వికీపీడియా:రచ్చబండ (పత్రికా సంబంధాలు)

అడ్డదారి:
WP:VPPR
రచ్చబండ
వార్తలు | పాలసీలు | ప్రతిపాదనలు | సాంకేతికము | ఆలోచనలు | పత్రికా సంబంధాలు | ఇతరత్రా..

పత్రికా సంబంధాలుసవరించు

పవన్ సంతోష్ మరియు నేను వైజాసత్య గారితో హైదరాబాదులో జరిపిన చర్చల అనంతరం ఈ విభాగాన్ని ప్రారంభించాను. సభ్యులు గమనించగలరు.--Rajasekhar1961 (చర్చ) 12:09, 7 ఫిబ్రవరి 2015 (UTC)

వికీపీడియాలో వార్తలకు ముడిసరుకుగా పనికివచ్చే చాలా ఘటనలే జరుగుతున్నాయి. వికీ బయట జరిగే సమావేశాలు వంటివే కాకుండా వికీలో జరిగేవి కూడా భాషాభివృద్ధికి, తెలుగులో విజ్ఞానం అభివృద్ధికి కూడా పనికివస్తూండడంతో తెవికీ వివరాలు చాలావరకూ పత్రికల్లో పడదగ్గవే. తద్వారా తెవికీ ప్రగతి, తెవికీలో పనిచేయగలరన్న విషయం, వికీ నాణ్యత వంటి విషయాలు పాఠకులకు తెలుస్తాయి. కానీ ఈ వివరాలను మనం సరైన పత్రికావిలేకరుల చెంతకు తీసుకుపోవడంలో వెనుకబడివున్నామన్నది నా గమనింపు. ఈ విషయాన్ని 2015 జనవరి 10న హైదరాబాద్‌లో నేనూ, రాజశేఖర్ గారూ వ్యక్తిగతంగా కలిసిన సందర్భంగా చర్చించాము. తెవికీ సముదాయం సభ్యులు విడివిడిగా వివిధ విషయాలపై పత్రికలకు తెలియపరచడానికి అర్హులే అయినా తెవికీ సముదాయాన్ని ప్రతిబింబిస్తూన్న పత్రికా ప్రకటనలు తయారుచేసేందుకు, అందరి అనుమతితో పంపేందుకు చర్చించే వేదికగానూ, తెవికీ గురించి, సముదాయ సభ్యుల గురించి వెలువడ్డ వార్తాపత్రికా కథనాలు వంటివి పొందుపరిచేందుకు ప్రారంభించాము.--పవన్ సంతోష్ (చర్చ) 16:24, 7 ఫిబ్రవరి 2015 (UTC)
చాలాకాలము నుండి దాదాపు నేను వికీకి వచ్చినప్పటి నుండేమో, (నాకు పత్రిక, మీడియా, సినిమా మాధ్యమాల నందు ప్రచారం అంటే మక్కువ కాబోలు) ఈ విషయము మీద చర్చించుతూనే ఉన్నాను. స్పందనలు తెలియజేయగలరు. JVRKPRASAD (చర్చ) 01:46, 8 ఫిబ్రవరి 2015 (UTC)

గౌతమీ గ్రంథాలయంలో అవగాహన కార్యక్రమం పత్రికా ప్రకటనసవరించు

పత్రికా ప్రకటనసవరించు

బుధవారం స్థానిక గౌతమీ గ్రంథాలయం పత్రికా విభాగంలో తెలుగు వికీపీడియా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని వికీమీడియా ఫౌండేషన్ ఐఈగ్రాంటీలు, తెలుగు వికీపీడియా రచయితలు బేసె కాశీవిశ్వనాథ్, సూరంపూడి పవన్ సంతోష్ సంధానకర్తలుగా వ్యవహరించారు. కార్యక్రమాన్ని తెలుగు వికీపీడియా అభివృద్ధికి గాను గ్రంథాలయ పుస్తక జాబితా ప్రాజెక్టులో భాగంగా విశ్వనాథ్ నిర్వహించారు. కార్యక్రమానికి గౌతమీగ్రంథాలయ సంస్థ గ్రంథపాలకులు వెన్నేటి శ్రీసూర్యనారాయణమూర్తి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో విశ్వనాథ్ మాట్లాడుతూ తెలుగు వికీపీడియాలో పుస్తకంలో, వైబ్సైట్లలో, మేగజైన్లలో దొరికే సమాచారాన్ని ఆధారం చేసుకుని ఎవరైనా వ్రాయవచ్చని సూచించారు. ప్రస్తుతం తెవికీ(తెలుగు వికీపీడియా) సభ్యులు వ్యాసాల్లో ఫోటోలు చేర్చాలన్న ప్రయత్నాలు చేస్తున్నారని, ఎవరైనా తాము తీసిన విలువైన ఫోటోలు ఫేస్బుక్ లో మాత్రమే కాకుండా కామన్స్.వికీపీడియా.ఆర్గ్ లో చేర్చాలని విజ్ఞప్తిచేశారు. పవన్ సంతోష్ మాట్లాడుతూ గౌతమీ గ్రంథాలయం ఎన్నోఏళ్ళ నుంచి తెలుగుకు చేస్తున్న సేవలను అంతర్జాల యుగంలో కూడా కొనసాగిస్తోందని కొనియాడారు. వికీపీడియా అంటే ఏమిటి, దాని వల్ల ఉపయోగాలు, తెవికీలో ఎలా రావచ్చు, తెలుగు టైపింగ్ సులభంగా ఎలా చేయవచ్చు, తెవికీలో సమాచారం చేర్చడం వల్ల విద్యార్థులకు ఉపయోగాలు వంటి విషయాలపై అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. కార్యక్రమంలో ఉచితంగా దొరికే తెలుగు సాఫ్ట్వేర్ల వివరాలు, వాడకం, ఎక్సెల్, వర్డ్ వంటి వాటిలో తెలుగును ప్రతివారూ 5 నిమిషాల్లో చేర్చడం అంశాలను కూడా చేసి చూపారు. మధ్యాహ్నం ఔత్సాహికులు, విద్యార్థులకు ఉచితంగా తెలుగులో వ్రాయడం, తెలుగు వికీపీడియాలో వ్యాసాలు అభివృద్ధి చేయడం వంటి అంశాలపై విశ్వనాధ్, పవన్ సంతోష్ శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో సీతంపేట గ్రంథపాలకులు మారిశెట్టి సత్యనారాయణ, ఆర్.వి.ఆర్.ఎస్.ఎస్.శర్మ, తదితర సిబ్బంది, విద్యార్థులు, పుస్తకప్రియులు హాజరయ్యారు.
--విశ్వనాధ్ (చర్చ) 07:26, 18 మార్చి 2015 (UTC)

లక్షపదాలకు చేరిన తెలుగు విక్ష్నరీసవరించు

వికీపీడియన్ల స్వచ్ఛంద కృషితో ఎవరైనా మార్పులు చేర్పులు చేయదగ్గ పద్ధతిలో తయారుచేసిన బహుభాషా స్వేచ్ఛానిఘంటువు తెలుగు విక్ష్నరీ లక్షపదాల మైలురాయిని చేరుకుంది. విక్ష్నరీ అనే పదం వికీ-డిక్ష్నరీ పదాల కలయికగా ఏర్పడింది. వికీ అంటే స్వేచ్ఛా విజ్ఞానాన్ని, ఎవరైనా మార్చదగ్గ మాధ్యమాన్ని సూచించే పదం కాగా దానికి డిక్షనరీ అనే పదాన్ని కలిపి దీన్ని రూపొందించారు. అందరికీ విజ్ఞానం అందాలి-అందరూ విజ్ఞానాన్ని పంచాలి అన్న నినాదంతో సాగుతున్న వికీపీడియాకు ఇది సోదర ప్రాజెక్టు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 96 భాషలలో వున్న ఈ విక్ష్నరీలు అర్థంతో పాటుగా ఉచ్ఛారణ, ఎటిమాలజీ, వ్యాకరణ విభాగాలు, నానార్థాలు వంటి భాషా విభాగాలతో సహా పదాలకు వేర్వేరు పేజీలు తయారుచేసి అభివృద్ధి చేయాలన్న ప్రయత్నంతో ముందుకు సాగుతోంది.

సామాన్యులే మాన్యులై చేస్తున్న కృషిసవరించు

సాధారణంగా డిక్ష్నరీలను తయారుచేయడం భాషావేత్తలో, మహాపండితులో పూనుకోవలసిన పనిగా భావిస్తూంటారు. అతికొద్దిమంది ఉండే ఈ పండితులో, భాషావేత్తలో నిర్మించడం వల్లనే గతంలో తెలుగుభాషకు సమగ్రమైన నిఘంటువుల నిర్మాణం అందని మానిపండుగా మిగిలిపోయింది. ఐతే విక్ష్నరీని మాత్రం స్వచ్ఛందంగా ముందుకువచ్చి భాషాభివృద్ధిని మాత్రమే కాంక్షించే సాధారణమైన వ్యక్తులే నిర్మిస్తున్నారు. దీనిని నిర్మించే క్రమంలో వారు పలు నిఘంటువులను సంప్రదించడం, ఎటిమాలజీని తయారుచేసేందుకు ఆంగ్లవిక్షనరీలో అనుసరిస్తున్న విధానాలను స్వీకరించడం, ఇతర భాషల విక్షనరీలో పనిచేస్తున్న భాషాశాస్త్రవేత్తల సహకారం తీసుకోవడం వంటివి చేస్తూన్నారు. అంతేకాక హైదరాబాద్ నగరానికి చెందిన పాథాలజిస్ట్ డాక్టర్.రాజశేఖర్ విక్ష్నరీని అభివృద్ధి చేసే క్రమంలో తెలుగు భాషావేత్తలను సంప్రదించి మరీ విక్ష్నరీలో కృషిచేశారు. వారిలో ముఖ్యంగా హోసూరు నివాసియైన భాషావేత్త కె.నారాయణ పిళ్ళెను ప్రతి ముఖ్యమైన ప్రయత్నంలోనూ, పదాల ఎటిమాలజీల నిర్ధారణలోనూ, ఇతర వ్యాకరణాది అంశాలలోనూ ఫోన్ ద్వారా సంప్రదించి విక్ష్నరీని సమగ్రం చేస్తున్నారు. నారాయణ పిళ్ళై ఈ ప్రయత్నానికి ఎంతగానో సంతోషించి తమ పూర్తి సహకారాన్ని, రిఫరెన్స్ పుస్తకాల వివరాలని అందించి కృషిలో పరోక్షంగా భాగంపంచుకుంటున్నారు. తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవాల సందర్భంగా తిరుపతిలో వికీపీడియన్ల సమక్షంలో జరిగిన సభకు ఆయన ప్రత్యేకంగా విచ్చేసి వికీపీడియన్లను వ్యక్తిగతంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "తెలుగు భాషా సంబంధమైన విషయాలలో విక్ష్నరీలో కృషిచేస్తున్న రాజశేఖర్ వంటివారు అడిగిన ప్రశ్నలు..... సందేహాలు..... పెద్ద పెద్ద భాషా పండితుల చర్చలలో మాత్రమే ఉటంకించ బడేవని, అటు వంటి ప్రశ్నలు, సందేహాలు..... భాషా పండితులు కాని వీరికి రావడమే వీరు చేస్తున్న కృషి ఎంత పెద్ద ప్రయత్నమో తెలుపుతోందని వీరు చేస్తున్న కృషి చాల గొప్పదని" పేర్కొన్నారు.

విక్ష్నరీ నిర్మాణంలో ముఖ్యులుసవరించు

తెలుగు వికీపీడియాలో విశిష్టమైన కృషి చేస్తున్న భాస్కరనాయుడు (హైదరాబాద్), డా.రాజశేఖర్ (హైదరాబాద్), మాకినేని ప్రదీప్, అర్జునరావు(బెంగళూరు), టి.సుజాత(చెన్నై), జె.వి.ఆర్.కె.ప్రసాద్(విజయవాడ), పాలగిరి రామకృష్ణారెడ్డి(అనపర్తి) వంటీవారే విక్ష్నరీని తీర్చిదిద్దేందుకూ కృషిచేశారు. వేర్వేరు వృత్తులు, వేర్వేరు ప్రాంతాల్లో ఉండే వీరందరూ స్వచ్ఛంద కృషితో ఈ బహుభాషా నిఘంటువును అభివృద్ధి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న ఈ అంతర్జాల నిఘంటువుల కృషిలో తెలుగును కూడా ముందుకుతీసుకువెళ్ళి అంతర్జాతీయంగా తెలుగు పదాలను కూడా ఈ విస్తృతమైన కృషిలో భాగం చేయాలన్న తపన వీరిని నడుపుతోంది. వేర్వేరు వృత్తుల్లో, తమ జీవితాల్లో నిత్యం బిజీగా ఉంటున్నా తమకున్న సమయాన్ని వీలున్నంతవరకూ మిగుల్చుకుని దానిలోనే భాషా సేవ సాగిస్తున్నారు.

పదేళ్ళ కృషిసవరించు

తెలుగు విక్ష్నరీ 2005 సమయంలోనే ప్రారంభమైంది. తొలిదశలో మాకినేని ప్రదీప్, వైజా సత్య, చదువరి ఖాళీపేజీలు ఏర్పాటుచేసి, మూసలు(టెంప్లేట్స్) తయారుచేసి, ప్రాజెక్టు నిర్వహణకు కీలకమైన మౌలిక పాలసీ చర్చలు చేసి పునాదివేశారు. 2007లో ఆగస్ట్-అక్టోబర్ మధ్యకాలంలో మాకినేని ప్రదీప్ బ్రౌణ్య నిఘంటువుని విక్ష్నరీలో చేరుస్తూ చాలా పదాలను మౌలిక స్థితిలో అభివృద్ధి చేశారు. వీటిలో గణనీయమైన సంఖ్యలో ఆంగ్లంలో పర్యాయపదాలు కూడా ఉన్నాయి. ఆంగ్ల పదాలకు తెలుగు వివరణలు చేరుస్తూ కూడా కొన్నిటిని అభివృద్ధి చేశారు. ఇటువంటీ కొన్ని గట్టి కృషి ప్రయత్నాలు ఉన్నా మొదటి ఐదు సంవత్సరాలను నిద్రాణమైన స్థితి అనే చెప్పుకోవచ్చు. 2011 నుంచి తెలుగు విక్ష్నరీలో టి.సుజాత, డా.రాజశేఖర్, పాలగిరి, జె.వి.ఆర్.కె.ప్రసాద్ కృషితో గణనీయమైన స్థితికి అభివృద్ధి చెందింది. వీరి కృషి ఫలితంగా 25వేల పదాలు పైగా చేరాయి. ఐతే ఈ దశలో గణనీయమైన కృషి చేస్తున్న జె.వి.ఆర్.కె.ప్రసాద్ అనారోగ్య స్థితిగతుల దృష్ట్యా ఏడాదిపాటు ఆయా కార్యకలాపాలకు దూరంగా ఉండడంతో కొంత మందకొడి స్థితి ప్రారంభమైంది. సరిగా ఇదే సమయం(2012)లో విక్ష్నరీలో సభ్యత్వం స్వీకరించిన భాస్కరనాయుడు అత్యంత వేగవంతంగా అభివృద్ధి చేయడం ప్రారంభించారు. ఆయన రాజశేఖర్‌ని "తెలుగు విక్ష్నరీ కొద్దిమంది సభ్యులతో నెట్టుకొస్తున్న స్థితిలో ఏం చేస్తే అభివృద్ధి చెందుతుందన్న" చర్చ లేవదీసినారు. రాజశేఖర్ భాస్కరనాయుడుకు తనవద్దవున్న వేయిపుటల ఆంగ్ల-తెలుగు నిఘంటువు అందించి, మౌలికమైన అవగాహన కల్పించగా భాస్కరనాయుడు అత్యంత వేగంగా పేజీలు అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆయన వేలాదిపదాలు చేరుస్తూ పోయారు. ఆ నిఘంటువు పనిని ఆయన ఆరు నెలల కొద్ది వ్యవధిలోనే పూర్తిచేయడం విక్షనరీ వేగం పుంజుకునేలా చేసింది.

సమస్యలు అధిగమిస్తూ..సవరించు

విక్ష్నరీలో పలు సందర్భాల్లో సాంకేతిక, పాలసీ పరమైన సమస్యలు ఎదురైనప్పుడు పలువురు వికీపీడియన్ల చొరవ, చర్చలు, కృషి ఫలితంగా వాటీని పరిష్కరించుకున్నారు. 2013లో విక్ష్నరీలో ఉన్న పదాల కన్నా కొన్ని వేల పదాలు తక్కువగా గణాంకాలు కనిపించడమనే సాంకేతిక సమస్య ఎదురైంది. ఈ విషయాన్ని పరిష్కరించేందుకు సీనియర్ వికీపీడియన్ అర్జున రావు ప్రయత్నించారు. ఒక పేజీలో ఉన్న పదాలకు, వాటీ అర్థాలు తెలిపే పేజీలకు ఉండాల్సిన అంతర్ వికీ లంకెలు లేకపోయిన ప్రతిపేజీని గణాంకాలలో లెక్కించట్లేదన్న సంగతి ఆయన సాంకేతికంగా కొన్ని ప్రయత్నాల ద్వారా కనిపెట్టగలిగారు. దీన్ని నివారించేందుకు విక్ష్నరీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న భాస్కరనాయుడు, రాజశేఖర్ అవిరళంగా శ్రమించి ప్రతిపేజీ తెరచి లంకెలు లేనిపేజీల్లో చేరుస్తూ పోయారు. ఆ విధంగా ఆ సమస్య తీరింది. అలానే విక్ష్నరీలో తొలినుంచీ ఐదుగురే క్రియాశీలక సభ్యులు రాస్తూండడాన్ని గమనించిన భాస్కరనాయుడు విజయవాడలోని తెవికీ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న గుళ్ళపల్లి నాగేశ్వరరావును ప్రోత్సహించి ఆయనకీ విక్ష్నరీలో అవగాహన కల్పించి చేర్చారు. ఆపై గుళ్ళపల్లి నాగేశ్వరరావు విక్ష్నరీలో అత్యధిక మార్పులు చేసిన వ్యక్తులలో ఒకరిగా నిలవడం విశేషం.

ప్రణాళికాయుతమైన అభివృద్ధిసవరించు

విక్ష్నరీలో పనిచేసేది కొద్దిమందే అయినా ఉన్నవారంతా ప్రణాళికాయుతంగా తమ శక్తిసామర్థ్యాలు జాగ్రత్తగా అంచనావేసుకుని ఈ అభివృద్ధి సాధించారు. విక్ష్నరీ సభ్యుల్లో భాస్కరనాయుడు లక్షకు పైగా మార్పులు చేర్పులు చేసి మార్పులు చేర్పుల్లో అగ్రస్థానంలో కొనసాగుతూండగా వారి తర్వాతి స్థానాల్లో జెవిఆర్‌కె ప్రసాద్, రాజశేఖర్, టి.సుజాత, గుళ్ళపల్లి నాగేశ్వరరావు, మాకినేని ప్రదీప్ వంటివారున్నారు. భాస్కరనాయుడు 37,265 కొత్త వ్యాసాలను విక్ష్నరీలో తయారుచేశారు. ఆయన ఈ క్రమంలో తెలుగు విక్ష్నరీకి నిర్వాహకునిగా పనిచేశారు. రోజుకు కొన్ని గంటల సమయాన్ని విక్ష్నరీకే వెచ్చిస్తూ ఆయన విక్ష్నరీ అభివృద్ధికి ఇతోధికంగా సహకరించారు.

తెలుగు నిఘంటువుల్లో లేని ప్రత్యేకతలుసవరించు

సాంకేతిక యుగంలోని అవకాశాలను అందిపుచ్చుకుంటూ తెలుగు విక్ష్నరీ ముద్రిత నిఘంటువులకు లేని కొన్ని ప్రత్యేకతలను సాధిస్తోంది. ఆంగ్ల విక్షనరీ నుండి కొన్ని ప్రామాణికమైన వాటిని ముద్రిత నిఘంటువులలో లేని విశేషాల్ని తెలుగు విక్షనరీలో ప్రారంభించాము, వీటిలో కొన్ని ప్రయత్నాలను డా.రాజశేఖర్ ఇతర భాషల విక్ష్నరీలలో పనిచేస్తున్న భాషావేత్తలతో ఆన్లైన్లో సంప్రదించి, వారి కృషిని తెలుసుకుని ప్రవేశపెట్టారు. వాటిలో కొన్ని

  • తెలుగువారి వ్యక్తిగత మరియు ఇంటి పేర్లు: అలాసడైర్ అనే వికీమీడియన్ చేసిన కృషి స్పూర్తితో స్టీఫెన్ బ్రౌన్ అనే వికీమీడియన్ ప్రోత్సాహంతో తెలుగువారిలో స్త్రీపురుషుల వ్యక్తిగత పేర్లు మరియు ఇంటిపేర్లకు ఒక అనుబంధంగా తెలుగు విక్షనరీలో ప్రారంభించాము. దీనిని అనుబంధం:పేర్లు వద్ద సభ్యులు తిలకించవచ్చును. తెలుగు భాషా పరిశోధనలో పేర్లు గురించిన ఒక విభాగమైన ఒనొమాటోపియా (Onomatopoeia) లో కృషిచేస్తున్న వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
  • విభక్తులు సాధారణంగా నిఘంటువులలో కనిపించవు. కానీ ఒక భాషను నేర్చుకోవాలంటే ఇవి తెలియడం చాలా అవసరం. స్టీఫెన్ బ్రౌన్ ప్రోత్సాహంతో కొన్ని నామవాచకాలు ఎనిమిది విభక్తులలో ఏకవచన మరియు బహువచన ప్రయోగంలో ఎలా మారుతుంటాయి అని తెలుసుకోవచ్చును. ఉదా: రాముడు, కృష్ణుడు
  • క్రియలు వాటి యొక్క క్రియా రూపాలు నిఘంటువులలో కనిపించవు. ఇలా క్రియలు ప్రథమ పురుష, ఉత్తమ పురుష మరియు మధ్యమ పురుషలలో ఏకవచన మరియు బహువచనాలలో, భూత, భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎలా మార్పుచెందునో తెలుసుకోవచ్చును. ఉదా: చేయు
  • అంతర్జాతీయ ఉచ్చారణ సంఘం (International Phonetic Association) ఒక భాషకు చెందిన అక్షరాలను మరియు పదాలను ఎలా పలకాలో నిర్ణయిస్తుంది. దీనికోసం ఆయా అక్షరాలు వ్రాసే విధానం వేరుగా ఉంటుంది. ఆ పద్ధతిలో వ్యాసినట్లయితే తెలుగుభాష రానివారు కూడా ఆ పదాన్ని ఎలా పలకాలో తెలుసుకొనవచ్చును. అంతే కాకుండా బొంబాయిలో నివసిస్తున్న మురళి మరియు శ్రీఫణి దంపతుల సహకారంతో ఒక వెయ్యి పదాలకు ఆడియో ఫైల్స్ తయారుచేసి, వాటిని వికీ కామన్స్ లోని అప్లోడ్ చేసి ఆయా పదాలలో చేర్చాము. ఈ మూల పదాలను ఎవరైనా మీటనొక్కి వినవచ్చును. ఉదా: ఊయల
  • తెలుగు భాషలోని పదాల వ్యుత్పత్తి (Etymology) ఒక ప్రత్యేకమైన పరిశొధనాంశము. తెలుగు భాషా పదాలు ఎక్కువగా సంస్కృతం నుండి ఉద్భవించినా; ప్రస్తుత కాలంలొ చాలా ఆంగ్ల పదాలు తెలుగులో స్థిరపడుతున్నాయి. ఈ దిశగా కొంత ప్రవేశాన్ని కూడా తెలుగు విక్షనరీలో కలిగించాము. ఉదా: అగ్ని, క్షేత్రము. ఈ విధంగా ఒక భాషకు చెందిన పదాలను వాటి మూల భాషా పదాల వరకే కాకుండా వాటి మూల శబ్దాల (Roots) వరకు తీసుకొనిపోవచ్చును.
  • బహువచన శబ్దాలను వాటి ఏకవచన శబ్దాలకు దారిమార్పు పేజీలుగా మార్చకుండా ఆయా శబ్దాలను ఫలానా పదం యొక్క బహువచన రూపం అని వ్రాయడం ద్వారా బహువచన పదాలన్నింటిని ఒకే దగ్గర చేర్చుకొనే అవకాశం కలుగుతుంది. అలాగే తెలుగులో బహువచనాలు రెండు రకాలుగా ఉన్నాయి. ఉదా: ముఖము కు బహువచనం ముఖములు, ముఖాలు మొదలైనవి.
  • బొమ్మలు సామాన్యంగా ఇతర నిఘంటువులలో కనిపించవు. కారణాలు అనేకం. ఇవి పిల్లల పుస్తకాలలో ఎక్కువగా కనిపిస్తాయి. నిఘంటువులోని పదానికి బొమ్మ గనుక ఉంటే సుళువుగా అర్థం అవుతుంది. ఇది బహుభాషా నిఘంటువు గనుక, తెలుగేతరులు చూసినప్పుడు ఆ యా పదాలు సులభముగా అర్థం కావడానికి ఈ బొమ్మలు ఉపకరిస్తాయి. పదానికి సంబంధించిన వివరాలు ఎక్కువగా వ్రాయాల్సిన అవసరం తగ్గుతుంది. ఇప్పటికే సుమారు ఒక వెయ్యి బొమ్మలున్నా కూడా, ఆ దిశగా ఎవరైనా కృషిచేసి తెలుగు విక్షనరీని ఇంకా మెరుగుపరచవచ్చును.

--పవన్ సంతోష్ (చర్చ) 11:44, 8 ఏప్రిల్ 2015 (UTC)

పిఠాపురంలో వికీ పీడియా అవగాహనా కార్యక్రమం పత్రికా ప్రకటనసవరించు

"పిఠాపురం ప్రాంతం గురించి వికీలో రాయాలి"సవరించు

పిఠాపురంలో ఆధ్యాత్మిక ప్రదేశాలకు, చారిత్రిక విశేషాలకు, సాహిత్యచరిత్రలో నిలిచే వ్యక్తులకు కొదవలేదని, కాకుంటే వాటి గురించి స్వేచ్ఛావిజ్ఞాన సర్వస్వమైన తెలుగు వికీపీడియాలో రాస్తే ప్రపంచానికి తెలియజెప్పినవారం అవుతామని వికీమీడియా ఫౌండేషన్ ఐఈగ్రాంటీ, సీనియర్ వికీపీడియన్ బి.కె.విశ్వనాధ్ పేర్కొన్నారు. పిఠాపురంలోని చారిత్రిక ప్రశస్తిపొందిన సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలోని చెలికాని భావనరావు సభాసదనంలో ఆదివారం వికీపీడియా అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమ నిర్వహణా బాధ్యతలు వికీపీడియా స్వచ్ఛంద రచయిత విశ్వనాధ్ వహించారు. పలువురు సాహిత్యాభిమానులు, గ్రంథాలయ పాఠకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వికీపీడియాలో చేరదగ్గ ప్రాధాన్యత కలిగిన ఆలయాలు, మఠాలు, పీఠాలు, సంస్థానం వంటివి పిఠాపురంలో ఉన్నాయని, వీటిలో కొన్నిటికి ఒక్కో విషయానికి ఒక్కో వ్యాసం ఉండదగ్గ అర్హత ఉందన్నారు. పిఠాపురం సంస్థానంలో ఆస్థాన కవులుగా వ్యవహరించి, తిరుపతి వెంకటకవులకే సవాలు విసిరిన వేంకట రామకృష్ణకవులు, రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన మహాకవి ఉమర్ ఆలీషా వంటివారు పిఠాపురం వాస్తవ్యులేనని తెలిపారు. వీరందరి గురించి మరింత సమాచారం వ్రాయాలని, ప్రస్తుతం విద్యార్ధులంతా కంప్యూటర్లు స్మార్ట్ ఫోన్లు వాడుతున్న నేపద్యంలో తెలుగు కంప్యూటర్లలో వ్రాయటం ఎంతో సులభం అని, విద్యార్ధులంతా ఆ దిశగా కృషి చేయాలని చెపుతూ, వికీపీడియా ద్వారా ఉన్న అనేక వేల వ్యాసాల నుండి సమాచారాన్ని ఉపయోగించుకోవాలని, మరిన్ని వ్యాసలను మెరుగుపరచడానికి కంప్యూటర్లలో తెలుగు వ్రాయటం అలవాటు చేసుకోవాలని శ్రోతలను, విద్యార్ధులను ప్రోత్సహించారు. కార్యక్రమంలో భాగంగా పట్టణానికి చెందిన సీనియర్ వికీపీడియన్, రాజాచంద్ర మాట్లాడుతూ తెలుగు వికీపీడియాలో వ్రాయడం ద్వారా ఎవరైనా పంచుకోదగ్గ విలువైన వ్యాసాలను తయారుచేసి తెలుగువారందరికీ కానుకగా సమర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. మన భాషకి, మన సంస్కృతికి విశ్వవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకువచ్చిన కృషిలో భాగమయ్యామన్న తృప్తి దీనివల్ల దక్కిందని తెలిపారు. పట్టణ ప్రముఖులు పత్రి రామకృష్ణ, రెడ్డెం శేషగిరిరావు, కండిపల్లి వెంకటరమణ, గ్రంథాలయ కార్యదర్శి కొండేపూడి శంకరరావు, గ్రంథాలయాధికారి మల్యాల శ్రీనివాస్ కార్యక్రమంలో మాట్లాడారు.

పిఠాపురం సాహిత్యవేత్త ఓలేటి పార్వతీశం వ్యాస సృష్టిసవరించు

ఈ సందర్భంగా నిర్వహించిన తెలుగు వికీపీడియా శిక్షణ కార్యక్రమంలో భాగంగా విశ్వనాథ్, రాజాచంద్ర ఎటువంటి వ్యాసాలు సృష్టించవచ్చో, ఎలాంటి సమాచారం చేర్చాలో పాల్గొన్నవారికి వివరించారు. ఈ సందర్భంగా వికీపీడియాలో ఎవరైనా ఆధారాలు కలిగిన సమాచారం కొద్దిమాత్రమే తెలిసినా చేర్చవచ్చని, చిన్నగా ప్రారంభమైన వ్యాసాలే చినుకు చినుకు చేరి గోదావరిగా మారినట్టు పలువురు వికీపీడియన్లు క్రమంగా చేసిన అభివృద్ధి వల్ల పెద్ద వ్యాసాలుగా పరిపుష్టమవుతాయని వివరించారు. ఈ క్రమంలో పిఠాపురానికి చెందిన జంటకవులు వెంకట పార్వతీశకవుల గురించి మాత్రమే వ్యాసం ఉండడం, విడివిడిగా వారికి వ్యాసాలు లేకపోవడం గమనించి వారిలో ఒకరైన ఓలేటి పార్శతీశం గురించి వ్యాసాన్ని సభ్యునితో ప్రారంభింపజేశారు. వికీపీడియాలో చేర్చిన ఫోటోలకు కాపీహక్కులు ఉండవని, మన చుట్టుపక్కల ఉన్న విశిష్టమైన ప్రదేశాలకు సంబంధించి అటువంటి ఫోటోలు తీసి చేర్చడమూ చాలా విలువైన సేవేనని పేర్కొన్నారు. --పవన్ సంతోష్ (చర్చ) 11:29, 12 ఏప్రిల్ 2015 (UTC)(విశ్వనాథ్ గారు పంపిన వివరాలతో)

ఈనాడు ఆదివారం, బతుకమ్మ సంచిక(నమస్తే తెలంగాణ)లకు స్పందనసవరించు

గమనిక:19 ఏప్రిల్ 2014న వెలువడ్డ ఈనాడు ఆదివారం, నమస్తే తెలంగాణ వారి బతుకమ్మ సంచికల్లో కవర్ స్టోరీ ఈ-బుక్స్ గురించి ప్రస్తావించింది. తెలుగులో ఈ పుస్తకాల విషయంలో జరిగిన శ్రమను ఎంతో ప్రస్తావించి తెవికీసోర్సును గురించి ఏమీ లేకపోవడం కారణంగా ఆరోజు జరిగిన తెలుగు వికీ నెలవారీ సమావేశంలో జరిగిన చర్చలో భాగంగా ఈ అంశంపై వారికి ఒక లేఖ(వచ్చేవారం సంచికలో ప్రచురణ జరిగేలా) పంపాలని నిర్ణయించాము. అందుకు అనుగుణంగా పంపేందుకు ఈ క్రింది టెక్స్ట్ తయారుచేస్తున్నాం

గత ఆదివారం సంచిక కవర్ స్టోరీ ఈ-బుక్స్ మీద రాయడం బావుంది. పైగా గతవారం అంతర్జాతీయ పుస్తక దినోత్సవం జరగడం కూడా మీరు వేసిన వ్యాసానికి మంచి విలువ తెచ్చిపెట్టింది. ప్రింటు పుస్తకాల విలువను తెలియజెప్తూనే ఈ-పుస్తకాల గురించి కూడా చాలా సమన్వయంతో రాశారు. అయితే భవిష్యత్తులో అంతర్జాలం అభివృద్ధి చెందుతూండడంతో ఈ-బుక్స్ అవసరం మరింత పెరగుతుందని చెప్పవచ్చు. ఇక తెలుగు ఈ-పుస్తకాల విషయంలో జరుగుతున్న కృషిని, పలు ఈ-గ్రంథాలయాల వివరాలను చెప్పేప్పుడు తెలుగు వికీసోర్సు కృషిని కనీసం ప్రస్తావించి అయినా ఉండాల్సింది. 9,896 తెలుగు యూనీకోడ్ పాఠ్యపుపేజీలు, 20 అమోదించబడిన, 1 దిద్దబడిన, 29 టైపు పూర్తయిన మరియు 99 టైపు చేయబడుచున్న పుస్తకాలతో ఎవరైనా అభివృద్ధిపరచగల స్వేచ్ఛానకలు హక్కులున్నరచనలుగల ఇ-గ్రంథాలయంగా తెలుగు వికీసోర్సు నిలుస్తోంది. భారత డిజిటల్ లైబ్రరీ, ఆర్కైవ్స్.ఆర్గ్ మొదలుకొని మీరు ప్రస్తావించిన వాటిలో అత్యధికం కేవలం పీడీఎఫ్ లేదా జెపిజి ఫార్మాట్లో పుస్తకాలను అందిస్తాయి. వాటిలోని సమాచారాన్ని నెట్‌లో టైపింగ్ ద్వారా వెతకడం చాలా కష్టమయిన పని, కానీ వికీసోర్సు మాత్రం ఏ సెర్చింజన్ ద్వారానైనా వెతకగల యూనీకోడ్ పాఠ్యం రూపొందించేందుకు కూడా కృషి చేస్తోంది. పైగా కొన్ని గ్రంథాలయాల్లా కాక కేవలం కాపీహక్కులు లేని పుస్తకాలను మాత్రమే వినియోగదారులు అన్నివిధాలుగానూ వాడుకోగలగిన విధమైన పుస్తకాలే ఉంటాయి. ఈ గ్రంథాలయాన్ని స్వచ్ఛంద కృషి చేసే వికీమీడియన్ల ద్వారా రూపొందించారు. ఇన్ని ప్రత్యేకతలున్న వికీసోర్సును గురించి వివరించివుంటే వ్యాసానికి మరింత నిండుతనం లభించేది. ఏదేమైనా చాలా చక్కని ప్రయత్నం చేసినందుకు అభినందనలు.--పవన్ సంతోష్ (చర్చ) 09:12, 20 ఏప్రిల్ 2015 (UTC)

పవన్ సంతోష్ గారు. పత్రికా సంభదాలు గురించి శ్రద్దగా రాస్తున్నందుకు కృతజ్నతలు..పైన పేర్కొన్న దానిలో మరొకటి చేర్చాలని నా యొక్క, వాడుకరి:Rajasekhar1961 గారి యొక్క అభిప్రాయం - వికీసోర్స్ యొక్క గణాంకాలు, యునీకోడ్ పూర్తి కాబడిన పేజీలు, ఇప్పటికే చేర్చబడిన పిడిఎఫ్ పేజీలు ఎన్ని అనేవాటిని కూడా చేర్చాలనేది. దీనిపై సభ్యులు స్పందిస్తే, మార్పులు చేయవచ్చు...--విశ్వనాధ్ (చర్చ) 14:36, 20 ఏప్రిల్ 2015 (UTC)
విశ్వనాధ్ గారూ మీరన్న గణాంకాలు చేర్చాను.--పవన్ సంతోష్ (చర్చ) 08:15, 22 ఏప్రిల్ 2015 (UTC)

నగరంలోని మ్యూజియం కళాఖండాలను డిజిటల్ గా భద్రపరుస్తూ తెలుగు వికీపీడియా దినోత్సవ సంబరాలుసవరించు

హైదరాబాద్: ఆదివారం తెలుగు భాషా వికీపీడియన్లు నగరంలోని పబ్లిక్ గార్డెన్సులోని డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాష్ట్ర ఆర్కియాలజీ మ్యూజియంలో విశిష్టమైన ఫోటో వాక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సచేతనంగా కృషిచేస్తున్న 45మందితో సహా 900కి పైగా స్వచ్ఛంద రచయితలు (తెవికీ భాషలో వాడుకరులు) కృషితో రూపుదిద్దుకున్న 62,500 వ్యాసాల తెలుగు స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం - తెలుగు వికీపీడియా. ప్రస్తుత విశిష్టమైన ఫోటో వాక్ కార్యక్రమం తెలుగు వికీపీడియా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు తెవికీ క్రియాశీల వాడుకరి (తెవికీపీడియన్ లేదా తెవికీ రచయిత), నాటకరంగ పరిశోధక విద్యార్థి వంగరి ప్రణయ్ రాజ్ కృషిచేస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొనేవారు గైడెడ్ టూర్ (పర్యటన)లో మ్యూజియంలో ప్రదర్శించిన కళాఖండాలు, చారిత్రిక వస్తువులు, ఆ ప్రాంతంలోని ముఖ్యమైన బిల్డింగులు, చారిత్రిక వ్యక్తుల విగ్రహాలు వంటివి ఫోటోలు తీస్తారు. ఆపైన ఫోటోలను సరైన వివరణలు పెడుతూ వికీపీడియా సోదర ప్రాజెక్టు అయిన వికీమీడియా కామన్స్(commons.wikimedia.org)లో చేరుస్తారు. తద్వారా మరింతమంది మ్యూజియంలోని కళాఖండాల గురించి వికీపీడియాలో వ్యాసాలు రాసేందుకు వీలుచిక్కుతుంది. ఈ కార్యక్రమం గురించి ప్రణయ్ రాజ్, "కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరికీ ప్రవేశం ఉంటుంది. పాల్గొనదలచినవారు te.wikipedia.orgలో "వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా దినోత్సవం 2015 - తెవికీలోకి చారిత్రిక ఛాయాచిత్రాలు" అన్న పేజీలో సంతకం చేసి కానీ, నేరుగా కానీ రావచ్చు. పాల్గొనేవారు మన సుసంపన్నమైన చరిత్రకు చెందిన ఫోటోలు తీసుకోవడం మాత్రమే కాకుండా మన నగరం, భాష, సాంస్కృతిక సంపద గురించిన సమాచారాన్ని వికీపీడియా, వికీమీడియా ప్రాజెక్టులు ఉపయోగించి ఎలా అభివృద్ధి చేయవచ్చో తెలుసుకుంటారు" అని పేర్కొన్నారు. బహుళ సంస్కృతుల సమాహారమైన, అత్యంత ముఖ్యమైన హైదరాబాద్ నగరంలో వివిధ ప్రదేశాల గురించి అంతర్జాలంలో దొరుకుతున్న సమాచారం ఇప్పటికీ తక్కువే ఉందని తెలిపారు. తనలాంటి పలువురు అంతర్జాలంలో తెలుగులో రాసేందుకు, సమాచారం అభివృద్ధి చేసేందుకు ఎవరైనా స్వేచ్ఛగా వినియోగించుకుని, రాయదగ్గ తెలుగు వికీపీడియాను ప్లాట్ ఫాంగా ఎంచుకుని https://te.wikipedia.org వద్ద రాస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ కు సంబంధించి దొరుకుతున్న 89వేల ఛాయాచిత్రాల్లో 89 మాత్రమే మంచి నాణ్యత కలిగి అందరికీ అందుబాటులో ఉన్నాయని వాపోయారు. వికీపీడియా వ్యాసాలు విజ్ఞాన సర్వస్వ తరహావి కావడంతో విద్యార్థులకు, పరిశోధకులకు, ఔత్సాహికులకు, ఇతర పాఠకులకు ఉపకరించే ఎంతో వాస్తవ సమాచారం అందులో దొరుకుతోందని ప్రణయ్ తెలిపారు.--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 14:23, 11 డిసెంబరు 2015 (UTC)

జాతీయ స్థాయి పోటీలో తెలుగు వికీపీడియా ఘన విజయంసవరించు

పంజాబ్ ప్రాంతం గురించి వ్యాసాలు సృష్టించడంపై జరిగిన దేశవ్యాప్త పోటీలో తెలుగు వికీపీడియా సముదాయ పరంగా గొప్ప విజయం సాధించింది. గత వారంలో సాగిన మూడు రోజుల వికీకాన్ఫరెన్స్ ఇండియా ముగింపు ఉత్సవంలో వికీమీడియా ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్ అసఫ్ బార్టోవ్ చేతుల మీదుగా తెలుగు వికీపీడియన్లు ట్రోఫీని అందుకున్నారు. తెలుగులో దాదాపుగా 450 పైగా వ్యాసాలు సృష్టించి, విస్తరించడంతో ఇంగ్లీష్, మలయాళంతో పాటుగా సంయుక్తంగా బహుమతిని పంచుకుంది.

ప్రస్తుత పంజాబ్ రాష్ట్రం, పంజాబ్ ప్రావిన్సు, హిమాచల్ ప్రదేశ్ లో కొంతభాగం, హర్యానా మొత్తం కలిపిన విస్తృతమైన పంజాబ్ ప్రాంతం, సంస్కృతి, చరిత్ర, ఆహారం, వ్యక్తులు, ప్రదేశాలు వంటి అనేక విషయాల గురించి వ్యాసాలు సృష్టించడం, విస్తరించడంపై ఈ పోటీ పలు భాషా వికీపీడియాల మధ్య జరిగింది. పదికి పైగా వికీపీడియాలు పాల్గొన్న ఈ ఎడిటథాన్(వ్యాసాల్లో సమాచారం చేర్పు కొందరు వికీపీడియన్లు చేస్తూ పోతే ఎడిటథాన్ గా వ్యవహరిస్తారు) నెల రోజులకు పైగా సాగింది. దీనిలో తెలుగు వికీపీడియన్లు అత్యంత ఆసక్తితో, సమిష్టి కృషితో పాల్గొన్నారు. ఈ పోటీని తెలుగు వికీపీడియాలో ప్రణయ్ రాజ్ వంగరి, పవన్ సంతోష్ కలసి సమన్వయకర్తలుగా వ్యవహరించగా, నిర్వహణలో విశ్వనాథ్.బి.కె. సహకరించారు. పంజాబ్ అంశంపై వ్యాసాలు రాసి తెలుగు వికీపీడియాకు ఘన విజయం చేకూర్చినవారిలో వెంకటరమణ, మీనా గాయత్రి, రవిచంద్ర, పవన్ సంతోష్, మురళీ మోహన్, సుజాత, సుల్తాన్ ఖాదర్, విశ్వనాథ్, భాస్కర నాయుడు, ప్రణయ్ రాజ్, రామకృష్ణారెడ్డి, మణికంఠ, రహ్మానుద్దీన్, రాజశేఖర్ మొదలైన వికీపీడియన్లు ఉన్నారు. పంజాబీ భాష, సిక్ఖు మత చరిత్ర, పంజాబీ ఆహారం, పంజాబీ దుస్తులు, పంజాబీ పండుగలు, పంజాబి కవులు, పంజాబీ మాండలీకాలు మొదలైన అంశాలపై చక్కని వ్యాసాలను వికీపీడియన్లు మంచి మూలాలు, బొమ్మలతో సృష్టించారు. ఈ ఎడిటథాన్ గురించి పలువురు వికీపీడియన్లు మాట్లాడుతూ సమిష్టిగా తెలుగు వికీపీడియా సాధించిన ఈ విజయం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ఉత్సాహం అందిస్తుందని అభిప్రాయపడ్డారు.

(ప్రణయ్ రాజ్ వంటి పలువురు వికీపీడియన్లను స్థానిక వార్తాపత్రికల వారు పంజాబ్ ఎడిటథాన్ లో తెవికీ విజయం గురించి రాయమని అడుగుతూ ఉండడంతో వారికి పంచేందుకు నమూనా పత్రికా ప్రకటన ఆయన కోరికపై తయారుచేశాను. ఎవరైనా మార్పులు చేర్పులు సూచించవచ్చు, అనౌచిత్యాలు ఉంటే సవరించవచ్చు. అలానే కొన్ని పడికట్టు పదాలు పత్రికా రచనలో తప్పనిసరి అని గమనించగలరు. వికీపీడియన్లు దీన్ని స్థానిక పత్రికలకు ఇవ్వదలుచుకుంటే ఆ జిల్లాలోని వికీపీడియన్లు కేంద్రంగా ఇవ్వగలరు. ఉదాహరణకు: ఈ విజయంలో జిల్లాకు చెందిన ××××, yyyy కృషి చేయడం విశేషం. వంటివి. ఎందుకంటే స్థానికత మన తెలుగు పత్రికల విషయంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది--పవన్ సంతోష్ (చర్చ) 08:00, 9 ఆగష్టు 2016 (UTC))

ధన్యవాదాలు పవన్ సంతోష్ గారు.--Pranayraj1985 (చర్చ) 08:50, 9 ఆగష్టు 2016 (UTC)
పవన్ సంతోష్గారికి చాలా బాగా రాసారు. ఇది తెలుగు వికీపీడియా సముదాయ సభ్యుల విజయం కనుక వారి కృషి కొరకు చేస్తున్న ప్రకటన, దీనిని తెలుగు సముదాయానికి మాత్రమే పరిమితం చేయ ప్రార్ధన. తెలుగు బాషను ఉన్నతంగా ఎత్తి చూపే ఏ కార్యాలైనా వాటికి తగిన గుర్తింఫు రావాలి, అలాంటి ప్రయత్నాలు చెయ్యాలి అని నా అభిప్రాయం. --Viswanadh (చర్చ) 09:25, 9 ఆగష్టు 2016 (UTC)

ఆదివారం తెలుగు వికీపీడియా దినోత్సవం - వికీపీడియన్లకు సాంకేతిక శిక్షణసవరించు

డిసెంబరు రెండవ ఆదివారం తెలుగు వికీపీడియా దినోత్సవం సందర్భంగా స్థానిక అబిడ్స్ లోని గోల్డెన్ థ్రెషోల్డ్ లో వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా డిసెంబరు 10, 11 తేదీల్లో వికీపీడియన్లకు, వికీపీడియా ఔత్సాహికులకు వికీపీడియాకు సంబంధించిన పలు సాంకేతిక అంశాలు, కార్యక్రమ నిర్వహణ సామర్థ్యాలు వంటివాటిలో శిక్షణనిస్తారని సీఐఎస్-ఎ2కె ప్రతినిధి పవన్ సంతోష్ తెలియజేశారు. కార్యక్రమానికి ప్రముఖ ఆంగ్ల వికీపీడియన్, సీఐఎస్-ఎ2కె సంస్థ ఉద్యోగి టిటో దత్తా హాజరై శిక్షణ నిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరుకాదలిచినవారు pavansanthosh.s@gmail.com మెయిల్ కు సంప్రదించాలని సూచించారు. 11వ తేదీ సాయంత్రం హైదరాబాద్ వికీపీడియా నెలవారీ సమావేశంలో వేడుకలు, భవిష్యత్ కార్యకలాపాలపై చిరు సమీక్ష, వందరోజులు-వంద వ్యాసాలు ఛాలెంజ్ లో విజయవంతంగా సాధించిన తెలుగు వికీపీడియన్లకు చిరుసత్కారం వంటివి ఉంటాయని పేర్కొన్నారు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:02, 7 డిసెంబరు 2016 (UTC)

వికీపీడియా కార్యక్రమాల నిర్వహణపై, వికీపీడియా రచనకు ఉపకరణాలపై అవగాహనసవరించు

వికీపీడియాను అభివృద్ధి చేసేందుకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన నాయకత్వ శిక్షణ, వికీపీడియాలో పనికివచ్చే ఉపకరణాల గురించి శిక్షణ వంటివి వికీపీడియన్లకు అందించారు. అబిడ్స్ గోల్డెన్ థ్రెషోల్డ్ శనివారం ప్రారంభమైన రెండు రోజుల మినీ మీడియా వికీ ట్రైనర్, ట్రైన్ ద ట్రైనర్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆంగ్ల వికీపీడియన్ టిటో దత్తా మాట్లాడుతూ తెలుగు వికీపీడియాను అభివృద్ధి చేయడం ద్వారా తెలుగును అభివృద్ధి చేయవచ్చనీ వివరించారు. వికీపీడియాను అభివృద్ధి చేయడానికి కళాశాలల్లో కార్యశాల, ఫోటోవాక్, ఎడిట్-అ-థాన్ తదితర కార్యక్రమాలు నిర్వహించవచ్చని వివరించారు. చరిత్రకారుడు, రచయిత, తెలుగు వికీపీడియన్ కట్టా శ్రీనివాసరావు మాట్లాడుతూ గోల్కొండ వంటి ప్రదేశాల్లో కూడా ప్రజలకు తెలియని చారిత్రక, సాంకేతిక ప్రదేశాలు, అంశాలు ఉన్నాయని, వాటిని ఫోటోలు తీసి వికీమీడియా కామన్స్ లో చేర్చవచ్చని తెలిపారు. కార్యక్రమాన్ని సీఐఎస్-ఎ2కె ప్రతినిధి పవన్ సంతోష్, వికీపీడియన్ ప్రణయ్ రాజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వికీపీడియన్లు కశ్యప్, మీనా గాయత్రి, మౌర్య, నాగేశ్వరరావు వంటివారితో పాటు కొత్తగా వికీపీడియాలో చేరినవారూ పాల్గొన్నారు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 09:41, 10 డిసెంబరు 2016 (UTC)

తెలుగు వికీపీడియన్లు సృష్టిస్తున్నది విజ్ఞాన విప్లవంసవరించు

తెలుగు వికీపీడియన్లు తెలుగులో విజ్ఞాన విప్లవం సృష్టిస్తున్నారని పవన్ సంతోష్ పేర్కొన్నారు. తెలుగు సాహిత్యం, విజ్ఞానం అన్న రంగాల విషయంలో ప్రస్తుతం తెలుగు వికీపీడియా, వికీసోర్సు, వికీడేటా వంటి ప్రాజెక్టులు కలిసి తెలుగులో విజ్ఞానాన్ని అందరికీ అందజేసేలా కృషిచేస్తోందని వివరించారు. తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల్లో చేస్తున్న కృషి మరింత మందికి విజ్ఞానాన్ని అందజేసే విషయంలోనూ, తెలుగు భాషా వ్యాప్తి విషయంలోనూ గొప్ప ఒరవడి సృష్టిస్తుందని, భవిష్యత్తులో లక్షలాది మంది తెలుగు వికీపీడియా ద్వారా విజ్ఞాన వ్యాప్తికి కృషిచేస్తారని ఆయన పేర్కొన్నారు. ఆదివారం తెలుగు వికీపీడియా దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకల్లో ఆయన ఈమేరకు మాట్లాడారు. కొమర్రాజు లక్ష్మణరావు, గిడుగు రామ్మూర్తి వంటి మహనీయులు తెలుగు భాష చరిత్రను మలుపుతిప్పినప్పుడు వారి గురించి తెలియనట్టే ప్రస్తుతం జరుగుతున్న ఈ విప్లవాన్ని తొలినాళ్ళలో ఎవరూ గుర్తించలేదని ఆయన గుర్తుచేశారు. తెలుగు వికీపీడియాలో వందరోజులు వంద వికీపీడియా వ్యాసాలు రాసి 100వికీడేస్ ఛాలెంజ్ విజయవంతంగా పూర్తిచేసిన ప్రణయ్ రాజ్, మీనా గాయత్రిలకు జ్ఞాపిక అందజేశారు. 100వికీడేస్ ను సూచించే కేక్ కోశారు. గత సంవత్సరం తెలుగు వికీపీడియా సాధించిన పంజాబ్ ఎడిటథాన్ విజయాన్ని గురించి వివరించారు. కార్యక్రమానికి ముందు తెలుగు వికీపీడియన్లకు సాంకేతిక ఉపకరణాల గురించి నేర్పించే మినీ మీడియా వికీ ట్రైనర్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా రహ్మానుద్దీన్, టిటో దత్తా, పవన్ సంతోష్ వికీపీడియన్లకు పలు ఉపకరణాల గురించి, సాంకేతిక అంశాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వికీపీడియన్లు విశ్వనాథ్, భాస్కరనాయుడు, కశ్యప్, గుళ్ళపల్లి నాగేశ్వరరావు, విజయవాడ ఆంధ్ర లొయోలా కళాశాల నుంచి విద్యార్థి వికీపీడియన్లు, తదితరులు పాల్గొన్నారు. --పవన్ సంతోష్ (చర్చ) 12:48, 11 డిసెంబరు 2016 (UTC)

కాపీలెఫ్ట్‌లో నేరుగా విడుదల అవుతున్న తొలి తెలుగు ప్రింట్ పుస్తకంసవరించు

కోడిహళ్ళి మురళీమోహన్ (స్వరలాసిక) రాసిన ఆంధ్రసాహిత్యములో బిరుదనామములు అన్న ప్రింట్ పుస్తకం ప్రచురణ జరుగుతూనే అన్ని హక్కులూ రచయితవే అన్న లైసెన్సుతో కాక ఎవరైనా తిరిగి ఉపయోగించుకోగల స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేస్తున్నారు. ఈ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం గుంటూరు అన్నమయ్య గ్రంథాలయంలో ఫిబ్రవరి 5న (ఆదివారం) ఉదయం 10.30కి జరుగుతుంది. కార్యక్రమంలో భాగంగా తమ రచనలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఆశిస్తూండి, అందుకు వ్యయప్రయాసలతో ప్రయత్నించి మరోమారు ముద్రించుకునే వీలు లేక సాహిత్యపరులు, చదవ దలచిన పుస్తకం పై కారణంగా ప్రింట్‌లో అందుబాటులో లేక పాఠకులు ఇబ్బందులు పడడం అన్న సమస్యకు ఒక ప్రత్యామ్నాయాన్ని కాపీహక్కులు, డిజిటైజేషన్ వంటి అంశాల్లో నైపుణ్యం కలిగిన వక్తలు తెలియజేనున్నారు. స్వేచ్ఛా నకలు హక్కుల గురించి ప్రచారం చేయడానికి ఉద్దేశించిన జాతీయ స్థాయి ఫ్రీడం ఇన్ ఫెబ్ అన్న కాంపైన్‌లో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. కార్యక్రమంలో భాగంగా గతంలో ప్రచురణ అయిన తమ పుస్తకాలను తిరిగి స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేసిన కవి, సంగీత వేత్త భూసురపల్లి వెంకటేశ్వర్లు, ఎవరైనా తిరిగి వాడుకోగల విధంగా తాము టైప్‌ చేసిన అన్నమయ్య సంకీర్తనలు మొత్తాన్ని విడుదల చేసిన అన్నమయ్య గ్రంథాలయం ప్రతినిధి పెద్ది సాంబశివరావు వంటి సాహిత్యవేత్తలకు సత్కారం జరుగుతుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సాహిత్యకారులు సోమేపల్లి వెంకట సుబ్బారావు, రావి రంగారావు హాజరుకానున్నారు. ఆసక్తి కలిగిన కవి, రచయితలు, సాహిత్యవేత్తలు, పాఠకులు కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా మనవి. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:59, 31 జనవరి 2017 (UTC)

ఫిబ్రవరి 8న విజయవాడలో పుస్తకానికి రెక్కలు - స్వేచ్ఛా నకలు హక్కులు కార్యక్రమంసవరించు

తెలుగు సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి స్వేచ్ఛా నకలు హక్కులు ప్రస్తుత సాహిత్యం ఉన్న పరిస్థితిలో అవగాహన కల్పించే పుస్తకానికి రెక్కలు - స్వేచ్ఛా నకలు హక్కులు అన్న కార్యక్రమం బుధవారం (ఫిబ్రవరి 8) మధ్యాహ్నం 3 గంటల నుంచి విజయవాడ ఆంధ్ర లొయోలా కళాశాలలో జరగనుంది. కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఆంధ్రప్రదేశ్‌ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, భాషోద్యమకారుడు సామల రమేష్‌ బాబు, సాహిత్యవేత్త సినారె శతకం గుమ్మా సాంబశివరావు పాల్గొంటారు. కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే స్వేచ్ఛా నకలు హక్కుల్లో అనేక రచనలు విడుదల చేసిన రచయితలు పూదోట జోజయ్య, కానూరి బదరీనాథ్‌, జోబ్ సుదర్శన్‌లకు సత్కారం జరుగుతుంది. పుస్తకాలను స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేసి, డిజిటైజ్ చేయడం అన్నది రచయితలు తమ మౌలిక ఆశయాన్ని సాధించేందుకు ఒక సాధనంగా ఎలా ఉపయోగించుకోవచ్చన్న అంశంపై సీఐఎస్-ఎ2కె ప్రతినిధి, కొమర్రాజు లక్ష్మణరావు విశిష్ట వికీపీడియన్ అవార్డు గ్రహీత సూరంపూడి పవన్ సంతోష్‌ ప్రసంగిస్తారు. అంతర్జాలంలోని స్వేచ్ఛా గ్రంథాలయం తెలుగు వికీసోర్సులో వేలాది పేజీలను, పదుల కొద్దీ పుస్తకాలను డిజిటైజ్ చేయడంలో, ప్రూఫ్‌ రీడ్ చేయడంలో కృషిచేసిన విద్యార్థి వికీపీడియన్లకు ధ్రువపత్రాలు అందజేస్తారు. కార్యక్రమంలో పలువురు రచయితలు తమ సాహిత్యాన్ని స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేస్తున్నారు. కార్యక్రమాన్ని సీఐఎస్-ఎ2కె (బెంగళూరు), ఆంధ్ర లొయోలా కళాశాల సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 15:09, 6 ఫిబ్రవరి 2017 (UTC)

హైదరాబాద్ లో 2017 సెప్టెంబర్ 7న అసఫ్ బార్టోవ్ పత్రికా సమావేశంసవరించు

వికీపీడియా సహా అనేక స్వచ్చంద స్వేచ్చా విజ్ఞాన ప్రాజెక్టులను విస్తరించేందుకు కృషిచేస్తున్న వికీమీడియా ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అసఫ్ బార్టోవ్ రేపు సాయంత్రం 5 గంటలకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్2లోని ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బాంక్ వద్ద మీడియా ప్రతినిధులతో పత్రికా సమావేశంలో మాట్లాడనున్నారు. కంప్యూటర్లు, మనుషులు చడవగలిగే వికీ సెంట్రల్ రిపాజిటరీ వికీడేటా ప్రాజెక్టు గురించి వికీపీడియన్లకి శిక్షణను ఇచ్చేందుకు భారతదేశంలో ఏడు నగరాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం, గురువారం హైదరాబాద్ లో వికీపీడియన్లకు వికీడేటా కార్యశాల నిర్వహించారు. సెప్టెంబర్ 7 సాయంత్రం 5 గంటల నుంచి సాగే ఈ పత్రికా సమావేశంలో వికీపీడియాల వ్యాప్తి, వికీమీడియా సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు, స్థానికంగానూ, అంతర్జాతీయంగానూ వికీపీడియాల్లో జరుగుతున్న కృషి వంటి విషయాలు, విలేకరులు అడిగే ప్రశ్నలపైనా స్పందిస్తారు. కార్యక్రమానికి మీ సంస్థ నుంచి ప్రతినిధిని ఆహ్వానిస్తున్నాము. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 14:08, 6 సెప్టెంబరు 2017 (UTC)

మీ ఊరి ఫోటో తీసి తెలుగు వికీపీడియాకు అందించండిసవరించు

తెలుగు వికీపీడియాలో సాహిత్యం, కళలు, నాటకం, సంస్కృతి, పలువురు ప్రముఖులు వంటి అంశాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు అన్ని గ్రామాల గురించి వ్యాసాలున్నాయని, ఈ వ్యాసాల్లో చేర్చేందుకు మీమీ ఊళ్ళలో ఆలయమో, కొలనో, పర్యాటక ప్రదేశమో, ప్రధాన వీధో, ప్రభుత్వ కార్యాలయమో, బడో, ఏదోక దాన్ని స్వయంగా ఫోటో తీసి commons.wikimedia.org అన్న వెబ్సైట్‌లో చేర్చమని వికీమీడియా ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్, వికీపీడియన్ అసఫ్‌ బార్టోవ్ పిలుపునిచ్చారు. కనీస సమాచారంతో ఉన్న ఈ గ్రామ వ్యాసాలను తెలుగు వికీపీడియన్లు, 2011, 2001 నాటి ప్రభుత్వ జనగణన (సెన్సెస్) సమాచారం సహా పలు మూలాలు ఉపయోగించి విస్తరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 299 భాషల్లోనూ, 23 భారతీయ భాషల్లోనూ వికీపీడియాలు ఉన్నాయని, వీటితోపాటు కామన్స్, విక్ష్నరీ, వికీసోర్సు వంటి సోదర ప్రాజెక్టుల అభివృద్ధి కోసం, నిర్వహణ కోసం వికీమీడియా ఫౌండేషన్ అంతర్జాతీయంగా కృషిచేస్తోందని పేర్కొన్నారు. భారతదేశ వ్యాప్తంగా కేరళ నుంచి పంజాబ్ వరకూ వివిధ ప్రదేశాల్లో వికీపీడియన్లకు సమాచార భాండాగారంగా వృద్ధి చెందుతున్న వికీడేటా మీద, సాంకేతికాంశాల మీద శిక్షణను ఇచ్చేందుకు అసఫ్‌ బార్టోవ్ ఆగస్టు 30 నుంచి దాదాపు మూడువారాల పాటు పర్యటిస్తున్నారు. దేశంలో ఎంచుకున్న 7 నగరాల్లో హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ ట్రస్టు బ్లడ్ బ్యాంక్ వేదికగా సెప్టెంబర్ 6, 7 తేదీల్లో స్థానిక వికీపీడియన్లకు వికీడేటా, సాంకేతిక శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆయన, ఇతర వికీపీడియన్లు పత్రికా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు వికీపీడియా నిర్వాహకుడు, సీఐఎస్-ఎ2కె సంస్థ ప్రతినిధి సూరంపూడి పవన్ సంతోష్‌ మాట్లాడుతూ తెలుగు భాష కోసం తమ వంతుగా ఏదో ఒకటి చేయాలని భావించేవారు, ఇప్పటికే ఫేస్‌బుక్‌లోనూ, వాట్సాప్‌లోనూ తెలుగు సమాచారం తోటివారితో పంచుకుంటున్నవారు తెలుగు వికీపీడియాలో కొద్ది కొద్దిగా కృషిచేయడం వల్ల భాషకి మరింత మేలుచేసినవారు అవుతారన్నారు. తెలుగు వికీపీడియా నిర్వాహకుడు, తెలుగు వికీసోర్సు అధికారి, ఎన్టీఆర్ ట్రస్టు భాషా, కళలు, సాంస్కృతిక శాఖాధిపతి రహ్మానుద్దీన్ షేక్ మాట్లాడుతూ వికీపీడియా కోసం గ్రామాల ఫోటోలు పంచుకునేప్పుడు తప్పనిసరిగా తమ స్వంత ఫోటోలనే వినియోగించాలని, అంతర్జాలంలో ఎక్కడో దొరికిన ఫోటోలతో చేయరాదని సూచించారు. తెలుగు వికీపీడియాలో ఖాతా సృష్టించుకుని పనిచేయడం చాలా సులభమని, ఇతర వికీపీడియన్ల సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. తెలుగు వికీపీడియాలో రోజుకొక వ్యాసం చొప్పున సంవత్సరం పాటు ఒక్కో వ్యాసం చేస్తూ 365 వ్యాసాలను రోజు తప్పకుండా రాసిన వికీపీడియన్ ప్రణయ్ రాజ్‌ను సముదాయ సభ్యులు అభినందించారు. ఇది ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి వికీ ఇయర్ అని పలువురు పేర్కొన్నారు. మొదట తనకు తానే 100 రోజుల పాటు రోజుకో వ్యాసం రాసే నియమాన్ని పెట్టుకుని పూర్తిచేసి, తర్వాత దాన్ని కొనసాగించారు. ఆయన 365రోజుల పాటు రోజుకో వ్యాసం రాసే ప్రయత్నం ఈరోజుతో 365 రోజుకు చేరుకోగా, ప్రణయ్ తాను ఇంతటితో ఆపనని ఈ యజ్ఞాన్ని 500 రోజులకు, వీలైతే వెయ్యిరోజులకు కొనసాగిస్తానని చెప్పారు. ప్రణయ్‌ రాజ్ ఈ క్రమంలో 100 రోజల పాటు కేవలం మహిళల గురించి, మహిళలపై వ్యాసాలు, మరో 100 రోజుల పాటు ప్రత్యేకించి తెలంగాణకు సంబంధించిన వ్యాసాలు సృష్టించి విస్తరించారు. 365 రోజున ఆయన తెలంగాణ సంస్కృతి గురించి వ్యాసాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా ఆయనతో సముదాయ సభ్యులు కేక్ కోయించి, వేడుక చేశారు. అసఫ్‌ మాట్లాడుతూ ఆయన పెళ్ళి జరిగిన రోజున కూడా వికీపీడియాలో వ్యాసం రాసే నియమాన్ని తప్పకుండా రాయడం విశేషమని పేర్కొన్నారు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 12:22, 7 సెప్టెంబరు 2017 (UTC)

వీడియోలు కూడా చూశానండి, చాలా సంతోషం. JVRKPRASAD (చర్చ) 12:26, 7 సెప్టెంబరు 2017 (UTC)

ప్రణయ్ రాజ్... ప్రపంచ రికార్డుసవరించు

మోత్కూర్ మండల కేంద్రానికి చెందిన తెలుగు వికీపీడియా రచయిత ప్రణయ్ రాజ్ వంగరి వికీపీడియా రచనలో ప్రపంచ రికార్డు సాధించారు. గత 4 సంవత్సరాలుగా తెలుగు వికీపీడియాలో వ్యాసాలు రాస్తున్న ప్రణయ్ 'వికీవత్సరం' అనే కాన్సెప్ట్ తో 365రోజులు - 365 వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తంలో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్ గా చరిత్ర సృష్టించారు. 2016, సెప్టెంబర్ 8న '100వికీడేస్' 100రోజులు - 100వ్యాసాలు అనే కాన్సెప్ట్ ను ప్రారంభించిన ప్రణయ్, తెలుగు వికీపీడియాలో ప్రతిరోజు ఒక వ్యాసం చొప్పున రాస్తూ 2017, సెప్టెంబర్ 7న 'వికీవత్సరం' పూర్తిచేశాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్.టి.ఆర్. ట్రస్టులో నిర్వహించిన వికీపీడియా శిక్షణా శిబిరంలో అసఫ్ బార్టోవ్ (వికీమీడియా ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్), ఇతర తెలుగు వికీపీడియన్లు ప్రణయ్ ను అభినందిస్తూ సత్కరించారు. ఇది ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి 'వికీవత్సరం' అని పలువురు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రణయ్ మాట్లాడుతూ... తెలుగు వికీపీడియన్ గా 'వికీవత్సరం' పూర్తిచేయడం చాలా ఆనందంగా ఉందని, ఇందుకు సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశాడు. మొదట్లో 100వికీడేస్ ఛాలెంజ్ పూర్తిచేయడమే అసాధ్యంగా తాను భావించానని, అది పూర్తిచేసి 'వికీవత్సరం' కాన్సెప్ట్ ను రూపకల్పన చేశానన్నాడు. 'వికీవత్సరం' ఛాలెంజ్ ప్రారంభించిన తరువాత తను నాటక ప్రదర్శనల కోసం చాలా ప్రాంతాలకు పర్యటించాల్సివచ్చిందని, ఫిబ్రవరి 15న తన పెళ్లికూడా జరిగిందని, అయినా కూడా తెలుగు వికీపీడియాలో వ్యాసం రాయడం ఆపలేదని తెలియజేస్తూ... తన పెళ్లిరోజున వ్యాసం రాయడంతోపాటుగా తన భార్యతో వికీపీడియాలో ఖాతా తెరిపించానని తెలిపాడు. 365రోజుల పాటు రోజుకో వ్యాసం రాసే ప్రయత్నం సెప్టెంబర్ 7న 365 రోజుకు చేరుకోగా, ప్రణయ్ తాను దీనిని ఇంతటితో ఆపనని ఈ యజ్ఞాన్ని 500 రోజులకు, వీలైతే వెయ్యిరోజులకు కొనసాగిస్తానని చెప్పారు. 100 రోజల పాటు కేవలం మహిళల గురించి, మహిళలపై వ్యాసాలు, మరో 100 రోజుల పాటు ప్రత్యేకించి తెలంగాణకు సంబంధించిన వ్యాసాలు సృష్టించిన ప్రణయ్ తన వికీవత్సర (365వ) వ్యాసంగా తెలంగాణ సంస్కృతి గురించి వ్యాసాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా ఆయనతో సముదాయ సభ్యులు కేక్ కోయించి, వేడుక చేశారు. అసఫ్ మాట్లాడుతూ ప్రణయ్ తన పెళ్ళి జరిగిన రోజున కూడా వికీపీడియాలో వ్యాసం రాసే నియమాన్ని తప్పకుండా రాయడం విశేషమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణయ్ రాజ్ తోపాటు అసఫ్ బార్టోవ్ (వికీమీడియా ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్), టి. విష్ణువర్ధన్ (సి.ఈ.ఓ., ఎన్.టి.ఆర్.) లతోపాటు ఇతర తెలుగు వికీపీడియన్లు పాల్గొన్నారు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 13:02, 7 సెప్టెంబరు 2017 (UTC)

తెలంగాణ ఐటీ శాఖ డిజిటిల్ మీడియా విభాగంతో సీఐఎస్-ఎ2కె ఎంవోయూసవరించు

తెలంగాణలో వికీపీడియా సముదాయాన్ని, ఉద్యమాన్ని వ్యాప్తి చేయడం. తెలుగు, ఉర్దూ భాషల్లో స్వేచ్ఛా నకలు హక్కుల్లో ఇ-రీసోర్సులు వృద్ధి చేయడం, తెలంగాణ ప్రాంతంలో డిజిటల్‌గా విజ్ఞాన భాండాగారాలు, స్వేచ్ఛా నకలు హక్కుల్లో సమాచార విస్తరణ వంటివాటిపై కార్యకలాపాలు విస్తరించడం వంటివి లక్ష్యాలుగా తెలంగాణ ప్రభుత్వ ఐటీ డిపార్ట్‌మెంట్‌ డిజిటల్ మీడియా విభాగం, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్‌ సొసైటీ వారి యాక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం బుధవారం అవగాహన ఒప్పందం (మెమొరాండమ్ ఆఫ్‌ అండర్‌స్టాండింగ్) ఏర్పరుచుకున్నాయి. కార్యక్రమంలో తెలుగు వికీపీడియన్ ప్రణయ్‌ రాజ్‌ పాల్గొన్నారు. ఐటీ కార్యదర్శి జె.ఎస్.రంజన్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ తరఫున పవన్ సంతోష్‌ సంతకం చేశారు. తెలంగాణ ప్రాంతంలో మరింత మందిని తెలుగు, ఉర్దూ వికీపీడియాల్లో కృషిచేసేందుకు ప్రోత్సహించి, శిక్షణ నిచ్చే కార్యకలాపాలు చేపట్టనున్నట్టు, ప్రభుత్వం యొక్క ఆర్కైవ్‌లోని పలు ఫోటోలను స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేసేట్టు ఈ సందర్భంగా కొణతం దిలీప్ పేర్కొన్నారు. పవన్ సంతోష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం స్వేచ్ఛా నకలు హక్కుల్లో పెద్ద ఎత్తున ఫోటోలను విడుదల చేయడం వల్ల, తెలంగాణకు సంబంధించిన అనేక విజ్ఞాన సర్వస్వ పరమైన వ్యాసాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. కార్యకలాపాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వ శాఖల్లోని సంబంధిత అధికారులకు స్వేచ్ఛా నకలు హక్కుల గురించి, వికీపీడియా ఉద్యమం గురించి అవగాహన సదస్సులు నిర్వహించడం, తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి కలిగిన స్వచ్ఛంద రచయితలను వికీపీడియాలో కృషిచేయడంపై కార్యశాలల నిర్వహణకు సహకరించడం, ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా విజ్ఞాన వ్యాప్తికి కృషిచేస్తున్న పలువురిని ఈ కార్యకలాపాల్లో భాగం చేసే విధమైన మేధో మధనాల నిర్వహణ వంటి అంశాలు ఉంటాయి.

ఆంగ్ల పాఠాంతరంసవరించు

The Telangana Government’s IT, Electronics and Communications Department and the Centre for Internet & Society - Access to Knowledge, Bengaluru have entered into a Memorandum of Understanding which aims to catalyse the development of the Wikimedia movement in Telangana and improve the state of free-licensed e-content in Telugu and Urdu.

The Principal Secretary for IT Department Sri. Jayesh Ranjan and renowned Telugu Wikimedian and Theatre Scholar Pranay Raj were present for the occasion. Sri. Konatham Dileep, Director (Digital Media), IT Department and CIS-A2K Telugu Community Advocate Pavan Santhosh were signatories to the memorandum. Sri. Konatham Dileep emphasised the Telangana Government’s support for activities to train and encourage participation of interested volunteers from Telangana to contribute Telugu and Urdu Wikimedia projects. The government would also release important and encyclopedic photographs from its archives.

Mr. Pranay Raj explained that free-licensing content and media related to Telangana culture would catalyse the growth of content regarding Telangana. Some of the planned activities include: increasing awareness about free licenses and Wikipedia among government officials, increasing participation from Telangana in the Wikimedia movement by conducting series of targeted workshops for interested volunteers, improving collaboration by conducting ideation sessions for intellectuals and writers from Telengana who already contribute to the collation and disbursement of knowledge in Telugu and Urdu.

--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:00, 28 అక్టోబరు 2017 (UTC)