బంగాళదుంప

(ఆలుగడ్డలు నుండి దారిమార్పు చెందింది)

బంగాళదుంప అనేది దుంప జాతికి చెందిన ఒక కూరగాయ. ఒక్కో ప్రాంతములో ఒక్కోక పేరుతో ఈ దుంప కూర పిలవబడుతున్నది. కొన్ని చోట్ల ఆలు గడ్డ అని కొన్ని ప్రాంతములలో బంగాళదుంప లేదా "బంగాల్ దుంప" అని పిలుస్తారు. (ఆంగ్లము లో potato.) ఈ మొక్క సొలనేసి కుటుంబానికి చెందిన గుల్మము.

ఆలుగడ్డ - బంగాల్ దుంప
Scientific classification
Kingdom:
Division:
Class:
Subclass:
Order:
Family:
Genus:
Species:
సొ. ట్యూబరోసమ్
Binomial name
సొలానమ్ ట్యూబరోసమ్

బంగాళదుంప చరిత్ర

మార్చు
 
భారతదేశంలో తన పంటతో ఒక రైతు
 
 
2005లో ప్రపంచ దేశాలలోబంగాళ దుంపల ఉత్పత్తి

17వ శతాబ్దము వరకు బంగాళదుంప అనే కూరగాయ ఉన్నదని ఒక్క దక్షిణ అమెరికా ఖండంలో తప్ప మిగిలిన ప్రపంచానికి తెలియదు. స్పానిష్ వారు దక్షిణ అమెరికా ప్రాంతమును ఆక్రమించి వారి దేశానికి వలస దేశాలుగా తమ అధీనము లోనికి తీసుకువచ్చిన తరువాత, ఈ కొత్త కూరగాయ గురించి ముందు ఐరోపా వాసులకు ఆ తరువాత వారి ద్వారా ఇతర ప్రాంతములకు తెలిసింది. భారతదేశానికి బంగాళాదుంప ఐరోపా వలసవారి నుండి వచ్చినదే. వారు మన దేశమును వారి అధీనములోనికి తెచ్చుకున్న సందర్భములో తమ తమ దేశాలనుండి ఇక్కడకు తెచ్చిన అనేకమైన వాటిలో బంగాళాదుంప ముఖ్యమయినది. అసలు మొట్టమొదటి బంగాళదుంప మొక్కను ఐరోపాకు తెచ్చినది ఎవరు అన్న విషయంమీద ఇదమిద్దమైన ఆధారాలతో కూడిన సమాచారం లేదు. కొంతమంది వాదన ప్రకారం, అనేక యాత్రా విశేషాలను తన పర్యటనల ద్వారా ప్రపంచానికి తెలియచేసిన సర్ వాల్టర్ రాలీ (Sir Walter Raleigh) ఈ మొక్కను మొదట ఐరోపాకు తెచ్చాడని అనిపిస్తుంది. ఈ విషయంలో 20 సంవత్సరాలకు పైగా ఎంతగానో కృషిజరిపిన డేవిడ్ స్పూనర్ (David Spooner) మరొక విచిత్రమైన విషయం చెప్పాడు. అదేమిటంటే, స్పానిష్ ఆక్రమణాక్రమంలో, 1568లో గొంజాలో జిమెనెజ్ దే కేసడా (Gonzalo Jimenez de Quesada) అనే సైనికాధికారిని, ప్రస్తుతం కొలంబియా దేశంగా పిలవబడుతున్న ప్రాంతాన్ని తమ అదుపులోనికి తీసుకురావటానికి, స్పెయిన్ ప్రభుత్వం 2000 మంది సైనికులనిచ్చి పంపింది. అతను, తన అనుచరులతో, అక్కడి బంగారాన్ని దోచుకురావచ్చని చాలా ఉత్సాహంగా బయలుదేరాడు. కాని, నాలుగు సంవత్సరాల తరువాత అతను ఖాళీ చేతులతో, 60 మంది తన మిగిలిన అనుచరులతో చాలా డీలా పడి ఓటమి భారంతో తమ దేశానికి తిరిగి వచ్చాడు. ఆ దెబ్బతో అతని పరువు పోయింది, అతని పై అధికారులు అతన్ని చాలా నిరసించారు. అతని ఓటమి మీద అనేక వ్యంగ రచనలు కూడా జరిగినవట. కాని, అతను బంగారానికి బదులు, దక్షిణ అమెరికా ఖండము నుండి, అక్కడి మొక్కలలో ఒకటయిన "పప" లేదా "పొటాటొ" మొక్కలను తీసుకుని వచ్చాడు. అతనికి తెలియకుండానే, బంగారాన్ని మించిన సంపదను స్పెయిన్ దేశానికి తీసుకుని వచ్చాడు. అక్కడనుండి ఈ మొక్క మొదట స్పెయిన్, ఆ తరువాత ఇతర ఐరోపా దేశాలకు, వారి వలసవాద దురాక్రమణల వల్ల ఇతర దేశాలకు వ్యాప్తి చెందినదట.

అయితే, ఐరోపాలో దాదాపు ఒకటిన్నర రెండు శతాబ్దాలవరకు ఈ దుంపకూరను ఆదరించలేదు. ఇంగ్లాండులో నయితే, ఈ దుంపను "స్పడ్" (SPUD - Society for Pevention of Unhealthy - అనారోగ్య ఆహార అలవాట్ల నిరోధనా సంఘము) గా వ్యవహరించారట. కాని కొంతకాలమునకు, ఈ విధమయిన విపరీత వర్ణనల ప్రభావంనుండి బయటపడి, బంగాళాదుంప ఒక ముఖ్య భోజ్య పదార్థముగా మారినది. చరిత్రకారులు చెప్పిన ప్రకారం, పారిశ్రామిక విప్లవం విజయవంతము కావటానికి ఈ దుంపకూర ఎంతగానో దోహదపడినదట. బవేరియన్ యుద్ధాన్ని "పొటాటో యుద్ధం"గా అభివర్ణించారు. కారణం, యుద్ధం జరుపుతున్న దేశాల దగ్గర బంగాళాదుంపల నిల్వలు ఉన్నంతవరకే ఆ యుద్ధం జరిగినదట. అలాగే, దక్షిణ అమెరికాలో జరిగిన "ఇంకా" తెగల యుద్ధాలలో కూడ, మధ్యలో కొంత విరామం తీసుకుని, ఈ దుంపకూర పంటను ఇళ్ళకు చేర్చిన తరువాత మళ్ళీ కొనసాగించేవారట.

బంగాళాదుంప ఐరోపా ప్రాంతానికి ఎలా వచ్చింది అన్న విషయం మీద అనేక వాదనలు ఉన్నాయి, అందులో ప్రధానమైనవి, పైన ఉదహరించటం జరిగింది. భారతదేశంలోకి బంగాళాదుంప దాదాపు 17వ శతాబ్దపు మొదటి అర్ధ భాగములోనే వచ్చిందనటానికి కొంత ఆధారాలు ఉన్నాయి. అందులో ప్రధానమయినది, సర్ థామస్ రో (Sir Thomas Roe) 1615లో ఇంగ్లాడ్ రాయబారిగా మొఘల్ వంశస్థుడు జహంగీర్ పరిపాలిస్తున్న సమయంలో భారతదేశానికి వచ్చాడు. అతనితో పాటుగా అతని స్వంత పూజారి ఎడ్వర్డ్ టెర్రీ (Edward Terry) కూడా వచ్చాడు. అతనికి కొత్త ప్రదేశాలలో తను చూసిన విషయాలమీద వ్రాయటం ఒక అభిరుచి. అతని "తూర్పు భారతావని యాత్ర " (Voyage to East India) అనే పుస్తకాన్ని వ్రాశాడు. ఆ పుస్తకంలో అతను అప్పటికే భారతదేశంలో బంగాళదుంప ఉన్నట్టు వ్రాశాడు. భారతదేశంలో ఈ దుంపకూర గురించి చెయ్యబడ్డ మొట్టమొదటి ప్రస్తావన ఇదే. అప్పట్లో, ఈ మొక్కని పెరటి తోటలలో వేడుకగా పెంచేవారట. పూర్తిగా ఒక పంటగా 1822 వరకు పండించబడలేదు. మనదేశంలో సిమ్లా నగరంలో కేంద్రీయ బంగాళదుంప పరిశోధనా సంస్థ (Central Potato Research Institute-CPRI) [1] ఉంది. ఈ సంస్థకు చెందిన ఎస్.కె.పాండె (S.K.Pandey) చెప్పిన ప్రకారం, 1822వ సంవత్సరమువరకు, మనదేశములో బంగాళదుంపను ఒక పంటగా పండించలేదట. మొట్టమొదట, సల్లివాన్ అనే అంగ్లేయుడు, మద్రాసుకు దగ్గరలో తన వ్యవసాయ క్షేత్రంలో పంటగా మొదలు పెట్టాడట.

బంగాళాదుంప పంట నుండి 2006వ సంవత్సరములో మొత్తం ప్రపంచములో 315 మిలియన్ టన్నుల దిగుబడి వచ్చింది. ఈ విధంగా చూస్తే, మొత్తం పంటలలో బంగాళదుంప నాలుగవ స్థానాన్ని అక్రమిస్తుంది - వరి, గోధుమ, మొక్కజొన్న తరువాత. ప్రపంచవ్యాప్త బంగళాదుంప పంటలో నాలుగవ వంతు చైనా దేశంలో పండించబడుతున్నదట

పంట సాగు, ఉత్పత్తి

మార్చు
బంగాళదుంపలు యొక్క ప్రధాన ఉత్పత్తిదారులు
2006
(మిలియన్ మెట్రిక్ టన్నులు)
  People's Republic of China 70
  Russia 39
  భారతదేశం 24
  United States 20
  Ukraine 19
  జర్మనీ 10
  Poland 9
  Belgium 8
  Netherlands 7
  France 6
ప్రపంచ ఉత్పత్తి 315
మూలం:
ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ
(ఎఫ్.ఏ.వో)
[2]

అనుకూల పరిస్థితులు

మార్చు

ఈ పంటకు పగలుపూట తక్కువ సూర్యకాంతి, రాత్రిళ్ళు చల్లటి వాతావరణము కావాలి. ఈ విధమైన వాతావరణ పరిస్థితులు భారతదేశంలో చలికాలంలోనే ఉండటం వలన, ఈ పంటను భారతదేశంలో చలికాలంలోనే పండిస్తారు. ఈ పంటకు 90 నుండి 100 రోజుల సమయం చాలు. ఆందువలన, బంగాళాపంటను స్వల్ప కాలిక పంటగా పరిగణిస్తారు. వేడి ప్రాంతాలలో కూడా బంగాళదుంపను పండించటం జరుగుతున్నది కాని, అది మొత్తం దిగుబడిలో 8 నుండి 10 శాతము మాత్రమే. మన దేశంలో దాదాపు 25 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతున్నది. భారతదేశంలో ఈ పంటను ముఖ్యంగా బీహార్, ఉత్తర ప్రదేశ్ లలో పండిస్తారు. 1995లో బంగాళదుంపను "స్పేస్ సెంటర్"లో కూడా పండించారు. కాబట్టి, అంతరిక్షంలో పండించబడ్డ మొట్టమొదటి కూరగాయగా పేర్కొనవచ్చును.

సాగు పద్దతి

మార్చు
 
అమెరికాలోని మెయిన్ రాష్ట్రం ఫొర్ట్ ఫైర్‌ఫీల్డ్ గ్రామంలోని బంగాళాదుంప పొలం

బంగాళదుంపలు చెట్టుకు పండవు. పేరులోనే ఉన్నట్టు, దుంపగా భూమిలోపల, చెట్టు వేళ్ళకు పెరుగుతాయి. బంగాళదుంపలలో 80 శాతము నీరు మిగిలిన 20 శాతము ఘన పదార్ధములు. సాధారణంగా బంగాళదుంప మొక్కలు 60 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతాయి. బంగాళాదుంప మొక్కలు భూమిపై కొంత ఎత్తుకు పెరిగి, పసుపు రంగు కేసరాలు కలిగిన పూలు పూస్తుంది. పూలు పూచిన తరువాత, కొన్ని జాతి మొక్కలు చిన్న, ఆకుపచ్చని (చిన్న టొమాటో సైజు) పళ్ళు కాస్తాయి. ఒక్కో పండులోను 300 దాకా గింజలుంటాయి. ఈ బంగాళదుంప పళ్ళలో విషపదార్ధాలుంటాయి గనుక అవి తినడానికి పనికిరావు. ఈ మొక్కలు తుమ్మెదల ద్వారా పరపరాగసంపర్కం చెందడమే కాకుండా స్వజాతి సంపర్కం కూడా చెందుతాయి. ఏ బంగాళాదుంప రకాన్నైనా శాఖీయంగా, దుంపలను, "కళ్ళు" కలిగి ఉన్న దుంప ముక్కలను నాటడం ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. అంతే కాకుండా కత్తిరింపుల ద్వారా కూడా మంచి విత్తన దుంపలను పొందవచ్చు. ఈ పద్ధతిన హరిత గృహాలలో వినియోగిస్తారు. ఆధునిక రకాల మొక్కలను దుంపల కళ్ళ నుండి కాక గింజలనుండి పెంచుతున్నారు. గట్టిగా లోపలి భాగము సాధ్యమైనంత వరకు తెల్లగా ఉండాలి, ఆకుపచ్చనివి అసలు బాగుండవు. ఎక్కువ ఆలుగడ్డలు కొన్నచో వీటిని చల్లని చీకటి ప్రదేశాలలో దాచి ఉంచాలి.

పండిన బంగాళాదుంపలను తవ్వి తీయటానికి ప్రత్యేక పనిముట్లు ఉపయోగిస్తారు. వీటి సహాయంతో భూమిలోని దుంపలను బయటికి తీస్తారు. పెద్దపెద్ద బంగాళాదుంప సాగుదారులు, దుంపలను భూమినుండి వెలికి తీయటానికి యంత్రాలను ఉపయోగిస్తారు.

పంట నిలవ, అమ్మకం

మార్చు

సామాన్యంగా బంగాళాదుంపలను భూమిలోనుండి తీసిన వెంటనే అమ్మకం చేయరు. కొంతకాలం నిల్వ ఉంచిన బంగాళాదుంపలకు ఎక్కువ ధర పలుకుతుంది. కొన్నిసార్లు పంటను వెంటనే "కొత్త బంగళాదుంపలు"గా అమ్మటం జరుగుతుంది. బంగాళదుంపలను నిలువ ఉంచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతయినా అవసరం. నిల్వ చేసే ప్రదేశం వెలుగు తక్కువగా, మంచి గాలి తగిలేట్టుగా ఉండాలి. ఎక్కువకాలం నిల్వ ఉంచాలనుకుంటే, నిలవ ప్రదేశంలో 40°ఫా ఉష్ణోగ్రత ఉంచాలి. వ్యాపారపరంగా నిల్వచేసే గిడ్డంగులలో అయితే అరు నెలల వరకు, ఇళ్ళల్లో అయితే కొన్ని వారాలవరకు నిల్వచెయ్యవచ్చు.

ఆహార, వ్యవసాయ సంస్థ FAO లెక్కల ప్రకారం, 2006వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 315 మిలియన్ టన్నుల బంగాళదుంపల దిగుబడి వచ్చినదట. ఈ దిగుబడిలో నాలుగవ భాగం దిగుబడి ఛైనాలో జరిగినదట.

రకరకాలైన వంటలు

మార్చు
 
బంగాళాదుంప అల్లం, పచ్చిమిర్చి కూర
 
బంగాళాదుంప చిక్కుడుకాయ పోపు కూర

బంగాళదుంపతో రుచికరమైన వంటలు, కూరలు, చట్నీలు, ఫలహారాలు, ఇతర ఆహార పదార్ధాలు తయారుచేయవచ్చును. ఉడకబెట్టిన కూర, వేపుడు, కుర్మా వంటివి తరచు తెలుగు నాట చేసే కూరలు. ఇంకా బజ్జీల వంటి తినుబండారాలు చేస్తారు. ఊరగాయలు కూడా పడుతుంటారు. బంగాళదుంప చిప్స్ వంటి తినుబండారాలు మార్కెట్లో లభిస్తాయి. పాశ్చాత్య దేశాలలో బంగాళ దుంపతో చేసే పదార్ధాలు అక్కడి అలవాట్లకు తగినవిగా ఉంటాయి. ఇవి భారతీయ వంటకాలకంటే భిన్నమైనవి. ఏమైనా బంగాళ దుంపను తరిగి, లేదా ఉడకబెట్టి లేదా వేయించి అనేక రకాలైన, రుచికరమైన పదార్ధాలు తయారు చేయడం చాలా సమాజాలలో సర్వసాధారణం అయింది.

  • బంగాళదుంప వేపుడు
  • బంగాళదుంప ఇగురు కూర
  • బంగాళదుంప చట్నీ
  • హర భర కబాబ్

పౌష్టిక విలువలు

మార్చు
Potato, raw, with peel
Nutritional value per 100 గ్రా. (3.5 oz)
శక్తి321 కి.J (77 kcal)
19 g
పిండిపదార్థము15 g
పీచు పదార్థం2.2 g
0.1 g
2 g
విటమిన్లు Quantity
%DV
థయామిన్ (B1)
7%
0.08 mg
రైబోఫ్లావిన్ (B2)
3%
0.03 mg
నియాసిన్ (B3)
7%
1.1 mg
విటమిన్ బి6
19%
0.25 mg
విటమిన్ సి
24%
20 mg
ఖనిజములు Quantity
%DV
కాల్షియం
1%
12 mg
ఇనుము
14%
1.8 mg
మెగ్నీషియం
6%
23 mg
ఫాస్ఫరస్
8%
57 mg
పొటాషియం
9%
421 mg
సోడియం
0%
6 mg
ఇతర భాగాలుపరిమాణం
నీరు75 g
Percentages are roughly approximated using US recommendations for adults.

ఆహార పౌష్టికత పరంగా బంగాళదుంపలలో పిండి పదార్ధాలు (కార్బోహైడ్రేటులు) ప్రధానమైన ఆహార పదార్థం. ఒక మధ్య రకం సైజు దుంపలో 26 గ్రాములు పిండిపదార్థం ఉంటుంది. ఇది ముఖ్యంగా స్టార్చ్ రూపంలో ఉంటుంది. ఈ స్టార్చి‌లో కొద్ది భాగం పొట్టలోను, చిన్న ప్రేవులలోను స్రవించే ఎంజైములు వలన జీర్ణం కాదు. కనుక ఈ జీర్ణం కాని స్టార్చి భాగం పెద్ద ప్రేవులోకి తిన్నగా వెళ్ళిపోతుంది. ఈ జీర్ణం కాని స్టార్చి (resistant starch) వలన శరీరానికి ఆహార పీచు పదార్ధాలు (Dietary fiber) వల్ల కలిగే ఉపయోగాలవంటి ప్రయోజనాలే కలుగుతాయని భావిస్తున్నారు (శరీర పౌష్టికత, కోలన్ క్యాన్సర్ నుండి భద్రత, [1] గ్లూకోజ్ ఆధిక్యతను తట్టుకొనే శక్తి, [2] కొలెస్టరాల్ తగ్గింపు, ట్రైగ్లిజరైడులు తగ్గింపు వంటివి[3]). దుంపను ఉడకపెట్టి ఆరబెడితే ఇలా జీర్ణంకాని స్టార్చి ఎక్కువవుతుంది. ఉడికిన వేడి దుంపలో ఉండే 7% జీర్ణంకాని స్టార్చి, దానిని ఆరబెట్టినపుడు 13%కు పెరుగుతుంది.[4]

బంగాళ దుంపలలో పలువిధాలైన విటమిన్‌లు, ఖనిజ లవణాలు (minerals) ఉన్నాయి. 150 గ్రాముల బరువుండే ఒక మాదిరి బంగాళ దుంపలో 27 మిల్లీగ్రాముల విటమిన్-సి (ఒక రోజు అవసరంలో 45%), 620 మి.గ్రా. పొటాషియం ( అవసరంలో 18%), 0.2 మి.గ్రా. విటమిన్-B6 (అవసరంలో 10%) మాత్రమే కాకుండా కొద్ది మోతాదులలో థయామిన్, రైబోఫ్లావిన్, ఫోలేట్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పదార్ధాలు లభిస్తాయి. ఇంతే కాకుండా బంగాళదుంప తొక్కలో ఉన్న పీచు పదార్థం కూడా చాలా ఉపయోగకరం. ఒక మాదిరి బంగాళ దుంప తొక్క బరువు 2 గ్రాములు ఉంటుంది. ఇందులో ఉన్న పీచు ఎన్నో ధాన్యపు గింజల ద్వారా వచ్చే పీచుకు సమానం. ఇంకా బంగాళదుంపలో కార్టినాయిడ్స్, పాలీఫినాల్స్ వంటి ఫైటో రసాయనాలు ఉన్నాయి. బంగాళ దుంపలో లభించే ఇన్ని పోషక పదార్ధాల వినియోగం దానిని ఉడకపెట్టే విధానంపై బాగా ఆధారపడి ఉంటుంది.

అందానికి బంగాళాదుంప :

మార్చు

బంగాళాదుంప తినేందుకు రుచిగా ఉండటమే కాదు, అందానికి అడ్డుగా నిలిచే ఎన్నో సమస్యల్ని తీరుస్తుంది. కళ్ల నుంచి జుట్టు వరకు అందాన్ని పెంపొందించడంలో ముందుటుంది.

కళ్లకి మెరుపు : ఎవరి ముఖంలోనైనా మొదట ఆకర్షించేవి కళ్లే. అయితే కళ్ల చుట్టూ నల్లటి వలయాలు రావడం, కళ్లు ఉబ్బడం లాంటివి ఇబ్బంది పెట్టే సమస్యలు. బంగాళాదుంపని ముక్కలుగా చేసి జ్యూసర్‌లో వేస్తే కొంచెం జ్యూస్‌ వస్తుంది. దానిలో దూది ముంచి, కళ్లపై పావుగంట సేపు ఉంచుకోండి. ఇలా రోజూ చేస్తూ ఉంటే నల్లని వలయాలు తగ్గుతాయి.

ముడతలు పోయేలా : బంగాళాదుంప రసంతో రోజూ ముఖాన్ని కడుక్కుంటే ముడతలు రావడం తగ్గుతుంది. ముఖంపై వచ్చే తెల్లమచ్చల్లాంటివి కూడా పోతాయి. ఎండకి కమిలిపోయి బొబ్బలెక్కిన చర్మానికి బంగాళాదుంప రసాన్ని రాసిన చర్మం మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది.

చక్కని ఛాయకి : బంగాళాదుంపని మిక్సీలో వేసి మెత్తగా చేసేయండి. ఆ పేస్టుని ముఖానికి రాసుకుని అరగంటపాటు వదిలేయండి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువు అవడంతో పాటు, ఛాయ పెరుగుతుంది. చర్మంపై ఉన్న జిడ్డుని కూడా అది పీల్చేసుకుంటుంది. దాంతో ముఖం తాజాగా మారుతుంది. అలాగే బంగాళాదుంప రసానికి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి పట్టించి, పావుగంట తరువాత కడిగేసుకుంటే చర్మం రంగు తేలుతుంది. .

ఫేస్‌మాస్క్‌లు : ఒక స్పూను బంగాళాదుంప రసానికి స్పూను ముల్తానీ మట్టిని కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరే వరకూ ఉంచండి. మొదట గోరువెచ్చటి నీళ్లతో, తరువాత చన్నీళ్లతో కడిగేసుకోండి. అలాగే బంగాళాదుంపని బాగా ఉడకబెట్టి ముద్దలా చేయండి. చల్లారాక ఒక స్పూను పాల పౌడర్‌ని, ఒక స్పూను బాదం నూనెని కలిపి పేస్టులా చేయండి. దానిని ముఖానికి రాసుకుని పావుగంట తరువాత శుభ్రపరుచుకోండి.

పొడి చర్మము ఉన్నవాళ్ళు తురిమిన బంగాళాదుంప, అర చెంచా పెరుగు కలిపి దానిని మూకానికి రాసుకొని 20 నిమిషాల తరువాత కడుగుకుంటే మృదువుగా తయారవుతుంది.

అంతర్జాతీయ బంగాళాదుంప సంవత్సరం

మార్చు
 

ఐక్య రాజ్య సమితి 2008 సంవత్సరాన్ని అధికారికంగా అంతర్జాతీయ బంగాళాదుంప సంవత్సరం గా ప్రకటించింది.[5] వర్ధమాన దేశాలలో బంగాళాదుంప యొక్క ఆహారపు ప్రాముఖ్యతను చాటి చెప్పడానికే ఈ ప్రయత్నం. గతంలో 2004 సంవత్సరాన్ని అంతర్జాతీయ వరి సంవత్సరంగా ప్రకటించింది. ఒక సంవత్సరానికి బంగాళదుంప పేరు పెట్టి గుర్తించడంలో విశేష కారణాలు ఈ విధంగా ఉన్నాయి:

  1. ప్రపంచ వ్యాప్తంగా ఆహార ధరలు పెరిగి పోతున్న ఈ తరుణంలో, బంగాళదుంప చాల చౌకైన ఆహార పదార్థం. ఈ పంటను ఎక్కువగా పండించటం వలన ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం తగ్గించటానికి దోహదపడుతుంది.
  2. ప్రపంచంలో ధాన్యేతర (ధాన్యము కాని) ఆహార పంటలలో బంగాళదుంప ప్రధానమైనది. దీనిని తక్కువ అదాయం ఉన్న దేశాలలో బాగా వాడుతారు. అందువల్ల ఈ పంట మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరణ;
  3. మిగిలిన ఆహార ఉత్పత్తులలాగ, బంగాళదుంపకు ప్రపంచ వ్యాప్త వ్యాపారం జరగదు. ఎక్కువగా ప్రాంతీయ విఫణిలోనే వర్తకం జరుగుతుంది. కనుక, బంగాళదుంపల ధరలు ప్రాంతీయ విషయాల మీదనే అధారపడి ఉంటాయి. ప్రపంచ విఫణిలోని ఆటుపోట్లు, ఈ పంట ధరలమీద ప్రభావం చూపవు. దానివల్ల అనేకమంది రైతులు లాభపడే అవకాశం ఉన్నది, తప్పనిసరిగా ఖర్చులు పోను, రైతుకు అదాయం వచ్చే అవకాశం ఉంది.

చిత్రమాలిక

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Hylla S, Gostner A, Dusel G, Anger H, Bartram HP, Christl SU, Kasper H, Scheppach W. Effects of resistant starch on the colon in healthy volunteers: possible implications for cancer prevention. Am J Clin Nutr. 1998;67:136-42.
  2. Raban A, Tagliabue A, Christensen NJ, Madsen J, Host JJ, Astrup A. Resistant starch: the effect on postprandial glycemia, hormonal response, and satiety. Am J Clin Nutr. 1994;60:544-551.
  3. Cummings JH, Beatty ER, Kingman SM, Bingham SA, Englyst HN. Digestion and physiological properties of resistant starch in the human large bowel. Br J Nutr. 1996;75:733-747.
  4. Englyst HN, Kingman SM, Cummings JH. Classification and measurement of nutritionally important starch fractions. Eur J Clin Nutr. 1992;46:S33-S50.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-06-21. Retrieved 2008-06-01.
  • 6. ముత్తేవి రవీంద్రనాథ్, కూరగాధలు, విజ్ఞాన వేదిక, తెనాలి, 2014

వనరులు

మార్చు

బయటి లింకులు

మార్చు