వికీపీడియా:తెవికీ వార్త/2011-12-09/మాటామంతీ-రాజశేఖర్

తెవికీ వార్త
తెవికీ వార్త
మాటామంతీ-రాజశేఖర్

మాటామంతీ-రాజశేఖర్

రాజశేఖర్ , డిసెంబర్,9, 2011
నా వ్యక్తిగత చిత్రపటము.
  • వికీపీడియా పరిచయం ఎప్పుడు, ఎలా

నాకు అంతర్జాలంలో గూగుల్ శోధనా యంత్రం ద్వారా వెతకడం అలవాటు. అలా వెతుకుతున్నప్పుడు చాలాసార్లు వికీపీడియా పేజీ లింకులు మొట్టమొదటగా రావడం గమనించాను. ఒకసారి మా అబ్బాయి హోమ్ వర్క్ కోసం సౌత్ కొరియా గురించి అవసరమైతే ఆంగ్ల వికీపీడియా బొమ్మలతో సహా మంచి సమాచారం దొరికింది. అలా ఏదైనా విషయం గురించి లేదా ఎవరైనా గొప్ప వ్యక్తి గురించిన సమాచారం ఏ ఇతర వెబ్ సైటులో దొరకని విధంగా వికీపీడియాలో లభించేది. ఇదొక అలవాటుగా మారింది. వికీపీడియా గురించి తెలుసుకొని అందులో ఎవరైనా సమాచారాన్ని చేర్చవచ్చని తెలిసిన వెంటనే నేను పనిచేయడం మొదలుపెట్టారు. మొదటగా మా వూరు సాలూరు (ఇంగ్లీషు వికీలో వ్యాసం) గురించిన సమాచారం వెతికితే అసలేమాత్రం విషయం లభించలేదు. అందువలన నేనే విషయాల్ని సేకరించి చేర్చాను. ఇప్పటికీ ఆ ప్రదేశం గురించి ఇంకెక్కడా లభించని సమాచారం అందులో లభిస్తుంది. అదీ మొట్టమొదటగా. అందుకు చాలా గర్వపడ్డాను.

తర్వాత తెలుగు వికీపీడియాలో ప్రవేశించి చూస్తే కావలసిన సమాచారము లభించలేదు. చాలా వరకు తెలుగు పదాల కోసం వెదికితే అయితే సినిమా లేదా గ్రామాల పేజీలకు పోతుండేది. వాటిలో కూడా ఎక్కువగా సమాచారం లేదు. నా కంప్యూటర్ సెట్టింగ్ కొంచెం మార్చి తిన్నగా వికీ పేజీలలోనే నా రచనలు మొదలుపెట్టాను. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల గ్రామాల గురించిన విషయం ఎక్కువగా చేర్చాను. తర్వాత వికీపీడియా సోదర ప్రాజెక్టులు అయిన విక్షనరీ మరియు వికీసోర్సులో కూడా కొంత పనిచేశాను.

  • సభ్యుడుగా/నిర్వహకులుగా ఇప్పటివరకు జరిపిన కృషి, గుర్తింపులు
    • 2007 : అక్టోబర్ 2007 లో వికీపీడియా నిర్వాహకుడిగా వైజాసత్య ప్రతిపాదించగా ఇతర నిర్వాహకుల అభిప్రాయాలకు అనుగుణంగా నన్ను నిర్వాహకునిగా ఎన్నుకొని నా బాధ్యతలను పెంచారు.
    • 2008 : చేరిన 10 నెలలలోపే 10 వేల దిద్దుబాట్లు చేసినందుకు విశ్వనాథ్ గండపెండేరం బహుకరించారు.
    • 2009 : వికీపీడియా:WikiProject/జీవ శాస్త్రము లో విశిష్టమైన కృషి చేసినందుకు మాటలబాబు మరియు విశ్వనాథ్ లు కానుకలు ప్రదానం చేశారు.
    • 2010 : ఈ సంవత్సరంలో అత్యధిక దిద్దుబాట్లు చేసిన పది మందిలో ఒకడిగా గుర్తింపు పొందాను.
    • 2011 : నేను ఇంతవరకు అత్యధిక దిద్దుబాట్లు అనగా 50,000 పైగా చేసి మొదటిస్థానంలో ఉన్నాను. పతకాన్ని ప్రదానం చేసి ప్రోత్సహించిన కాసుబాబు గారికి ధన్యవాదాలు.
  • ప్రస్తుతం తెవికీలో చేస్తున్న కృషి
    • వికీపీడియా మొత్తం వ్యాసాల్ని 50,000 కన్నా ఎక్కువగా పెంచాలి.
    • 2000-2011 వరకు తెలుగు సినిమాలు అన్నింటికీ కొంత సమాచారంతో పేజీలు తయారుచేయడం.
    • మేళకర్త రాగాలు అన్నింటి గురించి వ్యాసాల్ని పూర్తిచేయడం.
    • తెలుగు వ్యాకరణం గురించిన అన్ని కీలకమైన విభాగాలకు పేజీలను అందులో ముఖ్యమైన సమాచారాన్ని చేర్చడం.
    • జీవ శాస్త్రములో భారతదేశంలోని చాలా రకాల జీవ జాతులకు (జంతువులు మరియు మొక్కలు) సంబంధించిన వివరాలు చేర్చి విస్తరించడం.
    • నేను చేసిన అన్ని దిద్దుబాట్లు చూడవచ్చు.
  • వికీ సమాచారానికి మీకు ముఖ్యమైన వనరులు
    • నేను వ్రాసిన ఎక్కువ వ్యాసాలు ప్రచురించబడిన పుస్తకాలు నుండి తీసుకొంటున్నాను. ఉదా: 20వ శతాబ్ధి తెలుగు వెలుగులు పుస్తకం మనకు తెలియని ఎందరో ప్రముఖుల గురించి తెలియజేస్తుంది. ఇలాంటి ముఖ్యమైన పుస్తకాల్ని కొనడం గాని లేదా దగ్గరలోని గ్రంథాలయం నుండి తెచ్చుకుంటాను. కొన్ని పుస్తకాలను వ్యాసాలుగా కూడా చేర్చాను. ఉదా: నాటి 101 చిత్రాలు కథా కిరణాలు, స్వర్ణయుగ సంగీత దర్శకులు.
    • కొన్ని వ్యాసాలు అనువాదాలుగా ఆంగ్ల వికీ నుండి తీసుకున్నాను. ఉదా: మేళకర్త రాగాలు. కొన్ని వ్యాసాలు వ్రాయడానికి అధికారిక వెబ్ సైట్లనుండి సమాచారాన్ని తీసుకుంటాను. ఉదా: సినిమాలకు IMDb ఎక్కువగా తీసుకుంటాను.
  • వికీ కృషి లో నచ్చినవి/ నచ్చనివి/హాస్య సంఘటనలు

వికీపీడియాలో సభ్యులు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొనడం మరియు కొంతమంది సభ్యులు ఆచరిస్తున్న సంయమనం శ్లాఘించదగినవి. నాకు నచ్చనవి అంతగా లేదు. కొన్ని సందర్భాలలో చర్చలు హద్దులు దాటినట్లుగా అనిపించింది. వికీ ఏ ఒక్కరికీ చెందినది కాదు; అయినా మనందరికి సంబంధించినది అని గుర్తిస్తే ఈగో సమస్యలు ఉండవు.

  • వికీ ఉపయోగపడిన విధం

వికీపీడియా ద్వారా నా తీరిక సమయం ఇతరులకు ఉపయోగకరంగా మారిందని కలిగిన ఆనందం విలువకట్టలేనిది.

  • తెవికీ భవిష్యత్తుకి కలలు
    • తెలుగు వికీపీడియా తెలుగు భాషకు ఒక నిజమైన విజ్ఞాన సర్వస్వంగా ఎదగాలి. సమిష్టి కృషితోనే ఇది సాధ్యం. తెలుగువారి సంస్కృతిని ప్రతిబింబించేదిగా వికీ రూపుదిద్దుకోవాలని నా ప్రగాఢ కోరిక. మన పండుగలు, నోములు, మరచిపోతున్న తెలుగు భాష, కుటుంబ వ్యవస్థ, సాంప్రదాయాలు, కళారూపాలు, ఎందరో మహానుభావులు, ఆటపాటలు, సంగీత సాహిత్యాలు, మొదలైనవాటిని విస్తరించి ప్రపంచవ్యాప్తంగా మనల్ని మనం గౌరవించుకొనే విధంగా చేయాలి.
    • సంస్కృతం తెలుగు భాషకే కాక మరెన్నో ప్రపంచ భాషలకు తల్లివంటిది. ఆంగ్ల వికీపీడియాలో ఇప్పటికే కొన్నింటికి వ్యాసాలుగా అభివృద్ధి చేశారు. అలాంటి మాతృ భాషకు సంబంధించిన పదాలకు మంచి వ్యాసాలు తయారుచేసి మన కృతజ్ఞతను తెలియజేయాలని కోరిక.
    • భారతదేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు. అందువలన ప్రతి రాష్ట్రం, జిల్లా, మండలం, పంచాయితీ, గ్రామం వరకు మొత్తం సమాచారాన్ని చేరిస్తే మన సామాజిక వ్యవస్థ గురించి ప్రపంచమంతా తెలియజేసిన వారమౌతాము. దీనికి సమాచార హక్కు ద్వారా లభించే సమాచారం చాలా కీలకమైనది.
    • భూమి మీద నివసించే అన్ని జీవ జాతులకు (జంతువులు మరియు మొక్కలు) సంబంధించిన కీలకమైన సమాచారం వికీ ద్వారా తెలుగులో లభించాలి.
    • విజ్ఞానశాస్త్రం మానవుని మేధస్సు ద్వారా లభించినది. ఇది పిల్లలలో పెద్దలలో అపోహలు తొలగిపోవడానికి కారణం కావాలి. ఈ విజ్ఞానాన్ని అందరికీ వికీ ద్వారా పంచాలి.
  • తోటి సభ్యులు నుండి మీ కోరికలు
    • తెవికీలో ఎవరైనా ఒకరు చేస్తున్న పనికి మరొకరు తోడ్పడాలి. నిర్మాణాత్మకమైన సలహాలు అందించాలి. తప్పులుచేసిన వారిని దండించడానికి ఇది పాఠశాల కాదు. వారిని సరైన త్రోవలో ఉంచి మనకు తద్వారా తెలుగు భాషాభివృద్ధికి సహాయపడేటట్లుగా సరిదిద్దాలి.
    • తెవికీలోని మీ రచనలకు సరైన మూలాలు తెలియజేయండి. చేర్చిన సమాచారాన్ని నిర్ధారించవలసి వచ్చినప్పుడు చాలా కష్టమౌతుంది.
  • భారత కాలమానం ప్రకారం వికీ పీడియాలో కృషి చేసే రోజు(లు)/సమయం

తెలుగు వికీపీడియాలో 21 జూన్ 2007 లో సభ్యునిగా నమోదు చేసుకున్నాను. అంటే నవంబర్ 2011 నాటికి 4 సంవత్సరాల 5 నెలలుగా వికీలో పనిచేస్తున్నాను. ఒక ప్రత్యేకమైన ప్రణాళిక లేదు. తీరిక సమయం దొరికినప్పుడు రాత్రి/పగలు అన్ని సమయాల్లోనూ రచనలు చేస్తుంటాను.

  • తోటి సభ్యులు సంప్రదించాలనుకుంటే, మీ కిష్టమైన సంప్రదింపు విధం

మొబైల్ లో అయితే సౌకర్యంగా ఉంటుంది. వ్యాసాల గురించి అయితే ఆ వ్యాసం యొక్క చర్చా పేజీ లో చర్చించడం మంచిదని భావిస్తాను. ఈ మెయిల్ ద్వారా కూడా నన్ను చేరవచ్చును.

  • తెవికీ వార్త చదువరులకి సందేశం

తెవికీ వార్త చదువరులు మీ స్పందనలను నిర్వాహకులకు తెలియజేసి వికీపీడియా అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించడానికి తోడ్పడండి. నిర్దిష్టమైన విషయాన్ని గురించి సరైన వ్యక్తిని సంప్రదించండి.

+వ్యాఖ్య చేర్చుఈ కథనాన్ని చర్చించండి

తెలుగు భాషకు,మనభాషలో వికీ విజ్ఞాన సర్వస్వాన్ని తీర్చిదిద్దేందుకు మీరు చేస్తున్న కృషి అపూర్వం.అభినందనీయం.

  • అనేక మైన విశిష్టమైన వ్యాసాలను అందించి తెవికీని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, తోటి సభ్యులు తెవికీ లో విశేషమైన రచనలు చేయడానికి తోడ్పడుతున్న నిర్వాహకులు రాజశేఖర్ గారి కృషికి అభినందనలు. మిమ్మల్ని ప్రతీ సభ్యులు ఆదర్శంగా తీసుకుని తెవికీ లో వ్యాస అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తాను.-- కె.వెంకటరమణ చర్చ 13:50, 21 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారు, తెలుగు భాష అభివృద్ధికి, తెలుగు వికీ అభివృద్ధికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం... అపూర్వం -- ఫజ్లుర్ రహమాన్ నాయక్.