ఉదయ్ శంకర్
ఉదయ్ శంకర్ (జననం ఉదయ్ శంకర్ చౌదరి ; 1900 డిసెంబరు 8 - 1977 సెప్టెంబరు 26) ఒక భారతీయ నాట్య కళాకారుడు, నాట్య రూపకర్త. ఫ్యూజన్ డ్యాన్స్‌ను రూపొందించడంలో, యూరోపియన్ థియేట్రికల్ పద్ధతులను భారతీయ శాస్త్రీయ నృత్యానికి గిరిజన నృత్యానికీ అనుగుణంగా మార్చడంలో అతను ప్రసిద్ధి చెందాడు. 1920 లు, 1930 లలో అతను దీనికి భారతదేశం, ఐరోపా, అమెరికాల్లో ప్రాచుర్యం కలిగించాడు.[1][2][3][4][5] భారతదేశంలో ఆధునిక నృత్యానికి మార్గదర్శకుడతడు.
ఉదయ్ శంకర్ | |
---|---|
జననం | ఉదయ్‌పూర్, ఉదయ్‌పూర్ రాజ్యం, బ్రిటిషు భారతదేశం | 1900 డిసెంబరు 8
మరణం | 1977 సెప్టెంబరు 26 కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ | (వయసు 76)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నాట్యకళాకారుడు, నాట్య రూపకర్త |
భార్య / భర్త | అమలా శంకర్ |
పిల్లలు | ఆనంద శంకర్ మమతా శంకర్ |
తండ్రి | శ్యాం శంకర్ చౌధురి |
తల్లి | హేమాంగినీ దేవి |
Honours | సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ (1962) పద్మ విభూషణ్ (1971) |
1962 లో, జీవితకాల సాఫల్య పురస్కారంగా కేంద్ర సంగీత నాటక అకాడమీ అత్యున్నత పురస్కారమైన సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌తో సత్కరించింది. 1971 లో భారత ప్రభుత్వం అతనికి రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌ను ప్రదానం చేసింది.
ప్రారంభ జీవితం, విద్య
మార్చుఉదయ్ శంకర్ చౌదరి రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెద్ద కొడుకుగా జన్మించాడు. అతని కుటుంబ మూలాలు ప్రస్తుత బంగ్లాదేశ్ లోని నరైల్‌లో ఉన్నాయి.[6] అతని తండ్రి శ్యామ్ శంకర్ చౌదరి, ప్రముఖ న్యాయవాది. అతని పెద్ద కుమారుడు జన్మించిన సమయంలో రాజస్థాన్‌లోని ఝలావర్ మహారాజు వద్ద ఉద్యోగం చేస్తున్నాడు. అతని తల్లి హేమాంగినీ దేవి జమీందారీ కుటుంబానికి చెందినది. అతని తండ్రికి మహారాజులు 'హర్‌చౌదరి' అనే బిరుదు ఇచ్చారు. అయితే అతను 'చౌదరి' అనే ఇంటిపేరును 'హర్' అని కాకుండా ఉపయోగించటానికి ఇష్టపడతాడు. ఉదయ్ తమ్ముళ్లు రాజేంద్ర శంకర్, దేబేంద్ర శంకర్, భూపేంద్ర శంకర్, రవిశంకర్ లు. అతని తోబుట్టువులలో, భూపేంద్ర 1926లో చిన్నవయసులో మరణించాడు.[7] [8]
ఉదయ్ శంకర్ తండ్రి సంస్కృత పండితుడు. అతను కలకత్తా విశ్వవిద్యాలయం నుండి గౌరవాలతో పట్టభద్రుడయ్యాక, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అక్కడ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ సాధించాడు.[9] అతని తండ్రి తన పని నిమిత్తం తరచూ మారడం వలన, కుటుంబం అతని తల్లి సోదరులతో నస్రత్‌పూర్‌లోని ఉదయ్ మామ ఇంట్లో ఎక్కువ సమయం గడిపింది. ఉదయ్ చదువులు నస్రత్‌పూర్, గాజీపూర్, వారణాసి, ఝలావర్‌లతో సహా పలు ప్రదేశాలలో జరిగాయి. గాజీపూర్ పాఠశాలలో, అతను తన డ్రాయింగ్, క్రాఫ్ట్స్ ఉపాధ్యాయుడు అంబికా చరణ్ ముఖోపధ్యాయ్ వద్ద సంగీతం, ఫోటోగ్రఫీ నేర్చుకున్నాడు. [9]
1918లో, పద్దెనిమిదేళ్ల వయస్సులో, అతను JJ స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో శిక్షణ కోసం ముంబై వెళ్ళాడు. ఆపై గంధర్వ మహావిద్యాలయంలో చేరాడు. [10] అప్పటికి, శ్యామ్ శంకర్ ఝలావర్‌లోని తన ఉద్యోగానికి రాజీనామా చేసి లండన్ వెళ్లాడు. ఇక్కడ అతను ఒక ఆంగ్ల స్త్రీని వివాహం చేసుకున్నాడు. న్యాయవాదిగా వృత్తి జీవితం సాగిస్తూ, ఔత్సాహిక ఇంప్రెసారియో అయ్యాడు. బ్రిటన్‌కు భారతీయ నృత్యాన్ని, సంగీతాన్నీ పరిచయం చేశాడు. తదనంతరం ఉదయ్, లండన్ వెళ్ళి, తండ్రితో నివసించాడు. 1920 ఆగస్టు 23 న లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్‌లో చేరి, సర్ విలియం రోథెన్‌స్టెయిన్ వద్ద చిత్రలేఖనం అభ్యసించాడు. తండ్రి లండన్‌లో నిర్వహించిన కొన్ని స్వచ్ఛంద ప్రదర్శనలలో నృత్యం చేశాడు. అలాంటి ఒక సందర్భంలో, రష్యన్ బాలే నర్తకి అన్నా పావ్లోవా హాజరైంది. ఇది అతని కెరీర్‌పై శాశ్వత ప్రభావాన్ని చూపింది.[5]
కెరీర్
మార్చుఉదయ్ శంకర్ భారతీయ శాస్త్రీయ నృత్య రూపాల్లో దేనిలోనూ గురువు వద్ద శిక్షణ పొందలేదు. అయినప్పటికీ, అతని ప్రదర్శనలు సృజనాత్మకంగా ఉంటాయి.[11] అతను ఐరోపాలో ఉన్న సమయంలో బ్యాలేతో పాటు భారతీయ శాస్త్రీయ నృత్యం, జానపద నృత్యాలు రెండూ పరిచయమైంది. అతను రెండు శైలులలోని అంశాలను కలిపి హై-డ్యాన్స్ అనే కొత్త నృత్యాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. బ్రిటిష్ మ్యూజియంలో రాజ్‌పుత్ పెయింటింగ్, మొఘల్ పెయింటింగ్ శైలులను అధ్యయనం చేసిన తర్వాత అతను శాస్త్రీయ భారతీయ నృత్య రూపాలనూ, వాటి ఐకానోగ్రఫీనీ నృత్య కదలికలకు అనువర్తించాడు. ఇంకా, అతను బ్రిటన్‌లో ఉన్న సమయంలో, అనేక మంది ప్రదర్శన కళాకారులను చూశాడు. ఆ తర్వాత అతను కళలో అధునాతన అధ్యయనాల కోసం ఫ్రెంచ్ ప్రభుత్వపు ' ప్రిక్స్ డి రోమ్' స్కాలర్‌షిప్‌పై రోమ్ వెళ్ళాడు.
త్వరలోనే అటువంటి కళాకారులతో అతని పరస్పర చర్య పెరిగింది. భారతీయ నృత్యాన్ని సమకాలీన రూపంలోకి మార్చాలనే ఆలోచన కూడా పెరిగింది. దిగ్గజ రష్యన్ బాలే నర్తకి అయిన అన్నా పావ్లోవాతో అతని పరిచయం ఒక మలుపు తీసుకువచ్చింది. భారతదేశ ఆధారిత ఇతివృత్తాలపై సహకరించడానికి ఆమె కళాకారుల కోసం వెతుకుతోంది. వీరి పరిచయం హిందూ ఇతివృత్తాలపై ఆధారపడిన నృత్య రూపకాలను రూపొందించడానికి దారితీసింది. అన్నాతో కలిసి ఆమె నిర్మించిన 'ఓరియంటల్ ఇంప్రెషన్స్'లో చేర్చడం కోసం ' రాధా - కృష్ణ ', 'హిందూ వెడ్డింగ్' లను రూపొందించాడు. బ్యాలేని లండన్‌లోని రాయల్ ఒపేరా హౌస్ లో ప్రదర్శించారు. తరువాత అతను అజంతా కేవ్స్ ఫ్రెస్కోస్ ఆధారంగా నృత్య రూపకాలను రూపొందించి కొరియోగ్రాఫ్ చేసి, యునైటెడ్ స్టేట్స్ అంతటా ప్రదర్శించాడు.[12] కాలక్రమేణా అతని నృత్య శైలి 'హై-డ్యాన్స్'గా ప్రసిద్ధి చెందింది. అతను దానిని 'సృజనాత్మక నృత్యం' అని వర్ణించాడు.[13]
అతను పారిస్‌లో అన్నాతో ఒకటిన్నర సంవత్సరాలు పనిచేశాక, స్వంతంగా రూపకాలను రూపొందించడం మొదలుపెట్టాడు.
శంకర్ 1927 లో ఫ్రెంచ్ పియానిస్ట్ సైమన్ బార్బియర్, భారతీయ కళా చరిత్రను అధ్యయనం చేయాలనుకునే స్విస్ శిల్పి అలిస్ బోనర్ లతో కలిసి భారతదేశానికి తిరిగి వచ్చాడు. సైమన్ అతనికి శిష్యుడు, నృత్య భాగస్వామి. అతనిని స్వయంగా రవీంద్రనాథ్ ఠాగూర్ స్వాగతించాడు. భారతదేశంలో ప్రదర్శన కళల పాఠశాలను ప్రారంభించమని కూడా అతన్ని ఒప్పించాడు.
1931 లో పారిస్‌కు తిరిగి వెళ్ళాక, అతను ఆలిస్ బోనర్‌తో కలిసి యూరప్‌లో మొట్టమొదటి భారతీయ నృత్య సంస్థను స్థాపించాడు. అప్పటికి అలిస్, అతని శిష్యులలో ఒకరిగా మారింది. తాను కొత్తగా రూపొందించిన నృత్యరీతులకు అనుగుణంగా సంగీతం కోసం సంగీత విద్వాంసులు విష్ణు దాస్ షిరాలీ, తిమిర్ బరన్‌లతో కలిసి కొత్త టెంప్లేట్‌ను సృష్టించాడు. అతని మొదటి నృత్య ప్రదర్శనలు 1931 మార్చి 3 న పారిస్‌లోని చాంప్స్-ఎలీసీస్ థియేటర్‌లో జరిగాయి. అతని యూరప్ పర్యటనల్లో దాన్ని తన స్థావరంగా చేసుకున్నాడు.[14]
త్వరలోనే అతను తన సొంత బృందంతో యూరప్, అమెరికాలలో ఏడేళ్ల పర్యటనను ప్రారంభించాడు. దానికి అతను ఇంప్రెసారియో సోల్ హురోక్, సెలబ్రిటీ సిరీస్ ఆఫ్ ఇంప్రెసారియో, ఆరోన్ రిచ్‌మండ్ ఆధ్వర్యంలో 'ఉదయ్ శంకర్ అండ్ హిస్ హిందూ బ్యాలే' అని పేరు పెట్టుకున్నాడు. యునైటెడ్ స్టేట్స్‌లో మొదటిసారిగా 1933 జనవరిలో న్యూయార్క్ నగరంలో ఫ్రెంచ్ నర్తకి అయిన తన నృత్య భాగస్వామి సిమ్కీతో కలిసి ప్రదర్శన ఇచ్చాడు. పర్యటనలో భాగంగా, గ్రాండ్ సెంట్రల్ ఆర్ట్ గ్యాలరీస్‌లో రిసెప్షన్ జరిగింది.[15] తర్వాత శంకర్, అతని బృందం దేశవ్యాప్తంగా 84-నగరాల పర్యటనకు బయలుదేరింది.[16][17]
భారతీయ నృత్యానికి యూరోపియన్ థియేట్రికల్ పద్ధతులను అనువర్తింపజేసే అతని పద్ధతి భారతదేశంలోను, విదేశాలలోనూ బాగా ప్రాచుర్యం పొందింది. సాంప్రదాయిక భారతీయ ఆలయ నృత్యాల కోసం ఒక కొత్త శకాన్ని ప్రారంభించినందుకు అతను ఘనత పొందాడు. ఓవైపు అతని సోదరుడు రవిశంకర్, భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని బయటి ప్రపంచంలో ప్రాచుర్యం చేసే కృషి చేస్తున్నాడు.
శాంతి నికేతన్‌కు సమీపంలో శ్రీనికేతన్‌ను నిర్మించడంలో రవీంద్రనాథ్ ఠాగూర్‌కు సహాయం చేసిన లియోనార్డ్ నైట్ ఎల్మ్‌హిర్స్ట్, అతని బృందం, ప్రధాన నర్తకి సిమ్కీతో కలిసి ఆరు నెలల రెసిడెన్సీ కోసం డార్టింగ్‌టన్ హాల్, టోట్నెస్, డెవాన్‌ను సందర్శించమని 1936 లో ఆహ్వానించాడు. రష్యన్ నాటక రచయిత అంటోన్ చెకోవ్ మేనల్లుడు మిచెల్ చెకోవ్, జర్మన్ ఆధునిక నృత్యకారుడు-కొరియోగ్రాఫర్, కర్ట్ జూస్, నృత్య సంజ్ఞామానాన్ని కనుగొన్న రుడాల్ఫ్ లాబన్ లు కూడా ఆహ్వానితుల్లో ఉన్నారు. ఈ అనుభవం అతని భావవ్యక్తీకరణ నృత్యానికి మరింత ఉత్సాహాన్ని జోడించింది.[18]
1938 లో భారతదేశాన్ని తన స్థావరంగా చేసుకున్నాడు. ఉత్తరాఖండ్ హిమాలయాలలోని అల్మోరా నుండి 3 కి.మీ. దూరంలో ఉన్న సిమ్టోలాలో, 'ఉదయ్ శంకర్ ఇండియా కల్చరల్ సెంటర్'ని స్థాపించాడు. కథకళి కోసం శంకరన్ నంబూద్రిని, భరతనాట్యం కోసం కందప్ప పిళ్లైని, మణిపురి కోసం అంబి సింగ్, సంగీతం కోసం ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్‌ను ఆహ్వానించాడు. త్వరలో, అతను గురుదత్, శాంతి బర్ధన్, సిమ్కీ, అమలా, సత్యవతి, నరేంద్ర శర్మ, రుమా గుహా ఠాకుర్తా, ప్రభాత్ గంగూలీ, జోహ్రా సెహగల్, ఉజ్రా, లక్ష్మీ శంకర్, శాంతా గాంధీ సహా కళాకారులు, నృత్యకారులను అక్కడ చేర్చాడు; తన స్వంత సోదరులు రాజేంద్ర, దేబేంద్ర, రవి కూడా అతనితో పాటు విద్యార్థులుగా చేరారు. అయితే నిధుల కొరత కారణంగా నాలుగేళ్ల తర్వాత, 1942 లో, కేంద్రం మూతపడింది. అతని విద్యార్థులు చెదిరిపోయారు. అతను తన శక్తిని తిరిగి సమీకరించుకుని, దక్షిణాదికి చేరుకున్నాడు. అక్కడ అతను తన నృత్యం ఆధారంగా 1948 లో తన ఏకైక చిత్రం కల్పన చేసాడు. అందులో అతను, అతని భార్య అమలా శంకర్ ఇద్దరూ నృత్యం చేశారు. ఈ చిత్రం మద్రాసులోని జెమినీ స్టూడియోస్‌లో నిర్మించారు.[19] 2008 లో ఈ సినిమాని ది ఫిల్మ్ ఫౌండేషన్ వారి వరల్డ్ సినిమా ప్రాజెక్టు, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాల సహకారంతో సినీటెకా డి బోలోగ్నా సంస్థ డిజిటల్‌గా పునరుద్ధరించింది.[20]
ఉదయ్ శంకర్ 1960 లో కోల్‌కతాలోని బాలీగంజ్‌లో స్థిరపడ్డాడు. అక్కడ 1965 లో "ఉదయ్ శంకర్ సెంటర్ ఫర్ డ్యాన్స్" ప్రారంభించాడు. 1962 లో అతను భారతీయ నృత్యానికి చేసిన జీవితకాల కృషికి గాను సంగీత నాటక అకాడమీ వారి అత్యున్నత పురస్కారం, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌ను అందుకున్నాడు.
వ్యక్తిగత జీవితం
మార్చుఉదయ్, సితార్ వాయిద్యకారుడు రవిశంకర్‌కి అన్నయ్య. తన నృత్య భాగస్వామి అమలా శంకర్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి 1942 లో ఆనంద శంకర్ అనే కుమారుడు, 1955 లో మమతా శంకర్ అనే కుమార్తె జన్మించారు. ఆనంద శంకర్ సంగీతకారుడు, స్వరకర్త అయ్యాడు. అతను తన బాబాయి రవిశంకర్ వద్ద కాకుండా డాక్టర్ లల్మణి మిశ్రా వద్ద శిక్షణ పొందాడు. కాలక్రమేణా యూరోపియన్, భారతీయ సంగీత శైలులను కలిపిన ఫ్యూజన్ సంగీతానికి ప్రసిద్ధి చెందాడు. మమతా శంకర్, ఆమె తల్లిదండ్రుల లాగే నర్తకి. సత్యజిత్ రే, మృణాల్ సేన్ ల చిత్రాలలో పని చేస్తూ, ప్రముఖ నటిగా పేరు తెచ్చుకుంది. ఆమె కోల్‌కతాలో 'ఉదయన్ డ్యాన్స్ కంపెనీ'ని నడుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణిస్తూ ఉంటుంది.[21]
ఉదయ్, అమలా శంకర్‌లు 1965 లో కోల్‌కతాలో ఉదయ్ శంకర్ ఇండియా కల్చర్ సెంటర్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇది ప్రారంభమైన రోజు నుండి అమలా శంకర్ డైరెక్టర్-ఇన్-ఛార్జ్‌గా పనిచేసింది. 1991 లో ఆమెకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఈ పాఠశాల 2015 వరకు కొనసాగింది. వినూత్నమైన సృజనాత్మక నృత్య ప్రక్రియల గురించిన శంకర్ ఆలోచనలను కొనసాగించడానికి ఇది కృషి చేసింది.
Awards
మార్చు- 1960: Sangeet Natak Akademi Award – 'Creative Dance'[22]
- 1962: Sangeet Natak Akademi Fellowship
- 1971: Padma Vibhushan
- 1975: Desikottama, Visva-Bharati University
- ↑ Uday Shankar Encyclopædia Britannica
- ↑ "Uday Shankar: a tribute", The Hindu, 21 December 2001.
- ↑ DANCE VIEW; ONE OF INDIA'S EARLY AMBASSADORS New York Times, 6 October 1985.
- ↑ Sukanta Choudhary (1990) Calcutta, the Living City: The present and future. Oxford University Press. p. 280.
- ↑ 5.0 5.1 Reginald Massey (2004) India's dances: their history, technique, and repertoire. Abhinav Publications. ISBN 81-7017-434-1. pp. 221–225. Ch. 21.
- ↑ Kothari, Sunil (2018-12-27). "Reliving the classic film Kalpana by dance great Uday Shankar". The Asian Age. Retrieved 2022-01-16.
- ↑ Family Tree Mamta Shankar Dance Company, website.
- ↑ Biography of Ravi Shankar Ramon Magsaysay Award website.
- ↑ 9.0 9.1 Uday Shankar Biography catchcal.com.
- ↑ Islam, Sirajul (2012). "Uday Shankar". In Islam, Sirajul; Jamal, Ahmed A. (eds.). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second ed.). Asiatic Society of Bangladesh.
- ↑ Sunil Kothari (2000) Uday Shankar:An Appreciation. Natya Kala Conference
- ↑ Nayana Bhat (26 September 2007) The Uday Shankar story. narthaki.com
- ↑ Ballet Legacy. The Times of India, 22 March 2003.
- ↑ UNESCO observes grand centenary functions in Paris. Rediff.com, 27 April 2001.
- ↑ Grand Central Art Galleries, 1934 yearbook
- ↑ Largest Tour Time, 30 October 1933.
- ↑ Dancer from Hindustan. Time, 9 January 1933.
- ↑ Celebrating Creativity: Life & Work of Uday Shankar IGNCA
- ↑ ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఉదయ్ శంకర్ పేజీ
- ↑ World Cinema Project (2008). "Kalpana". www.film-foundation.org. Retrieved 2021-07-06.
- ↑ Mohd. Anis Md. Nor (2007) Dialogues in dance discourse: creating dance in Asia Pacific. Cultural Centre, University of Malaya. p. 63. ISBN 983-2085-85-3.
- ↑ Creative Dance Archived 5 అక్టోబరు 2008 at the Wayback Machine Sangeet Natak Akademi Award Official listings.