స్వర్ణకమలం

1988 సినిమా

స్వర్ణకమలం కె. విశ్వనాథ్ దర్శకత్వంలో 1988లో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా. వెంకటేష్, భానుప్రియ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను కె. ఎస్. రామారావు సమర్పణలో భాను ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సి. హెచ్. వి. అప్పారావు నిర్మించాడు. ఈ చిత్రానికి లోక్ సింగ్ ఛాయాగ్రాహకుడిగా, జి. జి. కృష్ణారావు ఎడిటరుగా పనిచేశారు. ఈ చిత్రానికి దర్శకుడు కె. విశ్వనాథ్ కథ, స్క్రీన్ ప్లే అందించాడు. తోటపల్లి సాయినాథ్ మాటలు రాశాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటలకు ఇళయరాజా అందించిన ఈ చిత్ర సంగీతం శ్రోతల ఆదరణ పొందింది.

స్వర్ణకమలం
Swarnakamalam.jpg
దర్శకత్వంకె.విశ్వనాధ్
నిర్మాతసి. హెచ్. వి. అప్పారావు,
కె. ఎస్. రామారావు (సమర్పణ)
రచనకె. విశ్వనాథ్ (స్క్రీన్ ప్లే/కథ),
తోటపల్లి సాయినాథ్ (మాటలు)
నటులువెంకటేష్,
భానుప్రియ
సంగీతంఇళయరాజా
ఛాయాగ్రహణంలోక్ సింగ్
కూర్పుజి. జి. కృష్ణారావు
నిర్మాణ సంస్థ
విడుదల
1988 జూలై 15 (1988-07-15)
నిడివి
143 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

చిత్రకారుడైన యువకుడు తన పొరుగింటిలో ఉండే వృద్ధబ్రాహ్మణ విద్వాంసుని కుమార్తెలోని నాట్యకళా కౌశలం గుర్తించి ఆమెను ప్రోత్సహించి ఉన్నత శిఖరాలకు చేరేలా చేయడం కథాంశం. ఈ సినిమా ఉత్తమ చిత్రంగా బంగారు నంది పురస్కారం అందుకొనగా, ఉత్తమ నటిగా భానుప్రియ, ఉత్తమ నటుడిగా వెంకటేష్ ప్రత్యేక జ్యూరీ నంది పురస్కారాలు అందుకున్నారు. ఇంకా ఈ చిత్రం దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు, సినిమా ఎక్స్‌ప్రెస్ పురస్కారాలను కూడా అందుకుంది. ఈ సినిమాకు కె.వి. సత్యనారాయణ నృత్య దర్శకత్వం చేశాడు.

కథసవరించు

మీనాక్షి (భానుప్రియ), సావిత్రి (దేవీ లలిత) కూచిపూడి నాట్యంలో నిష్ణాతులైన శేషేంద్ర శర్మ ఇద్దరు కూతుర్లు. ఆయన నాట్యంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన వాడైనా పెద్దగా కలిగిన కుటుంబం కాకపోవడంతో తన ఇద్దరు కూతుళ్ళకూ అందరిలాగే చదువు చెప్పించలేక పోతాడు. కానీ సావిత్రికి కర్ణాటక సంగీతం లో, మీనాక్షికి కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇస్తాడు. సావిత్రి తనకు తెలిసిన విద్యను గౌరవప్రదంగా ఎంచి దాన్నే జీవనాధారంగా భావిస్తుంటుంది. కానీ రెండవ కూతురు మీనాక్షి మాత్రం నాట్యం లాంటి కళలు కడుపు నింపవనే భావన కలిగి ఉంటుంది. సాధారణంగా అందరూ అభిమానించే విలాసవంతమైన జీవనం గడపాలని కోరుకుంటుంది. ఇవన్నీ కేవలం ఆమె అక్కతోనే చెప్పుకుంటుంది.

ఇదిలా ఉండగా వారి ఇంటి పక్కన ఇంట్లోకి చంద్రశేఖర్ (వెంకటేష్) అనే చిత్రకారుడు అద్దెకు దిగుతాడు. ఆమెలోని నాట్యాన్ని చూసి అభిమానిస్తాడు. కానీ ఆమె అయిష్టతను గమనించి బాధపడతాడు. వారి కుటుంబానికి చిన్న చిన్న పనుల్లో సహాయపడుతూ వారికి చేదోడు వాదోడుగా ఉంటాడు. ఆమె చేత ఎలాగైనా నాట్య ప్రదర్శన ఇప్పించాలని ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చేయిస్తాడు. అయితే ఆమె అయిష్టంగా అందుకు ఒప్పుకొని నాట్యం మధ్యలో సగంలో నిలిపివేయడంతో ఆమె తండ్రి నాట్యాన్ని కొనసాగిస్తాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆయన నాట్యం చేస్తుండగానే మరణిస్తాడు. తన తండ్రి మరణానికి తనే కారణమయ్యానని బాధ పడుతుంటుంది. ఆమెకు అమెరికాకు వెళ్ళే ఆసక్తిని గమనించిన చంద్రశేఖర్ ఆమెను కూచిపూడి నృత్యంలో మంచి ప్రావీణ్యం సంపాదించేలా ప్రయత్నించి భారతీయ నృత్యంలో ప్రసిద్ధురాలైన ఒక అమెరికా నర్తకి సాయంతో అక్కడికి వెళ్ళేలా ప్రోత్సహిస్తాడు. అమెరికా వెళ్ళడానికి ఎయిర్‌పోర్ట్ దాకా వెళ్ళిన ఆమె, చంద్రశేఖర్ కు తనమీద ఉన్న ప్రేమను అర్థం చేసుకుని తిరిగి వచ్చేస్తుంది. ఇద్దరూ కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

తారాగణంసవరించు

నిర్మాణంసవరించు

ఈ సినిమాలో కీలక భాగం కథానాయిక చుట్టూనే తిరుగుతుంది. ఈ పాత్రను భానుప్రియ పోషించగా, ఆమెకు స్ఫూర్తి కలిగించే పాత్రలో కథానాయకుడి పాత్రలో వెంకటేష్ నటించాడు.[1][2] ఈ సినిమాలో కథానాయికకు స్ఫూర్తిని కలిగించే నర్తకి పాత్రలో షారన్ లోవెన్ తన నిజ జీవిత పాత్రలో నటించింది.[3] మొదట్లో ఈ పాత్రకు యామిని కృష్ణమూర్తి, సంయుక్త పాణిగ్రాహి మొదలైన వారిని అనుకున్నారు. ఒకసారి షారన్ దూరదర్శన్ కి ఇచ్చిన ముఖాముఖిలో ఆమెను చూసిన చిత్రబృందం ఆ పాత్ర ఈమెకు సరిపోతుందని భావించారు. ఆమెకు తర్వాత వేరే సినిమాల్లో నటించడానికి అవకాశాలు వచ్చినా మళ్ళీ నటించలేదు.[4] ఈమె స్వతహాగా ఒడిస్సీ కళాకారిణి. కాబట్టి ఆమెకు కూచిపూడి గురువైన వెంపటి చిన్నసత్యం తో ఒక నెలరోజుల పాటు ఆ నృత్యం నేర్పించి సినిమా కోసం చిత్రీకరిద్దామనుకున్నారు. కానీ ఆమె స్వల్ప సమయంలో తాను అందులో మెలకువలు పూర్తిగా ఆకళింపు చేసుకోలేకపోవచ్చుననీ, ఇంకా ఈ సినిమా తర్వాత ఆమెను ఎవరైనా కూచిపూడి ప్రదర్శన కోసం ఆహ్వానించడం తనకు ఇష్టం లేదని తెలిపింది. దర్శకుడు ఆమె అభిప్రాయాన్ని గౌరవించి ఒడిస్సీ నృత్యాన్నే సినిమాలో ఉంచడానికి అంగీకరించాడు. ఈ చిత్రం కోసం భారతదేశంలోని పలు ప్రాంతాల నృత్యకళాకారులు ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేశారు.

ఈ చిత్రంలో మీనాక్షి తండ్రి పాత్రను పోషించిన ఘంటా కనకారావు నిజజీవితంలో నాట్యాచార్యుడే. ఆయనది ఏలూరు. ఈ చిత్రంలో నాట్యం చేస్తూ వేదిక మీదే మరణించినట్లుగానే నిజజీవితంలో కూడా మరణించడం యాధృచ్చికం. మీనాక్షి అక్కపాత్ర పోషించిన నటి దేవిలలిత. ఈమెను ఓ టీవీ సీరియల్ లోచూసిన తర్వాత ఈ పాత్రకి ఎంపిక చేశారు దర్శక నిర్మాతలు. ఇంటి యజమాని పాత్ర పోషించింది కె. ఎస్. టి. సాయి. ఆయన కుమారుడు, వయొలిన కళాకారుడిగా పోషించిన నటుడు కూడా నిజజీవితంలో వయొలిన్ కళాకారుడే. వీరెవరూ అప్పటికి పేరున్న కళాకారులేమీ కాదు. కానీ దర్శకుడు విశ్వనాథ్ తాను రాసుకున్న పాత్రల కోసం వీరైతేనే బాగుంటుందని ఎన్నుకున్నాడు. హాస్యం కోసం సృష్టించిన ఓంకారం, అఖిలం పాత్రలను సాక్షి రంగారావు, శ్రీలక్ష్మి పోషించారు.[5]

పాటలుసవరించు

ఈ సినిమాలో పాటలు జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో చిత్రీకరించారు.[6] శృతిలయలు, స్వాతికిరణం, సూత్రధారులు మొదలైన సినిమాలకు నృత్య దర్శకత్వం వహించిన కె. వి. సత్యనారాయణ ఈ సినిమాలో పాటలకు నృత్యాన్ని సమకూర్చాడు.[7] ఈ చిత్రంలోని అందెల రవమిది పదములదా (పాట) కు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది.[8]

ఈ చిత్రం లోని అన్నిపాటలకు సంగీతం అందించినవారు: ఇళయరాజా.

పాటలు
సంఖ్య. పాటసాహిత్యంగానం నిడివి
1. "అందెల రవమిది పదములదా"  సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి  
2. "ఆకాశంలో ఆశల హరివిల్లు:"  సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్. జానకి  
3. "ఆత్మాత్వం"      
4. "ఘల్లు ఘల్లు ఘల్లు"  సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల  
5. "కొత్తగా రెక్కలొచ్చెనా"  సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి  
6. "కొలువై ఉన్నాడే దేవదేవుడు"  సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల  
7. "చేరి యశోదకు"  అన్నమయ్యపి. సుశీల  
8. "నటరాజనే"   పి. సుశీల  
9. "శివపూజకు చివురించిన"  సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల  

పురస్కారాలుసవరించు

నంది పురస్కారాలు 1988
 • ఉత్తమ చిత్రం (బంగారు నంది) - సి.హెచ్.వి. అప్పారావు
 • ఉత్తమ నటి - భానుప్రియ[9]
 • ప్రత్యేక జ్యూరీ పురస్కారం - వెంకటేష్
దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు - 1988
 • ఉత్తమ చిత్రం - సి.హెచ్.వి. అప్పారావు[10]
 • ఉత్తమ నటి - భానుప్రియ
సినిమా ఎక్స్‌ప్రెస్ పురస్కారాలు - 1988
 • ఉత్తమ చిత్రం - సి.హెచ్.వి. అప్పారావు
 • ఉత్తమ దర్శకుడు - కె. విశ్వనాథ్[11]
 • ఉత్తమ నటి - భానుప్రియ

మూలాలుసవరించు

 1. Sripada, Krishna (2017-03-13). "Not easy to be at centre stage". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Retrieved 2021-04-15.
 2. Saran, Renu (2014-03-04). History of Indian Cinema (in ఇంగ్లీష్). Diamond Pocket Books Pvt Ltd. ISBN 978-93-5083-651-4.
 3. Kumar, Ranee (2016-05-26). "Sharon Lowen, an envoy of Indian culture". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Retrieved 2021-04-12.
 4. Lowen, Sharon (2017-05-02). "Dance without frontiers: K Viswanath – Director who aims to revive classical arts". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2021-04-12.
 5. "ఎంతో మందికి నాట్యంపై మక్కువ పెంచిందీ సినిమా". Sakshi. 2013-07-15. Retrieved 2021-05-04.
 6. బి, మధులత. "ఆ పాటను ప్రత్యేకంగా చెప్పి రాయించుకున్నా". eenadu.net. ఈనాడు. Archived from the original on 10 May 2017. Retrieved 10 May 2017.
 7. "కె. వి. సత్యనారాయణ ప్రొఫైలు". narthaki.com. Retrieved 9 August 2017.
 8. సాక్షి, ఫన్ డే (ఆదివారం సంచిక) (30 April 2017). "అందెల రవమిది..." Archived from the original on 13 August 2017. Retrieved 22 December 2020.
 9. "సితార - 32 సంవత్సరాల కె.విశ్వనాథ్‌ స్వర్ణకమలం - సితార స్పెషల్‌". సితార. Retrieved 2021-04-14.
 10. Vidura (in ఇంగ్లీష్). C. Sarkar. 1989.
 11. Express News Service (1989-03-11), "Cinema Express readers choose Agni Nakshathiram", The Indian Express, p. 4, retrieved 2016-10-07