మామిడి హరికృష్ణ

కవి, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌, చిత్రకారుడు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు

డా. మామిడి హరికృష్ణ కవిగా, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌గా, చిత్రకారుడి‌గా, తెలంగాణ చరిత్ర పరిశోధకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు సినిమా విమర్శలో మంచి పేరు సంపాదించిన రచయిత. వివిధ పత్రికలలో వేలాది వ్యాసాలు రాసిన అతను రచనలలో సినిమా పూర్వపరాలు, సమకాలీన విశ్లేషణలు చారిత్రక దృష్టితో కనిపిస్తాయి.[1] 2014, అక్టోబరు 28 నుండి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 'తెలుగు సినిమాలలో జానపద కథాంశాలు – అధ్యయనం' అనే అంశంపై పిహెచ్.డి పరిశోధన చేశాడు.[2]

డా. మామిడి హరికృష్ణ
జననంహరికృష్ణ
శాయంపేట, వరంగల్ జిల్లా, తెలంగాణ
నివాస ప్రాంతంహైదరాబాదు,తెలంగాణ
వృత్తితెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు
ప్రసిద్ధిమామిడి హరికృష్ణ
మతంహిందూ
తండ్రిసుదర్శన్
తల్లిస్వరాజ్యం
సినివారం కార్యక్రమంలో మాట్లాడుతున్న మామిడి హరికృష్ణ

జననం - విద్యాభ్యాసం

మార్చు

వరంగల్ జిల్లా, శాయంపేటలోని పద్మశాలి కుటుంబానికి చెందిన డాక్టర్ మామిడి సుదర్శన్, స్వరాజ్యం దంపతులకు హరికృష్ణ జన్మించాడు.[3] శాయంపేటలోనే పదవ తరగతి వరకు విద్యను అభ్యసించి, ఇంటర్మీడియట్, డిగ్రీ వరంగల్‌ లోని లాల్ బహదూర్ కళాశాలలో చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎ (సైకాలజీ), కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఈడి చేశాడు.[4] 'తెలుగు సినిమాలలో జానపద కథాంశాలు – అధ్యయనం' అనే అంశంపై పిహెచ్.డి పరిశోధన చేసి 2022 జూలై 16న తెలుగు విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్‌ పట్టాను అందుకున్నాడు.[5]

సాహిత్య ప్రస్థానం

మార్చు

హరికృష్ణ తల్లి స్వరాజ్యం విద్యావంతురాలు. తెలుగు సాహిత్యాన్ని తాను చదవడమేకాకుండా, హరికృష్ణ చేత కూడా చదివించింది. అలా 9వ తరగతిలోనే చలం, శరత్ చంద్ర ఛటర్జీ, శ్రీశ్రీ, గురజాడ వంటి ప్రముఖ సాహితీవేత్తల సాహిత్యాన్ని చదివాడు. తెలుగు సాహిత్యమేకాకుండా భారతీయ, ప్రపంచ సాహిత్యాన్ని చదివిన ఈయన అనేక అంశాలపై అవగాహన పెంచుకున్నాడు.[6]

కవిగా, రచయితగా

మార్చు

సాహిత్య రంగంలో తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరుచుకున్న హరికృష్ణ, నిరంతరం కవితలు రాస్తూ 2014లో తెలుగు సాహిత్యంలో ‘ఫ్యూజన్ షాయరీ‘ అనే ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. తెలంగాణ భాషలో కవితలు రాస్తూ, ప్రపంచ కవిత పేరిట ప్రపంచంలోని ప్రముఖుల కవితలను తెలుగులో అనువదిస్తూ ప్రపంచ సాహిత్యాన్ని తెలుగువారికి అందిస్తున్నాడు. సినిమా, సాహిత్యం, కళలు, సైకాలజీ, బిహేవియర్ వంటి అంశాలపై దాదాపు పదివేలకుపైగా వ్యాసాలు రాయడమేకాకుండా... తెలుగు, ఇంగ్లీష్ భాషలలో టైమ్స్ పత్రికలలో గెస్ట్ కాలమ్స్ రాశాడు.

పుస్తకాలు

మార్చు

రచన

  1. తెలుగు సినిమాలో భాష-సాహిత్యం-సంస్కృతి
  2. ఊరికి పోయిన యాళ్ళ (దీర్ఘకవితా పుస్తకం - 2018 సెప్టెంబరు 20)[7]
  3. సుషుప్తి నుంచి (కవిత్వం - 2020 సెప్టెంబరు 20)
  4. ఒంటరీకరణ (కవిత్వం)[8]
  5. తెలుగు సినిమాలలో జానపద కథాంశాలు – అధ్యయనం (పరిశోధన గ్రంథం)[9]

సంపాదకీయం

  1. ఆశాదీపం (ఎయిడ్స్ పై కవితా సంకలనం)
  2. చిగురంత ఆశ (వినియోగం వికాసం కోసం)
  3. వినియోగం - వికాసం కోసం (వినియోగదారుల హక్కుల చైతన్యంపై తెలుగు సాహిత్యంలో విశిష్ట పుస్తకం)

1996లో ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు స్వీకరించాడు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో, వివిధ హోదాలో పనిచేసిన మామిడి హరికృష్ణ 2014, అక్టోబరు 28న తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా నియమితులయ్యాడు.[10][11] సంచాలకుడిగా హరికృష్ణ నిబద్దతను చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మామిడి హరికృష్ణ పదవీకాలాన్ని మరో మూడేళ్ళపాటు (2019 అక్టోబరు 28 వరకు) పొడగించారు.[12] మామిడి హరికృష్ణకు సహకార శాఖలో జాయింట్‌ రిజిస్ట్రార్‌ పదవి నుంచి అడిషనల్‌ రిజిస్ట్రార్‌గా పదోన్నతి కలిపిస్తూ, సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా కొనసాగాలని 2024 ఆగస్టు 5న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులుగా విజయాలు

మార్చు
  1. తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులుగా వచ్చిన తరువాత తెలంగాణ కళాకారులకు ప్రాముఖ్యత ఇవ్వటంలో గతంలో ఎన్నడూ జరగనన్ని కార్యక్రమాలు చేశాడు.
  2. 'మన ఊరు౼మన చెరువు' పథకానికి చిందు, యక్షగాన కళాకారులు వివిధ జిల్లాలు, ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించి వారికి ఉపాధి మార్గం చూపించాడు.
  3. తెలంగాణ కళారాధన పేరిట 116 రోజులపాటు నిరంతరంగా రవీంద్రభారతి ప్రాంగణంలో వివిధ కళాప్రక్రియల ప్రదర్శనలు నిర్వహించాడు.
  4. తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా పండుగలా నిర్వహించి, కళాకారులను గౌరవించాడు.
  5. గోల్కొండ కోటపై స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించి వివిధ తెలంగాణ కళా ప్రక్రియలను ప్రదర్శించాడు.
  6. జానపద జాతర పేరిట రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జానపద ఉత్సవాలు నిర్వహించాడు.
  7. గోదావరి పుష్కరాల్లోనూ, బతుకమ్మ వేడుకలు, బోనాలు పండుగలోనూ వేల కళాకారులకు అవకాశాలు అందించాడు.
  8. రవీంద్రభారతికి నూతన హంగులు తీసుకువచ్చాడు.[13]
  9. తెలుగుకు ప్రాచీన హోదా రావడంలో ప్రముఖ పాత్ర వహించాడు.[14][15][16][17]
  10. సంచాలకుడిగా శాఖ ప్రచరించిన ఈ క్రింది పుస్తకాలకు సంపాదకత్వం వహించాడు.[18][19]

తెలుగు:

  1. తొలిపొద్దు (2015)
  2. కొత్తసాలు (2016)
  3. తంగేడువనం (2016)
  4. మట్టి ముద్ర (2016)
  5. పద్య తెలంగాణం (2016)
  6. తల్లివేరు (2017)
  7. స్వేదభామి (2017)
  8. ఆకుపచ్చని పొద్దుపొడుపు (2017)
  9. గొల్ల రామవ్వ ఇంకొన్ని నాటికలు (2017)
  10. తెలంగాణ తేజోమూర్తులు (2017)
  11. కళా తెలంగాణం (2017)
  12. పటం కతలు (2017)
  13. తెలంగాణ వాగ్గేయ వైభవం (2017)
  14. తెలుగు కార్టూన్ (2017)
  15. స్మర నారాయణీయం (2017)
  16. అలుగు దుంకిన అక్షరం (2018)
  17. కాకతీయ ప్రస్థానం (2018)
  18. మనకు తెలియని తెలంగాణ (2019)
  19. తారీఖుల్లో తెలంగాణ (2019)
  20. తెలంగాణ రుచులు (2019)
  21. జయ జయోస్తు తెలంగాణ

ఇంగ్లీష్:

  1. కల్చర్ ఆఫ్ తెలంగాణ ఎట్ సూరజ్‌కుండ్ (2016)
  2. తెలంగాణ హార్వెస్ట్ (2017)
  3. ఆదిరంగ్ మహోత్సవ్ (2017)
  4. కల్చర్ ఆఫ్ ఎమిటి (2017)
  5. ఎ గ్రీన్ గార్లాండ్
  6. ఉమెన్ ఇన్ ఆర్ట్ అండ్ కల్చర్
  7. వేర్ ది హెడ్ ఈజ్ హైల్డ్ హై (2018)
  8. ఐ విట్‌నెస్ ఆఫ్ ఎన్ ఎపోచ్
  9. మైమ్‌స్కేప్ ఆఫ్ తెలంగాణ

హిందీ:

  1. నయా సాల్ (2017)

సినీరంగ ప్రస్థానం

మార్చు

ఇప్పటివరకు రావూరి భరద్వాజ, సి. నారాయణరెడ్డి మొదలైన వారి గురించి దాదాపు 150 డాక్యుమెంటరీలు తీశాడు. క్లాసిక్ సినిమాలను, సినీరంగానికి చెందిన కళాకారులను పరిచయంచేస్తూ వందేళ్ళ భారతీయ చిత్రంపై 60,70 ఎపిసోడ్లుగా వివిధ భాషల చిత్రాలపై హరికృష్ణ నిర్మించిన డాక్యుమెంటరీలు వివిధ ఛానళ్ళలో ప్రసారమయ్యాయి.[6]

  1. ఏకాంత వాసి (26 నిముషాలు) - రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ్ అవార్డు వచ్చిన సందర్భంగా (2013)
  2. శతాబ్ది చిత్రం (50 నిముషాలు) - భారతీయ సినిమా 100 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా
  3. విశ్వంభరుడు - సి. నారాయణరెడ్డి జీవితం, అతను రాసిన సినీ పాటలపై

టీవీరంగ ప్రస్థానం

మార్చు
  1. వివిధ టీవీ ఛానల్స్ లో వచ్చిన టాప్ 100 మూవీస్, హాలీవుడ్ 360, ఫార్ములా నెం.1, ఫ్రేమ్ టూ ఫ్రేమ్, బాంబే టాకీస్, డైరెక్టర్స్ మూవీ, జూమ్ బరాబర్ జూమ్, తెలుగు సినిమాలలో వనిత, 100ఏళ్ళ భారతీయ సినిమా, సూపర్ హిట్ సినిమా, రూలర్ వంటి కార్యక్రమాలకు రచయితగా పనిచేశాడు.
  2. సినీరంగ పెద్దల విజయాలపై కథనాలు రాయడమేకాకుండా, శ్యామ్ బెనగళ్, వేటూరి సుందరరామ్మూర్తి, అక్కినేని నాగేశ్వరరావు, సి. నారాయణరెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ మొదలైన వారిని ఇంటర్వ్యూలు చేశాడు.
  3. సమకాలీన అభివృద్ధి, టెలివిజన్ ట్రెండ్స్ గురించి ఇడియట్ బాక్స్ పేరుతో ప్రతి వారాంతం వచ్చే 30 నిముషాల కార్యక్రమాన్ని, స్పెషల్ ఫోకస్ పేరుతో సమకాలీన విషయంపై కార్యక్రమాన్ని రూపొందించాడు.
  4. వావ్ - మంచి కిక్ ఇచ్చే గేమ్ షో (ఈటీవీ - సాయి కుమార్); రాజు రాణి జగపతి (ఈటీవి - జగపతిబాబు); యువర్స్ టైం స్టార్ట్స్ నౌ (ఎన్ టీవి - ఝాన్సీ);, అభిమాని (రాజీవ్ కనకాల) వంటి గేమ్ షోలకు రూపకల్పన, పరిశోధన, రచనలు చేశాడు.[20] వావ్ గేమ్ షో మూడవ సీజన్ ప్రసారమవుతూ, ఇతర భాషల ఛానళ్ళలో కూడా రూపొందించబడింది.

తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా  సాధించిన విజయాలు:

మార్చు

కరోనా కాలం – ఆగని అక్షర యజ్ఞం

2020 జనవరిలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపివేసి, మానవ జాతి చరిత్రలోనే వ్యక్తులను, వ్యవస్థలను అన్నిటినీ స్తంభింపచేసింది. 2020 మార్చి 23న భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘జనతా కర్ఫ్యూ’ను విధించాల్సి వచ్చింది. ఆ తర్వాత రోజు నుంచే దేశ చరిత్రలో మొట్టమొదటసారిగా ‘లాక్‌డౌన్‌’ విధించారు. ఈ నేపథ్యంలో అన్ని యంత్రాంగాలు, సంస్థలు, వ్యవస్థలు చాలా వరకు నిర్‌వ్యాపారమై ఎక్కడివక్కడే కుదేలైన పరిస్థితులలో సాహితీ, సాంస్కృతిక కార్యకలాపాలు కూడా ఆగిపోయాయి.

ఇలాంటి పరిస్థితులలో 2020 జూలై 28 నాడు ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు సెక్రటరీగా అదనపు బాధ్యతలు అందించింది. అప్పటికే, భాషా సాంస్కృతిక శాఖ చేపట్టిన ‘‘6 సి ఇనిషియేటివ్’’లో భాగంగా సాహితీ కార్యక్రమాలకు తెలంగాణ సాహిత్య అకాడమి సారథ్యంలో ఆన్‌లైన్‌ వేదికగా శ్రీకారం చుట్టింది. “6సి” అంటే (Corona Cannot Control Culture, Creativity, Cinema). ఈ పేరుతో 4 ఏప్రిల్‌, 2020 నాడు సాంస్కృతిక, సాహితీ కార్యక్రమాలకు ఆన్‌లైన్‌ ద్వారా డిజిటల్‌ / వర్చువల్‌ ప్లాట్‌ఫామ్‌పై నిర్వహించడానికి భాషా సాంస్కృతిక శాఖ నిర్ధిష్ట కార్యాచరణ పథకాన్ని రూపొందించి అమలు చేసి విజయము సాధించింది. ఈ విధానంలో నిర్వహించిన నృత్యోత్సవాలు, డ్రామా ఉత్సవాలు, యాక్టింగ్‌, స్క్రిప్ట్‌ రైటింగ్‌ వర్క్ షాప్, కర్రసాము, డైరెక్షన్, సంగీతోత్సవాలు ఇతర వర్క్ షాప్‌లు ఎంతో ఆదరణను, ప్రశంసలను పొందాయి. ఈ అనుభవంతో తెలంగాణ సాహిత్య అకాడమి ద్వారా వర్చువల్/డిజిటల్ విధానంలో ఆన్‌లైన్‌ సాహితీ కార్యక్రమాలను, కవి సమ్మేళనాలను నిర్వహించడం ప్రారంభించింది.

అలా తెలంగాణ సాహిత్య అకాడమీ ఈ కరోనా సమయాల్లో ఫిజికల్ గానూ, డిజిటల్ గానూ ఈ దిగువ రకాల సాహిత్య, భాషా కార్యక్రమాలను నిర్వహించింది.

1. తెలంగాణకు చెందిన ప్రముఖ సాహితీవేత్తల జయంతులు, వర్ధంతులు :

మార్చు

తెలంగాణాకు చెందిన ముకురాల రామారెడ్డి, మాడపాటి, రావెళ్ళ వెంకట రామారావు, మఖ్ధూం మొహియుద్దీన్, నీలా జంగయ్య, సరోజిని నాయుడు, గడియారం రామకృష్ణశర్మ, ఒద్దిరాజు సోదరులు, బిరుదురాజు రామరాజు, సామల సదాశివ, పల్లా దుర్గయ్య, సురవరం ప్రతాపరెడ్డి, సుద్దాల హనుమంతు, పైడిమర్రి, చందాల కేశవదాసు, దాశరథి సోదరులు, పాకాల యశోదారెడ్డి, వానమామలై, దేవులపల్లి రామానుజరావు, కాళోజి, నందగిరి ఇందిరాదేవి, షోయబుల్లాఖాన్‌, మాదిరెడ్డి సులోచన, వట్టికోట, ఆదిరాజు, పొట్లపల్లి, లోకమలహరి, భండారు అచ్చమాంబ మొదలగు సాహితీ వైతాళికుల జయంతి, వర్ధంతుల సందర్భంగా వారి చిత్ర పటాలకు పూలమాలలతో నివాళులు అర్పించడమే కాక, వారు చేసిన సాహితీ కృషిని గుర్తుచేసుకోవడం, ఆన్‌లైన్‌ వేదిక గానూ యూట్యూబ్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా ద్వారా వారి జీవిత విశేషాలను తెలుగు సాహితీ లోకంలో వ్యాప్తి చేసింది.

2. కవి సమ్మేళనాలు - రాష్ట్ర స్థాయి, అంతర్జాతీయ బహు భాషా కవి సమ్మేళనాలు :

మార్చు

కావ్యకౌముది సంస్థతో కలిసి ‘‘అంతర్జాతీయ బహుభాషా కవి సమ్మేళనం’’లను 4 సార్లు ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించగా అందులో ప్రతిసారీ దాదాపు 25 పైగా దేశాల నుంచి కవులు పాల్గొని తమ తమ భాషలలో కవితలు వినిపించారు. ఇవే కాకుండా తెలుగు కవి సమ్మేళనాలను కూడా ఆయా సాహితీ సంస్థల కార్యక్రమాలలో అంతర్భాగంగానూ, ప్రత్యేకంగానూ నిర్వహించింది.

3. భాషా ఛందస్సుపై అవగాహన కార్యక్రమాలు :

మార్చు

‘‘తెలుగులో బాలవ్యాకరణం, భాష, విమర్శ’’ అంశాలపై సంవత్సర కాలం పాటు ఆన్‌లైన్‌ కార్యక్రమాలను తెలంగాణ సారస్వత పరిషత్‌ ప్రాచ్య కళాశాల పూర్వ విద్యార్థుల సహకారంతో తెలంగాణ సాహిత్య అకాడమి నిర్వహించింది. భాష, వ్యాకరణంపై ఉన్న ఎన్నో క్లిష్ట అంశాలను ఈ కార్యక్రమంలో విశదీకరించి చర్చించడం ద్వారా ఉపాధ్యాయులు, భాషా పండితులు, సాహితీ వేత్తలకు అవగాహన కల్పించడం సాధ్యమయింది.

4. ప్రసిద్ధ కవులచే స్వయంగా ‘కావ్యగానం’ కార్యక్రమాలు :

మార్చు

ప్రముఖ కవులు తాము రాసిన కవితల గురించి, దాని నేపథ్యాన్ని గురించి వారి ముఖతః వారే వివరించే విధంగా వినూత్నమైన కార్యక్రమాన్ని ‘కావ్యగానం’ అనే పేరిట తెలుగు భాషా చైతన్య సమితితో కలిసి తెలంగాణ సాహిత్య అకాడమి ప్రతి ఆదివారం నిర్వహించింది. అనుమాండ్ల  భూమయ్య, కూరెళ్ల విఠలాచార్య, తిరునగరి, జింబో, గండ్ర లక్షణ రావు, రామాచంద్రమౌళి, జలజం, నాళేశ్వరం, సుద్దాల అశోక్‌ తేజ, అయినంపూడి శ్రీలక్ష్మీ, యాకూబ్‌, వనపట్ల, జూపాక సుభద్ర, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, సుంకిరెడ్డి, అన్నవరం, అఫ్సర్‌, ప్రసేన్‌, జూకంటి, వేణు సంకోజు, నలిమెల భాస్కర్‌, షాజహానా, ఎస్వీ సత్యనారాయణ, దేశపతి శ్రీనివాస్‌, దోరవేటి, కాంచనపల్లి, దామెర రాములు, శిలాలోహిత, స్వాతి శ్రీపాద, రేణుక అయోల, కొండెపూడి నిర్మల, మహెజబీన్‌, సీతారాం, రేడియం మొదలగు సమకాలీన కవులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సాహిత్య ప్రస్థానాన్ని, కవితా విశేషాలను వివరించడం పరిశోధనలకు, భవిష్యత్‌ తరాలకు ఒక డాక్యుమెంటేషన్‌ను అందజేసిందని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం పరిశోధకులకు ‘First Hand Source of information’గా భావించగలిగే స్థాయిలో రూపొందడం విశేషం.

5. ప్రచురణ విక్రయ కేంద్రం ఏర్పాటు :

మార్చు

తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురించిన పుస్తకాలను విద్యార్థులు, పరిశోధకులు, పోటీ పరీక్షల అభ్యర్థులకు, సాహితీ ప్రియులకు అందరికీ అందుబాటులో ఉంచడానికి రవీంద్రభారతి ప్రాంగణంలో శాశ్వత విక్రయ కేంద్రాన్ని 13 నవంబరు, 2020 నాడు ఏర్పాటు చేసింది. దీనివల్ల వ్యక్తులు పుస్తకాలను చూడటం, చదవడం, అవసరమైన వాటిని డిస్కౌంట్‌లో కొనుగోలు చేసే అవకాశం లభించింది.

6. హైదరాబాద్‌ బుక్‌ ఫేయిర్‌లో స్టాల్‌ ఏర్పాటు :

మార్చు

ప్రతి యేటా ప్రతిష్ఠాత్మకంగా భాషా సాంస్కృతిక శాఖ , హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సొసైటీ సంయుక్తంగా నిర్వహించే బుక్‌ ఫెయిర్‌లో తెలంగాణ సాహిత్య అకాడమికి ప్రత్యేక స్టాల్‌ను

ఏర్పాటు చేయడం ద్వారా ఫెయిర్‌ను సందర్శించే లక్షలాది మంది పుస్తక ప్రేమికులకు అకాడమీ ప్రచురించిన పుస్తకాలను చేరువ చేసింది.

7. సోషల్‌ మీడియా ద్వారా తెలంగాణాసాహితీ, భాషా విషయాల వ్యాప్తి :

మార్చు

తెలంగాణకు సంబంధించిన సాహితీ, భాషా విషయాలు, వైతాళికులకు సంబంధించిన విశేషాంశాలను, జీవన ప్రస్థానాన్ని వాట్సప్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు, సందర్భోచితంగా తెలియపరుస్తూ ఒకవైపు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యక్రమాలను, మరొకవైపు ఆ విశేషాలను అన్ని వర్గాల ప్రజలకు అందించే ప్రయత్నాన్ని చేసింది.

ఇలా ‘కోవిడ్‌ సవాలు’ను అవకాశంగా మలుచుకుంటూ ఆన్‌లైన్‌ వేదికగా గణనీయమైనంత సాహితీ, భాషా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా తెలంగాణ సాహిత్య అకాడమి తెలంగాణ ప్రాంతం అనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలుగు వారందరికీ చేరువ అయింది. సౌతాఫ్రికా నుండి మొదలుకొని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వరకు, కెనడా నుంచి మొదలుకొని బ్రిటన్‌ వరకు వివిధ NRI సంస్థలతో సమన్వయం చేసుకుంటూ తెలంగాణ సాహిత్య అకాడమి రకరకాల సాహిత్య కార్యక్రమాలను నిర్వహించింది. ఇక దేశీయంగా వివిధ సాహితీ సంస్థల సహకారంతో పైన తెలిపిన విభిన్నమైన సాహితీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం ‘‘హైబ్రిడ్‌ తరహా’’ లో ఆన్‌లైన్‌ / వర్చువల్‌ కార్యక్రమాలను , ఆఫ్ లైన్‌ కార్యక్రమాలను సమాంతరంగా నిర్వహిస్తూ వర్గాలు, ప్రాంత పరిమితులకు అతీతంగా తెలంగాణ సాహిత్య అకాడమీ అందరినీ కలుపుకొని పోవాలనే లక్ష్యాన్ని సాధించడంలో సఫలీకృతం అయింది.

8. పుస్తక ప్రచురణలు

మార్చు

తెలంగాణ సాహిత్య అకాడమి ప్రధాన లక్ష్యాలలో పుస్తక ప్రచురణలు కూడా ఒకటి. దీనివల్ల ఆయా భాషా, సాహిత్య విషయాలు గ్రంధస్థం కావడమే కాక, భావితరాలకు ‘రెఫరెన్స్’గా నిలుస్తాయి. అందుకే “తెలంగాణ భాష – ఒక అవలోకనం” (నలిమెల భాస్కర్) వంటి పుస్తకాలను ఎన్నిటినో ఈ కరోనా కాలంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా ప్రచురించారు.

          అంతేగాక, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, విద్యావేత్తగా, సాహితీవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, పాలనాదక్షుడిగా, ఆర్థిక సంస్కరణల ప్రతిపాదకుడిగా పూర్వ ప్రధాని శ్రీ పి.వి.నరసింహారావు పాత్ర రాష్ట్ర దేశ విషయాలలో అనన్య సమాన్యమైనది. అతను శత జయంతి సందర్భంగా వారి మూర్తిమత్వాన్ని 360 డిగ్రీలలో ఆవిష్కరించడమే ప్రధాన లక్ష్యమని ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ మొత్తం 8 పుస్తకాలను ప్రచురించింది. వాటిలో శ్రీ పీవీ గారు రాసినవి 4 పుస్తకాలు కాగా, మిగతావి అతను కృషిని, జీవితాన్ని విశ్లేషించే గ్రంథాలు కావడం విశేషం. వాటి వివరాలు:

శ్రీ పీవీ నరసింహారావు రచనలు (ఇంగ్లీష్ లో)

i.      Influence of India's Culture on the West and Other Speeches: పశ్చిమ దేశాలపై భారత సంస్కృతి ప్రభావంపై పీవీ నరసింహారావు గారి ప్రసంగాల సంకలనం

ii.     The Granny & Other Stories: పీవీ నరసింహారావు గారు రాసిన 8 అరుదైన కథల సంకలనం. ఇందులో ప్రసిద్ధ గొల్ల రామవ్వ కథ కూడా ఉంది.

iii.    The Meaning of Secularism and Other Essays: పీవీ నరసింహారావు గారు వివిధ సందర్భాలలో రాసిన వ్యాసాల సంకలనం.

iv.    Thus Spake PV-Interviews with P.V.NarasimhaRao: పీవీ నరసింహారావు గారిని వేర్వేరు మీడియా ప్రతినిధులు చేసిన ఇంటర్వ్యూల సంకలనం.

శ్రీ పీవీ గారిపై ఇతర పుస్తకాలు (ఇంగ్లీష్ లో)

v.     P.V. Narasimha Rao-Architect of India's Reforms: పీవీ నరసింహారావు చేసిన ఆర్థిక సంస్కరణలపై సంజయ బారు రాసిన కాఫీ టేబుల్ పుస్తకం.

vi.    Legend in Lines: పీవీ నరసింహారావు గారు స్ఫూర్తిగా దాదాపు 125కు పైగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర కార్టూనిస్ట్ లు వేసిన క్యారికేఛర్ ల సంకలనం.

శ్రీ పీవీ గారిపై తెలుగులో ప్రచురించిన పుస్తకాలు

vii.   నమస్తే పీవీ: పీవీ నరసింహారావు గారి గురించి నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురించిన వ్యాసాల సంకలనం.

viii.  కాలాతీతుడు: పీవీ నరసింహారావు గారి జీవితం స్ఫూర్తితో 143 మంది కవుల కవితా సంకలనం.

పై పుస్తకాలను 2021 జూన్ 28న పీవీ జ్ఞానభూమిలో జరిగిన పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళసై సౌందర రాజన్ గారు, ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆవిష్కరించారు.

9. సమకాలీన సాహితీవేత్తల రచనలు, జీవితం, సాహిత్యంపై చర్చ – సదస్సులు :

మార్చు

అ)      ఉనికి సామాజిక, సాంస్కృతిక వేదిక – నల్లగొండ (బండారు శంకర్) వారి ఆద్వర్యంలో మునాసు వెంకట్ కవిత్వంపై, మహాకవి గింజల నరసింహారెడ్డి కవిత్వంపై ఒక రోజు సదస్సు.  

ఆ)      సాహితీ మిత్ర మండలి, పరకాల వారు సాహితీ కార్యక్రమాలపై సదస్సు (డా.పల్లేరు వీరస్వామి).

ఇ)      సాహితీ సోపతి, కరీంనగర్ (అన్నవరం దేవేందర్) వారి పదేండ్ల పండుగ సాహితీ ఉత్సవాలు, డా.కాలువ మల్లయ్య సప్తతి సాహిత్య సంబురాలను నిర్వహించింది.  

ఈ)     భానుపురి సాహితీ వేదిక, సూర్యాపేట వారి ఆద్వర్యంలో సక్కనితొవ్వ సాహితీ సంకలన ఆవిష్కరణ, భానుపురి సాహితి జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం వంటి కార్యక్రమాలను (ఆఫ్ లైన్‌లో - భౌతికంగా కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ) విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

ఇవేకాక కవిత్వం / సాహిత్యానికి సంబంధించిన పుస్తకావిష్కరణలను, బాల సాహిత్యంపై, కావ్య పాఠనంపై కొత్త పుస్తకాల పరిచేయంపై ప్రత్యేక సాహితీ సదస్సులు / చర్చా గోష్టులను కూడా విజయవంతంగా నిర్వహించి తెలంగాణ సాహితీ సమాజంలో తనదైన ముద్రను వేసింది. వీటికి తోడు 2022 సంవత్సరపు క్యాలెండర్ ను, డైరీని కూడా ప్రచురించడం ద్వారా సాహితీవేత్తలకు తెలంగాణ సాహిత్య అకాడమి కార్యకలాపాలను మరింత చేరువ చేసే ప్రయత్నాలు చేసింది. ఇది కేవలం డైరీ గానే కాక, అందులో తెలంగాణకు చెందిన ప్రముఖ సాహితీ వైతాళికుల జయంతులు, వర్ధంతుల విషయాలను, రాష్ట్ర అవతరణ నుండి సాహిత్య రంగం ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ పురస్కారాలు సాధించిన అక్షర మూర్తుల వివరాలను అందించడం అందించారు[21]

గుర్తింపులూ, పురస్కారాలు

మార్చు
  1. లాసెట్‌లో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం, ఎంఈడీ సెట్‌లో కాకతీయ విశ్వవిద్యాలయం స్థాయిలో మొదటి స్థానం, బిఈడీ సెట్‌లో రాష్ట్రస్థాయిలో ఐదవ స్థానంలో నిలిచాడు.
  2. 2009, 2012 సంవత్సరాల్లో ఉత్తమ సినీ విమర్శకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే నంది పురస్కారాలు అందుకున్నాడు.[22]
  3. 2010 నంది బహుమతుల జ్యూరీ సభ్యుడిగా పనిచేసాడు.
  4. ఊరికి పోయిన యాళ్ళ కవితా సంకలనంలోని ‘పండుగ‘ అనే కవితనే ప్రతిష్ఠాత్మకమైన నేషనల్ సింపోజియం ఆఫ్ పోయెట్స్-2020కి ఎంపిక చేయబడింది.[23] ఈ కవితకు జాతీయస్థాయి పురస్కారం కూడా అందుకున్నాడు.[1] జాతీయస్థాయి పురస్కారం అందుకున్న తెలంగాణ భాష తొలి కవిత ఇది.
  5. యువ సినిమా కళాకారులకు ప్రోత్సాహం అందిస్తూ, తెలంగాణ సినిమారంగం కోసం కృషిచేస్తున్నందుకు 2018లో ఇండివుడ్ అవార్డు, 2019లో జీ సినిమా అవార్డు అందుకున్నాడు.
  6. కొన్ని సంవత్సరాల కాలం క్రితం సాహితీకారులకు, కవులకు చిరపరిచితమైన హరికృష్ణ వివిధ వార, దిన పత్రికల్లో పలు సందర్భాల్లో విభిన్న కవితలు, వ్యాసాలు రాసి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
  7. తెలంగాణ కవితలను ఆంగ్లంలోకి అనువదించి తెలంగాణ కవితలకు అంతర్జాతీయ గుర్తింపును సాధించాడు.
  8. 2019 సంవత్సరంలో రాష్ట్రస్థాయి ఉత్తమ అధికారిగా ఎంపికైన హరికృష్ణ, 2020 ఫిబ్రవరి 17న మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ చేతులమీదుగా ఈ అవార్డును అందుకున్నాడు.
  9. 'తెలుగు సినిమాలలో జానపద కథాంశాలు – అధ్యయనం' అనే అంశంపై పిహెచ్.డి పరిశోధన చేసి గోల్డ్ మెడల్ సాధించిన హరికృష్ణను, 2022 జూలై 23న ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభినందించి సత్కరించాడు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 మన తెలంగాణ, కలం (30 December 2019). "తెలంగాణ బతుకు చిత్రణ". Archived from the original on 20 April 2020. Retrieved 20 April 2020.
  2. telugu, NT News (2022-07-17). "మామిడి హరికృష్ణకు తెలుగు వర్సిటీ డాక్టరేట్‌". Namasthe Telangana. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  3. telugu, NT News (2023-05-21). "మామిడి హరికృష్ణకు పితృవియోగం". www.ntnews.com. Archived from the original on 2023-05-21. Retrieved 2024-08-07.
  4. బహుముఖ ప్రజ్ఞాశాలి మామిడి హరికృష్ణ, డా. బాసని సురేష్, దక్కన్ ల్యాండ్, అక్టోబరు 2019, పుట. 23.
  5. "సాంస్కృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణకు డాక్టరేట్‌". Sakshi. 2022-07-17. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  6. 6.0 6.1 అక్షరం నాకు మా అమ్మ ఇచ్చిన వరం (మామిడి హరికృష్ణ ఇంటర్వ్యూ), పాలపిట్ట మాసపత్రిక, డిసెంబర్ 2017, హైదరాబాదు, పుట. 52.
  7. Babu, Velugu (2023-08-13). "ఊరు తెలంగాణ భాష తెలంగాణ - Mana Telangana". Mana Telangana. Archived from the original on 2023-08-14. Retrieved 2023-08-14.
  8. "అమ్మ మనసు - Sunday Magazine". EENADU. Archived from the original on 2021-09-11. Retrieved 2021-12-13.
  9. "సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ హరికృష్ణకు డాక్టరేట్‌". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-07-17. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  10. వన్ ఇండియా. "భాషా సాంస్కృతిక డైరెక్టర్‌గా మామిడి హరికృష్ణ". Archived from the original on 5 November 2016. Retrieved 23 July 2016.
  11. సాక్షి, తెలంగాణ, కథ. "సాంస్కృతిక శాఖ సంచాలకునిగా హరికృష్ణ!". Retrieved 28 December 2016.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)
  12. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (14 October 2016). "మామిడి హరికృష్ణ పదవీకాలం పొడిగింపు". Retrieved 20 October 2016.[permanent dead link]
  13. నవతెలంగాణ (16 November 2015). "భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా మామిడి హరికృష్ణ ఏడాది ప్రస్తానం". Archived from the original on 23 మే 2019. Retrieved 20 October 2016.
  14. నమస్తే తెలంగాణ (9 August 2016). "తెలుగు ప్రాచీనహోదాకు తిరుగులేదు". Archived from the original on 11 August 2016. Retrieved 20 October 2016.
  15. నమస్తే తెలంగాణ (28 August 2016). "మన తెలుగు వెలుగు ప్రాచీన హోదాపై కవర్ కథనం". Archived from the original on 25 January 2019. Retrieved 20 October 2016.
  16. నమస్తే తెలంగాణ (27 July 2016). "తెలంగాణ వల్లే..త్వరలో తెలుగుకు ప్రాచీన హోదా..!". Retrieved 20 October 2016.
  17. ఆంధ్రజ్యోతి. "తెలుగు ప్రాచీనమే". Archived from the original on 10 ఆగస్టు 2016. Retrieved 3 March 2017.
  18. Telangana Today (24 February 2019). "When Telugu took centre stage". Telangana Today. Madhulika Natcharaju. Archived from the original on 3 August 2019. Retrieved 3 August 2019.
  19. మనతెలంగాణ, తెలంగాణ (15 September 2019). "జానపదుల చేతిలోని తీపి మామిడి". డా. బాసని సురేష్. Archived from the original on 1 October 2019. Retrieved 1 October 2019.
  20. నమస్తే తెలంగాణ, ఎడిటోరియల్ (5 April 2020). "నిర్జనమ్‌". Archived from the original on 13 April 2020. Retrieved 13 April 2020.
  21. "తెలంగాణ సాహితీ ప్రస్థానంలో నవోదయం ! | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 2022-03-18.
  22. తెలుగు ఫిల్మీబీట్. "నా నంది తెలంగాణాకు అంకితం". telugu.filmibeat.com. Retrieved 3 March 2017.
  23. ఈనాడు, ప్రధానాంశాలు. "జాతీయస్థాయి సమ్మేళనానికి మామిడి హరికృష్ణ కవిత". www.eenadu.net. Archived from the original on 20 April 2020. Retrieved 20 April 2020.

బయటి లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.