మూడు
సహజ సంఖ్య
(3 నుండి దారిమార్పు చెందింది)
మూడు లేదా 3 అనేది లెక్కించడానికి వాడే అంకెలలో రెండు తరువాత, నాలుగుకు ముందు వచ్చే అంకె. సమానంగా విభజించలేని మొదటి సమూహం మూడు కావడం వల్లనో, మరెందువల్లనో గాని ఈ అంకెకు గణితంలోనూ, భాషా ప్రయోగంలోనూ, మతపరమైన ఆచారాలు, సిద్ధాంతాలలోనూ, సంస్కృతిలోనూ కొన్ని విశిష్టతలున్నాయి. కార్డినల్ డిగ్రీలు క్రింద చూపబడ్డాయి.
నిజ సంఖ్య (Cardinal) | 3 మూడు |
క్రమ సంఖ్య (Ordinal) | 3వ, మూడవ, తృతీయి |
గుణకములు Factorization | ప్రాథమిక సంఖ్య |
భాజకములు (Divisors) | 1,3 |
రోమన్ సంఖ్య | III |
ద్వియాంశ (Binary) | 1 |
అష్టాంశ (Octal) | 3 |
ద్వాదశాంశ (Duodecimal) | 3 |
షోడశాంశ (Hexadecimal) | 3 |
దీనిని వివిధ సందర్భాలలో ఇలా వాడుతారు
- లెక్కలో మూడవది. అంటే కొన్ని వస్తువుల సమూహాన్ని లెక్క పెట్టేపుడు "ఒకటి", "రెండు" తరువాత "మూడు" వస్తుంది. ఇక్కడ అన్నింటిలో ఆ వస్తువు కూడా ఒకటి మాత్రమే కాని దానికి విశేష స్థానం ఏమీ లేదు. (ఒకటి, రెండూ, మూడు ....;)
మూడును సూచించే గుర్తులు
మార్చుతెలుగు భాష వాడుకలో
మార్చు- తెలుగులో మూడుకి సంబంధించిన మాటలు మూడొంతుల ముప్పాతిక వరకు సంస్కృతం నుండి దిగుమతి అయినవే అని అనిపిస్తుంది.
- ముప్పావలా అంటే మూడు పావులాలు. మువ్వన్నె అంటే మూడు రంగులు. మువ్వురు అంటే ముగ్గురు. మువ్వంద అంటే మూడు వందలు.
- ముప్పేటలో మూడు పేటలుంటే ఉన్నాయేమో కాని ముప్పేటకాయ అంటే మూడు పాళ్ళు ముదిరి ఇంకా ఒక పాలు లేతగా ఉన్న కొబ్బరి కాయ. ముక్కంటి అంటే మూడు కన్నులు కలవాడు, శివుడు; కలది, కొబ్బరికాయ.
- విశాఖపట్నం జిల్లాలో ముచ్చిలక అనే మాటని ముప్పాతిక అనే అర్థంలో వాడడం ఉంది. కాని నిఘంటువులో ముచ్చిలక అంటే భూస్వామి కౌలుదారుల మధ్య ఖరారునామా అనే అర్థం ఒక్కటే ఉంది.
- ముమ్మారు అన్నా ముమ్మిడి అన్నా మూడు సార్లు అని అర్థం కదా, మరి ముమ్మిడివరం అంటే మూడు సార్లు వరం అని అర్థమా? దేవుడి దగ్గర మూడు వరాలు పుచ్చుకుందికేనేమో ముమ్ముడివరంలో బాలయోగి వెలిసేడు.
- ముప్పది అంటే మూడు పదులు, వెరసి ముప్ఫయ్. ఇలాగే ముయ్యేడు అంటే మూడు ఏళ్ళు వెరసి ఇరవై ఒకటి. మున్నూరు 300 అయినట్లే మూడు మూళ్ళు తొమ్మిది కాస్తా ముమ్మూడు అవుతుందన్నది ముమ్మాటికీ నిజం.
- మనిషిని పోలిన మనిషి కనిపిస్తే “ముమ్మూర్తులా మీలాగే ఉన్నాడండీ” అంటాం.
- మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు తిరుపతిలో స్వామి పుష్కరిణిలో మూడుకోట్ల తీర్థములు వస్తున్నవనే ఐతిహ్యం కారణంగా ఆ రోజుని ముక్కోటి ఏకాదశి అంటారు.
- ఈ పైన చెప్పిన ఉదాహరణలన్నిటినీ వ్యాకరణంలో ఒక్క సూత్రంతో టూకీగా చెప్పెయ్యొచ్చు. “సమనాధికరణంబగు ఉత్తర పదంబు పరంబగునప్పుడు మూడు శబ్దమున డువర్ణంబునకు లోపంబును, మీది హల్లునకు ద్విత్వంబును అగు”. కనుక మూడు + లోకములు = ముల్లోకములు. ఇదే విధంగా ముప్పాతిక, మువ్విధం, ముక్కాలి పీట, ముత్తాత, ముజ్జగము, మొదలగునవి.
- వ్యాకరణంలో ముఖ్యమైన సంధి త్రిక సంధి. ఈ సందర్భంలో అ, ఇ, ఎ అనే అక్షరాలని త్రికం అంటారు. త్రికం అంటేనే మూడు!
- ముయ్యంచు అంటే త్రిభుజం అని ఎంతమందికి తెలుసు? ఈ త్రిభుజాన్ని త్రికోణి అని కూడా అంటారు.
- “త్రి”తో మొదలయే సంస్కృతం మాటలు తెలుగులో కొల్లలు. త్రిమూర్తులు, త్రిలోకములు అందరికి తెలిసున్నవే. ఆయుర్వేదంలో సొంఠి, పిప్పలి, మిరియాలని త్రికటుకాలనిన్నీ; కరక, తాడి, ఉసిరికలని త్రిఫలాలనిన్నీ; వాత, పిత్త, శ్లేష్మాలని త్రిదోషాలనిన్నీ అంటారు. వ్యాకరణంలో మాత్రం త్రిదోషాలంటే పద, వాక్య, అర్థ దోషాలు.
- “ట్రిగొనామెట్రి” అన్న మాటని త్రి, గుణ, మాత్ర అని మూడు మాటలుగా విడగొట్టి “మూడు గుణాలని (సైను, కొసైను, టేంజెంటు) కొలిచే శాస్త్రం” అని అన్వయం చెప్పొచ్చు.
- త్రిశూలం త్రినేత్రుడి ఆయుధాలలో ఒకటి.
- త్రిదండం అనేది మనోదండం, వాగ్దండం, కర్మదండం అనబడే మూడు వెదురు బద్దలతో కట్టిన దండం.
- శైవులు నుదుటి మీద అడ్డుగా పెట్టుకునే విభూతి పెండికట్లని త్రిపుండ్రం అంటే వైష్ణవులు నిలువుగా పెట్టుకునే బొట్టుని ఊర్వ్థపుండ్రం అంటారు.
- బ్రహ్మపదార్థము సగుణబ్రహ్మము, నిర్గుణబ్రహ్మము అని రెండు రకాలే అయినా సగుణబ్రహ్మము త్రికాలాలలోనూ త్రిగుణాత్మకం (సత్వ, రజో, తమో గుణాలు) అని త్రిమతాచార్యులైన శంకర, రామానుజ, మధ్వాచార్యులు ఏకీభవించేరు.
- మనస్సులో అనుకున్నది ఒకటి, నోటితో చెప్పేది మరొకటి, చేత్తో చేసేది ఇంకొకటి అయితే ఆ పనిలో త్రికరణశుద్ధి లేదు.
- “త్రి” అన్న అక్షరం మాటకి మొదట వచ్చినట్లే మూడుని సూచించడానికి “త్రయం” అన్న తోక సర్వసాధారణంగా మాటకి చివర వస్తుంది - త్రిమూర్తులలో ఒకడైన శివుడిని “త్రయంబకుడు” అన్నప్పుడు తప్ప. భారతాన్ని తెలిగించిన నన్నయ, తిక్కన, ఎర్రనలు కవిత్రయం. అవస్థాత్రయంలో ఒంటి మీద తెలివి ఉన్న పరిస్థితిని జాగ్రదావస్థ అనిన్నీ, తెలివి తప్పిన తర్వాత నిద్రావస్థ అనిన్నీ, కలలు కనే సమయాన్ని స్వప్నావస్థ అనిన్నీ లేదా సుషుప్తావస్థ అనిన్నీ అంటారు. ఈ సుషుప్తావస్థ గురించి మనకి అనాది నుండి తెలుసుకానీ, ఈ దృగ్విషయం (”ఫినామినన్”) పాశ్చాత్యులకి ఈ మధ్యనే అవగాహన అయింది. దీనినే వీళ్ళు “రెం స్లీప్” (Rapid Eye Movement) అంటారు.
- సులభంగా అర్థం అయే కవిత్వం ద్రాక్షాపాకం, కొంచెం కష్టపడితే కాని అర్థం కాకపోతే అది కదళీపాకం, బొత్తిగా కొరుకుడు పడనిది నారికేళపాకం. ఈ మూడింటిని గుమ్మగుచ్చి పాకత్రయం అంటారు. ఇలాగే ఈషణత్రయం అని ఒకటుంది. నారేషణ అంటే ఆడదాని యందు ఆశ. పుత్రేషణ అంటే కొడుకు పుట్టాలనే కోరిక, ధనేషణ అంటే డబ్బు కోసం తాపత్రయం. “తాపత్రయం” అన్న మాటకి అసలు అర్థం ఆధ్యాత్మికం, ఆధిభౌతికం, ఆధిదైవికం అయినప్పటికీ ఆ విషయాన్ని విస్మరించి మనకి తోచిన విధంగా వాడేయడానికి ఊరికే తాపత్రయ పడిపోతూ ఉంటాం.
- అష్టాక్షరి, ద్వయం, చరమశ్లోకం మంత్రత్రయం. “ఓం నమో నారాయణాయ” అన్నది అష్టాక్షరి.
- కాళహస్తి, ద్రాక్షారామం, శ్రీశైలం ఉన్న త్రిలింగ దేశమే తెలుగు దేశం అని అంటారు.
- “త్రయం”కి ఇంగ్లీషులో సమానార్థకం “ట్రిపుల్” లేదా “ట్రయొ”.
- ఇంగ్లీషులోని “ట్రై”, “ట్రి”లు తెలుగులోని “త్రి” జ్ఞాతులు కనుక “ట్రై ఏంగిల్” అన్న మాటకి సరి అయిన తెలుగు త్రికోణం.
- ఇదే బాణీలో ముయ్యాకు అంటే మూడాకుల దళం అని అర్థం. ఈ మూడాకుల దళాన్నే ఇంగ్లీషులో “ట్రైఫోలెయెట్” అంటారు. “ట్రైడెంట్” అంటే “మూడు దంతాలు ఉన్నది” అనే అర్థం స్ఫురించినా ఇంగ్లీషులోనూ తెలుగులోనూ ఇది మూడు పళ్ళు ఉన్న త్రిశూలం. పాశ్చాత్యులు భోజనం చెయ్యటానికి వాడే మూడు పళ్ళ ఫోర్క్ ని త్రిశూలం అనీ, నాలుగు పళ్ళ ఫోర్క్ ని చతుశ్శూలం అనీ తెలుగులో అనొచ్చు.
- “ట్రైక్లోరోమెతేన్” అన్న రసాయన నామానికి త్రిహరితపాడేను అన్నది తెలుగు సేత. దీని వ్యుత్పత్తి కావలసిన వారు “రసగంధాయరసాయనం” పుస్తకం చదవండి.
- త్రిశంకు స్వర్గం, త్రిశంకు చక్కెర మొదలైన మాటలలోని “త్రి” కీ, మూడుకీ ఏమీ సంబంధం లేదు. ఇంతకీ 'త్రిశంకు చక్కెర' అన్నది “ఇన్వర్ట్ సుగర్” అన్న మాటకి తెలుగుసేత. దీని వృత్తాంతం కూడా “రసగంధాయరసాయనం”లో ఉంది.
- కేమ్‌బ్రిడ్జి విశ్వవిద్యాలయంలో జరిగే పరీక్షలలో పరీక్షని పర్యవేక్షించే వ్యక్తి (”వాచరు”) ముక్కాలిపీట మీద కూర్చునేవాడుట. అందుకనే ఈ పరీక్షలని “ట్రైపోప్” అనేవారు.
- పాశ్చాత్యుల ప్రస్తావన ఎలాగూ వచ్చింది కనుక ఒక చిన్న పిట్టకథ. రాజకీయాలలో మనం మన దేశాన్ని కుల వర్గాలుగా విడగొట్టినట్లే పూర్వం రోం సామ్రాజ్యాన్ని రోమను, సెబీను, ఆల్బను అని మూడు కుల వర్గాలుగా విడగొట్టేరు. లేటిన్‌లో “ట్రైబస్” అంటే మూడో వంతు కనుక ఈ కుల వర్గాలని వారు “ట్రైబ్” అన్నారు. రాజాస్థానానికి వచ్చే రాబడిలో మూడో వంతు ప్రతి “ట్రైబ్” నుండి వస్తోంది కనుక ఆయా కుల వర్గాలు కట్టే పన్నుని “ట్రిబ్యూట్” అన్నారు. “కంట్రిబ్యూషన్” అన్న మాట ఇందులోంచి వచ్చినదే. ఉపనదిని “ట్రిబ్యూటరీ” అనడానికి కూడా కారణం ఇదే - నదిలోని నీటిని “కంట్రిబ్యూట్” చేస్తున్నాది కనుక!
- రెండు పేటల దారంతో నేసిన బట్టని “ట్విల్” అన్నట్లే, మూడు పేటల దారంతో నేసిన బట్ట “డ్రిల్” బట్ట. ముప్పిరి అంటే మూడు పేటలు కనుక “డ్రిల్లు” బట్టని ముప్పిరి బట్ట అనొచ్చు.
- “త్రిమితీయ” అన్న ప్రత్యయాన్ని “త్రీ డిమెన్‌షనల్” అన్న అర్థంలో వాడుతున్నారు కొందరు. ఈ లెక్కని ఈ “ఫోర్ డిమెన్‌షనల్” ప్రపంచాన్ని “చతుర్‌మితీయం” అనొచ్చు. కాని “ఫోర్ డిమెన్‌షనల్” అన్న మాటకి “తురీయ మితీయం” అనే మాట మరొకటి ఉంది.
- భూగర్భశాస్త్రంలో “మూడవ, తృతీయ” అన్న అర్థం రావలసినప్పుడల్లా “టెర్‌షియరీ, ట్రయాసిక్” అనే పూర్వప్రత్యయాలు వాడతారు.
- “ట”మాషా ఏమిటంటే ఇంగ్లీషులో ట కార త కారాలకి ఒకే ఒక అక్షరం ఉన్నా భాష ఉచ్చారణలో ట కార త కారాలతో మొదలయే “మూడు” మాటలు చాల ఉన్నాయి. కాని తెలుగులో ట కార త కారాలకి విడివిడి అక్షరాలు ఉన్నా ట కారంతో మొదలయే "మూడు మాటలు" తెలుగులో లేవు.
- రెండు రోడ్ల కూడలిని కూడలి కిందే లెక్కించరు, ఎందుకంటే రోడ్డు మీద ఎక్కడ నిలబడ్డా, ముందున్న రోడ్డు, వెనకున్న రోడ్డు కలిపి రెండు రోడ్ల కింద లెక్క లోకి వస్తుంది కనుక. మూడు రోడ్ల కూడలిని లేటిన్‌లో “ట్రివియం” అంటారు. ఈ రకం కూడలిలో కూర్చుని ప్రజలు పనికిమాలిన (ట్రివియల్) కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారుట. మనదేశంలో ఇప్పటికీ ఇలా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు కనిపిస్తూనే ఉంటారు.
వనరులు
మార్చు- వేమూరి వేంకటేశ్వరరావు, "తెలుగు భాషలో అంకెలు, సంఖ్యలు - 3" ఈమాట - అంతర్జాల పత్రిక, జూలై 1999, https://web.archive.org/web/20070929063919/http://www.eemata.com/em/issues/199907
- వేమూరి వేంకటేశ్వరరావు, రసగంధాయ రసాయనం, 1991, 155 పుటలు
గణితంలో
మార్చు- ఒక సంఖ్యని 3 చేత భాగించగలమా లేమా అని సంశయం వస్తే ఆ సంఖ్యలోని అంకెలని అన్నింటిని కలిపి ఆ మొత్తాన్ని మూడు చేత భాగించి చూడండి. ఈ మొత్తాన్ని 3 చేత భాగించ గలిగితే ఆ సంఖ్యనీ భాగించగలం. ఉదాహరణకి 531 లోని అంకెల మొత్తం 5 + 3 + 1 = 9. ఈ 9 ని 3 చేత భాగించగలం కనుక 531 నీ 3 చేత భాగించగలం.
- వృత్తలేఖిని, కొలబద్ద సహాయంతో ఒక గీతని కాని, కోణాన్ని కాని సమద్విఖండన (బైసెక్ట్) చేయవచ్చని రేఖాగణితంలో దిట్టలయిన గ్రీకులు ఎప్పుడో కనుక్కున్నారు. కానీ ఒక కోణాన్ని సమత్రిఖండన (ట్రైసెక్ట్) చెయ్యడం ఎలాగో వాళ్ళకి తెలియలేదు. ఈ పని చెయ్యడం అసంభవం అన్న విషయం మనకి ఇటీవలి కాలంలోనే అర్థం అయింది!
కొన్ని సాధారణ లెక్కలు
మార్చులిపి సంకేతం పరిణామం
మార్చువిజ్ఞాన శాస్త్రంలో
మార్చుసంస్కృతిలో
మార్చువివిధ భాషలలో
మార్చువివిధ భాషలలో ఒకటికి వాడే పదాలు, గుర్తులు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
త్రీ Three | ఆంగ్లం |
తీన్ | హిందీ |
మూరు | కన్నడం |
మూన్ఱు | తమిళం |
.. | మళయాళం |
.. | బెంగాలీ |
తీనీ | ఒరియా |
.. | మరాఠీ |
.. | గుజరాతీ |
.. | పంజాబీ |
.. | కష్మీరీ |
.. | నేపాలీ భాష |
.. | మణిపురి భాష |
తీనీ | అస్సామీ భాష |
.. | కష్మీరీ |
.. | సంస్కృతం |
వనరులు
మార్చు- ఈ మాట తెలుగు వెబ్ పత్రిక - జూలై 1999 సంచిక - వేమూరి వేంకటేశ్వరరావు వ్యాసం - రచయిత, పత్రికల సౌజన్యంతో
- వేమూరి వేంకటేశ్వరరావు, "ఒకటి, రెండు, మూడు,..., అనంతం," కినిగె ఇ-ప్రచురణ, https://web.archive.org/web/20190428112414/http://kinige.com/