బాపు దర్శకత్వంలో ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల ప్రధానపాత్రలుగా 1967లో విడుదలైన సినిమా సాక్షి. సాక్షి బాపు దర్శకుడిగా తీసిన మొట్టమొదటి చిత్రం. ఈ చిత్రం తీసే సమయానికి కృష్ణగాని, విజయనిర్మల గాని ప్రేక్షకులకి అంతగా తెలియదు. ఈ సినిమాలో వీరిద్దరూ ఏవిధమైన మేకప్ లేకుండా నటించారు. రంగారావు అనే నటుడు ఈ చిత్రంలో కరణం పాత్రను పోషించి,ఈ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకుని సాక్షి రంగారావుగా ప్రసిద్ధికెక్కాడు.

సాక్షి
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
నిర్మాణం శేషగిరిరావు
కథ ముళ్ళపూడి వెంకటరమణ
తారాగణం కృష్ణ,
విజయనిర్మల,
రాజబాబు,
విన్నకోట రామన్న పంతులు,
సాక్షి రంగారావు,
జగ్గారావు (మస్తాన్),
విజయలలిత,
శివరామకృష్ణయ్య,
చలపతిరావు
సంగీతం కె.వి.మహదేవన్,
సహాయకుడు పుహళేంది
నేపథ్య గానం చిత్తరంజన్,
పి.బి. శ్రీనివాస్,
ఘంటసాల,
పి. సుశీల
నృత్యాలు పసుమర్తి కృష్ణమూర్తి
సంభాషణలు ముళ్ళపూడి వెంకటరమణ
ఛాయాగ్రహణం పి.ఎన్. సెల్వరాజ్
నిర్మాణ సంస్థ నందనా ఫిలిమ్స్
(శ్రీరమణ చిత్ర?)
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నిర్మాణం మార్చు

అభివృద్ధి మార్చు

ముళ్ళపూడి వెంకటరమణ ఆంగ్ల చలనచిత్రం high noon అనుసరించి సాక్షి అనే కథను రాశారు.[1] సాక్షి చిత్రకథను చాలావరకూ ఆ సాక్షి కథనే ఆధారంగా చేసుకుని తయారుచేసుకున్నారు. కనుక ఈ సినిమా మూలకథాంశంపై హై నూన్ ప్రభావం ఉందని చెప్పవచ్చు. కథలో చివరకు కథానాయకుడి పాత్ర కూడా మంచి పాత్ర కాదన్న విషయం తెలుస్తుంది. ఐతే సినిమాకు అనుగునంగా ఆ విషయాన్ని తీసివేసి సినిమా కథానాయకుడిని అమాయకుడిగా నిలిపారు.[2]
అప్పటికి పెద్ద హీరోలతో తీస్తున్న భారీ బడ్జెట్ సినిమాలు పరాజయం పాలవుతూండడంతో నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ వారు చిన్న బడ్జెట్లో తీసే సినిమాలకు ఫైనాన్స్ చేద్దామన్న పాలసీకి వచ్చారు. దాంతో బాపురమణలు వారిని ఈ సినిమా కథతో సంప్రదించారు. ఆ మీటింగ్ లో భాగంగా నవయుగ ప్రతినిధులు "మీకు అక్కినేని నాగేశ్వరరావు, దుక్కిపాటి మదుసూదనరావు తెలుసు కదా, పైగా అక్కినేని జీవితచరిత్ర కూడా రాసినట్టున్నారు, మరి వారికి ఈ ప్రయత్నాలు తెలుసా?" అని అడిగారు. దానికి రమణ-తెలియదని, చెప్పలేదని, లక్షలతో వ్యాపారమైన సినిమారంగంలో ఇలాంటి సిఫార్సులు నాకిష్టంలేదని, నచ్చితే అవకాశమివ్వమని సమాధానం చెప్పారు. అంతటి సినీతారలు తెలిసినా, నిజాయితీగా అవకాశం అడగడం నచ్చి వారు ఫైనాన్స్ చేయడానికి ముందుకువచ్చారు. సినిమా పూర్తిగా అవుట్-డోర్ లో షూటింగ్ చేసి, కొత్తవారిని హీరోహీరోయిన్లుగా పెట్టుకుని, పాటలు లేకుండా తీస్తామన్నారు. కథ విన్నాకా, వారు అవుట్-డోర్ షూటింగ్, కొత్తవారు వరకూ సరే కానీ పాటలు లేకపోవడం తెలుగువారు అంగీకరించలేరని చెప్పడంతో, ట్రీట్ మెంట్లో మార్పులు చేసుకుని పాటలు కూడా చేర్చారు. అలాగే బాపు అంతకుముందు ఎక్కడా పనిచేయకపోవడంతో, రమణనే దర్శకత్వం వహించి బాపును సహాయకునిగా తీసుకోమనీ అడిగారు. బాపుకు దర్శకత్వం మీదున్న పట్టు తనకు లేదని, తాను రచయితనేనని చెప్పి ఒప్పించారు. అయితే ఇందరు కొత్త టెక్నీషియన్లతో పనిచేయడంలో కనీసం కెమేరామాన్ అయినా సీనియర్ని తీసుకోవాలని, అన్నపూర్ణ చిత్రాలకు ఛాయాగ్రాహకులైన సెల్వరాజ్ పేరు సూచించారు. అలాగే తీసుకున్నారు. బాపురమణలు ఇతర సన్నిహితులు కలిపి పాతికవేల రూపాయలు ఆంధ్రాబ్యాంకు ఖాతాలో జమచేసి ఆ రసీదు పంపగా నవయుగ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రూ.50వేలు ఫైనాన్స్ చేసింది. దాంతో సినిమా ప్రారంభమైంది.[3]

చిత్రీకరణ మార్చు

పులిదిండి గ్రామంలో సాక్షి చిత్రీకరణ సాగింది. ఈ సినిమా స్క్రిప్ట్ పని పూర్తిచేసి, ఫైనాన్సు చేసేందుకు నవయుగ వారిని ఒప్పించగానే బాపురమణలు ఓ మ్యాప్ గీసుకున్నారు. సినిమాలో అనుకున్న గ్రామం ఎలావుంటుంది అన్న మ్యాప్ అది. అందులో బల్లకట్టు ఉన్న ఓ కాలవ, కాలవ దగ్గర రేవులో ఓ పెద్ద మర్రిచెట్టు, రేవు నుంచి ఊరికి చిన్న బాట, ఊళ్ళో ఓ చిన్న గుడి, గుడికో మండపం.. ఇలా తమ సినిమా కథకు అవసరమైన పల్లెటూరిని మ్యాప్ గా గీశారు. గోదావరి పరిసరాల్లో ప్రభుత్వ ఇరిగేషన్ డిపార్ట్ మెంటులో పనిచేసి అప్పటికి సీలేరు ప్రాజెక్టు ఇంజనీరుగా పనిచేస్తున్న బాపు రమణల బాల్యమిత్రుడు, రచయిత బి.వి.ఎస్.రామారావును ఆ మ్యాప్ ని పోలిన ఊరు వెతకాల్సిందిగా కోరారు. రామారావు ఉద్యోగానికి సెలవుపెట్టి అలాంటి ఊరి కోసం రాజమండ్రి వచ్చేసి ఇరిగేషన్ కాంట్రాక్టర్ గా పరిచయస్తులైన కలిదిండి రామచంద్రరాజుకు అలాంటి ఊరిని వెతుకుదాం సాయపడమని అడిగారు. ఆ మ్యాప్ చూసినాకా మ్యాపును పోలినట్టుగా తమ ఊరు పులిదిండే ఉందని సూచించారు.[4]
అయితే బాపురమణలు వచ్చి సినిమా చిత్రీకరించాల్సిన గ్రామం ఎంచుకోవాల్సివుంటుంది కనుక అందుకోసం వెతికేందుకు ఆయన గ్రామంలో స్వంత ఇంట్లోనే వారికి బస ఏర్పాటుచేశారు. కాలవరేవుల్లో బొబ్బర్లంక, పిచికలలంక, ఆత్రేయపురం, ఆలమూరు, పులిదిండి, కట్టుంగ వంటి గ్రామాలను చూశారు. చివరకి పులిదిండి గ్రామాన్నే ఎంచుకున్నారు.[3]
సినిమాకు అవసరమైన కొన్ని సెట్లు బి.వి.ఎస్.రామారావు వేశారు. ఈ సెట్ ఎంత సహజంగా కుదిరేలా ప్రయత్నించారంటే సినిమాలో కథానాయకుడి గుడిసె సెట్ వేసినప్పుడు, దాన్ని పాతబడిన ఇల్లుగా చూపేందుకు గ్రామంలోని పాతబడిపోయిన పాడైన గుమ్మం ఆ ఇంటివారిని అడిగి తీసుకుని వినియోగించారు. అలానే ఆ గుమ్మాన్నిచ్చిన వారికి కొత్త గుమ్మాన్ని ఏర్పాటుచేశారు. ఈ సినిమా చిత్రీకరించేందుకు ముందు బాపుకు సినిమా దర్శకత్వ విభాగంలో పనిచేసిన అనుభవమేదీ లేదు. కేవలం సినిమా విద్యార్థిగా, ఔత్సాహికునిగా ప్రారంభమై ఎవరి వద్దా అసిస్టెంటుగా పనిచేయకుండానే సినిమాల్లో అడుగుపెట్టారు. ఆయనకు షాట్ తీసే విధానాల గురించి కొంత మౌలికమైన విషయాలను ఆదుర్తి సుబ్బారావు అసిస్టెంటుగా పనిచేసిన కబీర్ దాస్ నేర్పారు. సినిమాలో మొదట అమ్మకడుపు చల్లగా అత్తకడుపు చల్లగా పాట చిత్రీకరణతో ప్రారంభించి దాదాపు 19రోజుల్లోనే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలైంది.[5]

నిర్మాణానంతర కార్యక్రమాలు మార్చు

19రోజుల్లో సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రారంభించారు. దానిలో భాగంగా కూర్పు, అప్పటికి ట్రయల్ కోసం డబ్బింగ్ చేసిన సీన్లు కాక మిగతా వాటికి డబ్బింగ్ పూర్తచేసుకున్నారు. రీరికార్డింగ్ సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ చేశారు. చివర్లో చేసే టైటిల్ మ్యూజిక్ కోసం విభిన్నమైన ప్రయత్నం చేశారు. అంతకుముందు ఓసారి బాపురమణల ముందు విజయవాడలో మారుతీ టాకీసు అధినేత బెనర్జీ పల్లెటూరి డప్పుల మేళంతో కచేరీ ఏర్పాటుచేశారు. వాటిలో డప్పులూ, కంచాలు-పలుదోము పుల్లలతో వాయిస్తూంటారు. విజయవాడలో ఈ మేళాన్ని విన్న బాపుకు టైటిల్ మ్యూజిక్ సమయంలో గుర్తుకువచ్చి, "మనది పల్లెటూరి కథే కాబట్టి ఈ డప్పులూ, కంచాల మేళమే టైటిల్ మ్యూజిక్" అని నిర్ణయించారు. బెనర్జీ, నిర్మాత డూండీ సహకారంతో ఆ మేళం చేసిన పన్నెండుమంది కళాకారుల్నీ మద్రాసు తీసుకువచ్చి డప్పులూ కంచాలతోనే మూడు గతులతో తాళాలతో స్వరపరిచి రికార్డు చేసి దాన్నే ఉపయోగించారు.[3]

బడ్జెట్ మార్చు

సినిమా బడ్జెట్ మొదట రూ.2లక్షల 50వేలుగా అంచనా వేసుకున్నారు. నిర్మాతలుగా బాపురమణలకు ఇదే మొదటి చిత్రం కావడంతో ఫైనాన్స్ చేసేందుకు నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ వారిని సంప్రదించారు. వారు అంగీకరించి బాపురమణలు రూ.25వేలు పెట్టుబడి పెట్టగానే రూ.50వేలు విడుదల చేశారు. అయితే మొట్టమొదట బాపురమణలు టెక్నీషియన్లకు, ఆర్టిస్టులకు ఎవరికైనా రూ.పదివేలు లోపే రెమ్యూనరేషన్ ఉండేలా ఎంచుకోవాలనుకున్నారు. దర్శకుడు బాపుకు రూ.10వేలు, సంగీత దర్శకుడు మహదేవన్ కు రూ.10వేలు, రచయిత రమణకు రూ.7వేలుగా అంచనా వేసుకున్నారు. అయితే నవయుగ వారు కొత్త దర్శకుడు కాబట్టి సీనియర్ని ఛాయాగ్రాహకుడిగా పెట్టుకోమనడం, అందుకు సెల్వరాజ్ ను అనుకోవడం జరిగింది. ఆయన అప్పటికే రూ.16వేలు తీసుకుంటున్న టెక్నీషియన్ కావడంతో అందుకు తగ్గట్టుగా బడ్జెట్ పెరిగింది. సినిమాలో కథానాయకునిగా పనిచేసిన రోజుల్లో కృష్ణ కొత్తనటుడు కావడంతో రూ.4వేలు, అప్పటికే బి.ఎన్.రెడ్డి వంటి ప్రతిష్ఠాత్మక దర్శకుని వద్ద పనిచేసిన నటి కావడంతో విజయనిర్మలకు రూ.6వేలు పారితోషికం ఇచ్చారు. షూటింగ్ 16రోజులు గడిచేసరికి దాదాపు రూ.లక్ష లోపుగా ఖర్చయింది. 16వ రోజున ప్రింట్ అయ్యి, ఒక వరసలో అమర్చిన ఫిలం డైరెక్టర్ ఆఫ్ ఛాయాగ్రహణంగా చేస్తున్న సెల్వరాజ్ సినిమా చిత్రీకరిస్తున్న పులిదిండికి రప్పించారు. చాలా అందంగా వచ్చినాయనిపించి, సౌండ్ ట్రాక్ 35 మీద కాకుండా సామాన్యమైన టేప్ రికార్డర్ పై రికార్డు చేసి జతచేసేశారు. దాన్ని నవయుగ డిస్ట్రిబ్యూషన్స్ మేనేజర్లు శర్మ, నర్సయ్యలకు టూరింగ్ టాకీసులో చూపించారు. సరైన సౌండ్ లేని ఆ సినిమా చూడడంతో వారికి అది నచ్చకపోగా, అప్పటివరకూ ఇచ్చిన డబ్బు మూడునెలల్లో తిరిగి ఇచ్చేయాలని మిగిలిన పెట్టుబడి కోసం వేరెవరినైనా చూసుకోమని తేల్చి చెప్పేశారు.
వేరే ఫైనాన్షియర్లు ఎవరు దొరుకుతారన్న ఆక్రోశంతో ముళ్ళపూడి వెంకటరమణ నవయుగ డిస్ట్రిబ్యూషన్ సంస్థలో వాటాదారు, వసూళ్ళ విభాగానికి ఇన్ ఛార్జి అయిన చంద్రశేఖరరావుతో "ముహూర్తాలు పెట్టుకుని, చివర్లో వేరే పెళ్ళికొడుకుని చూసుకోమన్నట్టు, సినిమా నవయుగ వారు ఫైనాన్సు చేస్తున్నారన్న పేరు వచ్చేసి ఈ దశలో మేము చెయ్యం అంటే ఎలా"గంటూ నిలదీశారు. అతని మాట మీద అప్పటికి రూ.75 వేలు నవయుగ వారు ఇవ్వాల్సి వుండగా, రావాల్సిన లక్షా పాతికవేల రూపాయల్లో రూ.50వేలు తగ్గించుకుని రూ.75వేలు విడుదల చేయాలని లెక్కవేసి అడిగారు నిర్మాతలు రమణ, సురేష్ కుమార్. సామాన్యంగా వసూళ్ళ విభాగమే చూసే చంద్రశేఖరరావు తప్పిపోయిన పెళ్ళి సంబంధంతో పోల్చడంతో మెత్తబడి, ఫైనాన్సు విభాగం చూసే వాసుకి ఆ దృష్టితోనే వివరించారు. దాంతో వాళ్ళు పాటల సౌండు జతచేసి, మాటలు చేర్చి డబ్బింగ్ జరిపి ఓ అయిదారు సీన్లు, పాటలు చూపించండి చూస్తామని చెప్పారు. అలాగే మద్రాసులో చేయగా, చూశారు. సినిమా వాళ్ళకు నచ్చడంతో మిగిలిన రూ.75వేలు విడుదల చేశారు.[3]

విడుదల మార్చు

ప్రచారం మార్చు

చిత్రకారునిగా ప్రసిద్ధుడైన బాపు అప్పటికే పబ్లిసిటీ డిజైనర్ గా పలు సినిమాల పోస్టర్లు చిత్రీకరించారు. ఆయన తన తొలి సినిమాకు విభిన్నమైన చిత్రాలతో వాల్ పోస్టర్లను డిజైన్ చేశారు. సినిమా గురించి "19 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తిచేసుకున్న సినిమా" అంటూ కూడా పబ్లిసిటీ చేసుకున్నారు. అయితే ఆ పబ్లిసిటీకి పరిశ్రమ వర్గాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ప్రముఖ దర్శకుడు బి.ఎన్.రెడ్డి బాపురమణలతో "వై, 19 రోజులు కాకుంటే మరో రెండొందల రోజులు తీయండి. మీరెంత బాగా తీశారన్నది పాయింటు తప్ప ఎన్ని రోజులు తీశారన్నది కాదు" అన్నారు. ప్రముఖ రచయిత, నిర్మాత చక్రపాణి "ఎన్ని రోజులు తీస్తే అన్ని రోజులే ఆడుద్ది" అంటూ వ్యాఖ్యానించారు.[3]

పంపిణీ, థియేటర్లు మార్చు

సినిమాను ప్రధానంగా నవయుగ డిస్ట్రిబ్యూషన్స్ అనుబంధ సంస్థ శ్రీఫిలింస్ డిస్ట్రిబ్యూషన్స్ వారు విడుదల చేశారు. సినిమా నిర్మాణ దశలో ఉండగానే రికార్డింగ్ థియేటర్లో పాటలు విని బావున్నాయని మెచ్చుకుని సినిమా నిర్మాతల్లో ఒకరైన సురేష్ కుమార్ తమ్ముడు బెనర్జీ మైసూర్ ప్రాంతంలో సినిమా హక్కులు కొంటానన్నారు. అయితే ఆయన విడుదల సమయం దగ్గరపడుతున్నా ఆ విషయంపై ముందుకుకదలి డబ్బు ఇవ్వకపోవడంతో వేరే డిస్ట్రిబ్యూటర్లను వెతుక్కునే పనిలో నిర్మాతలు పడ్డారు. ప్రధాన పంపిణీదారులైన శ్రీఫిలంస్ వారు సినిమా బావుందనీ, త్వరగా విడుదల చేయాలని తొందరపడుతూంటే వేరే మైసూర్ పంపిణీ విషయమై తర్జనభర్జనలు సాగాయి. ఒకరోజు మైసూరు ప్రాంతంలో సినిమా హాళ్ళూ, పంపిణీ వ్యాపారం ఉన్న భక్తవత్సల, సురేంద్ర బ్రదర్స్ వచ్చి సినిమా చూశారు. వారు వాహినీ స్టూడియోకు చెందిన మూలా నారాయణస్వామి తమ్ముడు మూలా రంగప్ప కొడుకులు. భక్తవత్సలకు సినిమా విపరీతంగా నచ్చి, తాను మైసూర్ ప్రాంతంలో పంపిణీ తీసుకుంటానన్నారు. అప్పటికి బెనర్జీ ఇరవైవేల రూపాయలు లోపే ఇస్తానన్నా అవసరాల రీత్యా ఒప్పుకున్న రమణ ఆయన ఎంతకావాలి అని అడిగేసరికి రూ.25వేలు అడిగి ఒప్పించారు. దాంతో మైసూర్ ప్రాంతంలో శారదా మూవీస్ ద్వారా విడుదల చేశారు.[3]

కథ మార్చు

గ్రామంలో పడవ నడిపేవాడు కృష్ణ. అతన్ని ప్రేమించే అమ్మాయి విజయ నిర్మల. ఊరి రౌడీ, లారీ డ్రైవరు జగ్గారావు. విజయ నిర్మల ఇతని చెల్లెలు. రౌడీ హత్య చేస్తుండగా చూసిన కథానాయకుడు, న్యాయస్థానానికి వెళ్ళి సాక్ష్యం చెప్తాడు. రౌడీకి జైలు శిక్ష పడుతుంది. కాని, రౌడీ జైలు నుంచి తప్పించుకుని వస్తున్నాడని తెలిసిన జనం, అప్పటిదాకా మెచ్చుకున్నవారే, ప్రాణ భయంతొ ఉన్న పడవాడికి ఆశ్రయం ఇవ్వటానికి నిరాకరిస్తారు. ఇక రౌడీ చేతులో ఎట్టాగో చావు తప్పదని నిబ్బరంగా ఉన్న పడవ వాడు, రౌడీ వచ్చి తన్నటం మొదలు పెట్టేసరికి, భయంలోంచి వచ్చిన తప్పనిసరి ధైర్యంతో తాగి ఉన్న రౌడీని తనకున్న శక్తి యావత్తూ వినియోగించి దెబ్బలు వేస్తాడు. ఆ రౌడీ చచ్చిపోతాడు.

విశేషాలు మార్చు

సాక్షి సినిమాలో తొలిసారి వెండితెరపై జంటగా నటించిన కృష్ణ, విజయ నిర్మల తదనంతరం ప్రేమించి వివాహం చేసుకున్నారు. సాక్షి సినిమా కోసం సందర్భంగా పులిదిండి గ్రామంలో నాయికా నాయికల మధ్య వివాహాన్ని చిత్రీకరించిన ఆలయంలోనే దరిమిలా కృష్ణ, విజయనిర్మల నిజజీవితంలోనూ పెళ్ళిచేసుకోవడం విశేషం.[6]

పాటలు మార్చు

గీతరచన మార్చు

సాక్షి సినిమా కోసం ఆరుద్ర 4 పాటలు రచించారు.[7]

స్వరకల్పన మార్చు

 • అటు వెన్నెల ఇటు వెన్నెల ఎటు చూస్తే అటు వెన్నెల - రచన: ఆరుద్ర; గానం: పి.సుశీల
 • అమ్మకడుపు చల్లగా అత్తకడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా - రచన: ఆరుద్ర; గానం: పి.సుశీల
 • దయలేదా నీకు దయలేదా ప్రాణసఖునిపై దయలేదా - రచన: ఆరుద్ర; గానం: పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ బృందం
 • పదిమంది కోసం నిలబడ్డ నీకు ఫలితం ఏమిటి? - రచన: ఆరుద్ర; గానం: మోహన్ రాజు
 • సిలిపొడా సిన్నొడా , ఘంటసాల, సుశీల , రచన: దాశరథి
 • నంద కిషోరా గోపాల కనువిందులు, బృందం
 • రాధా మాధవ భామా విలాసం,(యక్షగానం), రచన : ఆరుద్ర,పి.బి.శ్రీనివాస్, పి సుశీల , రాజబాబు,

మూలాలు మార్చు

 1. లలిత. "బొమ్మలోంచి సినిమాలోకి నడిచొచ్చిన 'బాపూ తనపు' హీరోయిన్!". సారంగ. Archived from the original on 22 మార్చి 2015. Retrieved 18 April 2015.
 2. ఎమ్.వి.ఎల్., ప్రసాద్. "ముందుమాట". కథారమణీయం-2 (1 ed.). హైదరాబాద్: విశాలాంధ్ర పబ్లికేషన్స్.
 3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 ముళ్ళపూడి, వెంకటరమణ (జూలై 2013). (ఇం)కోతి కొమ్మచ్చి (6 ed.). హైదరాబాద్: వరప్రసాద్ రెడ్డి.
 4. బి.వి.ఎస్.రామారావు (అక్టోబరు 2014). కొసరుకొమ్మచ్చి (3 ed.). హైదరాబాద్: వరప్రసాద్ రెడ్డి.
 5. బాపు. "మా సినిమాలు". నవతరంగం. Archived from the original on 15 మార్చి 2015. Retrieved 18 April 2015.
 6. శ్రీరమణ (13 డిసెంబరు 2014). "బాపు గీతలు జాతికి చక్కిలిగింతలు!". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Retrieved 24 October 2015.
 7. సాక్షి, ఆరుద్ర సినీ గీతాలు (1965-1970), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2002, పేజీలు: 60-63.