, సమ్మర్ కొండ, బాంటోనీ కొండ, ఎలిసియం కొండ, జాఖు కొండ. సిమ్లాలోని ఎత్తైన ప్రదేశం జాఖు కొండ, దీని ఎత్తు 2,454 మీటర్లు (8,051 అ.). ఇటీవలి కాలంలో, నగరం ఈ ఏడు కొండలను దాటి వ్యాప్తి చెందింది.
జనాభా
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం, సిమ్లా నగరం 35.34 చదరపు కి.మీల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. జనాభా 169,578. 93,152 మంది పురుషులు, 76,426 మంది మహిళలు ఉన్నారు. నగరం యొక్క సమర్థవంతమైన అక్షరాస్యత రేటు 93.63 శాతం.[15]
భాష
మార్చుహిందీ ఇక్కడి వాడుక భాష, ఇది నగరంలో ప్రధానంగా మాట్లాడే భాష, అధికారిక ప్రయోజనాల కోసం సాధారణంగా ఉపయోగించే భాష. గణనీయమైన జనాభా ఇంగ్లీష్ కూడా మాట్లాడుతారు, ఇది నగరం యొక్క రెండవ అధికారిక భాష. హిందీ కాకుండా, పహారీ భాషలను ఇక్కడి పహారీ జాతి ప్రజలు మాట్లాడుతారు, వీరు నగర జనాభాలో ప్రధాన భాగం. నగరంలోని పంజాబీ వలస జనాభాలో పంజాబీ భాష ప్రబలంగా ఉంది, వీరిలో ఎక్కువ మంది పశ్చిమ పంజాబ్ నుండి వచ్చిన శరణార్థులు,1947 లో భారత విభజన తరువాత నగరంలో స్థిరపడ్డారు.
మతం
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం, నగరంలో అత్యధికంగా హిందూ మతాన్ని 93.5% మంది ఆచరిస్తున్నారు, తరువాత ఇస్లాం (2.29%), సిక్కు మతం (1.95%), బౌద్ధమతం (1.33%), క్రైస్తవ మతం (0.62%), జైన మతం ( 0.10%).[16]
వాతావరణం
మార్చుసిమ్లాలో కొప్పెన్ వాతావరణ వర్గీకరణ క్రింద ఉపఉష్ణమండల హైలాండ్ క్లైమేట్ (సిడబ్ల్యుబి) ఉంది. సిమ్లాలోని వాతావరణం శీతాకాలంలో ప్రధానంగా చల్లగా ఉంటుంది, వేసవిలో మధ్యస్తంగా ఉంటుంది.[17] వేసవిలో సగటు ఉష్ణోగ్రత 19 నుండి 28 °C (66 నుండి 82 °F), శీతాకాలంలో సగటు −1 నుండి 10 °C (30 నుండి 50 °F) . నెలవారీ అవపాతం నవంబరులో 15 మీ.మీ. (0.59 అం.) నుండి ఆగస్టులో 434 మీ.మీ. (17.1 అం.) మధ్య మారుతూ ఉంటుంది. సగటు మొత్తం వార్షిక అవపాతం 1,575 మీ.మీ. (65 అం.), ఇది ఇతర పర్వత ప్రాంతాలతో పోలిస్తే తక్కువ కానీ మైదాన ప్రాంతాల కన్నా చాలా ఎక్కువ. చారిత్రాత్మకంగా డిసెంబరు నెలలో చోటుచేసుకునే హిమపాతం, ఇటీవల (గత పదిహేనేళ్లుగా) ప్రతి సంవత్సరం జనవరిలో లేదా ఫిబ్రవరి మొదట్లో చోటుచేసుకుంటుంది.[18]
ఆర్థిక వ్యవస్థ
మార్చుఉపాధి ఎక్కువగా ప్రభుత్వ, పర్యాటక రంగాలచే నడుస్తుంది.[19] మిగిలిన ఉద్యోగాలు విద్యా, ఉద్యాన ఉత్పత్తుల ప్రాసెసింగ్ రంగాల కిందికి వస్తాయి. ఉద్యోగార్ధులు, యజమానుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఇటీవల ఒక మోడల్ కెరీర్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. నగరానికి ప్రధాన ఆదాయ ఉత్పత్తి వనరులలో హోటల్ పరిశ్రమ ఒకటి. 5 నక్షత్రాల హోటళ్లతో సహా సిమ్లాలో 6500 హోటళ్లు ఉన్నాయి, అత్యంత ప్రాచుర్యం పొందినవి ఒబెరాయ్ సిసిల్, పీటర్‌హాఫ్, వైల్డ్‌ఫ్లవర్ హాల్, హోటల్ హాలిడే హోమ్. అత్యధిక ర్యాంకు కలిగిన హోటళ్లున్న భారతీయ నగరాల జాబితాలో సిమ్లా అగ్రస్థానంలో ఉంది.[20]
ఉన్నత విద్యా పాఠశాలలతో పాటు, హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ (ఐఎఎస్) వంటి అనేక సంస్థలు కూడా ఉన్నాయి. ఉమ్మడి పోటీ పరీక్షల (సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ) ద్వారా, సబార్డినేట్ కేడర్ నుండి పదోన్నతి ద్వారా ఐఎఎస్ కు నియామకం జరుగుతుంది. ఐఎఎస్ కు నియమించబడిన తరువాత, నేరుగా నియమించిన అధికారులకు ప్రధానంగా నేషనల్ అకాడమీ ఆఫ్ ఆడిట్ అండ్ అకౌంట్స్, సిమ్లాలో శిక్షణ ఇస్తారు.[21] సిమ్లా ఆహ్లాద వాతావరణం, హిల్ స్టేషన్ల రాణి అన్న ఖ్యాతి కారణంగా భారతదేశం అంతటి విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు. విద్యా వ్యవస్థలు జిల్లాతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నాయి.
సంస్కృతి
మార్చుసిమ్లాలో వివిధ ప్రాంతాల ప్రజలు నివసిస్తారు, రకరకాల పండుగలను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం పర్యాటకులు గరిష్ఠంగా ఉండే కాలంలో (మే-జూన్ నెలల్లో), 3-4 రోజుల పాటు సిమ్లా వేసవి పండుగ జరుపుతారు.[22] దేశవ్యాప్తంగా ఉన్న ఎందరో ప్రముఖ గాయకులు ఈ పండుగలో అలరిస్తారు. 2015 నుండి, 95.0 బిగ్ ఎఫ్.ఎం, హిమాచల్ పర్యాటక శాఖ సంయుక్తంగా ఏడు రోజుల సుదీర్ఘ శీతాకాలపు సంబరాలను రిడ్జ్‌లో క్రిస్మస్ నుండి నూతన సంవత్సరం వరకు నిర్వహిస్తున్నాయి.[23]
ఈ ప్రాంతంలోని కళాఖండాలను, ఆభరణాలు, వస్త్రాల సేకరణను రాష్ట్ర సంగ్రహాలయంలో చూడవచ్చు. దీనిని 1974 లో నిర్మించారు. రిడ్జ్ నుండి విస్తరించి ఉన్న లక్కర్ బజార్లో చెక్కతో చేసిన స్మృతి చిహ్నలను విక్రయిస్తారు. ప్రధాన నగరానికి 55 కిలోమీటర్లు (34.2 మైళ్ళు) ఉన్న వేడి సల్ఫర్ స్ప్రింగ్స్ కు తట్టా పానీ అని పేరు. సత్లుజ్ నది ఒడ్డున ఉన్న ఇక్కడి నీటికి ఔషధ విలువలు ఉన్నాయని ప్రజలు నమ్ముతారు. సిమ్లా దక్షిణ ఆసియా యొక్క ఏకైక సహజ ఐస్ స్కేటింగ్ రింక్‌కు నిలయం.[24] ఈ వేదిక వద్ద తరచుగా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలు జరుగుతాయి. రింక్‌ను నిర్వహించే సిమ్లా ఐస్ స్కేటింగ్ క్లబ్, ప్రతి సంవత్సరం జనవరిలో కార్నివాల్ నిర్వహిస్తుంది. ఇందులో ఫ్యాన్సీ దుస్తుల పోటీ, ఫిగర్ స్కేటింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సిమ్లా ఇంకా పరిసరాల్లో గ్లోబల్ వార్మింగ్, పెరుగుతున్న పట్టణ అభివృద్ధి ప్రభావాల కారణంగా, ప్రతి శీతాకాలంలో మంచు మీద కార్యక్రమాల సంఖ్య గత కొన్ని సంవత్సరాలుగా తగ్గుతోంది.
రవాణా
మార్చువివిధ ప్రదేశాల నుండి సిమ్లాకు ఉన్న దూరాలు:
- కల్క - 90 కి.మీ
- పటియాల - 172 కి.మీ
- చండీఘడ్ - 119 కి.మీ
- అంబాలా - 166 కి.మీ
- ఢిల్లీ - 380 కి.మీ
- ఆగ్రా - 568 కి.మీ
- అమృత్సర్ - 342 కి.మీ
- జమ్ము (పఠాన్‌కోట మార్గం) - 482 కి.మీ
- చౌపాల్ (హిమాచల్ ప్రదేశ్) - 110 కి.మీ
- శ్రీనగర్ - 787 కి.మీ
- జైపూర్ - 629 కి.మీ
- ధర్మశాల (హిమాచల్ ప్రదేశ్) ( మండి (హిమాచల్ ప్రదేశ్) మార్గం) - 290 కి.మీ
- ధర్మశాల (హిమాచల్ ప్రదేశ్) ( హమీర్పూర్ (హిమాచల్ ప్రదేశ్)) - 235 కి.మీ
- డల్హౌసీ - 345 కి.మీ
- చంబా (హిమాచల్ ప్రదేశ్) - 401 కి.మీ
- కులు - 235 కి.మీ
- మనాలి (హిమాచల్ ప్రదేశ్) - 280 కి.మీ
- మండీ (హిమాచల్ ప్రదేశ్) - 153 కి.మీ
- పాలంపూర్ - 270 కి.మీ
- రోహ్రు - 129 కి.మీ
- డెహ్రాడూన్ - 275 కి.మీ
- తెయాగ్ - 28 కి.మీ
- రాంపూర్ (హిమాచల్ ప్రదేశ్) - 132 కి.మీ
ఇది కూడ చూడు
మార్చు- 1972 జూలై 3 న భారత్ పాకిస్తాన్ ల మధ్య సిమ్లా ఒప్పందం
- సిమ్లా అకార్డ్ (1914) సిమ్లాలో జరిగిన ఒక సమావేశం ముగింపులో బ్రిటన్, టిబెట్ మధ్య 1914 లో సంతకం చేయబడిన ఒక ఒప్పందం. దాని చట్టపరమైన స్థితి వివాదాస్పదమైనప్పటికీ, ఇది ప్రస్తుతం చైనా, భారత్ ల మధ్య సమర్థవంతమైన సరిహద్దు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Shimla Municipal Corporation". Shimla Municipal Corporation. Retrieved 2013-10-25.
- ↑ "Population in the age group 0-6 and literates by sex—urban agglomeration/town". Census of India 2001. Government of India. 27 May 2002. Retrieved 2007-04-14.
- ↑ HASTPA. "Hero MTB Himalaya : The 16th Edition". Hero MTB Himalaya : The 16th Edition. Archived from the original on 2021-05-26. Retrieved 2021-05-26.
- ↑ "Stunning facts about Shimla no one told you before". Times of India Travel. Retrieved 2021-05-28.
- ↑ Staff, Scroll. "Himachal Pradesh is not considering any proposal to change Shimla's name to Shyamala, says CM". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-28.
- ↑ Pubby, Vipin (1996). Shimla Then & Now (in ఇంగ్లీష్). Indus Publishing. ISBN 978-81-7387-046-0.
- ↑ Harrop, F. Beresford (1925). Thacker's new Guide to Simla. Simla: Thacker, Spink & Co. pp. 16–19.
- ↑ "Heritage of Shimla" (PDF). Town & Country Planning Department, Shimla. Archived from the original (PDF) on 30 June 2007. Retrieved 4 May 2007.
- ↑ "Unesco". Unesco.org. Retrieved 14 October 2012.
- ↑ 10.0 10.1 "History of Himachal Pradesh". National Informatics Centre, Himachal Pradesh. Archived from the original on 21 November 2006. Retrieved 31 March 2008.
- ↑ "Shimla Municipal Corporation". Archived from the original on 3 April 2007. Retrieved 4 May 2007.
- ↑ "Concrete buildings make Shimla vulnerable to quake". Indiainfo.com. Archived from the original on 22 December 2005. Retrieved 14 October 2005.
- ↑ "Report from the field: Shimla City, India" (PDF). GeoHazards International. Archived from the original on 30 June 2007. Retrieved 11 May 2007.
- ↑ "Sight seeing tours around Shimla". HP Tourism Development Corporation. Archived from the original on 11 May 2007. Retrieved 21 May 2007.
- ↑ "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 7 July 2012.
- ↑ "C-1 Population By Religious Community - HP". census.gov.in. Retrieved 19 August 2020.
- ↑ "Weather log for Shimla". shimlatimes.in. Archived from the original on 22 డిసెంబరు 2015. Retrieved 21 December 2015.
- ↑ "62cm and counting". The Tribune, Chandigarh, India. Retrieved 14 February 2007.
- ↑ "City Development Plan, Shimla". Municipal Corporation, Shimla. Archived from the original on 15 November 2006. Retrieved 4 May 2007.
- ↑ "Shimla tops list of highest ranked hotels". shimlatimes.in. Archived from the original on 5 జూన్ 2014. Retrieved 18 August 2013.
- ↑ "National Academy of Audit and Accounts, Shimla".
- ↑ "Himachal Tourism - Adventure Tourism". web.archive.org. 2007-04-16. Archived from the original on 2007-04-16. Retrieved 2021-05-26.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Nov 28, TNN /; 2015; Ist, 10:31. "Winter carnival to add to Shimla's tourism | Shimla News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-26.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "The Tribune, Chandigarh, India - Himachal Pradesh". www.tribuneindia.com. Retrieved 2021-05-26.