పావలా శ్యామల
పావలా శ్యామల రంగస్థల నటిగా, చలన చిత్ర నటిగా ప్రసిద్ధురాలు.
పావలా శ్యామల | |
జన్మ నామం | నేతి శ్యామల |
జననం | 1951 అమరావతి, గుంటూరు జిల్లా |
జీవిత విశేషాలు
మార్చుఈమె 1951 లో గుంటూరు జిల్లా, అమరావతిలో జన్మించారు. ఈమె అసలు పేరు నేతి శ్యామల[1]. గణేష్ పాత్రో రచించిన పావలా నాటకంలో నటన ద్వారా ఈమె పేరు పావలా శ్యామలగా స్థిరపడిపోయింది. ఈమె హైస్కూలు చదువు అమరావతిలోనే జరిగింది. శ్యామల తండ్రి వ్యాపారం చేస్తుండేవారు. దాంతో ఆయన సమీప పట్టణాలైన గుంటూరు, విజయవాడ, ఏలూరు... ఇలా తరచూ వెళ్తుండేవారు. వ్యాపారం నిమిత్తం ఆయా పట్టణాల్లో ఉండేవారు. దాంతో శ్యామల కూడా చిన్నతనంలోనే ఎన్నో ఊళ్ళు చూడగలిగారు. అంతేకాదు అప్పట్లో సాంస్కృతిక కళారంగాల్లో మహిళలు ప్రాతినిథ్యం పెరుగుతోన్న రోజులు కాబట్టి ఆమె కూడా అటువైపు దృష్టి సారించారు. ఈమె బాల్యం అంతా అమరావతిలోనే గడచింది. ఈమెలోని సృజనాత్మకత కూడా అక్కడే అరంగేట్రం చేయసాగింది. దాంతో ఈమె లఘునాటికలు రాయగలిగేవారు. తనలా నాటకాల పట్ల అభిరుచి ఉన్న వారిని చేరదీసి వారిచేత ఆ నాటకాలు ప్రదర్శింపచేసేవారు. ఈమె సృజనాత్మకతని గుర్తించిన లయన్స్‌క్లబ్ ఈమెకు అవకాశాలిచ్చింది. వాటిని ఉపయోగించుకొని ఆమె నాటకాలు ప్రదర్శించే వారు. నాటకాల్లో అభిరుచి పెంచుకొన్న శ్యామల జీవితం చిన్నతనంలోనే నాటకీయంగా మలుపుతిరిగింది. పదమూడేళ్ళకే ఆమెకి వివాహం జరిగింది. ఆ తర్వాత రెండు మూడేళ్ళకే ఈమె భర్త ఘోరప్రమాదంలో కన్నుమూశారు. అప్పటికే ఈమెకు ఇద్దరు పిల్లలు. కుటుంబపోషణ కోసం ఈమె నాటకాన్ని వృత్తిగా స్వీకరించారు. 44 ఏళ్లుగా అనేక నాటకాలు, సినిమాలు, టి.వి.సీరియళ్లలో నటించిన ఈమె ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు. ఆరోగ్య సమస్యల వల్ల సినిమాలలో నటించడానికి అవకాశాలు సన్నగిల్లాయి. ఈమె దుస్థితిని తెలుసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు,[2] సినీ నటుడు పవన్ కళ్యాణ్[3], నిర్మాత బండ్ల గణేష్ [4] మొదలైనవారు ఈమెను ఆర్థికంగా ఆదుకుంటున్నారు.
నాటకరంగం
మార్చునేతి శ్యామల తొలినాటకం "దొంగాటకం’’. విశాఖపట్నానికి చెందిన కె.వెంకటేశ్వరరావు దర్శకత్వంలో పదిహేడేళ్ళ శ్యామల తన పాత్రలో జీవించారు. ఆ నాటకం ఈమెకు ఉత్తమనటి అవార్డు తెచ్చిపెట్టింది. అది మొదలు ఈమె నాటకాలపైనే సహజంగానే ఆధారపడ్డారు. ఈమె రెండో నాటకం పేరు ‘‘పావలా’’. ఆ నాటకంలో శ్యామల తన పాత్రపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారు. ఈమె నుంచి పాత్రను, పాత్రనుంచి ఈమెను విడదీసి చూడడం సాధ్యంకాక నాటకాభిమానులు ఈమెను ‘‘పావలా శ్యామల’’ అన్నారు. ఆ నాటకం రాష్ట్రంలోనే కాక రాష్ట్రేతర ప్రాంతాల్లోనూ ప్రదర్శితమై ఆబాల గోపాలం ప్రశంసలందుకొంది. అందరినోట ‘‘పావలా శ్యామల’’గా పిలుపునందుకొన్నారు. ఆ పేరు శాశ్వతం చేసుకొన్నారు. ఈమె హావభావాలు ఎంతో విలక్షణంగా నిండుగా పాత్రోచితంగా ఉన్నట్లు విమర్శకులు సైతం అంగీకరించారు. ఈమె సంభాషణలు పలుకుతుంటే హాలంతా చప్పట్లు మోగడం పరిపాటి. రచయిత సన్నివేశాన్ని ఎలా హించి కల్పించినా ఈమె పాత్రోచితంగా మార్పులుచేసి వాటికి సందర్భ శుద్ధిని కలిగించేవారు. ముందునుంచీ నాటకరంగంలో ఉండడం... పైగా తనలోనూ రచనా నైపుణ్యం ఉండడమే అందుకు కారణం.
ఈమె నటించిన నాటకాలలో కొన్ని ముఖ్య నాటకాలు:
- దొంగాటకం
- పావలా
- కొడుకు పుట్టాల
- ఒక దీపం వెలిగింది
- మంచుబొమ్మలు
- భయం
- నిర్మానుష్యం
- రసరాజ్యం మొదలైనవి.
సినిమా రంగం
మార్చుఈమె నటించిన సినిమాలలో కొన్ని:
- బాబాయ్ అబ్బాయ్ (1985)
- మొగుడు పెళ్ళాలు (1985)
- స్వర్ణకమలం (1988)
- కర్తవ్యం (1990)
- దండోరా (1993)
- చీమలదండు (1995)
- సుస్వాగతం (1998)
- తెలుగోడు (1998)
- కోదండరాముడు (2000)
- మనసంతా నువ్వే (2001)
- అల్లరి రాముడు (2002)
- ఇంద్ర (2002)
- నిన్నే ఇష్టపడ్డాను (2003)
- ఆంధ్రావాలా (2004)[5]
- వర్షం (2004)
- గౌరి (2004)
- మొదటి సినిమా (2005)
- నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
- అందగాడు (2005)
- అయోధ్య (2005)
- బహుమతి (2007)
- రెయిన్బో (2008)
- బలాదూర్ (2008)
- గోలీమార్ (2010)
- ఏమో గుర్రం ఎగరావచ్చు (2014)
- కమలతో నా ప్రయాణం (2014)
- చందమామ కథలు (2014)
- బెంగాల్ టైగర్ (2015)
- బాబు బంగారం (2016)
- మత్తు వదలరా (2019)
పురస్కారాలు
మార్చుఈమె ఏ రంగస్థలనటి అందుకోనన్ని అవార్డులు, బహుమతులు అందుకొన్నారు. వాటిలో కొన్ని:
- అలహాబాదులో జరిగిన అఖిల భారత నాటకపోటీల్లో ఉత్తమ క్యారెర్టర్ నటిగా అవార్డు
- రాజమండ్రి లలిత కళాపరిషత్తు వారి ‘‘మహానటి కన్నాంబ అవార్డు’’
- గుంటూరు లలిత కళా పరిషత్తులో ‘‘కళాజ్యోత్స్న’’,
- కాకతీయ కళాపరిషత్తు నుంచి ‘‘విశిష్టవ్యక్తి’'
- 2013లో హంస (కళారత్న) పురస్కారం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు, 11 ఏప్రిల్ 2013)[6]
- ఉత్తమ నటి (కన్నాంబ అవార్డు) - గైడెడ్ ఇంప్రవైజైషన్ ప్రక్రియ - లలిత కళానికేతన్ (రాజమండ్రి)
భావాలు అనుభవాలు
మార్చు- నాన్న ఆచార, సంప్రదాయాలు బాగా పాటించే వారు. బయటకు వెళ్ళివస్తే స్నానం చేయకుండా ఇంట్లో అడుగు కూడా పెట్టరు. ఆడపిల్లలపై ఆంక్షలు ఎక్కువగా ఉండేవి. దాంతో పదో తరగతి పూర్తి చేసిన వెంటనే నాకు పెండ్లి చేశారు. చిన్నతనం నుంచే చిన్న చిన్న నాటికలు రాస్తుండేదాన్ని. రేడియో నాటికలు రాసేదాన్ని. ఇలా రాస్తుంటే మా నాన్నగారు తిట్టేవారు. ఆయనకు తెలియకుండా 'వనితావాణి'కి రాస్తుండేదాన్ని. ఏది వింటే దాన్ని రాసుకునేదాన్ని. మా పాప మాధవ పుట్టిన తర్వాత ప్రమాదంలో మావారు చనిపోయారు. దాంతో ఒంటరిగా మిగిలాను.
- నాటకాల్లో చేస్తున్నానని బంధువులందరూ వెలి వేశారు.
- పావలా వెనుక కథ:'పావలా' అనే నాటికలో నటించాను. కేవలం ఈ ఒక్క నాటికలోని నా పాత్రకు 200 అవార్డులు తీసుకున్నాను. అప్పటికే పరిశ్రమలో మరో శ్యామల ఉండేది. దాంతో నా పేరు పావలా శ్యామలగా మారిపోయింది. అప్పటి నుంచి అందరూ నన్ను 'పావలా శ్యామల' అని పిలుస్తున్నారు. అయితే ఈ పావలా కథ రంగస్థలం గురించి తెలిసిన వారికి మాత్రమే తెలుస్తుంది.
- చదువుకునే వయసులో మా పాప మేడపై నుంచి కిందపడింది. దాంతో తలకి పెద్ద గాయం అయింది. పెద్ద నరం చిట్లిపోయింది. జ్ఞాపకశక్తి కోల్పోయింది. దాంతో వైగాజ్‌లో ఉన్న మా ఒక్క ఇంటినీ అమ్మేసి పాపకు ట్రీట్‌మెంట్ చేయించా. కానీ పూర్తిగా కోలుకోలేదు. చదివితే కండ్లు మసకబారిపోతాయి. పావుగంటకు ఓ సారి కండ్లు తిరిగి పడిపోతుంది. చివరకు మందులు కూడా పని చేయడం లేదు. ఇక ఇంతకంటే బాగు చేయడం కష్టమన్నారు. ప్రస్తుతం తన పని తాను చేసుకోగలదు. కానీ ఒంటరిగా ఉండలేదు. బయటకు వెళ్ళి పని చేసే పరిస్థితి కాదు. ఎక్కడికి వెళ్ళినా నాతోపాటు ఆమెను కూడా తీసుకెళ్ళాలి. ఉన్న డబ్బులన్నీ తన ట్రీట్‌మెంట్‌కు ఖర్చు చేశాను. పాప దిగులుతో నా ఆరోగ్యం పాడైపోయింది. సరైన తిండి లేదు. మందుల్లేవు. దాంతో అవకాశాలు తగ్గాయి. ఒంటరిగా పాపను తీసుకుని చాలా కష్టపడ్డాను. నాటకాల్లో చేసేటప్పుడు నన్ను వెలివేసిన బంధువులు సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు దగ్గరయ్యారు. మళ్ళీ కష్టాలు మొదలవ్వడంతో మొహం చాటేశారు. ఇప్పుడు మమ్మల్ని పలకరించే దిక్కు లేదు. ఇంటి అద్దె కట్టలేకపోయాం. ఓనర్ అద్దె కట్టకపోతే ఖాళీ చేయమంటాడు. నా కిడ్నీలు పాడై మంచంలో ఉన్నాను. ఆ సమయంలో ఇంటి ఓనర్ కరెంటు, నీళ్ళు ఇవ్వకుండా ఆపేశాడు. మానవత్వం లేకుండా వ్యవహరించాడు. అప్పుడే దిల్‌రాజు 50 వేలు ఇస్తే పాత బాకీ కట్టి వేరే ఇంటికి మారాను.
- ఈ ప్రపంచంలో ఓ స్త్రీ ఒంటరిగా బతకడమంటే చాలా కష్టం. అదీ ఓ చంటి పిల్లతో. ఒకవేళ మనం బతకాలనుకున్నా ఈ సమాజం బతకనివ్వదు. పట్టుకుని పీడిస్తారు. సినిమా వాళ్ళకు ఇల్లు ఇవ్వమంటారు. 'నీ భర్త ఏం చేస్తున్నాడు' అంటారు. లేడు అంటే ఇల్లు లేదు పొమ్మంటారు. ఇలా చాలా అవమానాలు తట్టుకున్నాను. కళాకారిణిగా ఇంత అనుభవం ఉండి ఇలాంటి పరిస్థితిని భరించలేకపోతున్నాను. ఒక్కో సారి చనిపోవాలనిపించేది. కానీ పాప నా కాళ్ళకు సంకెళ్ళు వేసింది. తనకోసమే బతుకుతున్నాను. ఆనారోగ్యం వల్ల ఎప్పుడు పోతానో నాకే తెలియదు. నేను పోతే పాపకు దిక్కులేదు. తన గురించే నా దిగులంతా.
- సాయం కోసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారిని కలవడానికి వెళ్ళాను. కానీ మెంబర్‌ని కాదని సాయం చేయలేమన్నారు.
- ముఫ్పై ఏండ్లు నాటకాల్లోనే ఉండిపోయాను. అక్కడ పెద్దగా వచ్చే ఆదాయం ఏమీ ఉండేది కాదు. వచ్చింది కాస్తా మేం బతకడానికి సరిపోయేది. ఇక సినిమాల్లోకి వచ్చేసరికి యాభై ఏండ్లు వచ్చాయి. అన్నీ ముసలి పాత్రలే కాబట్టి ఇక్కడ కూడా పెద్దగా మిగుల్చుకోవడానికి అవకాశం లేదు. సినీ ఫీల్డ్ అంటే కొంత మెయింటెన్ చేయాలి. ఎంత పిచ్చి వేషమైనా కొద్దో గొప్పో గ్లామర్‌గా కనిపించాలి. పైగా నాకు ఇంత ఇస్తేనే వస్తాను అని డిమాండ్ చేసే పరిస్థితి నాకు లేదు. నేను కాదంటే వేరే వాళ్ళను పెట్టుకుంటారు. పైగా మా అమ్మాయి ఆరోగ్యం వల్ల ఎవరైనా పిలిస్తేనే వెళ్ళేదాన్ని. ఇప్పుడు అవకాశాలే తగ్గాయి. వస్తున్న పెన్షన్ ఎప్పుడు ఆగిపోతుందో అని నేనూ, నా కూతురు గుండె చేతుల్లో పెట్టుకొని బతుకుతున్నాం.
- కిడ్నీలకు ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. హాస్పిటల్లో చేరదామంటే డబ్బుల్లేవు. అప్పుడే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ షూటింగ్ దగ్గరకు వెళితే ఆయన నన్ను చూసి లక్షరూపాయలు ఇచ్చి సాయం చేశారు. హాస్పిటల్లో చేరాను.కేసీఆర్‌గారు దయతో పది వేల పెన్షన్, డబుల్ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేశారు. పదివేలు పెన్షన్ మాత్రం వస్తుంది. ఆనాడు ఆయన ఈ సాయం చేయకపోతే బతికేదాన్ని కాదు. కానీ పెరిగిన ధరల వల్ల ఆ పది వేలు ఇంటి అద్దె, కరెంటు, వాటర్‌కే సరిపోతుంది. తక్కువ అద్దెతో వచ్చే ఇల్లు మేడపైన దొరుకుతుంది. మెట్లు ఎక్కే స్థితిలో నేను లేను. అద్దె కట్టే బాధ లేకపోతే ఆ పదివేలతో బతకొచ్చు. కేసీఆర్ నాపై మరొక్కసారి దయచూపి డబుల్‌బెడ్ రూం కూడా ఇస్తే బాగుంటుంది. అలాగే అమెరికా నుండి అజరురెడ్డి గారు లక్ష రూపాయలు సాయం చేసారు.
మూలాలు
మార్చు- http://www.navatelangana.com/article/maanavi/645980 Archived 2017-11-14 at the Wayback Machine
- ↑ [https://web.archive.org/web/20160117225240/http://eenadu.net/Magzines/Sahitisampadainner.aspx?qry=pratibhavantulu37 Archived 2016-01-17 at the Wayback Machine నాటికని ఇంటిపేరు చేసుకొన్న సహజనటి పావలా శ్యామల - చీకోలు సుందరయ్య]
- ↑ "పావలా శ్యామల తలరాతను మార్చిన కెసిఆర్". Archived from the original on 2016-01-18. Retrieved 2016-01-19.
- ↑ పావలా శ్యామలకు...పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం
- ↑ "పావలా శ్యామల మాటలకు కదిలొస్తున్న మానవతా వాదులు". Archived from the original on 2016-01-18. Retrieved 2016-01-19.
- ↑ FilmiBeat, Movies. "Andhrawala Cast & Crew". www.filmiBeat.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2020. Retrieved 6 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (9 April 2013). "41 మందికి ఉగాది పురస్కారాలు...15 మందికి హంస అవార్డులు". www.sakshieducation.com. Archived from the original on 17 April 2020. Retrieved 17 April 2020.