హైదరాబాదు చరిత్ర

హైదరాబాదు నగరం నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగినది. ఈ నగరం చాలా ప్రసిద్ధిచెందిన మసీదులు, దేవాలయములు, బజార్లు, మార్కెట్లు, ముత్యాల దుకాణాలతోను, అందమైన పరిసరాల ప్రకృతి సౌందర్యంతోనూ విలసిల్లుతున్నది. ఇందలి రాజభవనాలు, ఇళ్ళు, పార్కులు, వీధులు అన్నీ కూడా సమున్నతమైన నిర్మాణ కౌశల్యాన్ని ప్రతిబింబిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.

హైదరాబాదు నగరం డెక్కన్ డైమండ్ సిటీ, నవాబుల నగరం, ముత్యాల నగరం, సరస్సుల నగరం, రాళ్ళ నగరం మొదలైన పేర్లతో ప్రసిద్ధి చెందింది.[1]

ప్రాచీన చరిత్ర

మార్చు

హైదరాబాదు నగరం ఉన్నటువంటి ప్రాంతము క్రీ.పూ. 3 వ శతాబ్దంలో అశోకచక్రవర్తి సామ్రాజ్యములో భాగంగా ఉండెడిది. ఆ తరువాత శాతవాహనులు, కళ్యాణి చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. చాళుక్య సామ్రాజ్యం క్షీణించడంతో వారి సామంతులైన కాకతీయులు స్వాతంత్ర్యం పొంది వరంగల్లు రాజధానిగా ఒక విశాల సామ్రాజ్యం స్థాపించారు. కాకతీయుల కాలంలో హైదరాబాదు ప్రాంతం లోని గోల్కొండ మీద మొదటి మట్టి కొట నిర్మాణం జరిగింది.

సా.శ 1321 లో ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యం వరంగల్లును జయించి కాకతీయ సామ్రాజ్యాన్ని అంతం చేసింది. కొన్ని దశాబ్దాల పాటు బీదర్ రాజధానిగా బహమనీ సుల్తానులు దక్కన్ మీద ఆధిపత్యం కోసం దక్షిణాన విజయనగర రాయల తోనూ, ఉత్తరాన ముసునూరి నాయకుల తోనూ పోరాడి, 15 వ శతాబ్ది మధ్య కాలానికి హైదరాబాదు ప్రాంతాన్ని సొంతం చేసుకున్నారు.

కుతుబ్ షాహీలు

మార్చు
దస్త్రం:Hyderabad india .jpg
సంధ్యా సమయంలో చార్మినారు.

సా.శ 1463 లో సుల్తాన్ మహమ్మద్ షా బహమన్ తెలంగాణాలో తిరుగుబాటులను అణచడానికి కులీ కుత్బ్ ఉల్ ముల్క్ను సూబేదారుగా నియమించాడు. కులీ గోల్కొండను సుస్థిరపరచి, విస్తరించి తెలంగాణను పరిపాలించాడు. బహమనీ సల్తనత్ లో ఏర్పడిన అంతర్గత విభేదాల వలన కులీ 1518 లో తన స్వాతంత్ర్యం ప్రకటించి సుల్తాన్ కులీ కుతుబ్ షా అన్న పేరుతో సింహాసనం అధిష్ఠించాడు.

హైదరాబాదు స్థాపన

మార్చు
 
మహమ్మద్ కులీ కుతుబ్ షా, 5 వ కుతుబ్ షాహీ సుల్తాన్, హైదరాబదు నగర స్థాపకుడు.

కుతుబ్ షాహీల అధీనంలో గోల్కొండ ప్రఖ్యాతి గాంచింది. పెరుగుతున్న జనాభా కోసం 1589 లో 5వ సుల్తాన్ మహమ్మద్ కులి కుతుబ్ షా ఒక కొత్త నగరాన్ని నిర్మించ దలిచాడు. ఈ నగరాన్ని మూసీ నది దక్షిణ ఒడ్డున, గోల్కొండకు తూర్పు దిశలో నిర్మించాలని నిర్ణయం జరిగింది. గోల్కొండ రాజ్యంలో ప్లేగు వ్యాధి తగ్గినందుకు సంతోషంతో ప్రసిద్ధి చెందిన చార్మినారు 1592 లో నిర్మించారు. చార్మినార్ చుట్టూ చార్‌ కమాన్‌ లను నిర్మించారు.

వర్ధిల్లిన భాగ్య నగరం

మార్చు

నగర స్థాపన తరువాత 100 సంవత్సరాల వరకు హైదరాబాదు చరిత్ర కుతుబ్ షాహీ వంశ చరిత్రతో ముడి పడి ఉంది. కుతుబ్ షాహీ సుల్తానులేడుగురూ కూడా పండితులను ఆదరించారు. చక్కటి నిర్మాణాలు చేసారు. హైదరాబాదులో ఇండో పర్షియను, ఇండో ఇస్లామిక్ సారస్వతం, సంస్కృతుల వ్యాప్తికి దోహదం చేసారు. ఈ సుల్తానులు తెలుగు భాషను ఆదరించి తెలుగు సంస్కృతిని పోషించారు. కూచిపూడి నాట్యం కుతుబ్ షాహీల కాలం నాటిదే; కూచిపూడి అగ్రహారం ఒక సుల్తాన్ విద్వాంసులకు ఇచ్చిన కానుకే. వీరి కాలంలో గోల్కొండ వజ్రాలకు, ముత్యాలకు, ఉక్కుకు, ఆయుధాలకు, అద్దకపు వస్త్రాలకు ప్రపంచంలోనే ప్రముఖ మార్కెట్టుగా విలసిల్లింది. 17వ శతాబ్దంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరం కూడా విస్తరించి, గోల్కొండ రాజ్యానికి అనధికారిక రాజధానిగా ఎదిగింది. హైదరాబాదు నగరం ఎన్నో పార్కులతో చల్లని వాతావరణం గల నగరంగా ప్రసిధ్ధి చెంది, ఇరాన్ లోని ఇస్ఫహాన్ నగరంతో తరచు పోల్చబడింది.

మొగలు ఆక్రమణ

మార్చు

17 వ శతాబ్దం మధ్య కాలనికి దక్కన్ లో కొత్త యుధ్ధం మొదలయ్యింది. మొగలు రాకుమారుడు ఔరంగజేబు దక్కన్ రాజ్యాల మీద మొగలు ఆధిపత్యాన్ని నిరూపించడానికి ఎన్నో రాజ్యాలతో యుధ్ధాలు చేసాడు. 1666 లో చక్రవర్తి షా జహాన్ మరణం తరువాత ఔరంగజెబు సింహాసనాన్ని చేజిక్కించుకొని దక్కన్ వాపసు వచ్చాడు. శివాజి నేత్రుత్వంలో మరాఠాలు మొగలులను పొరడుతుండగా, ఔరంగజేబు కన్ను హైదరాబాదు మీద పడింది.

ఔరంగజేబు ముట్టడి

మార్చు

1686 లో ఔరంగజేబు గోల్కొండ కోటను ముట్టడి చేసాడు. కొన్ని నెలల పాటు కోట స్ఠిరంగా ఉండడంతో ఔరంగజేబు సైన్యం వెనక్కి తిరగవలసి వచ్చింది. ఒక సంవత్సరం తరువాత 1687 లో మొగలు సైన్యం మళ్ళీ గోల్కొండను ముట్టండించింది. ఫతే మైదాన్ ("విజయ మైదానం", ఈనాటి లాల్ బహాదూర్ శాస్త్రి స్టేడియం) లో 9 నెలలు ఎదురుచూసిన ఔరంగజేబు చివరికి అభేద్యమైన గోల్కొండ కోటను గెలవడానికి ఒకే ఒక మార్గం వుందని గుర్తించాడు. లంచమిచ్చి రాత్రి పూట కోట ద్వారాలు తెరిపించి మొగలు సైన్యం కోటలోకి ప్రవేశించింది. భద్రాచలం రామదాసును బంధించి, తదుపరి క్షమించిన 7 వ సుల్తాన్ అబుల్ హసన్ తానాషాను బందీ చేసి హైదరాబాదును మొగలు సామ్రాజ్యంలో కలిపాడు ఔరంగజేబు.

హైదరాబాదు మొగలు ఆధిపత్యంలో 4 దశాబ్దాలు మాత్రమే ఉంది. కాని ఈ కాలంలో వజ్రాల ఉత్పత్తి, వ్యాపారం క్షీణించిపోయాయి.

అసఫ్ జాహీలు

మార్చు

1707 లో ఔరంగజేబు మరణం తరువాత మొగలు సామ్రాజ్యం బలహీనపడడంతో, ప్రాంతీయ సామంతులు స్వతంత్రులయ్యారు. మొగలు చక్రవర్తి నుండి నిజాం ఉల్ ముల్క్ ("దేశానికి ప్రభువు") బిరుదు పొందిన ఆసఫ్ ‌జా, 1724 లో ప్రత్యర్థి అధికారిని ఓడించి, హైదరాబాదు రాష్ట్రాన్ని చేజిక్కించుకుని, మొగలుల నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు.

గ్రహణం తప్పిన హైదరాబాదు

మార్చు

ఆసఫ్ ‌జా వారసులు నిజాం అనే పేరుతో హైదరాబాదును పాలించారు. ఏడుగురు నిజాముల పాలనలో హైదరాబాదు ఆర్థికంగాను, సాంస్కృతికంగాను కూడా అభివృద్ధిని సాధించింది. నిజాంసాగర్, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, వంటి పెద్ద జలాశయాలను నిర్మించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పై సర్వేలు కూడా వీరి కాలంలో మొదలయ్యాయి.

పాతబస్తీకి సరిహద్దుగా హైదరాబాదు సరిహద్దు గోడ కట్టబడింది.[2]

విడదీసి జయించు

మార్చు

బ్రిటిషు వారు, ఫ్రెంచి వారు భారత్‌లో తమ సామ్రాజ్యాలను విస్తరించుతున్నపుడు, నైజాం రాజ్యం ఉత్తరాంధ్రా పరగణాలను (ప్రస్తుత కొస్తాంధ్ర జిల్లాలు) తదుపరి రాయలసీమ ప్రాంతాన్ని (దత్తమండలం) బ్రిటిష్ వారికి ధారాదత్తం చేయటం ద్వారా వారితో స్నేహం కుదుర్చుకుని తన అధికారాన్ని కాపాడుకున్నాడు. బ్రిటిషు వారి చేత టిప్పు సుల్తాను ఓటమిలో నిజాముది పెద్ద చెయ్యే ఉంది. 3 వ నెజాము సికందర్ జా పాలనలో సికందరాబాదు నగరం స్థాపించబడింది. ఈ నగరం మొదట ఫ్రెంచి సైనికుల కోసం నిర్మించగా, తరువాత బ్రిటిషు సైన్యం ఇక్కడ వుంచబడింది.

ఏడవ నిజాము మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ "బ్రిటిషు ప్రభుత్వపు విశ్వాసపాత్రుడైన మిత్రుడు" అనే బిరుదు పొందాడు కూడా. హైదరాబాదులో బ్రిటిషు వారు తమ ప్రతినిధిని ఉంచినప్పటికీ, రాష్ట్రంలో నిజాము పాలన కొనసాగింది. నిజాముల ఏలుబడిలోని హైదరాబాదు, భారత్‌లోని అన్ని సంస్థానాల కంటే పెద్దది. ఇంగ్లండు, స్కాట్లండు, వేల్సు ల మొత్తం వైశాల్యం కంటే పెద్దది. నిజాం రాజ్యంలో ప్రత్యేక కరెన్సీ, రైల్వే, తపలా వుండేవి. ఆదాయపు పన్ను లేదు.

 
హైదరాబాద్ రాజ్యం 1909

7 వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా గుర్తించబడ్డాడు. హైదరాబాదులో తన పేరు మీదగా ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా ఆసుపత్రి స్థాపించాడు. 1917 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధునిక యుగంలో మొఠ్ఠమొదటి సారి ఒక భారతీయ భాష (ఉర్దూ) లో కోర్సులు చెప్పడం ప్రారంభించింది. నలందా, తక్షశిలల తరువాత మొదటి సారి భారతీయులు ఒక భారతీయ భాషలో ఉన్నత విద్య పొందగలిగారు.

స్వతంత్ర భారతి, కానీ...

మార్చు

1947 లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు, నిజాం తన రాజ్యాన్ని వేరుగా వుంచాలన్న తన ఉద్దేశ్యాన్ని ప్రకటించాడు. బ్రిటిషు కామన్వెల్తులో భాగంగా కానీ, స్వతంత్ర దేశంగా కానీ హైదరాబదు సంస్థానాన్ని పరిపాలించదలచిన నిజాముకు రజాకార్లు మద్దతు ఇచ్చారు. తెలంగాణా కమ్యూనిస్టులు నిజాం పాలనను వ్యతిరేకించి సాయుధ పొరాతం ప్రారంభించారు. రజాకార్ల అమానుష చర్యల వలన వేలాది శరనార్థులు కోస్తా ఆంధ్రా జిల్లాలు చేరారు.

ఆపరేషన్ పోలో

మార్చు

ఈ పరిస్థితిలో భారత హోం మంత్రి సర్దార్ వల్లభ్ భాయి పటేల్ ఆపరేషన్ పోలో పేరుతో పోలీసు చర్యను ఆదేశించారు. 5 రోజుల పోలీసు చర్య పిమ్మట, 1948 సెప్టెంబరు 17 న, భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఒక సంవత్సరం పైగా ముగిసిన తరువాత, హైదరాబాదు సంస్థానం భారతదేశంలో కలిసింది.

హైదరాబాదు రాష్ట్రం

మార్చు

నిజాం భారత ప్రభుత్వం యొక్క "ఇంస్ట్రుమెంట్ ఆఫ్ ఆక్సెషన్" మీద సంతకం చేయడంతో హైదరాబాదు స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రంగా అవతరించింది. హైదరాబాదు యొక్క ప్రప్రథమ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. 1.8 కొటి హైదరాబదు రాష్ట్ర వాసుల ప్రతినిధులు భారత రాజ్యాంగ సభలో పాల్గొనటం మొదలు పెట్టారు. తదుపరి ఎనిమిది సంవత్సరాలు హైదరాబదు ఒక ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగింది.

భాషాప్రయుక్త రాష్ట్రాలు

మార్చు

1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రము మద్రాసు రాష్ట్రము నుంచి వేరయింది. కర్నూలు ఆంధ్ర రా‌ష్ట్ర రాజధాని అయింది. 1956 లో భారత దేశాన్ని భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించినపుడు హైదరాబాదు రాష్ట్రం మూడు భాగాలుగా విడిపడి, ఆంధ్ర, మహారాష్ట్ర (అప్పటి బొంబాయి రాష్ట్రం), కర్ణాటక లలో కలిసిపోయింది. హైదరాబాదు నగరం, చుట్టుపక్కల ప్రాంతాలు ఆంధ్ర రాష్ట్రంలో కలిసాయి. ఆ విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము 1956 నవంబరు 1న, హైదరాబాదు రాజధానిగా ఏర్పడింది. [1], [2]

  1. డా. మామిడి, హరికృష్ణ (2023-10-19). "Hyderabad, Shehar Ye Pyar Ka". Telangana Today. Archived from the original on 2023-10-20. Retrieved 2023-10-30.
  2. Bilgrami, 1927, pp. 94.