సాదనాల వేంకటస్వామి నాయుడు

సాదనాల వేంకటస్వామి నాయుడు సాహిత్య, సంగీత, నాటక, సాంస్కృతిక, సేవా రంగాలలో కృషి చేస్తున్న కళాపిపాసి.

సాదనాల వేంకటస్వామి నాయుడు
సాదనాల వేంకటస్వామి నాయుడు
Sadanala venkataswamy naidu.jpg
సాదనాల వేంకటస్వామి నాయుడు
జననం (1961-02-15) 1961 ఫిబ్రవరి 15 (వయస్సు 60)
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లులోకవిరోధి, మాధురీస్వామి, సాధన
విద్యఎం.ఏ, బి.ఎల్, బి.ఇడి, ఎం.ఫిల్, పిహెచ్.డి.
వృత్తిరైల్వే ఉద్యోగి
Organizationదక్షిణ మధ్య రైల్వే
సుపరిచితుడుకవి, గీత రచయిత
గుర్తించదగిన సేవలు
దృశ్యం, నాయుడుబావ పాటలు
జీవిత భాగస్వామిడా.మాధురి
తల్లిదండ్రులుసత్యవతి,బాలకృష్ణారావు
పురస్కారాలుబంగారు నంది,తె.వి.వి బంగారు పతకం
సంతకం
Svsnaidusign.jpg

జీవిత విశేషాలుసవరించు

సాదనాల వేంకటస్వామి నాయుడు (Sadanala Venkata Swamy Naidu) 1961, ఫిబ్రవరి 15వ తేదీన తూర్పు గోదావరి జిల్లా, ముమ్మడివరం మండలం, గేదెల్లంక గ్రామంలో సత్యవతి, బాలకృష్ణారావు దంపతులకు జన్మించాడు. విశాఖపట్నం జిల్లా, నక్కపల్లి గ్రామంలో ఇతని బాల్యం గడిచింది. రాజమండ్రి వి.టి.జూనియర్, డిగ్రీ కాలేజీలో ఇంటర్‌మీడియెట్, డిగ్రీ ఆర్ట్స్ కాలేజీలో చదివి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. (తెలుగు) పట్టా పొందాడు. రాజమండ్రి జి.ఎస్.కె.మెమోరియల్ లా కాలేజీలో లా పూర్తి చేశాడు. తెలుగు విశ్వవిద్యాలయంలో “కృష్ణాపత్రిక సాహితీసేవ ఒక పరిశీలన” అనే అంశంపై పరిశోధించి ఎం.ఫిల్.పట్టా సాధించాడు[1].ఆ తర్వాత అన్నామలై విశ్వవిద్యాలయం నుండి బి.ఇడి.చేసి కందుకూరి వీరేశలింగం ఆస్తిక డిగ్రీ కళాశాల, రాజమండ్రిలో ఆంధ్రోపన్యాసకులుగా కొంతకాలం పనిచేశాడు. తరువాత దక్షిణ మధ్య రైల్వేలో ప్రథమశ్రేణి తెలుగు పండితుడిగా డోర్నకల్ రైల్వే హైస్కూలులో పనిచేశాడు[2]. ప్రస్తుతం సికిందరాబాదు డివిజినల్ కార్యాలయంలో ఛీఫ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్యపేరు మాధురి. కుమార్తె పేరు ఆర్యాణి.

సాహిత్య రంగంసవరించు

ఇతడు కథలు, కవితలు, వ్యాసాలు, గేయాలు, నాటికలు అనేకం వ్రాశాడు. ఇతని రచనలు సమాచారం, కళాప్రభ, నేటి నిజం, అపురూప, అంజలి, రచన,ఎక్స్‌రే,ఆంధ్రజ్యోతి మొదలైన అనేక పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని కథలు, కవితలు పలు సంకలనాలలో చోటు చేసుకున్నాయి. ఇతడు రచించిన గీతాలు కేసెట్లుగా విడుదలయ్యాయి. ఆకాశవాణిలో ఇతడు వ్రాసిన గీతాలు, సంగీతరూపకాలు, నాటికలు ప్రసారమయ్యాయి. ఇతడి రచనలకు ఎన్నో బహుమతులు లభించాయి. ఇతడి రచనలు ఇంగ్లీషు, హిందీ, ఒరియా భాషలలోకి తర్జుమా అయ్యాయి. పలు సాహిత్య సంస్థలతో ఇతనికి సంబంధాలున్నాయి. అనేక సెమినార్లలో పాల్గొని పత్రసమర్పణ గావించాడు.

ముద్రిత రచనలుసవరించు

 
ఆరుద్ర నుండి పురస్కారం అందుకుంటున్న సాదనాల
 1. దృశ్యం (వచన కవితాసంపుటి)
 2. కృష్ణాపత్రిక సాహిత్య సేవ - ఒక పరిశీలన (సిద్ధాంత గ్రంథం)
 3. నాయుడు బావ పాటలు
 4. సర్వసమ్మత ప్రార్థన

అముద్రిత రచనలుసవరించు

 1. తెలుగు వచన కవులు (1930-1990)
 2. అక్షర తమాషాలు

ఆడియో కేసెట్లుసవరించు

 1. పుష్కర గోదావరి
 2. కట్టెమిగిల్చిన కన్నీటి గాథ
 3. అక్షరదీపం
 4. సుముహూర్తం
 5. మహనీయుల స్ఫూర్తితో
 6. తెలుగుతేజం
 7. విజయకెరటం

సాహితీ సంస్థలుసవరించు

 1. ది పొయెట్రీ సొసైటీ ఆఫ్ ఇండియా (న్యూఢిల్లీ) - సభ్యుడు
 2. కవిత్వం (రాజమండ్రి) - కార్యదర్శి
 3. వాగర్ధ సమాఖ్య (రాజమండ్రి) - సభ్యుడు
 4. సాహితీ సమితి (ఖమ్మం జిల్లా) - ఉపాధ్యక్షుడు
 5. ఇండియన్ హైకూ క్లబ్ (అనకాపల్లి) - ప్రాంతీయ కార్యదర్శి
 6. వాగనుశాసన వాజ్మయవేదిక - కార్యదర్శి
 7. సాహితీవేదిక - కోశాధికారి
 8. జీవనసాహితి - ముఖ్యసలహాదారు

పత్రికా రంగంసవరించు

ఇతని రచనలు పలు దిన, వార, పక్ష, మాస పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని గురించి పరిచయ వ్యాసాలు కూడా పలుపత్రికలలో వచ్చాయి. ఇతడు అక్షరవర్ధిని అనే పత్రికకు, సంవీక్షణం అనే ద్వైమాసపత్రికకు సంపాదకునిగా పనిచేశాడు.

సంగీత, నాటక రంగాలుసవరించు

ఇతడు ఆకాశవాణిలో ఆడిషన్ పాసై గాయకుడిగా అనేక జానపద గేయాలు పాడాడు. డ్రామా ఆడిషన్ పాసై బి గ్రేడ్ కళాకారుడిగా పాతికకు పైగా రేడియో నాటకాలలో నటించాడు. విజయశంకర్ ప్రభుత్వ సంగీత,నృత్య కళాశాల రాజమండ్రిలో మృదంగం, గాత్రం అభ్యసించాడు. మూషిక మరణం నాటకంతో నాటకరంగ ప్రవేశం చేశాడు[3]. అనేక నాటకాలకు రచయితగా, దర్శకుడిగా పనిచేసి స్వయంగా నటించాడు. పల్లెరథం, సంధ్యారాగం, సువ్వీ సువ్వన్నలాలి, గోదావరి చెప్పిన సుబ్బారావు కథ, అదిగో భద్రాద్రి మొదలైన సంగీత రూపకాలను వ్రాసి ఆకాశవాణిలో ప్రసారం కావించాడు. దూరదర్శన్‌లో ప్రసారమైన గురజాడ దిద్దుబాటు, కథావీధి టెలీ ఫిల్ములలో నటించాడు. 2011 నంది పద్యనాటక పోటీలకు స్కృటినీ జడ్జిగా పనిచేశాడు.

సినిమా రంగంసవరించు

ఇతడు ఆంధ్రకేసరి, సుర్ సంగం, గాలి శ్రీను మొదలైన చిత్రాలలో చిన్న పాత్రలను ధరించాడు[4]. మహానంది డాక్యుమెంటరీ చిత్రానికి టైటిల్ సాంగ్ వ్రాశాడు. దక్షిణ కాశీ - ద్రాక్షారామం, శ్రీకాళహస్తి, కొయ్యబొమ్మలతల్లి కొండపల్లి మొదలైన డాక్యుమెంటరీ చిత్రాలకు రచనాసహకారం అందించాడు.

సాంస్కృతిక, సేవా రంగాలుసవరించు

ఇతడు జేసీస్ క్లబ్, రోటరీ క్లబ్ మొదలైన సంస్థలలో సభ్యుడిగా ఉన్నాడు. భారతీయ యూత్ హాస్టల్స్ అసోసియేషన్‌ రాజమండ్రి యూనిట్‌కు కన్వీనర్‌గా వ్యవహరించాడు. 1993లో జరిగిన తానామహాసభలకు రాజమండ్రి ప్రాంత కన్వీనర్‌గా, గురజాడ ఆర్ట్స్ థియేటర్‌కు ఉపాధ్యక్షుడిగా, ది ట్రస్ట్ ఆఫ్ సర్వీస్ సంస్థకు కార్యదర్శిగా పనిచేశాడు. అక్షరాస్యత ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఉద్యమగీతాలను రచించాడు. “బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్” పేరుతో ప్రతియేటా 20మంది పేదపిల్లలకు స్కాలర్‌షిప్పులతో పాటు అప్పుడప్పుడు పిల్లలకు పుస్తకాలు, దుస్తులు, చెప్పులు ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు.

క్రీడారంగంసవరించు

ఇతడు విద్యార్థి దశలో బాల్‌బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ క్రీడలలో అంతర్ కళాశాల పోటీలలో పాల్గొన్నాడు. ప్రైమరీ స్కూలు చదివే సమయంలోనే స్కౌట్‌లో కబ్‌గా చేరాడు. దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగంలో చేరిన తర్వాత అడ్వాన్స్ స్కౌట్ మాస్టర్‌గా, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కమీషనర్‌గా, డిస్ట్రిక్ట్ కమీషనర్‌గా వివిధ హోదాలలో సేవలను అందించాడు. పాయకరావుపేట, శృంగవరపుకోట, విజయనగరం, హుబ్లీ, హరిద్వార్, జాల్నా, గద్వాల్, గుంతకల్, డార్జిలింగ్, సిమ్లా తదితర ప్రాంతాలలో ర్యాలీలలో పాల్గొన్నాడు. స్కౌటింగులో హిమాలయన్‌వుడ్ బ్యాడ్జ్ సాధించాడు. భారతీయ రైల్వే తరఫున లండన్‌లోని ఛెమ్స్‌ఫర్డ్‌లో జరిగిన వరల్డ్ జంబోరీలో పాల్గొన్నాడు[5].

పురస్కారాలు, సత్కారాలుసవరించు

 
నంది నాటక పురస్కార సభలో బంగారు నంది స్వీకరిస్తున్న సాదనాల
 • 2012 ఫిబ్రవరిలో గుంటూరులో జరిగిన నంది నాటక ప్రదానోత్సవ సభలో బంగారు నంది ప్రదానం
 • రాష్ట్రస్థాయి ఉత్తమ కవితాసంపుటిగా దృశ్యం పుస్తకానికి తడకమట్ల సాహితీ పురస్కారం
 • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
 • తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా సత్కారం
 • జేసీస్ క్లబ్ ఔట్‌స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డ్
 • రోటరీ లిటరరీ అవార్డ్
 • దక్కన్ యువకవితోత్సవ్‌లో ఉత్తమ కవితా పురస్కారం
 • బూర్గుల రామకృష్ణారావు స్మారక రాష్ట్రస్థాయి కవితలపోటీలో ప్రథమ బహుమతి
 • సమతా రచయితల సంఘం, అమలాపురం వారి సాహిత్య పురస్కారం
 • యు.టి.ఎఫ్. ఖమ్మం జిల్లా శాఖ నిర్వహించిన గేయరచనల పోటీలో ప్రథమ బహుమతి
 • లయన్స్ క్లబ్ తెనాలి నిర్వహించిన రాష్ట్రస్థాయి కవితల పోటీలో ప్రథమ బహుమతి
 • సిలికానాంధ్ర, రచన పత్రికలు సంయుక్తంగా నిర్వహించిన గేయరచన పోటీలో బహుమతి
 • ఎక్స్‌రే,మానస, కళాదర్బార్ మొదలైన సాహిత్యసంస్థలు నిర్వహించిన కవితలపోటీలలో బహుమతులు.

మూలాలుసవరించు

 1. న్యూస్ టుడే (1990-01-06). "కవిత ఏదయినా అది సమాజం కోసమే - సాదనాల మనోదృశ్యం". ఈనాడు దినపత్రిక తూర్పుగోదావరి జిల్లా సంచిక.
 2. ఎన్.తిర్మల్ (2005-11-13). "బహుముఖ రసజ్ఞుడు సాదనాల". కిన్నెరసాని శీర్షిక ఆంధ్రజ్యోతి దినపత్రిక ఖమ్మం ఎడిషన్.
 3. కల్చరల్ కంట్రిబ్యూటర్, ఖమ్మం (2002-09-06). "సంగీత, సాహిత్య, నాటకకళల్లో సంచలనం 'సాదనాల'". ఆంధ్రభూమి దినపత్రిక ఖమ్మం ఎడిషన్.
 4. న్యూస్‌లైన్, డోర్నకల్. "సాహితీమూర్తి సాదనాల". సాక్షి దినపత్రిక వరంగల్ జిల్లా 'కాకతీయ కళలు' శీర్షిక.
 5. ఆన్‌లైన్ - ఖమ్మం. "సాహితీ బంధువు సాదనాల". ఆంధ్రజ్యోతి దినపత్రిక.

బయటి లింకులుసవరించు