వి.కమలాకరరావు

కర్ణాటక మృదంగ వాద్య కళాకారుడు

వి.కమలాకరరావు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మృదంగ వాద్య కళాకారుడు.

వి.కమలాకరరావు
వ్యక్తిగత సమాచారం
జననం (1936-06-08) 1936 జూన్ 8 (వయసు 88)
రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
సంగీత శైలికర్ణాటక సంగీతం
వాయిద్యాలుమృదంగం

ఆరంభ జీవితం

మార్చు

ఇతడు జి.వరదరావు , నేత్రావతి దంపతులకు 1936, జూన్ 8వ తేదీన రాజమండ్రిలో జన్మించాడు.[1] ఇతడు తన ఐదవ యేటనే మృదంగం పట్ల ఆసక్తి కనబరిచాడు. ఇతని తండ్రి ఇతని ఆసక్తిని గమనించి ఇతడికి రాజు వద్ద సంగీతం నేర్పించాడు. తరువాత ఇతడు వారణాశి యజ్ఞనారాయణశాస్త్రి వద్ద మృదంగం అభ్యసించాడు. తరువాత పాలకొల్లుకు చెందిన ఎల్లా సోమన్న వద్ద కొంతకాలం నేర్చుకున్నాడు. ఆ తర్వాత తన 13వ యేట ఇతడు తంజావూరు వెళ్ళి అక్కడ పాల్గాట్ మణి అయ్యర్ వద్ద గురుకుల పద్ధతిలో మృదంగవిద్యలో మెలకువలు నేర్చుకున్నాడు.

వృత్తి

మార్చు

ఇతడు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడు. కాలేజీ రోజులలో ఇతడు అంతర్ కళాశాల పోటీలలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెడల్‌ను అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతులమీదుగా అందుకున్నాడు. ఇతడు తన 7వ యేటి నుండే సంగీత కచేరీలకు మృదంగ సహకారాన్ని అందించడం మొదలుపెట్టాడు[2]. 12వ యేట వయోలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామినాయుడు కచేరీకి మృదంగ వాద్య సహకారం అందించి అతని ప్రశంసలను పొందాడు.

ఇతడు అలత్తూర్ శ్రీనివాస అయ్యర్, జి.ఎన్.బాలసుబ్రమణియం, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, చెంబై వైద్యనాథ భాగవతార్, టి.కె.రంగాచారి, మహావాది వెంకటప్పయ్యశాస్త్రి, శ్రీపాద పినాకపాణి, ఈమని శంకరశాస్త్రి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నేదునూరి కృష్ణమూర్తి, నూకల చినసత్యనారాయణ, ఎం.ఎస్.బాలసుబ్రహ్మణ్యశర్మ, టి.ఎన్.శేషగోపాలన్, టి.వి.శంకరనారాయణన్, లాల్గుడి జయరామన్, ఉప్పలపు శ్రీనివాస్, ఎన్.రవికిరణ్, చిట్టిబాబు, ఎల్.సుబ్రహ్మణ్యం, అన్నవరపు రామస్వామి, టి.ఆర్.సుబ్రహ్మణ్యం, ద్వారం దుర్గా ప్రసాదరావు వంటి కర్ణాటక సంగీత విద్వాంసులకు వాద్య సహకారాన్ని అందించాడు. ఇతడు దేశంలోని అన్ని ప్రతిష్టాత్మక సంగీత సభలలో పాల్గొన్నాడు.

ఇతడు మనదేశంలోనే కాక నేదునూరి కృష్ణమూర్తి, చిట్టిబాబు, లాల్గుడి జయరామన్, మాండొలిన్ శ్రీనివాస్, ఎన్.రవికిరణ్, ఎల్.సుబ్రహ్మణ్యం, టి.ఆర్.సుబ్రహ్మణ్యం, త్రివేండ్రం ఆర్.వెంకట్రామన్ మొదలైన వారితో కలిసి హాంగ్‌కాంగ్, ఆస్ట్రేలియా, గ్రీస్, సిరియా, అమెరికా, ఫ్రాన్సు వంటి అనేక దేశాలు పర్యటించి కచేరీలు చేశాడు.

ఇతడు ఎల్.సుబ్రహ్మణ్యం, ఏహుది మెనూహిన్, వి.జి.జోగ్, ఎం.ఎస్.గోపాలకృష్ణ, ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ వంటి కళాకారులతో "జుగల్‌బందీ" కచేరీలు చేశాడు.

ఇతడు ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ఉన్నతశ్రేణి కళాకారుడిగా ఎంపికై అనేక కార్యక్రమాలలో పాల్గొన్నాడు.

పురస్కారాలు, బిరుదులు

మార్చు

రాజమండ్రిలోని శ్రీత్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఇతడిని కనకాభిషేకంతో సత్కరించి "మృదంగ విద్వన్మణి" అనే బిరుదును ప్రదానం చేసింది. ఇంకా అనంతపురం త్యాగరాజ గానసభ "మృదంగ కళావతంస", విజయవాడ కన్నడ సేవాసంఘం "మృదంగ కోవిద", రాజమండ్రి కన్నడ సేవాసంఘం "మృదంగ సుధాకర", కారైకుడి సంగీత సభ "మృదంగ కాదల్", విజయవాడ పారుపల్లి సంగీత సమాఖ్య "నాద భగీరథ", విశాఖపట్నం సంగీతకళాసమితి "మృదంగ కళాప్రవీణ", తాడేపల్లి గూడెం త్యాగరాజ గానసభ "మార్దంగిక సార్వభౌమ", రాజమండి రాగసుధ "మృదంగ సుధానిధి", విశాఖ సంగీత అకాడమీ "సంగీత కళాసాగర", హైదరాబాదు ఆంధ్ర సంగీత అకాడమీ "సంగీత విద్యానిధి" వంటి అనేక బిరుదులను ప్రదానం చేసి ఇతడిని గౌరవించాయి.

ఇతడికి కారైకుడి ఆర్.మణికి చెందిన శృతిలయ సేవాకేంద్ర నటరాజాలయ సంస్థ "గణపతి సచ్చిదానంద పురస్కారం" ప్రదానం చేసింది. పాల్గాట్ మణి అయ్యర్ మెమోరియల్ అవార్డుతో పాటు "మృదంగ కళాశిరోమణి" ఇతడిని వరించింది. 1999లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతడికి కర్ణాటక సంగీతం వాద్యపరికరాలు (మృదంగం) విభాగంలో అవార్డును ఇచ్చింది. 2010లో కంచి కామకోటి పీఠం ఇతడిని సన్మానించింది. 2010 నుండి ఇతడు మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ఆస్థాన విద్వాంసుడిగా ఉన్నాడు.

మూలాలు

మార్చు
  1. web master. "MRIDANGAM MAESTRO SRI V.KAMALAKARRAO". .weebly. Retrieved 15 March 2021.
  2. Staff Reporter (31 May 2019). "A six-day tribute to mridanga 'vidwan' Kamalakar's journey". The Hindu. Retrieved 16 March 2021.