భగవద్గీత

హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన గ్రంథం
(శ్రీమద్భగవద్గీత నుండి దారిమార్పు చెందింది)


భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు.

గీతోపదేశం బాగా జనప్రియమైన చిత్రం. ఇది కలంకారీ శైలిలో వస్త్రంపై అద్దిన చిత్రం.

భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.

19వ శతాబ్దానికి చెందిన భగవద్గీత వ్రాతప్రతి

భగవద్గీత ఆవిర్భావం

మార్చు
భగవద్గీత
 
యోగములు
1. అర్జునవిషాద
2. సాంఖ్య
3. కర్మ
4. జ్ఞాన
5. కర్మసన్యాస
6. ఆత్మసంయమ
7. జ్ఞానవిజ్ఞాన
8. అక్షరపరబ్రహ్మ
9. రాజవిద్యారాజగుహ్య
10.విభూతి
11.విశ్వరూపసందర్శన
12.భక్తి యోగము
13.క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ
14.గుణత్రయవిభాగ
15.పురుషోత్తమప్రాప్తి
16.దైవాసురసంపద్విభాగ
17.శ్రద్దాత్రయవిభాగ
18.మోక్షసన్యాస
గీతా మహాత్యము
గీత సంస్కృత పాఠము
గీత తెలుగు అనువాదము
హిందూధర్మశాస్త్రాలు

భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధం మయారు. పాండవవీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపువారూ శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని "నా కర్తవ్యమేమి?" అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథ సారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.

భగవద్గీత విశిష్టత

మార్చు

భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మ స్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీతకు హిందూ మతంలో ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రశంసించే కొన్ని ఆర్యోక్తులు ఇవి:

సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాల నందనః
పార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్
  • శ్రీకృష్ణుడను గొల్లవాడు ఉపనిషత్తులనెడు గోవులనుండి అర్జునుడనెడి దూడను నిమిత్తముగా చేసికొని గీత అను అమృతమును పితికెను. బుద్ధిమంతులు అంతా ఈ గీతామృతమును పానము చేయవచ్చును.
  • ప్రతి వ్యక్తి గీతను శ్రవణ, కీర్తన, పఠన, పాఠన, మనన, ధారణాదుల ద్వారా సేవింపవలెను. అది పద్మనాభుని ముఖ కమలమునుండి ప్రభవించింది. (మహాభారతం - భీష్మ పర్వం)
  • నేను గీతను ఆశ్రయించి ఉండును. గీత నా నివాసము. గీతాధ్యయనము చేయువాడు భగవంతుని సేవించినట్లే (వరాహ పురాణం)
  • నిరాశ, సందేహములు నన్ను చుట్టుముట్టినపుడు, ఆశాకిరణములు గోచరించనపుడు నేను భగవద్గీతను తెరవగానే నన్ను ఓదార్చే శ్లోకము ఒకటి కనిపిస్తుంది. ఆ దుఃఖంలో కూడా నాలో చిరునవ్వులుదయిస్తాయి. భగవద్గీతను మననం చేసేవారు ప్రతిదినమూ దానినుండి క్రొత్త అర్ధాలు గ్రహించి ఆనందిస్తారు. (మహాత్మా గాంధీ)

భగవద్గీతలో ముఖ్య విషయాలు

మార్చు
గీతా సారము

(భగవద్గీత గురించి ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. ఎందరో పండితులు, సామాన్యులు, ఔత్సాహికులు కూడా అర్ధాలు, అంతరార్ధాలు, సందేశాలు, విశేషాలు వివరించారు. కనుక "భగవద్గీత సారం" అన్నవిషయం ఇది వ్రాసేవారికి "అర్ధమయినంత, తోచినంత" అని గ్రహించాలి)

కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యంవైపు నడిపించడం అనేది గీత లక్ష్యం అని సందర్భానుసారంగా అనుకోవచ్చును. అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించక ప్రశ్నిస్తూ ఉంటాడు. శిష్యునిపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు అతనికి నిగూఢమైన, వేరెవరికీ తెలియని అనేక విషయాలు బోధిస్తాడు.

ఆత్మ నిత్య సత్యమైనది, చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ ఆత్మను చంపదు. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మ గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి, వస్తు ప్రపంచాన్ని వదలి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరగలడు. భక్తి, కర్మ, ధ్యాన, జ్ఞాన మార్గాలలో భగవంతుని చేరవచ్చును.

మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మలవలన దోషాలు కూడా తప్పవు. సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి, సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించరాదు. అన్ని కర్మల ఫలాన్ని భగవంతునకు ధారపోయాలి.

కృష్ణుడే పరబ్రహ్మము. సృష్టిలోని సకలము భగవంతుని అంశతోనే ఉన్నాయి. అన్ని పూజల, యజ్ఞాల ఫలాలు ఆ దేవదేవునకే చెందుతాయి. బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు అర్జునునకు తాత్కాలికముగా దివ్య దృష్టిని ప్రసాదించాడు. అనంతము, తేజోమయము, సర్వవ్యాప్తము, కాల స్వరూపము అయిన ఆ శ్రీకృష్ణుని విశ్వ రూపాన్ని చూసి అర్జునుడు తరించాడు.

ప్రకృతిలో సకల జీవాలు సత్వరజస్తమోగుణాలచే నిండి ఉన్నాయి. భగవంతునకు శరణాగతుడైనవాడికి ఈ గుణాల బంధంనుండి విముక్తి లభిస్తుంది.

 
శ్రీకృష్ణుడు, పార్థుడు గీతోపదేశం సన్నివేశం ఉన్న విగ్రహాలు తిరుమలలో
ఆత్మ తత్వము
జీవన కర్తవ్యము - కర్మ, జ్ఞానము, భక్తి
యోగ సాధన
భగవత్తత్వము
శ్రద్ధ, గుణ విభాగము

భగవద్గీత విభాగాలు

మార్చు

భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క "యోగము" అని చెబుతారు. వీటిలో 1నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి "కర్మషట్కము" అని అంటారు. 7 నుండి 12 వరకు అధ్యాయాలను "భక్తి షట్కము" అని అంటారు. 13 నుండి 18 వరకు"జ్ఞాన షట్కము". ఒక్కొక్క యోగంలోని ప్రధాన విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. (ఆధ్యాయం శీర్షిక లేత నీలి రంగులో ఉంది. దానిపై క్లిక్ చేస్తే వికీసోర్స్‌లోని ఆ అధ్యాయానికి దారి తీస్తుంది)

"ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రంలో నావారు, పాండుపుత్రులు ఏమి చేశారు సంజయా?" అనే ధృతరాష్ట్రుని ప్రశ్నతో ఈ యోగం మొదలవుతుంది. తరువాత సంజయుడు అక్కడ జరిగినదంతా చెబుతాడు. మొదట ఇరు పక్షాల సేనలను సంజయుడు వర్ణిస్తాడు. అర్జునుని కోరికపై పార్ధసారథియైన కృష్ణుడు ఉభయసేనల మధ్య రథాన్ని నిలిపాడు. అర్జునుడు కురుక్షేత్రంలో మొహరించి యున్నసేనలను చూశాడు. ప్రాణాలకు తెగించి యుద్ధానికి వచ్చిన బంధు, గురు, మిత్రులను చూశాడు. - వీరందరినీ చంపుకొని రాజ్యం పొందడమా? అని మనసు వికలం అయ్యింది. కృష్ణా! నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు. నేను యుద్ధం చేయను. నాకు ఏమీ తోచడం లేదు. కర్తవ్యాన్ని బోధించు - అని ప్రార్థించాడు.

సాంఖ్యము అనగా ఆత్మానాత్మ వివేచన. కర్తవ్య విమూఢుడైన అర్జునుని కృష్ణుడు మందలించాడు. తరువాత అర్జునునికి ఆత్మ తత్వాన్ని బోధించాడు. తానే చంపేవాడినన్న భ్రమ వద్దని తెలిపాడు. ఇది గీతలోని తత్వం విశదపరచిన ప్రధానాధ్యాయం. దీనిని సంక్షిప్త గీత అని కూడా అంటారు. శరీరానికి, ఆత్మకు ఉన్న భేదాన్ని భగవంతుడు వివరించాడు. ఆత్మ శాశ్వతమని, దానికి మరణం లేదని, ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతుందని వివరించాడు. దానికి శీతోష్ణ సుఖదుఃఖాలవంటి ద్వంద్వాలు లేవు. ఇంద్రియాలకు విషయ సంపర్కం వలన ద్వంద్వానుభవాలు కలుగుతుంటాయి. సుఖ దుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు వంటి ద్వంద్వ విషయాలపట్ల సమబుద్ధిని కలిగి ఫలాపేక్ష రహితంగా కర్మలు చేయాలి. సుఖము పట్ల అనురాగము, దుఃఖము పట్ల ఉద్విగ్నము లేకుండా కర్మలు చేసేవాడు, ఇంద్రియాలను వశంలో ఉంచుకునేవాడు, అహంకార మమకారాములు వీడినవాడు, బుద్ధిని ఆత్మయందే లగ్నము చేసినవాడు స్థితప్రజ్ఞుడు.

సాంఖ్య యోగం: శరీరము అశాశ్వతము. దానిని తెలుసుకున్న శరీరి (ఆత్మ) శాశ్వతము. ఈ విశయానికి ప్రాధాన్యమిచ్చి కర్తవ్యపాలన చేయాలి. ఈ రెండిటిలో ఏ ఉపాయాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నా చింతలు, శోకాలు తొలగిపోవును.

కర్మలన్నింటినీ ఆవరించుకొని కొంత దోషం ఉంటుంది. అలాగని కర్మలు చేయకుండా జీవనం సాధ్యం కాదు. కర్మలవలన సంభవించిన బంధమే జీవుడిని జనన మరణ చక్రబంధంలో కట్టివేస్తుంది. అయితే అహంభావాన్ని, ఫలవాంఛను వీడి కర్మలను ఆచరిస్తే కర్మ బంధాలనుండి విముక్తులు కావచ్చును. అందువలన

  1. యుక్తమైన కర్మలు చేస్తూనే ఉండాలి. వాటి ఫలితాన్ని గురించి ఆశించరాదు. అలాగని కర్మలు చేయడం మానరాదు. ఫలితం ప్రియమైనా, అప్రియమైనా గాని దానిని సమబుద్ధితో స్వీకరించాలి.
  2. కర్మల పట్ల సంగము (ఆసక్తి, వ్యామోహం) పెంచుకోకూడదు. కార్యం సిద్ధించినా సిద్ధింపకున్నా గాని సమభావం కలిగి ఉండాలి. ఫలాపేక్ష లేకుండా చేసేదే నిష్కామ కర్మ. ఫలాపేక్షతో చేసే కామ్యకర్మలు నీచమైనవి.
  3. లోక కళ్యాణం కోసం చేసే కర్మలు భగవంతునికి ప్రీతికరమైనవి. ఇవి బంధం కలిగించవు. మోక్షప్రదాలు.

ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మ పవిత్రమైన యజ్ఞం వంటిది. ఇదే కర్మ యోగము. కర్మణ్యే వాధికారస్తే మాఫలే సుఖదాచనా, మా కర్మఫలాగే దుర్భు:మాతే సంగోస్త్వ కర్మణి||

ఆత్మను, పరమాత్ముని గురించిన జ్ఞానమే మోక్షప్రథము. అది నిష్కామ కర్మ వలన లభిస్తుంది. నిష్కామ కర్మ వలన శుద్ధమైన చిత్తం జ్ఞానోదయానికి సరైన క్షేత్రం. ఈ పరమ జ్ఞానాన్ని పురాతనకాలంలో సూర్యునకు భగవంతుడు ఉపదేశించాడు. లోకంలో ధర్మాన్ని రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి యుగయుగమున భగవంతుడు అవతరిస్తాడు. ఈ అధ్యాయంలో కృష్ణుడు తన పరమాత్మ తత్వాన్ని ఇలా బోధించాడు -

" ధర్మానికి హాని కలిగి ఆదర్మం పెచ్చుమీరినపుడు నేను సాధుసంరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం, ధర్మ పునస్థాపన కోసం ప్రతియుగంలోనూ అవతరిస్తుంటాను. నేను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను, జనన మరణ రహితుడను అయినా గాని నా మాయాశక్తిచే నన్ను నేను సృజించుకొంటుంటాను. మానవులు నన్ను ఏవిధంగా ఆరాధిస్తారో ఆ రూపంలోనే వారిని అనుగ్రహిస్తుంటాను. రాగ భయ క్రోధాదులను త్యజించి నన్నే ధ్యానించేవారు నన్ను పొందుతారు. కర్మ ఫలాసక్తిని విడచి, నిత్య తృప్తుడై, అహంకార మమకారాలను పరిత్యజించి, సుఖదుఃఖాలకు అతీతుడైన, సమదృష్టి కలిగిన, త్యాగబుద్ధి కలిగిన సాధకునికి జ్ఞానం సులభంగా లభిస్తుంది. జ్ఞానంతో సమానమైన పావనకరమింకొకటి లేదు. ఇంద్రియ నిగ్రహము, శ్రద్ధ కలిగి, ఆత్మ ధ్యానం చేసే సాధకునికి పరమశాంతిని ప్రసాదించే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, సంశయాత్ముడు ఇహపరలోకాలలోనూ శాంతిని పొందలేడు."

ఇంతకూ కర్మను చేయాలా? త్యజించాలా? అని అర్జునుడి సందేహం. అందుకు కృష్ణుడు చెప్పిన సమాధానం - "కర్మ చేయకుండా ఉండడం కర్మ సన్యాసం కాదు. నిష్కామ కర్మ ఆచరిస్తూ, కర్మ ఫలాలను త్యజించడం వలన జ్ఞానియైనవాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ సాధన ధ్యానయోగానికి దారి తీస్తుంది. ఫలాసక్తిని విడచి, బ్రహ్మార్పణ బుద్ధితో కర్మ చేసే సన్యాసికి సర్వమూ బ్రహ్మమయంగా కనిపిస్తుంది. ఈ సమత్వమే బ్రహ్మజ్ఞానానికి అత్యవసరం. ఎల్లపుడూ చేయదగిన కర్మను సంగరహితంగా చేసిన మానవుడు పరమపదాన్ని పొందుతాడు"

ఈ అధ్యాయంలో వివిధ యోగసాధనా విధానాలు చెప్పబడ్డాయి. ఇంద్రియ మనో బుద్ధులను అదుపులో ఉంచుకొని ధ్యానంలో మనసు నిలుపుకోవాలి. ఇది సులభం కాదు. ఈ ప్రయత్నంలో ఎవరిని వారే నిగ్రహించుకొని ఉద్ధరించుకోవాలి. ధ్యానం సరిగా సాగాలంటే ఆహారం, నిద్ర, వినోదం, సౌఖ్యం వంటి విషయాలలో సంయమనం పాటించాలి. అతి ఎక్కడా కూడదు. మనస్సు చంచలం కనుక అది చెదిరిపోతూ ఉంటుంది. అభ్యాసం, వైరాగ్యం అనే బలమైన సాధనల ద్వారా మనసును నిగ్రహించుకొనవచ్చును. ధ్యానానికి అంతరాయం కలిగే సంకల్పాలను దూరంగా ఉంచాలి. సమస్త ప్రాణుల సుఖదుఃఖాలనూ తనవిగా తలచి వాటిపట్ల దయ, కరుణ, ఆర్ద్రత, సహాయత చూపాలి. ఒకవేళ యోగసాధన మధ్యలో ఆగిపోయినా దాని ఫలితం వలన ముందుజన్మలో జీవుడు యోగోన్ముఖుడై గమ్యాన్ని చేరగలడు.

విజ్ఞానము అనగా అనుభవ జ్ఞానం. ఈ అధ్యాయంలో భగవంతుని తత్వం గూర్చిన జ్ఞానం, ఆయన స్వరూపము, మాయ, సర్వాంతర్యామిత్వం పరిచయం చేయబడినాయి. ఆయనకు శరణుజొచ్చుట మాత్రమే సరయిన భక్తిమార్గం. వారికే ఆయన కరుణ లభిస్తుంది. వేలాదిలో ఏ ఒక్కడో మోక్షసిద్ధికై ప్రయత్నిస్తాడు. వారిలో ఏఒక్కడో భగవంతుని తెలుసుకోగలుగుతాడు.

భగవంతుని ప్రకృతి (మాయ) మనస్సు, బుద్ధి, అహంకారము, పంచభూతములు అనే ఎనిమిది తత్వాలుగా విభజింపబడింది. ఇది అపరా ప్రకృతి. ఇంతకంటె ఉత్తమమైనది పరాప్రకృతి భగవంతుని చైతన్యము. ఈ రెండింటి సంయోగం వలన సృష్టి జరుగుతుంది. మణిహారంలో సూత్రంలాగా భగవంతుడు విశ్వమంతటా వ్యాపించియున్నాడు. భగవంతుకంటె వేరుగా ఏదీ లేదు.

ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అనే నాలుగు విధాలైన భక్తులు భగవంతుని ఆరాధిస్తారు. వారిలో జ్ఞాని సర్వమూ వాసుదేవమయమని తెలుసుకొని కొలుస్తృఆడు గనుక అతడు భగవంతునికి ప్రియతముడు. అనేక దేవతల రూపాలలో భగవంతుని ఆరాధించే భక్తులను ఆయా దేవతలస్వరూపంలో వాసుదేవుడు అనుగ్రహిస్తాడు. దేవతలనారాధించేవారు దేవతలను, సర్వేశ్వరుని ఆరాధించేవారు సర్వేశ్వరుని పొందుతారు. జన్న జరా మరణాలనుండి మోక్షాన్ని పొందగోరినవారు దేవదేవుని (వాసుదేవుని) ఆశ్రయించి, సమస్తమూ ఆ బ్రహ్మమే అని తెలుసుకొని బ్రహ్మమును పొందుతారు.

బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మ, అధిభూతము, అధిదైవము అనే విషయాల వివరణ ఈ అధ్యాయంలో చెప్పబడింది. నిత్యమైన, సత్యమైన పరమ పదము, పరబ్రహ్మము గూర్చి చెప్పబడింది.

క్షరము అనగా నశించునది. నాశరహితమైన పరబ్రహ్మమే అక్షరము. జన్మరాహిత్యం గురించి బోధించేది ఆత్యమ విద్య. అంత్యకాలంలో భగవంతుని ధ్యానిస్తూ దే్హాన్ని త్యజించేవాడు నిస్సందేహంగా పరబ్రహ్మమును చేరుకొంటాడు. ఓంకారాన్ని ఉచ్ఛరిస్తూ దేహాన్ని విడచేవాడు పరమపదాన్ని పొందుతాడు. అన్య చింతన లేకుండా నిశ్చల మనస్సుతో సదా స్మరణ చేసేవానికి ఇది సాధ్యమౌతుంది. అలా భగవంతుని పొందినవానికి పునర్జన్మ లేదు. బ్రహ్మ చేసిన సృష్టి మరల బ్రహ్మకు రాత్రి కాగానే లయిస్తుంది. సమస్తమూ నశించినా నిశ్చలంగా ఉండే పరబ్రహ్మ స్థానం శ్రీకృష్ణుని ఆవాసం. అక్కడికి చేరినవారికి తిరిగి వెళ్ళడం ఉండదు. అనన్య భక్తి చేతనే ఆ దివ్యపదాన్ని చేరుకోగలరు.

కర్మ యోగము, జ్ఞాన యోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, జ్ఞాన విజ్ఞాన యోగములలో జీవన విధానానికి మార్గం, భగవత్ప్రాప్తికి సాధనం నిర్దేశించబడినాయి. అక్షర పరబ్రహ్మ యోగంలో పరబ్రహ్మాన్ని గురించిన పరిచయం జరిగింది. 9న అధ్యాయం అయిన "రాజవిద్యా రాజగుహ్య యోగము" కృష్ణుడు తానే భగంతుడనని, సృష్టి స్థితి లయ కారకుడనని తెలిపాడు. ఇది పవిత్రమైన జ్ఞానము. అన్నింటా విస్తరించిన పరమాత్ముని గురించి, ఆయనను పొందు విధము గురించి చెప్పబడింది. కృష్ణుడు ఈ యోగంలో చెప్పిన విషయ సారాంశం -

" విద్యలలో ఉత్తమమైనది, అతి నిగూఢమయినది ఈ బ్రహ్మ విద్య. జీవుని మోక్ష రహస్యాన్ని తెలియజేస్తుంది. అర్జునా! నా అధ్వర్యంలోనే సమస్త చరాచర సృష్టి జనిస్తుంది, కల్పాంతంలో నాలోనే విలీనమై మళ్ళీ కల్పాదిలో సృష్టింపబడుతుంది. ఈ జగత్తుకు నేనే తల్లిని, తండ్రిని, పూర్వుడను, కర్మ ఫల ప్రదాతను. ప్రణవ నాదాన్ని. వేదాలు, వేద విద్య, వేదాల ద్వారా తెలియదగినవాడను నేనే. సర్వాన్నీ భరించేవాడిని, ఆశ్రయాన్ని, బీజాన్ని, శరణునొసగేవాడిని, సాక్షిని, సృష్టి స్థితి లయ కారకుడను, సత్‌స్వరూపుడను, అమృతుడను. మూఢులు నా తత్వాన్ని తెలియజాలక వ్యర్ధమైన ఆశలతోను, నిష్ప్రయోజనమైన కర్మలతోను నశిస్తున్నారు. సజ్జనులు నన్ను సదా కీర్తిస్తూ జహఞానయోగం ద్వారా ఆరాధిస్తారు. అనన్య చింతనతో నన్ను ఉపాసించేవారి యోగ క్షేమాలు నేనే వహిస్తాను."

"అన్య దేవతలను ఆరాధించేవారు కూడా నన్నే ఆరాధిస్తున్నారు. నేనొసగే కామ్యార్ధాలను ఆయా దేవతల ద్వారా పొదుతున్నారు. నన్ను కొలిచేవారు నన్నే పొందుతారు. పవిత్రమైన హృదయంతో నాకు పత్రము, పుష్పము, ఫలము, జలము ఏది తర్పించినా దానిని స్వీకరించి నేను తృప్తుడనౌతాను. ఏ పని చేసినా ఆ కర్మ ఫలం నాకు సమర్పిస్తే నీవు కర్మ బంధంనుండి విముక్తుడవౌతావు. నన్ను ఆరాధించే ఎటువంటి భక్తుడైనా అతడెన్నటికీ నశింపడు. ఎవరైనా నన్ను ఆశ్రయిస్తే పరమగతిని పొందుతారు. కనుక నాయందే మనసు లగ్నం చేసి, నా భక్తుడవై, నన్నారాధించుము. నన్నే శరణు జొచ్చుము. నన్నే నీవు పొందెదదవు"

ఇంతకు ముందు యోగాలలో ముందుగా భగవంతుని పొందడానికి అవుసరమైన సాధన చెప్పబడింది. తరువాత అక్షరమైన పరబ్రహ్మమంటే ఏమిటో, ఎవరో, ఆ పరబ్రహ్మను పొందడానికి ఏమి చేయాలో కృష్ణుడు చెప్పాడు. ఇక ఈ అధ్యాయంలో ఆ పరబ్రహ్మము ఏయే రూపములలో గోచరిస్తుందో తెలిపాడు. సకల చరాచరమలలో, లోకములలో, యుగములలో వ్యాపించియున్న తన అనంతమైన విభూతులలో కొద్ది విభూతులను భగవానుడు అర్జునునకు తెలియజెప్పెను.

" నేను సమస్త మానవుల హృదయాలలో ఆసీనుడనై యున్నాను. సమస్తమునకు ఆది, మధ్య, అంతము నేనే అనగా దైవమునకు ఆది అంతము నామము రూపము లేవు.. ఆదిత్యులలో విష్ణువును. తేజోమయమైనవానిలో సూర్యుడను. గోవులలో కామధేనువును. దైత్యులలో ప్రహ్లాదుడను. ఆయుధ ధారులలో రాముడను. నదులలో గంగ. స్త్రీలలో కీర్తి, మేధ, క్షమ. పాండవులలో అర్జునుడను. మునులలో వ్యాసుడను. వృష్ణులలో వాసుదేవుడను. విజయులలో జిగీషను. మోసగాళ్ళలో ద్యూతాన్ని. జలచరాలలో మొసలిని. జలరాశులలో సముద్రాన్ని. వేయేల? ఐశ్వర్యమయము, కాంతిమయము, శక్తి మయము ఐనవన్నియు నా తేజస్సులో ఒక అంశనుండి కలిగినవి. సప్తర్షులు, సనకసనందనాదులు, మనువులు నా మానసమునుండే ఉద్భవించారు. జ్ఞానులు నా దివ్య విభూతులను తెలిసికొన్నవారై, నాయందే మగ్నులై, పరస్పరం నాగురించి ఒకరికొకరు బోధించుకొంటూ ఆనందిస్తుంటారు." - అని తన విభూతుల గురించి తానే ఇలా చెప్పాడు భగవంతుడైన వాసుదేవుడు.,

ఓ కౌంతేయా! నీళ్ళలో రసమును నేను. చంద్రసూర్యలలో కాంతినేను.వేదములలో ప్రణవమును నేను.ఆకాశమున శబ్దమును నేను.మానవూలలో పౌరుషము నేను. నేలలో తావి నేను. సూర్యునిలో తేజస్సును నేను.భూతములలో జీవమేనేను. తాపసులలో తపస్సును నేను.భూతములన్నింటికి బీజమును నేను.బుద్ధివంతులలో బుద్ధిని నేను.తేజస్సులలో తేజస్సును నేను.బలవంతులలో కామరాగములు లేని బలమేనేను.ధర్మవిరుద్ధము కాని కామమేనేను.సాత్త్విక రాజసిక తామస భావములన్నియు నావల్లనే కలిగెడివి.వాటిలో నేను లేను.కాని అవి నాయందు ఉన్నాయి.విభూతి శ్లోకములకు ముఖ్యార్ధము చెప్పుచో పరిణామవాదములోకి దిగును.ఏలనగా భగవంతుడే రసము, కాంతి మొదలగు రుఊపములు తాల్చెనని చెప్పవలసి వచ్చును. దారమును పూసలును ఒకటి కావు.ఈవిషయానంతరమునందే విభూతిశ్లోకములున్నవి.పరమాత్మ వలననే సాక్షాత్తు భూతోత్పత్తి యగునని భ్రమను నివారించుటకు నాలగవ పాదమున వానిలో నేను లేనుగాని అవి నాలో ఉన్నవి అని ముగింపబడెను.క్రతువు, యజ్ఞము, స్వధ, ఔషధము, నేయి, నిప్పు, హోమము నేనే.నేనే జగతికి తండ్రిని, తల్లిని, తాతను తెలియదగినవాడను నేనే.పవిత్రమగు ఓంకారము ఋక్కుసామము యజస్సు, గతి, భర్త, ప్రభువు, సాక్షి, నివాసము, శరణము, నెచ్చెలి, ప్రభవము, ప్రళయము, ఆధారము, నిదానము నేనే.ఓ అర్జునా! నేనే వేడిమిని కలుగజేయునది.నేనే వర్షించు నది, నేనే నీరు లాగుకొనునది; అమృతము మృత్యువు, సత్తు అసత్తు నేనే.ప్రకృతియే కార్యము చేయును. కాని ఆప్రకృతి ఆత్మాధీనము. కావున ప్రకృతి కార్యము ఆత్మ కారోపించబడెను.జగత్తుయందు యేది దొడ్దదో ఆయా వస్తువులనే ఈశ్వరరూపముగా చింతించమని ఉపదేశించెను.

భగవానుని దివ్యగుణ వైభవాల గురించి విన్ తేజోరూపమును చూపమని ప్రార్థించెను. సామాన్య చక్షువులతో ఆ రూపం చూడడం దుర్లభం గనుక కృష్ణుడు అర్జుననకు దివ్యదృష్టిని ప్రసాదించెను. అపుడు అర్జునుడు అసంఖ్యాక ముఖములు, నేత్రములు, అద్భుతాయుధములు ధరించి అనంతముగా విస్తరించిన దేవదేవుని విశ్వరూపమును దర్శించెను. అది దివ్యమాల్యాంబర ధరము, దివ్య గంధానులేపనము. ఆ మహాకాల స్వరూపమును అంతకు ముందెవ్వరును చూడలేదు. అర్జునుడు పులకించి ఆ అనంతరూపుని ఇలా ప్రస్తుతించాడు.

"దేవదేవా! జగత్పతే! అనంతరూపా! సూర్యునివలె ప్రజ్వలించుచున్న నీ అనంత రూపము చూడ నాకు శక్యము గాకున్నది. నీవు దేవదేవుడవు, సనాతనుడవు. అనంత శక్తి సంపన్నుడవు. నీయందు బ్రహ్మాది సమస్త దేవతలు కనిపించుచున్నారు. దేవతు, మహర్షులు, పితరులు నిన్ను స్తుతిస్తున్నారు. ప్రభో! నీకు అనేక నమస్కారములు. మరల మరల నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము" అని ప్రార్థించాడు.

అర్జునుని కరుణించి భగవానుడు తన రూపాన్ని ఉపసంహరించి ఆ అద్భుత రూపాన్ని దర్శించడం తపస్సు వలన కాని, వేదాధ్యయనం వలన గాని అలవి కాదని చెప్పాడు. అనన్యమైన భక్తి వలన మాత్రమే ఆ దివ్యరూపాన్ని తెలుసుకోవడం సాధ్యమని తెలిపాడు.

11. విశ్వరూప సందర్శన యోగము - ఏకాదశాధ్యాయము

మార్చు

పరమాత్ముని సగుణ, నిర్గుణ రూపములలో దేనిని ఆరాధింపవలెనని అర్జునుడు ప్రశ్నించెను. రెండును భగవానుని చేరు మార్గములే అయినను సగుణ సాకార ఉపాసనయే భక్తులకు అనువైన మార్గమని సెలవిచ్చెను. ఆపై భగవంతుడు జ్ఞానియైన తన భక్తుల లక్షణములను వివరించెను. భగవంతుని యెడల అత్యంత ప్రేమ కలిగి ఉండడం భక్తి అనబడుతుంది. ఉత్తమ భక్తుడు ఇంద్రియ నిగ్రహము, సమ భావము, సర్వ భూత హితాభిలాష కలిగి ఉండాలి. ఏ ప్రాణినీ ద్వేషింపక అన్ని జీవులపట్ల మైత్రి, కరుణ కలిగి ఉండాలి. అహంకార మమకారాలను విడచిపెట్టాలి. ఓర్పు, సంతుష్టి, నిశ్చల చిత్తము కలిగి ఉండాలి. శుచి, శ్రద్ధ, కార్య దక్షత కలిగి ఉండాలి. మనోబుద్ధులను భగవంతునికి అర్పించాలి.

మానవుల శరీరము క్షేత్రము. ఆ క్షేత్రమును గూర్చి తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు. అన్ని క్షేత్రములలోను అంతర్యామిగానున్న క్షేత్రజ్ఞుడు పరమాత్ముడే. అని, అట్టి పరమాత్ముని స్వరూపమును కృష్ణపరమాత్ముడు తెలియజెప్పెను.

క్షేత్రమంటే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారములతో కూడుకొని యున్న శరీరము. క్షేత్రజ్ఞుడంటే క్షేత్రంలో ఉండే జీవుడు. అన్ని క్షేత్రాలలో ఉండే క్షేత్రజ్ఞుడను నేనే అని, ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్యనున్న యథార్థ సంబంధం తెలిసికోవడం జ్ఞానమని కృష్ణుడు ఉపదేశించాడు. అలాంటి జ్ఞానం కలిగిన జ్ఞాని లక్షణాలు - తనను తాను పొగడుకొనకపోవడం, గర్వం లేకపోవడం, అహింసాచరణ, ఋజుత్వము, గురు సేవా తత్పరత, శుచిత్వము, స్థిర బుద్ధి, ఆత్మ నిగ్రహం, ఇంద్రియ విషయాలపై వైరాగ్యం కలిగి ఉండటం, ఇష్టానిష్ఠాల పట్ల సమభాఞం కలిగి ఉండడం, ఏకాంత ప్రియత్వం, తత్వ జ్ఞానం ధ్యేయాన్ని గ్రహించడం, భగవంతునియందు అనన్యమైన భక్తి కలిగి ఉండడం వంటివి.

ఇలాంటి జ్ఞానం లేని అజ్ఞాని తన ఆత్మ తత్వాన్ని తెలిసికొనలేక, క్షేత్రమే తాను అని భ్రమించిసంసార బంధాలకు లోనౌతాడు. అనేక జన్మలనెత్తుతాడు. యథార్థంగా శరీరానికి భిన్నంగా, సాక్షీభూతంగా, ప్రభువుగా, భరించువానిగా భగవానుడున్నాడు.

ఆత్మ నాశన రహితమైనది. కాని ప్రకృతివల్ల ఉద్భవించిన సత్వ రజస్ తమో గుణములు జీవాత్మను శరీరమున బంధించును. అనుచు శ్రీకృష్ణుడు ఈ మూడు గుణముల స్వభావమును, ప్రభావమును వివరించెను. అందరిలోను ఉన్న సత్వరజస్తమో గుణాల ప్రభావం వలన జీవులు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ త్రిగుణాలు ప్రకృతితోపాటు ఉద్భవించి క్షేత్రజ్ఞుడిని క్షేత్రంలో బంధించి ఉంచుతాయి. బ్రహ్మాండమంతా భగవంతుని కారణంగానే సృజింపబడుతుంది.

సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశింపజేయునది, జీవునికి సుఖంపట్ల జ్ఞానం పట్ల ఆసక్తిని పెంచి జీవుని బంధిస్తుంది. రజోగుణం ఇంద్రియ విషయాలపై అనురక్తిని, తృష్ణను కలుగజేసి జీవుని నిరంతర కార్య కలాపాలలో బంధించి ఉంచుతుంది. తమోగుణం అజ్ఞానం వలన కలుగుతుంది. భ్రమ, అజాగ్రత్త, నిద్ర, సోమరితనం వంటి వాటిలో జీవుని బంధిస్తుంది. సత్వ గుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వలన మూఢత్వము కలుగుతాయి.

దేనినీ ద్వేషింపకుండా, కాంక్షించకుండా, సమత్వంతో నిర్మ మనస్కుడైనవాడు అమృతత్వాన్ని పొందుతాడు. భగవంతుని అచంచల భక్తి విశ్వాసాలతో ఆరాధించేవాడు గుణాతీతుడై బ్రహ్మ పదాన్ని పొందడానికి అర్హుడౌతాడు.

త్రిగుణాత్మకమైన సంసార వృక్షమును శ్రీకృష్ణుడు వర్ణించెను. జగత్తులో నాశనమొందువాడు క్షరుడు. వినాశరహితుడు అక్షరుడు. వీరిద్దరికంటె ఉత్తమమైనవాడు, అతీతుడు గనుక భగవంతుడు పురుషోత్తముడు.
పురుషోత్తమ ప్రాప్తి యోగమును ఆధ్యాయముయందలి 16వ శ్లోకము
శ్లో❘❘ ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ ❘
క్షరస్సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్చతే ❘❘
ఇక్కడ క్షరుడు అనగా త్రిగుణాల సృష్టి అయిన నాశనమొందు స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు, ఆక్షరుడు అనగా క్షేత్రజ్ఞుడు, పురుషోత్తముడు అనగా పరమాత్మ. ఈ జ్ఞానం సృష్టి ఆది యందు దేవదేవునిచే సూర్యునికి చెప్పబడింది. తిరిగి మరల ఆ జ్ఞానమే దేవుని మానవరూపము అయిన భగవంతుడు శ్రీకృష్ణపరమాత్మ చే ద్వాపరయుగములో పరమ పవిత్ర పరిశుద్ధ భగవద్గీత రూపములో శ్రీ అర్జనుని కారణంగా చేసుకుని మరల ఈ లోకానికి చెప్పబడింది.

అసుర లక్షణములు, దైవ లక్షణములకు మధ్య అంతరమును భగవంతుడు వివరించెను. మానవులు మనుష్యులుగా, మానవత్వముతో జీవనం సాగించుటకు ఏ లక్షణములను అలవరచుకోవాలి, ఏ లక్షణములకు దూరముగా వుండాలి అనే విషయములను తెలుసుకొనుటకు ఈ అధ్యాయము ఎంతగానో ఉపయోగపడుతుంది. దైవీ భావములు గల వారిలో ఏ గుణములు ప్రస్ఫుటిస్తాయి అలాగే అసురీ భావములు గలవారిలో ఏ లక్షణములు ప్రస్ఫుటిస్తాయి అనే విషయములో ఆ భగవానుడు ఎంతో విపులముగా తెలియ చేసారు. కనుక ఈ అధ్యాయము ప్రతి ఒక్కరికి ఆచరణాత్మకమైన జ్ఞానమును ప్రసాదిస్తుంది. దైవీ సంపద కలిగిన వారి లక్షణములు ఈ విధముగా వుంటాయి---------------

భయము లేకుండుట అంతః కరణమందు నిర్మలత్వము, తత్వ జ్ఞానార్ధమై ధ్యానమందు నిరంతర దృఢ స్థితి, సాత్వికమైన దానము, ఇంద్రియ నిగ్రహము, దైవ, గురుపూజనము, అగ్ని హోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేద శాస్త్రములు చదువుట, చదివించుట, భగవంతుని గుణ నామ కీర్తనము, స్వధర్మ పాలనయందు కష్టముల యందు ఓర్పు, సరిరమున, అంతః కరణమున, ఇంద్రియములయందు సరళత్వము, మనోవాక్కాయముల నెవ్వరిని బాధింపకుండుట, సరళ సత్య భాషణము, అపకారి పట్ల కూడా ఎట్టి క్రోధము కలగకుండుట కర్మల యందు కర్తృత్వ అభిమానము లేకుండుట, ఎవరినీ నిందింపకుండుట, సకల ప్రాణుల యందు నిర్హేతుకమైన దయ కలిగి యుండుట, ఇంద్రియ విషయ సంయోగము కలిగినను దానియందు ఆసక్తి లేకయుండుట, కొమలత్వము, లోకవిరుద్ధమైన, శాస్త్ర విరుద్ధమైన కర్మాచరణ యందు లజ్జ కలిగి యుండుట వ్యర్ధమైన కర్మలు చేయకుండుట. తేజము, క్షమా, ధైర్యము, బాహ్య శుద్ధి, ఎవరి యందును శత్రు భావము లేకుండుట తన యందు పూజ్యత అభిమానము లేకుండుట అనునవన్నియు ఓ అర్జునా! దైవీ సంపద కలిగిన వారి లక్షణములు.

ఓ అర్జునా! దంభము, దర్పము, దురభిమానము, క్రోధము, పౌరుషము, అజ్ఞానము మోసలగునవి అసురీ సంపదతో పుట్టిన వారి లక్షణములు.

వివిధమార్గాలలో పూజలు చేసేవారి శ్రద్ధ ఏ విధమైనది? ఎవరు ఏవిధంగా యజ్ఞానుల, దానాలు చేస్తారు?

కనుక అన్ని సంశయములను పరిత్యజించి, తనయందే మనసు నిలిపి యుద్ధము (కర్మ) చేయమని భగవంతుడు ఉపదేశించెను. అర్జునుడు మోహవిరహితుడయ్యెను. యోగేశ్వరుడగు కృష్ణుడు, ధనుర్ధరుడైన పార్ధుడు ఉన్న చోట సంపద, విజయము తప్పక ఉంటాయని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు..

భారతీయ షెడ్యూల్డ్ భాషలలో భగవద్గీత అనువాదాలు

మార్చు

1.సంస్కృతం 2.హిందీ 3.బెంగాలీ 4.అస్సామీ 5.మరాఠీ 6.కన్నడ 7.తెలుగు 8.గుజరాతీ 9.ఒరియా 10.తమిళం 11.ఉర్దూ భాషల్లో భగవద్గీత అనువదాలు ప్రచురించబడ్డాయి.మిగతా 11 షెడ్యూల్డ్ భాషలలో అనువాదాలు ప్రచురించబడాలి.

భగవద్గీత గురించి భాష్యాలు, రచనలు

మార్చు
సంస్కృతంలో
తెలుగులో
ఆంగ్లంలో
ఇతర భాషలలో

మరికొన్ని విశేషాలు

మార్చు

గీత గురించిన అభిప్రాయాలు

మార్చు

భగవద్గీత నుండి మార్గదర్శకత్వము పొందినవరిలో ఎందరో యోగులు, తాత్త్వికులు ఉన్నారు. వారిలో శ్రీ చైతన్య మహాప్రభు ఒకరు. ఈయన "హరే కృష్ణ" మంత్రోపాసకులు. మహాత్మ గాంధి తన అహింస సిద్ధాంతానికి గీత నుండే స్ఫూర్తిని పొందారు. గాంధీ మహాభారత యుద్ధాన్ని నిత్య జీవితంలో జరిగే సంఘర్షణలన్నిటికి వేదిక వంటిదని వర్ణించారు. అంతిమంగా గీత సారము ఆయనకు బ్రిటిష్ వారి వలస పాలనను ఎదిరించడానికి ఒక ఆయుధము వంటి స్ఫూర్తిని ఇచ్చింది.

అమెరికా అణు శాస్త్రవేత్త, అణుబాంబు సృష్టించిన 'మాన్ హాటన్ ప్రాజెక్ట్' నిర్దేశకుడైన 'రాబర్ట్ ఒపెన్హీమర్' 1945లో మొదటి అణ్వాయుధ ప్రయోగాన్ని చూసినపుడు ఆ ప్రభావాన్ని వర్ణించడానికి గీతలోని విశ్వరూప ఘట్టాన్నుండి (11-32) ఉదహరించాడని అంటారు [1].

శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యులలో అగ్రగణ్యుడైన స్వామి వివేకానంద గీతలోని భక్తి, జ్ఞాన, కర్మ రాజ యోగాలకు ఎంతో విపులంగా నూతన భాష్యాన్ని వ్రాశారు. యోగులు కాదలచిన వారు గీతలోని ప్రతి అధ్యాయాన్ని వివరంగా చదవమని స్వామి శివానంద బోధించారు. ఒక యోగి ఆత్మ కథ రచయిత అయిన పరమహంస యోగానంద, గీతను ప్రపంచములోని అత్యుత్తమ పవిత్ర గ్రంథముగా పేర్కొన్నారు.

భగవద్గీత కాలం

మార్చు

భగవద్గీత ఎప్పుడు వ్రాయబడినదో పూర్తిగా నిర్ధారణ కాలేదు, లేదా నిరూపింపబడలేదు. మహాభారత ఇతిహాసమునందలై వివిధ ఖగోళ ఆధారల అనుసరించి, మహాభారత కాలాన్ని క్రీస్తు పూర్వం 3137 గా చెప్పబడుతున్నాయి. ఈ తారీఖులు హిందువుల విశ్వాసమైన కలియుగారంభమై 5000 సంవత్సరాలు అయినాయి అనేదానికి అనుకూలంగానే ఉన్నాయి. పురాణాలను అనుసరించి మాత్రం క్రీస్తుపూర్వం 2500 గా చెప్పబడుతున్నాయి. పాశ్చాత్య విద్వాంసులు మాత్రం ఈ తారీఖులు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలుగా చెప్పుచున్నారు.[2]

గీతా శ్లోక సంఖ్య

మార్చు

భగవద్గీతలోని శ్లోకాల సంఖ్య గురించి చాలా పరిశోధన జరిగింది, ఇంకా జరుగుతూ ఉంది.

మహాభారతంలో భీష్మ పర్వం 43వ అధ్యాయం, 4వ శ్లోకం ఇలా ఉంది:

షట్శతాని సవింశాని శ్లోకానాం ప్రాహకేశవః
అర్జునః సప్తపంచాశత్ సప్తషష్టించ సంజయః
ధృతరాష్ట్రః శ్లోకమేకం గీతాయా మానముచ్యతే

దీన్నిబట్టి కృష్ణుడు 620 శ్లోకాలు, అర్జునుడు 57 శ్లోకాలు, సంజయుడు 67 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే మొత్తం 745 శ్లోకాలు. కానీ, వాడుకలో ఉన్న భగవద్గీత ప్రతిని బట్టి కృష్ణుడు 574 శ్లోకాలు, అర్జునుడు 84 శ్లోకాలు, సంజయుడు 41 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే మొత్తం 700. మరి కొన్ని ప్రతులలో 13వ అధ్యాయం "క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం" మొదట్లో అర్జునుడు అడిగినట్లుగా "ప్రకృతిం పురుషం చైవ ..." అని ఒక ప్రశ్న ఉంది. అది కనుక కలుపుకుంటే మొత్తం 701 శ్లోకాలు అవుతాయి.

ఇవి కాకుండా రాజస్థాన్లోని కథియవాడ్‌లో భోజ (భూర్జర) పత్రాలపై రాసిన భగవద్గీత పాఠాంతరం ఒకటి బయటపడిందనీ, దానిలో ఏకంగా 755 శ్లోకాలు ఉన్నాయనీ, తమ 'గీతా మకరందం' (1963) రెండవ ముద్రణలో (చూడు పే. 13, 1964) విద్యాప్రకాశానందగిరి వారు (శుకబ్రహ్మాశ్రమము, కాళహస్తి) రాశారు. కానీ, దీనిని గురించి మరిన్ని వివరాలు అందుబాటులో లేవు.

ఏది ఏమైనా, మహాభారత శ్లోకం ప్రక్షిప్తం కాదనుకుంటే మరొక 44/45 అమూల్యమైన శ్లోకాలు కాలగర్భంలో కలిసిపోయాయని చెప్పచ్చు.

ఘంటసాల భగవద్గీత

మార్చు
  1. భగవద్గీత. మహాభారతము సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునకు ఒనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరుగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించెను. కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథియై నిలిచెను. యుద్ధ రంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మితృలను చూచి, హృదయము ద్రవించి,
  2. స్వజనమును చంపుటకు ఇష్టపడక "నాకు విజయమూ వలదు, రాజ్య సుఖమూ వలదు" అని ధనుర్బాణములను క్రింద వైచె. దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ:
  3. దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు, అనిత్యములైన శరీరములను గూర్చిగాని, నిత్యములు, శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని దుఃఖింపరు.
  4. జీవునకు దేహమునందు బాల్యము, యౌవనము, ముసలితనము యెట్లో మరొక దేహమును పొందుటకు కూడా అట్లే కనుక ఈ విషయమున ధీరులు మోహము నొందరు.
  5. మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రములను వదలి నూతన వస్త్రములను ధరించునో అట్లే ఆత్మ (జీవాత్మ) జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నది. (2.22)
  6. ఆత్మ నాశనము లేనిది, ఆత్మను శస్త్రములు చేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు అర్పివేయును సమర్ధము కాదు. ఆత్మ నాశనము లేనిది. (2.23)
  7. పుట్టినవానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. (2.27)
  8. యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు. జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జునా! యుద్ధమును చేయు కృతనిశ్చయుడవై లెమ్ము. (2.37)
  9. కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు కాని, వాని ఫలితముపైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు. (2.47)
  10. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోనివాడును, రాగము, భయము, క్రోధము పోయిన వాడును, స్థితప్రజ్ఞుడని చెప్పబడును. (2.56)
  11. విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి, వాని యందను రాగమధికమై, అది కామముగా మారి చివరకు క్రోధమగును. (2.62) క్రోధమువలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితముముగా మనుజుడు బుద్ద్దిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. (2.63)
  12. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుస్టారము, బ్రహ్మప్రాప్తిసాధనము కలిగిన జీవుడు సంసారమున బడక, సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు.
  13. అర్జునా! ఈ లోకములో ఆత్మానాత్మ వివేకముగల సన్యాసుకలు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధిగల యోగీశ్వరులకు కర్మయోగము చేతను, ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్పబడియున్నది.
  14. అన్నము వలన జంతుజాలము పుట్టును. వర్షము వలన అన్నము సమకూరును. యజ్ఞము వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కర్మ వలననే సంభవమగును.
  15. పార్దా! నాచే నడుపబడు ఈ లోకము అను చక్రమును బట్టి, యెవడు అనుసరింపడో, వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్ధుడు, జ్ఞానీ కానివాడు సదా కర్మల నాచరించుచునే ఉండవలెను.
  16. ఉత్తములైన వారు దేని నాచరింతురో, దానినే ఇతరులును ఆచరింతురు. ఉత్తములు వేనిని ప్రమాణముగా అంగీకరింతురో లోకమంతయు దానినే అనుసరించును.
  17. అర్జునా! నీ వొనర్చు సమస్త కర్మలనూ నా యందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై, అహంకారము లేనివాడవై సంతాపమును వదలి యుద్ధము చేయుము.
  18. చక్కగా అనుస్టింపబడిన పరధర్మము కన్న, గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. ఆచరణకు అనుచితమైనది.
  19. పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామముచేత జ్ఞానము కప్పబడి యున్నది.
  20. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్దినొందునో, ఆయా సమయములయందు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంరక్షణముల కొఱకు ప్రతీయుగమునా అవతారము దాల్చుచున్నాను.
  21. అనురాగము, భయము, క్రోధము వదలి నా యందు మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి. (4:10)
  22. ఎవరెవరు యేయే విధముగా నన్ను తెలియకోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను కానీ, ఏ ఒక్కనియందు అనురాగాముకాని, ద్వేషముగాని లేవు. (4:11)
  23. ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో యెవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టివానిని పండితులని విద్వాంసులని పల్కుదురు. (4:19)
  24. యగ్నపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందనగు ఫలము గూడ బ్రహ్మమనియే తలంచవలయును. (4:24)
  25. శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్ధుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. (4:39)
  26. కర్మ, సన్యాసములు రెండునూ మోక్షసోపాన సాధనములు. అందు కర్మ పరిత్యాగము కన్నా, కర్మానుష్టానమే శ్రేష్ఠమైనది. (5:2)
  27. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పనముగా కర్మల నాచరించునో, అతడు తామరాకుకు నీటిబిందువులు అంటని రీతిగా పాపమున చిక్కుబడడు. (5:10)
  28. ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించి పరమార్థతత్వమును జూపును. (5:16)
  29. విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణునియందును శునకము శునక మాంసము వొండుకొని తినువాని యందును పండితులు సమదృష్టి కలిగి వుందురు. (5:18)
  30. దేహత్యాగమునకు ముందు యెవడు కామక్రోధాది అరిషడ్వర్గములను జయించునో, అట్టివాడు యోగి అనబడును. (5:23)
  31. ఎవడు ఇంద్రియములను జయించి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంబిమపజేసి, మనస్సును, బుద్ధిని, స్వాధీన మొనర్చుకొని, మోక్షాసక్తుడై యుండునో అట్టివాడే ముక్తుడనబడును. (5:28)
  32. సకల యజ్ఞ తపః ఫలములను పొందువానిగను, సకల ప్రపంచ నియామకునిగను, నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు. (5:29)
  33. అర్జునా! సన్యాసమని దేనినందురో, దానినే కర్మయోగ మనియు అంటారు. అట్టి యెడ సంకల్పత్యాగమొనర్పనివాడు యోగికాజాలడు. (6:2)
  34. యుక్తాహార విహారాదులు, కర్మాచరణము గలవానికి ఆత్మసంయమ యోగము లభ్యము. (6:17)
  35. గాలిలేనిచోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుననే మనోనిగ్రహము కలిగి అత్మయోగమభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును. (6:19)
  36. సకలభూతములయందూ సమదృష్టి కలిగినవాడు, అన్ని భూతములు తనయందును, తనను అన్ని భూతములయందును చూచుచుండును. (6:29)
  37. అర్జునా! ఎట్టివానికైనను, మనస్సును నిశ్చలముగా నిల్చుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాసవైరాగ్యములచేత నిరోధింపవచ్చును. (6:35)
  38. అర్జునా! పరిపూర్ణమైన విశ్వాసముతో నన్నాశ్రయించి వినయముతో ఎవరు సేవించి, భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు. (6:47)
  39. వేలకొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ది కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకోన గలుగుచున్నాడు. (7:౩)
  40. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి యెనిమిది విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపుము.
  41. అర్జునా! నా కన్నా గొప్పవాడుగాని, గొప్పవస్తువుగాని, మరేదియును ఈ ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గ్రుచ్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమై ఉంది. (7:7)
  42. భూమియందు సుగంధము, అగ్నియందు తేజము, యెళ్ళ భూతముల యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగుము. (7:9)
  43. పార్దా! త్రిగునాత్మకము, దైవసంబందమగు నా మాయ అతిక్రమింపరానిది. కాని నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభసాధ్యము. (7:14)
  44. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు, జ్ఞానులు అను నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్నాశ్రయించుచున్నారు. (7:16)
  45. జ్ఞానసంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞానియై నన్ను శరణమునొందుచున్నాడు. (7:19)
  46. ఎవడు అంత్య కాలమున నన్ను స్మరించుచు శరీరమును వదలుచున్నాడో, వాడు నన్నే చెందుచున్నాడు. (8:5)
  47. అర్జునా! ఎవడు అభ్యాసయోగముతో, ఏకాగ్రచిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించునో, అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణపురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువుకన్నా అణువు, అనూహ్యమైన రూపము కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారమున కన్నా ఇతరుడు. (8:8,9)
  48. ఇంద్రియగోచరము కాని పరబ్రహ్మపదము శాశ్వతమైనది. పునర్జన్మ రహితమైన ఆ ఉత్తమపదమే పరమపదము. (8:21)
  49. జగత్తునందు శుక్ల, కృష్ణములనెడి రెండు మార్గములు నిత్యములుగా నున్నవి. అందు మొదటి మార్గము వలన జన్మ రాహిత్యము, రెండవదాని వలన పునర్జన్మము కలుగుచున్నవి. (8:26)
  50. యోగియైనవాడు వేదాధ్యయనము వలన, యగ్నతపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మ పదవిని పొందగలడు. (8:28)
  51. పార్దా! ప్రళయకాలమునందు సకల ప్రాణులును, నాయందు లీనమగుచున్నవి, మరల కల్పాదియందు సకల ప్రాణులను నేనే సృష్టించుచున్నాను. (9:7)
  52. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందును నన్నే ధ్యానించుచుండునో, అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను. (9:22)
  53. ఎవడు భక్తితో నాకు పత్రమైనాను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడో, అట్టి వానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. (9:26)
  54. పార్దా! నాయందు మనస్సు లగ్నముచేసి యెల్లకాలము యందు భక్తీ శ్రద్దలతో స్థిరచిత్తుడవై పుజించితినేని నన్నే పొందగలవు. (9:34)
  55. కశ్యాపాది మహర్షి సప్తకము, సనకసనందనాదులు, స్వయంభూవాది మనువులు నావలననే జన్మించిరి. పిమ్మట వారివలన ఎల్లలోకమందలి సమస్త భూతములు జన్మించును. (10:6)
  56. పండితులు నాయందు చిత్తముగలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావ మెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు బ్రహ్మానందము ననుభవించుచున్నారు. (10:9)
  57. సమస్తభూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి, పెంపు నాశములకు నేనే కారకుడను. (10:20)
  58. వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందరి బుద్ధి నేనే. (10:22)
  59. రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే. (10:౩౦)
  60. లోకమునందు ఐశ్వర్యయుక్తమై, పరాక్రమయుక్తమై, కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజోభాగము వలననే సంభవములు.
  61. పార్దా! దివ్యములై, నానావిధములై, అనేక వర్ణములై, అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కనులార దర్శింపుము. (11:5)
  62. ప్రభో కృష్ణా! దేవా! ఎల్లదేవతలు, ఎల్లప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకీ మొదలగుగాగల యెల్ల సర్పములు నీయందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వరా! నీ విశ్వరూపము అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పియున్నది. అట్లయ్యుయు నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై, ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుటవలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో! నా యందు దయముంచి నాకు ప్రసన్నుడవు కమ్ము కృష్ణా! ప్రసన్నుడవు కమ్ము. (11:15,16,20)
  63. అర్జునా! ఈ ప్రపంచమునెల్ల నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్ధమునకు సిద్దపడినవారిని నీవు చంపకున్నను బ్రతుకగల వారిందెవ్వరును లేరు. (11:32)
  64. ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రధ కర్ణాది యోధ వీరులు నాచే సంహరింపబడిరి. ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపుము. (11:34)
  65. అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి, కిరీటము, గద, చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింప గోరుచున్నాను కృష్ణా... (11:46)
  66. అర్జునా! నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరునూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరునూ సదా కోరుచుందురు. (11:52)
  67. ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి, శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టివారు నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు. (12:2)
  68. అభ్యాసయోగము కన్న జ్ఞానము, జ్ఞానము కన్న ధ్యానము, దానికన్న కర్మఫలత్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వల్ల సంసార బంధనము తొలగి, మోక్షప్రాప్తి సంభవించుచున్నది. (12:12)
  69. ఎవడు కోరికలు లేనివాడై, పవిత్రుడై, పక్షపాతరహితుడై, భయమును వీడి, కర్మఫలత్యాగియై నాకు భక్తుడగునో, అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు. (12:16)
  70. శత్రుమిత్రులయందును, మానావమానములయందును, శీతోష్ణ సుఖ దుఃఖాదులయందును సమబుద్ధి కలిగి సంగరహితుడై, నిత్యసంతుస్టుడై, చలించని మనస్సు గలవాడై, నా యందు భక్తిప్రవత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు.
  71. అర్జునా! దేహము క్షేత్రమనియు, దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు. (13:1)
  72. ఆత్మజ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు ద్రుష్టి కలిగియుండుట జ్ఞానమార్గములనియు, వానికి ఇతరములైనవి అజ్ఞానము లనియు చెప్పబడును. (13:11)
  73. ప్రకృతిని ‘మాయ’ యని యందురు. అది శరీర సుఖదుఃఖాదులను తెలియజేయును. క్షేత్రజ్ఞుడు, ఆ సుఖదుఃఖాదులను అనుభవించుచుండెను. (13:20)
  74. శరీరము నశించినను, తాను నశింపక, ఎవడు సమస్త భూతములందున్న పరమేశ్వరుని చూచునో, వాడే యెరిగినవాడు. (13:27)
  75. అర్జునా! గుణనాశరహితుడైనవాడు పరమాత్మ, అట్టి పరమాత్మ దేహాంతర్గుడయ్యెను. కర్మలనాచారించువాడు కాడు. (13:31)
  76. పార్దా! సుర్యుడోక్కడే యెల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింప జేయుచున్నాడో, ఆ విధముగానే క్షేత్రజ్ఞుడు యెళ్ళ దేహములను ప్రకాశింపజేయుచున్నాడు. (13:౩౩)
  77. జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీస్వరులు మోక్షమును పొందిరి. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుచున్నాను. (14:1)
  78. అర్జునా! ప్రపంచమున జన్మించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది. నేను (పరమాత్మ) తండ్రి వంటివాడను.
  79. అర్జునా! త్రిగుణములలో సత్వగుణము నిర్మలమగుటంజేసి, సుఖ జ్ఞానాభిలాషల చేత, ఆత్మను దేహమునందు బంధించు చున్నది. (14:6)
  80. ఓ కౌంతేయా! రజో గుణము కోరికలయందు అభిమానము, అనురాగము పుట్టించి, ఆత్మను బంధించుచున్నది.
  81. అజ్ఞానము వలన బుట్టునది తమోగుణము, అది సర్వప్రాణులను మొహింపజేయునది. ఆ గుణం, మనుజుని ఆలస్యముతోను, అజాగ్రత్తతోను, నిద్రతోను బద్ధునిజేయును.
  82. మానావమనములయందు, శత్రుమిత్రులయందు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతుడందురు.
  83. బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారము కొమ్మలుగా గల అశ్వర్థవృక్షము అనాది అయినది. అట్టి సంసారవృక్షమునకు వేదములు ఆకులు వంటివి. అట్టిదాని నెరింగినవాడే వేదార్ధసార మెరింగినవాడు.
  84. పునరావృత్తి రహితమైన మోక్షపధము, సుర్యచంద్రాదుల ప్రకాశమున కతీతమై, నా ఉత్తమ పథమై యున్నది.
  85. దేహులందు జఠరాగ్నిస్వరూపుడనై, వారు భుజించు భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను.
  86. పార్దా! సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరులను వంచింపకుండుట, కావరము లేకుండుట మొదలుగు గుణములు దైవాంశ సంభూతులకుండును. అట్లే డంబము, గర్వము, అభిమానము, క్రోధము, కఠీనపు మాటలాడుట, అవివేకము, మొదలగు గుణములు రాక్షసాంశమున బుట్టిన వారికుండును.
  87. కామ, క్రోధ, లోభములు ఆత్మను నాశమును చేయును. అవి నరకప్రాప్తికి హేతువులు కావున, వానిని వదలి వేయవలెను.
  88. శాస్త్రవిషయముల ననుసరింపక యిచ్చామార్గమున ప్రవర్తించువాడు సుఖసిద్దులను పొందజాలడు. పరమపదమునందజాలడు.
  89. జీవులకు గల శ్రద్ధ, పూర్వజన్మవాసనాబలము వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని మూడు విధములుగా నున్నవి.
  90. సత్వగుణులు దేవతలను, రాజోగుణులు యక్షరాక్షసులను, తమోగుణులు భూతప్రేతగణంబులను శ్రద్ధాభక్తులతో పూజించుచుందురు.
  91. ఇతరుల మనస్సుల నొప్పింపనిదియు, ప్రియము, హితములతో కూడిన సత్యభాషనము, వేదాద్యన మొనర్చుట, వాచకతపస్సని చెప్పబడును.
  92. జ్యోతిష్టోమాది కర్మల నాచరింపకుండుట సన్యాసమనియు, కర్మఫలము, ఈశ్వరార్పణ మొనర్చుట త్యాగమనియు పెద్దలు చెప్పుదురు.
  93. కర్మములు ప్రియములు, అప్రియములు, ప్రియాతి ప్రియములని మూడు విధములు. కర్మఫలము కోరినవారు జన్మాంతరములందు ఆ ఫలములను పొందుచున్నాడు. కోరని వారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలకున్నారు.
  94. అర్జునా! కర్మమోక్షమార్గముల, కర్తవ్య భయాభయముల, బంధమోక్షముల, ఏ జ్ఞానమెరుగుచున్నదో అది సత్వగుణ సముద్భనమని ఎరుగుము.
  95. ఈశ్వరుడు యెల్ల భూతములకు నియామకుడై, ప్రాణుల హృదయ ముందన్నవాడై, అంత్రగాడు బొమ్మలనాడించు రీతిగా ప్రాణుల భ్రమింపజేయుచున్నాడు.
  96. సమస్త కర్మల నాకర్పించి, నన్నే శరణుబొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తుని గావింతును. నీవు చింతింపకుము.
  97. ఎవడు పరమోత్క్రష్టమైనదియు, పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకుపదేశము చేయుచున్నాడో వాడు మోక్షమున కర్హుడు.
  98. ధనంజయా! పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రమును చక్కగా వింటివా? నీ అజ్ఞాన జనితమైన అవివేకము నశించినదా?
  99. కృష్ణా! అచ్యుతా! నా అవివేకము నీ దయవలన తొలగెను. నాకు సుజ్ఞానము లభించింది. నాకు సందేహములన్నియు తొలగినవి. నీ ఆజ్ఞను శిరసావహించెదను.
  100. యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్దారియగు అర్జునుడు, ఎచట నుందురో, అచ్చట సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు నీతి యుండును.
    గీతాశాస్త్రమును ఎవరు పటింతురో వారు భయశోకాది వర్జితులై విష్ణు సాయుజ్యమును పొందుదురు.

ఇవి కూడా చూడండి

మార్చు
వికీసోర్స్‌లో ఉన్న భగవద్గీత పాఠానికి అధ్యాయాల ప్రకారం లింకులు
  1. అర్జునవిషాద యోగః -- (సంస్కృతము) (తెలుగు)
  2. సాంఖ్య యోగః -- (సంస్కృతము) (తెలుగు)
  3. కర్మ యోగః -- (సంస్కృతము ) (తెలుగు)
  4. జ్ఞాన యోగః -- (సంస్కృతము ) (తెలుగు)
  5. కర్మసన్యాస యోగ: -- (సంస్కృతము) (తెలుగు)
  6. ఆత్మసంయమ యోగః -- (సంస్కృతము ) (తెలుగు)
  7. జ్ఞానవిజ్ఞాన యోగః -- (సంస్కృతము) (తెలుగు)
  8. అక్షరపరబ్రహ్మ యోగః -- (సంస్కృతము) (తెలుగు)
  9. రాజవిద్యారాజగుహ్య యోగః -- (సంస్కృతము) (తెలుగు)
  10. విభూతి యోగః -- (సంస్కృతము) (తెలుగు)
  11. విశ్వరూప సందర్శన యోగః -- (సంస్కృతము) (తెలుగు)
  12. భక్తి యోగః -- (సంస్కృతము) (తెలుగు)
  13. క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగః -- (సంస్కృతము) (తెలుగు)
  14. గుణత్రయవిభాగ యోగః -- (సంస్కృతము) (తెలుగు)
  15. పురుషోత్తమప్రాప్తి యోగః -- (సంస్కృతము) (తెలుగు)
  16. దైవాసురసంపద్విభాగ యోగః -- (సంస్కృతము) (తెలుగు)
  17. శ్రద్దాత్రయవిభాగ యోగః -- (సంస్కృతము) (తెలుగు)
  18. మోక్షసన్యాస యోగః -- (సంస్కృతము) (తెలుగు)

మూలాలు

మార్చు

ఈ వ్యాసం రచనలో ఉపయుక్తమైన వనరులు

మార్చు
  • శ్రీమద్భగవద్గీత - తత్వవివేచనీ వ్యాఖ్య - రచన: జయదయాల్ గోయందకా - గీతాప్రెస్, గోరఖ్‌పూర్ ప్రచురణ (2002)
  • భగవద్గీత యథాతథము - రచన: ఏ.సి.భక్తివేదాంత ప్రభుపాద రచన - ప్రచురణ: భక్తివేదాంత బుక్‌ట్రస్ట్, హైదరాబాదు (2006)
  • శ్రీ మదాంధ్ర సంపూర్ణ మహాభారతము - బొమ్మకంటి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, కొంపెల్ల వేంకటరామశాస్త్రి - ప్రచురణ: గొల్లపూడి వీరాస్వామి సన్స్, రాజమండ్రి (2001)
  • శ్రీమద్భగవద్గీతా పరిచయం - సంకలనం: బాలగంగాధర పట్నాయక్, దీపశిఖ, ఒడిషా - శ్రీ శాంతి ఆశ్రమం, తూర్పుగోదావరి జిల్లా - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం

బయటి లింకులు

మార్చు
  • భగవద్గీత

https://web.archive.org/web/20161027062530/http://www.thraithashakam.org/publications/telugu/pdf/Thraitha-Siddhantha-Bhagavadgeetha.pdf

  • భగవద్గీత మొదటి భాగము

భగవద్గీత తెలుగు pdf and mp3 download for free Archived 2021-01-16 at the Wayback Machine [3] (తెలుగు) -> శ్రీ దయానంద పొన్నాల రాజయోగి, శ్రీమద్రామడుగు శివరామదీక్షిత అచల గురుపీఠ రాజయోగ ఆశ్రమము, సికింద్రాబాదు.

వ్యాఖ్యానాలు

మార్చు

వినండి(ఆడియో)

మార్చు

అవీ, ఇవీ

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=భగవద్గీత&oldid=4010876" నుండి వెలికితీశారు