ఎం.చంద్రశేఖరన్ కర్ణాటక సంగీత వాయులీన విద్వాంసుడు.

ఎం.చంద్రశేఖరన్
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంమోహన్ చంద్రశేఖరన్
జననం(1939-12-11)1939 డిసెంబరు 11
కలకత్తా, పశ్చిమ బెంగాల్
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తివాయులీన విద్వాంసుడు
వాయిద్యాలువయోలిన్

విశేషాలు మార్చు

ఇతడు 1939, డిసెంబరు 11వ తేదీన కలకత్తా నగరంలో టి.ఎన్.మోహన్, చారుబాల మోహన్ దంపతులకు రెండవ సంతానంగా జన్మించాడు.[1] ఇతని తల్లి వాయులీన విద్వాంసురాలు. ఇతనికి రెండుసంవత్సరాల వయసులో జాండీస్ సోకి కంటిచూపు పోయింది. సంగీతంపట్ల ఉన్న ఆసక్తిని గమనించి ఇతని తల్లి చారుబాల ఇతనికి వయోలిన్ నేర్పించింది. ఇతడు తొలి కచేరి తన 11వ యేట మైలాపూర్‌లోని త్యాగరాజ సంగీత విద్వత్‌సమాజంలో నిర్వహించాడు. ఇతనికి 20 సంవత్సరాల వయసులో ఇతని తల్లి మరణించింది. అంత వరకు ఇతడు ఆమె వద్ద వయోలిన్ నేర్చుకున్నాడు. ఇతని తల్లి ఇతనికి బ్రెయిలీ నేర్పి తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, తమిళ భాషలలో చదవడం, వ్రాయడం నేర్పించింది.

 
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌ను స్వీకరిస్తున్న చంద్రశేఖరన్

ఇతడు మన్నార్గుడి సాంబశివ భాగవతార్, కుంభకోణం ఎస్.విశ్వనాథన్, విద్యాల నరసింహనాయుడు, టి.జయమ్మాళ్‌ల వద్ద గాత్ర సంగీతం నేర్చుకున్నాడు. ఇతడు 70 సంవత్సరాలకుపైగా 6 తరాల సంగీత విద్వాంసులకు వాద్య సహకారాన్ని అందించాడు. ఇతడు వాద్య సహకారం అందించిన కళాకారులలో మహారాజపురం విశ్వనాథ అయ్యర్, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, మదురై సోమసుందరం, టి.ఆర్.మహాలింగం, మదురై మణి అయ్యర్, చెంబై వైద్యనాథ భాగవతార్, జి.ఎన్.బాలసుబ్రమణియం, పాల్ఘాట్ కె.వి.నారాయణస్వామి, టి.కె.రంగాచారి, మహారాజపురం సంతానం, ఎన్.రమణి, టి.ఎన్.శేషగోపాలన్ మొదలైనవారున్నారు. ఎం.ఎస్.గోపాలకృష్ణన్‌‌తో కలిసి జుగల్బందీ కచేరీలు చేశాడు. ఇతడు తన కుమార్తె జి.భారతి, టి.ఎన్.కృష్ణన్, ఎ.కె.సి.నటరాజన్, నామగిరిపేట్టై కృష్ణన్‌ లతో జంట కచేరీలు చేశాడు. ఇతడు సోలో కళాకారుడిగా ప్రదర్శన ఇచ్చినప్పుడు కొన్ని సార్లు వయోలిన్ వాదనతో పాటు పాడేవాడు. ఇతడు 30కి పైగా కృతులను, వర్ణనలను, జావళీలను స్వరపరిచాడు.

ఇతడికి మద్రాసు సంగీత అకాడమీ 2005లో సంగీత కళానిధి పురస్కారాన్ని ప్రదానం చేసింది.[2] కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతడికి 1986లో కర్ణాటక సంగీతం వాద్యం (వయోలిన్) విభాగంలో అవార్డు, 2011లో ఫెలోషిప్ ప్రదానం చేసింది.

ఇతడికి భార్య పట్టమ్మాళ్, కుమార్తె భారతి, ముగ్గురు కుమారులు ఉన్నారు.

మూలాలు మార్చు

  1. K.T.P. Radhika (19 December 2019). "M. Chandrasekaran: Giving voice to the strings". The Hindu. Retrieved 30 March 2021.
  2. "Violinist with versatile skills". The Hindu. 1 December 2005. Archived from the original on 13 ఫిబ్రవరి 2006. Retrieved 13 January 2011.